కవితలు కిన్నెరసాని పాటలు కిన్నెర సంగీతము
5. కిన్నెర సంగీతము
కోనలన్నీ ముంచుకొనివచ్చు సెలయేటి
చాన కిన్నెరసాని జలజలా స్రవియించు
తరగలో పై కెగయు
నురుగులో క్రొంగ్రొత్త
తేనెకాలువ లూరెనో అమృతంపు
వాన చినుకులు జారెనో
తేనె తరగల పిండుతోన జలజల సాగు
చాన కిన్నెరసాని జాలైన మేలైన
వాకలో అందాల
రాకలో బంగారు
జిలుగు గంటలు మ్రోగెనో చిన్నారి
బిగువు నవ్వుల సాగెనో
తేనెలై కలకండ సోనలై వానలై
చాన కిన్నెర పాట సాగులాడుట చూచి
చివరలో చివురొత్తు
సవురులో క్రొమ్మావి
వింతగా సిగ్గందెనో కోకిలా
గొంతులో కద లాడెనో
చెఱకుపానక మెఱ్ఱ జీరపాకమువోలె
తరుణి కిన్నెరపాట తారులాడుట చూచి
పువ్వులో లేసంజ
రువ్వులో దానిమ్మ
తెల తెల్లనయి పోయెనో క్రొంజిల్క
పలుకులో పస దప్పెనో
ప్రొద్దుకాకల జారిపోవు మంచును బోలె
పొలతి కిన్నెరపాట పొంగిపోవుట చూచి
నీటిలో కిన్నెరా
సాటిలో అడవిలో
తోగుల్లు పారాడెనో క్రొంజలువ
వాగుల్లు సాగాడెనో
పికిలి పిట్టల యీలలకు క్రొత్తసాటిగా
సకియ కిన్నెరపాట జరుగు లాడుట చూచి
సాములో చిఱువెచ్చ
జాములో మెల్లగా
పగలు పులకలు పొందెనో మల్లెలా
సొగసు వెలుగులు చిందెనో
తొలివెన్నెల చివుళ్ళ తెలినిగ్గు విరజిమ్ము
వెలది కిన్నెరపాట విరిసిపోవుట చూచి
తెలుపులో వెన్నెలా
మలుపులో రేచాన
సిరివెల్లి పచరించెనో విరిపూల
నెరతావి తర మెంచెనో
తలిరాకుకన్న మెత్తని యందమును బోవు
తరుణికిన్నెరపాట తాను తాన మందుటచూచి
ఎడదలో ఆనంద
జలధిలో లోకాలు
పులకితమ్మయి పోయెనో రసవార్ధి
చులుకితమ్మయి పోయెనో
చిఱుత తంగెటిజుంటి జీబు చిక్కనవోని
చిన్ని కిన్నెరపాట జీరసాగుట చూచి
పూలలో తేనెల్ల
చాలులో క్రొందేంట్లు
కదలు లాడుట మానెనో వాకపై
పదువులై పరువెత్తెనో
ఒకసారి సన్నగా ఒకసారి విన్నగా
ఉవిద కిన్నెరపాట యొయ్యారములు చూచి
కళ్ళలో లేపచ్చ
మళ్ళలో పసిలేళ్ళు
బెదురు చూపులు చూచెనో మైనిగల్‌
నదరుగా కనుపించెనో
అంౘకన్నియయెల్గు అడవి సాగినయట్లు
అతివ కిన్నెరపాట అతిసన్నగిలి పోవ
పొరలలో సనసన్న
తెరలలో చిఱుగాలి
యాపాట సాగించెనో ఉయ్యాల
తో పాటు వూగించెనో
అందగత్తెల జిల్గుటందె మ్రోసినయట్లు
చింది కిన్నెరపాట జిలుగుల్లు పోవగా
కూతలో లేతమ్మి
మేతలో రాయంచ
లొండొంటి ప్రేమించెనో సింగార
ముండి కలయిక పొందెనో
ఏటి కిన్నెర పాట ఎగిరెగిరి మిన్నంది
సాటి తారల నడుమ చాలుగా నిరవొందు
దవ్వులో జాబిల్లి
నవ్వులో క్రొక్కారు
తలిరు పూవులు చిమ్మెనో చొక్కంపు
తెలుగు వెలుగులు క్రమ్మెనో
కంచు గీసినయట్లు కదలు తరగలతోన
మించి కిన్నెరపాట మేలిపోకలు వోవు
నిగ్గులో అందంపు
జగ్గులో వనమెల్ల
ఒక పాటయై పోయెనో తనుదాన
యెఱుక లేకే పోయెనో
ముద్దు ముద్దుగ నడచి ప్రోడవోలిక నాడి
మురిపమ్ముగా పాడి ముగుద కిన్నెరసాని
యెడదలో యెదురైన
బెడదలో కష్టాల
కడలియే కల గాంచెనో కన్నీటి
కడవలే ప్రవహించెనో.
AndhraBharati AMdhra bhArati - kavitalu - kinnerasaani paaTalu - kinnera saMgiitamu ( telugu andhra )