కవితలు కిన్నెరసాని పాటలు కిన్నెర వైభవము
9. కిన్నెర వైభవము
తూర్పులో తెల్లనై తోచిన దుషఃకాంత
తొలిమావిలేబూత దూసెను పికీకాంత
తలలపై రతనాలు తళతళా మెరిసేటి
నల్లత్రాచులు దూకి నాట్యమాడేటట్లు
మెరిసింది కిన్నెరా ఒడ్డుల్లు
ఒరిసింది కిన్నెరా
పొందమ్మి తెలివొంద పొడిచింది క్రొంబొద్దు
మేల్కొను మెకాలతో మెలగిన దడవిసద్దు
పసుపుబట్టలు ఆరపట్టగా నేలపై
గాలి లేబొరలలో కదలు లాడినయట్లు
కదలింది కిన్నెరా కాంతితో
మెదలింది కిన్నెరా
ప్రొద్దెక్కి గాలిలో పుట్టింది చిఱువెట్ట
పొదల బుర్రు మని కూసింది కోమటిపిట్ట
రేలచెట్టా కెల్ల రాలి క్రొత్తచివుళ్ళు
తొడిగి లేయెండలత్రోవ దూకినయట్లు
పొలిచింది కిన్నెరా తెలుపుల్లు
మలచింది కిన్నెరా
జాము జామున్నర సాగెను చదల ప్రొద్దు
నెమలి కూతలతోడ నిండిన దడవి సద్దు
తరగ విరిగినచోట తరణికాంతులు ప్రబ్బి
గాజుముక్కలు సూర్యకాంతి మండినయట్లు
పొదిలింది కిన్నెరా అందాలు
వదలింది కిన్నెరా
మిగులు తా నడిమింట మెరసి మండెను తరణి
నెగడె కాంతారమ్ము నిశ్శబ్ద మగు కరణి
మరకతమ్ములు నేల పరచగా పడ్డట్లు
పారుటాకుల మీద పసిమి యూదినయట్లు
నడచింది కిన్నెరా సొగసుల్లు
ముడిచింది కిన్నెరా
మూడుజాముల ప్రొద్దు మొగి జారినది మింట
వెనుకపట్టెను తమ్మివిరి మేల్వలపుపంట
కళ్ళమ్ముతుడిచి పండిన గోదుమల కుప్ప
తూర్పుగాలులకు తూర్పారపట్టినయట్లు
జారింది కిన్నెరా పైడిగా
మారింది కిన్నెరా
మూరగా బారగా ప్రొద్దు వాటారింది
పొలము పిచ్చిక గుంపు పురుగు మేతేరింది
అడవి చెట్టులనీడ లవఘళించిన నీరు
వలపు తిరిగిన పైరు నాట్యమాడిన యట్లు
తరలింది కిన్నెరా
ఉరలింది కిన్నెరా
కొండ దగ్గిరనగా క్రుంకింది ముదిప్రొద్దు
మింటవచ్చెను పిట్టగముల రెక్కలసద్దు
అడవిలో బోయ వేటాడినట్టి మృగాల
తొడుసులం బడి నల్లతోగు వారినయట్లు
నడచింది కిన్నెరా రంగులు
ముడిచింది కిన్నెరా
నల్లగా రేచాన నడచింది తొలిజాము
గొల్లుగా బొబ్బలిడె క్రోల్పులుల్‌ పెనుదీము
దొడ్డదొర ముంగిళ్ళ తోరణాలుగ వ్రేలు
హరినీల మణుల కాంతులు ప్రబ్బినట్లుగా
మారింది కిన్నెరా ఊటలై
ఊరింది కిన్నెరా
నడిరేయి నల్లనై నాట్యమాడిన దడవి
విడివులుల్‌ మృగముల వెదకి చంపెను తడర
నీరు సాగునో యేమొ నీరు కన్పడరాక
తరగసవ్వడీమాత్ర గురుతుపట్టెడునట్లు
పోయింది కిన్నెరా నలుపులా
చేయంది కిన్నెరా
శుక్లపక్షము వచ్చె చూచుచుండగ మింట
శోభిల్లె చిన్నజాబిల్లి తారలజంట
తెచ్చి మణ్గులుగ ఛాదీవెండి కంసాలి
మూసలో కరగించి పోసినయట్లుగా
ఆడింది కిన్నెరా తళతళ
లాడింది కిన్నెరా
తలిరాకు తుద తక్కితారెను వసంతమ్ము
కోకిలోర్చెను నెమలికూతలకు పంతమ్ము
మగనిపే రెడబాటు పొగల సగమయిపోయి
బహు సన్నగిలిపోయి పాలిపోయిన మేన
మెరసింది కిన్నెరా ఎదలోన
ఒరిసింది కిన్నెరా
ఎడనీరు కాల్వలై యేరులై పోవుకై
వడి మృగమ్ములు దప్పికలు తీర్చుకొనురీతి
సాగింది కిన్నెరా బూదిరం
గూదింది కిన్నెరా
మండు టెండలు గాసి మాడ్చినది గ్రీష్మమ్ము
కొండయంచులనుండి కురిసినది ఊష్మమ్ము
నీటిపుట్టము తొలగి నిలువెల్ల నిప్పులో
యేటియిసకలు మండి యెగసిపడిపోవగా
ఏడ్చింది కిన్నెరా తనువెల్ల
మాడ్చింది కిన్నెరా
అడవిలో చిఱుపూట యట్లుగా కదలాడి
పాలలో కలిపిన పంచదారవిధాన
రుచి హెచ్చె కిన్నెరా సితమణి
చ్ఛవి గ్రుచ్చె కిన్నెరా
వడగళ్ళతో వచ్చిపడె వానకాలమ్ము
పుడమి పచ్చికలతో పొంగెను రసాలమ్ము
పతిగుట్ట మొగిలితోడున క్రుమ్మరించిన
అతి ప్రేమవారి దేహ మ్మెల్ల నిండగా
సుడిసింది కిన్నెరా అందాలు
తడసింది కిన్నెరా
నలగఁగొట్టిన పంగనామాల చెరుకులో
నలిబూదెరంగు పానకము జారినయట్టు
వడిచింది కిన్నెరా నల్లనై
నడచింది కిన్నెరా
అంౘరెక్కలతోడ నరుగుదెంచె శరత్తు
పంచలందున తెల్పుపడె కొంచెము సరిత్తు
మొదలిపొంగులు పోయి పోనుపో స్వచ్ఛమై
తేరుకొన్న మనోహరుని ప్రేమపోలిక
కదిలింది కిన్నెరా కెరటాలు
మెదలింది కిన్నెరా
బంగారుతీగలో పానక మ్మయిపోయె
మఱియు చిక్కనగాక మఱియు పల్చనగాక
తరలింది కిన్నెరా పండ్లరం
గురలింది కిన్నెరా
దిశదిశల్‌ మంచులో తేలించుకొనె కారు
తెల్లనై తరగల్లు తేలించుకొనె నేఱు
రాణివాసము వొల్చు రమణి మేల్ముసుగులో
వెండితీగ వితాన వెలిగిపోయెడునట్లు
వెలిగింది కిన్నెరా దారిలో
మలగింది కిన్నెరా
శైవాభిషేకరంజన్నారికేళ గ
ర్భాంబువుల్‌ వాకలై అడవి పారినయట్లు
కదలింది కిన్నెరా ముత్యాలు
వదలింది కిన్నెరా
శిశిరాగమము పచ్చి చెట్లయాకులు దూసె
ముసలులై జంతువులు ముడుచుకొని కన్మూసె
పొలతి దేహమ్మెల్ల ముడుతల్లు పడ్డట్లు
పొలిచింది కిన్నెరా నిలుకడల్‌
వలచింది కిన్నెరా
రాలి యెండినయాకు లోలిండి నీరముల్‌
మాగి యెర్రని క్రొత్తమధువుకాలువ యట్లు
తోచింది కిన్నెరా యెర్రనై
యేచింది కిన్నెరా
ఋతువు ఋతువున మారు రుచులలో కిన్నెరా
కారుకారువ మారు కాంతిలో కిన్నెరా
తెలుగు సత్కవిరాజు పలుకందుకోలేని
ఛవులూరి చవులూరి జలమెల్ల ప్రొవులై
కదిలేను కిన్నెరా
సాగేను కిన్నెరా
తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న
రామయ్య అతని దర్శనము చేసే త్రోవ
కాచింది కిన్నెరా
తెలుగు యాత్రికుల కందిచ్చు చల్లని నీడ
పుణ్యాత్మ కిన్నెరా
తెలుగు యాత్రికుల కందిచ్చు చల్లని నీరు
పూతాత్మ కిన్నెరా
తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న
రామయ్య అతని దర్శనము చేసే త్రోవ
కాచింది కిన్నెరా
AndhraBharati AMdhra bhArati - kavitalu - kinnerasaani paaTalu - kinnera vaibhavamu ( telugu andhra )