కవితలు ప్రాతస్స్తవము విశ్వనాథ సత్యనారాయణ
ప్రాతస్స్తవము
విశ్వనాథ సత్యనారాయణ
(భారతి, జూన్‌ 1936)
శా.లే! యింకన్ నిదురించుటేమిటిర లే! లే! చిట్టినాతండ్రి! కృ-
ష్ణా! యన్నాయి కళిందజాపులినదేశక్రీడనార్థమ్ము న-
ప్డే యేగెన్ మఱి నీవుకూడఁ జనవా వేగమ్మ లేవయ్య తం-
డ్రీ! యాదిత్యనవాంశువుల్ పసపు పండించెన్ గవాక్షమ్మునన్.
తే.ప్రక్కయంతయుఁ జిమ్మితి పద్మనాభ
అన్న చూడుము పుస్తకమ్మట్లు పండు -
కొనును నీవేమొ ప్రక్కంత క్రుమ్మిక్రుమ్మి
ప్రక్క యటులుండ నీ విట్లు పండుకొందు.
క.మొగము కడిగెదను లే సం-
పెగఱెక్కనుబోలె ఱెప్పవిప్పుము, నునుచి-
ర్నగవు పసరుమొగ్గవలెన్
దొగరుపెదవిమీఁద వచ్చి దోబూచాడున్.
మ.ఇదిగో తండ్రికిఁ జిట్టిన వ్వుదయమయ్యెన్ లే! యదూత్తంస! నీ-
వొదుగన్ బోవని సందుసందులకునై యూరెల్లఁ దా నేడ్చెడున్
గద! నీ యల్లరి లేక, గజ్జియలు ఘల్ఘల్గా గృహమ్మెల్లఁ ద్రొ-
క్కెదు నాట్యమ్ముల లేవవయ్య! ప్రభువా! కృష్ణా! యశోదాత్మజా!
చ.పొలపొల కన్నువిప్పి మఱి మూసెదు చిట్టికి నిక్కమాడు చ-
క్కిలిగిలి యున్నదా! కలదు, కేలును జంకకు హత్తుకొంచు న-
వ్వులచిఱువెల్గులోఁ బెదవి పొందె నుషోనవరేఖ! తిర్గి య-
వ్వలిమొగమై ముడుంచుకొని పండెద వల్లరి కాదు లెమ్మురా.
చ.తఱకలుకట్టగాఁ బెరుఁగు ద్రచ్చిన కవ్వపుమ్రోఁత నిద్రలే-
చి రురుశిశుంబలెన్ నెగచి చిందులుత్రొక్కెదు, ప్రొద్దదెక్కియున్‌
సరి నునుసెజ్జ వీడవు పసందులబిడ్డవు నేఁడు తండ్రి! యి-
క్షురసము నీకునై యెదురుచూచెడు మీఁగడతోడ వెన్నతోన్.
తే.చాలు నిఁక నిద్ర లెమ్ము కృష్ణయ్య! లెమ్ము
లేఁతక్రోఁతులై పండ్లిగిలించుకొంచు
నక్కి నిను తొంగి కనుగొంచు నన్నుఁ జూచి
పరువు లిడెదరు నీదు సావాసగాండ్రు.
చ.ప్రిదులని చంద్రవంక సవరించెద, రత్నపురావిరేకఁ బైఁ
గుదురుగ నిల్పుదాన, జడకుప్పెలు వేసెద జుత్తు దువ్వి, యీ
నిదురను మాని పైడిబరణింబలె మెల్లఁగ లేచిరమ్ము నా
యెదగల యింద్రనీలమణి యేడిర! యల్లదె మెల్ల లేచెడున్.
శా.ఒయ్యారమ్ముల నిద్రకాని నిదురేలోయీ! యశోదాశిశూ
కయ్యమ్ముల్ మిగిలెన్ విచిత్రశిశువా! గ్రామమ్మునందెల్ల నో
యయ్యా కోపమువద్దులే, యననులే, ఔ పైడిఖిల్లావులే!
సయ్యాటమ్ముగ నంటిలే యదుకులస్వామీ! రమావల్లభా!
తే.అయ్య నిద్దురలేచెనా యంచు నడిగె
నందగోఁపుడు మీయయ్య సుందరాంగ!
కొసలు ప్రక్కలఁబడి పులిగోరు నలిగి-
పోవుచున్నది లేవరా బుచ్చితండ్రి!
ఉ.అచ్చపువేల్పుబువ్వ బుడగై తరఁగై గరుడాళువారిపై
వచ్చెడు చిట్టికోసమని వాఁకిట నున్నది యెవ్వరోయి! వేఁ
బుచ్చుకొనుండు దానిఁ జిఱుపొంగులనవ్వుల కన్నుదమ్ములన్
విచ్చుచునున్నవాఁడు యదువీరుఁడు, బుగ్గ గులాబిమొగ్గగాన్.
ఉ.చిమ్ములదూడవంక నెగఁజిమ్మెడు కోరలకన్నుదోయితో
గుమ్మమువద్ద నున్నదదిగో! కను నీకయి గుమ్మపాలగో-
వమ్మ, మఱీవు త్రాగకయ యా తన దూడనుగూడఁ ద్రావనీ-
దమ్మ! మఱింక లే! నురుసు లారకమున్నుగఁ ద్రావఁగావలెన్.
ఆ.అనఁగ ననఁగ నొక్క యబ్బాయి యున్నాఁడు
లిప్తలోన నిద్ర లేచు నంట
కన్నువిప్పువఱకు గంటసేపనుకొమ్ము
కన్నువిప్పుపైని గంటసేపు.
ఉ.దిండిది మంచమిద్ది తెగఁద్రెంచుక లేవవలెన్ సుమండి! లే-
దండి! యిదేగతిన్, మసలినంతటిసేపును బద్ధకంబు పో-
దండి! జగమ్ము మీకొఱకు ద్వారమునొద్దనె వేచియుండె లే-
వండి! యదూద్వహా! విసువువచ్చెను ప్రాణము తల్లిగారికిన్.
ఉ.ఎత్తఱి తెల్లవారి నిదురించరు మాదగుకోవలోన మా
మొత్తముమీఁద నెవ్వరును, బోలిక యింటనె యున్నదేకదా!
మెత్తగ పండుకో! నిదుర మేల్కొనఁగాఁ దగదయ్య! అయ్య! మే-
నత్తల చాలికందురుగదా! నిజమే! యదువంశమండనా!
ఉ.ఈ యెలనవ్వులో జనని యెంతటికోపము పోవు నంచు నీ-
వే యెదలో నెఱుంగుదువులే! పసిదొంగ! మరింకఁ జాలు లే-
వోయి బడాయి! లేవఁగదవోయి! ననుం గడుపార కన్నతం -
డ్రీ! యదువృద్ధలోచనమణిచ్ఛవిభూతశరీరవల్లరీ!
శా.అంతేకావలె నిద్రమేల్కొనవు నీ వన్నాయి తా వచ్చి యా-
యింతా మీఁగడ పాలు వెన్న తిని యప్డే చెప్పకుండన్ జనెన్
సంతోషించితిఁ గండ్లుచల్లవడెఁ గన్నా! లేవరా యంచు నే-
నెంతేనిం బతిమాలుచుండినను నీ వింతేని విన్నావురా!!
తే.ఇంక నిద్దురలేవ వీ వెట్లుకాని
నెలలతరబడి నీబిడ్డ నిద్రపోవు-
నుర్వియెల్లఁ జాతుర్మాస్య లుండవచ్చు-
నని జగంబునఁ జాటింతునయ్య కొడుక!
క.ఇఁకఁ జాలు లేవవోయీ
యొకకొలికికిఁ దెత్తుఁగాని యూరెల్లను నీ
వొకవేల్పువులే మాపా-
లికి స్వామీ! లేవవయ్య! లేవయ్య! ప్రభూ!
తే.వెనుక త్రిప్పుచేతులను గుప్పిళ్లుపట్టి
కనులు తుడుచుచుంటివి మణికట్లతోడ
నిక్కి నీల్గుచునుంటివి నిద్ర యింక-
నయ్యెనని యనుకొమ్మందువా! ముకుంద!
మ.ఇది యేదోకథవోలె నున్నయది మీకీరాత్రియెల్లన్ బ్రభూ
యదువంశాంబుధిచంద్ర! నిద్ర యది లేనట్లున్నదే! తేలుఁగా-
నదియున్ గొంచెముసేపులోన, కడుపేదయ్యా! బలే నిండియు-
న్నదియే, యుట్లవి యేమియేన్ మిగిలెనా! నందార్భకా! యూరిలో.
క.ఇదియా నినుఁ గనవచ్చిన
యదపుచెడిన కుఱ్ఱకుంక లందఱకన్నుల్
చెదిరిన మందారమ్ములు
చిదిపిన కట్టెఱ్ఱకావి చిమ్ముచునుండెన్.
చ.మతకరిబుద్ధు లెంతకును మానవు నిన్నునుబట్టి యాప బ్ర-
హ్మతరముకాదు, నా కడుపునం దెటుపుట్టితివోయి! చాలు! నా
మెతకతనమ్ముగాక, పుడమిన్ నినువంటి కుమారు లుందురే
యతివ గయాళిమూఁక యిపుడై పడిపోవును వచ్చి నాపయిన్.
ఉ.గొల్లలగూడెముల్ తడకకొంపలు తల్పులులేవు నీవు వ్రే-
పల్లెకు మేటివైతి వొక పాతికక్రోఁతులు నీకుఁ దోడు మీ-
రెల్లరు నుట్లకెక్కుపనికేమొ హుజూర్సరదారులైరి! యీ
పిల్లలతోడ నింకఁ గనుపింపుమ యింకొకమాఱు చెప్పెదన్.
ఉ.పాయకరాత్రులన్ గదలవద్దనిచెప్పినమాట గాలికిం
బోయెను జాలుచాలు నటువో పురుగుండును బుట్రయుండు కా-
ళీయుని సంగతిన్ దలఁచలే నిపుడైనను నా యదృష్ట మ-
న్నా! యలకోటిదేవతలు నాఁడు నినున్ బ్రతికించి యీయరే.
ఉ.చేతముకూడ సొమ్మసిలు చీఁకటిలోపల నల్లదొంగ వే
రీతిని గానుపింతువు దరిద్రులకున్ నిదురించువేళ నీ-
వా తరుణమ్ము వేచికొని యందఱవెన్నలు దొంగిలింతు నీ
చేతము సుంతయున్ గుణము చెందదురా నవనీతలుబ్ధుఁడా!
క.తన యింటఁ బాలు లేవో
తన యింటను బెరుఁగు లేదొ తానేమిటికో
వనజాక్షుఁ డూరిపైఁ జని
తిని ‘యాగీ’ లింటిపైకిఁ దెచ్చును చెపుమా!
తే.ఎవఁడురా వాఁడు మొన్నఁ దానేమొ వచ్చి
యయ్య యవతారపురుషుఁ డటంచు చెప్పె
నిపుడు వచ్చినఁ తెలియుఁగదే నిశాప్ర-
ళయశిశున్ నిన్నెఱుంగువేళకును లేఁడు.
క.ఆ మొగము నట్లుపెట్టెదు
స్వామీ! నామాట గిట్టుబడి కాలేదా?
ఆమెతలు మఱగువారికి
సామెత లేమిటికి వట్టి చాదస్తమ్ముల్.
తే.చెప్పిచెప్పి నా గొంతుక నొప్పివెట్టె
కొన్ని పెరుఁగులు నిశిఁ దోడుకొనును గొనవు
తోడుకొనుచున్న పెరుఁగులు దోఁచెదేని
కూడుకొనుచున్న కాపురాల్‌ కూలిపోవు.
ఉ.ప్రన్నని బుల్లియేడుపుల రాగము తీసెదు నీవు చేయలే-
దన్నను చాలదా! యటుల నందురఁటే! గజదొంగ లమ్మకుం
గన్నులుకప్ప నీ యొడుపు గాని, నిజంబుగ నీకు నేడు పం-
చన్నల! వచ్చుచున్నదఁటరా! కనులన్ దడి యేది చెప్పరా.
మ.అది ఆలాగున నేడ్వఁగా వలయురయ్యా! రంగమార్తాండ! క-
న్తుదలన్ నీళ్ళులుకూడ తెచ్చితివికాదోయీ! నటోత్తంస! యే-
మిది నిక్కమ్ముగ నేడ్చుచుంటివిర! యేమీ! సామి! నీ గుండె యెం-
తదిరా! అమ్మను నేడిపించుటకునైనం గొంక వింతేనియున్.
కం.మా నాయనగా ఏడ్వకు
మా నాయనగారు చూడ మాంధాత గదే!
లేనివిపో నపవాదులు
గానీ, మా తండ్రి యిల్లు కదలఁడు గదవే!
మ.ఎవరా బాబును గూర్చి యిట్లనిరి బాబెచ్చోటికిం బోయె? రే-
బవలున్ నా యొడిలోన నుండును గదే! బంగారు నా తండ్రి ఆ
యెవరో గిట్టనివార లందురు శిశూ! నేనెత్తుకొందున్ నినున్
జివురుం గేల్మెడ ముద్దుపెట్టుకొనరా! చిట్టీ! ననుం జెక్కిటన్.
శా.తా మెవ్వారలు తండ్రి నిట్లనిరి నే దండించెదన్ వారలన్
రా! మా బంగరునాన్న ! యెత్తుకొనెదన్ రావయ్య కృష్ణయ్య! యే-
డీ? మా యాదవవంశదీపమణి యేడీ? చిన్నినందయ్య యే-
డీ? మా వేల్పులకెల్ల వేల్పుదొర యేడీ? వాఁడు నీవా ప్రభూ?
తే.చాలు నేడ్వకురా బాబు చచ్చిపోయి
నానురా నాదు బంగారునాన్న చిట్టి-
కనులఁ గన్నీరు తెప్పించి కన్నకేమొ
ఆటయరదమ్ము తెచ్చు మామయ్య నేఁడు.
తే.బుజముపైఁ బండుకొని బాబు మొగము నత్తు-
కొనెడు నిటుచూడు! నన్నుఁ గన్గొనఁగనిమ్ము
మనసు కిలికించితం బందుకొనిన తండ్రి
తమ్మిమొగము చిర్నగవులు తాండవించు.
ఉ.నా రతనాలు! నా మణులు! నా వరహాలును, నింద్రనీలపున్
హారతి! నాదు ముత్తెములహారము! వజ్రము, పుష్యరాగమున్!
కోరిక లుబ్బఁగా దిగిన కుచ్చులపల్లకి! నా మనస్సులో
నూరిన తియ్యనీటిజల! యుల్లలదుజ్జ్వలవారివేణియున్.
కం.మజ్జారే! చక్కలిగిలి
బుజ్జాయికిఁ బొట్టమీఁద ముద్దిడుకొన్నన్
బొజ్జఁ గలవేమొ! బుజ్జికి
ముజ్జగముల కిలకిలారు ముద్దులనవ్వుల్.
కం.మొగము కడిగించుకొనె మా
సొగసరి దువ్వించుకొనియె జుత్తును సొగసీ-
సొగయని చలిదన్నము తినె
ఖగరాడ్గతి నింక నేమి గంతులు త్రొక్కున్.
సీ.కుణుకుణుకుణుకుణుక్వణనమ్ము లొనరింపఁ | గవ్వించు బంగరుమువ్వలగమి
కిణకిణకిణకిణస్వనములు వెలయింప | జిలుగురత్నాల గజ్జియలపేట
ఘణఘణఘణఘణధ్వనులు పంచారింప | నెఱినగిషీల యందియలజంట
ధణధణధణధణ ధ్వానమ్ము లొలయింప | కలుపుకేల్జత హొన్నుగంటలసడి
తే.యదుకులోద్యానకేకి నాట్యమ్ముచేసె | నందగర్భసరోహంస నడలునెఱపె
నెమ్మి నాట్యమాడెను యశోదమ్మకొడుకు | అంచనడకలు నడచెఁ గ్రిష్ణమ్మగారు.
ప్రాతస్స్తవము - విశ్వనాథ సత్యనారాయణ - (భారతి, జూన్‌ 1936) - ఆంధ్రభారతి - కవితలు - శృంగారవీథి - శృంగార వీథి - శృంగార వీధి - శృంగార వీధి - Partasstavamu - Viswanatha Satyanarayana - AndhraBharati AMdhra bhArati - kavitalu - SringaraVithi - SrungaraVithi - Sringara Veedhi - Sringara Veethi - Srungara Veedhi - Srungara Veethi- ( telugu andhra )