| కవితలు | శంఖవరం 'సంపత్' రాఘవాచార్య | ఖండకావ్యములు |
|
భారతి, జులై 1938
| రాధ పిలుపు |
|
కొంచెము కొంచెమై పెదవి కోసల మోసులువోవు నవ్వు లం దించిన కౌముదీప్రభలు నిల్చిన యాకడకంటి చూపు సా రించి మసారహారపటలీ పరిభూషిత రాధికావధూ కుంచితదేహవల్లి నుపగూహనలో నొకమారు నింపరా! |
|
నీమురళీరవమ్ము విని నీకడకు\న్ జనుదెంచి చూతునా స్వామి! యిదేమి నాగళము సన్నవడె\న్ చెమరించె దేహము\న్ సామి వినిర్గతాశ్రువులు జాలయి పారెను ఫుల్లగల్లము\న్ హ్రీమధురమ్ముగా పులకరించినదీ మృదుమాలతీగతి\న్. |
|
స్వామి! పునఃపునారచిత చంద్రకచారు పురఃప్రసారముల్ నామనము\న్ హరించె పరిణద్ధకలాపికలాప కైశిక శ్రీమహనీయతల్ సతుల లేయెడదల్ హరియించుటల్వినా ఏమి ఘటించు నీకు కికురించుట నీపనియయ్యెనే ప్రభూ! |
|
ఓ యదువంశమౌళి! రుచిరోజ్జ్వలమీనపతాక మెత్తి ద ర్పాయుత శింజినీరవముల\న్ మదనాహ్వయుడేయు బాణముల్ నీ యెద తాకి తూలిపడునేమొ సుమమ్ములపోల్కి - రాధకున్ తీయనిమంటలై యుసురు తీయునురా జగదేకసుందరా! |
|
శారదయామినీమధురచంద్రిక లిమ్ముగ నింబవాటిక\న్ తీరిచి మ్రుగ్గువెట్టి నవనీతలము\న్ మలుపచ్చిముత్యపు\న్ పేరుల నందగించె రజనీరమణీకచసక్తసూసక శ్రీరమణీయమై వొలిచె శీతమయూఖుడు షోడశాంశుడై. |
|
లోకముకూడ మైమరపులో పులకించి రహస్సమాధిలో తా కనుమూసుకొన్నది సితద్యుతికాంతుల మున్కలాడి ల జ్జాకలన\న్ కనుల్ మొగిచి శార్వరియు\న్ నిదురించెనేమొ హే వాకమున\న్ ప్రమోదసుఖవార్నిధి క్రుంకిడి సోలిపోవుచు\న్. |
|
వలపులు ముర్మురించు రసవన్నవ హృచ్ఛషకమ్ము నీకునై నిలిపితి, త్రావి పొమ్ము నవనీతదయాగుణశాలి! ఆవల\న్ వలచిన నుండునోమరి రవంతయు నుండక యెండిపోవునో మొలచినకూర్మి కన్నుగవ మూసిన నేమగునో జగత్ప్రభూ! |
|
నీలమణిచ్ఛవిచ్ఛటలు నిండిన నీ హృదయమ్ము ఱాయికా జాలదు నీ రసాకృతికి జాలద ఈనిఖిలప్రపంచము\న్ చాలని నా యలంతి యుపచారముల\న్ గొనుమీ పవిత్ర పూ జాలసత\న్ పునీతమగు నస్మదుదాత్తసమాధి మాధవా! |