లలితకళలు నాట్యకళ  

డాక్టరు వి. రాఘవన్‌, ఎం.ఏ., పి.హెచ్‌.డి.

జమిలి కళలగు నృత్త గీతములకు తానకమైన నాట్య శాస్త్రమును వివిధ విజ్ఞాన శాఖలతో పాటు ఆంధ్ర రాజన్యుల పోషణమున నభివృద్ధి పొందినది. ప్రాచీన కాలము నుండియు నీ రెండు కళలును ఆంధ్ర దేశమున ప్రజాదరణమునకు పాత్రములై విలసిల్లు చుండిన వనుటకు అమరావతి యందును, నాగార్జునుని కొండయందును కానవచ్చు చున్న శిల్ప చిత్రములే నిదర్శనము. గండారపు కళ (ప్లాస్టిక్‌ ఆర్ట్‌)ను మాత్రమే నిదర్శనముగా గ్రహించినచో నాట్యకళ యందు ప్రజలకు గల యభిరుచి విజయనగర రాజుల కాలమువరకు ననలు సాగుచుండిన దనవచ్చును. ప్రకృత విషయము నాట్యకళ. కావున నీ కళ ఆ కాలమున ప్రచారములో నుండెనని రుజువగుటయే కాక భరతముని ప్రోక్తములయి అభినవగుప్తాచార్యులచే విపులముగ వివరింపబడిన 'పిండి బంధము' లను బృంద నృత్యములును ప్రచారమున నుండినట్లు అమరావతీ శిల్పములవలన స్పష్టమగు చున్నది. మూల గ్రంథముల యందు వాగ్రూపమున వర్ణింపబడిన నృత్య విశేషము లచట సుందర శిలామయ శిల్ప రూపమున రూపమును దాల్చినవి. ఇట్టి శిల్ప చిత్ర మొకటి అమరావతియందు గలదు. అందు నలుగు రాట కత్తెలు కలిసి నృత్యము చేయుచున్నారు. అందలి రచన, తూగు, సౌకుమార్యము ప్రశస్తముగా నున్నవి. బ్రిటిష్‌ మ్యూజియమున భద్రపరుపబడిన అమరావతీ శిల్పములలో కూడ ఒక నృత్య దృశ్యము కలదు. అందొక యువతి వల్లకిని మీటుచుండగా నింకొక యువతి వేణు గానము చేయుచుండును. తదనుగుణముగా నొక నర్తకి నృత్యము చేయుచుండును. గుంటూరు జిల్లా యందలి గోలి శిల్పములలో నొక యువతి విపంచిని మీటుచున్న ట్లొక శిల్పమున్నది. నాగార్జునుని కొండయందు విపంచిని మీటుచున్న యువతి శిల్ప మిట్టి దొకటి యుండుటయే కాక ముగ్గురు స్త్రీలు బృందనృత్యము చేయుచున్నట్లు నొక శిల్ప దృశ్యము కలదు. మీద పేర్కొనిన అమరావతి యందలి బృందనృత్య శిల్పమున కంటె నది యంద చందములలో కొంచెము కొరతవడినను, అంత హృదయాకర్షకము కాకపోయినను దానితో సరిసమానముగా గ్రహింపదగినదియే.

నాట్యము సాతవాహనుల, ఇక్ష్వాకుల కాలమున మహారాజుల, సంపన్నుల ఆశ్రయమున వర్ధిల్లిన దనుటకు అమరావతి, నాగార్జునునికొండ శిల్పములలోని చిత్రములే తార్కాణము. వారి కాలమునకు తరువాత ఆ కళ యెట్లుండెనో తెలిసికొనుటకు శిల్పములో నైనను ఆధారములు కానరావు. కాని యది పౌరాణిక మత విజృంభణ కాలమున రాజాదరణము వలన కంటెను ఎక్కువగా దేవాయతనాశ్రయమున వర్ధిల్లిన దనుట కవకాశము కలదు. పూర్వచాళుక్య పరిపాలనమున శివాలయమున కగ్రహారము దాన మిచ్చుటకు గల ప్రయోజనములలో తత ఘన సుషిర ఆనద్ధ వాద్య వాదక గాయక నటకాచార్య విలాసినీ జనమును పోషించుట ఒకటి. (తత ఘన సుషిర ఆనద్ధము లనునవి నాలుగు రకములైన వాద్యములు. వీణలోనగునవి తతములు; కంచుతాళములు లోనగునవి ఘనములు; మద్దెల లోనగు చర్మవాద్యములు ఆనద్ధములు; పిల్లంగ్రోవి మున్నగునవి సుషిర వాద్యములు).

బెజవాడలో అక్కన్న మాదన్న గుహలకు కొద్ది దూరములో నున్న జమ్మిదొడ్డిలోని మండప స్తంభ చూళికల మీదను, దూలములమీదను క్రీ. శ. 8, 9 శతాబ్దములనాటి పూర్వచాళుక్య శిల్ప సంప్రదాయమునకు చెందిన నాట్య చిత్రములు కొన్ని యున్నవి. వాని వలన పూర్వ చాళుక్య యుగమున నాట్యకళకుగల జనాదరము వ్యక్తమగుచున్నది. క్రమముగా శిల్ప, చిత్రలేఖనములకు వలెనే సంగీత, నాట్య కళలకుకూడ పూర్వచాళుక్య పరిపాలనాంతిమకాలము నాటికి ఈ యాశ్రయము మరింత బలపడినది. చాళుక్య చోళ యుగమునందు అంతకు పూర్వమున కంటెను దేవాలయమునకు ప్రాధాన్యము హెచ్చి స్వామికి హవిర్బల్యర్చనాదులును, అంగరంగ భోగాదులును నిత్యవిధులైన కాలమున స్వామి సేవాపరిజనములో గాయక, మార్దంగిక, నర్తకీజనము ముఖ్యులై వారి జీవన భృతికి జీతములో, వృత్తి మాన్యములో ఏర్పడి నాట్యకళ కత్యంత ప్రాముఖ్యము కలిగినది. దేవాలయములో నాట్యమండపము ప్రముఖ భాగమైనది. స్వామియొక్క అర్చాసేవా సమయములలో శివాలయములందు శివకథలను, విష్ణ్వాలయమున విష్ణు కథలను ఆడిపాడి అభినయించుట ఆచారమైనది. ఈ యాచారము వలననే పూర్వ మధ్యయుగమున తెలుగుదేశములో నర్తకులును, నాట్యమండపమును లేని దేవాలయ ముండెడిది కాదు.

కాకతీయుల కాలమున నాట్యకళ విపుల ప్రచారమున నుండెనని శాసనముల వలనను, శిల్పరచనములవలనను, సాహిత్యమువలనను విదిత మగుచున్నది. రేచెరువుల నామిరెడ్డి పిల్లలమర్రి శాసనములో దేవాలయ కైంకర్యము చేయు గాయక మార్దంగిక నర్తకీ జనమునకు గృహదానములును చేసినట్లు కలదు. మైలాంబ పానుగల్లు శాసనములోని గాయకులకు, నర్తకులకు ఇట్టి దానములు చేసినట్లు చెప్పియున్నది. జలజకరండమను నపూర్వ వాద్య ప్రశంస గల ధర్మసాగర శాసనమున కొన్ని నివర్తనముల భూమిని గాయకులకు, పదుగురు నాట్యకత్తెలకు ఇచ్చినట్లు లిఖింపబడి యున్నది. కాకతి గణపతి దేవ, జాయపల చేబ్రోలు శాసనము పదునాల్గురు ఆటకత్తెలకు గృహముల నిచ్చినట్లు పేర్కొనుచున్నది. శకవర్షము 1183 లో తనకు కాకతీయ మహారాజ్ఞి రుద్రమదేవి దానముగా నిచ్చిన మందార (ఇప్పటి మందడ)మను గ్రామములో విశ్వేశ్వర శివాచార్యుడు స్థాపించిన గోళకీమఠ విద్యాస్థానమునను, దేవాలయమునను పదిమంది నర్తకులకు, మర్దలవాదకు లెనమండ్రకు, కాశ్మీర దేశీయుడైన గాయకునికి, పదు నాల్గురు గాయనులకు, కరడావాదనాదులలో చతురులైన ఆరుగురికి వృత్తిమాన్యము లిచ్చి నాట్య, సంగీతములకు పోషణ కల్పించెనని మల్కాపుర శాసనము తెలుపుచున్నది.

శాసనములతోపాటు కాకతీయ నరపతులు కట్టించిన దేవాలయములయందలి శిల్పము కూడ నాట్య సంప్రదాయములు, వానికి దేవాలయములతో గల సంబంధము అవిచ్ఛిన్నముగా సాగుచుండినట్లు నిరూపించుచున్నవి. కాకతీయుల కాలమునందలి నృత్య, శిల్పములలో రామప్ప దేవాలయములోనివి ప్రశస్తములు. జాయపచే నృత్త రత్నావళిని రచింపజేసిన కాకతి గణపతిదేవుని కాలమున చెక్కబడిన శిల్పములగుట వీనికి గల మరియొక విశేష గుణము. ఆంధ్రదేశ మందలి నృత్య, సంగీత కళల చరిత్రను రచించిన ఆంధ్రరచయితలు కొందరు ఈ కాకతీయ నృత్య శిల్పములు జాయప నృత్తరత్నావళి యందలి నృత్యవర్ణనల కుదాహరణములుగ చెక్కబడినవని భావించిరి. కాని ఇది నిరూపింప వలను పడదు. లభించిన శిల్పములు చాల కొలదిగ నున్నవి. అవియు చిదంబరములోని, తంజావూరులోని శిల్పములవలె నాట్య భంగిమముల కుదాహరణములుగా చెక్కబడినవి కావు. కొంత పోలికలు కానవచ్చు చున్నను శాస్త్రీయములగు భంగిమముల విషయమున నవియు, నివియు నొక్క రూపువే అని చెప్పుటకు సాధ్యము కాదు. పాలంపేట యందలి పెద్ద దేవళము యొక్క ద్వార బంధములమీదను, స్తంభముల మీదను నృత్యశిల్పము లున్నవి. పాలంపేటలోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివర నున్న దేవాలయము యొక్క లోపలి భాగమున, స్త్రీలు మద్దెల వాయించుచుండ వివిధ భంగిమములతో నృత్యము చేయుచున్న ఆటగత్తెల శిల్పము లున్నవి. పడుమటివైపు ద్వారబంధములమీదను అట్టివే మార్దంగికు రాండ్రు గల నృత్యశిల్పములు గలవు. వరంగల్లు కోట ద్వారబంధముపై రాతి గొడుగు పలక మీదను ఇట్టి నృత్య శిల్పచిత్రములు చెక్కబడి యున్నవి. ఆ వరంగల్లు కోట యందలి స్వయంభూ లింగేశ్వర దేవాలయమున ఒక చిన్న శివతాండవ శిల్ప మున్నది.

కాకతీయ యుగమున నాట్యకళ బహుళ ప్రచారమున నుండెనని అప్పటి సంస్కృతాంధ్ర గ్రంథములును తెలుపుచున్నవి. సంస్కృత గ్రంథమగు నృత్తరత్నావళి కాకతీయుల కాలమునందలిదే. కాకతీయ మహీపతియగు గణపతిదేవునికడ గజసేనాధ్యక్షుడుగ నుండిన జాయప 'నృత్తరత్నావళి' యను నాట్యశాస్త్ర గ్రంథమును రచించెను. తెలుగునాట వెలసిన నాట్యగ్రంథములలో నిది యుత్తమ మనదగియున్నది. దక్షిణమున తన 'సంగీత చింతామణి' యందు వేమ భూపాలుడే కాక తన 'సంగీతరాజము'న కుంభకర్ణుడును ఈ నృత్తరత్నావళిని విరివిగ నుపయోగించుకొనిరి. జాయప ఈ గ్రంథమును తాను కలియుగము 4355 వ సంవత్సరమున, అనగా క్రీ. శ. 1253- 54 లో రచించితినని తన గ్రంథములో చెప్పికొనెను. భరత ప్రోక్తమై తద్వ్యాఖ్యాతలచే వివరింప బడిన నాట్య శాస్త్రమునకు ఇది చక్కని సంగ్రహరచన మగుటయేకాక జాయప కాలమున ప్రచారమం దుండిన దేశినృత్యము లెల్ల ఇందు చక్కగా వివరింపబడియుండుట చేత ఇది చాల అమూల్యమైనది. ఎనిమిది అధ్యాయములుగల ఈ గ్రంథమున కడపటి మూడధ్యాయములు దేశినృత్య సంప్రదాయములను గూర్చి వివరించుచున్నవి. మార్గ నృత్యములను వివరించు పట్టున మూలమగు భరతనాట్య శాస్త్రమున జాయపకు గల అపార పాండిత్యమేకాక అభినవగుప్త విరచితమగు తద్వ్యాఖ్యానమునందుగల నిరాఘాట ప్రజ్ఞయు ప్రకటిత మగుచున్నది. ఇంతే కాదు; కీర్తిధర, భట్టతండు విరచితములగు భరతనాట్యశాస్త్ర వ్యాఖ్యా ప్రకారములుకూడ ఇందు తరచు నుదాహృతములైనవి. ఇది యంతయు పరిశీలింప ఈ ప్రసిద్ధరచయితల యపూర్వ గ్రంథముల మాతృకలు దక్షిణ దేశమున లభ్యములగు చుండెడి వనియు, అవి నిత్యోపయోగమున నుండెడి వనియు స్పష్టమగు చున్నది. దేశినృత్యాధ్యాయములలో జాయప పేరణి, ప్రేఖ్ఖణము, రాసకము, చర్చరి, నాట్యరాసకము, దండరాసకము, శివప్రియము, చిందు, కందుకము, భాండికము, ఘంటసరి, చరణము, బహురూపము, కోలాటము అను జానపదములు, ప్రాంతీయములు నైన నృత్యములను వివరించెను. ఆనాటి సాటి యాదవరాజుల యొక్క యాస్థానమున పుట్టువు గాంచిన సంగీత రత్నాకరమున కూడ గానరానివి వానిలో కొన్ని గలవు.

జాయప దీనితోపాటు గీతరత్నావళియను సంగీత గ్రంథమునుకూడ రచించెను. అందు తన నృత్తరత్నావళి యందలి నృత్యములకు సంగీత ముపాంగ మగునట్లు వర్ణించి యుండవలెను. ఈ గీతరత్నావళి ఖిలమైపోయినది. నృత్తరత్నావళియం దుదాహృత మగుటవలన దీని యునికి తెలియవచ్చినది.

ఆనాటి తెలుగు రచనములలో కేవలము సూచనలే కాక నృత్య కళకు సంబంధించిన విశేష విషయము లధికముగ వర్ణితములైనవి. సోమనాథ కృతమగు పండితారాధ్య చరిత్ర యందలి పర్వత ప్రకరణములో నృత్యకళకు సంబంధించిన శాస్త్రీయ సాంకేతిక పదజాలమే కాక నృత్తరత్నావళిలో వర్ణింపబడిన జానపద నృత్యముల దృక్పథము ననుసరించి మిక్కిలి యమూల్య మనదగిన జానపద నృత్యవర్ణనము కూడ కావింపబడినది. ఈ గ్రంథము నృత్యములను శ్రీశైలము నందలి శివరాత్రి మహోత్సవములలో నేకదేశముగ వర్ణించి నృత్య కళకు, శైవమునకు పరస్పరసంబంధము గలదని రూఢిపరచుచున్నది. పండితారాధ్య చరిత్రయం దాకాలమున ప్రజారంజకములుగా నుండిన దేశినృత్యము లీ క్రింద పేర్కొన బడినవి కొన్ని వర్ణింపబడి యున్నవి; వెడయాట (ఇదియే వికట నర్తనము), చిందు (దీనిని జాయపయు పేర్కొనెను), కోడ(ణ)ంగి ఆట (ఇది హాస్యకాని నృత్యము, జాయప వర్ణించిన భాండిక నృత్యమువంటిది కావచ్చును), పేరణి (ఇదియు జాయప రచనమున కలదు), ప్రమథ గణముల చేష్టితములను వర్ణించు బహునాటకములు, బహురూపులు (ఇదియు జాయప వర్ణితమే), వెడ్డంగము (ఇది కరణములతో నెరసి వివిధగతుల నొప్పుచుండును కాని, ఇది యవిజ్ఞాతము), అమర గంధర్వాంగనల నృత్యానుకరణములు, పక్షుల ఆటలు, గడాటలు (దొమ్మరాటలు), భారతాది కథల ఛాయాచిత్ర ప్రదర్శనములు, బొమ్మలాటలు, పగటివేషములు.

సోమనాథ ప్రోక్తము నాట్య విషయము కావున చర్చింపదగినది. పేరణిని పంచాంశి అని సోమనాథుడు పేర్కొనెను. నాట్యశాస్త్రములందు దీనికి పంచాంశములు (అయిదు భాగములు - పంచాంగములు) కలవని చెప్పబడినది. ఆ యంగములు నృత్తము, కైవారము (కవి చరము), ఘర్ఘరము, వికటము, గీతము - అని జాయప చెప్పెను. దేవాలయము నెదుట ప్రవర్తిల్లు ఇతర నృత్యములను సోమనాథుడు తరువాత వర్ణించెను. అతడు నర్తకజనుల నగలతోను, వేషములతోను మొదలిడెను. నాట్యము చేయునపుడు నట్టువకత్తె లర్ధోరుకముల (చల్లడముల) నాకాలమున ధరించువారు. తెర లోపలి భాగమున రంగముమీదికి నర్తకులు ప్రవేశించిన వెంటనే నర్తన గానములు ప్రవర్తిల్లెడివి. దీనికి పూర్వరంగమని పేరు. తదనంతరము నర్తకులు తెరబయటికి వత్తురు. తరువాత కన్నులు, కనుబొమ్మలు మొదలగు నర్తకుల అంగ ప్రత్యంగ ఉపాంగముల చలనములు అభివర్ణితములు. ఆవెంట జంత్ర సంగీతము, గమకముల యొక్కయు, వివిధవాద్యముల యొక్కయు దేశినామములు వర్ణింపబడినవి. కొంతమేర పదఘట్టనము, ఉద్ఘట్టనము, ఉత్ప్లుతి మొదలగు పదగతులను సంగ్రహముగా పేర్కొని తరువాత సోమనాథుడు వివిధ విధ నర్తకుల నర్తనముల తీరులను అత్యుత్సాహముతో కావ్యధోరణిని వర్ణించినాడు. ఈ వర్ణనములో మరగాళ్ళపై నడక, ఒంటికాలి నడక, మోకాటి నడక, కూర్చుండియే ముందుకు చనుట, రొమ్ముతో ప్రాకుట, గిరగిర తిరుగుచు పోవుట మున్నగునవి కలవు. సోమనాథుడు బొంగరమువలె గిరగిర తిరుగుచు చేయు నృత్యమును పేర్కొని యున్నాడు. దీనికి భ్రమరి నృత్యమని పేరు. ఇట్టి నృత్య మీనాడు అంతరింప కున్నను చాల అరుదు. మరియు నీ గ్రంథమున నెమళ్ళు చిలుకలు హంసలు కోయిలలు మొదలగు పక్షులవలెను, కోతులు జింకలు ఎద్దులు ఏనుగులు పెద్దపులులు మొదలగు జంతువులవలెను, తుమ్మెద చేప పాము మొదలగువాని వలెను నడచుచు ఆర్చుచు నృత్యము చేసినట్లు వర్ణింపబడెను.

వీనితోపాటు బహువిధములయిన ఇతర నృత్యభేదములును, వేర్వేరు కథలను వివరించు నాటకప్రదర్శనములును వర్ణింప బడినవి.

దేశిలాస్యమునకు అంగములు వివిధ గ్రంథములలో పేర్కొనబడినవి. జాయప తన నృత్తరత్నావళిలో ఆరవ యధ్యాయమున వానిలో నలువది యారింటిని నిర్వచించినాడు. సోమనాథుడు ఈ యంగములను పెక్కింటిని వర్ణించియున్నాడు. వీనిలో చాల భాగము గుర్తింప దగినవే. కొన్ని జాయప రచనమునగాని, శార్ఙ్గదేవ, పార్శ్వదేవ, వేమభూపాలుర గ్రంథములలోగాని కానరావు. కావున ఆ కాలమున వాడుకలో నుండిన నాట్యకళయొక్క చరిత్రను గ్రహించు విషయమున ఈ సోమనాథుని వర్ణనలు అమూల్య సాధనము లగుచున్నవి.

దేశిలాస్యాంగములను వివరించిన వెనుక సోమనాథుడు వివిధాంగములయొక్క అభినయముల పట్టిక నిచ్చెను. అందు ముఖమువి 4, కనుబొమ్మలవి 7, కన్నులవి 26, నాసా పుటములవి 6, చెవులవి 10, కుత్తుకవి 9, రొమ్మువి 3, పాదములవి 5, తొడలవి 5 అభినయములు పేర్కొన బడినవి. తరువాత 22 తానకములు (స్థానకములు), 34 దృష్టులు, 64 హస్తములు, 32 చారులు, 7 భ్రమరులు, 108 కరణములు, 100 అలంకారములు, 13 శిరోభినయములు, 32 దండనములు చెప్పబడినవి. ఈ పట్టికయందలి అభినయాదులు నాట్య గ్రంథములలో నే యొకదానియందు పేర్కొనబడిన వానితోగాని పూర్తిగా సరిపోవు. వీనిలో కొన్నిటి సంఖ్యలు చిత్రముగా నున్నవి. నేత్రాభినయములు రెండు మారులు రెండు విధములుగా చెప్పబడినవి. అలంకారములు 100, దండనములు 32 అజ్ఞాతములు. కట్టకడపట సోమనాథుడు హంస, నెమలి, పాము, ఏనుగు, ఎద్దు, కోతి, మేక మొదలగు వివిధములగు పక్షులయు, మృగములయు గతుల ననుకరించి చేయు నృత్యముల పట్టిక నిచ్చినాడు.

కళాసంపదను, అందలి విభేదములను, దాని సంప్రదాయములను చక్కగా వివరించి పేర్కొనుటకు సారస్వతాధారముల నెక్కువగా సేకరించి వాని నొండొంటితో పోల్చి పరిశీలించవలసిన ఆవశ్యకము కలదని సోమనాథుడు తెలుపుచున్నాడు.

సోమనాథుని రచనాంతరమగు బసవపురాణమున నృత్యవర్ణన మెడనెడ కొలదిగా గలదు. బసవని వివాహ ఘట్టమున సోమనాథుడు కోలాటము, అనగా దండరాసకము, పాత్ర (ఇది యొకతీరు నృత్యము; దీని ప్రస్తావమిందేకాని మరెందును లేదు), గొండ్లి, పేరణి అను వానిని పేర్కొనెను. కొంత తరువాత, ఆనంద గీతములు, శంకర గీతములు, మనకు ముఖ్యముగ ప్రసక్తమయిన జతిగీతములు ప్రస్తావించెను. బసవని కల్యాణపుర ప్రవేశ సమయమున పేరణి ప్రస్తావ మున్నది. ఆ పేరణి సౌరాష్ట్రనర్తనాచార్యుల సంప్రదాయాను సారము నర్తింపబడిన ట్లున్నది. ఇందువలన శైవసంప్రదాయము నను సరించిన పేరణి యొక్క చరిత్ర, దాని యానుపూర్వి స్పష్టమగుచున్నవి. పూర్వాంగ సంగీతము, తెరతీయుట, దేశిలాస్యాంగములు, ముఖరసము, సౌష్ఠవము, లలి, భావము, ధూకళి, ఝంకళి, ఠేవ, విభ్రమము, రేఖ అనువాని ప్రస్తావము నున్నది. ఆ వెంబడినే మరి యొకచోట జతిగీతముల ప్రస్తావము కలదు. మరికొంత యావల దేశి సంగీత సంబంధము లయిన సాంకేతిక పదముల పట్టిక యున్నది. ధూకళి తప్ప తక్కిన దేశిలాస్యాంగము లన్నియు జాయప నృత్తరత్నావళి యందు గలవు. పార్శ్వదేవుడు ఆ ధూకళినే తూకళి అనుపేరుతో పేర్కొనెను.

మాచలదేవి యను పేరు గల వేశ్య యొకతె ప్రతాపరుద్రుని నేస్తగత్తె యుండె ననియు, ఆమె సుప్రసిద్ధ నర్తకి యనియు, ఆమె జీవితము నాటకముగా రచింపబడి ప్రదర్శింపబడె ననియు క్రీడాభిరామమునందు కలదు.

కొండవీటి రెడ్డి రాజులలో పలువురు నాట్యశాస్త్ర రచయిత లుండిరి. వారిలో మొదటి వాడు కుమారగిరి రెడ్డి (క్రీ. శ. 1386 - క్రీ. శ. 1403). ఇతనికి వసంతరాజని నామాంతరము. ఇతడు తన పేర వసంతరాజీయ మను నాట్యశాస్త్ర గ్రంథమును వ్రాసెను. ఆ గ్రంథ మీనాటికిని కానరాదు. కాని ఇతర రచయితలు - అనగా కుమారగిరికి ప్రధానియు, తోబుట్టువు భర్తయు, కాళిదాస నాటక వ్యాఖ్యాతయునగు కాటయ వేమారెడ్డి, మాఘవ్యాఖ్యాత మల్లినాథుడు, అతని కుమారుడును ప్రతాపరుద్రీయ రూపక వ్యాఖ్యాత యగు కుమారస్వామి, ప్రబోధచంద్రోదయ రూపకవ్యాఖ్యాత యగు నాదెండ్ల గోప ప్రధాని మొదలగు వారు వసంతరాజీయములోని భాగములను తమ రచనములలో నుదాహరించి యున్నారు. కుమారగిరిరెడ్డి తరువాత వచ్చిన వీరనారాయణుడను నామాంతరముగల పెదకోమటివేమ భూపతి సంగీత చింతామణిని రచియించిన విషయము పూర్వోక్తము.

ఆ కాలపు ఆంధ్ర కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచియించిన కాశీఖండమునను నృత్యముల ప్రసక్తి గలదు. కర్పూరతిలక యనువేశ్య కాశికానగరమున రత్నేశ్వరుని సమ్ముఖమున నృత్యము చేసినట్లు అతడు వర్ణించి యున్నాడు. కుండలీనృత్యమును - కోహలుడు మొదలగు నాట్యాచార్యుల మతభేదములతో - దేశి మార్గ నృత్యములను, చారిక కరణ అంగహార రేచక భ్రమరికా నృత్యములను కావించి యామె లాస్య తాండవ జననీ జనకులగు పార్వతీ పరమేశ్వరులను మెప్పించెనట.

రేచెర్ల వంశ్యులలో సర్వజ్ఞ బిరుదాంచితుడగు సింగభూపాలుడు రస నాట్య విషయముల నభివర్ణించు రసార్ణవ సుధాకరమునే కాక, కడపటి యధ్యాయమున నాట్య విషయము నభివర్ణించు సంగీత రత్నాకరమునకు సంగీత సుధార్ణవ మను నొక వ్యాఖ్యానమును రచించెను. ఈ కాలముననే యక్షగానమను నృత్య నాటక ముప్పతిల్లినది.

విజయనగర రాజుల కాలమునను నాట్య సంగీత కళలు వర్ధిల్లినవి. విద్యానగరరాజ్య ప్రతిష్ఠాపకుల యాచార్యులు విద్యారణ్యుల సంగీతసార మను గ్రంథము తంజావూరు రఘునాథనాయక విరచిత మనబడు సంగీత సుధయం దుదాహృతమైనది. రెండవ దేవరాయల కాలములో అబ్దుర్‌ రజాక్‌ అను పార్సీ యాత్రికుడు విజయనగరమును దర్శింప వచ్చి యుండెను. విజయనగర రాజ భవనమున దశరా దినములలో మహానవమి మహోత్సవ మత్యంత వైభవముతో జరిగినట్లు అతడు వర్ణించి యున్నాడు. అందు వైదేశికుడగు నతడు ఆ మహోత్సవ సమయమున నద్భుతావహము లగు నాట్య ప్రదర్శనములు జరిగినట్లు పేర్కొని యున్నాడు. 'ఈ స్థలమునకును, మంటపములకును నడుమ చక్కగా తీర్చిన కాళీ స్థలము కలదు. అందు గాయకులు గానము చేసిరి; కథకులు కథలు చెప్పిరి. గాయకురాండ్రలో నధికాంశము లేబ్రాయపు కన్యలే. వారి బుగ్గలు చంద్రునివలెను, వారి మొగములు వసంతము నతిశయించిన శోభతోను ఒప్పుచుండినవి. వారు ధరించిన వస్త్రములు సొగసయినవి. క్రొత్తగా విచ్చిన గులాబి పూవులవలె వారి రూపములు మనసున కమితానందము కలిగించినవి. వారు రాయల కభిముఖముగ నున్న తెరకు మరుగున కూర్చుండి యుండిరి. అకస్మాత్తుగా రెండు వైపులనుండి తెర తొలగింపబడినది. అంత నా బాలికలు చూపర వివేకము చూర పోవునట్లును, ఆత్మ లానంద పరవశము లగునట్లును లలిత పద విన్యాసములతో నృత్యము చేయనారంభించిరి' అని యతడు వ్రాసెను.

క్రీ. శ. 1433-34 లో మడమను గ్రామములోని అగ్నీశ్వర దేవాలయ దేవదాసి - అరంవళత్త నాచ్చియార్‌ అను అరవ దేవదాసి - రెండవ దేవరాయలను సందర్శించి, అతనివలన నొక దేవాలయముకొరకు దానము పడసెను. సాళువ తిరుమలరాయల సోదరుడును, రెండవ దేవరాయల కాలమున దుర్గపాలకుడునైన గోపేంద్ర తిప్పరాజు తాళదీపిక యను ప్రత్యేక తాళ లక్షణ గ్రంథమును రచించెను. అతడు వామనుని కావ్యాలంకార సూత్ర వృత్తులకు తాను రచించిన లఘుటీక యొక్క ప్రస్తావన శ్లోకములందొక దానివలన తాను శివాంకితముగ నొక తాళ ప్రబంధమును రచించినట్లే కాక నాట్యమునకు సంబంధించిన యొక గ్రంథమును ('శివా క్లుప్తాకారా నటన కరణా నామపి భిదాః') వ్రాసినట్లును తెలియుచున్నది.

ఇమ్మడి ప్రౌఢ దేవరాయ లనబడు మల్లికార్జున దేవరాయల కాలము (క్రీ. శ. 1446 - క్రీ. శ. 1465) లో చతుర కల్లినాథుడు రచించిన కలానిధి నామకమగు సంగీతరత్నాకర వ్యాఖ్యానము విజయనగర యుగమున వెలువడిన ఉత్తమ సుప్రసిద్ధ గ్రంథము. సింగ భూపాలుని వ్యాఖ్యానము కన్న ఈ కల్లినాథుని వ్యాఖ్యానము ప్రశస్త తరము. సంగీత రత్నాకరము నందలి కడపటి యధ్యాయమునకు చేసిన వ్యాఖ్యానము వలన కల్లినాథుని నాట్యకళా పాండిత్యము స్పష్టమగుచున్నది. శ్రీకృష్ణదేవరాయల కాలమున (క్రీ. శ. 1509 - క్రీ. శ. 1530) అంతఃపుర స్త్రీ జనమునకు నాట్యాచార్యత్వమును వహించి యుండిన బండారు లక్ష్మీ నారాయణ పండితుడు సంగీత సూర్యోదయ మను నొక గ్రంథమును రచించెను. అందు నృత్యమును గురించిన అధ్యాయ మొకటి కలదు. అందతడు శార్ఙ్గదేవ, కోలాహల విరచిత గ్రంథముల ననేక పర్యాయము లుదాహరించినాడు. ఓఢ్రరాజగు వీరరుద్ర గజపతియొక్కయు, విజయనగర ప్రభువగు కృష్ణదేవరాయల యొక్కయు పోషణమున వెలసిన లొల్ల లక్ష్మీధరుడు తన సౌందర్యలహరీ వ్యాఖ్యానాంతమున తాను రచించిన పెక్కు విషయములను వివరించు సుదీర్ఘ గద్యయందు తన పూర్వులలో తన కైదవ తరమువాడగు విరించిమిశ్రుడు భరతార్ణవపోత మను నాట్యగ్రంథము నొక దానిని రచించినట్లు చెప్పి యున్నాడు.

సాహిత్యమునకంటె నధికముగ హంపి శిల్పములును, విదేశ యాత్రికులగు బర్బోసా, పేయస్‌ మొదలగువారు రాయల యాస్థానమునుగురించి, రాజధాని యందలి ప్రజా జీవిత విధానమును గురించి వ్రాసిన వృత్తాంతములును విజయనగర రాజుల కాలమున నృత్యకళ పొందుచుండిన గౌరవాదరములను తెలుపుచున్నవి. ఈ విదేశ యాత్రిక వృత్తాంతములలో అప్పటి వేశ్యాంగనల యొక్క సంపత్సమృద్ధికిని, వారికి ఆస్థానికులతోడను, ఇతర ప్రముఖులతోడను గల సంబంధానుబంధములకును ప్రస్తావము కలదు. శుద్ధాంత కాంతాజనముకూడ నాట్యకళ నభ్యసించుచుండెను. పేయస్‌ రచియించిన వృత్తాంతములో నర్తకీ జనము నాట్యము నభ్యసించునట్టిదియు, ప్రదర్శించునట్టిదియు నగు నర్తనశాల వర్ణనము మిక్కిలి ముఖ్యమయినది. 'నర్తనశాల సుదీర్ఘమయినది. కాని అంత వెడల్పు గలది కాదు. దానియందు గోడనుండి సరిగా రెండు మూరల దూరమున శిల్ప రమణీయము లగు శిలా స్తంభములు గలవు. ఆ స్తంభ ఫలకములపై నాట్యాంతమున నుండవలసిన సరియైనతీరులలో నొప్పు నాట్యకత్తెల రూపములు చెక్కబడి యున్నవి. నృత్యము నభ్యసించువారు నృత్యాంతమున తాముండవలసిన వైఖరిని మరచి పోయిన యెడల, అట్టివారు ఈ శిల్పచిత్రములను చూచి తాముండవలసిన తీరును జ్ఞాపకము తెచ్చు కొందురు. ఈ నర్తనశాల తుదను ఎడమచేతివైపున చిత్రలేఖనములు గల యొక యేకాంతస్థలము కలదు. అచట నాట్యకత్తెలు తమ శరీరములను, కాళ్ళను చక్కగా జాపి సడలజేసి కొనుటకై వ్రేలాడుదురు. వారి నృత్యము సుందర తరముగ నుండునట్లు చేయుటకుగాను శరీరము తేలికగా వంగునట్లు చేయుట కచ్చట నేర్చుకొందురు. నర్తనశాల యొక్క మరియొక తుదను కుడివైపున నాట్య ప్రదర్శనమును గాంచుటకై రాజు కూర్చుండు ప్రదేశమున నేలమీదను, గోడలమీదను బంగారు రేకులు తాపబడి యుండును. గోడ నడిమి భాగమున పండ్రెండేండ్ల బాలిక ప్రమాణమున నుండు సువర్ణ విగ్రహము కలదు. ఆ విగ్రహముయొక్క చేతులు నాట్యాంతమున నుండ వలసిన తీరున నుండును'. ఈ నాట్య మందిరము నాశముకాక యుండిన యెడల నాట్యకళా సంప్రదాయ పునర్నిర్మాణమున కీనా డంతకన్న సహాయకారి మరియొకటి యుండెడిది కాదు; తంజావూరు, చిదంబరములతోపాటు విజయనగరము కూడ భరత నాట్య శాస్త్రమునకు మూడవ శిలాశిల్పమయ భాష్యమై యుండెడిది. విజయనగర శిథిలములలో నేడు మిగిలి యుండునది నలువైపుల ప్రక్కలయందు నృత్య శిల్పచిత్రములు గల సింహాసన వేదిక మాత్రమే. ఆ కాలమునాటిదే యగు తాడిపత్రి దేవాలయమునను నృత్య శిల్పఫలకములు గలవని తెలియుచున్నది.

కృష్ణదేవరాయల యుద్యోగులలో నొక్కడైన నాదెండ్ల గోపన్న మంత్రి ప్రబోధచంద్రోదయ మను నాధ్యాత్మిక రూపకమునకు వ్యాఖ్య రచియించెను. అతడు నాట్యశాస్త్ర గ్రంథ కర్తలలో శృంగనాచార్యుని నామమును రెండు మూడు మారు లుదాహరించెను. ఈ శృంగనాచార్యుడు పెదకోమటి వేమారెడ్డి కాలమున నుండి, సంగీత రత్నాకరమునకు తెలుగు వ్యాఖ్యానము రచించినట్లు తెలియవచ్చిన సింగనభట్టు కావచ్చును.

సంగీత దర్పణమును రచించిన చతుర దామోదరుడును ఆంధ్రరచయితగా తోచుచున్నాడు. అందు ప్రబంధాధ్యాయమున నితడు నృత్య విషయమును ప్రస్తావించుటయే కాక కడపటిదగు ఆరవయధ్యాయమున కేవలము నృత్త విషయమును వివరించినాడు. ఈ నృత్తాధ్యాయమున నాతడు దాక్షిణాత్య నృత్య ప్రబంధములను వివరించెను.

మీద పేర్కొనిన గ్రంథములకంటె ముఖ్యమయినది దేవన (దేవేంద్ర) కృతమగు సంగీత ముక్తావళి. ఇది మరియొక దాక్షిణాత్య నాట్యశాస్త్ర గ్రంథము; బహుశః ఆంధ్రకర్తృకమే కావచ్చును. నృత్తాభినయ విషయములు రెండింటిని బట్టిచూడ ఇది యమూల్యగ్రంథమని చెప్పదగియున్నది.

తరువాత దాక్షిణాత్య సంగీత, నాట్య కళలు తంజావూరు నాయకరాజుల, విశేషించి రెండవ మూడవ ప్రభువులైన రఘునాథ, విజయరాఘవ నాయకుల యుదార పోషణమున నాంధ్రులచే పునరుజ్జీవితములైనవి. కాలక్రమమున సంస్కృత సంగీత, నాట్య శాస్త్రములను గూర్చిన గొప్ప గ్రంథములకు మారుగా ఆయా కళలయందు పేరుగన్న సంప్రదాయ వేత్తలును, ప్రయోగ నిపుణులును నగు నాట్యాచార్యులు రచించిన సంగ్రహరచనములు, ఖండ రచనములు, ప్రకీర్ణకములునైన గ్రంథములు బయలుదేరినవి. ఆ కాలములోనివారు గొప్ప గ్రంథములు వ్రాయగల పాండిత్యాతిశయము గలవారు కారు. అయినను అటు తరువాతి కాలమున బయలుదేరిన వానిలో ముడుంబ నరసింహాచార్యులవారి భరతసర్వార్థ సంగ్రహము, సోమనార్యుని నాట్యచూడామణి, శుద్ధసత్త్వ వెంకటాచార్యులవారి అర్జునాది మతసారము అను మూడు గ్రంథములు పేర్కొన దగినవి. వ్రాతప్రతులలో తెలుగు వ్యాఖ్యానములేని ప్రామాణికామూల్య నృత్త, సంగీత గ్రంథము లేవియు కానరావు. వాస్తవమునకు నాట్య, సంగీత కళలపై తెలుగునకు మంచి ప్రాభవ ముండెను. నిన్న మొన్నటి వరకును కర్ణాటక సంగీతము పాడువానికి తెలుగుభాషాజ్ఞాన మావశ్యకమై యుండెను.

ఆంధ్రదేశము నందలి బ్రాహ్మణ పండితులు భాగవత ధర్మములో నొక యంగముగా భగవన్మహిమాప్రకాశకములగు కథలను గేయ సంకీర్తనములుగను, నృత్య రూపకములు గను రచియించి ప్రదర్శించు సంప్రదాయమును ప్రచారమునకు దెచ్చిరి. జయదేవుని గీతగోవింద రచన కాలమున నారంభమైన యీ సంప్రదాయమును కూచిపూడిలోని ఆంధ్రబ్రాహ్మణ భక్తబృంద మవలంబించి యభివృద్ధి కావించెను. తంజావూరి సమీపము నందలి గ్రామములలో ఉద్భవించి తరువాత ప్రాముఖ్యమునకు వచ్చిన తెలుగు భాగవత నాట్య రూపక సంప్రదాయము కూచిపూడి సంప్రదాయమునకు శాఖారూపమే. దక్షిణ దేశమందలి నాట్యకళయొక్క చరిత్రలో పై భాగవత రూపకములతో సమానముగ ప్రధానములైనవి, తెనుగువారు ఆ కళకు కానుకగా నిచ్చినవి క్షేత్రజ్ఞ (క్షేత్రయ) విరచితములై అభినయమున కుద్దిష్టములైన పదములు. పద మనగా రసమంజరి మొదలగు గ్రంథములలో పేర్కొనబడిన వివిధజాతి శృంగారనాయికా, నాయకులలో ఒకజాతి నాయికా, నాయకుల శృంగార రసావస్థావిశేషము నభివర్ణించు గేయము. అమరుశతకము మున్నగు సంస్కృత రచనముల యందలి శృంగార ముక్తకములు సైతము క్షేత్రజ్ఞ పదముల యుత్పత్తికి కారణములై యుండవచ్చును. రాగమాధుర్యము చేతను, తెలుగుశయ్యాసౌలభ్యముచేతను, రస భావ సంపదచేతను ప్రసిద్ధిగాంచిన క్షేత్రజ్ఞ పదములం దభినయ కల్పనకు మంచి అవకాశము కలిగినది. గీతగోవింద, మేఘదూతలవలె క్షేత్రజ్ఞపదములును పలువురు పదకవుల సరస రచనలకు కారణమైనవి. ఇవియు నభినేయములే.

వి. రా.
తెలుగు సంస్కృతి
తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము - 1959
తెలుగు భాషా సమితి

AndhraBharati AMdhra bhArati - lalitakaLalu - nATyakaLa DAkTaru vi. rAghavan.h - andhra telugu tenugu ( telugu andhra )