లలితకళలు సంగీతము  

శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

భారత దేశమందు సంగీతకళ పరమ ప్రాచీనమైన వానిలో నొకటి. పదమూడవ క్రీస్తు శతాబ్దము మొదటిలో నుండిన శార్ఙ్గదేవుడు ప్రాచీన సంగీత మత ప్రవర్తకులని పార్వతీ పరమేశ్వరు లాదిగా ముప్పది తొమ్మిది మందిని పేర్కొని 'అన్యేచ బహవః పూర్వే' అని చెప్పినాడు[1]. అతనికి తరువాతి సంగీత లాక్షణికులు లెక్క కందని వారు. ప్రాచీనులలో సదాశివుడు మొదలగు దివ్య వ్యక్తులు కొందరిని వదలినను అనేకు లితరులు గ్రంథ కర్తలుగానో, సంప్రదాయ ప్రవర్తకులుగానో ఉండిన వాస్తవ వ్యక్తులనుటకు సందేహింపబనిలేదు. కాని వారి రచనలు - లక్ష్య లక్షణములు - బహుళముగా కాల గర్భమున గలసి పోయినవి. ఉన్నవానిలో ప్రాచీనతమమని చెప్పదగినది భరతుని నాట్యశాస్త్రము. దీని కాలము క్రీ. పూ. రెండవ శతాబ్దికి మీరదని చెప్పుదురు. ప్రక్షేప విక్షేపములు, రూపాంతరములు, పాఠాంతరములు ఎన్నో దీనికి కలవు. కాని భరతముని క్రీ. పూ. ప్రథమ శతక మందలివాడైన కాళిదాసుని కాలమునకే నారద, తుంబురులవంటి దేవర్షిగా ప్రసిద్ధి కెక్కినాడు. కనుక ఇప్పటి నాట్యశాస్త్ర గ్రంథ మెప్పటిదైనా దాని మూలకారకుడైన భరతుడు అంత కెంతో పూర్వమం దుండినవా డనక తీరదు.

భరతాచార్యుడు చేసిన మహా ఘనకార్య మేమనగా శుద్ధస్వర సప్తకమం దొక్కొక్కటిని ప్రత్యేకముగా గ్రహము చేసి నడపినప్పుడు శాస్త్రీయముగా ఏర్పడు షాడ్జి, ఆర్షభి మొదలైన యేడు శుద్ధ జాతులకు తోడు, వీని పరస్పర సంకరముచే ఏర్పడి దేశమందు వ్యాప్తిలో నున్న మరి పదునొకండు వికృత జాతులను కూడ గ్రహించి మన్నించుట. భారతీయ సంగీత పద్ధతి ప్రపంచమున కనుగ్రహించిన మహా ప్రసాదమగు రాగ సంప్రదాయమునకు పైజాతులే మూల రూపములు[2]. ఆ వికృత జాతుల పేరులివి: 1.షడ్జోదీచ్యవతి, 2. షడ్జకైశికి, 3. షడ్జమధ్యమ, 4. రక్తగాంధారి, 5. గాంధారోదీచ్యవతి, 6. మధ్యమోదీచ్యవతి, 7. గాంధారపంచమి, 8. ఆంధ్రి, 9. నందయంతి, 10. కర్మారవి, 11. కైశికి. వీనిలో 1, 5, 6 సంఖ్యల జాతులు ఉదీచ్యము లను పేరుగలిగి ఉత్తర దేశీయములని చెప్పదగియున్నవి. తక్కిన వానిలో 'కర్మారవి' గూడ దేశ విశేష సంబంధమును తెల్పునట్లున్నది గాని యే దేశమో చెప్పలేము. మరి 'ఆంధ్రి' ఆంధ్రదేశము దనుట వివరింప బనిలేదు. తక్కిన వేదేశ భాగములవో తెలియదు.

భరతుని కాలమున దక్షిణాపథములో ఆంధ్రదేశము వారిచ్చిన ఒక రాగజాతి చాల ప్రబలముగా నున్నట్లు ఇందుచే మన మూహింపవచ్చును. కాని దాని స్వరూపము నేడు మనకు సుగ్రహము కాదు. తక్కిన పదునేడు జాతులవలె ఇదియును నిత్య నూతన విలాసములతో విహరించు భారతీయ రాగ నిర్ఝర ప్రవాహములో కలిసి మరుగుపడి పోయినది. గాంధారి - షాడ్జి జాతులు రెంటి సంకరముచే ఆంధ్రి యేర్పడినదని భరతుడు వచింపగా మతంగుడు ఆర్షభి - గాంధారి వీని కలయికచే జనించిన దన్నాడు. మతంగుని కాలమునకే, అనగా సుమారు పదవ శతకమునకే దాని స్వరూపము మారిన దన్నమాట. అతడు దీనికి ని-రి-గ-ప లు అంశస్వరములని, రి-గ లకు ని-ధ లకు సంగతి ముఖ్యమని, షడ్జమును వదలుటచే షాడవము - ఆరు స్వరములు గలది - గూడ అగునని చెప్పి, కొంత విరివిగా స్వర సంచార మిచ్చినాడు. కాని అంతమాత్రమున దాని స్వరూపము మనము తెలిసికొనలేము. 'ఆంధాళి' అను నొక రాగ మున్నది. అది 'ఆంధ్రి'కి ప్రాకృత రూపము కావచ్చును. దాని పునస్సంస్కారమైన రూపమే 'ఆందోళిక' కావచ్చును. నన్నిచోడుని కుమారసంభవమున 'ఆందోలి' కలదు. 12 - 13 శతాబ్దులకు చేరిన పార్శ్వనాథుడు దీనిని 'అంధాళి' అనియే పేర్కొని లక్షించెను. ఆ కాలమునకే ఇంచుమించు చేరిన పాల్కురికి సోముని పండితారాధ్య చరిత్రలో రాగాల పట్టికలో 'ఆందోళి' కలదు. రామామాత్యుడు 'ఆందోలి'ని 'అధమ' రాగములలో చేర్చి లక్షించెను[3]. నిషాద, గాంధారములు రెండును లేని ఔడవ రాగము - ఐదు స్వరములు గలది - ఇదని అతని లక్షణము. పోలూరి గోవిందకవి ఈ మాటనే అనుసరించెను. వెంకటమఖి మతమును ఇదే. త్యాగరాజు 'అభిమానము లే దేమి' అను కృతిని ఆంధాళిలో రచించెను[4]. ఇప్పటికి నా దృష్టి కిదే ప్రాచీనతర లక్ష్యము. ముత్తుస్వామి దీక్షితులది 'బృహన్నాయకి' అనునది దీని తరువాతిది. అది 'ఆరోహే చావరోహేచ ధ వర్జ్యా' అని 'ఆంధాళికా' అను పేరుతో త్రిస్థాయి సంచారిగా షాడవముగా లక్షింపబడినది. త్యాగయ్యగారి యింకొక కృతి 'రాగసుధారస పానము' అను దానిని ఆందోళక యనుపేర కొందరును, 'మయూరధ్వని' యను పెద్దపేర మరికొందరును నేడు పాడుచున్నారు. ఇరుతెగలవారి స్వరరచన ఒకటే. 'సరిమపని సనిధమరి' అని షాడవముగా గాంధార వర్జితముగా నున్నది.

భరతుడు నిర్దేశించిన తక్కిన పదునేడు జాతుల పరిణామ క్రమమును ఇంతమాత్ర మైనను తెలిసి కొన వీలులేదు. మతంగుడు మొదలగు తరువాతి లాక్షణికుల కాలమునకు ఆ జాతు లెన్నో క్రమిక పరిణామమును పొంది నామ రూపాలను మార్చుకొన్నవి. భరతుని యేకీకరణ మహోద్యమమును తరువాతివారు సర్వ విధముల కొనసాగించి ఆ జాతుల పరిణత రూప వైవిధ్యము నంతయు గ్రహించి, యేర్పరచి, గ్రామ రాగములు, ఉపరాగములు, శుద్ధరాగములు, భాషలు, విభాషలు, అంతర భాషలు, రాగాంగములు, ఉపాంగములు, భాషాంగములు, క్రియాంగములు - ఇట్లు పది తెగలుగా విభజించిరి. ఆ విభాగ శాస్త్రపు దృఢముష్టికిని సంగీతకళ అణగియుండ లేదు. లక్షణముల కంచెలను దాటి లక్ష్యములు పరువెత్తుచునే యుండెను, ఉన్నవి, ఉండగలవు. కాని, నియమమే లేని యే బ్రతుకును మనుష్యులు బ్రతుకలేరు. కనుక భూత వర్తమానములందలి మార్పులను, కూర్పులను సమరస బుద్ధితో ఏర్చి, చేర్చి, భావికి కొంత మార్గదర్శకముగా కట్టుబాటులను ఏర్పరుపవలసినది లోకకల్యాణ దృష్టిగల నియంతల భారము. సంగీత కళకు లాక్షణికు లందరును యథామతిగా శ్రద్ధతో ఆ పని చేసినవారే. మరి ఈ శాస్త్రము లక్ష్య ప్రధానము గనుక లక్ష్యమునకు విరుద్ధముగా లక్షణ మున్నచో లక్షణమునే దిద్దుకొనవలసినదని శాసించువరకును వారి విశాల హృదయము వెలసినది[5]. వారు చేయని ప్రధాన కార్యము సంగీతమునందలి నాదలయ భాషకు తగిన లిపిని కల్పించుటయే. ఆ లోపముచే లక్షణములు సుగ్రహము కాక మసకు మసకుగా నిలిచినవి. ఇక లక్ష్యము లన్నచో తొంబది పాళ్ళు నశించినవి. వాని కాధారముగా నున్న వాగర్థముల పుణ్యాన ఆ పదిపాళ్ళు గూడ శుష్కముగానే యైనను నిలిచియున్నవి. మనలో లక్షణ వాఙ్మయము లక్ష్య వాఙ్మయమున కన్న ఎంతో పెద్ద రాశిగా నిలిచి యుండుట కిదే హేతువు.

ఇట్లు భరత ఖండమునం దెల్ల భరతముని మూల సిద్ధాంతములనే ఆశ్రయించి యేక సంప్రదాయమును స్థాపించు ప్రయత్నమును అఖండముగా ఆసేతు హిమాచలముగా పండితులు చేసినను ఇక్కడ సంగీత కళ రెండుగా చీలి కర్ణాటకము, హిందూస్తాని అను పేళ్లతో నిలిచినది. ముస్లిములు మన దేశమును కొల్లగొనవచ్చి రాజ్యమును స్థాపించుకొన్నది మొదలు ఉత్తరాపథమున - సుమారు 12-13 శతాబ్దములయందు - ఆ సుల్తానులు ఈ దేశపు సంగీతకళా మాధుర్యమునకు పరవశులగుటయే కాక పార్సీ, అరబ్బు దేశములందలి జాతీయ రుచులను, పద్ధతులను ఇక్కడ ప్రవేశపెట్టి, పోషించి వ్యాప్తికి దెచ్చిరి. అలా ఉద్దీనుని ఆస్థానమందు కవి, గాయకుడు, యోధ, మంత్రియు నై యుండిన అమీరు ఖుస్రూ అను మహామహుడు ఈ పద్ధతికి మూలపురుషుడని ఔత్తరాహుల నమ్మిక. అతని కాలము 1296 - 1315 క్రీస్తు శకాబ్దములు.

తక్కిన అన్ని విషయముల వలెనే సంగీతకళను గూర్చి కూడ హిందువుల దృష్టి ప్రాయికముగా ఆధ్యాత్మిక మైనది. అందలి మరుగులను తోడి తోడి ఉత్తరోత్తరముగా పరతత్త్వ లీలావిలాస శక్తులను హార్దముగా తెలిసికొని యనుభవించుట మన పరాయణము. మన పాలికిది 'ధర్మార్థ కామమోక్షాణాం ఇదమే వైకసాధనం'[6] అనిపించినది. కనుకనే స్వరములు, రాగములు, తాళములు మొదలగువానిని గూడ దేవతా బీజాక్షరమంత్ర పూర్వకముగా అప్రాకృతముగా ఉపాసించుట మన పద్ధతి. బహిరింద్రియ తృప్తికి భారతీయులు పరాఙ్ముఖులు కారు. కాని అంతటితోనే తృప్తిపడువారు గారు. ఈ దృష్టి చాలనివారు గనుక మహమ్మదీయ రాజులును, రాజ్యాధికారులును ప్రాకృత దృష్టితోనే సంగీతకళను గొలిచిరి.శ్రోత్రరంజనము వారికి చాలును. 'శ్రోతృచిత్తరంజనము' కావలెనని ప్రాచీన భారతీయు లన్నారు. శుద్ధమైన శ్రుతి లయముగల నాదము శ్రోత్రము నాకర్షించును. అందలి సూక్ష్మతర సూక్ష్మతమ భేదములు, వాని పరస్పర సంవాదములును శ్రోత్రమూలముగానే చిత్తము నాకర్షించును. మొదటిది ఆపాత మధురము, రెండవది ఆలోచనామృతము. 'సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయమ్‌ - ఏక మాపాత మధురం అన్య దాలోచనామృతమ్‌' అన్న సంస్కృత సూక్తి సాహిత్యాభిమాన మెక్కువగాను సంగీతానుభవము తక్కువగాను గల వారెవరో అన్న మాట. మహమ్మదీయుల శ్రోత్రరక్తి పిపాస ఉత్తరదేశమందు శుద్ధనాద ప్రధానమైన సంప్రదాయమును వ్యాపింపజేసినది. దక్షిణదేశమున సూక్ష్మనాదలయముల వ్యాప్తి గమకముల మూలముగా వేరు రూపములను కళకిచ్చినది. నాదశుద్ధికంటె దాని సూక్ష్మత, దాని వలన స్ఫురించు భావ సూక్ష్మత, వీనికితోడుగా కాలలయమందలి గంభీర సుకుమార భేదములును కర్ణాటక సంగీతమును రూపుగొల్పినవి. దీనికంటె దానికి మనదేశమునందు వ్యాప్తి యెక్కువగా నుండుటకు కారణము గూడ దాని శ్రోత్ర రంజన శక్తియే కాని చిత్తరంజన శక్తి అంతగా కా దనుట సూక్ష్మేక్షికతో గమనింపవచ్చును.

భరత సంప్రదాయమున శ్రుతి - లయములు రెండును మాతాపితల వలె సమాన గౌరవము గలవి కావున మొన్న మొన్నటిదాక లాక్షణికులెవ్వరును ఈ కర్ణాటక - హిందూస్తానుల భేదమును గమనింపలేదు[7]. పదుమూడవ శతకాదిలో అమీరు ఖుస్రూ చేసిన యీ ప్రయత్నము ఒక నూరేండ్లలో రెంటికిని భిన్న స్వరూపమును స్పష్టముగా ఇయ్యగలుగుట అసాధ్య మేమియు కాదు. కాని తరువాతి లాక్షణికు లెవ్వరు గాని ఆ రెండు పేళ్ళను పేర్కొనకపోవుట మాత్రము మనము గమనింపదగిన వింత. మరి దాక్షిణాత్య పద్ధతికి కర్ణాటక మను పేరు కర్ణాటసామ్రాజ్యము మూలముననే వచ్చిన దనవలెను. క్రీ. శ. 15-16 శతకములందే ఆ సామ్రాజ్యము నెలకొన్నది కనుక 14వ శతకాది భాగమందే ఆ పేరు ఏర్పడుట దురూహమైన విషయము[8]. అభిమాన భేదము, అభిరుచి భేదమును శాస్త్రదృష్టికి అకించిత్కరములు. గౌడ, కర్ణాట, బంగాళ, మరాట, గుర్జర ప్రముఖ నానాదేశములందలి వరుసల నన్నిటిని సంగ్రహించి ఎరుకలు, గొల్లలు, చెంచులు మొదలగు ఆటవికుల పద్ధతులను గూడ వదలక కలుపుకొన్న ప్రాచీన లాక్షణికులకు ఈ రెండు పద్ధతులను విభిన్నములుగా భావించు మనఃప్రవృత్తి యుండదు. ఎన్నో రాగముల, గీతముల పద్ధతులను దాక్షిణాత్యులు ఉత్తరదేశమునుండి స్వీకరించినారు. హెజజ్జి, సహానా, అఠాణా, తిల్లానా మొదలగువాని పేళ్లు గూడ మార్చలేదు. కాని అక్కడి సామాన్య స్వరూపములను గ్రహించి తమ గంభీర మార్గమున వానిని సంస్కరించి తమవి చేసికొన్నారు. క్రీ. శ. 17 వ శతకమున కల్యాణి, పంతువరాళి మొదలగు రాగములు గీత - ప్రబంధ - ఠాయములకు యోగ్యములు కానివని వెంకటమఖి అన్నాడు. కాని తరువాతి గాయకుల ప్రతిభా బలముచే అవి యెట్లు సంస్కరింపబడి యెంతటి గౌరవము నందుకొన గల్గినవో నేడు మన మెరుగుదుము. రాగములలో ఉత్తమ మధ్యమాధమములను విభాగములుకూడ ప్రాచీనము కాదు. మరి ఆ విభాగమునకుకూడ కారణము వాని స్వరముల సంవాద వివాదాది ధర్మములే కాని జాతి దేశాది భేదముల వలన నేర్పడిన అసూయ కాదని దృఢముగా చెప్పవచ్చును. స్వచ్ఛంద ప్రవృత్తిగల నేటి సినిమా దాటులను గూర్చి విమర్శకులైన సంగీత రసికులకు గల అతృప్తియు నట్టిదే. వాని అందచందములు వట్టి యైంద్రియికములు, తాత్కాలికములు; ఎందును లోతుకు దిగనివి.

నిజము చూడబోయినచో పూర్వకాలమున సంగీత కళను గూర్చి శాస్త్రీయ వ్యాసంగము మన దేశమున తమిళులు కొంత శ్రద్ధతో జరిపినా రనవలయును. అసలు సప్తస్వరములు మొదలగు వానికే వారు సొంతమగు పేళ్లు పెట్టుకొన్నారు[9]. కాని రాగవ్యక్తి ప్రధానమైన పద్ధతినే వారుగూడ పరిశీలించి పెంపొందింప ప్రయత్నించుటచేత, స్వరముల సంవాద వివాదానువాద ధర్మములు ఈశ్వర సంకల్ప సిద్ధములై అందరకును సమానమే యగుటచేత సర్వంకషమైన భరత సంప్రదాయ సాగరములో ఆ ద్రావిడ పద్ధతియు కలిసిపోయినది. ఇప్పటికి తమిళజాతిలో మిగిలినది ఆ ప్రాచీనుల గానకళా శ్రద్ధ, అభిరుచి మాత్రమే.

సంగీత కళకు లక్ష్య లక్షణముల నిర్మించి వ్యాప్తికి దెచ్చుటయందు ఆంధ్రుల పాలు గొప్పది. 11వ శతాబ్దికి వెనుక తొల్లిటి ఆంధ్రుల చరిత్రమును సూచించునట్టి అమరావతి, నాగార్జునునికొండ, గోలి మొదలగు స్థలములందలి స్తూప, విగ్రహ శిల్పములలో వివిధ వీణలు, వేణువు, మృదంగము మొదలగు వాద్యములు గలవు. ఇవి క్రీ. పూ. రెండవ శతకము మొదలు క్రీ. త. మూడవ శతాబ్ది మధ్యముదాక నుండు కాలమునకు చేరినవని పరిశోధకుల యభిప్రాయము. హాల మహారాజు సంగ్రహించిన 'సప్తశతి' లోని యీ ప్రాకృతగాథ ఆంధ్రసామ్రాజ్యమందు గాన నాదములకున్న యసాధారణ గౌరవమును వెల్లడించును.

"గాహాణయ గేయాణయ
తంతీ సద్దాణ పోఢ మహిళాణ
తాణం సొచ్చియ దండో
జే తాణ రసం సయాణంతి"
... ... ...

("గాథలందు గేయ గతులందు వీణెల
పలుకులందుఁ బ్రోడ మెలఁతలందుఁ
గలుగు మేలి రసము గనుఁ గొనలేనివా
రవని నున్న వారి కదియె శిక్ష"[10] - నా తెనిగింపు).

క్రీ. శ. 11 వ శతకమునుండి తెలుగు సారస్వతమునందు ఆంధ్రుల సంగీత రసికతకు సాక్ష్యమెంతో కలదు. కాని కవిత్రయములో నన్నయ, తిక్కన లిద్దరును ఎక్కువగా సంగీతమం దేమియు అభిరుచిని చూపలేదు. రాజరాజ నరేంద్రుని యాస్థాన సభలో తార్కిక, వైయాకరణాది పండితులు ఎంతెంతో పెద్దవారు నన్నయకంట బడిరి కాని సంగీతజ్ఞులు పడలేదు (ఆది. 1,8) ఇందలి 'వైణిక గాయకులు నాదిగా' అను వావిళ్లవారిది అధిక పాఠము. నే జూచిన వ్రాతప్రతులలో ఇతర ముద్రణములలో లేదు. ఆ యున్న 'వైణిక గాయకులు' గూడ తక్కిన పండితులవలెకాక నిర్విశేషణముగా సభలో నొక మూల నొదిగినారు. నన్నయ రాజరాజును ఒకటేతూరి 'కావ్యగీతప్రియ' అని సంబోధించినాడు. 'కావ్యగీత' అనునది ద్వంద్వమో, షష్ఠీ తత్పురుషమో తెలియదు. ద్రౌపది పెండ్లి కోలాహలమందు, యాదవుల రైవతకోత్సవమందును వాద్యగానగోష్ఠి స్పర్శ కలదు. ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మ సభలలో కూడ సంగీత గంధము ఎక్కడను గొట్టదు. అప్సరసలు గంధర్వులును ఒకచోట గలరుగాని వారెవ్వరును నోరెత్తరు. మరి వ్యాసమహర్షి ఆ సభలన్నిటిలోను ఆటపాటలకు తప్పక చోటు కల్పించినను నన్నయ అక్కరలేదన్నాడు.

తిక్కన ఉత్తర రామాయణమున గాని, భారత సంహిత యందు గాని సంగీతవిషయమున సవతితల్లిప్రేమనే చూపినాడు. అర్జునుడు ఉత్తరకు 'నృత్య గీత వాద్య నైపుణ్యము' నేర్పినాడు గాని దానిని తిక్కన యెక్కడను వర్ణింప లేదు. ఇష్ట దేవతయగు హరిహరనాథుని ఎంతో విపులముగా, పునరుక్తముగా గూడ పొగడిన తిక్కన ఒక 'గానలోల' అను నంతటి విశేషణమైనను ఆ మూర్తికి వేయలేదు. ఎప్పుడును 'కావ్యరసమునే కొనియాడుచు' నున్న యతనికి ఇతర కళల రసానుభవమున కవకాశము కలుగలేదేమో!

ఎర్రాప్రెగ్గడ సంగీతరసికుడు; కనుకనే నన్నయ పేరిటనే రచించిన అరణ్యపర్వశేషమున ఆయన చిత్తవృత్తినే యనుకరించినను స్వతంత్రమైన రచనలో ఆ కళయందు తనకుగల గొప్పరసికతనే కాదు, విజ్ఞానమునుకూడ విస్తరముగా చూపుకొనెను. దీనికితోడు ఎర్రన్న కాశ్రయమిచ్చిన ప్రభువు ప్రోలయ వేమారెడ్డి 'నృత్తగీతకళాసల్లీలోపేతోత్సవుడు.'

ఇట్లె నన్నిచోడుడు, పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, శ్రీనాథుడు మొదలగు సీమాపురుషుల రచనల యందు సంగీత రసికత ఆ కాలమం దెంత మహనీయముగా నుండినదో తెలియనగును. కాకతీయులు, రెడ్డిరాజులు, పద్మనాయక ప్రభువులు మొదలగు దొరలును, వారి యనుయాయులైన ఇతర రాజులును, అధికారులును ఈ కళయం దెంతో గౌరవాభినివేశములను చూపిరి. మరి విజయనగర సామ్రాజ్య కాలమందు ప్రజలు సంగీతానందమున మునిగి తేలినవా రనవలయును. కృష్ణదేవరాయల నాటి అష్ట దిగ్గజముల రచనలలో నెల్ల ఇది స్పష్టముగా నున్నది. తరువాతి తంజావూరు, పుదుక్కోట, మధుర మొదలగు సామంత - స్వతంత్ర - రాజుల కాలమందు ఈ కళ యక్షగానము, శృంగారపదము, కీర్తన, జావళి మొదలగు పలు త్రోవలలో ప్రజల జీవితమును చూర గొన్నది. రామరాజభూషణుడు 'సంగీత కళా రహస్య నిధి'గా నున్నవాడు. అతని రచనలలో గానవచ్చు నయగారపు శిల్పమునకు అతని సంగీత కళానుభవమే మూలమని నమ్మవచ్చును. ఇదిగాక 'ఈతడు రచించిన కృతులు కొన్ని యక్కడక్కడ నేటివరకును పాడబడుచున్నవి' అని శ్రీ కందుకూరి వీరేశలింగముగా రన్నారు. కాని వానిని ఆయన సంగ్రహించి పెట్టిన పుణ్యాన బోలేదు. ఒకవేళ ప్రయత్నించి యుండినను వట్టి సాహిత్యమును మాత్రమే ఆయన సంగ్రహింపగలిగి యుండును. చతుర్విధ కవితలలో మధురకవితను చేర్చి గౌరవించిరి కాని ప్రాచీనులు దాని మాధుర్యమునకు హేతువయిన గానశరీరమును సంరక్షించి పెట్టుకొను ప్రయత్నము చేసినట్లు తోపదు. పాల్కురికి సోమన పేర్కొన్న వివిధ గేయములు ఇట్లే నశించినవి. ఇట్టి వెన్నో. కాకతీయుల కాలపు కృష్ణమాచార్యుని సింహగిరి వచనాలు, వానివంటివగు శంకర వచనములు, శఠకోప విన్నపములు మొదలగు గేయములును, పద కవితా పితామహుడగు మహామహుడు తాళ్ళపాక అన్నమయ్య గారి, అతని పుత్ర పౌత్రుల కొన్నివేల పదములును ఇట్లు గాన శరీరమును పోగొట్టుకొని మనకు మిగిలిన కొన్ని శబ్దపంజరములు. అన్నమయ్యగారి మనుమడు, ప్రఖ్యాత ద్విపదకవి చిన్నన్న - చినతిరువెంగళనాథుడు - రచించిన కృతులలో రెండుమాత్రము సుబ్బరామ దీక్షితులదయచే, సాంప్రదాయికమైన స్వర శరీరముతో మనకు లభించినవి. ఇట్లే వీరవెంకటపతిరాయని కంకితమైన 'గీతప్రబంధ' మొకటి మాత్రము సస్వరముగా పుస్తకములో నిలిచి యున్నది. పై దీక్షితులే రచించి మన కిచ్చినవి ఘనం సీనయామాత్యుని రచనలవంటి వొకటి రెండును లభించుచున్నవి. దక్షిణదేశమం దంతటను వ్యాపించిన క్షేత్రయ్య పదముల, తీర్థనారాయణస్వామి తరంగముల నేటి స్వర రాగమూర్తి కూడ అంతగా ప్రామాణికమైన మూల రచన యని నికరముగా చెప్పలేని వివిధ స్థితిలో నున్నది.

తెలుగుదేశ మందలి రసికులలో పండితులలో అగ్రగణ్యుడైన జగన్నాథ పండితరాయలు గొప్ప కవిమాత్రమే కాక గొప్ప గాయకుడై, బయకారుడై యుండెనన్నమాట ఎందరికో ఆశ్చర్యము గల్గింపవచ్చును. ఢిల్లీ సుల్తాను షహజహాను ఆస్థానమందలివా రతని గానమాధురిని చవిగొన్న పుణ్యాత్ములు. తానసేనునికి తరువాత అతని రచనలే గొప్పవట. అతడు కర్ణాటక సంప్రదాయమున పాడగా విన్న అక్కడివారు భాష యర్థము తెలియకున్నను అతని గాత్ర - రాగముల రక్తిని గ్రహించిరట. అతని రచనలలో ఒకటైనను మనకు నేటికి మిగులలేదు. క్రీ. శ. 18వ శతకమందలి శ్రీ త్యాగరాజస్వామి మొదలగువారివి, వారి తరువాతివారివియు నగు రచనలే చాలవరకు అసలు చెడకుండ మనలో నిలువగలిగినవి. అందుకు స్వర లయ లిపి యేర్పడుట ముఖ్యహేతువని చెప్పవచ్చును.

మరి లక్షణపథమందు ఆంధ్రుల కైవాడము ఇతరుల కెందుకు తీసిపోనిది. కొంత పైచేయిగానే యున్నదన్నను చెల్లును. పదమూడవ క్రీస్తు శతకమునకు ముందున్న లాక్షణికులలో ఎవ రాంధ్రులో, ఎవరు కారో నిర్ణయించు సాధనములు లేవు. ఇప్పటికి తెలిసిన తెలుగు లాక్షణికులలో కాకతీయ గణపతిదేవుని మరదియు, గజసాధనికుడును అగు జాయపసేనాని ప్రాచీనుడు (క్రీ. శ. 1250); గీత రత్నావళి, నృత్త రత్నావళి అను రెండు గ్రంథములు రచించెను. గీత రత్నావళి ఇంకను మనకు లభింపలేదు గాని నృత్త రత్నావళి లోనే అందలి పద్యము లుదాహరింప బడుటచే దాని పేరు మన మెరుగుదుము. నృత్త రత్నావళియందితడు చూపిన పాండిత్యమును గమనించినపుడు ఇతని గీత రత్నావళి లభింపకపోవుట సంగీతకళ కెంత నష్టమో ఊహింపవచ్చును[11]. నృత్త రత్నావళిని ప్రమాణ గ్రంథముగా క్రీ. శ. 15వ శతాబ్ది మధ్యమువాడు కుంభకర్ణ మహారాజు తన 'సంగీతరాజ'మున ఉల్లేఖించినాడు.

ఈ కాలపు పాల్కురికి సోముని బసవ పురాణమునను, పండితారాధ్య చరిత్రమునను సంగీతమునకు సంబంధించిన వివిధ విషయములు గలవు. కాని అవన్నియు లక్షణము, లక్ష్యము రెండును లేని వట్టి పట్టీలు. అప్పటి శైవసంప్రదాయమందు సంగీతకళ కుండిన విశిష్టవ్యాప్తిని అవి సూచించు నంతే.

క్రీ. శ. 14వ శతక మధ్యమందలి శ్రీ విద్యారణ్యస్వామి 'సంగీత సారము'ను రచించినాడని, దాని ననుసరించియే తాను రాగ లక్షణములను వివరించుచున్నాడనని గోవింద దీక్షితులు - క్రీ.శ. 17వ శతకమువాడు - వచించినాడు. ఆ గ్రంథము దుర్లభము [12].

విద్యారణ్యస్వామి ఆంధ్రుడే యని స్పష్టముగా చెప్పలేము. కాని ఆంధ్ర కర్ణాటకుల కూడలియై ఆంధ్ర సాహిత్యమును పలువిధములుగా మొదటినుండి పోషించిన విజయనగర సామ్రాజ్యమును ప్రతిష్ఠ చేసిన ఆమహనీయునిని ఆంధ్రులు తమవానినిగా గౌరవించుట సహజము, ఆవశ్యకమును. ఇప్పటి వాడుకలో నిలిచిన మేళ - రాగ పద్ధతిని ఈయనకంటె ముందు పేర్కొన్న వారు కానరారు. ఆయన మతము ప్రకారము 15 మేళములను, అందు జన్యములైన 50 రాగములను సంగీతసుధ తెల్పుచున్నది.

రాచకొండ సర్వజ్ఞ సింగమనాయని సంగీత రత్నాకర వ్యాఖ్య - సంగీత సుధాకరము ఈ శతాబ్దములోని గొప్ప ఆంధ్ర రచనలలో నొకటి. మరి ఇప్పటి కదే రత్నాకరమునకు ప్రాచీన వ్యాఖ్య. క్రీ. శ. 13వ శతాబ్ది మొదటి భాగమందు దేవగిరి సింఘణ భూపాలుని యాస్థానమందు కరణికము వహించిన కాశ్మీర బ్రాహ్మణ పండితుడు శార్ఙ్గదేవుడు రచించిన సంగీత రత్నాకరము అప్పటి ప్రాచీనాధునిక సంగీత పద్ధతుల వివరణమున సీమాగ్రంథముగా ఏర్పడినది. సింగమనాయనికి తరువాత పదునైదవ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్యమున ఇమ్మడి దేవరాయని యాస్థాన పండితుడు చతుర కల్లినాథుడు 'కలానిధి' యను పేర ఇం కొకవ్యాఖ్య రచించెను.ఇంకను రెండు మూడు టీకలు గలవట. ఇంతైనను నిత్య పరిణామినియైన సంగీతకళకు రత్నాకరము ఎక్కువ పనికిరాక పోయినది. కనుకనే విద్యారణ్యాదులు వేరు మార్గమును పట్టినట్లున్నది. రత్నాకర మందలి లక్షణములు లక్ష్యమునకు విరుద్ధములని, అందు చూపిన ప్రయోగములు అబోధకములై అత్యల్పతరములుగా నున్న వని, పేరుకొన్న రాగాల స్వరూపమును వివరింపలే దని, కనుకనే గాయకులును, వైణికులును ఆ గ్రంథమును వదిలిపెట్టి రని సంగీత సుధాకరకర్త నిర్దాక్షిణ్యముగా నన్నాడు. కాని అతడు ఆ విషయములను తానేమో 'నిపుణ'ముగా ఒకతూరి విన్న మాత్రాన పదావలీ జ్ఞానము కల జనుల కందరికిని సంగీత రహస్య బోధము గల్గునట్లు వివరించినానని చెప్పుకొన్నాడు గాని అదంతయు వట్టి వాగాడంబరము మాత్రమే. ఎట్లును సింగభూపతి వ్యాఖ్య కల్లినాథుని వ్యాఖ్యకంటె కొంత సంగ్రహముగా నున్నను, నేడు సంగీత రత్నాకరము నర్థముచేసికొనుట కెంతో సహాయముగా నున్నది.[13]

క్రీ. శ. 14-15 శతకముల సంధికాలములో కొండవీటి కుమారగిరి రెడ్డి 'వసంతరాజీయ'మను నాట్య లక్షణ గ్రంథమును రచించినాడు. ఇదికూడ మల్లినాథ, కుమారస్వామి ప్రభృతులగు కావ్య నాటక వ్యాఖ్యాతలు ప్రమాణ గ్రంథముగా ఉదాహరించుట మూలమున మనకు తెలియును గాని అసలు గ్రంథము లభింపలేదు. నాట్యమునకు సంగీత మొక ప్రధానాంగము కనుక ప్రస్తావవశమున నైనను వసంతరాజీయమందు దాని వివరణ ముండి యుండునని యూహింపవచ్చును.

కొమరగిరిభూపాలుని తర్వాత కొండవీ డేలిన పెదకోమటివేమభూపతి - శ్రీనాథ, వామనభట్టుల కాశ్రయ దాత - 'సంగీతచింతామణి'కి కర్త. అసంపూర్ణములైన దీని రెండు వ్రాతప్రతులు తిరువాన్కూరు పుస్తకభండారమున గలవు.

ఈ క్రీ. శ. 15వ శతక మధ్యమందే విజయనగరపు ఇమ్మడి దేవరాయల సామంతుడైన సాళువ గోపేంద్ర తిప్పభూపాలుడు 'తాళదీపిక'ను రచించినాడు. తాళమునకే ప్రత్యేకముగా రచించిన గ్రంథములలో ఇదే మొదటిదేమో! ఇదిగాక తిప్పభూపతి శివస్తుతి పరముగా వేరు వేరు తాళములకు లక్ష్యములుగా కొన్ని 'ప్రబంధము' లనుగూడ రచించినాడని తోచుచున్నది. ఈ వంశము వాడేయైన నరసింగరాయలే తాళ్ళపాక అన్నమాచార్యుల కాశ్రయ మిచ్చి గౌరవించి ఆయన 32వేల సంకీర్తనములు శ్రీవేంకటేశ్వరాంకితముగా రచించునట్లు చేసినది. సంకీర్తన లక్షణము అను చిన్న లక్షణ గ్రంథమును గూడ అన్నమయ్య సంస్కృతమున రచించెను. కాని అది దుర్లభము. దానిని అతని మనుమడు చిన్నతిరుమలయ్య తెలిగించినాడు.

క్రీ. శ. 16వ శతకమున విజయనగర శ్రీకృష్ణదేవరాయల యాస్థాన కరణికుడు బండారు లక్ష్మీనారాయణకవి రాయల యంతఃపురమువారికి నాట్య సంగీతాచార్యుడై యుండి 'సంగీత సూర్యోదయము' రచించినాడు. ఇది యింకను అముద్రితముగా మద్రాసు సర్కారు తాళపత్ర గ్రంథాలయమం దున్నది. ఇతనికి భానుకవి తెలిగించిన 'పంచతంత్రి' అంకిత మీయబడినది.

క్రీ. శ. 1550 వ సంవత్సరమున అళియ రామరాయల యాశ్రితుడును, కొండవీటి దుర్గాధీశుడును అగు రామామాత్యుడు 'స్వరమేల కలానిధి'ని రచించెను. [14] ఇందు ప్రాచీన గ్రంథములకంటె స్పష్టముగా, సంగీతమున ప్రధాన వస్తువులైన స్వరముల, మేళముల స్వరూపము మాత్రము వివరింపబడినది. విద్యారణ్యుల 15 మేళములకు మరియైదు చేర్చి 20 మేళములు వివరించి యందలి జన్యరాగములుగా 73 రాగములను పేర్కొని, అందు 43 రాగములకు లక్షణము చెప్పినాడు. ఇతడు తన మాతామహుడు కల్లపదేశికుడు విద్యానిధి యని, గంధర్వశాస్త్రమందు దత్తిలునివంటి గొప్పవా డనియు చెప్పుకొన్నాడు. సంగీత రత్నాకరమునకు 'కలానిధి' యను వ్యాఖ్య రచించిన గొప్ప మనీషి కల్లినాథు డతడు కావచ్చును. ఇరువురును రాయబయకార, తోడరమల్ల, అభినవ భరతాచార్య బిరుదాంకితులే; విజయనగరమందలివారే; క్రీ. శ. 1465లో ఇమ్మడి దేవరాయల కాలమున నున్నవాడు క్రీ. శ. 1550 లో నున్నవానికి మాతామహుడు కాగలడా యని సందేహింప వచ్చును. కాని అతని వయస్సు అప్పు డెంతో ఇతని వయ స్సిప్పు డెంతో తెలియనిది యీ సందేహము నివృత్తి కాదు. ఐనను అసంభవ మని మాత్రము చెప్పలేము. సంభావ్యమే యైనప్పుడు కల్లినాథుడును ఆంధ్రసంగీత లాక్షణికుల పంక్తి కలంకారభూతుడు కాగల డనుకో వచ్చును. అది యెట్లయినను రామామాత్యుని స్వరమేల కలానిధి కర్ణాటక సంగీత పరిణామములో ఒక ముఖ్య ఘట్టమును తెల్పుచున్నది. లక్షణమనుపేర వట్టి ప్రాచీన వాక్యములను అనువాదముచేయుట నిష్ఫలమని రామమంత్రి యెదురు తిరిగినాడు. సంగీతము గాంధర్వము గానము అని రెండు తెగలని, అనాది సంప్రదాయముగా గంధర్వులు పాడునది గాంధర్వమని, అందు లక్షణమే ముఖ్యమని, గానము అట్టిదికాక దేశి రాగ సంప్రదాయము ననుసరించి బయ కారులు జనరంజకముగా రచించినది గనుక దానియందు లక్ష్యమే ప్రధానమని, లక్ష్యవిరుద్ధమైన శాస్త్రమును మార్చుకోవలెనని రామమంత్రి ధైర్యముతో పలికినాడు. కనుకనే ఒక స్థాయిలో శుద్ధ స్వరములు ఏడును, వికృత స్వరములు పండ్రెండును గలిసి 19 స్వరములు శార్ఙ్గదేవుడు నిర్ణయింపగా, వికృత స్వరములలో ఐదింటికి ప్రత్యేక స్వరూపము లేదని స్పష్టపరచి మొత్తము పదునాలుగే స్వరాలని రామమంత్రి నిర్ణయించినాడు. అందును రెండు వికృత స్వరములను వదిలి మొత్తము పండ్రెండు మాత్రమే ప్రకృతి స్వరములను గోవింద దీక్షితుడు, వెంకటమఖి మొదలగు తరువాతివారు గ్రహించి ఆ ప్రకారమే వీణలో మెట్ల నమర్చిరి. ఆ పద్ధతియే నేటికిని అనువర్తించి వచ్చుచున్నది. ఆ రెండు స్వరములను వదలుటగూడ రామామాత్యునకు సమ్మతము కాకపోలేదు.

వీణ మెట్లమీది తంతులను మేళగించు విషయమున రామమంత్రి కాలమున రెండు పద్ధతు లుండెడివి - శుద్ధమేళము, మధ్యమేళము అని. వీణను మూపున కానించుకొని నిలువున వాయించునప్పుడు ఎడమచేతిప్రక్క మొదటి తీగ అనుమంద్ర షడ్జముగా, రెండవది అనుమంద్ర పంచమముగా, మూడవది మంద్రషడ్జముగా, నాల్గవది మంద్రమధ్యమముగా శ్రుతిచేయుట శుద్ధమేళము. మొదటిది అనుమంద్ర పంచమము, రెండవది మంద్రషడ్జము, మూడవది మంద్రపంచమము, నాల్గవది మధ్యషడ్జముగా అమర్చుట మధ్యమేళము. శుద్ధ మేళమునకంటె మధ్య మేళమందు సంగీతమున రక్తి నెక్కువగా నిచ్చు మధ్య తార స్థాయి స్వరములకు స్ఫూర్తి యెక్కువ. వాయించు వేళ్లకు సౌకర్యమును అధికమే. కనుకనే యిప్పటికి మధ్యమేళమే స్థిరముగా వైణికులలో నిలిచినది. రామామాత్యుడు, 1. అను మంద్ర-స, 2. అను(మంద్ర)-ప, 3. మంద్ర-స, 4. మంద్ర-ప - ఇట్లు ఇంకొక మేళమును కల్పించి, దానికి అచ్యుతరాయ మేళమని పేరు పెట్టెను.[15] ఇందును అనుమంద్ర, మంద్ర, స్థాయుల కున్నంత ప్రాధాన్యము మధ్య, తారములకు లేకపోవుటచే వాడుకలో ఇదియు నెలకొనలేదు. అచ్యుత దేవరాయల రాజ్యకాలమందే యితడు విజయనగరాస్థాన మందలి సంగీత విద్వాంసులలో నొక్కడుగా నుండిన వాడని మన మిందుచే నెరుగగలము.

ఇతడు నిర్వచించిన రాగ లక్షణములను తరువాతి గోవింద దీక్షితుడు, అతని కుమారుడు వెంకటేశ్వర దీక్షితుడును తీవ్రముగా ఖండించిరి. తండ్రి 'సంగీత సుధ' లో 'కొందరు నవీను'లని పేరు చెప్పక యితని మతమును ఖండింపగా కొడుకు స్పష్టముగా రామామాత్యుని పేర్కొని 'చతుర్దండి ప్రకాశిక'లో నిస్సంకోచముగా, అవివేకముగా దూషించెను. వ్యక్తిగతముగానో, రాజకీయ కారణాల వల్లనో వారికి అతనిమీద కలిగిన ఆక్రోశము ఈ విమర్శకు హేతు వనుకొనవలసి యున్నది. సంగీతకళ నిత్యపరిణామిని అను తత్వమును గమనింపకున్నచో నేడు మనము ఆ తండ్రి, కొడుకులను అంతే తీవ్రముగా ఖండించి విమర్శింప వచ్చును. తత్వదృష్టికన్న స్వపాండిత్య స్ఫోరణమందే వారికిగల యభినివేశము ఆ రెండు గ్రంథములందును స్పష్టముగా నున్నది.

'షడ్భాషాచంద్రిక' మొదలగు అనేక గ్రంథములు రచించిన మహామనీషి చెరుకూరి లక్ష్మీధరుడు 'భరతశాస్త్ర గ్రంథము'ను రచించినట్లు గీతగోవిందమునకు అతడు రచించిన శ్రుతిరంజనియను టీక[16] యందలి యుదాహరణముల వలన తెలియగలము. నాట్యము, సంగీతము దీని ప్రమేయము.

ఇదే సమయమందే రామరాజ భూషణుడు ఆ వరకును ఆ యా రాగములకు తగినట్లుగా వెనుక ముందులకు సర్దుకొనవలసి యుండిన వీణ యెదమీది చలసారికలను అచలసారికలుగా మైన మతికించు పద్ధతిని కనిపెట్టి ఆచరణ లోనికి తెచ్చినట్లు ఆంధ్రదేశ సంప్రదాయపు మాట.[17] అల్లసాని పెద్దన చలసారికలనే పేర్కొన్నాడు, "నీవీణ నిన్న 'నాట' రాగమునకు తగినట్లు స్వరముల సారికలను మేళముచేసి యుంచినావు. ఇప్పుడు 'దేశాక్షి' రాగమునకు మేళవింపుము" అని వరూధినిని చెలి బోధించినదట. ముక్కు తిమ్మన్న 'మేలవించినవి సుమ్మీ దీని మెట్లు' అని కృష్ణునికి హెచ్చరిక చెప్పు నారదుని మాటలో అజాగ్రత్తతో వీణను చేయాడినప్పుడు మేళము చెడునని సూచించి, ఆ వీణ మేళము చలమేళమే అని తోపజేసినాడు. తెనాలి రామకృష్ణుని 'వీణాపాణింధమపాణి, ప్లవకన్య', 'కిన్నెర వీణె మోపి శ్రుతి గీల్కొన సారెలు చక్కనొత్తి' వాయించునది గనుక అదియు చలమేళమే. కాని రాయల ఆముక్తమాల్యదలో చూడికుడుత్తమ్మ వీణ కప్పుడే 'మయినపుమెట్లు' గలవు. అవి విరహపు వేడికి కరగును, అనగా అచల మేళము అప్పటికే కొందరి వాడుకలోనికి వచ్చినదన్న మాట. ఈ మేళపు మార్పును తంజావూరి రఘునాథరాయలు తొలుదొల్త చేసిన వాడని ఇంకొక అభిప్రాయము కలదని విన్నాను. ఎట్లును వీణా వాద్యమున నాటినుండి నేటిదాక స్థిరముగా సర్వత్ర వ్యాపించిన యీ సంస్కరణము సుమారు క్రీ. శ. 16వ శతాబ్దమున ఆంధ్రదేశమున జరిగినదని మాత్ర మూహించుట తప్పుగాదు.

క్రీ. శ. 17వ శతకమందలి ఆంధ్రలక్షణ గ్రంథములలో అగ్రగణ్యమైనది సకలకల సోమనాథుని రాగవిబోధము. తన గ్రంథమునకు తానే విపులమైన టీకయు వ్రాసి గ్రంథము విలువ నెంతో హెచ్చించినాడు.[18] రామామాత్యునివలెనే ఇతడు శుద్ధ - వికృత స్వరాలు పదునాలుగే అని యంగీకరించి, రాగమేళములు మాత్రము అతనివలె ఇరువది యనక ఇరువది మూడని వివరించెను; రాగ స్వరముల సూక్ష్మ భేదములను వీణలో వాయించు పద్ధతులు ఇరువది రెండుగా వివరించి, వానికి వ్రాతలో సంజ్ఞల నేర్పరిచి, ఒక్కొక్క రాగమునకు స్వర సంచార వాదన పద్ధతులను లక్ష్యమార్గమున విపులముగా చూపి మహోపకృతి చేసినాడు. స్వర రాగముల స్వరూప మింత స్పష్టముగా వివరించు గ్రంథము ఇం కొకటి లేదన్నను చెల్లును. 1531 వ శాలివాహన శకవర్షమున ఈ గ్రంథము రచించినట్లు అతడే చెప్పినాడు.

గద్యపద్యమయముగా మొట్టమొదట తెలుగులో సంగీత లక్షన గ్రంథము రచించిన కీర్తి పోలూరి గోవింద కవిది. 'రాగతాళ చింతామణి' లో
"సంగీత శాస్త్రంపు సర్వంకషప్రజ్ఞ-గలిగియుఁ దొల్లిటి కవివరేణ్యు,
లీభాతి నాంధ్రోక్తి శోభిత కావ్యంబు-పచరింపరు ..."
అని అతడే చెప్పుకొన్నాడు. ఇతడు రామామాత్యుని తరువాతి వాడు. స్వర - మేళ - రాగ లక్షణములు అతనివే తెలిగించి చెప్పినాడు.[19] కాని ఎంత తరువాతివాడో తెలియదు; క్రీ. శ. 16-17 శతకముల నడిమివాడని యూహింపనగును. ఇదిగాక తాళమునే ప్రత్యేకముగా వివరించు 'తాళదశప్రాణ దీపిక' అనునదియు ఇతడు రచించెను.

క్రీ. శ. 17వ శతాబ్దాదియందలి తంజావూరి ప్రభువు రఘునాథ నాయకుడు రచించినట్లుగా నున్న 'సంగీత సుధ' నిజమునకు కర్ణాటకుడైన గోవింద దీక్షితులు రచించి అతని పేరు పెట్టినదే యైనను[20] ఆంధ్ర రచనగానే పరిగణింప వచ్చును. విషయమును ఎంతో మించిన విస్తరము గల అబ్బురపు రచన యిది. రామామాత్యుడు కల్పించిన 'అచ్యుతరాయ మేళము'నకు ప్రతిగా 'అచ్యుతేంద్ర రఘునాథభూప మేళ' మొకటి వీణకు కల్పించినాడు. కాని అదియును వాడుకలోనికి రాలేదు. 'జయంతసేన' మొదలగు రాగములను రఘునాథరాయలు కల్పించినట్లు ఇందు గలదు. తక్కిన రాగము లెట్టివో తెలియదు. జయంతసేన మాత్రము త్యాగయ్యగారి పుణ్యాన 'వినతా సుతవాహన శ్రీరమణ' అను నొక కీర్తన మూలముగా జీవించియున్నది. ఇతడు కల్పించెనన్న రామానందాది తాళములును అంతరించినవి.

'సంగీత పారిజాత' కర్త అహోబల కవి గూడ ఈ కాలమువాడే యని పండితుల యూహ; పేరునుబట్టి చూచితిమేని తెలుగువాడు గాబోలును. కాని ఇతని రాగ స్వరూపములు కర్ణాటకమునకు కంటె హిందూస్థానీ పద్ధతికి ఎక్కువగా నుపకరించును.

ఇంకను కాలదేశములు తెలియనివారిలో నాట్యచూడామణి, స్వరరాగ సుధారసము అను గ్రంథములు రచించిన అష్టావధాని సోమనార్యుడు, 'నాట్య సర్వస్వదీపిక'ను రచించిన కొటికలపూడి నారాయణ శివయోగి మొదలగువారెందరో కలరు. వారి గ్రంథములు ఇంకను బైలుపడలేదు.

క్రీ. శ. 19-20 శతాబ్దములలో కర్ణాటక సంగీతమును గురించిన లక్షణ గ్రంథములు తెలుగులో పుట్టినన్ని తక్కిన యే భాషలోను పుట్టలేదు. ముఖ్యముగా తచ్చూరి శింగరాచార్య సోదరుల సంగీత పారిజాతాది గ్రంథములు, వీణ రామానుజయ్యది సంగీత సర్వార్థసార సంగ్రహము, శ్రీనివాసయ్యంగారి గానభాస్కరము మొదలగు రచనలు, తిరువత్తూరు త్యాగయ్యగారి పల్లవి, స్వరకల్పవల్లి మొదలగునవియు ఈ సందర్భమున స్మరింపదగును. ఈ యన్నింటికంటె ప్రధానము ఎట్టియాపురపు సుబ్బరామ దీక్షితుల 'సంగీతసంప్రదాయప్రదర్శిని'. గ్రంథకర్త అచ్చపు తమిళజాతి వాడైనను తెలుగు భాషను చక్కగా నేర్చుకొని అందులో వివిధలక్ష్యలక్షణములను విరివిగా, విస్పష్టముగా, గమక తాళాది చిహ్నములతో గూడ సంగ్రహించి, ప్రకటించి సంప్రదాయమును రక్షించుట కెంతో సహాయపడెను. అతనికి ముందుగాని, తరువాతగాని ఇంత గొప్ప ప్రామాణిక గ్రంథమును రచించినవా రిప్పటికి కానరారు.

కర్ణాటక సంగీతమునకు తెలుగువారి గొప్ప కానుక తెలుగు భాషయే. తెలుగు తక్కిన దాక్షిణాత్య భాషలన్నింటి కంటె మొదలు అచ్చుల ప్రాధాన్యమును ఎక్కువగా సంపాదించుకొన్నది; సంయుక్త వర్ణములను వియుక్తము చేసికొన్నది. పదాంతమందు వచ్చు నకార లకారములు - ఎంతో మృదువైనవి కూడ - అజంతములుగా భాషా పరిణామమున మారినవి. సంగీత నాదమును వెలువరచు శక్తి అచ్చులకే కలదు కాని హల్లులకు లేదు - అనునాసికములకు తప్ప. కనుక అచ్ప్రధానమైన తెలుగుభాష తక్కిన ద్రావిడ భాషలకన్న సంగీతమందు వ్యాప్తిని, వర్చస్సును సంపాదించుకొన్నందుకు వింతపడవలసిన పనిలేదు. మరి యే భాషవారైనను సంగీత రచనకు పూనుకొన్నప్పుడు తమ భాషయందలి హల్లుల ప్రాజాపత్యమును సాధ్యమైనంతవరకును తగ్గించు కొందురు. జయదేవుడు గీతగోవిందమునందలి అష్టపదులను రచించునప్పుడు హల్ప్రధానమైన సంస్కృత భాష నట్లే సంస్కరించి లొంగదీసెను. మరాటి, హింది, ఉర్దూ మొదలగు భాషల గీత రచనలందును మన మీ ప్రయత్నమును కనుగొనవచ్చును. ఇప్పుడు ద్రావిడ భాషలందును కన్నడము, తమిళమును ప్రాచీన హలంత రూపములను అజంతములుగా ఎంతో మార్చుకొన్నవి కాని తెలుగునకా లాలిత్యము వానికన్న మొదలే యేర్పడినది. దీనికి తోడు మొదటినుండి సంగీత కళలో తెలుగువా రెక్కువగా పరిశ్రమించుట, కళా కేంద్రములగు విజయనగరము, తంజావూరు, మధుర, పుదుక్కోట మొదలగు రాజాస్థానములలో తెలుగు వాగ్గేయకారులు చొరవతో ప్రవేశించి నెలకొని తమ రచనలు వ్యాప్తికి తెచ్చుట కర్ణాటక సంగీత కళలో తెలుగుభాష కొక సాంప్రదాయికమైన ప్రబల స్థానము నిచ్చినవి. ఇందుచేత తమిళ, కన్నడ, మలయాళ భాషవారును తెలుగు ప్రయత్న పూర్వకముగా నేర్చుకొని దానిలోనే కీర్తన, వర్ణాది రచనను సాగించ వలసిన యవస్థకు పాల్పడినారు. అట్టి రచనలలో ఎన్నో తెలుగువారి పరిహాసమునకు గురియైనవి. పట్టణం సుబ్రహ్మణ్యయ్య, రామనాడు శ్రీనివాసయ్యంగారు మొదలగు తెలుగు బయకారు లెందరో తెలుగురాని తమిళులే, కాలక్రమమున ఈ సంప్రదాయము తెలుగువారి కనావశ్యకమైన అహంకారమును, ఇతరులకు అనర్థకరమైన అసూయాభిమానములను గలిగించినది. తెలుగు పాటలు పాడరాదని మొండిపట్టు పట్టువరకు తమిళ, కర్ణాటకు లనేకులందు దాని ఫలము వ్యాపించినది. ఇంకను ఇతర భాషలనే వాడరాదని కూడ ఈ దృష్టి సుతి మించినది; కాని సంగీతము విశ్వజనీనమై భాషల యెల్లలను మీరి వ్యాపించు నాదకళ గనుక పై యల్ప భావములు ఎక్కువగా వ్యాపింపలేవు; త్వరలో నశించి విశ్వమంగళమును సాధింపగలవు.

రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
తెలుగు సంస్కృతి
తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము - 1959
తెలుగు భాషా సమితి

AndhraBharati AMdhra bhArati - lalitakaLalu - saMgItamu shrI raaLlapalli anaMtakR^iShNa sharma - andhra telugu tenugu ( telugu andhra )