నాటకములు ద్రౌపదీమానసంరక్షణము
మయసభ
మక్కపాటి వేంకటరత్నం

మయసభ (దుర్యోధన స్వగత వాక్యములు మాత్రము)
(స్థలము : మయసభ - దుర్యోధనుడు)
(కలయంగఁ జూచి - ఆశ్చర్యానందములతో)
     ఔరా! ఈ రచనా చమత్కృతి ఏమియోగాని ప్రకృతి నధఃకరించుచు కురుసార్వభౌముఁడనైన నా మానసమును సైతమాకర్షించుచున్నదే!
(ప్రక్కలం జూచి)
     వీరు నా నుడు లాలించి యుండరుగదా!
(ఆశ్చర్యముతో)
     ఏమి, వీరల రూప లావణ్యాతిశయములు? అపూర్వములే! ఈ త్రిజగన్మోహనాకృతులెవ్వరివై యుండును?
(సమీపించి మెల్లగా)
     ఓయీ మీరలెవ్వరు?
(నిదానించి)
     ఇదియేమి? వీరు ప్రతివచనంబీయరు?
(మరల కొంచెము బిగ్గరగా)
     మీరలెవ్వరు? ఇచ్చట నుండుటకు గతంబేమి?
(ఊరకుండి)
     ఏమిది?
(బాగుగ పరీక్షించి)
     నేనెంత భ్రమ పడితిని? నిమేషత్వమే లేదు. ఇవి సాలభంజికలు.
(ఆశ్చర్యముతో)
     ఏమి యీ విచిత్ర కల్పన!
(తలయూఁచి)
     మయుని లోకోత్తర కళాకౌశలము.
(ఇంకొకవైపునఁ జూచి)
     సభా భవనమున నుద్యాన వనమా! ఎంత రమణీయముగా నున్నది.
(చూచుచు)
     వివిధ ఫలభరానత శాఖాశిఖా తరువర విరాజితంబు. రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్యసురభిళ పుష్పవల్లీమతల్లికా సంభాసురంబు. భాసుర పుష్పగుచ్ఛ స్రవన్మధుర మధురసాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకారనినాద మేదురంబు. మేదుర మధుకర ఘనఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృతకలాప కలాప రమణీయంబు. రమణీయ కోమల కలాపకలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు, సంకీర్ణ నికుంజపుంజ సుందరంబు. ఆహా! ఈ యారామ సౌకుమార్యం బత్యంతమనోహరంబు. దినదినానేక నూత్నారామావలోకరంజిత కౌరవ వంశవర్ధన మనఃప్రమోదావహంబగు నీ నిష్కుటంబు తక్కొరుల కద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశము. కావుననే "మయసభ", "మయసభ" అని సామాన్య జనుఁడు మొదలు రాజకంఠీరవుని పర్యంత మేకగ్రీవముగ దీనిని గురించి వర్ణించుట.
(తల యూఁచి)
     ఇందలి ఫల కుసుమజాలములును మహదానందమును గల్పించుచున్నవి.
(నడువ నుంకించి చూచి)
     కాసారమా ఇది? ఉండి లేనట్లును, లేక యుండినట్లును గనంబడుచున్నది.
(బాగుగఁ జూచి)
     జలాశయమే కాకున్ననీ బిససూత్రములు నీ శతపత్రాదికము లెట్లుండును?
(తల పంకించి)
     సంస్పర్శమాత్ర నూత్న చైతన్య ప్రసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు. మంద పవనచాలనోద్ధూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘట్టన జాయమాన మృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యంబు. కమల కోకనదాది నానావిధ జల కుసుమ రాగారుణిత దరీభాగంబు. ఆలోలబాలశైవాలజాల లాలిత జంగమోద్యాన శంకావహంబు. గ్రీవాలంకృత బిససూత్ర పాళికాసందీపిత హంస హంసీగణ విభూషితంబు. వర్ణనాతీతంబు. చూడంజూడ నియ్యది అపూర్వ రమణీ రమణీయాకృతిం దలపించుచున్నది.
(తల యూఁచుచు)
    
సీ. రమణీయ పద్మపత్ర వ్రాత సముదీర్ణ - హరితచేలాంచల స్ఫురణ తోడ
లలిత నీలోత్పలోచ్చలిత దళానీక - చారు భాస్వద్దృగంచలము తోడ
మలయానిలోద్ధూత జలజ పాంశు సుగంధ - కమనీయ సౌరభాకలన తోడ
సలలితామేయ నిష్యంద శీతలబిందు - సందోహ హర్ష బాష్పముల తోడ
ఆ. విమల శైవల కబరికాభముల తోడ - లాలిత మృణాళ బాహువల్లరుల తోడ
నిరుపమ విలాస సత్కళాన్విత మగుచు - శ్రీల నొప్పారు నీ సరసీలలామ.
ఇందలి మధువారి పూరము నించుకఁగ్రోలి ఈ పరిసరమున నొక్కింత విశ్రమించెదగాక.
(అడుగువెట్ట వట్టి నేలయగును - యోజించి)
     ఇదియేమి? ఇచ్చటి ప్రకృతియే నన్ను బరిహసించుచున్నట్లున్నదే. ఇది యెంత మాయగ నున్నది!
సీ. భావగాంభీర్య స్వభావవాసన లేక - కేవల కల్పనాకృతి వహించి
అవలోకమాత్ర జీవానిలహర గూఢ - పదనిగూహన వృత్తిఁ బరిఢవిల్లి
భ్రాంతి కారణ నిరర్థ ప్రయుక్తానర్థ - విశ్రమపద శిలావితతి నెనసి
వితతసమాస మహిత భూరిభంగ సం - క్షుభిత సత్కవిరాజకోటిఁ దనరి
ఆ. ఉత్పలాదిక వృత్తంబు లుండుకతన - సరసమని యెంచిరా నిది విరసమయ్యె
వంచ్యమాన నరోత్తర వాంఛితంబు - కాకవి కుకావ్య మీ యంబుజాకరంబు.
ఇది మయుని రచనా విశేషమా? నేను భ్రాంతి యుతుండనైతినా?
(వినుట నభినయించి చకితుఁడై)
     ఎచ్చటిదీ హాసధ్వని? మముగాంచి యెవ్వరును బరిహసించుటలేదు కదా!
(కలయం జూచి)
     ఇచ్చట నెవ్వరును గానరారే! ఈసవ్వడి యెటనుండి వచ్చె?
(ఊరకుండి తల పంకించి తిరస్కారభావముతో)
     అతులిత మాయా రచనా సమర్థుఁడైన ఆ మయుండిట్లు ధ్వనించు యంత్రము నిందెందైన నిర్మించియుంచెనేమో?
(మరియొక వైపున దృష్టిఁ బరసి)
     ఆ కన్పడునదేమి?
(ఆశ్చర్యముతో)
     వివిధ మణి వికార కుడ్య భాగాంతర్గత ద్వారదేశమా? తత్సువర్ణ శాఖాంతరోల్లిఖిత గారుత్మతవల్లీ సముల్లసితమా? వల్లీసముల్లసిత సల్లలితపల్లవ సందోహమా? మధ్యేపల్లవ సంపుటా త్యంతభాసుర పుష్పఫల ప్రతానమా? పుష్పఫలమకరందరస సేవనార్థ సమాగత షట్పద కీర వారమా?
(యోజించి తలఁద్రిప్పుచు ఇటునటుం దిరుగుచు)
     ఇట్టి త్రిజగన్నుత సభాభవనము పాండవుల యధీనమున నుండుటయా?
(తల యూఁచుచు)
     కాల స్వభావము! నిన్ను మొన్నటిదనుక నిలువనీడ లేకుండిన పాండవులు దిగ్విజయ మొనరించి రాజసూయ మహాధ్వర నిర్వహణమున సార్వభౌమ పదంబు నలంకరించుటయా? అభిమానధనులగు భూరమణు లెల్ల రరిగాపులై వస్తువాహనాది నానావిధోపాయనముల నర్పించి గౌరవించుటయా? ఏ లోకముననో పడియుండిన యా మయ హతకుఁడు ద్రిలోకాధిక భ్రాజమానంబగు నీ సభాభవనమును నిర్మించి యిచ్చుటయా! పాండవు లన్యజన దుర్నిరీక్ష్యులై విజృంభించుటయా? ఇదియంతయుఁ గనులారగాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుఁడగు సుయోధన సార్వభౌముడు సహించి యుండుటయా?
(యోజించి తల పంకించి యీర్ష్యాసూయలతో మొగమున గంటుపెట్టుకొని)
     నా సమక్షమున నూరును బేరునులేని ధర్మజునకు నా సామంతులెల్లరునుపాయనముల నర్పించి పరస్పర శిరఃకోటీర సంఘర్షణంబున డుల్లిన వజ్రమణిమయూఖంబులు భూపతికి నూత్నశోభ నాపాదించి రత్నగర్భ నామమును సార్థకపరుప సాష్టాంగదండ ప్రణామంబుల నాచరించుట నాకవమానము గాదా? దుర్మదంబున ధర్మజుండు యుక్తాయుక్త విచార విదూరుండై సార్వభౌముని సమక్షమను జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులం గైకొనుటయా?
(యోజించి)
     యోచించినకొలఁది మనంబునఁ బట్టరాని క్రీధము వెల్లివిరిసి దుర్భరంబగుచున్నది. ఇంక నిచ్చట నిలువజాల.
(పోబోవ నది సంవృతద్వారం బగుట కవాటఘటిత శిరస్కుఁడగును. తల పట్టుకొని)
     అబ్బా!
(పరిహాసధ్వని వినంబడుచున్నది. తలపై చేయితీసి సవరించుకొని)
     మరల పరిహాసము.
(ధ్వని వచ్చు వైపు క్రూరముగ తలయూఁచుచు)
     అవరోధ జనుల పరిహాసము
(సక్రోధముగఁ దలయూఁచి పండ్లు కొరుకుచు)
     పంచభర్తృకా! కానిమ్ము. ఇచ్చటి కిది పరిహాసమాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫారిత భ్రుకుటీ ప్రభూత తీవ్ర వైశ్వానరజ్వాల.
(తల పంకించుచు గ్రూర దృష్టితో మరియొక వైపుగా నిష్క్రమించుచున్నాడు.)


(స్థలము - హస్తినాపురి, ఆంతరంగిక భవనము)
(అంతట క్రోధముగల దీర్ఘ నిశ్శ్వాసముతో కొంత సేపిటునటుం దిరిగి కూర్చుండి)
     ఆ బంధకీకృత పరిహాసావమానమునఁ బ్రాణ పరిత్యాగ మొనరించుటయా లేక ఆ పరిభవంబునకుఁదల యొగ్గి జీవించుటయా?
(ఊరకుండి లేచి)
     సప్త సాగర వేలావలయిత వసుంధరావలయంబున కెల్ల నేకచ్ఛత్రాధిపత్యమును వహించి అప్రతీపప్రతాపమునఁ జండ శాసనుండనై యలరారు నా యట్టి రాజన్య చూడామణి యెవ్వఁడిట్టి హేయమగు దుర్మరణమున కంగీకరించును?
(కూరుచుండి యోజించి)
     పోనిమ్ము. ఈయవమానమును భరింపఁజాలక దుర్మరణమునకే సాహసింతమన్నను బ్రయోజనమేమి?
(చకితుఁడై)
     ఆఁ! యేమీ? అభిమానధనుండగు సుయోధన సార్వభౌమునకా అవమానము?
(తలయూఁచుచు)
     ఆ దుర్జాతిశుద్ధాంతము లజ్జావిహీనతఁ బరిహసించినఁ బరిహసించునుగాక. నాయంతటి వాని కవమానము తటస్థించునా?
(తిరస్కారభావముతో)
     మహాగజేంద్రంబు మార్గంబునఁ జనుచుండఁ గుక్కలెన్ని మొరుగుటలేదు?
(యోజించి తలఁద్రిప్పుచు)
     ఉహుఁ నేనెన్ని విధముల నా యంతరాత్మకు సరిపెట్టుకొన్నను యీ వార్త యెట్లైన లోకంబున వెల్లడి కాక మానదు. నిరర్థకముగ దురర్థ ప్రతిపాదకులగు లోకులనేకు లనేక విధంబుల దలంపక మానరు. ఆ పిమ్మట నన్ను సందేహింపక మానరు. సుయోధన సార్వభౌముని జీవితమున నీ కళంకము స్థానమేర్పరచుకొనక మానదు.
(తలఁద్రిప్పుచు)
     అపయశంబున జీవించి యుండుటకంటె మరణంబు సర్వవిధంబుల శ్రేయోదాయకంబు.
(కూర్చొని యోజించి)
     పోనిమ్ము, ప్రాణపరిత్యాగానంతరముననైన యీ సడి తప్పునా?
(తలఁ ద్రిప్పుచు)
     మానినీ పరిహాసపాత్రుండగు మానవపతి చరిత్రమని రేపటి నుండియు నా జీవిత మీలోకమున నాటకరూపమునఁ బ్రదర్శింపఁబడదా? కావున సర్వవిధంబుల మరణంబు గర్హితంబు, జీవించి యుండుదమన్నఁ బరనారీపరిహాస పంక కళంకితజీవనుండనై మని యుండుటయు దుర్భరంబు. ఏమి సేయుదు?
(తలఁ ద్రిప్పుచు)
     అచేతనమగు భూపరాగమె పాదహతి సైపఁజాలక మానవుని మూర్ధ మధిరోహించి తన పగను దీర్చికొనుచుండ సచేతనుఁడనై సబలుఁడనై సార్వభౌముఁడనైన నేను ఒక్క ఆడుది యొనరించిన యవజ్ఞకు బ్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపఱచుకొనఁ జాలనే?
(కూరుచుండి యోజించి)
     కట్టా! నాయవమానములకన్నిటికిఁ గారణమైన దా మయసభయే కదా? నా క్రోధమున కునికిపట్టైన దా మయసభయే కదా! తుదకు నా జీవితమును విషమస్థితి నాక్రమింపఁ జేసినదియు నా మయసభయే గదా! ఏమి కాలవైపరీత్యము? తొట్టతొలుత నీ రాజ సూయమే లేకుండిన నింత యుట్టిపాటు పుట్టనేపుట్టదు కదా! ఔరా! ధర్మజ రాజ సూయము ధుర్యోధన సార్వభౌము నభిమాన పుష్పోపవన నిర్మూలనంబునకు విషవాయు సదృక్షంబైనదే!
(క్రోధముతో)
     దురాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాహ్యులు పరవంచనాసక్తులు నగు ఆ పాండవ హతకులు పిలిచినంతనే నే నేల యా రాజసూయాధ్వరంబున కరుగ వలె? పోయితినిబో - నాకేల యా పాడు మయసభా సందర్శనేచ్ఛ యంకురించవలె? అంకురించెఁబో - నేనేల అందందుఁ దిరుగాడి అవాచ్యములగు నవమానములకు లోను గావలె? లోనైతిఁబో - ఆ సమయమున ఆ పాపిష్ఠ నిష్కారణముగ నన్నేల పరిహసించవలె? ఈ స్థితిగతులంబట్టి చూడ నన్నా బంధకిచే వంచింపజేయుటకై ఆ పాండవహతకులీ రాజసూయ వ్యాజంబున నన్నింద్రప్రస్థమునకుఁ బిలిచినట్లు తోచుచున్నది.
(తలయూఁచి)
     నిశ్చయముగ నా దురాత్ము లీ దురుద్యోగ సంగతాత్ములే కానిచో గేవల సభావలోకన తత్పరుండనగు నన్ను వారేల నిరర్థకముగ పరిహసించవలె?
(తలయూఁచుచు)
     తెలిసినది. ఆ రాజసూయమునకు మూలమీ కుటిలోపాయంబై యుండుట నిశ్చయము, నిస్సంశయము. ఎంత మోసము! ఎంతకౌటిల్యము! ఎంత దుండగము!
(ఉత్కటక్రోధముతో)
     ఓరీ! పాపిష్ఠులారా! పాండు భూపాల గర్భభూతులారా!
(తలయూఁచి యోజించి)
     ఏమి నావెఱ్ఱి! ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మగౌరవమునందు గురినిల్పక సార్వభౌమ పదంబునైనఁ దలంపక నేనెట్టి యవ్యక్తాలోచనంబునంబడి కొట్టుకొను చున్నాఁడ? నవఖండ భూమండలాధిప మకుటతట ఘటితమణిఘృణి నిరంతర నీరాజిత నిజపాద పంకేరుహుండనై సింధురాట్చతుష్టయ పరివేష్టిత వసుంధరాభార ధూర్వహుండనై పరరాజ మదసంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమానధనుండనై దుర్నిరీక్ష్యుండనై పదునాల్గు భువనంబు లొక్కపెట్టు నెత్తివచ్చిన నుక్కడంపంజాలు ప్రచండ ప్రతాప ప్రభావిభాసితులగు నూర్గురు సోదరుల కగ్రజుండనై చండతర పరాక్రమోజ్జ్వలమై, దిగంత విశ్రాంత సద్యశోవిలసితమై అభిమానవల్లరీ బంధీకృతమై, నిష్కళంకమై జగంబునఁ బేరెన్నికఁగన్న సుక్షత్రియవంశంబున జనించి అనేకాక్షౌహిణీ చమూసమూహంబున కధినాథుండ నగు నాకు ఈ ప్రపంచమున నెయ్యది అసాధ్యము! ఇప్పుడేపోయి యా దురాత్ములఁ జించి చెండాడెద. ఆపురంబు భస్మీపటలము గావించెద. ఆ పాపిష్ట నా పాంచాలి నెంచరాని మహాపదల ముంచెద. నా మనోవికల్పములకు గారణమైన యా మయసభ విధ్వస్త మొనర్చెద.
(క్రూరముగ జూచుచు)
     దురాత్ములారా! పాండవ హతకులారా! సుయోధన సార్వభౌముఁ డభిమాన ధనుండనియు బందుగుండనియు, మీఁదుమిక్కిలి మీ యట్టి సామంతమాత్రుల కనేకులకు శాసకుండనియు నైనఁ దలంపరైతిరే? అప్పుడే దుర్మదాంధత్వము కన్నుల కెగదట్టెనా? అప్పుడే యుక్తాయుక్త వివేచనా జ్ఞానము నశించెనా? అగును. అల్పపుసిరి కన్నులు గాననిచ్చునా? ఎట్టెటులో యొక రాజసూయమును నిర్వహించితిమి కదాయని కన్నును మిన్నును గానకున్నారే! ఇంత మాత్రమున నింత మిట్టిపాటా!
(తల యూఁచుచు)
     కానిండు. ఈ సుయోధన క్రోధాగ్నికి దూదిబుంగలు కాకపోవునా మీమీ దుర్దౌష్ట్యములు? ఈ సుయోధన సార్వభౌము నీర్ష్యాభూతంబున కాహుతులు గాకపోవునా మీమీ హృదయ పిండంబులు? ఈ దుర్యోధన చక్రవర్తి యీర్ష్యాగ్రహంబునకుఁ బానీయంబులు కాకపోవునా మీమీ కవోష్ణ రక్తప్రవాహంబులు? ఈ శౌర్యరాశి దుర్వార శౌర్య చండమార్తాండ తీక్ష్ణ కరంబులకుఁ గబళంబు గాకపోవునా మీమీ గర్వాంధకారంబు? ఏమి మీ కండక్రొవ్వు? భవన్మనోగత దౌరాత్మ్య వారివాహ విభంజన సమర్థ ప్రభంజనము కాదా యీ కురురాణ్మణీ క్రోధము?

భవద్ధృదయ సంవృత గర్వ పర్వతోన్మూలన చణ వజ్రాయుధంబు గదా ఈ చక్రవర్తి క్రౌర్యము? భవచ్చిత్తాటవీ సంచరద్దురూహ మత్తమాతంగ వక్షఃకవాట విపాటనపాటనోదగ్ర సింహకిశోర కరాంచల నఖాంచలంబులు గావా ఈ కురుముఖ్యుని అద్భుతోపాయ పరంపరలు! ఓరీ! రాజకులపాంసులారా! మిమ్ములనింక నింద్రప్రస్థపురంబున నిలువనిచ్చిన నేను సుయోధనుండనేనా! కట్టుపుట్టముల సైత మూడలాగించి మిమ్ముల నట్టడవుల గుట్టలపాలు గావించి చెట్టులం బట్టింపకున్న నే రాజరాజునేనా! మీ సర్వసంపదలు హరించి మీదుర్మదంబు నడంపకున్న నే సార్వభౌముఁడనేనా? నిండు సభామధ్యంబున సకలరాజ సమక్షంబున బత్నీ సమేతముగ మీ మాన మారడివో జేయకుండిన భూమండలంబున నింకను దుర్యోధన చక్రవర్తినని పిలిపించుకుందునే?
(పరితాప క్రోధాసూయలు మూర్తిమంతంబులైనట్లు నటించుచు)
     పాండవాంకుర మారణ హోమమునకై హృదయకుండమునఁ గ్రోధాగ్ని ప్రజ్వరిల్లు చున్నది. నలుదెసల నాక్రమించుచున్నది. మంత్రపాఠకులు లేరె? ఏమి కర్తవ్యము? ఈ యవమాన సంజనిత సంతాప మవార్యమైనను నిలిచినచోట నిలువ నిచ్చుటలేదు. ఏమి సేయుదు? కట్టా! దుర్వారదర్వీకర నిర్వాంత విషవహ్నికీలలకైన దాళియుండనగునుగాని, ఈ దుర్వ్యధకు దాళియుండుట దుర్ఘటము. కాలకంఠ ఫాలనేత్రాభీల కీలికీలా కలాపంబున కైన నోర్చియుండనగునుగాని ఈ యవారణ దారుణాటోపంబు దుస్సహము. ప్రళయసమయ సముద్దండ దండధర చండాతి చండ దండ పాతంబునకైన సైపనగును గాని భీషణాతి భీషణంబగు నీశోషణంబున కోర్చుకొనుట దుస్సహము.
(ఒడలంతయు సెగలు గ్రక్కుట సూచించుచు)
     అబ్బా! దేహ మాపాదమస్తకమును మంటలెగయు చున్నది. ఈ పరితాపమున కంత మెప్పటికి? ఔరా! దరిద్రుని ఆత్మసంతృప్తికైన మితముండునుకాని నా యీ పరితాపము నకు మేరలేకున్నదే?
(అసూయావమాన క్రోధ పరితాపముల పరమావధిని నటించుచు)
     కర్తవ్యాకర్తవ్య విచారణములేదు. పుణ్యపాప వివక్ష లేదు. కీర్త్యపకీర్తులు లేవు. కారణా కారణములు లేవు. బంధుత్వాబంధుత్వములులేవు. భయము లేదు, భక్తి లేదు. పాండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూలోద్ఘట్టిత కౌరవవంశవర్ధన మనఃకంఠీరవంబు యథేచ్ఛా విహారవ్యవహారంబుల నప్రమత్తవృత్తి నిరాటంకముగ విజృంభించి తీఱవలసినదే.
(తలయూఁచుచు)
     పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండవ పట్టమహిషీ దారుణ పరాభవంబు ద్వితీయ కర్తవ్యము. పాండుభూపాల కులోన్మూలనము అనంతరాచరణీయము.
(నేపథ్యమున)
     అహో! ఈ ఇనుని దివస దీక్షాధికారము చెల్లిపోవుచున్నదే!
ఉ. కాలవశంబునన్‌ స్వకర కాండబలం బుడుగంగ వారుణీ
శైలశయానుఁడై తనకు శాత్రవుడైన సుధాంశుఁడింక మి
న్నేలునొయంచుఁ దద్వధకు నీ యినుఁడంపిన శక్తులో యనన్‌
గాలము వేచియున్నయవి క్రమ్మి పయింబడఁ గాఱు చీకఁటుల్‌.
ఓహో? సమయ సూచకులు దివసావసానమును దెల్పుచున్నారు. కర్ణ దుశ్శాసన సౌబలు లిచ్చటికిఁ జేరునప్పటికి నేనును కాలసవనములం దీర్చివచ్చెదగాక!
(నిష్క్రమణము)
AndhraBharati AMdhra bhArati - telugu nATakamulu - maya sabha mayasabha - draupadI mAna saMraxaNamu (makkapATi vEMkaTaratnaM) ( telugu andhra )