శతకములు శివముకుంద శతకము పరమానంద యతీంద్ర కృతము
శ్రీవరగిరిజానాయక
గోవింద లలాటనేత్ర గోకులతిలకా
భావజసంహార హరిహర
భావాత్మక శివముకుంద పరమానందా.
1
దైవము లిద్దఱు నేకో
దేవాది శ్రుతులవల్ల, దెలియఁగ నొకటే
భావించెద మిము నేకీ
భావంబుగ శివముకుంద పరమానందా.
2
భక్తుల పరిపక్వములకు
వ్యక్తులు రెండౌటగాక వర్ణింపఁగ న
వ్యక్తం బని తెలియుట నిజ
భక్తికదా శివముకుంద పరమానందా.
3
పరమానందయతీంద్రుఁడ
సురుచిరముగ మిమ్ము వాక్ప్రసూనంబులచేఁ
గరమర్థిఁ బూజచేసెద
పరమాత్మా శివముకుంద పరమానందా.
4
ఒకటై రెండై మూఁడై
సకలంబై యేమిగాని సహజము బయలై
యకలంకమతికిఁ దోఁచును
ప్రకటముగా శివముకుంద పరమానందా.
5
తనమహిమ తనకుఁ దెలిసిన
దనయందేతోఁచి యణఁగుఁ దత్త్వములెల్ల\న్‌
దనమహిమ తెలియఁ దనకే
పనుపడవలె శివముకుంద పరమానందా.
6
తనుఁ దాఁ దెలిసెడి మార్గం
బనువుగ సద్గురులవలన నతిసులభంబౌ
తనయుక్తుల శాస్త్రంబుల
బనిగొన దది శివముకుంద పరమానందా.
7
గురువాక్యము శాస్త్రార్థము
గురుతుగఁ దనయనుభవంబుఁ గుదురుగ నొకటై
మది నిల్చునేని యదిగా
పరమార్థము శివముకుంద పరమానందా.
8
మితిమేరలేని జన్మము
లతికష్టము లనుచు నెంచి యంతటఁ దత్త్వం
బతివిశదముగాఁ దెలియని
బ్రతు కేటికి శివముకుంద పరమానందా.
9
అలతత్త్వము గురుకృపచే
నలవడు నని నమ్మి మిగుల నాసక్తుం డై
తలపడవలె గురుభజనకుఁ
బలుమాఱును శివముకుంద పరమానందా.
10
అల సద్గురుకృప లేకయె
తలపడి చదివితి మటంచుఁ దటవటసుద్దుల్‌
పలుకుచు తిరిగినఁ దెలివికి
ఫలమౌనా శివముకుంద పరమానందా.
11
కంటెసఁగఁ గర్మజాలము
లుంటే బంధంబు దీఱదో గురుపదముల్‌
కంటే మోక్షము చేరువ
పంటగదా శివముకుంద పరమానందా.
12
కొందఱు తత్త్వపుమాటల
సందడిఁ బడి తెలిసినట్ల సద్గురుకృప లే
కుందు రనుభూతిఁ గానని
పందలవలె శివముకుంద పరమానందా.
13
తాఁటాకులు ద్రిప్పుచు పది
కోటులు చదువంగ నేమి గురువాక్యంబుల్‌
పాటించి తెలియ కది యే
ర్పా టౌనా శివముకుంద పరమానందా.
14
నిజమైన ముక్తికొఱకై
సుజనుఁడు సద్గురుని వెదకి సుస్థిరమతి యై
భజియింపక గలదే గతి
ప్రజలకు నిఁక శివముకుంద పరమానందా.
15
గురుభజనఁ బాపములు చెడు
గురుభజనను గర్మ ముడుగుఁ గోరిక లుడుగుం
గురుభజన ముక్తికర మగు
పరమాత్మా శివముకుంద పరమానందా.
16
నాటిన యామిక విడిచి ప
టాటోపము లేక నమ్రుఁడై గురుభజం
బాటించక ననుభవ మే
ర్పా టౌనా శివముకుంద పరమానందా.
17
ఆదట గురుమతమున దే
హాదులఁ దొలఁగంగ నేర్చునాతని మదిలో
పో దిఁక సహజానందము
పాదుకొను\న్‌ శివముకుంద పరమానందా.
18
వినినప్పుడె కనవచ్చును
యనుభవి యౌ యోగివాక్య మాదరమునఁ దా
వినఁగూడని యహమికఁచే
బనుపడ దది శివముకుంద పరమానందా.
19
మాటల వినుకులఁ దగులదు
సూటిగ సద్గురుఁడు చూపఁ జూచినఁ గా కే
ర్పాటును గా దది కుజనులు
పాటింపరు శివముకుంద పరమానందా.
20
అతి చంచల మై తిరిగెడి
మతి మీదయవల్ల నిపుడు మట్టుకు వచ్చె\న్‌
గతిచెడి ఱెక్కలు విఱిగిన
పతగమువలె శివముకుంద పరమానందా.
21
ఇలు వెడలి బయలుదేరక
గెలిచే దేలాగు మాయఁ గినియుచు రాఁగా
నిలు సొచ్చి తలుపు మూసిన
బలిమేదీ శివముకుంద పరమానందా.
22
బైలుగ మాయాభూతము
హేలాగతి నొప్పుఁ గాక యేలా తొలఁగు\న్‌
జాల వివేకపుఁ జబుకుల
పాలాడక శివముకుంద పరమానందా.
23
ఏయెడఁ బెద్దలసంగతి
సేయంగా నిత్యసుఖము చేకొనవచ్చు\న్‌
మాయాభూతము తొలఁగు ను
పాయం బిది శివముకుంద పరమానందా.
24
చాలం గర్మపుఁ దొట్ల\న్‌
సోలంగా నుంచి మాయ జోలలు వాడు\న్‌
లాలీయని జీవులనే
బాలురఁ గని శివముకుంద పరమానందా.
25
తానే పరదైవంబని
కానక తనకన్న వేఱు గాఁదలఁచేదే
యూనిన మాయారూపము
భానునుతా శివముకుంద పరమానందా.
26
తను నే నెఱుఁగనిమునుపే
తనయాటలు చెల్లెఁగాక తా మా యనఁగా
నను నే నెఱిఁగిన పిమ్మట
పనిగలదా శివముకుంద పరమానందా.
27
అంతా నే నై యుండగ
నింతైన\న్‌ మాయ కునికి యెక్కడి దయ్యా
యంతటఁ దొలఁగక నాతోఁ
బంతంబా శివముకుంద పరమానందా.
28
కట్టిడిమాయ యనంగా
రట్టుకు లోనాయెఁగాక భ్రమ యదికాదా
పట్టఁ బసలేని దది యే
పట్టున నిఁక శివముకుంద పరమానందా.
29
ఔరౌర మాయ కంటెను
యేరీతిని తనగుణంబు లెఱుఁగ రటం చా
నేరమి జీవులపై నిడి
పాఱెడి నిఁక శివముకుంద పరమానందా.
30
నలుదిశల నిక్కడక్కడఁ
దలచూపఁగ లేక మాయ దాగెను కంటే
యలపూర్ణుఁడ నేఁ గాఁగాఁ
బల ముడిగెను శివముకుంద పరమానందా.
31
కడుదబ్బఱలకు నెల్లను
నొడిగట్టిన మాయగుట్టు లొగి నేఁ గనఁగాఁ
బొడచూప వెఱచి తానే
వడిపోయెను శివముకుంద పరమానందా.
32
ఇది కల్లర ఛీయన్నా!
వదలక యీమాయ కదియవచ్చిన నేమో
ముదిలంజెవలపు చాలును
పదివే లిఁక శివముకుంద పరమానందా.
33
అవిరళతత్త్వం బెఱిఁగెడు
సువిచారం బొకనిపాలిసొమ్మా మనుజుం
డెవఁడైన నేమి తెలివికి
భవమోచన శివముకుంద పరమానందా.
34
ఏపాటు లేక తనలోఁ
జూపట్టుచు వెలుఁగుచుండు సూక్ష్మబ్రహ్మం
బేపారఁగఁ దెలియ రయో
పాపాత్ములు శివముకుంద పరమానందా.
35
శాంతంబై పూర్ణంబై
యెంతయు బ్రహ్మంబు తెలివి కేర్పడ మాయా
క్రాంతముగా మదిఁ దలఁచుట
భ్రాంతిగదా శివముకుంద పరమానందా.
36
పోషించి తత్త్వరచనల
భాషించినఁ దెలియ లేక పామరమతు లై
దూషణ చేతురు కొందఱు
పాషండులు శివముకుంద పరమానందా.
37
మెండుకొనుతత్త్వవాసన
లుండదు పరిపక్వహృదయమొగిఁ గాకుంటే
యెండిన కసుగా యైనది
పండౌనా శివముకుంద పరమానందా.
38
పుట్టించని సుద్దులు చెవిఁ
బెట్టిన నది లెస్సగాక పిమ్మట ధరలోఁ
బుట్టించెడు సుద్దులఁ జెవిఁ
బట్టుదురా శివముకుంద పరమానందా.
39
వారక సంసారంబునఁ
బోరాడిన నేమి విరతిఁబొందిన నేమీ
యారూఢ యోగి కది వ్యా
పారంబో శివముకుంద పరమానందా.
40
ఘోరతర కర్మవాసన
లేరీతిని జుట్టి పట్టి హీనులఁ జేయ\న్‌
మీఱిన యజ్ఞానుల కది
భారంబో శివముకుంద పరమానందా.
41
వేషములవలన జనులఁ బ్ర
మోషించి మనీషివరుల మోదము జెఱిచే
దూషకులఁ గూడి పెద్దలు
భాషింపరు శివముకుంద పరమానందా.
42
అచ్చట నచ్చట నేర్చిన
తచ్చన లొక కొన్ని యఱచి తత్త్వం బని తా
మెచ్చిన నేమగు మాటల
పచ్చ ళ్లది శివముకుంద పరమానందా.
43
అలయంగ భూమి నుదధి
స్థలి కృష్ణనివాసమైన ద్వారక నడుమ\న్‌
లలిఁ దను గను శివయోగియె
బలవంతుఁడు శివముకుంద పరమానందా.
44
నెల ప్రొద్దులోన గట్టిగ
నెలకొని చూడంగ వలయు నీలజ్యోతి\న్‌
వెలి లోను గానిచూపున
బలిబంధన శివముకుంద పరమానందా.
45
పరకార్యపరులు లోకులు
పరమజ్ఞానులు స్వకార్యపరు లై ధరలో
నిరతిశయసుఖముఁ గాంతురు
పరమాత్మా శివముకుంద పరమానందా.
46
మేటైన బ్రహ్మవిద్యకు
సూటై తగు రాజయోగసుస్థిరు లెచట\న్‌
బూటకపు మంత్రవిద్యలఁ
బాటింపరు శివముకుంద పరమానందా.
47
నలుగురి నొక్కటిఁ జేసిన
నలుగురిలో బ్రతుకవచ్చు నాణెముగాఁ దా
నలుగురిపనులకుఁ దిరిగిన
ఫల మంటదు శివముకుంద పరమానందా.
48
నలుగురిలోఁ దలవంచుక
నలుగురిలోఁ గూడి మాడి నడువక వేఱై
పలుపోకలఁ దిరుగును ఛీ!
బలహీనుఁడు శివముకుంద పరమానందా.
49
నలుగురికిం దా గుఱియై
మెలఁగిన నది ముక్తిగతికి మేలై రాదే
నలుగురితో గూడనిదే
పలుచనయా శివముకుంద పరమానందా.
50
తనయింటం దా నుండినఁ
దనయిల్లే తనకుఁ జేటు దాఁ దెచ్చునయా
తనయిల్లు కాలవేసిన
పనిమే లది శివముకుంద పరమానందా.
51
అద్దిర యనుభవ మెఱుఁగక
వద్దనువా రెవరు లేక వదరుచుఁ దిరిగే
పెద్దలసుద్దులు గిద్దులు
బద్దలునా శివముకుంద పరమానందా.
52
తలఁపు చెడఁ గర్మములు చెడుఁ
దలఁపు చెడ\న్‌ మాయ చెడును దా ననుట చెడు\న్‌
తలఁపు చెడినతఁడె ముక్తికి
బలవంతుఁడు శివముకుంద పరమానందా.
53
భావంబుఁ దలఁచుటెల్ల న
భావము తలఁపుడుగు టెల్లఁ బన్నుగ భావా
భావాతీతము సహజము
పావన మది శివముకుంద పరమానందా.
54
అసమానరాజయోగా
భ్యసనంబునఁ బడమటింటఁ బదిలుం డైతే
దొసఁ గేమిలేనిముక్తికిఁ
బస వట్టిది శివముకుంద పరమానందా.
55
కలపండ్రెండు పదాఱును
నలువదిరెండైనచోట నయముగ నొకటై
తెలివొందు వెరవుఁ గూడిన
ఫలసిద్ధౌ శివముకుంద పరమానందా.
56
ఇల బొమ్మరిండ్లలోపల
నలువున మఱి చిన్ని పాప లాడుచు నుండే
సులు వెఱిఁగి యచటఁ దనుఁగన
ఫలసిద్ధౌ శివముకుంద పరమానందా.
57
మీఱిన దుర్వాసనలను
గూరిన మతి నణఁపనేర్చుఁ గుశలుఁడు ధరలో
నారూఢియోగవిద్యా
పారీణుఁడు శివముకుంద పరమానందా.
58
లో వెలి చూపులు రెండును
బో విడువఁ దదంతరమున బొలుపగుతత్త్వం
బావిధ మెఱుఁగును నిర్గుణ
భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా.
59
తలఁచినయది జడిమం బగు
తలఁ పుడిగిన శూన్యమగును దలఁచిన తలఁపే
సలలిత మగు చిద్బ్రహ్మము
బలిబంధన శివముకుంద పరమానందా.
60
కన్నుల ముందఱఁ దెలివై
కన్నది యదికాన్పటంచుఁ గన్న యతండే
పన్నుగ నిజవిద్యాసం
పన్నుఁడగు\న్‌ శివముకుంద పరమానందా.
61
కను వెలుఁగుననే చూచినఁ
గనవచ్చును జీఁకటైనఁ గానఁగ వశమా
గను గంటనె తనుఁ గనవలెఁ
బనివడి తా శివముకుంద పరమానందా.
62
లో వెలిఁ జూచిన నొకటే
లో వెలిఁ గాకుండఁ జూడ లోనగు నొకటే
లో వెలిఁ దానై కనుఁబో
భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా.
63
ఒకటే రెండై తోఁపఁగ
నొకటిని జెప్పంగ వలసె యొకటై యున్న\న్‌
యొకటి నొక టేల సేయను
బ్రకటముగా శివముకుంద పరమానందా.
64
త న్నెఱుఁగనిదియు ఒకటే
త న్నెఱిఁగినయదియు నొకటె తా నన రెండై
యున్నది యొకటే సత్యము
పన్నుగ నిఁక శివముకుంద పరమానందా.
65
మఱచినయదియును నొకటే
మఱపున నెఱిఁగెడిది యొకటె మఱువని దొకటే
మఱ పెఱుక కాని దొకటే
పరమాత్మా శివముకుంద పరమానందా.
66
చూడఁగఁబడినది యొకటే
వేడుకఁ జూచెడిది యొకటె వీనికి వెలియై
చూడఁగవలసిన దొకటే
పాడి యిదే శివముకుంద పరమానందా.
67
కానఁగఁబడినది కాన్పును
మానుగఁ గనుఁగొన్నవాఁడు మఱివీనికి లోఁ
గానియతండును దానే
భానునుతా శివముకుంద పరమానందా.
68
ఇలఁ బసిఁడి లేక యేసొ
మ్ములు గలుగునె తాను లేక మునుకొని జగముల్‌
పొలుచునె యది తాఁ గాదా
బలిబంధన శివముకుంద పరమానందా.
69
జీవునకుఁ గాక దేవుఁడు
దేవునికి న్వేఱె యొక్క దేవుఁడు గలడే
దేవుఁడు తానే యనఁ గను
భావజ్ఞుఁడు శివముకుంద పరమానందా.
70
మొదటను విత్తే జగమై
యదియే లేనట్టు దాని కగునాధారం
బది దీనియందె నిలుచును
పదిలముగా శివముకుంద పరమానందా.
71
అతులిత సుజ్ఞానముచే
క్షితిలోపల జీవముక్తిఁ జెందకయుంటే
వెతగాదె తాను బ్రతికిన
బ్రతుకెల్లను శివముకుంద పరమానందా.
72
తనువెత్తఁ జేటు కింకా
తను వెత్తఁగఁజూతు రేమొ తామసులు భువి\న్‌
దనువు చెడి ముక్తి దొరకే
పని బూనరు శివముకుంద పరమానందా.
73
తలఁపునఁ గలిగినబంధము
తలఁపున నూడంగఁగొట్టి తా మించవలె\న్‌
ములు ముంటఁ బుచ్చువిధమున
బలిబంధన శివముకుంద పరమానందా.
74
యాగంబులు మంత్రంబులు
యోగంబులు మగుడజన్మ మొసఁగును నకటా
యోగులకర్మము లుడుగఁగ
బాగాయెను శివముకుంద పరమానందా.
75
దానంబులు సత్క్రియలును
బూని మఱెన్నైనఁ జేయఁ బుట్టుక చెడునే
దానికి వైరి వివేకము
భానునుతా శివముకుంద పరమానందా.
76
చేయఁగవలసినపని విధి
సేయుటగా కనుచు నెంచి సేయుచుఁ జేసీ
జేయని యాపని యదియును
బాయరయా శివముకుంద పరమానందా.
77
సృష్టికిఁ గలిగినతను విది
నష్టం బని తొలఁగి తన్ను నయముగ నంత
ర్దృష్టిఁ గనలేని మనుజుఁడు
భ్రష్టుఁ డయా శివముకుంద పరమానందా.
78
ఊనము జడమును విత్తును
గానిది చైతన్య మెట్లు గానేర్చునయా
తానే దానికి మూలము
భానునుతా శివముకుంద పరమానందా.
79
తానెఱుఁగనిపని యైన\న్‌
బూనఁగ మది కెట్టు లింపు పుట్టును జెపుమా
దానికి నేరం బే దిఁక
భానునుతా శివముకుంద పరమానందా.
80
అన్నియుఁ దానై యుండగ
నన్నియుఁ దాఁగాక తోఁచె నణఁగక వేఱా
యన్నియుఁ దనలో నైక్యము
పన్నుగ నిఁక శివముకుంద పరమానందా.
81
ఎఱిఁగెడి యెఱుకను గొని తా
నెఱుఁగుదుననువాఁడు జడుఁడు యెఱిఁగెడు నెఱుక\న్‌
మఱచిన యెఱుకే తా నగుఁ
బరమాత్మా! శివముకుంద పరమానందా.
82
ఒండెఱుఁగక తనుగంటే
పండినకాన్పగుచు సర్వపరిపూర్ణం బై
యుండును నదియే కన్నుల
పండు వయా శివముకుంద పరమానందా.
83
యెఱిఁగినయది జడిమంబగు
యెఱుకవిడ\న్‌ శూన్యమగును యెఱుకే యెఱుకై
నిరతిశయానందం బగు
పరమాత్మా! శివముకుంద పరమానందా.
84
కన్నది కన్నట్టే చనె
విన్నది విన్నట్టె యణఁగె వినకే కనకే
యున్నది యే నై యుంటిని
బన్నుగ నిఁక శివముకుంద పరమానందా.
85
కన్నది విన్నది గాకే
యున్నది తుదముట్టఁ గంటి నోహో! యిది నే
నెన్నఁడు నెఱుఁగనిదే సం
పన్నత యో శివముకుంద పరమానందా.
86
మాటల సందెడు నిడఁగను
తాటోటులు గాక దానఁ దత్త్వంబగునే
మాటల తత్త్వము లవి పరి
పాటిగదా! శివముకుంద పరమానందా.
87
మేదినిఁ గుజనులు ఘనులతొ
వాదింతురు నిజముఁ గన్నవారింబలెనే
యేదైనను దూషణ సం
పాదింతురు శివముకుంద పరమానందా.
88
కోటివగవిద్య లెల్లను
కూటికిఁ గా కాత్మవిద్యకును సరియగునే
బూటకము లనక కుజనులు
పాటింపరు శివముకుంద పరమానందా.
89
యోగంబందురు కొందఱు
యోగముగా జ్ఞానమందు రొగిఁ గొంద ఱిల\న్‌
యోగజ్ఞానంబులు సమ
భాగంబులు శివముకుంద పరమానందా.
90
జ్ఞానం బన యోగం బనఁ
గానఁగవలె నొకటికొకటి కావడికుండల్‌
పూనిక నొక్కట నిలువదు
భానునుతా శివముకుంద పరమానందా.
91
ఈకంటఁ జూడ లేఁడట
యేకంటను జూచుటింక నెఱుఁగుట యేలా
గాకన్నే యీకన్నౌ
ప్రాకటముగ శివముకుంద పరమానందా.
92
ఈకనుచూ పాకనుచూ
పేకంబై నిండి నిండి హెచ్చిన సుఖమౌ
వాకునఁ జెప్పఁగ వశమా
ప్రాకటముగ శివముకుంద పరమానందా.
93
దృశ్యము కూడిన తెలివి య
వశ్యము బంధంబుసుమ్ము వర్ణింపంగా
దృశ్యముఁ బాసినతెలివి యు
పాస్యం బది శివముకుంద పరమానందా.
94
బంధములగు కర్మంబులు
సంధింపక దృశ్యములను జ్ఞానాగ్నికిఁ దా
నింధనములు సేయఁగవలె
బంధురగతి శివముకుంద పరమానందా.
95
చెన్నుగ దీపముఁ జూడఁగ
నెన్నగఁ వేఱొక్కదీప మేఁటికిఁ జెపుమా
తన్నుండే తనుఁ గనవలెఁ
బన్నుగ నిఁక శివముకుంద పరమానందా.
96
అజ్ఞాని యొకఁడు గల్గఁగ
సుజ్ఞానిఁగఁ జేయవలసె సుజ్ఞానైతే
సుజ్ఞాని నేల చేయను
ప్రాజ్ఞుఁడనా శివముకుంద పరమానందా.
97
ధరలో విధియు నిషేధము
నెఱుఁగడు తద్‌జ్ఞుండు మింటి కెగిరెడు తురగం
బెఱుఁగునె మిట్టయుఁ బల్లముఁ
బరమాత్మా శివముకుంద పరమానందా.
98
దూషణ యసూయకొఱకే
భాషాంతరరచన లెల్ల బ్రతుకులకొఱకే
వేషము వంచనకొఱకే
పాషండము శివముకుంద పరమానందా.
99
మెండుగ లోకులవలెఁ దా
నుండఁగవలెఁ గూడకున్న నొక్కెఁడ మౌనై
యుండఁగవలె నేర్పరియగు
పండితునకు శివముకుంద పరమానందా.
100
ఇద్ధర నయ్యష్టమహా
సిద్ధులు వలె ననుచు భ్రాంతిఁ జెందుదురేమో?
సిద్ధం బగుముక్తికిఁ బ్రతి
బద్ధంబులు శివముకుంద పరమానందా.
101
అణిమాదిసిద్ధపురుషులు
గుణవంతులుగాఁగ జనులు కొనియాడుదు రా
గుణహీనులఁ బొగడుదురే
ఫణిశాయీ శివముకుంద పరమానందా.
102
ఒకతుచ్ఛసిద్ధిఁ జూపిన
సకలజనుల్‌ వానిఁ జూచి సన్మానముగా
సకలంకజ్ఞా నందురు
ప్రకటముగా శివముకుంద పరమానందా.
103
అణిమాదిసిద్ధు లెల్లను
గణుతింపఁగ మోక్షవిధము గా దెట్లంటే
నణిమాదులు సగుణంబులు
ఫణిశాయీ శివముకుంద పరమానందా.
104
సిద్ధులు జ్ఞానం బగునా
సిద్ధియు దృశ్యంబు లవియుఁ జేపట్టుదురా
శుద్ధములు గానిసిద్ధు ల
బద్ధంబులు శివముకుంద పరమానందా.
105
మహిమఁ గనలేరు లోకులు
మహిలో బోధం బపారమహిమ యదెగదా
మహిమవలె నందురజ్ఞులు
బహుళముగా శివముకుంద పరమానందా.
106
ఇహమందలి మంత్రౌషధ
విహితము లీవిధులలో వివేకములేకే
మహి మని చూతురు మూఢులు
బహుమతిగా శివముకుంద పరమానందా.
107
సుజ్ఞాన మహిమ యెప్పుడు
సుజ్ఞానియె యెఱుఁగనేర్చు సుస్థిరమతి యై
యజ్ఞాని తెలియనేర్చునె
ప్రాజ్ఞునిగతి శివముకుంద పరమానందా.
108
పరమానందయతీశ్వర
విరచిత మీశతక మిలను విఖ్యాతముగా
కరుణింపు త్రిజగధీశ్వర
పరమాత్మా శివముకుంద పరమానందా.
109
పరతత్త్వం బిది శతకము
పరమరహస్యంబు ముక్తిభాజన మిలలో
వరయోగివిలాసం బిది
పరమాత్మా శివముకుంద పరమానందా.
110
హరిహర గిరిధర పురహర
గరుడధ్వజ నీలకంఠ కనకాంబర శం
కర మాధవ గౌరీధవ
పరమాత్మా శివముకుంద పరమానందా.
111
AndhraBharati AMdhra bhArati - shatakamulu - SivamukuMda Satakamu shatakamu - telugu tenugu andhra ( telugu andhra )