శతకములు చిరవిభవశతకము కూచిమంచి తిమ్మకవి

కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

చిరవిభవశతకము - కూచిమంచి తిమ్మకవి
చ.సిరిమగఁడున్ బితామహుఁడుఁ జేరి భజింపఁగ వెండికొండపై
సరస నవేందుకాంతమణిసౌధమునందుఁ బసిండిగద్దెపై
గిరిసుతఁ గూడి వేడుకలఁ గేరెడు నిన్ను మదిన్ దలంచెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
1
చ.కరులు హరుల్ చమూవరులు గాటపు మేల్‍నగరుల్ కడానిబం-
గరులు సరుల్ తలోదరులు గంధమిళన్మృగనాభిచందనా-
గరులు విరుల్ జగాసిరులు గల్గి సుఖింత్రు త్వదీయులౌ నరుల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
2
చ.పరమకృపార్ణవా! తుహినపర్వతరాజకుమారికాధవా!
వరవృషసైంధవా! కుటిలవైరినిశాటసమిద్ధవా! మనో-
హరకరసారసాగ్రనిహితాజిగతానతబాంధవా! శివా!
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
3
చ.నిరుపమ కూచిమంచికులనీరధిచంద్రుడు గంగమంత్రికిన్
బరమపతివ్రతామణియు భాగ్యసమన్వితయైన లక్ష్మికిన్
వరసుతుఁడై న తిమ్మకవివర్యుఁడ నే శతకం బొనర్చెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
4
చ.శరనిధి కర్ఘ్యమిచ్చు క్రియ సారసబంధున కారతిచ్చు వై-
ఖరి నిఖిలాబ్జజాండచయకర్తకు నీకు సమగ్రభక్తి శ్రీ-
కరముగఁ గోరి యొక్కశతకంబు సమర్పణ సేయఁబూనితిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
చ.మరలని భక్తితోడ మును మల్హణబిల్హణముఖ్యసత్కవీ-
శ్వరులు కవిత్వవైఖరిని సారెకు నిన్ బ్రణుతించి ధన్యులై
బరగిరటంచు నేను నినుఁ బద్యముఖంబుగ సంస్మరించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
6
చ.హరిముఖసర్వదిక్పరివృతార్చితపాదసరోజుఁడైన య-
క్కరిముఖుఁ డెప్పుడున్ వితతకౌతుకలీలఁ బొసంగఁజేయుఁబో
నిరతముగాఁ ద్వదీయపదనీరజభక్తు లొనర్చు సత్కృతుల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
7
చ.శరశరదిందుకుందహరిచందనహారతుషారతారకా-
దరఘనసారవర్ణ వరదండశుకాంబుజపాణి వాణి యా-
దరమునఁ బ్రోచుచోఁ గవికదంబము నిన్బ్రణుతించు ధన్యమై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
8
చ.తరలని భక్తి నా హృదయతామరసంబున సంస్మరింతు దు-
ర్భరదురితాంధకారవిసరప్రసరన్నళినీసుహృల్లస-
త్కిరణములైన దెందులురి దివ్యకులోద్భవు లింగనార్యు స-
ద్గురుచరణంబు లుగ్రభవతోయధిసంతరణంబు లెప్పుడున్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
9
చ.గురుతరలీలఁ బీఠపురి కుక్కుటలింగమహాప్రభుండవై
బరగెడు నిన్ను నేనిపుడు భక్తి దలర్పఁగ నాశ్రయింతు నీ
వరకరుణానిరీక్షణము వాలెము నాపయి నిల్పి ప్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
10
చ.నరవతి కొక్కకావ్యమిడినన్ ధనధాన్యమణీచోళముల్
పురములు వాహనంబులు విభూషణగోవసుధాదికంబులుం
గురుకృపనిచ్చి బ్రోచు నిదిగో మరి నీవిఁక నేమియిచ్చెదో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
11
చ.హర పరమేశ శంకర పురాంతక భర్గ గిరీశ చంద్రశే-
ఖర మృడ కృత్తివాస శితికంధర శర్వ నగేంద్రజామనో-
హర శివ మృత్యుసంహర యటంచు నిను న్స్మరియింతు నెప్పుడున్,
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
12
చ.కరయుగళంబు మోడ్చి కుతుకంబున మ్రొక్కెద సర్వదేవతా-
పరివృఢమౌళిభాగ్మకుటపంకజరాగమణిప్రభాచ్ఛటా-
నిరతవిరాజమానరమణీయభవచ్చరణాగ్రపీఠికిం
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
13
చ.తరమె నుతింప నేరికిని దావక దివ్యపదప్రభావమున్
గరికిని సాలెపుర్వునకు గాడుపుదిండికి మోక్షమిచ్చి యా-
దరమున నేలుకొంటివట దాన వరేణ్యులఁ బ్రోచుటబ్రమా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
14
చ.తరలని భక్తి నెల్లపుడు ధ్యానము సేతు తుషారధారుణీ-
ధరవరకన్యకావిలసితస్తనకుంభవిలిప్తకుంకుమా-
గరుఘనసారచందనసుగంధవిభాస్వదురఃస్థలు న్నినున్
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
15
చ.శరధిశయాంబకాయ రవిచంద్రకృపీటభవాంబకాయ గో-
పరివృఢకేతనాయ సితపర్వతకూటనికేతనాయ సు-
స్థిరకరుణామతే భగవతే శివ తే నమ యంచు మొక్కెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
16
చ.సరసీరుహాక్ష పద్మభవ శక్ర కృశానుకృతాంత యామినీ-
చర వరుణానిలైలబిల చంద్రకిరీట సుధామయూఖ భా-
స్కరముఖదేవతాప్రముఖసర్వము నీవె యటంచు వేఁడెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
17
చ.శిరములు వేయిగల్గు నహిశేఖరుఁడైన చతుర్ముఖంబులన్
బరగు విధాతయైన సులభంబుగ నొక్కిసుమంతయైన నీ
చరితము లెన్నఁజాలరట శక్తులమే మముబోంట్ల మెన్నఁగాఁ
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
18
చ.వరుణభవాత్రిగౌతములు వ్యాసవసిష్ఠఘటోద్భవుల్ పరా-
శరసుతకణ్వకౌశికులు జహ్నుశమీకముఖాఖిలర్షిశే-
ఖరులు నుతింపఁజూలరటకా నిను మాదృశు లెన్ననేర్తురే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
19
చ.హరిణము ఢక్క శూలము గజాజిన మెక్కువకన్ను పాపరా-
సరములు బూదిపూత వినుజక్కర లేనెలపున్క లెద్దు దా
నిరుమెయి కప్పు కుత్తుకయు నెమ్మిగఁ గల్గు నిను న్భజించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
20
చ.ధరణి రథంబుగా శృతివితానము వాజులుగా రమామనో-
హరుఁడు శరంబుగా మరుదహార్యము సింగిణిగా బిలేశయే-
శ్వరుఁడు గుణంబుగా నలువ సారథిగాఁ దిగప్రోళ్లఁ గూల్చితౌ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
21
చ.హరి మిము వేయుపద్మముల నర్చన చేసిన సర్వలోకభీ-
కరఖరదైత్యసంహరణకారణమై కనుపట్టు చుట్టువా-
లరుదుగ నిచ్చిమెచ్చి భువనైకధురంధరుఁ జేసి యేలితో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
22
చ.తరణిసుతోగ్రపాశవితతవ్యథ గాసిలి స్వేతుఁ డర్థి నిన్
స్మరణము నొంద నజ్జము వెసం బడదన్ని ధరామరోత్తమున్
గరమనురక్తిఁ బ్రోవవె జగంబున శాశ్వతజీవిఁ జేసి మేల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
23
చ.అరుదుగ నింద్రకీలగిరి నర్జునుఁ డుగ్రతపం బొనర్చుచో
నరిగి కిరాతరూపమునఁ జక్కఁగ నిల్చి కరంబు వానితో
దురమొనరించి మెచ్చి కృపతోడుతఁ బాశుపతాస్త్రమీయవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
24
చ.సురలును దైత్యులుం గదసి స్రుక్కక వార్ధి మధింపుచున్నచో
నురుగతినందు హాలహల ముద్భవమై జగముల్ హరింప న-
గ్గరళము కంఠసీమనిడి కావవె లోకములెల్ల నాఁదటన్
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
25
చ.కిరికలహంసరూపములఁ గృష్ణుఁడు నంబురుహాసనుండు నీ
చరణములున్ శిరంబు గనఁ జాగి రసాతలము న్నభంబు వే-
సరి వెదుకంగ వారికిఁ బ్రసన్నతనొందవె లింగమూర్తివై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
26
చ.శరధిశయానుఁడైన హరి సారసబంధుకులంబునందు దా-
శరథి యనం జనించి బహుసంఖ్యలు మీఱిన లింగమూర్తులన్
సరవిఁ బ్రతిష్ఠఁ జేసెనఁట శక్యమె నీ యధికత్వమెన్నఁగాఁ
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
27
చ.గరువముతోడ నిన్ను వెలిగా నిడి దక్షుఁడు జన్న మొక్కెడన్
హరిహయపుండరీకనయనాబ్జభవాదులఁ గూర్చి చేయుచో
నరుదుగ వీరభద్రభయదాకృతిఁ గైకొని సంహరింపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
28
చ.కరమరుదార నల్వఁ దనకన్న ఘనుండగు వేల్పు లేఁడటం-
చురుగతి దేవతాసభ దురూక్తులు బల్కఁగ నల్గి వాని దు-
ర్భరతరగర్వభారమును బల్వడిఁ ద్రుంపవె భైరవాకృతిన్
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
29
చ.అరయ మృకండుసూనుఁడు నిరంతరమృత్యుభయాకులార్తుఁడై
వెఱవు దలిర్ప నిన్ శరణు వేడిన మిత్తి నడంచి యమ్మునీ-
శ్వరసుతుఁ బ్రోచినాఁడవట శాశ్వతజీవునిఁ జేసి వాసిగాఁ
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
30
చ.ముఱియుచుఁ గాశికాపురిని మూఢత బాహువులెత్తి ధారుణీ-
ధరములకన్న నెవ్వఁడును దైవము లేడని పల్కు నప్పరా-
శరసుతు బాహుయుగ్మకము స్తంభనమొందఁగఁ జేసి కుంచవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
31
చ.అరయ నశేషలోకముల కాఢ్యుఁడ వీవె నిజంబు బాలిశు-
ల్మెఱమెఱగాఁ దలంత్రు కడిమిం బహిరంతరలోకరక్షకై
గరళము కంఠమూలమున గట్టిగ నిల్పు టెఱుంగరేమొకో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
32
చ.హరి నరసింహరూపధరుఁడై సమరాగ్రమహోగ్రభంగి న-
బ్బురమొదవన్ హిరణ్యకశిపు న్బరిమార్చి చెలంగుచున్నచో
సరగఁ దదుగ్రతం శరభసాళువదేహుఁడవై యడంపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
33
చ.సరసవిహారలీల విటజంగమరూపముతోడ నేగి య-
బ్బురముగ మున్ను భల్లణుని పత్నిని చల్లమదేవిఁ గోరి యా
గురుకుచ కౌఁగిట న్నిలవె గోమెలయ న్నెలనాళ్లపట్టివై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
34
చ.ఇరవుగ దారుకావనమునీంద్రవధూతిలకంబుల న్మనో-
హరవటుకాకృతిం బొలిచి యబ్జశరాహవలీలలం గడున్
గరచిన నీ విలాసరతికౌశలముల్ గణుతింప శక్యమే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
35
చ.సరభసలీల మున్ముసలిజంగమువై చిరితొండనంబి మం-
దిరమున కేఁగి తత్తనయునిం బొలకై వధియింపఁజేసి చె-
చ్చెర నిజమూర్తి చూపి కృప చిప్పిల వానిఁ గృతార్థుఁ జేయవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
36
చ.దొరకొని చెప్పుగాల తలఁ ద్రొక్కి యొకించుక నంజు డెంగిటన్
బొరసిన దప్పనంబొసఁగి పుక్కిటనీ ర్మెయిఁ జిల్కు బోయకున్
సరగున మోక్షమిచ్చితఁట సజ్జనకోటుల కిచ్చు టబ్రమే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
37
చ.ఇరుసతలోకము ల్మహిమ నేలెడు స్వామివి నిన్ను వాకిటన్
దరలకయుండ గాపునిచి ధన్యతఁ జెందిన బాణదైత్యుఁ డే
కరణిని నిన్ను మున్నెరవు గ్రాలఁగఁ బూజ యొనర్చెనో కదా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
38
చ.మెరమెర లేక నీవు మును మేదరిసెట్టియు బోయలెంకయున్
బెరసుకులంపు చాకలియు బెట్టిన యోగిర మారగించితౌ
సరిసరి నిన్ను నర్చనలు సల్పెడుచో నియమంబులేలయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
39
చ.పురుడె గణింప భక్తసులభుండవు నీకు నిలింపులెల్ల కి-
న్నరనరుఁ డెట్టు లర్చన లొనర్చెనొ కాని కడుం గడిందిగా
సెరబడి చేసి వానికి విచిత్రధనాధిపతిత్వమివ్వవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
40
చ.గరళము కంఠమూలమున గట్టిగ దాల్చుట నీకు నంగదల్
బరగునటంచు రుద్రపశుపత్యభిధానుఁ డెదం గలంగఁగా
నొరిమెర నంగపీఠమున నుంచవె యాతని శాశ్వతంబుగాఁ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
41
చ.విరసముతోడ నిన్ శిలల వ్రేసియు రోకటఁ గ్రుమ్మియున్ గృహాం-
తరమునఁ గాపువెట్టియును సిద్ధముగా వెలివెట్టు కుంటిన-
ల్దిరగఁగఁ జేసినట్టి ఘనులే తగుభక్తవరేణ్యులైరి మేల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
42
చ.సురపతి వేణువుం గలిమికొమ్మమగండు మృదంగవాద్య మం-
బురుహభవుండు తాళమును పొత్తముముత్తవ వీణఁ బూనఁగా
హరిసతి బాడినం జదల నద్భుతతాండవకేళి సల్పితౌ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
43
చ.ఉరగము లెమ్ములుం బునుక లుగ్రపిశాచములుం గళాసముల్
గరళము కంఠమూలమున గట్టిగ నెప్పుడు గల్గియుండియున్
బరమశివాకృతిం బొలుచు భద్రములిచ్చెద వబ్బురం బహా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
44
చ.ఇరవుగ నెల్లలోకముల నేలెడు స్వామివి నీవు కూర్మితో
దొరతనమెల్లఁ బో కడచి తుచ్ఛపుజాలరిపూపకన్నియన్
శిరమునఁ బెట్టుకొంటివఁట చిత్రములౌర భవద్విలాసముల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
45
చ.హరుఁడు మురారి యబ్జభవుఁ డాఢ్యులటంచు పురందరుండు దే-
వర యనుచు న్విభావసుఁడు వహ్నియు వేల్పులటంచు నెంత్రు బు-
ద్ధిరహితమానవు ల్పశుపతిత్వము నీయెడఁ గల్గుటెన్నకే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
46
చ.సరవి విధాతరూపమున సర్వచరాచరముల్ సృజించి శ్రీ-
హరివయి బ్రోదిచేసి నిటలాక్షుఁడవై యడఁగింపుచుందు వ-
బ్బురముగ నీవెకా జననపోషణనాశనకర్త వారయన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
47
చ.శరనిధికన్యనాగ హిమశైలతనూజయనంగ వాణినాఁ
బరగు వధూట్లఁ గూడి భవపాలననాశము లోలిఁ జేయుచున్
హరిహరధాతృమూర్తి వగు నాఢ్యు నినుం గనుగొందు నీశ్వరా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
48
చ.పురుషులలోన విప్రుఁడును పుష్పకదంబములోన జాజియున్
దరువులలోన రావియును దానచయంబుల నన్నదానమున్
ధరణిఁ బ్రశస్తిఁ గన్న ప్రియదైవములం దధికుండ వీవయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
54
చ.పరుసము సోకి లోహము శుభస్థితి బంగరమైన రీతి స-
ద్గురుకరుణానిరీక్షణ మకుంఠితలీల నొకింత సోకినన్
నరుఁడు మహాత్ముఁడై బుధజనస్తుతుఁడై నినుఁ జెందుఁబో తుదిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
55
చ.అరయఁగ నీరబుద్బుదములట్ల నశించుచునుండు మేనులున్
శరధితరంగమాలికల చందమునం గనుపట్టు ఠీవులు
స్థిరమని నమ్మి నిన్గొలువనేరక రిత్త నశింతురౌ ఖలుల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
56
చ.పొరిఁబొరిఁ బుణ్యభూములకు బోవఁగనేలఁ గడు న్దపోమహా-
ధ్వరము లొనర్చనేల యుపవాసములన్ గృశియింపనేటికిన్
హరహర యంచు నొక్కతరి నాడినఁజాలు నఘప్రశాంతికై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
57
చ.తరణిసుధామయూఖవసుధాయజమానసమీరణానలాం-
బరజలమూర్తివైన నిను భక్తిఁ దలంచినవారి కెందులన్
దిరుగఁగనేల యే శిలల నిచ్చలుఁ గోరి భజింపనేలయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
58
చ.సరవి చతుశ్రుతు ల్నిఖిలశాస్త్రపురాణకథారహస్యముల్
విరివిగ నిచ్చనిచ్చలును విందుముగాని తలంచిచూడ మా
గురుచరణంబులాన నినుఁ గొల్వక యేరికి ముక్తి లేదయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
59
చ.గరుడముఁ గన్న పన్నగనికాయములట్ల మృగేంద్రుఁ గన్న కుం-
జరములకైవడిన్ దురితసంఘములెల్లఁ దొలంగి పారుచో
నరుఁడొకచో ననాస్థనయినం భవదాహ్వయ ముచ్చరించినన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
60
చ.ధరణిసురు న్వధించిన మదంబున గోనిధనంబొనర్చినం
గురుసతిఁ గూడినన్ మధువుఁ గ్రోలిన హేమము మ్రుచ్చలించినన్
దొరకొను పాతకంబు లొకతూరి శివా యనినన్ దొలంగుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
61
చ.గురుహరిణేక్షణామణినిఁ గూడిన దుష్కలుషాత్ముఁ జంద్రునిన్
శిరమునఁ బెట్టుకొంటివఁట చెప్పఁగ నబ్రమయారె మేలుమే-
ల్గురుతరభక్తితోడ నినుఁ గొల్చినవారి కిఁకేటిపాపముల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
62
చ.దురితము లేమిసేయు గ్రహదోషపిశాచరుజామృగోరగో-
త్కరభయమేల కల్గు నృపతస్కరవహ్నిభయంబులే ప్రియం
బెరయు నరుం డొకప్డు నినుఁ బేర్కొని నెమ్మది సంస్మరించినన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
63
చ.అరదము లందలంబులు హయంబులు రత్నవిభూషణంబు లం-
బరములు చామరంబులు ద్విపంబులు నాదిగఁ గల్గు ఠీవులు-
న్బొరసెడువారు మిమ్ము మునుఁ బూజయొనర్చినవారె కారయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
64
చ.వెరవిరవార నేపగిది వేఁడినఁ గానియు నియ్యలేని ము-
ష్కరనరనాయకాధముల సావడులం బడి ప్రేలువారికిన్
నిరతకృపార్ద్రదృష్టిమెయి నీవిడ కన్యుఁ డొసంగఁజాలునే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
65
చ.సరయువు గృష్ణ నర్మదయు జాహ్నవి బాహుద తుంగభద్ర భా-
స్కరసుతయు న్సరస్వతియు గౌతమియుం మొదలైన దివ్యని-
ర్ఝరులను మున్గు పుణ్య మొకసారె శివా యనినన్ లభించుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
66
చ.ధర శ్రుతిమంత్రకోటికిఁ ప్రధానము నాగమమాతయైన య-
గ్గురుతరమంత్రరాజమునకుం బతి వీవని లోగణింపకే
వెకవరి కొల్తురౌ ఖలులు వెంగళులై కుఱకుఱ్ఱవేల్పులన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
67
చ.హరువులు దీర్ప నీవు హృదయంబున నెప్పుడు గల్గియుండఁగా
వెరవరి యందు నందులకు వేరడులై చనుచుంద్రు పామరుల్
నెరయఁగ వెన్న చేతినిడి నేతికి ద్రిమ్మరు కైవడిం గటా!
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
68
చ.ఉరగము గాలిఁ గ్రోలి గుహనుండదె యాకులు నించుకోనల-
న్దిరుగదె మేఁక నీళ్ల వెనుదీయకఁ గృంకదె కప్ప యెవ్వరే-
కరణిఁ జరించుచున్న నినుఁ గన్గొనకున్నఁ బరంబు లేదుగా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
69
చ.హరహర! మేరుభూధరమునంత పదార్థము సంగ్రహించిన-
న్సురనగరాభిపత్యము త్రిశుద్ధిగ నబ్బిన రంభయంత సుం-
దరి నిజభార్యయైన మది దార్కొను తృష్ణ యడంగదేరికిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
70
చ.బురుదను హాళితో నురెడిపుర్వు మెలంగుచునుండి యెప్పుడు-
న్బురుద యొకింతయైనఁ దనుఁ బొందకయుండ మెలంగునట్లు నే-
ర్పరి గృహమేధియయ్యు భవబంధమునంటక నిన్నుఁ జెందుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
71
చ.ఒరుల భజింపఁబోడుగద యొక్కపుడు న్నినుఁగొల్చు మేటి భా-
స్వరసరసామ్రభూరుహలసత్కిసలానుభవానుమోదియౌ
పరభృతరాజమెందు నొకపట్టున వేములఁ జేరనేర్చునే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
72
చ.సరవిని జీవనార్థముగ చర్మసితాభసితాక్షమాల లే
నరుడు ధరించు కైతవమునన్ భువినాతఁ డశేషధారుణీ-
భరణధురీణప్రచురభాగ్యసమన్వితుఁడై చెలంగుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
73
చ.సురచిరభక్తితోడ మనుజుం డొక బిల్వదళం బొకప్డు నీ
శిరమున నుంచెనేని యది సింధురసైంధవచామరధ్వజాం-
బరమణిభూషణాది విభవస్ఫురణ న్గనుపట్టి యుండుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
74
చ.నరుఁ డొకనాఁడు నీ నగరు నంగనఁ బట్టి విచిత్రఘంటికో-
త్కరరవమాలకించిన నతండు వినం డెపుడున్ కృతాంతకా-
సరగళఘంటికావ్రజవిశంకటసాంద్రఘణంఘణధ్వనుల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
75
చ.దురదుర జాగి మర్త్యుఁ డొకతూరె సమంచిత తావకీన మం-
దిరమునకుం బ్రదక్షిణ మతిప్రమదంబునఁ జేసెనేని య-
ప్పురుషుఁడు శేషభూభువనపోషణధూర్వహుడై విరాజిలున్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
76
చ.తిరమున నీ నివేశమున దీప మొకానొకనాఁ డొకింత బం-
ధురమతి నిడ్డ ధన్యుఁడు చతుర్ముఖముఖ్యనిలింపమాన్యుఁడై
నిరుపమ తావకీన పద నిత్యసుఖోన్నతుల చెలంగుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
77
చ.కరతలతాళవృంతములుఁ గ్రమ్మఁగ నెవ్వఁడు తావకాలయా-
జిరమున నాఁడు నాతఁడు వసించు విరాజితరాజతావనీ-
ధరశిఖరాగ్రరత్నసముదంచితకాంచనసౌధవీధులన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
78
చ.పరిచితి మీఱ మీ శిరముపై పురిసెండు జలంబొకప్పుఁ డా-
దరమునఁ జిల్కు బల్లిదుఁడు తథ్యముగా నఖిలాఘదూరుఁడై
ధరఁ గల పుణ్యతీర్థములఁ దప్పకఁ గ్రుంకు ఫలంబుఁ జేకొనున్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
79
చ.బెరసిన వేడ్క యుల్లమునఁ బిక్కటిల న్మనుజుండు నీకుఁ గొ-
వ్విరిసరమొక్క టచ్చపువివేకముతోడ నొసంగిన న్బురం-
దరధరణీరుహప్రసవదామవిభూషితుఁడై చెలంగుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
80
చ.కరయుగమెత్తి నీకుఁ గుతుకంబున మొక్కునతండు శేషభూ-
వరమకుటాగ్రరత్నసమవాయసమగ్రవిభాసముల్లస-
చ్చరణసరోజుఁడై వివిధసంపదలం గొదలేక యుండుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
81
చ.తొరలెడు భక్తిఁ గప్పురపు ధూపము నీకు జనుం డొసంగుచో
గొరగొర వానిమేనఁ గల ఘోరతరాఘపిశాచసంఘముల్
బరువడి కూయి వెట్టుచును బారి చనుంగద తత్క్షణంబునన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
82
చ.పరునిఁ బరేశు భక్తజనపాలనశీలు ననంతు నాద్యు న-
క్షరు నపవర్గదాయకు జగన్మయు నద్వయు నప్రమేయు నం-
బురుహభవాండభాండపరిపూర్ణపిచండుఁ దలంతు నిన్మదిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
83
చ.హరునకు వందనంబు ఫణిహారునకు న్శరణ్యార్థి దేవతా-
వరదునకుం జొహారు పురవైరికి మ్రొక్కు నగేంద్రజామనో-
హరునకు జోత యంచు ననయంబును నీకు నమస్కరించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
84
చ.దిరమున స్నానసంధ్యలును దేవ సపర్యలు సువ్రతంబులు-
న్గురుభజనాదికంబులు నకుంఠితభక్తి నొనర్పనేర నీ
చరణము లాశ్రయించితి నిజంబుగ నన్నిక నెట్లు బ్రోచెదో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
85
చ.గురుఁడవు బాంధవుండవు సఖుండవు తల్లివి దండ్రి వన్న వీ-
శ్వరుఁడవు దాత వాప్తుఁడవు సర్వము నీవె యటంచు నమ్మితి-
న్వరదుఁడవై కృపారసము వావిరి నాపయిఁ జిల్కి బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
86
చ.కెరలెడు ఘోరపాపతతికి న్మదిఁ గంపిలి యేయుపాయమున్
దొరకక యొక్క పెన్వెరవు దోచిన నుబ్బుచు నిబ్బరంబుగా
హరహర యంచుఁ బల్కితి నహా! దురితంబులు వీడి పారెఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
87
చ.దొరకెను నాకు భాగ్యమున దుస్సహదండధరప్రచండకిం-
కరపటుదర్పసంహరణకారణమై యయిదక్షరంబులు-
న్బరగిన మంత్రరాజము సుపర్వులకైనఁ దలంక నేనిఁకన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
88
చ.గిరిశ నమోస్తు యోగిజనగేయ నమోస్తు మహోగ్రదోషసం-
హరణ నమోస్తు భోగికులహార నమోస్తు సమస్తదేవతా-
చరణ నమోస్తు తే యనుచు సారెకుఁ గోరి నమస్కరించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
89
చ.వరద పరాకు భక్తజనవంద్య పరాకు సమస్తపాపసం-
హరణ పరాకు భక్తనివహావహదక్ష పరాకు యోగిహృ-
శ్చరణ పరాకు సేయకిఁక సయ్యన నా మనవాలకించవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
90
చ.పరవనితా పరాస్థ నరపాలకసేవలయందుఁ గోరికల్
దొరలఁగనీక నీ చరణతోయజభక్తియు సూనృతోక్తి యె-
వ్వరికినిఁ గీడు సేయమియు వాలెము నా కొనఁగూర్చి బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
91
చ.మురిపెముతోడ నక్షుసరము ల్భసితంబు ధరించినాఁడ మ-
ద్గురువరదత్తమై సకలదోషములన్ దొలఁగించు ద్వాదశా-
క్షరి జపియించినాఁడ కలుషంబులు నాకిఁకఁ గల్గుటెట్లయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
92
చ.మురువుగ నక్షమాలయును మోదికఁ బూనితి భూతి దాల్చితిన్
స్మరణగ నైదువర్ణముల మంత్రము వేమరు నుచ్చరించితిన్
దురితపిశాచముల్ దొరగి దూరముగా జనకుండుటెట్లికన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
93
చ.గురువరభక్తి మీఱ మిముఁ గొల్చినవాఁడనటంచుఁ దద్దయుం
గరువముతోడ నేను కృతకర్మము లెవ్వియుఁ జేయనైతి దు-
ర్భరదురితాత్ముఁడంచును దిరస్కృతిఁ జేయక నన్నుఁ బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
94
చ.ఒరిమెఁ గవీంద్రుఁ డేమెఱుఁగునో యని దర్శనమియ్యనోడి బ-
ల్దొరలును మూలనీగుదురు లోభమున న్నిను నే మఱేమియు-
న్వరములు వేడ నాకిపుడు వైళము దర్శనమియ్యరాగదే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
95
చ.నర పశు పక్ష్మి వేఁట మృగ నాగ ఝషాదిక జంతుయోనుల-
న్బొరిఁబొరి నెన్నిమార్లు మును పుట్టితినో యెఱుఁగ న్మహాఘనుల్
హరు నినుఁ గొల్చు భాగ్య మిపుఁ డబ్బెనికే క్రియఁ బ్రోచెదో సుమీ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
96
చ.ఒరుల నుతింపఁజాలఁ గలుషౌఘమహాదహనాగ్నికీలయై
బరగుచుఁ గామితార్థము లపారముగా నిడు నీదు నామసం-
స్మరణ యహర్నిశంబును బ్రశస్తిగ నాకొనరించి బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
97
చ.కరిముఖ నందిభృంగిరిటికాశిసముద్భవ కాలభైరవా-
ద్యురు బలవన్మహాప్రమథయోధవరేణ్యులు గొల్వ ధారుణీ-
ధరసుతఁ గూడి నాకిపుడు తావక మోహనమూర్తిఁ జూపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
98
చ.సరభసలీల నొక్కనిమిషంబును నిన్భజియింపలేక బల్
దెరవుల దుర్విచారములఁ ద్రిమ్మరుచున్నది యెన్ని చెప్పిన-
న్మరలదు పాపజాతిమతి నాకిపు డంకెము గాదికెట్లయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
99
చ.అరయఁగ నే నహర్నిశము నాఁడెడు వాక్యములెల్లఁ దావక
స్ఫురణగఁ జిత్తగించి కలుషప్రకరంబులఁ బారఁదోలి నీ
చరణసరోజభక్తి కొనసాగఁగఁజేపీ సముద్ధరింపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
100
చ.ఇరవగు భక్తితోడ జనుఁ డీశతకంబుఁ బఠించిన న్సమా-
దరమున వ్రాసిన న్వినినఁ దప్పవుగా వివిధేష్టభోగముల్
ధర భుజియించి యా తుదిని తావక దివ్యపదంబుఁ జేరుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
101
సంపూర్ణము.
చిరవిభవశతకము - కూచిమంచి తిమ్మకవి - ఆంధ్రభారతి - శతకములు - చిరవిభవ శతకము చిరవిభవశతకం చిరవిభవ శతకం - శతకాలు ChiravibhavaSatakamu - Kuchimanchi Timmakavi - Chiravibhava Satakamu ChiravibhavaSatakam Chiravibhava Satakam - AndhraBharati AMdhra bhArati - shatakamulu - telugu Satakamulu - Telugu Satakalu - tenugu andhra ( telugu andhra )