శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
శా. శ్రీకైవల్యరమాధినాథ నిను నర్థిం గీర్తనల్‌జేసి కా
దా కంజాతభవేంద్ర నారద శుకవ్యాసాంబరీషార్జునుల్‌
నీకారుణ్యముఁ గాంచుటల్‌ ననుమతి\న్‌ నేనెంతధన్యుండనో
నాకుఁ జేకురె నట్టిభాగ్యములు కృష్ణా దేవకీనందనా.
1
శా. శ్రీవైకుంఠనివాసగోత్రధర లక్ష్మీనాథ గోపాల లీ
లావిర్భావ పతంగవాహ యదువంశాంభోధిచంద్రోదయా
నీవే దిక్కని యున్నవాఁడను దయన్‌ వీక్షించి రక్షించవే
నావిజ్ఞాపన మాలకించు మది కృష్ణా దేవకీనందనా.
2
శా. శ్రీరామావసుధాకళత్రములపైఁ జెన్నొందు పాదాబ్జముల్‌
గారామారఁగఁ జూచి శేషఫణి దాఁ గౌతూహలంబొప్పఁగా
క్షీరాంభోనిధిఁ బవ్వళించి యమరుల్‌ సేవింపఁగా నొప్పుని
న్నారాధింతు మదీయచిత్తమునఁ గృష్ణా దేవకీనందనా.
3
శా. నీడల్‌ దేఱెడు చెక్కుటద్దములతో నిద్దంపుఁగెమ్మోవితో
కూడీకూడని చిన్నికూకటులతో గోపార్భకశ్రేణితో
వ్రీడాశూన్య కటీరమండలముతో వేడ్క\న్‌ వినోదించుచు
న్నాఁ డా శైశవమూర్తి నేఁ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా.
4
శా. అందెల్‌ చిన్నిపసిండిగజ్జియలు మ్రోయ\న్‌ మేఖలాఘంటికల్‌
క్రందై మ్రోయఁగ రావిరేకనుదుట\న్‌ గంపింప గోపార్భకుల్‌
వందారుల్‌ గన వెన్నముద్దలకు నై వర్తించు మీబాల్యపుం
జందం బాదివిజుల్‌ నుతించుటలు కృష్ణా దేవకీనందనా.
5
శా. వేదోద్ధారకుఁగా సుధాప్రభువుఁగా విశ్వంభరావాహుఁగా
వాదావిర్భవుఁగా త్రయీవటువుఁగా వర్ధిష్ణుతాయుష్యుఁగా
కోదండాశుగపాణిఁగా బలునిఁగా ఘోరవ్రతచ్ఛేదిఁగా
నాదిబ్రహ్మముఁగాఁ దలంతు మదిఁ గృష్ణా దేవకీనందనా.
6
మ. అమరుల్మ్రొక్కులచే మునుల్‌ నుతులచే నార్యుల్మహానిష్ఠచే
సమరోత్సాహజనుల్‌ పునశ్చరణచే సాధుల్‌ దయాబోధచే
నమితోదారకళాఢ్యు లర్పణలచే నధ్యాత్ము లైక్యంబుచే
సమతం గాంచిరి మీపదాబ్జములు కృష్ణా దేవకీనందనా.
7
మ. జపముల్‌ సేయఁగ నేర నీమమున నిచ్చ ల్పూజ సేయంగలే
నుపవాస వ్రతభక్తి చొప్పెఱుఁగ వేదోక్తక్రమస్థుండఁగా
నపరాధంబులు నాయెడం దఱచు నే నజ్ఞాని నెబ్భంగుల\న్‌
జపలుం డంచు నుపేక్ష సేయకుము కృష్ణా దేవకీనందనా.
8
మ. సుకరంబై సురసేవ్యమై సులభమై సువ్యక్తమై యుక్తమై
ప్రకటంబై పరమార్థమై ప్రమదమై ప్రద్యోతమై పథ్యమై
యకలంకామృతమై యమోఘతరమై యానందమై యందమై
సకలంబు\న్‌ భరియించు మీమహిమ కృష్ణా దేవకీనందనా.
9
శా. కొండల్వంటి కవీశ్వరుల్‌ శతకము ల్గూర్పంగఁ గోటానకో
ట్లుండ\న్‌ నీవును జెప్పఁబూనితి వదేమో యంటివా వింటివా
వండేనేర్పులఁ బెక్కురీతుల రుచుల్‌ వర్తింపవే శాకముల్‌
దండి\న్‌ నామన వాలకింపు మదిఁ గృష్ణా దేవకీనందనా.
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )