శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
శా. శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబు ధా
రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్‌
దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలు సద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
1
శా. వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని
ర్వాణశ్రీఁ జెఱపట్టజూచిన విచారద్రోహమో నిత్యక
ల్యాణక్రీడలఁబాసి దుర్దశలపాలై రాజలోకాధమ
శ్రేణీద్వారము దూరఁజేసెదిపుడో శ్రీకాళహస్తీశ్వరా!
2
శా. అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్‌ సదా
కాంతల్పుత్రులు నర్థమున్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా!
3
శా. నీనా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబునేఁ
గానింబట్టక సంతతంబు మదివేడ్కన్గొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
మ. భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముఁడై వీఁడు న
న్ను వివేకింపఁడటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ
ట్టవు? బాలుండొకచోట నాటతమితోడన్నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపకయుండునా కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!
5
శా. స్వామిద్రోహముఁజేసి యేనొకని గొల్వంబోతినో కాక నే
నీమాటన్విన నొల్లకుండితినో నిన్నేదిక్కుగాఁ జూడనో
యేమీ యిట్టి వృథాపరాధినగు నన్నీ దుఃఖవారాశి వీ
చీమధ్యంబున ముంచియుంపఁదగునా శ్రీకాళహస్తీశ్వరా!
6
మ. దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సా
నువు నీ విల్లు, నిధీశ్వరుండు సఖుఁ, డర్ణోరాశి కన్యావిభుం
డు విశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ
చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
శా. నీతో యుద్ధముఁ జేయనోప, గవితా నిర్మాణశక్తిన్నినుం
బ్రీతుంజేయఁగలేను, నీకొఱకుఁ దండ్రిం జంపఁగాజాల నా
చేత న్రోకట నిన్ను మొత్త వెఱతుం జీకాకు నాభక్తియే
రీతి న్నాకిఁక నిన్నుఁ జూడఁగలుగున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
8
మ. ఆలుంబిడ్డలు దలిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడఁగట్టినాఁడవిఁక నిన్నేవేళఁ జింతింతు ని
ర్మూలంబైన మనంబులోనఁ గడుదుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
సీలామాలపుఁజింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా!
9
శా. నిప్పై పాతకతూల శైలమడఁచు న్నీనామమున్మానవుల్‌
తప్పన్‌ దవ్వులవిన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్‌
తప్పుందారును ముక్తులౌదురని శాస్త్రంబుల్మహాపండితుల్‌
చెప్పంగాఁ దమకింక శంకవలెనా శ్రీకాళహస్తీశ్వరా!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - shrii kaaLahastiisvara shatakamu ( telugu andhra )