శతకములు కృష్ణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
క. శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారకనిలయ జనార్దన
కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా.
1
క. నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగఁ గృష్ణా.
2
క. నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవవైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయగఁ గృష్ణా.
3
క. హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్త్వము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా.
4
క. క్రూరాత్ముఁ డజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందనుఁ బిలువ
నేరీతి నేలుకొంటివి
యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా.
5
క. చిలుక నొకరమణి ముద్దులు
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరన్‌
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరఁగ మిముఁ దలఁచు జనుల కరుదా కృష్ణా.
6
క. అక్రూరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుందా
శక్రాది దివిజసన్నుత
శుక్రార్చిత నన్నుఁ గరుణ జూడుము కృష్ణా.
7
క. నందుని ముద్దుల పట్టివి
మంధరగిరిధరుని హరిని మాధవు విష్ణున్‌
సుందర రూపుని మునిగణ
వందితు నినుఁ దలఁతు భక్త వత్సల కృష్ణా.
8
క. ఓ కారుణ్యపయోనిధి
నా కాధారంబ వగుచు నయముగఁ బ్రోవ\న్‌
నాకేల యితర చింతలు
నాకాధిపవినుత లోక నాయక కృష్ణా.
9
క. వేదంబులు గననేరని
ఆది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నాదిక్కుఁజూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగఁ గృష్ణా.
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kR^ishhNa shatakamu ( telugu andhra )