శతకములు కుక్కుటేశ్వరశతకము కూచిమంచి తిమ్మకవి

కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

పీఠిక - స్వామీ శివశంకరస్వామీ
(శతకసంపుటము ద్వితీయభాగము - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ, 1968)

కుక్కుటేశ్వరశతకము - కూచిమంచి తిమ్మకవి
సీ.శ్రీకరధవళాంగ, శ్రితజనావనసంగ, | కరనివిష్టకురంగ, పురవిభంగ,
తరణిచంద్రరథాంగ, ధరణీతలశతాంగ, | విదళితానంగ, గోవృషతురంగ,
వలయీకృతభుజంగ, విలసితఖట్వాంగ, | ధృతనభోగంగ, వార్నిధినిషంగ,
మునిమనోంబుజభృంగ, ఘనసమరాభంగ, | అతిదయాపాంగ, పుణ్యాంతరంగ,
 
తే.శైలజానుంగ, నీకొక శతక మిపుడు | కూర్చి యర్పింతుఁ గైకొమ్ము, కోర్కె లిమ్ము,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
1
సీ.కొక్కుఁ జొక్కువయాళి జక్కి నెక్కెడి వేల్పు | మినుసికయెకిమీని యనుఁగుఁబట్టి
మేల్కడాని పసిండిమేని జేజేమిన్న | యిద్దఱుతల్లుల ముద్దుఁగొడుకు
గుజ్జుదేవర వ్రేలుబొజ్జ మేటిమగండు | మొలకపూవుల పూజ నలరు వలఁతి,
చిలువజన్నిదముల చెలువుండు సికను లేఁ- | దొగవిందుతునె పూను సొగసుకాఁడు
 
తే.నను గజాననుఁ డెపుడు నిన్ బొగడు కృతులఁ | జిరకృపాస్ఫూర్తి సంపూర్తి సేయుచుండు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
సీ.గురుతరకౌండిన్యగోత్ర పవిత్రుండ | గంగనమంత్రిశేఖరుని సుతుఁడ
కూచిమంచన్వయాకూపార చంద్రుండ | వితతతావకకృపావీక్షణాప్త-
సత్కలితామహాసామ్రాజ్యభార ధౌ- | రేయుండ బుధజనప్రియ సచివుఁడ
ఘన దెందులూరి లింగన గురూత్తమదత్త | సారశైవాచార సంగ్రహుఁడను
 
తే.తిమ్మకవిచంద్రుఁడను నేను దివిరి నీకు | శతక మర్పింతుఁ గైకొమ్ము సంతసమున,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
3
సీ.కౌశిక కౌండిన్య కపిల కశ్యప కణ్వ | కౌత్స కాత్యాయన కలశజులును
జహ్ను జరత్కార జాబాలి జమదగ్ని | జలజభవాత్మజ జైమినులును
మందపాల మతంగ మౌసల మౌద్గల్య | మాండవ్య మైత్రేయ మంకణులును
వల్మీకభవ వత్స వాలఖిల్య వశిష్ఠ | వరతంతు వామదేవ ప్రముఖులును
 
తే.నిక్కముగ నిన్ను వర్ణింపనేర రనఁగ | నెంతవారింక నరులు ని న్నెఱిఁగి పొగడ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
4
సీ.దండ ముద్దండదోర్దండకోదండవి- | ఖండిత చండవేదండ, నీకు!
జోహారు హారామరాహారనీహార- | గోహర గోహీరదేహ, నీకు!
నతి శతక్రతుముఖాదితిసుతాతతకృత- | స్తుతికృతామితహిత కుతుక, నీకు!
జేజే పరాజితోగ్రాజివిరాజిత- | వ్యాజనిరీజసమాజ, నీకు!
 
తే.వందన ముదార దారుకావనమునీంద్ర- | సుందరీబృందమానసానంద, నీకు!
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
5
సీ.తపననందన భటోద్దండ చండభుజంగ | మేఘభీషణ విహంగోత్తమంబు
బహుజన్మసంచిత బ్రహ్మహత్యాముఖో- | గ్రౌఘకాలాభ్ర ఝంఝూనిలంబు
భూతవేతాళప్రభూత వాతజ్వరా- | ద్యామయారణ్య దావానలంబు
ఘోరదారిద్ర్యవికారభారోదగ్ర- | వారణానీక కంఠీరవంబు-
 
తే.నైన వంచాక్షరిని భక్తి యతిశయిల్లఁ | దవిలి జపియించు వారెపో ధన్యతములు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
6
సీ.అమర మస్తకకిరీటాంచిత మనోవిభా- | నీరాజితాంఘ్రిపంకేరుహునకు
శైలకన్యాఘనస్తనవిలిప్తమృగీమ- | దాంకిత విపుల బాహాంతరునకు
గగనతరంగిణీకల్లోలమాలికా- | శోభిత పటు జటాజూటునకును,
మరుదీశనీలోపమానమానిత మహా- | కాకోలరుగ్జాల కంధరునకు
 
తే.నీకు నతులు సమర్పించి నిష్ఠతోడఁ | గొల్చువారలె శమనుని గెల్చువారు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
7
సీ.అభవు నక్షయు నాద్యు నవ్యక్తు నవ్యయు | ననఘు ననంతు నాద్యంతరహితు
నప్రమేయు నజేయు నకలంకు నసమాను | నానందమయు నాఢ్యు నాత్మరూపు
నచలు ననామయు నఖిలేశు నద్వయు | నార్తరక్షాచణు ననఘహృదయు
నమలాత్ము నజుగురు ననవద్యు నభయదు | నసహాయు నతిపుణ్యు నగ్రగణ్యు
 
తే.నహరహంబును నిను భక్తి నాత్మఁ దలఁచు | పుణ్యమతులకుఁ గడు సులభుఁడవు నీవు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
8
సీ.సర్వసర్వంసహాస్థలి శతాంగము గాఁగ | రవిసుధాకరులు చక్రములు గాగ
వాణీవిలాసినీవరుఁడు సారథి గాఁగఁ | బ్రామిన్కుగములు బాబాలు గాగ
రత్నసానుధరాధరము కార్ముకము గాగ | నాగాధినాథుండు నారి గాగ
పంకజాతాక్షుండు కంకపత్రము గాఁగ | బర్హిర్ముఖులు వీరభటులు గాఁగఁ
 
తే.గూర్చి బారులు దీర్చి చిట్టార్చి పేర్చి | యోర్చి పురదానవులఁ దెగటార్చితీవు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
9
సీ.రక్షించితివి కదా రవిసూను బడఁదన్ని | చిరకృపామయబుద్ధి శ్వేతకేతు
భక్షించితివి కదా బ్రహ్మాండనివహకో- | లాహలభయద హాలాహలంబు
శిక్షించితివి కదా శితఖడ్గధారాంచ- | లమున దక్షాంధకప్రముఖ ఖలుల
వీక్షించితివి కదా వితతఫాలానల- | జ్వాలచే మరుని భస్మంబు గాఁగ
 
తే.నిగ్రహానుగ్రహప్రౌఢి నీకె కాక | కలదె తక్కిన చిఱుత వేల్పులకు నెల్ల,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
10
సీ.పలుకుఁగ్రొన్ననఁబోఁడి కులుకు వీణియ మీట | వేయుఁగన్నులవేల్పు వేణువూదఁ
గలుములతొగకంటి చెలఁగి గానము సేయ | నలువ కైతాళ మింపలర వ్రేయ
మధుదైత్యమథనుండు మద్దెల వాయింప | సకలపారిషదు లెచ్చరికసేయ
నందిభృంగీశు లందంద సందడి దీర్ప | మొనసి దేవతలెల్ల మ్రొక్కి కొలువ
 
తే.సంతసము మీఱఁ గేరి సాయంతనమునఁ | దాండవం బాడు నీ హొయల్ దలఁప వశమె
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
11
సీ.అబ్జగర్భునకు లోకానీకనిర్మాణ- | చాతుర్య మేరీతి సంభవించె
జలజాక్షునకు నిశాచరశిక్షణోపాయ- | పాటవం బేలీల నాటుకొనియె
పురుహూతునకు దివ్యభోగభాగ్యాస్పద- | స్వర్లోకపదవి యేసరణి వచ్చె
దిననాథునకు జగజ్జనలోచనదురాప- | ఘనవిభాస్ఫూర్తి యేకరణి నొదవె
 
తే.నహహ తావక పదసరోజార్చనావి- | ధానమునఁ గాదె కలిగె ననూనమహిమ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
12
సీ.ధననాయకుడు నితాంతము బ్రియమిత్రుండు | సిరులపైదలిగేస్తుఁ డరిదితూపు
కలధౌతశైలంబు కాఁపురంబు బిడారు | కాంచనాహార్యంబు కార్ముకంబు
రత్నాధివాసంబు రహి మించు తరకసం- | బల సర్వమంగళ యనుఁగురాణి
పంటలపువుఁబోఁడి బాళి మీఱిన తేరు | కళలీను రాజు కీల్గంటిపువ్వు
 
తే.గాఁగ నణిమాది భూతులు గల్గు నీకుఁ | బునుకలెత్తంగ నేరీతిఁ బొసఁగెనయ్య,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
13
సీ.చెలిమి నోగిర యిడ్డ చిరితొండబత్తుని | కొడుకుఁ జంపించుట దుడుకు గాదె
పరకాంత యని మది నరయక భల్లాణు | నిల్లాలి గోరుట యెగ్గు గాదె
మాలని యెంగిలిమాంసంబు రోయక | తవిలి మెసంగుట తప్పు గాదె
మొనసి యాడుది పంపు పనులకై కినియక | కుంటెనల్ తిరుగుట కొఱఁత గాదె
 
తే.శివశివా! నీవె యిటువలెఁ జేయునప్పు | డవని నరులకు నింకేమి యడ్డు కలుగు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
14
సీ.దశశతాబ్దముల నిన్ దవిలి పూజించిన | మెచ్చి చక్రికిఁ జక్రమిచ్చినావు
తరలక నిను గూర్చి తప్పమొనర్చిన క్రీడి | కెసఁగఁ బాశుపతాస్త్ర మొసఁగినావు
మిత్తి చేఁ బడి నిన్ను హత్తి బత్తిఁ దలంచు | మునిపుత్రుఁ జేపట్టి మనిచినావు
కాలకూటాగ్నిచేఁ గ్రాఁగి కుయ్యిడుచున్న | దివిజుల యాపదన్ తీర్చినావు
 
తే.బళిర జగముల నీవంటి భక్తిసులభుఁ | డైన దైవంబు గలఁడె లోనరసి చూడ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
15
సీ.పుఱియలు పునుకలు నెఱియఁ బేర్లుగ వైచి | కుత్తుక గరళంబు కుదురు కొలిపి
కడఁగి పెన్బాముల తొడపులుగాఁ బెట్టి | పచ్చియేనుఁగుతోలు పైని గప్పి
నెమ్మేన శవభస్మ మిమ్ముమీఱ నలంది | బికిరంబు చలికూడు ప్రేమఁ దినుచు
భూతపిశాచముల్ ప్రీతిఁ గొల్వగఁ బ్రేత- | భూములయందు నబ్బురము మీఱ
 
తే.మెలఁగుచుండియు భువనమంగళవిలాస- | లీలఁ జెలగుదువంట మేల్ బళీ యయారె!
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
16
సీ.జంభాహితుని భుజాస్తంభనం బొనరించి | విష్ణుని చక్రంబు విఱిచి పుచ్చి
బ్రహ్మదేవునిఁ బటాపంచలుగాఁ గొట్టి | భగుని కన్నులు నేలఁబడఁగఁ దిగిచి
పూషార్కు దంతముల్ పొడిపొడిగాఁ దన్ని | సోముని నరకాల భూమిఁ జమరి
దక్షుని తలఁ గొట్టి తవిలి వేల్పులనెల్లఁ | దఱిమి వేఁటాడిన తావకీన
 
తే.వీరభద్రావతార విహారలీలఁ | దలఁచినప్పుడె యాపదల్ తలఁగు నౌర
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
17
సీ.బాపని కొక స్వయంపాకాన కియలేక | చుట్టాలకును గూడు పెట్టలేక
పిడికెఁడు బిచ్చ మెన్నఁడు నొసంగగ లేక | కడుపార నన్నంబు గుడువలేక
పైమీఁద నొకగట్టిబట్ట గప్పఁగలేక | నదనునఁ గాసైన వదలలేక
కడుగైనఁ దవుడైన విడిచివెట్టఁగలేక | మాడైన మక్కైన మానలేక
 
తే.ఖలుఁడు విత్తంబు గూర్చినఁ గట్టి కొట్టి | పట్టి పుథించి నృపు లరి బలిమిఁ గొంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
18
సీ.జారచోరులకు గంజాయికల్లులకును | దొత్తుల కగ్గికి దొమ్మరులకు
కుంటెనకత్తెలకును వెలయాండ్రకు | నల్లమందునకు భూవల్లభునకు
తప్పుదండుగలకు దబ్బరగాండ్లకు | నంజుటికిని గోడిపుంజులకును
మందులవాండ్రకు మాలదాసర్లకు | నాటపాటలవాండ్ర కౌను గాని
 
తే.సుకవిజనదేవతాగృహసూరివరుల | జేరదింతయుఁ దులువ కూర్చిన ధనంబు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
19
సీ.విధవాకుచంబుల విధమున ససి చెడ్డ | పాడింట నిడిన దీపంబు కరణి,
గాననాంతరమునఁ గాయు వెన్నెల రీతి | షండున కబ్బిన చాన పోల్కిఁ
గ్రోఁతి చే నొదవిన కొబ్బరికాయ య- | ట్లంబుధిం బడిన తోయంబు మాడ్కి
ముసిడిఁ బండిన ఫలమ్ముల చందమున దుష్ట- | ఫణిశిరంబున వెల్గు మణి విధమున
 
తే.ధరణిఁ బరమనికృష్టుని దండనున్న | ధనము వృథయగు నేరికిఁ బనికిరాక,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
20
సీ.వేదశాస్త్రపురాణవిద్య లక్కఱగావు | పరిహాసవిద్యలు పనికివచ్చు
గద్యపద్యవిచిత్రకవితలు కొఱగావు | గొల్లసుద్దుల కతల్ పెల్లుమీఱు
దేవతాభాషల తీరు లేమియుఁ గావు | పారసీకోక్తులు ప్రణుతి కెక్కు
శైవవైష్ణవమతాచారంబు లొప్పవు | పాషండమతములు బాళి నలరు
 
తే.నౌర యిక్కలికాల మహత్త్వమెంతొ | వింతయై తోఁచుఁ గద ధరాభ్యంతరమున,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
21
సీ.కాపుకవీశ్వరుల్ కంచఱయోగులు | సాతానివైష్ణవుల్ సాలెభటులు
కోమటిదాతలు కొంటెభాగోతులు | మాలవెజ్జులు బోయమావటీలు
గొల్లపౌరాణికుల్ పల్లెదైవజ్ఞులు | బానిసవేశ్యలు జైనబాఁప
లాడుదీర్పరు లుగ్రయవనధరాధీశ్వ- | రులు వైదికప్రధానులును మిగుల
 
తే.భూతలంబునఁ గలిదోషహేతుకమునఁ | బ్రబలురై రింకనేమి చెప్పంగవలయు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
22
సీ.బొగ్గులఁ దైలంబు బుట్టింపగా వచ్చు | ధట్టించి జలరాశి దాటవచ్చు
జెలరేఁగి ఘనదవానలము మ్రింగఁగ వచ్చు | భుజగులఁ బేర్లుగాఁ బూనవచ్చు
బెబ్బులి నఱచేతఁ బెనఁగి పట్టఁగ వచ్చు | దివిరి ఱాతిని నార దీయవచ్చు
గొదమసింగమును నక్కునఁ జేర్పఁగా వచ్చు | గాలి పోగిడి మూట గట్టవచ్చు
 
తే.గాని తులువల డెందంబు గరగఁ జేయ | వశము గాదయ్య భువిని నెవ్వరికినైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
23
సీ.సల్లగా మాలదాసర సటారయగారి | తిర్నామములు సాన తేప వింటి
గొల్లమారన బోయ దెల్లఁగా సతికితే | బొల్లేవు పోట్లాటలెల్ల యింటి
జయన యెంకటబొట్లు సబ్బండుసారాలు | పూరాండములు సెప్పఁ గోరి యింటి
సరవయ్య బయలీదు జమిలికతోఁ బాడు | నంకమ్మపాట లెన్నైన యింటి
 
తే.గాని సీ యెద్దుమాంసుల కయితకంబు | లందమనిపించు కాయల యందమండ్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
24
సీ.అబ్బబ్బ కిందటేఁ డప్పయ్య తీర్తాన | జోలెజంగము కిస్తి సోలెఁడుప్పు
సాతాని జియరయ్య సతికితే పోయిస్తి | కొల్లఁగా గుల్లెఁడు సల్లబొట్టు
లంక సత్తెలవాఁడు పొఁకాన పొగిడితే | మాలదాసరికిస్తి మానెఁడూద
వేదాలు వాగితే యెల్లుబొట్టయ్యకు | కొలకుండ దోసెఁడు కొఱ్ఱలిస్తి
 
తే.నౌర తమకన్న కూసుగాఁ డవల నింకఁ | గలఁడె యను మూర్ఖుఁ డిద్ధరఁ గామవైరి!
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
25
సీ.ఆసనబేదంబు లనుకొంటి సేనియా- | డులు సాల రచ్చింపవలెనటంట
కైసవరుఁడనంట నాసారపుసుకుఁడ- | నంట యేధాంతుండనంట పెద్ద-
యెద్దు మారిసుఁడనంట సిద్దాంతుడనటంట | వాసి పేగుల నంటదోసినంట
సోమాదిగులనంట సామిపాకాలంట | సంతుకు తంబులు సతుకుకుంట
 
తే.యెంటఁబట్టిరి యబ్బబ్బ యేమి సేతు | బాపనపిసాసు లనుచోట్ల బలుకఁ దరమె,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
26
సీ.మోట బొల్లెద్దుకు ముకుదాడు గట్టిన- | ట్టెద్దెరా మొగమెల్ల సుద్దపట్టె-
లద్దించుకొని వచ్చి అయగారు యేంచేసె | తడియాకుఁ గావలె తయ్యడాడు
బళ్ళంట ఆమీఁద పరపామదంట మం- | గలదాని బొందంట గనడమంట
ముత్తి గలుగునంట ముద్రదానము గమ్మ- | టంట దాసరికొయ్య యెంటఁబట్టి
 
తే.పట్టిబుజములు గాలసబట్టెననెడు | చెనటుల తెఱంగు లేమని చెప్పనేర్తు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
27
సీ.బోలెఁడు గందంబు బొమలదాఁకా మెత్తి | మెంటెఁ డీబూడిద ఒంట బామి
రుదురాకపేర్లు జన్నిదములు మోఁకాలి | లాపున దిగయేసి యావుపాస-
నానికి నేతిదారైనను దెమ్మంట | దాఁ బల్కునెడ నమేద్యాలటంట
పచ్చాలు మాలయ్యపచ్చాలుననుకొంట | సంకలో కబ్బాలు సప్పుకొంట
 
తే.సెడుగుబాపఁడు నాబంటుకొడు కబ్బబ్బ | యెంటఁబడె నను మూర్ఖుల నెన్నదరమె
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
28
సీ.బట్టయ్యగాళ్ళంట బబ్బాయువంటను | బొజ్జయుంబనుకొంట బోజనాలు
గావలెనంట తేగాలు దెమ్మనుకొంట | సేరి బూసుండాలు సేసుకొంట
యెల్లనికొడుకంట మల్లనికొడుకంట | పోయిన పెతరుల పొగుడుకొంట
కలయిర్పులెట్టి తొందరగాఁగ దండకాల్ | సతకాలు సోకాలు సతుకుకొంట
 
తే.ఎంటఁ బట్టిరి గదరబ్బ యనెడు మూఢ | కష్టచిత్తుల కిఁక మఱెక్కడి యశంబు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
29
సీ.పాతపొత్తపుకట్ట సేత పట్టుకవచ్చి | దోసిబాపఁడనంట దోసిలొట్టి
జలము సంద్రుఁడటంట సని సాలదనుకొంట | సెడుగు వాసారులు సెప్పుకుంట
తిండికిఁ దెమ్మంట దేయిరింపుచు తూపె- | తూపెకు సేతులు సాపు గాని
మఱఁదలెన్నఁడు పెదమనిసైనదంటేను | తప్పక మూత్రంబె సెప్పలేఁడు
 
తే.సీ యితనికంటె సాకలిసెల్లిగాఁడు | మేలనెడు మోటకొయ్యల నేల దెలుప,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
30
సీ.కరణాలటంటను కైలకట్టల యిప్పి | పాతికలంటను పరిగలంట
కాన్లంట గీన్లంట కలయి లేనియి కొన్ని | సెల్లులు బాకీలు సెప్పుకొంట
బిరబిర గంటాలు గిరగిర దిప్పుతా | నాకులన్నియు నెడ గోఁకుకుంట
యెగరాసి దిగరాసి సగమేసి యెగదొబ్బి | కొంపలు పడదోసి సంపుతారు
 
తే.దయ్యమా కాయకసరైన దక్కనియ్య- | రేమి సేయుదు మను మోటులిలను గలరు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
31
సీ.యెద్దుమందను గూర్చి యెగసాయమిడితేను | తుది నది యధికారి దోసుకొనియె
దాపుదప్పులకంట దర్మకర్చులకంట | కాసువీసము లాగె కరణపయ్య
సల్లమ్మి పవకమ్మి సిల్లర దాసితే | కోమటి నాబంటుకొడుకు దొబ్బె
కళ్ళము కంకులు గాలిఁ బట్టగఁ బోతె | బట్టుబాపనవోళ్ళు బతగనీయ-
 
తే.రహహ దందర మిటులయ్యె ననెడి మోటుఁ | బెద్దదొక్కుడుగాళ్ళఁ జెప్పెడిదిఁకేమి,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
32
సీ.కాకంబునకు రత్నఖచితపంజరమేల | పందికి ముత్యాలపందిరేల
యీపిటీఁగకు మేటి తీపుఁదేనియ యేల | శ్వానంబునకుఁ బట్టుజాలరేల
మహిషంబునకు మృగమదవిలేపనమేల | కోతికి బంగారుగొలుసులేల
గర్దభంబునకు బంగారుపల్లంబేల | షండున కందమౌ జాణ యేల
 
తే.పరమలోభికి నృపసభాప్రథితమహిమ- | సుకవికృతభవ్యకావ్యవిస్ఫురణ యేల
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
33
సీ.పొడవైన కారెనుబోఁతుఁ గన్గొని తేంట్లు | మదగజేంద్రంబని పొదవునట్లు
దళమైన యెండమావులు సూచి నీళ్ళని | చెలఁగి జింకలు దాడిసేయునట్లు
వలయు దవాగ్నిధూమముఁ గాంచి మొగులని | చాతకంబులు డాయఁ జనినయట్లు
బూరుగచెట్టుపైఁ బూవులుండుట చూచి | చిలుకలు ఫలముకై చేరినట్లు
 
తే.ధరణి నధముల దాంభికత్వములు చూచి | చేరి యాచింపఁ దలతురు సూరిజనులు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
34
సీ.ఇల జొన్నఁ బడు గ్రుడ్డియెద్దు చాడ్పున మృదు- | పదగతు లరయక పరుపుకొనుచుఁ
బెనకున నోడిన పిఱికిబంటును బోలె | వడి లేక ప్రాసంబు విడిచివైచి
సారెఁ గొక్కెర రీతి జడధుల నెరసుల | నెమకుచు మిగులభంగములఁ దోఁగి
పెంటలపైఁ బొరల్వెట్టు రాసభమట్లు | పలుమఱు నపశబ్దమునె పలుకుచు
 
తే.తస్కరుని చందమునఁ బదార్థములు మ్రుచ్చి- | లించుచుఁ జరించు కుకవుల నెంచనేల?
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
35
సీ.దేశాటనంబును దేవతోపాస్తియుఁ | బండితస్నేహంబు బహుపురాణ-
శోధకత్వము పరిశుద్ధతయును మహా- | ప్రతిభయుఁ గల్పనాపాటవంబు
ఛందోముఖాశేషశాస్త్రవేదిత్వంబు | సంగీతసాహిత్యసౌష్ఠవంబు
నిఖిలకలానైపుణియు నహంకారరా- | హిత్యంబు జనహితకృత్యములును
 
తే.గలిగి కవిరాజ రాజశేఖరులు మెచ్చు | కబ్బములు గూర్చువాఁడె పో కవి యనంగ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
36
సీ.అలికులవేణి సింహకిశోరనిభమధ్య | పరిపక్వబింబోష్ఠి పద్మగంధి
రాకేందువదన శరచ్చంద్రికాహాస | కోకిలకలవాణి కుందరదన
పల్లవపాణి శంపాలతావిగ్రహ | లికుచవక్షోజ నాళీకనేత్ర
ముకురకపోల చంపకపుష్పసమనాస | భుజగరోమావళి పులినజఘన
 
తే.యనఁగ నెన్నిక గన్న లేయన్నుమిన్న | దొరకి ఘను నిన్ను నుతిగొన్న పురుషుఁ డహహ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
37
సీ.పతిని దైవమ యంచు మతి నెంచి యరయుచుఁ | గలనైనఁ గ్రోధంబు నిలుపఁబోక
యతిథులఁ జుట్టాల నతిభక్తిఁ జూచుచు | సత్యవాక్యనిరూఢి జరుపుచుండి
యుభయవంశములకు నుపకీర్తి నించుచు | నిమ్ముగా నగు సుచిత్తమ్ము పూని
యత్తమామల మాట కడుగు దాఁటగఁబోక | మాన మాభరణంబుగా నమర్చి
 
తే.మెలఁగుచుండెడి యిల్లాలు కలుగవలయు | మహితభాగ్యాన్వితుండైన మానవునకు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
38
సీ.తన యింటి యర్థంబుఁ దానె మ్రుచ్చిలుదాని | ననయంబుఁ గొరకొరలాడుదాని
గయ్యంబునకు నెప్డు కాలు దువ్వెడిదాని | నెడపక యేవేళ నేడ్చుదాని
పొరుగిండ్ల వెంబడిఁ దిరుగుచుండెడిదాని | ధట్టించి శిశువులఁ గొట్టుదాని
పరహితశీలయై పరగుచుండెడిదాని | గయ్యాళియై పతిఁ గలఁచుదాని
 
తే.తవిలి పదుగురుబిడ్డల తల్లియైన | విడువవలెనండ్రు పెద్ద లిప్పుడమియందు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
39
సీ.జగడాలచీలి వేసాలవెల్లి బిసాళి | తిండిపోతు గయాళి మొండికట్టె
హేయభాజనము పల్మాయలపుట్టిల్లు | కంతులరాకాసి పంతగత్తె
యవలక్షణముల తా వవివేకములప్రోవు | చెరపనచేట మాసికలమూట
నిక్కులబండి బందెలమారి కల్లల- | పాతర సోమరిపో తనంగ
 
తే.నెన్నఁబడు బేరజపురండ నేలుచుండు | పురుషుని యభాగ్య మేమని పొగడవచ్చు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
40
సీ.కిలకిల నగుచు ముద్దులు గుల్కు నొకవేళ | నొకవేళఁ గొరకొరలూని మెలఁగు
మలితవిచారబాములఁ గుందు నొకవేళ | నొకవేళ దృఢపరుషోక్తులాడు
రతికళాకౌశలోన్నతి సూపు నొకవేళ | నొకవేళ మొగమీక యూరకుండు
లలిఁ బెక్కురీతుల లాలించు నొకవేళ | నొకవేళఁ బెనువంత నొందఁజేయు
 
తే.నౌర వింతలు భూమిపై నాఁడుదాని | మనసు దెలియంగరాదు పద్మజునికైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
41
సీ.ఒరుల భాగ్యము సూచి యోర్వఁజాలనివాడు | బుధజనద్వేషంబు పూనువాఁడు
చెలిమిమైఁ దల్లిదండ్రులను బ్రోవనివాఁడు | పరకామినుల కాసపడెడివాఁడు
శివవిష్ణుదూషణల్ సేయుచుండెడివాఁడు | పలుమఱు కొండెముల్ పలుకువాఁడు
భూసుపర్వక్షేత్రములు మ్రింగఁజూచువాఁ | డాడినమాట లేదనెడువాఁడు
 
తే.ప్రోది చేసినవానితోఁ బోరువాఁడు | చేరు దుర్గతి నిహపరదూరుఁడగుచు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
42
సీ.బహుపుత్రసంప త్తిఁ బ్రబలుచుండెడివారు | నిక్షేపములు ధాత్రి నిలుపువారు
క్షితి శివోద్వాహముల్ సేయుచుండెడివారు | కొంచక గుళ్ళు కట్టించువారు
ఘనతటాకమ్ము లిమ్మొనరఁ ద్రవ్వెడివారు | విరివిగాఁ దోఁటలు వేయువారు
కవిబుధోత్తములకుఁ గామితార్థములిచ్చి | యందంబుగాఁ గృతులందువారు
 
తే.సప్తసంతానకర్త లీ సదమలాత్ము | లెపుడు నిహపరసుఖముల నెనయుచుండ్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
43
సీ.వలవని చెలువతో మెలగువాఁ డొకకూళ | వాసిడించి చరించువాఁడు కూళ
సిరి గల్గి కుడువక చిక్కువాఁ డొకకూళ | వనిత కుంకువ చెప్పువాఁడు కూళ
చెడి బంధునింటికిఁ జేరువాఁ డొకకూళ | వసుధేశుఁ జెడనాడువాఁడు కూళ
ధనికుతోఁ బగవెట్టుకొనెడువాఁ డొకకూళ | వడిలేని దొరఁ గొల్చువాఁడు కూళ
 
తే.కూడదన్నను గవితలఁ గూర్చి బలిమి | గుమతులకు నిచ్చువాఁ డొక్కకూళ సుమ్ము,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
44
సీ.ఆరకూటములోన నపరంజి యిడినట్లు | చెరువులోఁ బన్నీరు చిలికినట్లు
చౌటినేలను మంచిసస్యం బిడినయట్లు | వెలిమిడిలో నెయ్యి వేల్చినట్లు
షండున కందమౌ సకిని గూర్చినయట్లు | పేడలోఁ గస్తూరి పెట్టినట్లు
పాడింటిలోన దీపంబు నిల్పినయట్లు | వార్ధిలోఁ గురిసిన వానయట్లు
 
తే.తొడరి సుజనులు ధరణిలో దుర్జనులకుఁ | జేయు నుపకృతి వ్యర్థమై చెడు గదయ్య,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
45
సీ.పరమలోభిని దివాకరతనూభవుఁ డంచు | ఛద్మచిత్తుని హరిశ్చంద్రుఁ డనుచు
నిర్దయాత్ముని రామనృపశిఖామణి యంచుఁ | గడుకురూపిని రతికాంతుఁ డనుచు
పాపకర్ము నభంగపాండవాగ్రజుఁ డంచు | సమరభీరుని సవ్యసాచి యనుచు
కుండబీదను మరున్మండలేశ్వరుఁ డంచు | మతివిహీనుని భోగిపతి యటంచు
 
తే.కవులు కక్కూర్తి నిసుమంత కడుపు కొఱకు | పొగడుచుండుదు రవివేకబుధు లగుచు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
46
సీ.పూదోఁటఁ గారెనుబోతు దూఱినయట్లు | పైరులోఁ బెనుగాబు బలిసినట్లు
గుడిమీద మఱ్ఱిమ్రాన్ గుదురు మీఱినయట్లు | చెదపుర్వునకు ఱెక్కలొదవినట్లు
వెరవొప్పఁ జెఱకున వెన్ను పుట్టినయట్లు | తులసిలో గంజాయి మొలచినట్లు
నట్టింట గడితంపుఁ బుట్ట పుట్టినయట్లు | గందమ్ములోఁ బేడ కలిసినట్లు
 
తే.వంగడంబున నొక క్రూరవర్తనుండు | పొడమి తత్ప్రాభవంబెల్ల నుడుగఁజేయు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
47
సీ.కాకిమూఁకలలోనఁ గోకిలం బున్నట్లు | కొంగలలో నంచ కూడినట్లు
సైరిభబులలోన సామజంబున్నట్లు | నక్కలలో జింక చిక్కినట్లు
ధుత్తూరములలోనఁ దులసిచెట్టున్నట్లు | ఱేఁచులలోఁ బులి రేఁచినట్లు
గ్రద్దలలో విహంగప్రభుఁడున్నట్లు | ఖరములలో వాజి దొరలినట్లు
 
తే.ధరణిఁ బెక్కండ్రు నీచవర్తనులలోన | ఘనుఁ డొకఁడు చిక్కి యేమియుఁ గాక యుండు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
48
సీ.చక్కెరలోఁ బిప్పి సంగతంబైనట్లు | మొగిలిపువ్వున ముండ్లు మొలచినట్లు
మాలి పంటికి జీడి మట్టు మీఱినయట్లు | కనకంబునకు గామ కలిగినట్లు
గొనబుముత్తెమునకు గొగ్గి పుట్టినయట్లు | చందమామకుఁ గందు వొందినట్లు
పాలలోఁ దోడుఁ బాల్ మేళనంబైనట్లు | గంగలోపల నాఁచు గలిగినట్లు
 
తే.ఘనున కొక నేరమించుక కలిగెనేని | గొఱఁతగాఁ జూచి యెగ్గెన్నుకొనరు బుధులు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
49
సీ.కొఱగాని పంచమకులునైన నడిగించుఁ | బరదేశములవెంటఁ దిరుగఁజేయుఁ
గులములో వన్నె తక్కువయై మెలంగించు | మదిని హింసాంభోధిఁ గుదురుపఱచు
సభ నాడుమాట హాస్యరసాస్పదము సేయు | తెలివి యొక్కపుడైనఁ గలుగనీదు
తివిరి సాధులఁ బట్టి తెరవాట్లు కొట్టించు | గడలేని యిడుమలఁ గుడువఁజేయు
 
తే.ధరణిలోపల నకట పేదఱికమెంత | కాని దది వద్దు సుమ పగవానికైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
50
సీ.కులమున కెల్ల మిక్కిలితనం బొనఁగూడు | నాడినమాటయే పాడి యెసఁగు
నిఖిలవిద్యాభ్యాసనిపుణత లభియించుఁ | జేసిన పనులెల్ల వాసికెక్కు
మనుజేశ్వరాస్థానమాన్యత సమకూఱుఁ | గడలేని తేజంబు గలిగియుండు
కవిబుధవందిమాగధుల చెల్మి ఘటించుఁ | బగరయైనను వెంటఁ బడి చరించు
 
తే.గలియుగంబున నబ్బబ్బ కలిమివంటి | మంచివస్తువు కలదె యోజించి చూడ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
51
సీ.బంధుజాతములోన బహుమాన మెడలించు | సభలలో మాటాడఁ జనవులేదు
పరమైన విజ్ఞానసరత సిద్ధించదు | కుమతులు గెగ్గెర్లఁ గొట్టుచుంద్రు
పరభూమి కేఁగినఁ బాటింపరెవ్వరుఁ | బ్రతిభావిశేషంబు పట్టువడదు
ధారుణీపతు లొక్కదానమే నొసఁగరు | కులసతి యతనిఁ దక్కువగఁ జూచు
 
తే.నకట విద్యావిహీనత యంత కీడు | లేదు గద మర్త్యులకు ధాత్రిమీఁద నరయ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
52
సీ.కడుపార ఘృతమాంసఖండముల్ కడు మెక్కి | పుక్కిటఁ దమలంబు తుక్కు ద్రొక్కి
లావగు గడితంపుఠీవి గన్గొని నిక్కి | విడువక గేస్తుల మెడలు నొక్కి
కూర్చు రొక్కము చందుగులఁ గ్రిక్కిఱియఁ గ్రుక్కి | కసరుచు జనులపై విసము గ్రక్కి
కవిబుధవరుల ఢాకలకు మూలలఁ జిక్కి | కక్కుచుఁ బల్లకీ కుక్కులెక్కి
 
తే.నిక్కి మిక్కుటమైన యాదొక్కి బొక్కి- | లో టక్కరి నృపాలకులకీ ర్తి దక్కునొక్కొ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
53
సీ.అనయమ్ము రాజ్యాంతమున నరకము ధ్రువ | మ్మని స్మృతుల్ వచియింప వినఁగలేదొ
మును హరిశ్చంద్రాది మనుజేంద్రు లనఘులై | చనిరన్న సత్కథల్ వినఁగలేదొ
దండధరుండు మీఁదట దురాత్ములఁ బట్టి | వెతఁ బెట్టునను మాట వినఁగలేదొ
మహిలోన జాతస్య మరణం ధ్రువమ్మని | విబుధులు పలుకంగ వినఁగలేదొ
 
తే.కాని దుర్మతులయి ప్రజఁ గలంచి ధనముఁ | గూర్పఁజూతురు బేలలై కూళదొరలు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
54
సీ.మరుమరీచికలు తామరసపత్రాంతర- | సలిలబిందువులు చంచలలు హస్తి-
కర్ణాంతములు దీపకళికాశిఖలు బుద్బు- | దములు మంగలి చేతిదర్పణములు
మిణుఁగురుఁ బురువుల మెఱపు లభ్రచ్ఛాయ- | లైంద్రజాలికు నాట లంబురాశి-
వీచులు చలదళవృక్షపలాశముల్ | తృణహుతాశనముల తెఱఁగు లిట్టి
 
తే.సిరులు నిలుకడలని నమ్మి చెనఁటు లురక | చెడుదు రెన్నడు ధర్మంబు సేయలేక,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
55
సీ.భోగియై ప్రతిదినత్యాగియై పుణ్యసం- | యోగియై సుజనానురాగి యగుచు
దాతయై బుధజనత్రాతయై నిఖిలవి- | జ్ఞాతయై కుశలసంధాత యగుచు
ధీరుఁడై రణరంగవీరుఁడై నిర్మలా- | చారుఁడై నిరుపమోదారుఁ డగుచు
శాంతుఁడై సదమలస్వాంతుఁడై కీర్తిది- | గంతుఁడై పటుబలవంతుఁ డగుచు
 
తే.రాజ్యమేలంగఁ గలవాఁడె రాజు గాక | హీనమతియై చరించువాఁ డేటి రాజు?
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
56
సీ.ఘూకంబు తెఱఁగున గొందుల నిరుకుచు | భుజగంబు చాడ్పున బుస్సుమనుచు
బెబ్బులి కరణిఁ గంపిల డాక సేయుచు | భేకంబు గతి మేనిబెంపు గనుచు
భల్లూకమట్లు చొప్పడ విఱ్ఱవీఁగుచు | నాఁబోతు కైవడి నాముకొనుచు
గోమాయువట్ల యెన్నోమాయ లూనుచుఁ | గ్రోడంబువలెఁ గొరకొర నెగపుచు
 
తే.దనరు క్రూరనృపాలకాధముల నమ్మి | సిరుల కాసించువాఁ డొక్క చెనఁటికాఁడె
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
57
సీ.కోప మెక్కువ తాల్మి కొఱఁత కార్యము సున్న | నిలుకడ నాస్తి దుర్నీతి ఘనము
కనికరం బిల్ల దుర్గర్వ మగ్గము సత్య- | కౌచముల్ కల్ల మచ్చరము హెచ్చు
కాపట్య మురు వహంకారంబు గాటమ్ము | పొగరు దట్టము ద్రోహబుద్ధి దళము
పరధనాపేక్ష నిబ్బరము లోభము పెల్లు | పరహితచింత నిప్పచ్చరమ్ము
 
తే.ధర్మమతి తొట్టు నీ యిట్టి దుర్మదాంధ- | నృపకులాధము లేరి కేమియ్యఁగలరు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
58
సీ.అందలంబెక్కుట యవనిఁ బ్రశస్తమా | మ్రానెక్కి నిక్కదే మర్కటంబు
తొడవులు దొడుగుట దొడ్డసౌభాగ్యమా | కడుసొమ్ము లూనదే గంగిరెద్దు
విత్తంబు గూర్చుట విమలబ్రచారమా | బహునిధుల్ గావఁడే భైరవుండు
ప్రజల దండించుట పరమసంతోషమా | ప్రాణులనెల్ల నేపఁడే జముండు
 
తే.దొరతనంబున కివి గావు వరుస లరయ | సాహసౌదార్యఘనపౌరుషములు గాని,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
59
సీ.దానవైఖరిని రాధాతనూభవుఁ బోలి | చిరభోగమున శచీవరుని బోలి
కారుణ్యమున రఘుక్ష్మావరేణ్యుని బోలి | సత్యంబునను హరిశ్చంద్రుఁ బోలి
న్యాయమ్మునందుఁ గౌంతేయాగ్రజుని బోలి | సాహసంబున సవ్యసాచిఁ బోలి
భూరివిద్యాప్రౌఢి భోజరాజును బోలి | హరిభక్తినియతిఁ బ్రహ్లాదుఁ బోలి
 
తే.సర్వసర్వంసహాభుజాధూర్వహుఁడు న- | భంగుఁ డగువాఁడెపో నృపపుంగవుండు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
60
సీ.న్యాయంబు దప్పక నరులఁ గాపాడుచు | వసుమతిఁ బాలించువాఁడె రాజు
దుష్టశిక్ష మహాశిష్టరక్షణ కళా- | వైఖరిఁ జెన్నొందువాఁడె రాజు
కవివందిమాగధగాయకార్థులకెల్ల | వాంఛితార్థము లిచ్చువాఁడె రాజు
శరణని వేఁడిన శాత్రవజనునైన | వదలక చేపట్టువాఁడె రాజు
 
తే.కాక తన పొట్టకై ప్రజఁ గలఁచు దురిత- | రతుఁడు వాఁ డొక రాజా తరాజు గాక,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
61
సీ.మరుదనంగుడు శిబి మాంధాత భరతుండు | రంతిదేవుఁడు భగీరథుఁడు పృథుఁడు
శశిబిందుఁడు గయుండు జామదగ్ని దిలీపుఁ | డంబరీషుండు యయాతి దాశ-
రథి సుహోత్రుఁడు పురూరవుఁడు నాభాగుండు | కార్తవీర్యార్జునక్ష్మాపతియును
దుష్యంతుఁ డతని పుత్రుడు నలుండును పురు- | కుత్సుండు మొదలైన కుతలపతులు
 
తే.ధర్మపద్ధతి నిల నేలి తారమైనఁ | గొనక చనుచెల్ల వినరేమొ క్రూరనృపులు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
62
సీ.మొదవుల బదివేలు కదుపులు గూర్చిన | దూడ యొక్కటియైనఁ దోడరాదు
మాత లసంఖ్యముల్ మాటుగా నించినఁ | బసిఁడి వీసమును వెంబడిని రాదు
కోకలు మేట్లుగా గొట్ల నిండించిన | గుడ్డ యొక్కటియైనఁ గూడరాము
గొలుసులు రాసులు బలుపాతరల నిడ్డ | గింజ యొక్కటియన గెలన రాదు
 
తే.కావున నొడళ్ళు నిల్కడల్ కావటంచుఁ | జెలఁగి సుజనులు ధర్మంబు సేయుచుంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
63
సీ.కొండంత విత్తంబు గూడఁబెట్టిననైనఁ | బొదలు ధనాపేక్ష వదలిపోదు
స్వర్గాధిపత్యంబు సంభవించిన యేని | బహురాజ్యకాంక్ష యెప్పటికిఁ జనదు
పదివేలు పుత్రులఁ బడసినప్పటికిని | పుత్రోదయభ్రాంతి పోవదెపుడు
చతురంగబలము లసంఖ్యముల్ గూర్చిన | సేనాభిలాష మింతైనఁ దీఱ-
 
తే.దహహ డెందంబులోపల నంతకంత | నధికమగు నాస యింత కేమి మనఁగవచ్చు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
64
సీ.నిరతాన్నదానవైఖరిఁ జెలంగెడివారు | నెనరొప్ప దీనుల మనుచువారు
గోవిప్రబాంధవగురుభక్తి గలవారు | శివు విష్ణుఁ బూజలు సేయువారు
పరధన పరవధూపరతఁ జెందనివారు | పరహితాచరణులై పరఁగువారు
సుజ్ఞానసహితులై సొబగు మీఱెడివారు | సత్యవచోరూఢి సలుపువారు
 
తే.తలఁపులోపల ననయంబు ధర్మకార్య- | నిష్ఠ గలవార లందఱు నీకుఁ బ్రియులు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
65
సీ.న్యాయపద్ధతి భూషణము ధరాధిపునకుఁ | బొలఁతికి మానంబు భూషణంబు
శమదమంబులు భూషణములు నిశ్చలునకుఁ | బొసఁగ నింటికి సతి భూషణంబు
నరుని కల్మికి భూషణము దానవైఖరి | భూసురునకు విద్య భూషణంబు
నలినబంధుఁడు భూషణము నభోవీధికిఁ | బుడమికి సస్యంబు భూషణంబు
 
తే.బుధుల కెప్పుడు నీ పదాంభోజయుగళ- | పూజనాసక్తి వెలలేని భూషణంబు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
66
సీ.అంభోధి కభిషేక మాచరించినయట్లు | గంగకుఁ బాద్య మొసంగినట్లు
మేరువునకు నలంకారంబు లిడినట్టు- | లినునకు నారతు లెత్తినట్లు
మలయాచలమునకుఁ గలప మిచ్చినయట్టు- | లిల వసంతునకుఁ బూలిడినయట్లు
భూపముఖ్యునకుఁ దాంబూల మిచ్చినయట్లు | సోమున కద్దంబు సూపినట్లు
 
తే.నిఖిలలోకైకభర్తకు నీకు నొక్క | బిల్వదళ మార్యవర్యు లర్పించుచుంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
67
సీ.నడచిపోవఁగ జవం బడరకుండుటఁ జేసి | పుణ్యతీర్థము లాడఁ బోవరాదు
కాసు వీసము చేతఁ గల్గకుండుటఁ జేసి | దానధర్మక్రియల్ తలఁపరాదు
తనువున రుగ్బాధ తరలకుండుటఁ జేసి | స్నానజపాదులు సలుపరాదు
గడితంపుటాఁకలి విడువకుండుటఁ జేసి | యుపవాసములు నిష్ఠ నుండరాదు
 
తే.కాని నిన్నొక్కమాఱైనఁ గడఁగి తలఁప- | రాదె యెన్నరు గాక దుర్మతులు మదిని,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
68
సీ.శతవత్సరంబులు జనులకుఁగా నాయు- | వంబుజాసనుఁడు మర్యాద చేసె-
నందులో సగమేఁడు లరుగు నిద్రలచేత | శైశవక్రీడల జరుగుఁ గొన్ని
తారుణ్యమున మహామారభూతము సోఁక | నంగనాసక్తిచే నరుగుఁ గొన్ని
వార్ధకంబున బహువ్యాధిపీడలచేతఁ | గడమ యేఁడులు రిత్త గడచుచుండు
 
తే.కటకటా యెన్నఁడును దెల్వి గలిగి నిన్నుఁ | జేరి భజియింపకే ప్రాణి చెడు గదయ్య,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
69
సీ.ప్రకృతి గుణంబులఁ బాసి షడ్వర్గంబు- | నడఁచి జితేంద్రియులైన యంచి-
తాష్టాంగయోగక్రియారూఢులై చరా- | చరరూపమగు ప్రపంచంబు మిథ్య
యని తలంచుచు సమస్తాంతరస్థాయివై | నువ్వులలోపల నూనె వోలె
బూసలలో దారమును బోలి యెడపక | నిండారి యుండెడు నిన్ను నెపుడు
 
తే.లోనిచూపునఁ దగఁ దమలోనఁ గాంచి | సోఽహమనువారె సంతతోత్సాహమతులు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
70
సీ.వాయుభక్షణ చేసి వనటఁ గుందదె పాము | గుహలలో దూఱదే గూబపులుఁగు
వృక్షశాఖలమీఁద వ్రేలుచుండదె పక్షి | కానలఁ దిరుగదే వానరంబు
చెలరేఁగి కూయదే ఝిల్లికాకూటంబు | గహ్వరి దిరుగదే గంగిరెద్దు
నీట మునుంగదే మాటిమాటికిఁ గప్ప | యాకులు మెసవదే మేఁకపిల్ల
 
తే.యెన్ని తెఱఁగులఁ బొరలుచునున్న నిన్ను | లీలఁ గొలువని ఖలునకు లేదు ముక్తి,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
71
సీ.పరుసంబు వలన నబ్బురముగా లోహంబు | మేల్మిబంగారమై మెఱసినట్లు
భ్రమరంబు వలన విభ్రమరూఢి యలరారి | శలభంబు భ్రమరమై చెలఁగినట్లు
మలయభూజాతంబు వలన నింబము పటీ- | రావనీజాతమై యలరినట్లు
కతకంబు వలన నుద్గాఢపంకోదకం- | బతినిర్మలోదకంబైనయట్లు
 
తే.సద్గురుకృపాకటాక్షవీక్షణము వలన | బ్రాకృతుఁడు జ్ఞానియై ముక్తిపదము గాంచు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
72
సీ.మణిభూషణములు చామరములు ముత్యాల | గొడుగులు పడిగలు గుజ్జుపరపు
మిద్దెటిళ్ళు మెఱుంగుటద్దముల్ గద్దియల్ | చందుగల్ చందువాల్ మందసములు
పూలపాన్పులు శీరతాళవృంతము మేల్ | కలపముల్ తూగుటుయ్యెలలు పసిఁడి-
పల్లకీలు గుఱాలు బంట్లు బానిసలును | ధనధాన్య వసన గో దంతి తతులు
 
తే.కులుకుప్రాయంపు ముద్దుగుమ్మలును గలిగి | పొలుచువారలె మును నిన్నుఁ గొలుచువారు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
73
సీ.దానహీనుండైన మానవాధము కల్మి | తెరలెడు జుంటీఁగ తేనెచుట్టు
చుట్టాల నతిథులఁ జొరనీని ఖలునిల్లు | పెనుబాము వసియించు పెద్దపుట్ట
సభలఁ బ్రసంగింపఁజాలని జనుని ప్ర- | హృష్టసాహితి సానక్రింది వన్నె
పతివాంఛ దీర్పని పడఁతి చక్కదనంబు | కాననాంతరచంద్రికాప్రసక్తి
 
తే.చిత్త మిగురొత్త నినుఁ బూజ సేయలేని | నరుని జన్మము మహిషజన్మము గదయ్య,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
74
సీ.కుంభికుంభస్థలాక్షుద్రామిషము మెక్కు | సింగంబు కప్పల మ్రింగఁ జనునె
సారభూరుహఫలాహారలీలఁ జెలంగు | కీర ముమ్మెతలఁ జేరుకొనునె
యభ్రాపగాహాటకాబ్జమృణాళముల్ | కొను నంచ బురదవాగులకుఁ జనునె
ప్రబలవర్షాంబుధారలు గ్రోలు వానకో - | యిల యిల మంచుసోనలకుఁ జనునె
 
తే.ప్రభుభుజానీతభూరివైభవనిమగ్న- | విద్వదవతంస మల్పుల వేడఁ జనునె?
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
75
సీ.అడిగినప్పుడ తన యొడలి చర్మం బూడ్చి | కర్ణుఁ డీయండె యాఖండలునకు
నుడివినప్పుడ యొప్పి పుడమి మూఁడడుగులు | వైరోచనుం డీఁడె వామనునకు
శరణన్న యప్పుడు పరఁగ గువ్వను బ్రోచి | శిబి మేని పొలసీఁడె శ్యేనమునకు
ప్రార్థించినప్పుడే బ్రాహ్మణుఁ గాచి ఖే- | చరుఁడు ప్రాణములీఁడె సురవిరోధి-
 
తే.కరయ వితరణశూరులైనట్టి ఘనులు | కొంచకేమైన ఘనుల కర్పించుచుంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
76
సీ.పురుషోత్తమము భద్రగిరి యహోబలము శ్రీ- | శైలంబు వేంకటాచలము కాంచి
సింహాచలంబును శ్రీరంగమును ప్రయా- | గంబు కేదారంబు కాళహస్తి
కుంభకోణంబు శ్రీకూర్మంబు కాశి సు- | బ్రహ్మణ్యమును చిదంబర మయోధ్య
భీమేశ్వరంబును రామేశ్వరంబును | గోకర్ణమును హిమక్షోణిధరము
 
తే.మొదలుగాఁ గల పుణ్యభూములకుఁ జనఁగ | వలవ దరలేక నినుఁ గొల్చు నలఘుమతికి,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
77
సీ.లవణాబ్ధి లంఘించు పవనాత్మజున కొక్క | తోటకాలువ పూని దాటుటెంత
జగమెల్ల ముంచు వర్షము నించు కాలాంబు- | ధరమున కొకపాదు దడుపుటెంత
బహులోకవాంఛితఫలదమౌ సురశాఖి | కొక యణూపమఫలం బొసగుటెంత
చెడుగు రక్కసిమూఁకఁ జెండు చక్రమునకుఁ | బుడమి నొక్కరుని జంపుట యదెంత
 
తే.సకలబ్రహ్మాండభాండరక్షణకలాభి- | రామునకు నీకు ననుఁ బ్రోచుటేమి వింత?
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
78
సీ.నదులలో జాహ్నవి నరులలో విప్రుండు | గ్రహములలోనఁ బంకజహితుండు
తృణములలో దర్భ మృగముల సింగంబు | వ్రతముల ద్వాదశి లతల జాజి
దానమ్ములం దన్నదానమ్ము లోహజా- | తమ్ములలోనఁ గార్తస్వరంబు
గిరులలో మేరువు పురములలో కాశి | తరువుల రావి సంతతులఁ గృతియు
 
తే.నెట్లు పూజ్యములయ్యె నట్లెల్లవేల్పు- | గములయందును నీవె కా ఘనుఁడ వరయ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
79
సీ.నటుని పోల్కి ననేకనామరూపవిభేద- | ములు పూని శుభలీలఁ జెలఁగువాని
తవిలి పూసలలోని దారంబు కైవడి | జగదంతరాత్మయై నెగడువాని
నైంద్రజాలికు రీతి నఖిలంబు నుద్భవ- | స్థితిలయంబుల నొందఁజేయువాని
విపులాంబువులఁ బ్రతిబింబితుండౌ హేళి | వలె సర్వసాక్షియై వెలుఁగువాని
 
తే.నిన్ను సేవింతు భావింతు సన్నుతింతుఁ | బ్రేమ యేపార సాక్షాత్కరింపుమయ్య,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
80
సీ.సాలెపుర్వునకుఁ కుంజరమున కహికిని | ముక్తి యొసంగిన భక్తసులభ!
జముని దక్షుని పరాశరతనూజుని గర్వ- | దూరులఁ జేసిన భూరిశౌర్య!
హరి విరించన పురందరుల కఖండవై- | భవము లొసంగిన భువనజనక!
నంది భృంగీశ బాణ దశాననుల మహా- | ప్రమథులఁ జేసిన విమలచరిత!
 
తే.నీ మహత్త్వంబు పూని వర్ణింపఁ దరమె | వాణికి వేయిమోములవానికైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
81
సీ.ఆరకూటమ్ము బంగారమై యొప్పునే | తగర ముజ్జ్వలకలధౌత మగునె
గాజుపూస యనర్ఘగారుత్మత మ్మౌనె | జిల్లేడు దేవతాక్షితిజ మగునె
కాసరం బతిదర్పకంఠీరవ మ్మౌనె | కాకంబు వరమానసౌక మగునె
మతకరి జోరీఁగ మదపుటేనుఁగ యౌనె | ఘనబిడాలము చిత్రకాయ మగునె
 
తే.రాజగునె జాగ్రదుడు దురాగ్రహముచేతఁ | బ్రజల బాధించు ఘోరదర్పధ్వజుండు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
82
సీ.జింక బొడ్డునఁ దావి జిల్లు కస్తురివోలె | జంబాలమున నీరజంబు వోలె
మొరవ మంచిహొరంగుమెఱుఁగువజ్రమువలెఁ | గప్పచిప్పను మౌక్తికంబు వోలె
సరసోత్కరమునందు విరిదేనియలు వోలె | నెండుగడ్డిని గృశానుండు వోలె
వనబిడాలమునందుఁ గన జవాదిని బోలెఁ | బ్రకటింపఁ గృమియందుఁ బట్టువోలె
 
తే.జగతిలోపలఁ గారణజన్ము లొక్క | కానియెడఁ బుట్టియుఁ బ్రసిద్ధిఁ గాంచుచుంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
83
సీ.సిరికిఁ దోఁబుట్టువౌ జ్యేష్ఠామహాదేవి | దీనత నింటింటఁ దిరుగఁజాగె
హరికిఁ గూరిమిపట్టి యగు మకరాంకుండు | మెయిలేక సోకుఁడై మెలఁగుచుండె
మృడునకు గాదిలికొడుకైన వెనకయ్య | యిప్పటికిని బెండ్లి యెఱుఁగఁడయ్యె
నలినాసనునకు మానసపుత్రుఁడైన ద- | క్షుం డుక్కు సెడి తలకొట్లఁ బడియె
 
తే.నిలను దుష్కర్మసహితుల కెట్టి గట్టి | బంధుజనులున్నఁ గీడు వాపంగ లేరు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
84
సీ.గజముపై మహిషంబు కాలు ద్రవ్వెడునట్లు | కొండతోఁ దగరు డీకొనినయట్లు
కార్చిచ్చుపైఁ బతంగము తారసిలునట్లు | మృగరాజుపై నక్క మొగియునట్లు
బెబ్బులితో జింక పెనఁగఁబోయినయట్లు | పెనుబాముపైఁ గప్ప చనినయట్లు
పిల్లితో నెలుక దర్పించి దార్కొనునట్లు | తోడేలితో మేఁక దొడరునట్లు
 
తే.క్రూరు లొక కొంద రసమానవైర మూని | పోరుచుందురు ఘనులతో బుద్ధిమాలి
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
85
సీ.పొద్దుపొద్దుకు వచ్చి పోలిబొట్లయ్య దా | పంచాగమిప్పి ఒప్పన్న సేసి
సాతి బూదారంబు సాతి నచ్చత్తరా | మసిలేటి కారితే యల్లకలికి
గాందారిపొద్దున గాని వర్చీర్జాలు | రావు మీఁదాతులా రాశి నీకు
సూరీడు సందుడు సుకురుండు నని బుర- | స్సపతి పద్దనకొంట సాగినారు
 
తే.మంచిదని సెప్పి సూకలు మానెఁ డన్ని | కొల్లఁగొనిపోయె నని మూర్ఖకోటి పలుకు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
86
సీ.నింబభూజమునకు నిర్మలోదక మిడి | మనిచినఁ దన చేఁదు మానఁగలదె
పాపకూనకు మంచిపాల్పోసి పెంచిన | నెడరూను తన విషం బుడుగఁగలదె
ఉల్లిగడ్డకుఁ దుషారోదకంబిడి ప్రోది | యిడినను దన కంపు విడువఁగలదె
కందదుంపకుఁ బానకము పోసి పెంచిన | గొదలేని తన దూల వదలఁగలదె
 
తే.దుర్గుణున కెన్ని మంచి వస్తువులు పెట్టి | మనుపఁ జూచిన తన యోజ మానఁగలఁడె,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
87
సీ.ఎనుబోతునకు విద్దె లెన్నింటి నేర్పిన | మడుగున కేగుటల్ మానఁగలదె
శునకంబునకు నెన్ని సూడిదల్ వెట్టినఁ | బుల్లెలు నాకక మళ్ళఁగలదె
గాడిద కెన్ని సింగారముల్ దిద్దిన | బూడ్దెలోఁ బొరలక పోవఁగలదె
యూరబందికి నెన్ని తీరుల మేపినఁ | బరగళ్ళ కేగక బ్రదుకఁగలదె
 
తే.హీనుఁడగువాని సత్ప్రభు లెన్నిగతుల | నునిచి మనిచినఁ జెడుజాడ లుడుగఁగలఁడె,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
88
సీ.నోరు చేఁదై కూడుగూరలు చవి దప్పు | గడగడ నొడలెల్ల వడకుచుండు
జెవుడున నేమియుఁ జెవులకు వినరాదు | తెగులును జింతయుఁ దగులుకొనుచు
కన్నులఁ బొర గప్పి కానరాదెద్దియు | సిగ్గొకించుకయైనఁ జేరఁబోదు
బాలు రందఱుఁ గూడి గేలి గావింతురు | మగువలు పకపక నగుచునుంద్రు
 
తే.మదిఁ దలంపగఁ గటకటా ముదిమియంత | రోఁత లేదు గదా ధారుణీతలమున,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
89
సీ.బావిలోపలఁ బడ్డ పామును వెడలింపఁ | జనువానిఁ గరువక చనఁగఁగలదె
చిచ్చులోఁ బడెడు వృశ్చికమును వెడలింపఁ | జనువాని మీటక నడలఁగలదె
పెనువెల్లిఁ బడి పోవు బెబ్బులిఁ బరికింపఁ | జనువాని మ్రింగక మనుపఁగలదె
బురదగోఁతను బడ్డ పోట్లావు లెగనెత్తఁ | జనువాని బొడువక జరగఁగలదె
 
తే.అవనిలోపల ఖలుని నెయ్యంబు మీఱ | మనుపఁ జనువానిఁ జెఱుపక మానఁగలఁడె?
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
90
సీ.ఘనగహనాంతరోద్గతతృణానీకంబు | ధేనువునందుఁ బాలైనయట్లు
వితతదుర్వర్ణరూపితలోహపిండంబు | రసమునఁ బసిడియై యొసఁగినట్లు
సాంద్రాభ్రవారివృషత్కదంబము శుక్తి- | యందు ముక్తామణియైనయట్లు
భూరికుల్యాతకవారి రసాలమూ- | లమునఁ బానకమై చెలంగినట్లు
 
తే.కరిహయాందోళికారత్నకాంచనాదు- | లగుచు నిజవక్త్రమున నిడ్డ హార్యమొప్పు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
91
సీ.అన్నంబు నాలుక కరుచియై కన్పట్టు | నిలిచినచో నిల్వ నలవికాదు
మనుజేంద్రుతోనైన మాటాడ సైపదు | పనులయందేమియు మనసు లేదు
నడుచుచో నడుగులు తడబాటు గైకొనుఁ | దగఁ బందువులనైన నగవు రాదు
తెవులు పుట్టిన రీతి దేహంబు కృశియించుఁ | గలనైన నిద్దుర గలుగఁబోదు
 
తే.శివశివా ధాత్రిఁ దా వలచిన వధూటిఁ | బాయు వెత వద్దు సుమ్మెట్టి పలువకైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
92
సంపూర్ణము.
కుక్కుటేశ్వరశతకము - కూచిమంచి తిమ్మకవి - ఆంధ్రభారతి - శతకములు - కుక్కుటేశ్వర శతకం - కుక్కుటేశ్వర శతకము - కుక్కుటేశ్వరశతకం - శతకాలు - Kukkutesvara Satakamu - Kuchimanchi Timmakavi - Kukkuteswara Satakam - Kukkuteswara Satakam - KukkuteswaraSatakam - AndhraBharati AMdhra bhArati - shatakamulu - telugu Satakamulu - Telugu Satakalu - tenugu andhra ( telugu andhra ) వేదము వేంకటకృష్ణశర్మ శతకవాఙ్మయసర్వస్వము, 1954 పీఠిక - స్వామీ శివశంకరస్వామీ శతకసంపుటము ద్వితీయభాగము - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ ప్రచురణ, 1968