శతకములు కుమారీ శతకము ఫక్కి వేంకట నరసింహ కవి
క. శ్రీ భూ నీళా హైమవ
తీ భారతు లతుల శుభవతిగ నెన్నుచు స
త్సౌభాగ్యము నీ కొసఁగఁగ
లో భావించెదరు ధర్మలోల కుమారీ!
1
క. చెప్పెడి బుద్ధులలోపలఁ
దప్పకు మొకటైన సర్వ ధర్మములందున్‌
మెప్పొంది యిహపరంబులఁ
దప్పింతయు లేక మెలగఁ దగును కుమారీ!
2
క. ఆటలఁ బాటలలో నే
మాటయు రాకుండఁ దండ్రి మందిరమందున్‌
బాటిల్లుఁ గాపురములో
వాట మెఱిఁగి బాల! తిరుగ వలయుఁ గుమారీ!
3
క. మగనికి నత్తకు మామకుఁ
దగ సేవ యొనర్చుఁచోటఁ దత్పరిచర్యన్‌
మిగుల నుతిఁ బొందుచుండుట
మగువలకుం బాడి తెలిసి మసలు కుమారీ!
4
క. పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నఁడుఁ జేయరాదు బావల కెదుటన్‌
కనఁబడఁగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!
5
క. పరపురుషు లన్న దమ్ములు,
వరుఁడే దైవంబు, తోడి పడుచులు వదినల్‌
మఱదండ్రు నత్తమామలు
ధరఁ దల్లియుఁ దండ్రి యనియుఁ దలఁపు కుమారీ!
6
క. పదములపైఁ జెయివేయక
మదవతి పతిచెంత నిద్ర మరగినఁ జేతుల్‌
గదలంగనీక కట్టుచు
గదఁ గొని శిక్షించు యముఁడు కాంక్షఁ గుమారీ!
7
క. తెచ్చినఁ దేకుండిన నీ
కిచ్చిన నీకున్న మగని నెగ్గాడకుమీ
యొచ్చెము నీపైఁ దేలును
రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ!
8
క. మఱదండ్రు వదినె లత్తలు
మఱఁదులు బావల కొమాళ్లు మఱి పెద్దలు రా
నురవడిఁ బీటలు మంచము
లరుఁగులు దిగుచుండవలయు నమ్మ కుమారీ!
9
క. నోరెత్తి మాటలాడకు
మాఱాడకు కోపపడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగక
మీఱకుమీ యత్తపనుల మెలఁగు కుమారీ!
10
క. పతి పరకాంతలతో సం
గతిఁ జేసిన నాదుపుణ్యగతి యిట్లనుచున్‌
మతిఁ దలఁపవలయు లేదా
బతిమాలఁగవలయుఁ గలహ పడక కుమారీ!
11
క. పతి పాపపుఁ బనిఁజెప్పినఁ
బతిమాలి మరల్పవలయుఁ బతి వినకున్నన్‌
హిత మనుచు నాచరింపుము
మతిలోపల సంశయంబు మాని కుమారీ!
12
క. తిట్టిన దిట్టక, కొట్టిన
గొట్టక, కోపించెనేనిఁ గోపింపక, నీ
పుట్టినయింటికిఁ, బాదము
పెట్టినయింటికిని వన్నె పెట్టు కుమారీ!
13
క. దబ్బరలాడకు కదిమిన
బొబ్బలు పెట్టకుము మంచి బుద్ధిగలిగి యెం
దెబ్బెఱికముఁ బూనక కడుఁ
గొబ్బునఁ జిత్తమున వానిఁ గూర్పు కుమారీ!
14
క. పతి భుజియించిన పాత్రను
మెతు కొక్కటియైన భార్య మెసఁగుటకై తా
హిత మూనకున్న నది యొక
సతియే? కడుఁ బాపజాతి జగతి కుమారీ!
15
క. జపములు, గంగాయాత్రలు,
దపములు, నోములును, దాన ధర్మంబులు, పు
ణ్యపురాణము పతిభక్తికి
నుపమింపను సాటి రాక యుండు కుమారీ!
16
క. ఇరుగు పొరుగిండ్ల కైనను
వరుఁడో, కాక అత్తగారో, వదినెయొ, మామో
మఱఁదియో సెల విడకుండఁగఁ
దరుణి స్వతంత్రించి పోవఁ దగదు కుమారీ!
17
క. కూతురు చెడుగై యుండిన
మాతది తప్పన్నమాట మది నెఱుగుదుగా
నీతల్లిదండ్రులకు నప
ఖ్యాతులు రానీయఁ గూడదమ్మ! కుమారీ!
18
క. అమ్మకు రెం డబ్బకు రెం
డిమ్మహిఁ దిట్టించు కూఁతురెందుకు ధర నా
ద్రిమ్మరి పుట్టక పోయిన
నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ!
19
క. తన బావల పిల్లల యెడఁ
దన మఱఁదుల పిల్లలందుఁ దనపిల్లల కం
టెను మక్కువ యుండవలెన్‌
వనితల కటులైన వన్నె వచ్చుఁ గుమారీ!
20
క. ధనహీనుఁడైనఁ గడు దు
ర్జనుఁడైనఁ గురూపియైన జారుండైనన్‌
విను పాపియైన నెప్పుడుఁ
దనపతియే తనకు దైవతంబు కుమారీ!
21
క. ధనవంతు డైనఁ యప్పుడుఁ
పెనిమిటి చిత్తం బెఱింగి పెండ్లాము మెలం
గును లేమి మెలఁగ నేర్చిన
వనితకు లోకమున వన్నె వచ్చుఁ గుమారీ!
22
క. తలిదండ్రు లన్నదమ్ములు
తులఁ దూగఁగ నిమ్ము పసిడిఁ తోనైనను వా
రలయింట సతత ముండుట
వెలఁదికి మర్యాదగాదు వినవె కుమారీ!
23
క. కడుపారఁ గూడుఁ గూరలు
దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా
వడితనమునఁ బెనిమిటితో
నెడఁ బాసి చరింపఁ గూడదెపుడు కుమారీ!
24
క. పిల్లలఁ గనుగొనఁ దలఁచిన
యిల్లాలు గతాగతంబు లెఱుఁగక ఱాఁగై
యల్లరిఁ బెట్టినఁ జెడుఁ దా
నుల్లసములఁ బడును, గీడు నొందుఁ గుమారీ!
25
క. పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానఁగవలయున్‌
హిత మాచరింపవలయును
బ్రతుకున కొకవంక లేక పరఁగు గుమారీ!
26
క. పోకిళ్ళు పోక పొందిక
నాకులలోఁ బిందెరీతి నడఁకువగా నెం
తో కలిసిమెలసి యుండిన
లోకములోపలను దా వెలుంగుఁ గుమారీ!
27
క. అత్తపయిన్‌ మఱఁదలిపయి
నెత్తిన కోపమున బిడ్డ నేడ్పించుటకై
మొత్తినఁ దనకే కీడగుఁ
జిత్తములో దీనిఁ జింత సేయు కుమారీ!
28
క. మృతియైనను బ్రతుకైనం
బతితోడనె సతికిఁ జెల్లుఁ బతిబాసిన యా
బ్రతు కొక బ్రతుకా! జీవ
న్మృతి గాక వధూటి కెన్న నిదియుఁ గుమారీ!
29
క. మగని ప్రియ మబ్బె ననుచును
దెగ నీలిగి యింటివారి దిగఁద్రొక్కుచు దుం
డగురాలై తిరిగిన సరి
మగువలలో నిదియె తప్పు మాట కుమారీ!
30
క. జీవములు భర్తపద రా
జీవములని చిత్తమందు జింతించిన ల
క్ష్మీవల్లభు చరణంబుల
సేవ లతాంగులకు నెమ్మిఁ జేయుఁ గుమారీ!
31
క. కడు బుద్ధిగలిగి మెలఁగినఁ
బడఁతుక పుట్టింటివారు పదివేలవరా
లిడుకంటెఁ గీర్తియగు ద
మ్మిడి లేకుండినను నేర్చి మెలఁగు కుమారీ!
32
క. కడుఁ బెద్దమూటఁ దెచ్చినఁ
జెడుగై వర్తించు నేనిఁ జిరతర చింతం
బడుదురు తల్లిదండ్రులు తోఁ
బడుచులు సోదరులు నిందఁ బడుదురుఁ గుమారీ!
33
క. పుట్టింటివారి నీచతఁ
బెట్టకు మత్తింటివారు పెట్టెడి బాధల్‌
పుట్టింటఁ దెలియనీకు
రట్టడి చెలియందు రదియె రవ్వ కుమారీ!
34
క. తనకెంత మేలు చేసిన
మనమున కింపైన పనులుఁ మసలిన దాసీ
వనితల కెన్నటికైనం
జనవిచ్చి మెలంగరాదు జగతిఁ గుమారీ!
35
క. కులదేవతలకుఁ బెట్టిన
పొలుపునఁ దనయింటయాఁడు బొట్టెల కెల్లం
గలమాత్ర మొసఁగకుండినఁ
గలఁత పొడము దాన మేలు గాదు కుమారీ!
36
క. బద్ధకము సంజనిద్దుర
వద్దుసుమీ దద్దిరంబు వచ్చును దానన్‌
గద్దింతు రింటివారలు
మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ!
37
క. ఇంటఁ గల గుట్టు నీ పొరు
గింట రవంతైనఁ దెలుప నేఁగకు దానం
గంటనపడి నీవారలు
గెంటించెద రిల్లు వెడలఁ గినుకఁ గుమారీ!
38
క. వేకువజామున మేల్కని
పైకి వెడలి వచ్చి ప్రాచి పనిఁ దీర్పవలెన్‌
లేకున్నఁ దెల్లవాఱిన
లోకులు నవ్వుదురు సభల లోనఁ గుమారీ!
39
క. ఇక్కడి దక్కడఁ నక్కడి
దిక్కడఁ జెప్పినను వారి కిద్దఱికిఁ బగల్‌
పొక్కినఁ గల చేడియ ల
మ్మక్కా! యిడుముళ్ళమారి యండ్రు కుమారీ!
40
క. తలవాకిట నెల్లప్పుడు
నిలువఁగ రా దెప్పు డెంత నిద్దురయైనన్‌
మెలఁకువ విడరాదు సుమీ
తల నడుచుచు విప్పికొనుట తగదు కుమారీ!
41
క. వారికి వీరికిఁ గలిగెను
గోరిన వస్తువులు మాకుఁ గొదవాయె నటం
చూరక గుటకలు మ్రింగుట
నేరముగాఁ దలఁపవలయు నెలఁత కుమారీ!
42
క. కొన్నాళ్లు సుఖము కష్టము
కొన్నాళ్లు భుజింపకున్నఁ గొఱగాదు సుమీ!
పున్నమ దినముల వెన్నెల
యెన్నంగ నమాసలందు నిరులు కుమారీ!
43
క. పొంతఁ బని సేయ కెన్నఁడు
పంతంబులు పలుకఁబోకు ప్రాఙ్ముఖముగ నీ
దంతంబులు దోమకు మే
కాంతంబులు బయలుపఱుప కమ్మ! కుమారీ!
44
క. నడకలలో నడుగుల చ
ప్పుడు వినఁబడకుండవలయు భువి గుంటలు క
న్పడరాదు మడమనొక్కులఁ
బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ!
45
క. నవ్వంగ రాదు పలుమఱు
నవ్వినఁ జిఱునవ్వు గాని నగరా దెపుడున్‌
గవ్వలవలె దంతంబులు
జవ్వునఁ గానంగ బడెడి జాడఁ గుమారీ!
46
క. తొడవులు మిక్కిలి గలిగినఁ
గడుఁ ప్రేమన్‌ మగఁడు మిగుల గారామిడినన్‌
పడఁతుక పసుపుం గుంకుమ
గడియైనను విడువ రాదు గాదె కుమారీ!
47
క. చెడుఁగులతో లంజెలతో
గుడిసేటులతోడఁ బొత్తుఁ కూడదు మది నె
ప్పుడు నిల నుత్తమ కాంతల
యడుగులకు న్మడుగులొత్తు మమ్మ కుమారీ!
48
క. విసువకు పని తగిలినయెడఁ
గసరకు సేవకుల మిగులఁ గాంతునితోడన్‌
రొసరొస పూనకు మాడకు
మసత్యవచనంబు లెన్నఁ డైనఁ గుమారీ!
49
క. వేళాకోళంబులు గ
య్యాళితనంబులును జగడ మాడుటలును గం
గాళీపోకలుఁ గొండెము
లాలోచించుటయుఁ గూడ దమ్మ కుమారీ!
50
క. బంతులను బక్షపాత మొ
కింతైనను జేయరాదు హీనదశుల సా
మతుల నొక భంగి నిరీ
క్షింతురు బుధులెల్ల సంతసిల్లం గుమారీ!
51
క. మాసినతల మాసినయిలు
మాసిన వలువలు దరిద్ర మార్గంబులు నెం
తేసి ధనవంతులైనను
గాసిల్లుదు రల్పదశల గ్రాఁగి కుమారీ!
52
క. సన్నెకలుం బొత్రమ్మును
తన్నుకబోరాదు కాలఁ దగిలిన యెడలన్‌
గన్నుల నద్దుకొన న్వలెఁ
గ్రన్నన సిరి యందు నిలుచుఁ గాదె కుమారీ!
53
క. దీపము వెలిగిం చెడిచోఁ
జీపురుపుడ కుంచవలయుఁ జేతుల నేతం
బాపము పాలౌదువు మది
లోపల నిది తలఁపవలయు రూఢిం గుమారీ!
54
క. సరకులయెడ జాగ్రత్తయుఁ
జుఱుకు పనులయందు భక్తి సుజనులయందున్‌
గరుణ యనాథుల యెడలం
దరుణికి జెలువారవలయు ధరణిఁ గుమారీ!
55
క. చెప్పినఁ జెప్పక యుండినఁ
దప్పక సేయంగవలయుఁ దనపనులెల్లన్‌
మెప్పొదవఁగాను లేదా
ముప్పొదవును గాదె యెందు ముద్దు కుమారీ!
56
క. ఎంగిలి పరులకుఁ బెట్టకు
క్రంగున మ్రోయంగనీకు కాల్మెట్టియలన్‌
బంగారు లాభ ముండిన
దొంగతనము సేయుబుద్ధి దొలఁచు కుమారీ!
57
క. ఆపదల కోర్చి సంపద
లాపయి భోగించు ననెడి హర్షోక్తుల నీ
లోపలఁ దలఁచుచు లాంతరు
దీపముచందమున వెలుఁగఁ దివురు కుమారీ!
58
క. తనకడుపు కట్టుకొని యై
నను జుట్టమ్మునకు బెట్టి నను గీర్తి వహిం
చును భుక్తి ముక్తు లబ్బును
దన కెవ్వరు సాటిరారు ధరణిఁ గుమారీ!
59
క. వడి దనిపించుకొనుటకున్‌
గడి యైననుఁ బట్టకుండుఁ గాంతలలో నె
క్కుడు గుణవతి యనిపించెడి
నడవడి నేర్చుటయె కడు ఘనంబు కుమారీ!
60
క. చెప్పకు చేసినమేలు నొ
కప్పుడయినఁ గాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పే యని చిత్తమందుఁ దలఁపు కుమారీ!
61
క. ఎంతటి యాఁకలి కలిగిన
బంతిని గూర్చుండి ముందు భక్షింపకు సా
మంతులు బంధువులును నిసు
మంతైనను జెల్ల దందు రమ్మ కుమారీ!
62
క. అధికారము లేనిపనుల
కధికారము సేయఁబోకు మందునఁ గోపం
బధికం బగు నీవారికి
బుధు లది విని హర్ష మొందఁ బోరు కుమారీ!
63
క. తా నమ్ముడు వడియైనం
దీనుండగు ధవునియార్తిఁ దీర్చగ సతికిన్‌
మానము చంద్రమతీ జల
జాననఁ దలపోయవలయు నాత్మఁ గుమారీ!
64
క. తనకంటెఁ బేదరాండ్రం
గని యంతకుఁ దనకు మేలు గా యనవలయున్‌
దనకంటె భాగ్యవంతులఁ
గని గుటకలు మ్రింగ మేలు గాదు కుమారీ!
65
క. విఱుగఁబడి నడువఁ గూడదు
పరుల నడక లెన్ని తప్పు బట్టఁజనదు ని
ష్ఠురములు వచింపఁగూడదు
కఱపఁగవలె మేలు మేలు గలదు కుమారీ!
66
క. కోపమున నప్పు డాడ ని
రూపించినమాటఁ గొన్ని రోజులు చనినం
జూపెట్టుదు నని శాంతము
లోపలఁ గొనవలయు ధర్మలోల! కుమారీ!
67
క. కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములు లేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ!
68
క. గురుశుక్రవారముల మం
దిర గేహళులందు లక్ష్మి తిరముగ నిలుచుం
గరగరిక నలకి మ్రు గ్గిడి
గురుభక్తి మెలంగఁ బాయు గొదువ కుమారీ!
69
క. అపకీర్తి బొందుట క
ష్టపుఁబని గా దొక్క గడియ చాలును గీర్తిన్‌
నిపుణత వహింపవలయును
జపలగుణములెల్లఁ బాసి చనఁగఁ గుమారీ!
70
క. సరకులు బట్టలు వన్నెల
కెరవులు తేఁదగదు తెచ్చెనేని సరకు ల
క్కఱఁ దీర్చుకొనుచు వెంటనె
మరలింపకయున్నఁ దప్పు మాట కుమారీ!
71
క. గొప్పదశ వచ్చెననుచు నొ
కప్పుడయిన గర్వపడకు మదిఁ దొలఁగినచో
జప్పట్లు చరతు రందఱుఁ
దప్పని దండించు దండధరుఁడు కుమారీ!
72
క. సుమతియును జంద్రమతియును
దమయంతియు జానకియును ద్రౌపదియును బ
న్నములం బడి పతిభక్తిం
గ్రమమున నడుపుటలు తలఁప గాదె? కుమారీ!
73
క. సుమతి యను రమణి పతికై
శ్రమనొందుట నీచసేవ సలుపుటయు వియ
ద్గమననిరోధము భానున
కమరించుటయుం దలంపు మాత్మఁ గుమారీ!
74
క. వాణియు శర్వాణియు హరి
రాణియు వాక్కునను మైనురంబున నుంటల్‌
రాణఁ దిలకించి మదిలో
బాణిగ్రాహియెడ నిల్పు భక్తిఁ గుమారీ!
75
క. వడ్డించునపుడు తాఁ గను
బిడ్డనికిం దల్లిభంగిం బ్రేమ దలిర్పన్‌
వడ్డింపవలయు భర్తకు
నెడ్డెతనము మానవలయు నెందుఁ గుమారీ!
76
క. పవళించునపుడు రంభా
కువలయదళనేత్రభంగి గోరినరీతిన్‌
ధవుని కొనఁగూర్పవలయును
దివి భువి నుతిఁ బొందునట్టి తెఱవ కుమారీ!
77
క. ఆలోచన యొనరించెడి
వేళలలో మంత్రిభంగి వివరింపవలెన్‌
కాలోచిత కృత్యంబుల
భూలోకమునందుఁ గీర్తి బొందుఁ గుమారీ!
78
క. పనిసేయునపుడు దాసీ
వనితవిధంబునను మేను పంపఁగవలయున్‌
ధనవంతుల సుత యైనను
ఘనత గలుగు దానివలనఁ గాదె కుమారీ!
79
క. దానములు ధర్మకార్యము
లూనంగాఁ గలిగినంత యుక్తక్రియలన్‌
మానవతుల కిది ధర్మము
గా నెఱిఁగి యొనర్పవలయుఁ గాదె కుమారీ!
80
క. శ్రమ యెంత సంభవించిన
క్షమ మఱువఁగ రాదు ధరణి చందంబున స
త్యమునఁ బ్రవర్తించిన యా
రమణియె లోకంబునందు రమణి కుమారీ!
81
క. ఈ రీతిఁ దిరుగ నేర్చిన
నారీమణి కీర్తిఁ బొందు నరలోకమునన్‌
దూఱులు తొలంగి పోవును
ఘోరదురితసంఘ మెల్ల గుందుఁ గుమారీ!
82
క. కామము సంకల్పంబున
బామొందెడుఁ దొలగుఁ దేహ భావము దెలియన్‌
వేమఱు నిది పరికించుట
క్షేమం బగు ముక్తిఁ గని సుఖింపు కుమారీ!
83
క. పరజనము లాచరించెడి
దురితంబునఁ గ్రోధగుణము దోఁచెడి నధిక
స్ఫురణన్‌ క్షమఁ గైకొనినం
దఱుఁగు నది యెఱింగి మెలఁగ దగును కుమారీ!
84
క. దృశ్యపదార్థము లెల్లను
నశ్యము లని తలపఁ కుండినను లోపంబౌ
దృశ్యంబున నస్థిరత న
వశ్యము చిత్తమునఁ దలఁప వలదె కుమారీ!
85
క. జనియించెడు నజ్ఞానం
బున మోహగుణంబు, ధర్మమునఁ బరికింపం
దునుమాడఁ బడును దీనిం
గనుఁగొని మెలఁగంగ వలయుఁ గాదె కుమారీ!
86
క. కులమున విత్తంబున వి
ద్యలను మదం బుద్భవించు నాయా పెంపుల్‌
తలపోయ మరలు నిది హృ
జ్జలజంబునఁ దలఁపవలయు సతముఁ గుమారీ!
87
క. మాత్సర్య మొదవు సత్యము
హృత్సరసీజమున లేమి నెల్లప్పుడుఁ దా
సత్సేవయందుఁ దిరిగిన
మాత్సర్య మణంగుఁ దెలిసి మనుము కుమారీ!
88
క. బహుకష్టములం బొందక
మహిలో సమకూడఁబోదు మానవజన్మం
బహహా! యీ జన్మంబున
నిహపరములఁ గొనెడుజాడ లెఱుఁగు కుమారీ!
89
క. ఎన్నాళ్లు బ్రతుకఁ బోదురు
కొన్నాళ్లకు మరణదశలఁ గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!
90
క. పెనిమిటికన్నఁ బతివ్రత
మునుపే మృతిఁ బొందెనేనిఁ బురుషాగమనం
బున కెదురుచూచు వచ్చినఁ
గనుగొని యనురాగ మెనయఁ గలయుఁ గుమారీ!
91
క. మును నాథుఁడు దరలినచో
వెనువెంటనె పోయి యెల్ల వేల్పులు పొగడం
గని యెందు నిందు నందును
ఘనకీర్తులఁ బొందుచుండుఁ గాదె కుమారీ!
92
క. మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగారాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములు
దరిఁ బ్రేమ మెలంగవలయుఁ దరుణి కుమారీ!
93
క. ఆకు లొకిన్నియుఁ జేకొని
పోఁక నమిలి సున్న మడుగఁ బోయినఁ గని యీ
లోకులు నవ్వుదురు సుమీ!
కైకొనవలె మంచినడత ఘనతఁ గుమారీ!
94
క. నేలన్‌ వ్రాలిన పత్రము
లోలిం జోడించి, మడచు చుండిన యవియున్‌
బోలఁగ సున్నపుటాకులు
దూలించు దరిద్రదశల దోఁచఁ గుమారీ!
95
క. ఇద్దఱు గూడుక యొక చో
నొద్దిక మాటాడుచుండ నొదిఁగి యొదిఁగి యా
యొద్దకుఁ జనఁగూడదు తన
పెద్దతనంబెల్ల నణఁగ బెట్టుఁ గుమారీ!
96
క. తుడుపుదుమారమ్మును జెరు
గుడుధూళియు మేషరజముఁ గూడ దెపుడు మైఁ
బడ నెఱిఁగి తిరుగ నేర్చిన
బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ!
97
క. దీపములనీడ మానవ
రూపంబులనీడ శనితరులనీడను ఖ
ట్వాపాదిత మగు నీడ
నేపట్టున నిలువఁగూడ దెపుడుఁ గుమారీ!
98
క. కొనగోళ్ళ వ్రేలువెండ్రుక
లను జాఱెడునీళ్ళు, కుండలన్‌ ముంతల వా
డిన వెన్క మిగులునీళ్ళును
జన దండ్రు దరిద్ర మొందు జగతిఁ గుమారీ!
99
క. ధర బక్కికులుఁడు వేంకట
నరసింహకవీంద్రుఁ డిట్టి నడతలు ధరపైఁ
దెఱవల తెరువు లటంచును
జిరతర సత్కీర్తి వెలయఁ జెప్పెఁ గుమారీ!
100
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumArI shatakamu - phakki vEMkaTa narasiMha kavi - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )