శతకములు కుప్పుసామి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
గొంటరులఁ దుంటరుల గుమిగూర్చి సృష్టిఁ
జేసి చీటికి మాటికి డాసి వారు
తన్నుకొని చచ్చుచుండంగఁ దనియుచుండు
గొప్ప వానికి జేజేలు కుప్పుసామి.
1
ఏడొ, పద్నాలుగో, మూఁడొ యెన్నొ, జగము
లెల్ల సృష్టించి నటువంటి యీశుఁడొకరొ
యిర్వురో, యెందఱో వారి కెల్ల నేటి
కోళ్ళ నర్పింతు భక్తితోఁ గుప్పుసామి.
2
చిన్న పిల్లలకును దల్లి చెప్పునటులఁ
దెలుఁగు మాటల పొంకంబుఁ దీర్చి దిద్ది
తెలిసి తెలియక యర్థంబు తెలియునటులఁ
జెప్పఁ బూనితిఁ గఱదలు కుప్పుసామి.
3
మున్ను పెద్దలు చెప్పిన వెన్నొ కలవు,
ఎన్నకుండిన నీతులు కొన్ని కలవు
పేరుగాఁ గ్రుచ్చి మెడలోన వేతువానిఁ
గుతిల పడకుండఁ దాల్చుము కుప్పుసామి.
4
కమ్మ నెత్తావి దెసలెల్లఁ జిమ్మునట్టి
గంధఫలి చెంతఁజేరదు గండు తేఁటి
తేనె లేదన్న సంగతిఁ దెలిసికొనుచుఁ
దప్ప కీనీతి స్మరియింపు కుప్పుసామి.
5
పూలు తెగఁబూసినప్పుడు మూఁగుచుండుఁ
దేనెటీఁగలు పైఁబడి తేనెకొఱకు
స్నేహితులు కొంద ఱీరీతిఁ జేరుచుందు
రప్పుడప్పుడు కనిపెట్టు కుప్పుసామి.
6
పండ్ల చెట్లక్రిందకు నెట్టి బాటసారి
యూఱకేరాఁడు ఫలమును గోరివచ్చు
వాని నొకకంటఁ గనిపెట్ట వలసియుండు
గోల గాకుండ సుంతైనఁ గుప్పుసామి.
7
ఒకనియెడఁ గృతఘ్నతఁజూపి యున్న వాని
నమ్మియుండుట తగదు లేశమ్ము కూడఁ
దనకు లాభంబు కల్గుచోఁ దత్క్షణంబ
ముప్పు తప్పక చేకూర్చుఁ గుప్పుసామి.
8
ఒక్కమానవుండు డొక్కచీల్చినఁగాని
నారికేళఫలము నీరు నీదు
గొంటుకాని నిట్లు గోరాడకుండిన
నొప్పుకలుగఁనీడు కుప్పుసామి.
9
పిలువకుండ వచ్చి పెద్దమాటలు చెప్పు
వానినెపుడు నమ్మ వలదు, వలదు
మేలుకలుగబోదు మెఱమెచ్చుల కతండు
తప్పుచెప్పుచుండుఁ గుప్పుసామి.
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kuppusAmi shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )