శతకములు మంచి మాట వినర మానవుండ! శ్రీమతి భమిడి కామేశ్వరమ్మ
గురుస్తుతి
వందన మిదె గురు పాదపద్మములకు
నతులొనర్తును పరమగురు పదద్వంద్వములకు
భక్తి కొలతును పరమేష్ఠిగురు పాదపంకజములకు
తలతు నేవేళనూ గురుత్రయము నెపుడు.
1
నాదు చేయిబట్టి తనదరికి నడపించి
భక్తిరీతులనెన్నొ బోధ చేసి
నా గురుండు సఖుడు నాదైన దైవంబు
నా ప్రాణ పతికిదె నమస్కారశతము.
2
ఇష్టదేవతా ప్రార్థన
ముందుగ నిను పూజించెద సురవందిత
విఘ్నరాజ విఘ్నములుడుపన్‌;
గిరిరాజతనయ నందన
కారుణ్యము తోడ నన్ను గావుము తండ్రీ!
3
నలువరాణి నిన్ను, నా హృదయమందున
కొలుతు భక్తి తోడ, కొర్కెలొసగ
అల్లిబిల్లి నాదు పలుకులను మన్నించు;
ఉల్లసము గాదె, తొక్కు పల్కులు తల్లి కెంతొ!
4
ఎరుగను నే గణ విభజన
లెరుగను యతి ప్రాసలనగ నేవియొ తల్లి!
ఎరుగుదు నీ పదముల నొరుగుట
ఎరుకపడంగచెప్పు, విద్యలెల్లను నాకున్‌!
5
తల్లి భారతి నిన్ను నా యుల్లమందు
స్మరణజేసెద, వాక్కున సుధనొసంగ
సకల విద్యాప్రదాత, నీ కరుణ లేక
పలుకనేర్తురే, ఎంతటి వారలైన?
6
కాళిదాసుని కవిశ్రేష్ఠుని గంటమున నిలచి
తేనెవానలు కురిపించినావు భువిని
తడవిననె జాలు మేఘసందేశ, శాకుంతలముల
మరతురె బుధవరేణ్యులు పృథ్వి యున్నంత దనుక!
7
మంచి మాట వినర మానవుండ
శివుని పూజలేని చిత్తంబు అదిఏల?
పితృ పూజలేని విత్తంబులవి ఏల?
మాతృపూజలేని మనుగడ ఏలరా?
మంచి మాట వినర మానవుండ!
1
మాయలోనపుట్టి, మాయలోనపెరిగి,
మాయతెలియలేడు మానవుండు
మాయతెలిసెనేని, మాధవున్‌ గనుగొను
మంచి మాట వినర మానవుండ!
2
నిన్ను కడుపున మోసి, ప్రసవ బాధలకోర్చి,
హేయమైన ఊడిగములుచేసి,
నీదు ఉన్నతి గోరు తల్లిని మరువకు,
మంచి మాట వినర మానవుండ!
3
నీకు జన్మంబిచ్చి, నిన్ను తీర్చిదిద్ది,
కంటికి రెప్పవలె నిన్ను గాచి,
నీవె తాననుకొను, తండ్రిని పూజింపు
మంచి మాట వినర మానవుండ!
4
నుదుట వ్రాసియున్న వ్రాతకన్నను మించి
నువ్వుగింజయంత నీకు రాదు,
ఎండమావుల వెంట ఎందుకురా పరుగు?
మంచి మాట వినర మానవుండ!
5
ఎన్నివిధముల బెంచి పోషించినను,
మనుజ కాయంబు నిలుచుట కల్ల గాదె,
మాయ కాయమందు మోహంబు ఏలరా?
మంచి మాట వినర మానవుండ!
6
చిత్తంబునున్నట్టి శివుని గాంచగలేక
గుడిగోపురములంచు దిరుగనేల?
వెఱ్ఱివగుచు నీవు వెతల జెందగనేల?
మంచి మాట వినర మానవుండ!
7
ఊరి ముందరనున్న నదికెన్నడును పోడు
తీర్థయాత్రలంచు తిరుగుచుండు
మందుచెట్టు మనకు ముందున్న గనబోము
మంచి మాట వినర మానవుండ!
8
తన్ను తాను ముందు తెలుసుకొని పిమ్మట
పరులకుపదేశించుటెల్ల లెస్స
తాను గ్రుడ్డియైన దారెట్లు జూపును?
మంచి మాట వినర మానవుండ!
9
ఎక్కువ ధనమున్న, ఎట్లుగాతునను ఏడ్పు,
లేకయున్న, ధనము లేదనేడ్పు
ఏడ్పులేని మనుజులెందును లేరురా
మంచి మాట వినర మానవుండ!
10
మనసు నిల్ప నీకు మరి చేతగాకున్న
జపతపంబులేల, జన్నమేల?
మనసు నిల్పు నాడు మరి పూజలేలరా?
మంచి మాట వినర మానవుండ!
11
ఎంచి చూడ, జనులకొక రెండు దారులు
మంచి చెడ్డలనగ మహిని గలవు
మంచి దారిబోవ, మాధవుండెదురగును
మంచి మాట వినర మానవుండ!
12
తాను చేయు తప్పు తను తెలిసికొనలేక,
ఒరుల తప్పు లెన్నుటొప్పు గాదు
తనదు తప్పు తెలుసుకొనువాడె ధన్యుండు
మంచి మాట వినర మానవుండ!
13
నీకుచేతనైన ఒరులకుపకరించు
చేతగాకున్న, ఊరక చూచుచుండు
చెడ్డవానికైన చెడు చేయకెన్నడు
మంచి మాట వినర మానవుండ!
14
ఆశయుండవచ్చు, అది సహజమెల్లరకు,
ఆశలేని మనుజుడవని లేడు
ఆశ దురాశయైన దుఃఖంబు తప్పదు
మంచి మాట వినర మానవుండ!
15
ఇల్లు నాది యనుచు, ఇల్లాలు నాదనుచు
ప్రాకులాట ఏల పామరుండ?
వెళ్ళిపోవునాడు వెంటెవరు రారురా
మంచి మాట వినర మానవుండ!
16
ఆకలైనవానికన్నమిడుట లెస్స
పాత్రతెరిగి దానమిడుట లెస్స
మనకు విలువయున్న మాటాడుట లెస్స
మంచి మాట వినర మానవుండ!
17
రాము రహీమంచు క్రీస్తుదేవుండనుచు
వాదమేల వట్టి మూఢజనుడ
స్వర్ణ మొక్కటే గాని, భూషణంబులు వేరు
మంచి మాట వినర మానవుండ!
18
హస్తద్వయము కలుప చప్పట్టుల్‌ మ్రోగును
మాటకు మాట పోట్లాట యగును
మాట పెరుగుచోట మౌనివై యుండుము
మంచి మాట వినర మానవుండ!
19
చెడ్డవాని చెలిమి చేయబోకెన్నడు
ముప్పుతప్పదెన్నడైన నీకు
ఇనుము సమ్మెట సామెతెరిగినదె కదర
మంచి మాట వినర మానవుండ!
20
ముసలితనమునందు జపము చేసెదనంచు
కాలమంత వృథగ గడపబోకు
మతిలేని ముదిమిని మనసెటుల నిలచును
మంచి మాట వినర మానవుండ!
21
మంచి కార్యము జేయ మదిని దలచునపుడు
రేపు రేపటంచు నాపబోకు
క్షణ భంగురంబైన దేహమ్ము నమ్మకు
మంచి మాట వినర మానవుండ!
22
నీటిబుగ్గకు క్షణము నిలకడ యున్నది
అంతకన్న దేహమశ్వరంబు
దీపముండగానె దిద్దుకొను నీ ఇల్లు
మంచి మాట వినర మానవుండ!
23
పుట్టుటెంతనిజమొ, పోవుటంత నిజము,
నడుమ నాటకంబు నరుని బ్రతుకు
తెరపడుటెప్పుడో ఎరుగువాడెవ్వడు?
మంచి మాట వినర మానవుండ!
24
తోలు క్రింది వ్రాత తొలగజేయగ లేడు
విద్యలెన్నియున్న, విత్తమున్న
అనుభవించవలసినదె ఎంతవారలైన
మంచి మాట వినర మానవుండ!
25
అన్ని నాకు తెలుసునని విర్రవీగకు
క్షణములోనవచ్చు దెరుగవీవు
నుదుటి వ్రాతనెరుగు ఘనత నీకున్నదా?
మంచి మాట వినర మానవుండ!
26
ఒకని సంపద జూచి ఓర్వలేనివారు
సుఖము, శాంతి లేక కుములుచుంద్రు
ఇంట నగ్నిబుట్ట ఇల్లు దహియింపదా?
మంచి మాట వినర మానవుండ!
27
బంగారు పూల భగవంతు పూజించినన్‌ ,
భక్తి లేక పూజ ముట్టబోడు
హృదయ కుసుమమొకటి అర్పింప తృప్తుడౌ
మంచి మాట వినర మానవుండ!
28
మాయ నాటకమందు మనసును నిలుపక
మాయ దాటు మార్గమరయు మీవు
మానవ జన్మంబు మరిమరి రాదురా
మంచి మాట వినర మానవుండ!
29
అమ్మల, బాబాల నమ్మకు మదిలోన
గారడీ విద్యల ఘనులు వారు
నమ్ము నీహృదయమున జగదంబ పాదముల్‌
మంచి మాట వినర మానవుండ!
30
హస్తమున జపమాల అలవాటునను తిరుగు
చిత్తంబు తిరుగు తన ఇచ్ఛరీతి
చిత్తంబు పట్టుము, శ్రీహరిన్‌ గట్టుము
మంచి మాట వినర మానవుండ!
31
ధర్మంబు తప్పక సంచరించెదవేని,
అర్థ కామములు నీ వెంటనంటు
మోక్షంబు సిద్ధించు, జన్మంబు తరియించు
మంచి మాట వినర మానవుండ!
32
అర్థ మర్థమనుచు అర్రులు చాచక
బ్రతుకునకర్థంబు వెదకు మీవు
వ్యర్థంబు గానీక, దిద్దుకొనుమీజన్మ
మంచి మాట వినర మానవుండ!
33
విగత జీవికొరకు వగచుట ఎందులకు
స్థిరముగా నీవుండగలవె, ఇచట?
పుట్టుట, గిట్టుట సృష్టి ధర్మంబులు
మంచి మాట వినర మానవుండ!
34
పరమాత్మ చూపునందున చూపు నిలుపు
అతని నామమె నీ వీనులందు నింపు
పట్టు మాతని పదము గట్టిగా నీ మదిని
మంచి మాట వినర మానవుండ!
35
మైల పడితిమనుచు మరి మరి స్నానముల్‌
జేయ మైల వదలబోదు వినుము
మనసు మూలల నున్న మైలను వదలించు
మంచి మాట వినర మానవుండ!
36
మత్తెక్కి పరుగిడు మత్త గజంబును
కొంత శ్రమ జేత పట్టి బంధించ వచ్చు
పరుగిడు చిత్తంబు పట్ట నెవ్వరి వశము?
మంచి మాట వినర మానవుండ!
37
ఎంత చదువు చదివి, ఎన్నెన్ని నేర్చినన్‌
కోపముడుగకున్న, అన్ని సున్న
ఫణిరాజు శిరమున మణియున్న ఫలమేమి?
మంచి మాట వినర మానవుండ!
38
మలినమంటకుండ మనసునుంచితివేని
ఆత్మసాక్షాత్కార మందగలవు
మసిబారు అద్దమున మనిషి కనిపించునా?
మంచి మాట వినర మానవుండ!
39
చెడ్డ తలపు పెద్ద మనసునందు మొలకెత్తిన
పెరిగి పెరిగి పెద్ద వృక్ష మగును
వ్రేళ్ళూనుటకు మున్నె వెడలగొట్టుము దాని
మంచి మాట వినర మానవుండ!
40
ఎన్నెన్ని జన్మల నెత్తితివో తొల్లి
భాగ్య వశమున కలిగెనీ మనుజ జన్మ
మరు జన్మ లేకుండ మాధవుని సేవించు
మంచిమాట వినర మానవుండ!
41
చిక్కవలదు విషయ వాంఛల నెల్లపుడు
చిక్కకు సంసార జలధియందు
చిక్కుపడు ఎల్లపుడు శ్రీహరి పదభక్తి
మంచిమాట వినర మానవుండ!
42
జరయను రాకాసి తగిలిన వెనుక
నీవేమి చేయగలేవు, సర్వ శక్తులుడుగు
త్వరపడుమిప్పుడే హరి పూజ చేయంగ,
మంచిమాట వినర మానవుండ!
43
తాను లేకయున్న, తలక్రిందులవునని
మోరవిరచి విర్ర వీగువాడు
తన్ను గాచువాని నెన్నడు గనలేడు
మంచిమాట వినర మానవుండ!
44
తన్ను బిలువకుండ దగ దెచటికిబోవ
సుతులు, హితులు, ప్రాణ బంధులైన
దక్షునింట నాడు దాక్షాయణేమాయె
మంచిమాట వినర మానవుండ!
45
సంపదున్ననాడు, చనుదెంతురెల్లరు
తేనె కొరకు చీమలేగినట్లు
నిర్ధనుండవైన, నిన్ను జేరరెవ్వరు
మంచిమాట వినర మానవుండ!
46
నీదు స్థితిని మించి నెయ్యంబు నెరపిన,
బాధ తప్పదు బ్రతికియున్నదాక
కాసుకున్న విలువ మానిసికేదిరా?
మంచిమాట వినర మానవుండ!
47
అడ్డాలనాటి యా బిడ్డలు బిడ్డలు
గడ్డాలనాడు నీ సుద్దు వినునె?
ఇట్టి నిజము తెలిసి దుఃఖించుటేలరా?
మంచిమాట వినర మానవుండ!
48
సుతులవల్ల కాని గతులు కలుగ వటంచు
ఆడబిడ్డల నపహసించు నొకడు
ఆడువారు లేక అవనెట్లు నిలచును?
మంచిమాట వినర మానవుండ!
49
నీదిగాని దానికెన్నడాశించకు,
నీదియైన దాని వదలబోకు
నీకు సాటి రారు నిలలోన నెవ్వరు
మంచిమాట వినర మానవుండ!
50
సంసార రథమున చక్రాలు సతి పతుల్‌
రెండు సరిగ నుండ బండి నడచు
మాట భేదమైన మరి బండి నడువదు
మంచిమాట వినర మానవుండ!
51
ఇంట తన సతి యుండ, తుంటరి తనమున
పరభామినుల కొరకు పర్వులెత్తు
ఆడువారలందరవని ఒక్కటి గాదె?
మంచిమాట వినర మానవుండ!
52
కాసులున్నవాడె ఈశుండు భువిలోను
నతడేమి చెప్పిన నదియె ఘనత
నిర్ధనుండు చెప్పు నిజమును నమ్మరు
మంచిమాట వినర మానవుండ!
53
పోరులేని ఇంట పొసగును సౌఖ్యంబు
పోరు కల్గ, బ్రతుకు భారమగును
చింతలేనిచోట శ్రీలక్ష్మి నిలచును
మంచిమాట వినర మానవుండ!
54
మాటలందు నీకు మన్నన తెలిసిన
ఏదేశమేగిన నెదురు లేదు
మాటచేతగాక, మరి బ్రతుకు లేదురా
మంచిమాట వినర మానవుండ!
55
పట్టువదలక పతికి ప్రాణముల్‌ దెచ్చె సావిత్రి
సుధను సాధించిరి, సురలు నాడు
పట్టు వదలకున్న, పనిని సాధింతువు
మంచిమాట వినర మానవుండ!
56
అలవికాని ఆలి, అధముడౌ పుత్రుండు
కులము చెరచునట్టి కూతురున్న
వానికా గేహంబె, వసుధలో నరకంబు
మంచిమాట వినర మానవుండ!
57
ఏడ్చుచు పుట్టెదౌ, ఏడ్పించి పోయెదౌ
ఎచటినుండి వస్తివిచటికీవు?
నడుమనున్న నాల్గు రోజులైన నవ్వు
మంచిమాట వినర మానవుండ!
58
తల్లి దండ్రుల బ్రోచు తనయుడొక్కడు చాలు
పెక్కు సంతతేల, పుడమి బరువు
సుత శతంబు కల్గు ధృతరాష్ట్రుగతి వినమె?
మంచిమాట వినర మానవుండ!
59
మేఘుండు వర్షించు, పుడమి సస్యములిచ్చు,
తరులు పుష్పములనిచ్చు, నుపకార బుద్ధి
పరుల హితము గోరు, పరమేశ్వరుడు మెచ్చు
మంచిమాట వినర మానవుండ!
60
అందమైన దేవళములు, భవనముల్‌
పగులగొట్టిన, మరల గట్టవచ్చు
హృదయంబు పగులగొట్టకు, అతుకనేరవు
మంచిమాట వినర మానవుండ!
61
ఇతరులకు చెప్పుటకెన్నెన్నో నీతులు
ఆచరణలో శూన్యమవియె నీకు
చేయగలవారలే, చెప్పుటకర్హులు
మంచిమాట వినర మానవుండ!
62
పెంచకు వైరంబు, ద్రుంచకు స్నేహంబు
మంచి స్నేహంబు ఇంటి పాడి నీకు
పడగ విప్పిన పాము, పెంచిన వైరంబు
మంచిమాట వినర మానవుండ!
63
ఎంతటి మహనీయునకు ఉద్భవించిన
తలవ్రాత మార్చంగ తరముగాదు
సూర్యుని పుత్రుండు సూత పుత్రుడు గాదె?
మంచిమాట వినర మానవుండ!
64
ముదుసలి తలిదండ్రులను కసరి కొట్టకు
చావు, చావు మనుచు నీడ్వబోకు
నిత్య యవ్వనంబు నిలవదెవ్వరి కిలను
మంచిమాట వినర మానవుండ!
65
ఎదలోని నీ వ్యధను పదిలముగ దాచుము
పదుగురికి పంచుము సంతసంబు
పెద్దల సుద్దులివి బుద్ధిగలవారికి
మంచిమాట వినర మానవుండ!
66
దుష్ట బుద్ధులున్న దుర్జనులెల్లపుడు,
సజ్జనుల బాధించి తనియుచుంద్రు
దుర్జనుల కెల్లపుడు దూరముగ తొలగుము
మంచిమాట వినర మానవుండ!
67
పరులను బాధించి, తాను సుఖపడువాడు
దానవుండు గాక, మానవుండె?
మానవత్వము లేని మనుగడ ఏలరా?
మంచిమాట వినర మానవుండ!
68
నీకున్న దానితో, నిత్య తృప్తిని బొందు
ఒరుల సంపద జూచి వగక బోకు
నీ ఇంట నిలచును నిఖిల సౌఖ్యంబులు
మంచిమాట వినర మానవుండ!
69
తాను తినగలేడు, ఒరులకీయగబోడు
సిరుల మూటగట్టు, పరమ లోభి
లోభివాని సిరులు, లోకంబు పాలురా
మంచిమాట వినర మానవుండ!
70
పెద్ద పెద్ద యనగ, పెద్ద కాబోరెవరు
పెద్ద గుణములున్నవారె పెద్ద
వయసుతో పనిలేదు, మంచి మనసది చాలు
మంచిమాట వినర మానవుండ!
71
గద్దె నెక్కెడుదాక సుద్దులు జెప్పెదరు
గద్దెనెక్కిన వెనుక బుద్ధి మారు
గద్దెనెక్కినవాని సుద్దులను నమ్మకు
మంచిమాట వినర మానవుండ!
72
మంచిగా చెప్పిన, మాట వినరెవ్వరు
కస్సు బుస్సుమన్న, గౌరవింత్రు
నోరుగలవానికి ఊరంత వెరతురు
మంచిమాట వినర మానవుండ!
73
ధనికుడేది పల్కిన, ధరను జెల్లు
కాసులేనివాని నీతి వినము
కాసులు ధరనేల, నీతికి విలువేడ?
మంచిమాట వినర మానవుండ!
74
రాజులెల్లరో తొల్లి రాజ్యాల నేలిరి,
ప్రాణాల నొసగిరి, ప్రజల కొరకు
పదవి తప్ప, ప్రజల సుఖమరయరీనాడు
మంచిమాట వినర మానవుండ!
75
కట్నాల చావుల కథల విన్నప్పుడు
సిగ్గు గాదె, ప్రగతికెగ్గు గాదె?
ఇటుల జరిగెనేని, ఇంకేది మన ప్రగతి?
మంచిమాట వినర మానవుండ!
76
నిన్నెంతో అలరించి, నీదు వంశము నిల్పి,
కష్ట సుఖముల కడదాక తోడునిలచు, ఆ
స్త్రీని పెండ్లియాడ సిరి మూటలేలరా?
మంచిమాట వినర మానవుండ!
77
తల్లియై పెంచి, చెల్లియై మమతల పంచి ఇచ్చి
సగము దేహమై, నీకెంతో సౌఖ్యమొసగు
స్త్రీని గౌరవించు, సిరులింట పండించు
మంచిమాట వినర మానవుండ!
78
అగ్ని పడ ద్రోసిరి, డబ్బునకమ్మిరి,
వలువలీడ్చిరి, కాల్చిరి సతి వటంచు
సిగ్గుపడుమికనైన, స్త్రీలకెగ్గులు సలుప,
మంచిమాట వినర మానవుండ!
79
ఆడవారలనుచు, అలుసుగాచూడకు,
ఆడదికాదొక ఆదిశక్తి
సృష్టి నిలచిపోవు, స్త్రీ శక్తి లేకున్న
మంచిమాట వినర మానవుండ!
80
తాను కరుగుచుగూడ, తగదనక కొవ్వొత్తి
కాంతినొసగు, ఎంతో కరుణతోడ
లోకాన సజ్జనుని పోకడ ఇట్టిది
మంచిమాట వినర మానవుండ!
81
గుడిలోన కొలువైన దొడ్డ దేవరలైన
రాజ్యాలనేలెడు రాజులైన
పరుల సాయము లేక, పనులేమి జరుగవు
మంచిమాట వినర మానవుండ!
82
మనిషి అందముకన్న, మంచి మనసది మిన్న
సంపదలకన్న, చలనములేని విద్య మిన్న
ఈర్ష్యపడు బంధువునికన్న, హితుడెంతో మిన్నరా
మంచిమాట వినర మానవుండ!
83
నీదు సంతతియందు నీకెంత మమతయో
నిన్ను నీ తలిదండ్రులటులె పెంచిరని మదిని ఎంచి
వృద్ధులైనవారిని శ్రద్ధగా చూడుము
మంచిమాట వినర మానవుండ!
84
సానిపాపతోడ సరసాల నాడిన,
కాసులూడ్చి, కానుకిచ్చు వ్యాధి
తగులుకొని వదలదు, తరతరంబులదాక
మంచిమాట వినర మానవుండ!
85
నీదు రాబడి మించి ఖర్చు చేయబోకు,
అప్పు చేయగబోకు గొప్ప కొరకు
అప్పులిచ్చువారు నెత్తెక్కి తొక్కుదురు
మంచిమాట వినర మానవుండ!
86
చక్కనివారమని సంబరంబది ఏల,
మనసు చక్కదనము మరుగుపడిన,
మనసు చక్కగనున్న మనుజులే చక్కన
మంచిమాట వినర మానవుండ!
87
దానమిమ్మొకింత, నీకున్న దానిలో
ధనము తరుగబోదు, దానివలన
దానమిచ్చిన ధనమె, దాచిన ధనమగున్‌
మంచిమాట వినర మానవుండ!
88
పరసతి పొందగోరుట ఘోర పాపంబు
కష్ట నష్టములెన్నొ కల్గు దాన
ఎంతటి రావణున కాగతి పట్టెను
మంచిమాట వినర మానవుండ!
89
ఇంటిలోన ఎన్ని ఇక్కట్లు నీకున్న
పెదవి కదుప జనదు, పరుల ముందు
ఎదుటనయ్యో యనుచు, నీవెనుక నవ్వెదరు
మంచిమాట వినర మానవుండ!
90
కనుల ముందర భార్య కడగండ్లు గాంచియు
జూదమాడె మరల ధర్మజుండు
లోకాన వ్యసనపరు పోకడ ఇట్టిది
మంచిమాట వినర మానవుండ!
91
చిన్నవారినైన మన్నించుటెరుగుము
నేనె పెద్దటంచు నీల్గబోకు
వానరంబులు నాడు వారధి గట్టవా?
మంచిమాట వినర మానవుండ!
92
అన్నదమ్ముల మధ్య ఆస్థికై కొట్లాట
పదవికై కొట్లాట ప్రభువులందు
తల్లికన్నము బెట్ట, తనయుల కొట్లాట
మంచిమాట వినర మానవుండ!
93
మనసు నెరుగు మగువ, మంచి సంతానంబు,
ప్రాణమొసగునట్టి పరమ హితుడు
కలిగిన వానికీ ధరణియే స్వర్గము
మంచిమాట వినర మానవుండ!
94
నీవు తలచిన కార్యమెల్ల నెరవేరంగ
గర్వపడుదువు నీదు ఘనత జెప్పి
లేని నాడెల్ల, పైవాని దూరగ నేల?
మంచిమాట వినర మానవుండ!
95
మెడనిండ రుద్రాక్ష మాలలు ధరియించి
ఒడలెంత తెల్లని బూది పూసి
డాంబికంబులు పల్కు వారల దరిబోకు
మంచిమాట వినర మానవుండ!
96
బ్రతికియుండగ, పట్టెడన్నంబు పెట్టరు
శ్రాద్ధ కర్మలు చేతురు గొప్ప కొరకు
ఎవరు తిందురు భువిని, ఎవరు మెత్తురు దివిని?
మంచిమాట వినర మానవుండ!
97
పదవి యుండగ పాదముల నంటి మ్రొక్కుదురు
పదవి పోయిన వెనుక పలుకరెవరు
ఇది మారదెన్నడు, ఇంతె లోకపు తీరు
మంచిమాట వినర మానవుండ!
98
చక్కనైన రాజ మార్గమది యుండంగ
సందుగొందుల వెంట బోవనేల?
వెఱ్ఱివగుచు నీవు వెతల చెందగనేల?
మంచిమాట వినర మానవుండ!
99
ఎల్ల జీవుల బ్రోచు తల్లి తానుండంగ
మనుగడకై మథన పడుట ఏల?
ఇహ సుఖంబుల నీకు ఇంత మమతేలరా?
మంచిమాట వినర మానవుండ!
100
మంగళం తల్లి లలితాదేవి పదములకు
మంగళం శ్రీ శ్రీనివాసునకును
మంగళం ననుగన్న నాతల్లిదండ్రులకు
మంగళంబు మంచివారికెల్ల.
101


శ్రీ భమిడి ఆంజనేయులు గారి కోర్కెపై వారి తల్లి శ్రీమతి కామేశ్వరమ్మగారి 'మంచిమాట వినర మానవుండ' శతకరచనను ఆంధ్రభారతిలో పొందుపరిచాము. దీని transliterated textను మాకు పంపిన ఆంజనేయులు గార్కి మా అభినందనలు. దీనిపై చదువరుల అభిప్రాయాలను, ఆలోచనలను వారికి తెలియజేయగలరు.


AndhraBharati AMdhra bhArati - shatakamulu - maMchi mATa vinara mAnavuMDa - Manchi mata vinara manavuda - bhamiDi kAmESwaramma Bhamidi Kameswaramma Satakamu Shatakam Satakam Satakamulu Shatakalu Shatakaalu ( telugu andhra )