శతకములు మదనగోపాలశతకము చెంగల్వరాయఁడు
మదనగోపాలశతకము - చెంగల్వరాయఁడు
సీ.శ్రీరుక్మిణీనాథ జితకోటిరతినాథ సుందరాకార సానంద శరణు
సురయక్షకిన్నరవరమౌనిశుభకర నరకాంతకా పద్మనాభ శరణు
జలధరనిభగాత్ర జలజాతదళనేత్ర పరమపవిత్ర గోపాల శరణు
నిర్మలగుణతోష నిజభక్తజనపోషక వివచోభూషప్రకాశ శరణు
 
తే.అనుచు నిను చాల నుతియించి యబ్జభవుని | వెలది నెంతయు గొనియాడి విఘ్నపతిని
సన్నుతి యొనర్చి రచియింతు శతకముగను | మదనగోపాల సత్యభామావిలోల!
1
సీ.దండము యదువీర దశరూపధర నీకు దండము వసుదేవతనయ శౌరి
దండము హరిధరాధర నీకు విమలారి దండము శతకోటిసవనతేజ
దండము మందరోద్ధర నీకు సాష్టాంగదండము కంసమర్దన మురారి
దండము కోదండధర మాధవా తన దండకు నిను బిల్వ తరుణి పనిచె
 
తే.గాన వచ్చితి మీ పాదకమలసేవ | కల్గె నా భాగ్యమెట్టిదో కరుణగల్గి
సుదతి నేలుట దగునయ్య సుందరాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
2
సీ.సుదతి కెమ్మోపి దా జూపెనా పదియారుకళల చందురువలె గానవచ్చు
శుకవాణి కన్నులజూపెనా మరుజేతి కలువతూపులమాట్కి గానవచ్చు
వగమీర ముంగుర్ల సొగసు చూపించెనా భ్రమరమాలికలని పల్కవచ్చు
గబ్బిగబ్బల నుబ్బు గన్పడ జూపెనా పసిడిగిండ్లని మెచ్చ బల్కవచ్చు
 
తే.నతివ సౌందర్య మెన్నుట కలవిగాదు | మగని కూరిమిగలిగిన మగువ నేల-
దగును నీకైన దగు మంచితరుణి సుమ్ము | మదనగోపాల సత్యభామావిలోల!
3
సీ.బాలనే నే తాళజాలనే యీ రవ్వలేలనే వలచిన గోలననవె
రమ్మనే మనవిచే కొమ్మ నే బిగికౌఁగిలిమ్మనే నమ్మిన కొమ్మననవె
చల్లగా పన్నీరు చల్లగా విభునిపై చల్లగా మదికింపు సలుపుమనవె
దక్కి నా వలలోన జిక్కి నా సామికి మ్రొక్కినానని చాల ముదితయనవె
 
తే.యనుచు నీతోడ యెరుగింపుమనుడు వేడె | గాన వచ్చితి నిను బిల్వ కనకచేల
తామసించిన నా యింతి తాళదికను | మదనగోపాల సత్యభామావిలోల!
4
సీ.నెఱికురుల్ నీలాల నిరసించు మోముతో సరియౌనె పున్నమచందమామ
నిద్దంపు నునుజెక్కుటద్దంబులను గెల్చు ముద్దియయోష్టంబు మొనయ కెంపు
కన్నుల సోగలు కల్వరేకుల మీఱు జన్నుగుబ్బలు సరి జక్కవలకు
తిలపుష్పముల గేరు తెరవ నాశిక తీరు చెలి హస్తమబాళి జెనకజూచు
 
తే.గుందముల మించు రజనాళీ కొమ్మ నిన్ను | దలచి మరుబారిచేతను తాళలేక
యున్న దా యింతి నెడబాయ యుచితమగునె | మదనగోపాల సత్యభామావిలోల!
5
సీ.అరవిరిగొమ్మరా యపరంజిబొమ్మరా మరునిచేచిల్కరా మందయాన
యలికులవేణిరా యంబుజపాణిరా చిలుకలకొలికిరా చిగురుబోడి
వెన్నెలగుమ్మరా యన్నులమిన్నరా పన్నీటిసోనరా పంకజాక్షి
చిలికికటారిరా చిత్తజదంతిరా శుకవాణిరా మేటి సుందరాంగి
 
తే.యనగ దగినట్టి యా బాల నేలుకొనక | మోడిసేయంగ నుచితమే మోహనాంగ
తామసించక రావయ్య దానవారి | మదనగోపాల సత్యభామావిలోల!
6
సీ.నడుముల్కు తొడబెళ్కు మెడకుల్కు కడుతళ్కు మోము చూచిన చాల మురియవటర
పగడంపు జగనింపు తగకెంపు జిగిబెంపు కొమ్మవాతెర జూచి కోరవటర
బిగినుండు జిగిమించు తొలగించు వగలాడి పాలిండ్లు జూచిన భ్రమయవటర
ననబోడి శుకవాణి ఘనశ్రోణి మృదుపాణి వగలు చూచిన దాళవచ్చునటర
 
తే.గాన నా సుందరాంగిని గారవమున | నేలుకొనదగు నీకైన దిందువదన
వెలది నను బంపె నిను బిల్వ వేడ్కమీర | మదనగోపాల సత్యభామావిలోల!
7
సీ.బెళ్కుచూపులకొమ్మ తళ్కుబంగరుబొమ్మ కుల్కుముద్దులగుమ్మ కుందరదన
వగలాడియౌన జిగిముద్దుమోముది చిగురాకుమోవిది చిన్నెలాడి
జిగిపెన్గులాట్లచే బిగిగుబ్బపోట్లచే తగుమోవికాట్లచే తరుణి విభుని
వలపించు మరులెద గొలిపించు నతి మేలు కలిపించు రతులచే గంబుకంఠ
 
తే.యనగ దగినట్టి యీ యింతి నేలుకొన్న | గోరి చక్కెర పాలును గూర్చినటుల
సురతసౌఖ్యంబులబ్బును సుందరాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
8
సీ.వదనమా కాదది పదియారుకళలచే బెంపొంద వెలయు జాబిల్లి గాని
కన్నులా కావవి చెన్నుమీఱగజాల మెరసెడి బేడిసమీలు గాని
యధరమా కాదది మధురసభరితమై పరిపక్వమగు బింబఫలము గాని
కందరమా కాదు కరిమరేఖల దాల్చి కంధిలో బొదలు శంఖంబు గాని
 
తే.యనుచు నుతియింపతగినట్టి యలరుబోడి | నెనయదగు జాగుసేయక నేలుకొమ్ము
వినుతమౌ నీశ నీకు నే విన్నవింతు | మదనగోపాల సత్యభామావిలోల!
9
సీ.చల్లని పన్నీట జలకంబు గావించి జిలుగుబుటేదారిచీరె గట్టి
బంగారుసరిగెమొగ్గల నిగ్గుగను పట్టురంగు మీరిన మేటిరవికె దొడిగి
బన్నసరులు మేటిపతకంబు ముత్తియసరులు గుబ్బలమీద జారి యొరయ
నందిబందులు వజ్రసరులు కంకణములు కరములు నిగనిగ కాంతులెసగ
 
తే.మెలత మొలనూలిఘంటలు మిగుల మ్రోయ | కాళ్ళనందెలు గజ్జెలు ఘల్లుమనగ
చెలిని జూచిన మరువారి చిక్కవటర | మదనగోపాల సత్యభామావిలోల!
10
సీ.నెరులురా తుమ్మెదగరులురా నీలంపుసరులురా కొమ్మ ముంగురుల సౌరు
మేలురా చెనకినపాలురా మించుటద్దాలురా ముదిత కపోలయుగము
వాలురా బేడసమీలురా కల్వలనేలురా కలికి కన్గవల తీరు
చెండ్లురా బంగారుగుండ్లురా గజనిమ్మపండ్లురా యతివ పాలిండ్ల తీరు
 
తే.చెలియ నూగారు నల్లనిచీమబారు | పొలతి పొక్కిలి విరిసిన పొన్నపూవు
నెలత నేలుట తగునయ్య నెనరుతోను | మదనగోపాల సత్యభామావిలోల!
11
సీ.రవనూనె మెరుగిడి రాణించు నెరికురుల్ దువ్వి కొప్పమరించి తోరమైన
గొప్పరాగిడి మేటియొప్పైన కుప్పెయు సవరించి మొగ్గల సరులు మీర
పరగ కెంపులు చెక్కబడినట్టి పాపటబొట్టుపై శశిపువ్వు పొసగ దాల్చి
నిద్దంపు చెక్కుల వద్దికగా వజ్రతాటకముల ధాళధళ్య మమర
 
తే.నాణిముత్తెపు నత్తు మోవంది గుల్క | నెంచదగినట్టి తొలకరి మించొ యనగ
దాని వగ జూడ దమి నిల్వ దరమె నీకు | మదనగోపాల సత్యభామావిలోల!
12
సీ.కొసరంచు పలుమారు కొమ్మ కమ్మనిమోవి యాని తేనియ గ్రోలుమనుచు బలుక
వద్దికతో దన నిద్దంపు చెక్కులు ముద్దాడరా యని మురియ బల్క
మొనసి పాలిండ్లపై మొనగోరు లించుకయుంచరా యని తమిమించు పలుక
వడిబోక ముడివిచ్చి తడయక నాభిలో నంగుళం బానరా యనుచు బలుక
 
తే.కేళి మరుకేళి గూడంగ కోరి పలుక యతనుసామ్రాజ్య మెల్ల నీ కబ్బినటుల-
నుండదే చూడు మా యింతి నొనరగూడి | మదనగోపాల సత్యభామావిలోల!
13
సీ.విడెమందుకొమ్మన్న తొడలపై గూర్చుండి దొంతరవిడెమిచ్చు తోయజాక్షి
నెనరుంచుమనినను చనువున చెలరేగి మోవితేనియలాను ముద్దుగుమ్మ
యదనిదియన్నను వదలక బిగబట్టి యదనుగుబ్బలగుమ్ము పద్మగంధి
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
 
తే.మరునిచేచిల్క యనదగు మందగమన | కలికి నెమ్మోము చందురుకాంతినెసగు
నట్టివగలాడి నెడబారునలవి గాదు | మదనగోపాల సత్యభామావిలోల!
14
సీ.బిగికౌఁగిలింతల బెనగుచు పలుమారు విడెమందుకొమ్మను వేడ్కలాడి
కిలకిలమనుచు వెన్నెలతేటనగవుల గిలగింతలొనరించు కీరవాణి
తలపున విభునిపై తప్పేమియును లేక పొలయల్క గావించు పువ్వుబోడి
కొసరి వేడుచు బతి గూడినది యెంతహాయిరా నా సామి యను లతాంగి
 
తే.యట్టి కనకాంగి వగలెన్న నలవి గాదు | పంకజాక్షిని చౌసీతిబంధగతుల
నేలుకొనవయ్య యతివేగ నీరజాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
15
సీ.మొలకదేనియలొల్కు కుల్కుపల్కుల విభు మది కరగించునే మంజువాణి
క్షణమైన నిను బాయజాలర ప్రాణేశ యని కౌఁగిలించునే యబ్జపాణి
వీణె వాయింపుచు వెలది పైకమురీతి బాడగా నేర్చునే పద్మనయన
యిద్దరమొనగూడి వొద్దిక నుండుట కెన్ని నోచితినను నెమ్మెలాడి
 
తే.చాల మది కింపు బుట్టించు సరసిజాక్షి| నట్టి జవరాలి నెడబాయ నర్హమగునె
కలికి నేలుట దగునయ్య కరుణ గల్గి | మదనగోపాల సత్యభామావిలోల!
16
సీ.చెండ్లాడమనుచు బాలిండ్లు నాథుని చేతికబ్బంగనిచ్చు నా యలరుబోడి
గాటంపు రతుల జొకాటంపు వగలను మొనసి కూడగజాలు మోహనాంగి
బడలిన విభునకు బలుమీరు గెమ్మోవియానంగనిచ్చు నా పంకజాక్షి
పన్నీరుగంధంబు పైజల్లి శైత్యోపచారంబు సేయునా జలజపాణి
 
తే.గాన నా యింతి వగలెన్నగా దరంబె | సరససద్గుణజాల యా సన్నుతాంగి
చాల నిను గోరియున్నది జాలమేల | మదనగోపాల సత్యభామావిలోల!
17
సీ.కళలంటి సొక్కించగలయట్టి నిను బాయజాలరా యని రాల సాగి మ్రొక్కు
నా సామి నా దొర నా మనోహర యని జిగి బిగికౌఁగిట జేర్చి కొసరు
నిను గానకుండిన నిమిషంబు నా యెద జాలి బొందునటంచు చాల వెఱచు
తగ నిను గూడని తరుణి యవ్వనమెల్ల నడవిగాచిన వెన్నెలనుచు బలుకు
 
తే.దమకమున నిన్ను వలపింపదగినయట్టి | కొమ్మ ముద్దులగుమ్మయా కోమలాంగి
నెనయదగు నీకు నా యింతి నేలుకొమ్ము | మదనగోపాల సత్యభామావిలోల!
18
సీ.తలవాకిలిల్లుగా దన ప్రాణనాథుని రాక కెదురుచూచు రాజవదన
వచ్చిన దన విభు గ్రుచ్చి కౌఁగిట జేర్చి మచ్చికతో బల్కు మందయాన
మజ్జన మొనరించి మంచిగంధము మేన నలది వేడ్క యొనర్చు నబ్జపాణి
పళ్లెరమిడి చాల బసయైన కూరలు రతిరసాన్నము పెట్టు కుసుమగంధి
 
తే.యొనర భుజింప బ్రాణేశు నుపచరించు | సురటి చేబూని విసరును సొంపుమీర
నింపు బుట్టించు నా బాల నేలవేల | మదనగోపాల సత్యభామావిలోల!
19
సీ.పగడంపుగోడల బంగారుపట్టెల చప్పరంబొప్పు మంచం బమర్చి
క్రొత్త తాప్తా దూదిమెత్తపైన పరంజిజరి తలగడదిండ్లు చక్కబరచి
పరిమళద్రవ్యముల్ పన్నీరుగంధంబు రత్నాలగిన్నెను జతను పరచి
యరవిరిబంతులు మరువంబు కురువేరు నపరంజితట్టల నమరజేర్చి
 
తే.యతివ దన కేళిగృహము నలంకరించి | విభుని దోడ్కొని రమ్మని వెలది వనిచె
పాన్పుపై నిన్ను గూడ నా పద్మగంధి | మదనగోపాల సత్యభామావిలోల!
20
సీ.నాథునికడ జేరి నాతి వాక్చాతురి బల్కగా విభు డతిపరవశమున
మొనసి చక్కెరమోవి మునిపంట నొక్కిన నసురుసురను లేచి యలరుబోడి
యెవరైన జూచెద రిదివేళ గాదని తలుపుచాటున జేరి తమకమునను
జులుము సేయక నీకు జోహారు జేసెద దాళరా యిక కొంత దడవటంచు
 
తే.బతికి సతి మోహమొనరించి పణతి తెలిసి కినిసి క్షణమున రతిదేలి కీరవాణి
మగని మతి జరగించు నా మందగమన | మదనగోపాల సత్యభామావిలోల!
21
సీ.నెమ్మదిగా భర్త నెనరుంచవలెనని పొలతి పున్నమ యొక్కప్రొద్దులుండు
మమత బాయక పతి మందిరంబుననుండ మరుమంత్రజపము లేమరక సేయు
నన్యకాంతల విభు డాసింపకుండగా శివు నభిషేకంబు చేయుచుండు
మగడు దన మాటకు నూరాడకుండగా జెలి వినాయకపూజ సేయుచుండు
 
తే.బడతి యీ రీతి దేవతాప్రార్థనంబు | చేయుచున్నది మీ పాదసేవకొరకు
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... | మదనగోపాల సత్యభామావిలోల!
22
సీ.ఆసించి తన పతి ననుకూలపరచిన భాసురాంగికి నిత్తు బన్నసరులు
కూరిమి వరుని గూర్చగల్గినయట్టి ముద్దియకిత్తు నే ముత్తియములు
పనిపూని విభుని నా భవనంబు జేర్చిన వనితకిత్తును మేటివజ్రతతులు
కరుణించి తన భర్త గలయఁ జేసినయట్టి భామకిత్తును జౌలబావిలీలు
 
తే.అనుచు దగినట్టి చెలులతో నలరుబోడి | బలుకుచున్నది యతిమోహపరవశతను
గాన నా యింతి నేలుము కమలనాభ | మదనగోపాల సత్యభామావిలోల!
23
సీ.చల్లని పన్నీరుచల్లి నాథునితోడ సరసంబులాడుచు చాల మెచ్చి
యించుక నీ దయ యుంచరా నా సామి యంచు చక్కెరమోవి యాననిచ్చి
యెదయెద గదియించి వదలక బిగియించి ముదమున జెక్కిళ్ళు ముద్దుబెట్టి
సమరతి యుపరతి చతురత వగలను సదయునితో నొక్కజాము పెనగి
 
తే.యవుర శాబాసు నా సామి యనుచు బొగడి | మరలి రతిగూడి విభునకు మమత హెచ్చ
దమిని గల్పించినటువంటి తరుణి గదర | మదనగోపాల సత్యభామావిలోల!
24
సీ.పతియింట లేనప్డు భ్రమరమా యిట రాక తగునటే యని లేచి తరమబోవు
సద్దుజేయక నుండజాలవె కోయిల వేళ గాదని కేల వ్రేయబోవు
మచ్చరంబున నేడు మరుడు దండెత్తెనో చెలులార పొమ్మని జెప్పుడనును
నిలువుటద్దమునందు నెలకొన్నవాడని తెరవ చందురుని మర్దింపబోవు
 
తే.మగువ యీ రీతి విరహాబ్ధిమగ్న యగుచు | తలిరువిలుకాని బారికి తాళలేక
నిన్నె దలచుచునున్నది నీరజాక్షి | మదనగోపాల సత్యభామావిలోల!
25
సీ.తుమ్మెద రొదసేయ తొడరిన తోడనె తెమ్మెర వీచెనే తెరవలార
తెమ్మెర వీచెనే తెరగింక ననుచుండ గ్రమ్మె చిల్కలగముల్ కాంతలార
చిలుకలగము లేల చేరెనో యనుచుండ జెలగి కోయిల గూసె జెలియలార
కోయల లీరీతి గూసెనేమొకొ యని భావింప మరుడదె భామలార
 
తే.చెరుకవిలు వంచి యటపొంచి చేవమించి | పదరి యెద నాటనేసెనే పణతి యనుచు
బలుకుచున్నది వలపున భ్రమసి మిగుల | మదనగోపాల సత్యభామావిలోల!
26
సీ.దాడాయె మరుడిదే వేడాయె వెన్నెల వాడాయెనే విరుల్ వనితలార
చెలువ తెమ్మెర డాయ నళులు జుమ్మని మ్రోయ జిలుకలు రొదసేయ జెలియలార
విరహమగ్గలమాయె వెఱపొందగానాయె సరసుడు రాడాయె సఖులార
నను జేరవచ్చునా వనజాక్షి మెచ్చునా మనసిచ్చి కూడునా మగువలార
 
తే.యనుచు దనలోనె తలపోసి యతివ నీదు | రాక గోరుచునున్నది రవ్వలేల
గాననిక నేలుకొనవయ్య కరుణగల్గి | మదనగోపాల సత్యభామావిలోల!
27
సీ.సుదతి వెన్నెలపిండు జూచిన కడు తాపమందును జూడరాదనుచు బల్కు
విరులు దురుమగరాదు వెలదిరో యతనుని శరజాలములటంచు చేరి పల్కు
గంధ మలదగరాదు గంధవాహుండల్గి యదర వీవగ వేడియనుచు బల్కు
నిటు దలపోయుచున్నది యింతి మరుని దాడికిని వెఱచి నిను మది దలచితలచి
 
తే.... ... ... ...
యట్టి విరిబోడి నేలుట యర్హమగును | మదనగోపాల సత్యభామావిలోల!
28
సీ.తీరైన మృగనాభి తిలకంబు ధరియించి కనుల కాటుక దీర్చి గరిమ మీర
నగరుగంధము మేన నలది కొప్పున దావి పొలివోని పువ్వులు పొందుపరచి
వన్నెమీరగ సన్నవలిపెపై పన్నీరుచల్లి ఘమ్మనుచు వాసన చెలంగ
కుంకుమ యత్తరు గోరజవ్వాదియు బొంకమౌ పాలిండ్ల బూసె నీదు
 
తే.వక్షమున గుబ్బగురుతులు వనిత సేయ | గోరి యున్నది యిక నేలుకొనుము దాని
జాగుసేయక రావయ్య జలరుహాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
29
సీ.నిను జూచినది మొదల్ నిదుర కంటికి రాక మనమున దిగులొంది మరులు వరల
విరహ మగ్గలమాయె విభుడేల రాడాయె బిలువవే యని నన్ను బిలిచి పనిచె
ననబోడి మాటలు విని నేను గ్రక్కున నిను బిల్వ వచ్చితి నిలువకెందు
నిక జాగుసేయక శుకవాణికడ జేరి యకలంకముగ నేలు మంబుజాక్షి
 
తే.గడగి నీవింక రాకున్న గంబుకంఠి ప్రాణములు నిల్వనోపవు పడతి విరుల-
దండ లురిబోసుకొన నది దలచునింక | మదనగోపాల సత్యభామావిలోల!
30
సీ.ఇంతిరో విభుడు నా చెంత జేరినయంత నునుచెక్కులను గోట నులుమనటవె
కాంతరో నా భర్త కౌఁగిలించిన యెంత చక్కని కెమ్మోవి నొక్కనటవె
మందయానరో నాథుడంది చన్గవ నంట కొసరి నా జడతోడ గొట్టనటవె
కొమ్మరో పతిరతి గూడ నా గుబ్బల ఱొమ్మున గసిదీర గ్రుమ్మనటవె
 
తే.యనుచు బంతంబులాడుచు నలిరుబోడి | మరునికేళిని నిముషమేమరక కలిసి
నిన్నె మెప్పించనున్నది నీలవేణి | మదనగోపాల సత్యభామావిలోలా!
31
సీ.సురతచమత్క్రియల్ సూపించిచూపించి మేలిమి నీ పొందు మెచ్చిమెచ్చి
మోము మోమున జేర్చి ముద్దాడిముద్దాడి గొసబులియ్యని మోవి గ్రోలి గ్రోలి
గబ్బిగుబ్బల నెద గదియించిగదియించి బిగువు కౌఁగిళ్ళను బెనగిపెనగి
మరుకేళి గవయగ మనసిచ్చి మనసిచ్చి గౌరవంబు చెలంగగలసికలసి
 
తే.మాటిమాటికి దన మేను మరచిమరచి తమక మిగురొత్త రతికేలి తగ పెనంగు
వనిత నేలుట తగునయ్య వనరుహాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
32
సీ.విభుడు పైకొనువేళ వెలది సంతసమంది గబ్బిగుబ్బలచేత గదియనిచ్చి
దురుసుగా మరుకేళి దొడరిన నాథుని దప్పక వీక్షించి తరుణి తనదు
చెలువుని మోమున చెమట గ్రమ్మిన జూచి విరులవీవన చేత విసరి వేడ్క
నేడు మంచిదినంబు నెనరున ననుగూడి హాయి వుట్టించితి వంబుజాక్ష
 
తే.యనుచు నను జాల మెప్పించు నతివ నిట్లు | బాసి యుండగ దగునయ్య పడతి నీదు
రాక గోరుచునున్నది రవ్వలేల | మదనగోపాల సత్యభామావిలోల!
33
సీ.సుదతి దా దశవిధచుంబనగతులను దన భర్తకును దెల్పు దావులరయ
గుచయుగంబులు నాభి గొనబైన కెమ్మోవి హస్తముల్ చెక్కులు మస్తకంబు
కక్షంబు నుదురును కంఠంబు మరునిల్లు వదలక పదిచోట్ల ముదము మీర
కరికరలీలల గావించి నఖముల ముద్దులాడగ గొంత మొనయవలయు
 
తే.ననుచు జుంబనవిధముల నన్ని వగల | దెల్ప వలపింపదగినట్టి తెరవ నిపుడు
గలసి యేలుట దగునయ్య కామజనక | మదనగోపాల సత్యభామావిలోల!
34
సీ.ఎవతె బోధించెనో సవతి బెట్టిన మందు తలకెక్కె గాబోలు తరుణులార
పలుమారు చెలులను బంపిన నిటురాక పంతమేలనె నాతో భామలార
మ్రొక్కి వేడితినని ముదితలు దెల్పగా నక్కరలేదనె నమ్మలార
వనజాక్షి మగవారి వలపులు సతమనగూడునా తెల్పరే కొమ్మలార
 
తే.యనుచు బలుమారు చెలులతో నాడికొనుచు | మోహసాగరమున మున్గి ముదిత నీదు
కరుణ యను తెప్ప గోరెడి కమలనయన | మదనగోపాల సత్యభామావిలోల!
35
సీ.చిత్తజుకేళికి హత్తెనా వగలాడి యత్తరుగంధంబు యలదినట్లు
గుత్తంపుగుబ్బల గ్రుమ్మెనా విరిబోడి మెత్తనిపూచెండ్ల మెరమినట్లు
చిత్తంబు నొకటిగా జేర్చెనా యలివేణి నిత్యసంపదలచే నెగడినట్లు
పొత్తున భుజియింపబూనెనా శుకవాణి కొంత తేనియ జున్ను గ్రోలినటుల
 
తే.నుండు గదరోరి యా యింతినొనర గూడ | దగుర యిక జాగుసేయుట దగదు నీకు
వెలది నను బంచె నిను బిల్వ వేగ రమ్మి | మదనగోపాల సత్యభామావిలోల!
36
సీ.నిను బాసినది మొదల్ నీరజాతాక్షికి నాహారనిద్ర లేదాయె గదర
తలపున నిను చాల దలచి వేమారును బరితాపమును జెంది పలుకు గదర
యెప్పుడు నను బాయడేమొకో రాడాయెనని తన చెలులతో నాడు గదర
చలమూని నా ముద్దుసామి రాడని చాల భయమంది నిను బిల్వబంచె గదర
 
తే.కాన నిటకేగుదెంచితి గారవమున చాన నేలుట తగునయ్య జాగువలదు
నిన్నె మదిగోరి యున్నది నీలవేణి | మదనగోపాల సత్యభామావిలోల!
37
సీ.తొలుత ప్రాణేశుని తొడలపై బవళంచి యాసదీరగ ముద్దులాడుకొంచు
బ్రాణేశ నిను బాసి ప్రాణముల్ నిలుచునా యని తన కెమ్మోవి యాననిచ్చి
నలినాక్షి నిను బాయనని బాసలిమ్మని పలుమారు కొసరుచు బడతి విభుని
మక్కువతోడను మరుకేళి దేలించి యక్కరతోడ నయ్యలరుబోడి
 
తే.పాలువెన్నయు మీగడ పంచదార | కొమ్మనుచు వేగ భర్తకు గ్రోలనిచ్చి
హాయి పుట్టించునటువంటి యతివ గదర | మదనగోపాల సత్యభామావిలోల!
38
సీ.పలుమరు మేల్‍జరీ పైటకొంగున గట్టివలపు నిల్పగలేనె వనిత యనుచు
జెలరేగి నీ ముద్దుజెక్కులపై నొక్కి ముద్దుబెట్టనియవె ముదితయనుచు
కనకాంగి నీ బిగికౌఁగిట నను జేర్చి మనసియ్యరాదటే మగువ యనుచు
కొమరొప్ప నీ కుల్కుగుబ్బలపై నాట గోరులుంచగనీవె కొమ్మ యనుచు
 
తే.వెలది నను చాల కొసరిన విభుని పొందు | మఱచి యెటులుండవచ్చునే మందయాన
యనుచు నను బంపె నీకడ కబ్జనాభ | మదనగోపాల సత్యభామావిలోల!
39
సీ.ప్రేమతో నా విభు పిలువనంపిన నిందు రాడాయెనేమొకో రామలార
సవతులు నాపైన చాడి గావించిరో కానరాకున్నాడు కాంతలార
యతివలు నా మనోహరుని రావద్దని యడ్డగించిరొ కదే యమ్మలార
మనసిచ్చి యెవతెను మరగియున్నాడకో తెలియదు గదవే యో తెరవలార
 
తే.యనుచు జెలులతొ నెప్పుడా యలరుబోడి | నిన్నె తలచుచునున్నది నీరజాక్ష
గాన రావయ్య వేగమె కమలనయన | మదనగోపాల సత్యభామావిలోల!
40
సీ.తరువు బాసిన తీగె తెరగున విభు బాసి యెటు నిల్వనోపుదు నింతులార
ననుగైన మొగులు గానని నెమ్మి కైవడి ముచ్చట లేదాయె ముదితలార
జలము బాసినయట్టి జలజంబువలె మది సొంపొకించుక లేదె సుదతులార
కొమరైన ద్విజరాజు కూరిమి లేనట్టి కుముదంబువలెనాయె కొమ్మలార
 
తే.గాన నిక నేటి బ్రతుకని కంబుకంఠి | మదిని దత్తరమొదవ నా మందయాన
చెలుల నేవేళ జీరుచు చింతనొందు | మదనగోపాల సత్యభామావిలోల!
41
సీ.గజయాన వగమీర గదిసి నాథుని యెద కులుకుగుబ్బలచేత గ్రుమ్మి వేగ
బదపడి చేతుల వదలక బిగబట్టి గుదిగాళ్లు వెన్నున గూర్చి వొక్కి
మరుకేళి నొకవింత మనసిచ్చి యొక కొంతసేపు హాయిగ రతిచెంది మగని
మదికింపు పుట్టింప సదయుని మెప్పించి సుదతి నాథుని మోము జూచి తమిని
 
తే.యవుర నా సామి విడువకుమనుచు జాల మ్రొక్కి కౌఁగిట జేరిచి ముద్దుబెట్టి
కొసరి భర్తను లాలించు కోమలాంగి | మదనగోపాల సత్యభామావిలోల!
42
సీ.పల్కున దేనియలొల్కు రాజిల్క నా మదిరాక్షి విభునితో మాటలాడు
ఠీవి మీరిన మేటిపావురావలె గుల్కి మొనసి నాథునకు కెమ్మోవి యొసగు
జిగిమీర గౌగిళ్ల పికిలిపిట్టల భాతి తరుణి నాథుని గూడి తగ బెనంగు
శుకవాణి భర్తతో లకుముకి చందాన చెలరేగి యుపరతి సలిపి సొక్కు
 
తే.నహహఈ యింతి వగలెన్న నలవిగాదు | మగువ మరువేదముల కుప్ప మదిని యొప్ప-
గోరియున్నది నీ చెల్మి కువలయాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
43
సీ.సొగసైన మైనిగ్గు సుదతి సొమ్ముల జగ్గు వెలలేని మణులచే వేడ్కలలరు
పగడంపు జిగిడాలు పడతి మోవిని బోలు జూడజూడగ నెంతోచోద్యముగను
విరిబోడి పాలిండ్లు గురులైన పూచెండు నీక్షింపనీక్షింప నెనగు ముదము
చెలిహస్తముల బాగు చిగురుటాకుల లాగు గనుగొన నతిమోహకాంక్ష జెందు
 
తే.నిలువనిచ్చునా యొకచోట నిముషమైన | తరుణి నయవినయములచే దగ బెనంగ
గోరియున్నది రావయ్య కోమలాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
44
సీ.పసిడిబుటేదారి పట్టువల్వ ధరించి రాణించు పైఠాణిరవికె దొడిగి
బాలచందురువంటి ఫాలభాగంబున దిలకంబు కొనగోర దిద్ది వేగ
వరుని మృదూక్తుల వలపించి జిగిబిగికౌఁగిట జేర్పును కంబుకంఠి
పద్మంబు తావి మై బరగు పద్మినిజాతి కాంతయౌ నది గాన కమలనాభ
 
తే.నిన్నె మది గోరియున్నది నీలజాక్షి | తామసించక రావయ్య తరుణికడకు
భవ్యగుణశీల యీవేళ భక్తపాల | మదనగోపాల సత్యభామావిలోల!
45
సీ.వదనాంబుజమునందు కొదమతేటుల మాడ్కి నలువైన ముంగురుల్ నటనమాడ
పసమించు బంగారుపతకముల్ జతగూడి కులుకుగుబ్బలమీద గుసియాడ
సందిటగల బాజుబందుకుచ్చులచాలు తోరమై పలుమారు తూగులాడ
చెలువైన మొలనూలి చిరుఘంటలొరయుచు సారె కణిల్లని సద్దుసేయ
 
తే.జెలగి మొనసియు రతిగూడు చిన్నెలన్ని | మఱచియున్నాడొ దెల్పవే మగువ యనుచు
నన్ను బనిచిన వచ్చితి నలిననాభ | మదనగోపాల సత్యభామావిలోల!
46
సీ.తోయజముఖి విభు తొడలపై దన పాదయుగము చక్కగ నిల్పి యువతి వేగ
పతి భుజంబులు రెండు పట్టుక తన చేత గొసరి తా గెమ్మోవి గ్రోలనిచ్చి
కలయుచు మరుకేళి కాంక్షదీరగ జేసి యాకుమడ్పు లొసంగి హవుసుమీర
నిను బాయజాలరా నిముషమేని యటంచు మనసుంచి దయజూడుమనుచు బలికి
 
తే.మాటిమాటికి నీపైని మరులు చెంది యున్న విరిబోడి నెడబాయ నుచితమగునె
తరుణి మరుబారిచేతను దాళదికను | మదనగోపాల సత్యభామావిలోల!
47
సీ.మాటల నొకకొంత పాటల నొకవింత గావించు బతి కింపుగాను కొమ్మ
రూపున నొకకొంత చూపున నొకవింత జూపించు విభునకు సుందరాంగి
తళుకున నొకకొంత బెళుకు నొకవింత గల్పించు ధవునకు గంబుకంఠి
ముద్దుల నొకకొంత మోవిమార్పుల వింత గావించు భర్తకు గమలపాణి
 
తే.తరుణి వగలెన్న నెవ్వరితరము గాదు వినుతగుణశీల నీకు నే విన్నవింతు
జాగు సేయక రావయ్య జలజనాభ | మదనగోపాల సత్యభామావిలోల!
48
సీ.చెఱగు మాసిన మొదముల్ చెలియ మూడవనాడు గడిచి వేడ్కను జలకంబులాడి
పసపూని నెమ్మేన మిసిమికాంతి చెలంగ చాన పాదిరిపూల చాదుబెట్టి
నొసట బాసటబొట్టు పసమించు వజ్రాల యాభరణంబుల నమర దాల్చి
తళుకుబంగరు బుటేదారి పావడ పైని సరిగె పైటచెరంగు జాళువార
 
తే.కొద్దియద్దాల రవికెయు ముద్దుగుల్క | తోరమగు గబ్బిగుబ్బల దొడగి కొమ్మ
వెడలు తరి జూడగావలె వేయుకనుల | మదనగోపాల సత్యభామావిలోల!
49
సీ.దొండపండుకు జాల బొండుమల్లెలు గూర్చి యాట్లాడరా వేగ హవుసుకాడ
అద్దంపు పైపద్మమంటించి ప్రియమున జూడరా యావింత సొగసుకాడ
బాలచంద్రుల దెచ్చి పూలచెండ్ల గదించి వేడుక చూడరా వింతకాడ
మకరధ్వజునిగూటి శుకము నోటికనంటిపండిచ్చి చూడరా బలిమికాడ
 
తే.యనుచు దెరచాటి మాటల నతివ నీదు మనసు రంజిల్లగా జేయు మదనతంత్ర
జాలముల పుట్ట యా దిట్ట సరసిజాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
50
సీ.మరుని చేతికటారి మగువకుల్కు మిటారి తలపున బతి గోరి తాళలేక
తెమ్మెర గడుదూరి తమ్ముల నటుచేరి కొమ్మలకడ జేరి గొసరి వేగ
వలపునకే దారి వనజాక్షి యీసారి పిలువరే నా శౌరి ప్రియము దనర
కరుణించి యొకసారి కలసెనా వగమీరి తరుణి నా తమి జీరి తలతి చెలుల
 
తే.ననుచు సఖులతో నేవేళ నలరుబోడి వాదులాడగ జూచి వచ్చి మిమ్ము
పిలిచినానింక రావయ్య ప్రేమగల్గి | మదనగోపాల సత్యభామావిలోల!
51
సీ.పంకజముఖి వేణి శంకరాభరణంబు చెలియ నగవు పూర్ణచంద్రిక యగు
కలికి చూపులసొగసుగా వొప్పు సారంగ ననబోడి నాభి పున్నాగ యనగ
కాంత నెమ్మెయి తిరుకల్యాణి యనదగు బడతి జఘనంబు భూపాల యగును
నింతి ప్రాణేశు లాలింపగా నాయకి విభు పరిచారియై విసర సురటి
 
తే.కలసి మరుకేళి మెప్పించు కనకగౌరి లలితగుణజాల శుభలీల లలన నిన్ను
తోడి తెమ్మనె రావయ్య తోయజాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
52
సీ.పక్క బాయకయుండు ప్రాణేశ్వరుడు నన్ను నెడబాయుటకు నేడు హేతువేమి
రవిశశిభౌములు రాహుకేతువులును బుధశుక్రశనిగురుల్ పొలతి నాకు
చాలరో గాన గోచారంబు రీతిని యడుగరే విప్రుల నమ్మలార
కాకున్న నా భర్త కరుణ యింతయు లేక యిందు రాకుండునా రామలార
 
తే.యైన నేమాయె వారల కనుదినంబు విప్రవర్యుల రావించి వివిధగతుల
యొనర తచ్ఛాంతి గావింప నువిద దలచు | మదనగోపాల సత్యభామావిలోల!
53
సీ.మందగామిని మోముచందంబు జాచిన బొందదే రతికాంక్ష బూని నీకు
సోగకన్నుల దృష్టిసొగసు జూచినయంత నిలువనిచ్చునె మది నిముషమైన
వనజాక్షి లేజిగివాతెర జూచిన పలుమొన లూరవే పరమపురుష
పడతి సంతసమున బలువిచ్చి నవ్విన గనకాభిషేకంబు గాంచినట్టు
 
తే.లుండునటు గాన రావయ్య యొనర నీకు | దండమిక జాగుసేయక తరుణి కడకు
వచ్చి చూడుము నే బల్కు వార్తలన్ని | మదనగోపాల సత్యభామావిలోల!
54
సీ.కీరమా నే సేయు నేరమా నా యిల్లు దూరమా విభుడు రాదొడగెనేని
నేడు మా యింతిని గూడుమా యని పతి వేడుమా చెలి నీవు వేగ యనుచు
గోరి నా విభు డిల్లు జేరునా మరుబారి తీరుగా దెల్పవే తెరవ యనుచు
జిఱుతనా మరుదారి మరుతునా గుబ్బల నొరుతునా విభు నెద నో లతాంగి
 
తే.యనుచు బలుమారు చెలులతో నలరుబోడి నిన్ను దలచుచునున్నది నీరజాక్షి
జాగుసేయక రావయ్య చపల ముడిగి | మదనగోపాల సత్యభామావిలోల!
55
సీ.కలికి కీల్జడ సాటి గానోపకను భోగి కాలకంఠుని చేత కట్టుబడియె
పద్మంబు చెలి ముఖపద్మంబునకు నోడి హరిణచయంబుల నాదుకొనియె
వజ్రంబు చెలి దంతవరరుచులకు నోడి పాకశాసను చేత బట్టువడియె
రామతో నడ సరిరా నోడి రాయంచ వనజసంభవునకు వాహమయ్యె
 
తే.గాన జెలి సాటి యెవ్వరి గాన జగతి | దరుణులకు మిన్న దానెన్న దరముగాదు
పరమగుణజాల కాంచనభవ్యచేల | మదనగోపాల సత్యభామావిలోల!
56
సీ.కెమ్మోవి రుచి చాల బ్రమ్మి ముంగర ముత్తియమ్ము చొక్కంపు కెంపనగ దోచు
గనుసోగకాంతుల నెనయ బావిలి పచ్చపండు నీలపు జాయనుండి దనరు
పసిమిచెక్కుల కాంతి నెసగు గమ్మల వజ్రకణములు గోమేధికంబులయ్యె
తరుణిగుబ్బల రంగునొరసి పైటచెరంగు బంగారుచాయల బర్వి మెరయ
 
తే.వెలదియంగాంగముల తళ్కులలరు నిటుల | నీరజాసను డా యింతి నీకు గాను
దలచి సృజియించనేమొకో తరుణి నిపుడు | మదనగోపాల సత్యభామావిలోల!
57
సీ.మరుని కార్ముకములై తెరవ కన్బొమలొప్పు గురుకుచంబులు గెల్చు కోకయుగము
నసియాడు లేగౌను హరిమధ్య యనదగు నయ్యింతి నునుదొడ లనటితరులు
కలికిజంఘలు పొట్టకరగులై చెన్నొందు నతివపదములు చిగురుటాకులనగ
చుక్కలకాంతి పెంపెక్కు నఖావళి దంతిరాజముఖము బోలు తరుణినడక
 
తే.లౌర యా కుందరదన నీవంది మిథున- | మై చెలంగుటకై నొక్కమాట నీకు
దెల్పుదును మీకు వేవేగ దెలసి రమ్ము | మదనగోపాల సత్యభామావిలోల!
58
సీ.నెలత ఠీవియు సొగసు నేత్రోత్సవము సేయు నింతిమాటలు చెవుల కింపుజేయు
గలికి వగలను మనసు కరిగింపగా జేయు కొమ్మ తెల్వియు మది గోరజేయు
వనజాక్షి వింతలు వలపింపగా జేయు పడతి కనుసైగలు భ్రమయజేయు
నలివేణి చనులకు నౌసు వుట్టగజేయు వెలది కొసరులెంతొ వేడ్కసేయు
 
తే.గాన వగలాడికిని సాటిగలరె భువిని | చాన నీకైన దగు మంచిజాణ గదర
మానకిక నేలుకొనవయ్య మదనజనక | మదనగోపాల సత్యభామావిలోల!
59
సీ.వదలని కౌఁగిళ్ళ వాతెరనొక్కులు నెద గుబ్బయొరపుల యా లతాంగి
చిరునవ్వు మాటల జిలిబిలి పాటల దురుసుపై కొసరుల దోయజాక్షి
కొనగోటిమీటుల నెనలేనియాటల మొనసిన బొమముళ్ళ మోహనాంగి
గళరవంబుల చాలగానొప్పు సన్నల సైగల తగు ముద్దుచాన గాన
 
తే.వనిత వగనెన్న నెవ్వరి వశముగాదు | మరుని చేచిల్క యనదగు మందయాన
దాని కెనగాన నియ్యానత గజగాన | మదనగోపాల సత్యభామావిలోల!
60
సీ.తోయజవదన నీతోను భాషింపక మానునే విరహంబు మదనజనక
పణతుక నీపక్క పవ్వళింపక గాని నెమ్మదినుండునే నీరజాక్ష
యక్కున గదియించి యలమి ముద్దిడక నీ యాస దీరునె యింక జలజనాభ
కలికి నీతో రతి గలయక పలుమారు భ్రమదీరునా సతికి భవ్యచరిత
 
తే.గాన నిక చాన నేలుము గలిసి వేగ | పూని యిక నీవు రాకున్న పొలతి మధుర-
మైన విషములు ద్రావంగ మదిని దలచు | మదనగోపాల సత్యభామావిలోల!
61
సీ.మితిమీరి కాంక్షతో నతివేగ దన చేతి విరులవీవన చేత విసరి పతికి
నాకు మడ్పులొసంగి యతివ భర్తను బదులు విడెమిమ్మంచును వెలది ప్రాణ-
నాథుని నీక్షించి నవ్వుచు బలుమారు నాశదీరగ మాటలాడుకొనుచు
నిను జూడకుండిన నిముషమేనియు తాళజాలరా నా ముద్దుసామి యనుచు
 
తే.జాల మదికింపుమాటల సరసిజాక్షి | మగని వలపింపదగినట్టి మందయాన
నెలత నేలుట తగునయ్య నెనరుతోడ | మదనగోపాల సత్యభామావిలోల!
62
సీ.వనజాక్షి నెరనీటు వగలు చూచిన మది నిలువ నోపగరాదు నీరజాక్ష
కనకాంగి నెమ్మెయికాంతి జూచినయపుడె తమి నిల్ప వశమౌనె దానవారి
మగువ జిలిబిలి ముద్దుమాటలాలించిన నాశ మాన్ప దరంబె యమరవంద్య
శిబ్బెంపుగుబ్బల చిత్రంబు జూచిన మోహంబు మానునే మోహనాంగ
 
తే.గాన నిక జాగుసేయక కమలనయన | తరుణికడ కిక నతివేగ గదలిరమ్ము
ఇంతి నీ రాక కేవేళ నెదురుచూచు | మదనగోపాల సత్యభామావిలోల!
63
సీ.కాంత నెమ్మెయి సాముగంబము గావించి విభుని పొందుమటంచు వేడుకలర
నునుగోటి బాకుల నెనయించి గుబ్బల వదలని చేపట్ల వరుస దెల్పి
కొమ్మ నునుతొడలను కోణిత నెనయగజేసి మోవిమావుల వింతమొగ్గ నిల్చి
చెలి వేణివిసరుల జిరంతసాము ఘటించి సరిబోర దొడరి హెచ్చరిక దెల్పి
 
తే.యనయ గుబ్బల కుంకుమ యెఱ్ఱమట్టి | మేననంటగ మరునాము మెలత నీకు
దెల్ప గోరుచునున్నది దెలసిరమ్ము | మదనగోపాల సత్యభామావిలోల!
64
సీ.ధవుని బాసినయట్టి తరి గని నను జూచి వేగ మారుడు చెలరేగు గొమ్మ
చెలరేగి యదను క్రొంజిగురమ్ము లేసిన గోవెల లటుగూసె మావిగొమ్మ
మావిగొమ్మ బికాళి మది కలగించిన గల్కిచిల్కలు బల్కె గలివిగొమ్మ
కలివిమాటలు వినగా నోపకుండిన వెసవీచె దెమ్మెర వేపగొమ్మ
 
తే.వెలది యెట్లోర్తు శశిమంట వెలుగ గొమ్మ | పోయెదవె యిప్డు నా పతి బొగడగొమ్మ
ప్రియముతోనని నను బంచె బిల్వగొమ్మ | మదనగోపాల సత్యభామావిలోల!
65
సీ.కన్నెకు నాల్గింట గల్గును కన్బొమ లందగత్తెల మేటి యా వధూటి
కన్నెకు నేడింట గల్గును నేత్రముల్ మరుచేతితూపు యా మగువ చూపు
కన్నెకు నాఱింట గలుగును కుచములు గొప్పలై పూచెండ్ల యొప్పు దెగడు
కన్నెకు బదిరెంట గల్గు నెన్నడు మది యణుమాత్రమగు జాడ నరసి చూడ
 
తే.కన్నె కేనిటు బదములు గల్గియుండు కన్నెకును బదియవదియు గలుగు నీకు
కన్నెకును రెండవది నీకు కన్యకనుచు | మదనగోపాల సత్యభామావిలోల!
66
సీ.నీవు రావలెనంచు నెమ్మది దా గోరి గౌరీవ్రతము సేయు గంబుకంఠి
తోడ భాషింప నిజముగా మదిగోరి చెలి సరస్వతిపూజ సేయుచుండు
నీతోడ రతిగూడ నెలత దా నెదగోరి మదనుని బూజించు మందయాన
నీవు దయజూడంగ నిజభక్తి వరలక్ష్మినోము గావించు దా నుచితముగను
 
తే.భామ యీ రీతి వ్రతములు భక్తితోడ | జేయుచున్నది యచ్చట సిద్ధముగను
గలికి నీపైని నతిమోహకాంక్ష జెంది | మదనగోపాల సత్యభామావిలోల!
67
సీ.చాన నీపై వలపు మానెద నేవేళ బూని చిలుకలతోడ బోరుచుండు
బాల నీపై జాల బాళిచే దుమ్మెదరో దలకు దన మది రోయుచుండు
కామిని నీయందు కాంక్షను గోర్వంక కలకలంబుల కెదఁ దలకుచుండు
భామిని విరహార్తిబాధితయై నెమ్మి కేకలకును మది గనుకచెందు
 
తే.మగువ యీ రీతి మోహాబ్ధిమగ్న యగుచు | నున్న దాయింతి నెడబాయ నుచితమగునె
జాగుసేయక రావయ్య సారసాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
68
సీ.విరిబోడి నిను జేరి వింతవింతగ మాటలాడదే ముదమున హవుసుమీర
కొమ్మ పైకొని చాల ఘుమఘుమ వాసిల్ల పన్నీరు జల్లదే బాగుమీర
యెలనాగ నినుగూడి యెదయెద గదియించి పలుమారు పెనగదే బాళిమీర
నలివేణి నిను డాసి యక్కునక్కున జేర్చి గలయదే మరుకేళి ఘనతమీర
 
తే.గాన నా యింతి నేలుము గారవమున | చాన నిను వలచియున్నది జాగువలదు
పూని యిక వేగ రావయ్య పొలతి కడకు | మదనగోపాల సత్యభామావిలోల!
69
సీ.ముదమున నీ ముద్దుమోము చూడక గాని విరహంబు మానునే తరుణికిపుడు
మనమార నిను గూడి మరుకేళి గలయక యాశలు దీరునే యతివకిపుడు
కోర్కెతో నుపరతి గూడి మెప్పింపక మానునే వ్యసనంబు మగువకిపుడు
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
 
తే.కలికి యీ రీతి మదిలోన కలక జెంది | యున్న దా యింతి నతివేగ నూరడించి
జాగుసేయక నేలుము జలరుహాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
70
సీ.కనకాంగి నీ బిగికౌఁగిట జేరను దలచదా మరుబారి తాళలేక
కొమ్మ నీ యెద కుల్కుగుబ్బల గదియింప మది గోరదా తమి మానలేక
ముదిత నీ చెక్కులు ముద్దాడ దలవదా నిండిన మోహంబు నిలుపలేక
కాంత నీతో రతి కలయగా నెంచదా విరహానలముచేత వేగలేక
 
తే.కలికి నీయందు నతిమోహకాంక్ష జెంది నిన్నే దలచుచునున్నది నీరజాక్ష
వేడ్కతోడను రావయ్య వనితకడకు | మదనగోపాల సత్యభామావిలోల!
71
సీ.నీటుమీరగ దళ్కు నిడువాలుగన్నుల గాటపు వగ గుల్క కాటుకలది
యందమౌ మోమున పొందుగా కస్తూరితిలకంబు కొనగోట దిద్ది వేగ
నెరివేణి పొదవున విరిసరంబులు దాల్చి నరరత్నభూషణావళులు మెరయ
రంగుబుటేదారి రవికె యొప్పుగ దొడగి చెంగావిసరిగంచు చీర గట్టి
 
తే.వెడలి యారామమెల్లను వెతకి నిన్ను | గాన కిటు నన్ను బంపెను గమలనాభ
కరుణగల్గియు నా ఇంతికడకు రమ్ము | మదనగోపాల సత్యభామావిలోల!
72
సీ.కనకాంగిపై నీకు గడుమోహమగుటకు వనిత కొప్పున దాల్చు వకుళసరము
నానవాలుగ నిచ్చి యంపెను గైకొమ్ము మనమున సంతోషమంది వేగ
వలనొప్ప మదనాగ్ని వనితకు జల్లార్చి కడుప్రియంబున ఇంతి గలసిమెలసి
శుకవాణికడ జేరి సుఖలీల నుండుట కిది సమయము నీకు నింపుతోడ
 
తే.గాన నిను బిల్వవచ్చితి గమలనాభ | తామసించిన నా యింతి తాళదింక
కరుణతోడను రావయ్య కమలనాభ | మదనగోపాల సత్యభామావిలోల!
73
సీ.చెలియ పాలిండ్లు నీ చేతులకబ్బెనా దుర్గాధిపత్యంబు దొరికినట్లు
కనకాంగి నక్కున గదియింపగల్గిన యతనుసామ్రాజ్యము నందినట్లు
ఘనవేణి విపులజఘన మెక్కగలిగిన భూమండలమునెల్ల బూనినట్లు
కలికి యూరువు నంటగలిగిన నిచటనె కొమరొప్పగా రంభ గూడినట్లు
 
తే.గాన నా యింతితో గూడగలిగెనేని | నెల్లభోగంబులును నీకు నెలమి గల్గు
తరుణమిప్పుడు రావయ్య తరుణి కడకు | మదనగోపాల సత్యభామావిలోల!
74
సీ.పూర్ణచంద్రుని సరిబోల్పవచ్చును కాంత మోమున కకలంకమూర్తియైన
బంధుజీవముదొర భామ కెమ్మోవికి వికసించి కడువిఱ్ఱవీగకున్న
దరమెన యనదగు తరుణి కంఠమునకు కఠినత్వమందున గలుగకున్న
తమ్మిమొగ్గలు సాటి తరుణి పాలిండ్లకు బొసగ పంకంబున బుట్టకున్న
 
తే.నిన్ని సరిగాకనే కదా యెలమి క్షీణమొందె నొక్కటి వేసవి గందె నొకటి
జలధి బడె నొండు నీటిలో జారె నొండు | మదనగోపాల సత్యభామావిలోల!
75
సీ.తంబుర సుతిగూర్చి తరుణి తా జిలిబిలిపాటలు పాడెడి ఫణితి వినర
స్వరకల్పనంబుల సరి నెమ్మిగా వజక్రౌంచపికతురంగగజనినాద-
ముల యొప్పిదములను ముద్దుగుల్కెడి తాళలయపద్ధతుల నింపు లలర మదిని
సర్వవర్జిత మెరింగి కరిరాగాలాప మొనరించు హాయిగా ముద్దుగుమ్మ
 
తే.దానితో సరి యెవ్వరి గాన జగతి | నీకె దగినట్టి వగగల నేర్పులాడి
చాన నేలుట తగునట్టి జాణవీవు | మదనగోపాల సత్యభామావిలోల!
76
సీ.వగలాడి నగుమోము నిగనిగల్ చూచిన బంగారుచాయల పర్వు గదర
ననబోడి నునుజెక్కులను జూడ దళతళ మించుటద్దంబులై మెఱయు గదర
కొమ్మ జిగికెమ్మోవి నెమ్మిడాల్ చూచిన నీలవిద్రుమచ్ఛయ వెసగు గదర
చెలి దంతముల కాంతు లెలమితో జూచిన దాడింబవిత్తులై తనరు గదర
 
తే.యతివ సౌందర్య మెన్నుట కలవిగాదు | వనిత వగలెన్న నెవ్వరి వశముగాదు
ఇంతి ప్రాయము పదియురెండేండ్లు గదర | మదనగోపాల సత్యభామావిలోల!
77
సీ.వెలది నవ్వుల తేటవెన్నెల హరియించు గల్కి పల్కుల దేనెలొల్కజేయు
కలకంఠి కన్నులు కలువల నిరసించు మోము చందురుతోడ మొనయుచుండు
గామిని నాసిక కనకసూనము గేరు జెక్కు లద్దంబుల జెనకజూచు
ఘనవేణి కంఠంబు గడగి శంఖము గెల్చు చన్నులు పూచెండ్ల సరకు గొనవు
 
తే.పదర నిను కోరియున్నది బాళిమీర | మదవతిని గూడి లాలింప ముదముతోడ
జాగుసేయక రావయ్య జలరుహాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
78
సీ.ఠీకు కీల్కావిబుటేదారు పావడపై జరీచేలంబు బాగుమీర
హురుమంజి ముత్యాలసరులు గన్పడ బట్టు కనకపు మొగ్గల కంచుకంబు
బవిరెలు బొగడలు బావిలీల్ వజ్రంపు బలుకులచే నొప్పు పాపటయును
నందెలు మువ్వలు హస్తకడియములు సందిదండలు గుండ్లసరులు దూగ
 
తే.ముంగరయు నత్తు బేసరి ముదిత తనదు | నాసమున గీలుకొల్పి విలాసముగను
సుదతి నీ రాక కెదురు దా చూచుచుండు | మదనగోపాల సత్యభామావిలోల!
79
సీ.పదివన్నె బంగారుపడతి నెమ్మెయి కాంతి యలరు చందురుని హసించు మోము
వెలలేని వజ్రాల వెలసేయు రదనముల్ పచ్చివిద్రుమకాంతి సుదతి మోవి
ముకురసన్నిభములు శుకవాణి చెక్కులు ముంగుర్లు తేటుల రంగు దెగడు
కనకకలశములు కామిని పాలిండ్లు నలినాక్షి నాభి పున్నాగకుసుమ
 
తే.మతివ యూరు లనంటుల నపహసించు నెలత పదములు తాబేళ్ళ నేలజాలు
కాము చేకైదువన నొప్పు కాంత నేలు | మదనగోపాల సత్యభామావిలోల!
80
సీ.పలుమారు నే వచ్చి ప్రార్థించి పిలిచిన పలుకవదేమిరా పంకజాక్ష
యలివేణి మీయింతి యాడిన మాటలు మరుతునా యిక నేను మందయాన
ఇంతుల మాటల కెగ్గులెంతురె దయాపరుడవై ఇటు బల్క బాడియగునె
వలపెఱుంగక విభుని వాదుకు దీసుట రమణికి దగునే యో రామ చెపుమ
 
తే.యైన నేమాయె నిను గోరి యంబుజాక్షి | పిలువనంపెను రావయ్య ప్రేమగల్గి
వెలది సాష్టాంగమొనరించి వేడుకొనియె | మదనగోపాల సత్యభామావిలోల!
81
సీ.చెలియరో పో పొమ్ము క్షేమంబులగు నీకు దలపున మీ ఇంతి దలప నేను
దలపకుండగ నీకు దప్పేమి చేసెను వివరింపవలెనది వేదవేద్య
వివరింపగానేల వెలది నే గోరిన కోర్కె దీర్చక పాయె కువలయాక్షి
కోర్కెలీడేర్చను కోమలి నీ పొందు గోరియున్నది రార కోమలాంగ
 
తే.నయము నెరుగని స్త్రీలను నమ్మదగునె | వినయములు పెక్కు వల్కెద వెలది నీవు
నమ్మదగునయ్య నా మాట నలిననాభ | మదనగోపాల సత్యభామావిలోల!
82
సీ.బంధూక సహకార పాటల కురువక ఫలపూర జంబీర పనస తరులు
చందన ఖర్జూర చంపక బదరిక మాలూర మన్మథ మహిరుహములు
భల్లాతకామ్లాత భద్ర కేతకి నింబ పారిజాతాశోక పాదపములు
మాతులుంగ లవంగ మందారములు గల్గి జాతిప్రముఖ లతాసముదయముల
 
తే.వెలయు నారామమున జేరి వెలది మదన | తాపమున నిన్ను దలచుచు దాళలేక
యున్నదిక వేగ రావయ్య యూరడింప | మదనగోపాల సత్యభామావిలోల!
83
సీ.కనకాంగి విరహాగ్ని గ్రాగుచు నొకపొన్నమ్రాని పొంతను జేరి మగువ నిన్ను
దలచి దా నతిమోహతాపంబు నొందిన చెలులెల్ల శైత్యోపచార మొదవ-
జేయగా మిన్నంది జలజారి యతివపై పండువెన్నెలచిచ్చు బరుప వేడి
సైచక నను జూచి జలజాక్షి నిను వేగ దోడి తెమ్మనె రమ్ము తోయజాక్ష
 
తే.జాగు చేసిన నా ఇంతి తాళదికను చాల నిను నమ్మియున్న యా చానతోడ
మోడి సేయుట దగునయ్య మోహనాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
84
సీ.వలరాజుమామ జక్కులరేనిచెలికానితలపువ్వు కలువల చెలిమికాడు
ఱిక్కలగమికాడు జక్కులపగవాడు వారధిపట్టి భావజునిమామ
తిమిరబృందంబుల దెగటార్చు మగవాడు వలమురిదాల్పుముద్దులమరంది
గగనేభ మెక్కి వేగ చరించు రేరాజు విరహులపాలిటి వెడదచిచ్చు
 
తే.చందురుడు వేగ మిన్నంది చెలియ నేఁచ | దలచినంతనె విరహంబు తాళ వశమె
గాన రావయ్య నీవిక కరుణగల్గి | మదనగోపాల సత్యభామావిలోల!
85
సీ.జాబిల్లివేడికి సైరింపజాలునా కరుణించి మా చెలి గావకున్న
కోవెలరొదలకు గుండెలు దాళునా యలివేణి యెద చేతనంటకున్న
చలువతెమ్మెర వీవ సారెకు వణకదా చెలిని నీ కౌఁగిట జేర్పకున్న
తేటిఝంకృతులకు దెరవ దిగులొందదా యేకాంతమున దాని నేలకున్న
 
తే.తరుణి నిప్పుడు రతిగూడి తనుపకున్న | మదనతాపంబు మానునా మదనజనక
జాగుసేయక రావయ్య చానకడకు | మదనగోపాల సత్యభామావిలోల!
86
సీ.శుకతురంగము పౌజు యొక లక్ష చనుదేర తేటికాల్బల మొక్క కోటి గొల్వ
గోర్వంక బలములు గొల్చి కైవారంబు సేయ నెమ్ములును హెచ్చరికె దెల్ప
తెమ్మెరరథమెక్కి కమ్మవిల్తుడు చెరుకువింటను సంధించి విరుల సరము
తరుణిపై వడిదాక గురుకుచంబుల సందు గురుతుగా నేసిన కొమ్మ యెటుల
 
తే.సైచు విరిబోడి దా నోర్వజాల దికను | గాన వేగమె రావయ్య కరుణగల్గి
సుదతి నేలుట తగునయ్య సుందరాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
87
సీ.అతనుడు చలపట్టి యతివపై దండెత్తి యనిలరథంబెక్కి యళులగములు
చేరి కొల్వగ మేటిచిలుకగుర్రపుపౌజు తఱుచుగా వెనువెంట దగిలి నడువ
గోర్వంక లిరుగడ కొల్చి భటావళి కైవారములు సేయగాను మందు
తమ్మిఫిరంగుల దమ్మున పుప్పొడిమందు వెట్టుడు బొండుమల్లెగుండ్లు
 
తే.గలిగి యా ఇంతిపై దాడి కదల మరుడు | చూచి వచ్చితినిక నెట్లు సుందరాంగ
గాన వేగమే రావయ్య కనకచేల | మదనగోపాల సత్యభామావిలోల!
88
సీ.పండువెన్నెలచిచ్చు పయినిండ బర్విన నిముసమైనను తాళ నేర్చునటర
యళులు ఝుమ్మని మ్రోయ జిలుకలు రొదసేయ సతి కింపుగా వినగ నౌనటర
ముమ్మరమ్మై చల్వతెమ్మెర వీచిన నతివ నెమ్మెయి సారె కళుకదటర
మరుడు కోపించి చిగురుపువ్వుటమ్ముల బదరి వ్రేసిన కొమ్మ బ్రతుకునటర
 
తే.గాన నా సుందరాంగిని గారవమున | ... ... ... ... నదగు నీకైన యింతి నిపుడు
చలముడిగి వేగ రావయ్య సారసాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
89
సీ.నిముషంబు నొకకడ నిల్వనోపదు మారుతాపంబుచేతను తాళలేక
నించుకేనియు నన్నమింపుగాకను మోహపరవశయై యుండు బాళిమీర
క్షణమైన నిదురింపజాలదు వలపున చిత్తంబులో గడుచింతనొంద
గడియకు బలుమారు కడువడి భ్రమజెంది నిను దలంచుచునుండు నీరజాక్ష
 
తే.గాననిక జాగు సేయక కరుణగల్గి | యింతికడ కేగుదెమ్ము నీ వింపుమీర
తామసించిన మరు బాళి తాళదింక | మదనగోపాల సత్యభామావిలోల!
90
సీ.చౌసీతిబంధముల్ సరిబొంద బెనగెడి కొమరు ప్రాయపు ముద్దుగుమ్మ గదర
సదమదంబున విభు నెదనంట గుబ్బలనదిమి కౌఁగిట జేర్చు నతివ గదర
అసియాడు గౌనున నెసగు ఘంటల మ్రోత నెడపక గావించు నింతి గదర
బాళిచే గెమ్మోవి గ్రోలించి కడుమంచిమాటలచే ...ంచు మగువ గదర
 
తే.దాని సొగసెంత వగలెంత దలప వశమె | యెన్నదగినట్టి వెలదులమిన్న యగుర
నన్నె మదిగోరి యున్నది నీరజాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
91
సీ.ఏణాక్షి నీకేమి యెగ్గు జేసిన గాని తప్పు మన్నించరా దానవారి
పతితోడ కలహించు భామినితో పొందు చేయంగవచ్చునే జలజపాణి
చిరుత ప్రాయమునాటి చెలిమిని యా యింతి వాదించె గాబోలు వనజనాభ
పతిభక్తి గలిగిన పడతి తా విభునితోడ నెదిరింపదగునే యెమ్మెలాడి
 
తే.యైన నీ తప్పు సైరించి యతివ కడకు | రమ్ము పదివేల జోతలు రమణ నీకు
జేయ మది గోరియున్నది జాలమేల | మదనగోపాల సత్యభామావిలోల!
92
సీ.చెలియ సాష్టాంగంబు చేసి వేడితివని నెనరుంతు నీపైని నెలత పోవె
నెనరుంచి మా యింతి నెమ్మది నేలుటకిది తరుణంబన్న నేచదగునె
తగువుల పుట్నిల్లు తరుణి మీ సతిమాట లెఱుగమా పో పోవె యింతి నీవు
పరసతితోడను భాషింపరాదని తగవొనరించె మా తరుణి మొన్న
 
తే.నెన్ని నేర్చినదానవే యింతి నీవు | వనిత వెనువెంట నిదిగొ నే వత్తు బోవె
రమ్ము వేవేగ నిక నింత రవ్వలేల | మదనగోపాల సత్యభామావిలోల!
93
సీ.పదవె భామిని కడకు బయినమై వచ్చెదనని లేచి శ్రీకృష్ణు డతిముదమున
మహనియ్యమగు దివ్యమణికిరీటము దాల్చి వరరత్నభూషణావళులు మెఱయ
కర్ణశోభితమగు కనకకుండలములు పాదనూపురములు ప్రబలి మ్రోయ
పసిడిబంగారుదుప్పటివల్లెవాటుతో వెడలిన హరి జూచి వేగ జెలియ
 
తే.స్వామి మీ దయ నేడు మా సఖియకోర్కె | దీరగా గల్గె నీ శుభదినమునందు
భవ్యగుణజాల శుభలీల భక్తపాల | మదనగోపాల సత్యభామావిలోలా!
94
సీ.సరసిజాక్షుడు ప్రాణసఖిమందిరము జేరవచ్చిన నెదురేగి వనిత విభుని
నర్ఘ్యపాద్యాదుల నతివేగ నర్చించి దండప్రణామంబు దగ నొనర్చి
కనకాంగి ప్రాణేశు గౌఁగిట దగ జేర్చి పరగెడి తన కేళిభవనమునకు
వేగ దోడ్కొనిపోయి వెలది పచ్చలగద్దెపయి నునిచి యా సతి బాగుమీర
 
తే.విభుని సన్నిధిలోనుండి వెలది బలికె | నన్ను నెడబాసి యిట్లుండ న్యాయమటర
మరుని బారికి నెటులోర్తు మగువ నేను | మదనగోపాల సత్యభామావిలోల!
95
సీ.తన ప్రాణవిభునకు దడయక పన్నీట మజ్జనం బొనరించి మగువ కనక
పళ్లెరంబున మంచిపస గల యన్నంబు గోఘృతపక్వమౌ కూరలమర
నప్పడంబులు కందిపప్పును నొబ్బట్లు పాలుచక్కెర వెన్న పాయసంబు
ఘమ్మని వాసింపగా చారువడియముల్ పసిడిచెంబుల నీరు బాగుమీర
 
తే.విభుని ముందటనిడి వేగ వెలది విరుల | సురటి వీవంగ భుజియింప సుదతి విభుని
జూచి నను బాయకిక నేలు సుందరాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
96
సీ.నవరత్నకాంతు లున్నతమైన కేళికాభవనంబులో విరిపాన్పు జేరి
పరగ గందము మంచిపన్నీరు జవ్వాది బంగారుగిన్నెల బాగుపరచి
విరిసరంబులు మంచిమరువంబు కురువేరు నపరంజితట్టల నమరజేర్చి
ప్రాణనాథుని జేరి పడతుక కడుమంచియాకుమడ్పు లొసంగి యతివ మరుని
 
తే.కేళి దేలుచు సుఖియించి కీరవాణి | మమత బాయక విభు చెంత మగువ జేరి
యవుర నా సామి నను బాయకనుచు బొగడె | మదనగోపాల సత్యభామావిలోల!
97
సీ.అంత శ్రీకృష్ణుడా యలివేణితో గూడి మెరయ మిద్దెలయందు మేడలందు
కేళివనములందును కృతాద్రులందును పొదరిండ్ల దగు సురపొన్నలందు
నిసుకదిన్నెలయందు శశికాంతశిలలందు మదనోత్సవములను మగువ గూడి
సుఖలీల నెదుకులసోముడై చెన్నొంది పరగ భక్తుల బ్రోవ భవ్యమతిని
 
తే.నున్న దేవుని ... ... ... ... న్ని పూజ సేయదలచిన వారికి సిరులొసంగి
కోర్కెలొడగూర్తు గదవయ్య కోవలంక(?) | మదనగోపాల సత్యభామావిలోల!
98
సీ.వసుధ విజయనగవంశాబ్ధిచంద్రుడౌ వెలయ వెంకటగిరి విభున కెలమి
వరపుత్ర ... ... ... రివరమున బహువిధకృతులు గావించి సత్కీర్తి వెలసి
రాజిల్లు చెంగల్వరాయాహ్వయంబున దేజమొప్ప నృసింహదేవు పాద
కమలముల్ మదినుంచి గరిమ శ్రీహరిపేర నంకితంబుగ కబ్బమమరజెప్పి
 
తే.యబ్జనేత్రుని బదముల కర్పణంబు | చేసి విఖ్యాతి మైనుండ జెలగి నాదు
వాంఛలెల్లను సమకూర్చి వరములొసగు | మదనగోపాల సత్యభామావిలోల!
99
సీ.దండంబు యదువంశమండన గోవింద దండంబు నీకు వేదండవరద
దండంబు చంద్రమార్తాండ సులోచన దండంబు నీకు బ్రహ్మాండపోష
దండంబు పద్మజాఖండలసన్నుత దండంబు కుండలగండయుగళ
దండంబు భండనోద్దండపరాక్రమ దండంబు సద్గుణకాండ నీకు
 
తే.దండ మహిరాజశయన నీ దండ నమ్మి | యున్నవాడను నన్నేలుకొమ్ము తండ్రి
ప్రియజనోల్లాసభక్తమనోభిలాష | మదనగోపాల సత్యభామావిలోల!
100
మదనగోపాలశతకము సంపూర్ణము.
మదనగోపాల శతకము చెంగల్వరాయడు - ఆంధ్రభారతి - శతకములు - మదనగోపాలశతకము మదనగోపాలశతకం మదనగోపాల శతకం - శతకాలు Madana Gopala Satakamu - Chengalvaraya - Madanagopala Satakam - Chemgalvaraya - AndhraBharati AMdhra bhArati - shatakamulu - telugu