శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
శా. శ్రీరామామణి పాణిపంకజమృదుశ్రీతజ్ఞ పాదాబ్జ శృం
గారాకారశరీర, చారుకరుణాగంభీర, సద్భక్తమం
దారాంభోరుహపత్రలోచన కళాధారోరుసంపత్సుధా
పారావారవిహార, నా దురితముల్‌ భంజింపు నారాయణా!
1
మ. కడకుం బాయక వేయినోళ్ళు గల యా కాకోదరాధీశుఁడున్‌
గడముట్ట న్వినుతింప లేక నిగుడ\న్‌ గ్రాలంగ నొప్పారు మి
మ్మడర\న్‌ సన్నుతి సేయ నాదువశమే! యజ్ఞాని, లోభాత్ముఁడ\న్‌
జడుఁడ, న్నజ్ఞుఁడ, నైకజిహ్వుఁడ, జనస్తబ్ధుండ, నారాయణా!
2
శా. నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరి\న్‌
ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చు చందంబున\న్‌
నీ నామస్తుతు లాచరించు నెడల న్నే తప్పులుం గల్గిన\న్‌
వానిన్‌ లోఁగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా!
3
మ. నెరయ న్నిర్మల మైన నీ స్తుతికథానీకంబు పద్యంబులో
నొరుగుల్‌ మిక్కిలి గల్గెనేనియుఁ గడు న్యోగంబె చర్చింపఁగాఁ
గుఱుగ ణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం
జెఱకుం గోలకు తీపు గాక కలదే, చే దెందు, నారాయణా!
4
మ. చదువుల్‌ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని యై
మదిలోఁ బాయక నిన్ను నిల్పఁ దగు నామర్మంబు వీక్షింపఁడే
మొదలం గాడిద చారుగంధవితతుల్‌ మోవంగ శక్యంబె కా
కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త, నారాయణా!
5
మ. లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లం న్మించెఁ బో నీకథా
వళి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్‌
పెలుచం బూనిన యక్కరాటము తుదిన్‌ బేతేకరాటంబె పో
చలదిందీవరపత్రలోచన, ఘనశ్యామాంగ, నారాయణా!
6
మ. మన మార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్యమై
మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్మార్గమై
యెనయ\న్‌ సాయకశాయికిం జననియై యేపారు మిన్నేటికిం
జని మూలంబగు నంఘ్రి నాదు మదిలోఁ జర్చింతు, నారాయణా!
7
శా. నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా
నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా
నీ పాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా
నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా!
8
శా. బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ
బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్‌ భవ్యాధినాథుండవై
బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకు\న్‌ భావింప రాకున్న నా
జిహ్మవ్యాప్తుల నెన్న నాదు వశమే చిద్రూప, నారాయణా!
9
మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్‌ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )