శతకములు నరసింహ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
సీ. శ్రీ మనోహర! సురార్చిత సింధుగంభీర! - భక్తవత్సల! కోటిభానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశ్యపాంతక! శూర! - సాధురక్షణ! శంఖచక్ర హస్త!
ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ! - క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీలభ్రమరకుంతలజాల! - పల్లవారుణపాదపద్మయుగళ
 
తే. చారుశ్రీచందనాగరుచర్చితాంగ! - కుందకుట్మలదంత! వైకుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
1
సీ. పద్మలోచన! సీసపద్యముల్‌ నీమీఁదఁ - జెప్పఁ బూనితినయ్య!చిత్తగింపు
గణ యతి ప్రాస లక్షణముఁ జూడఁగలేదు - పంచకావ్య శ్లోకపఠన లేదు
అమరకాండత్రయంబరసి చూడఁగలేదు - శాస్త్రీయ గ్రంథముల్‌ చదువలేదు
నీ కటాక్షంబుననే రచించెదఁ గాని - ప్రజ్ఞ నాయది గాదు ప్రస్తుతింపఁ
 
తే. దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె - చెఱకునకు వంకపోయిన చెడునె తీపు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
సీ. నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దురితజాలములెల్ల ద్రోలవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - బలువైన రోగముల్‌ బాపవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దండహస్తుని బంట్లఁదఱుమవచ్చు
 
తే. భళిర నేనీ మహామంత్రబలముచేత - దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
3
సీ. ఆదినారాయణా! యనుచు నాలుకతోడఁ - బలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కార మర్పణఁ జేసి - ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండివారైనను - నిన్నుఁ గాననివారి నే స్మరింప
మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడివారి - చెంతఁ జేరఁగఁబోను శేషశయన!
 
తే. పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల - దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
4
సీ. ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు - ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు
కనక మిమ్మని చాలఁ గష్టపెట్టఁగలేదు - పల్ల కిమ్మని నోటఁ బలుకలేదు
సొమ్ము లిమ్మని నిన్నునమ్మి కొల్వఁగలేదు - భూము లిమ్మని పేరు పొగడలేదు
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగాలేదు - పసుల నిమ్మని పట్టుపట్టలేదు
 
తే. నేను గోరిన దొక్కటే నీలవర్ణ - చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
5
సీ. మందుఁడనని నన్ను నిందఁ జేసిననేమి? - నా దీనతను జూచి నవ్వనేమి?
దూరభావములేక తూలనాడిన నేమి? - ప్రీతిసేయక వంకఁ బెట్టనేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? - తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?
హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి? - చేరి దాపట గేలిచేయనేమి?
 
తే. కల్ప వృక్షమువలె నీవు గల్గనింకఁ - బ్రజల లక్ష్యంబు నాకేల?పద్మనాభ
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
6
సీ. చిత్తశుద్ధిగ నీకుసేవఁజేసెదఁ గాని - పుడమిలో జనుల మెప్పులకుఁ గాదు
జన్మపావనతకై స్మరణఁజేసెదఁ గాని - సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁ గాదు
ముక్తికోసము నేనుమ్రొక్కి వేఁడెదఁ గాని - దండి భాగ్యము నిమిత్తంబుఁ గాదు
నిన్నుఁ బొగడఁగ విద్యనేర్చితినే కాని - కుక్షినిండెడి కూటికొఱకుఁ గాదు
 
తే. పారమార్థికమునకు నేఁ బాటుపడితిఁ - గీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
7
సీ. శ్రవణ రంధ్రముల నీసత్కథల్‌ పొగడంగ - లేశ మానందంబు లేనివాఁడు
పుణ్యవంతులు నిన్నుఁబూజసేయఁగఁ జూచి - భావమం దుత్సాహపడనివాఁడు
భక్తవర్యులు నీ ప్రభావముల్‌ పొగడంగఁ - దత్పరత్వములేక తలఁగువాఁడు
తనచిత్తమందు నీ ధ్యానమెన్నఁడు లేక - కాలమంతయు వృథాగడుపువాఁడు
 
తే. వసుధలోనెల్ల వ్యర్థుండువాఁడె యగును - మఱియుఁ జెడుఁగాక యెప్పుడు మమతనొంది
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
8
సీ. గౌతమీస్నానానఁ గడతేఱుద మఁటన్న - మొనసి చన్నీళ్లలో మునుఁగలేను
తీర్థయాత్రలచేఁ గృతార్థుఁ డౌద మఁటన్న - బడలి నేమంబు లే నడుపలేను
దాన ధర్మముల సద్గతిని జెందుదమన్న - ఘనముగా నా యొద్ద ధనము లేదు
తపమాచరించి సార్థకత నొందుదమన్న - నిమిషమైన మనస్సు నిలుపలేను
 
తే. కష్టములకోర్వ నాచేతఁగాదు నిన్ను - స్మరణ చేసెద నా యథాశక్తి కొలఁది
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
9
సీ. అర్థివాండ్రకునీక హానిఁ జేయుటకంటెఁ - దెంపుతో వసనాభిఁ దినుట మేలు
ఆఁడుబిడ్డల సొమ్ములపహరించుటకంటె - బండఁ గట్టుక నూతఁ బడుట మేలు
పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె - బడబాగ్ని కీలలఁ బడుట మేలు
బ్రతుకఁ జాలక దొంగపనులు చేయుటకంటెఁ - గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు
 
తే. జలజదళనేత్ర నీ భక్తజనులతోడి - జగడమాడెడు పనికంటెఁ జావు మేలు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - narasiMha shatakamu ( telugu andhra )