శతకములు సుమతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. శ్రీ రాముని దయ చేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా
ధారాళమైన నీతులు
నోరూఁరఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ!
1
క. అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా
నెక్కినఁ బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !
2
క. అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
వడి గల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!
3
క. అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయఁబోకు, కుజనులతోడన్‌
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ!
4
క. అధరము గదలియుఁ గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ!
5
క. అప్పుగొని చేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపము\న్‌
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!
6
క. అప్పిచ్చు వాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును ద్విజుఁడున్‌
జొప్పడిన యూర నుండుము
చొప్పడ కున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
7
క. అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజము\న్‌
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
8
క. ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొంకక నిచ్చు వాఁడె దాత ధరిత్రి\న్‌
సోఁకోర్చు వాఁడె మనుజుఁడు
తేఁకువ కల వాఁడె వంశతిలకుఁడు సుమతీ!
9
క. ఆఁకలి యుడుగని కుడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకు\న్‌
బ్రాఁకొన్న నూతి యుదకము
మేఁకల పాఁడియును రోఁత మేదిని సుమతీ!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - sumati shatakamu ( telugu andhra )