శతకములు వేంకటేశ శతకము
1 11 21 31 41 51 61 71 81 91
శ్రీదేవి యురమున శిరసునఁ దులసి భూ, కాంతవీఁపుఁన బదాగ్రమున గంగ
కమలాసనుఁడు నాభిఁగాముండు మనసున, సవ్యవామాక్షుల శశియు రవియు
ధ్వజమున గరుడుండు తపసుల కాంతుల, సకలవాయువులు నాసాపుటముల
జగములు కుక్షిని జలధులు తరులందు, ఘనరోమముల దేవగణము లెల్లఁ
 
గలిగి శోభిల్లు నీమూర్తిఁ దలచి నీకు, సీసశతకంబు చెప్పెదఁ జిత్తగింపు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
1
ధర్మంబుగలచోటఁ దలకొను జయమెల్ల, దయగలచో సుకృతంబు నిలుచు
సత్యంబుగలచోట సమకూరు శుభములు, నేమంబుగలచోట నిలుచు సిరులు
పాడిగల్గినచోటఁ బంతంబులీడేఱు, దాక్షిణ్య మున్నచోఁ దగులు మైత్రి
భక్తిచేసినచోట ఫలమిచ్చు దైవంబు, మనసు నిల్పినచోట మలయు సుఖము
 
లితరమగుచోట వెదకిన నేలయుండు, సొరదినీదైనకృపగలచోటఁగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
2
పరమనాస్తికునకు భక్తివాదము లేల, షండున కేటికి సతుల పొందు
పాపకర్మున కేల వరపురుషార్థంబు, ధనలోభి కేల బాంధవము చింత
మూర్ఖునకేటికి మొదలనే మొగమాట, మనృతవాదికిని మర్యాద యేల
వెట్టివానికి నేల విమలవిచారంబు, పరదూషకున కేల పరముచింత
 
సరసునకుఁగాక వివరింప సద్గుణంబు, లెందుఁజూచిన మందున కేల గలుగు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
3
తపసికి నేటికిఁ దలపోయ రోషంబు, బ్రాహ్మణునకు నేల పాపచింత
బుద్ధిమంతునకేల పొసఁగని సఖ్యంబు, పరమయోగికి నేల ప్రజలరచ్చ
మహిరాజునకునేల బహుజనద్వేషంబు, కార్యవంతునకేల కడుఁ జలంబు
కీర్తికామునకేల కెరలినలోభంబు, మంచివానికి నేల మంకుగుణము
 
కీడుమేలును మతివితర్కించి చూచి, భవ్యగుణములను గొల్చి బ్రతుకవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
4
మరణంబు లేకుండ మందుచేఁ గలిగినఁ, గాలునకేటికిఁ గలఁగ బాఁఱఁ
బాయంబు చెడని యుపాయంబు దొరకిన, నేయెడ ముదిమికి నేలతలఁకఁ
గామితార్థము లిచ్చు కామధేనువు గల్గఁ, గఱవున కేటికి వెఱచి యొదుఁగ
వజ్రదేహంబు గా వరము సిద్ధించిన, శస్త్రాస్త్రముల కేల జలదరింప
 
శరణుసొచ్చిన యటువంటి జనులకెల్లఁ, గావఁ బ్రోవఁగఁ దాతవు గలవు నీవు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
5
కులమువారల కియ్యకో లైన దిల్లాలు, వరుసతో రక్షించువాఁడు తండ్రి
ప్రియముతోఁ జన్నిచ్చి పెంచినయది తల్లి, తనకుఁ దోడగువాఁడు తమ్ముఁడరయ
నాపదం బెడఁబాపునాతండు బంధుండు, వంచన సేయనివాఁడె భటుఁడు
మోక్షమార్గము చూపు ముఖ్యుండె యాచార్యుఁ, డాత్మకు నిష్టమౌనతఁడు సఖుఁడు
 
ఎఱిఁగి వీరలతోఁ బొందునెఱపవలయు, గుఱుతెఱింగిన సద్వివేకులకు నెల్ల
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
6
శౌర్యంబు గలుగుట జన్మసాఫల్యంబు, శాంత మాత్మవివేక సాధనంబు
మానంబు దనకును మహనీయ సంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు
సవినయవచనంబు సర్వవశ్యకరంబు, వెలయునాచారంబు వెనుబలంబు
దానంబు సేయుట తన కది దాఁచుట, సజ్జనసంగతి సౌఖ్యమొసఁగు
 
గాన బుధులీ గుణంబులు మానకెపుడు, తగిలి మిమ్ముభజింతురు తలఁచితలఁచి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
7
ధరదేవతాలయ ద్రవ్యసక్తుఁడు గాక, తొడిఁబడ బ్రాహ్మణద్రోహి గాక
చెనసి పతివ్రతాజనకాముకుఁడు గాక, వాఁడిమి నగరఁ గొండీఁడు గాక
గర్వముతోడ నొక్కట మదాంధుడు గాక, పరఁగ నవిశ్వాసపరుఁడు గాక
కుటిలవర్తనమునఁ గ్రూరచిత్తుఁడు గాక, సకలశాస్త్రములందు శఠుఁడుగాక
 
మెలగనేర్చిన యట్టి ధార్మికునకెందుఁ, గలుగు శుభములు మీ కటాక్షంబువలన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
8
గడుసరిఁ దాటోటుఁ గష్టు వేడుకకానిఁ, గలహప్రియుని ధూర్తుఁ గపటచిత్తు
సుంకరి జూదరి జూటు ననాచారి, మునిముచ్చుఁ జలపాది ముడియవిడుపుఁ
గుచ్చితు నపకారిఁ గుటిలాత్ము నవివేకిఁ, గైలాటకానిఁ డక్కరిఁ దుటారి
వేఁటకానిఁ బిసాళి వెఱ్ఱి నప్పులపోతు, మాయదారిని జారుమద్యపానిఁ
 
జేరవలదు మఱిపొందుసేయఁ దగదు మానవున కర్థితోఁ గలలోననైన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
9
జలకంబు తగుపాటి జపము దేవార్చన బ్రాహ్మణసేవ పురాణగోష్ఠి
దానంబు చోరశాత్రవ వినిగ్రహచింత, స్వజనగజాశ్వరక్షణము గణన
యాప్తమంత్రి పురోహితాలోచనంబులు, రాజ్యాధిధనవిచారంబు భుక్తి
సంగీతసాహిత్య సౌఖ్యానుభవములు, గూఢచారుల కొల్వు గుప్తనిద్ర
 
సలుపవలయును బ్రతిదివసంబునందు, నయమెరింగినయట్టి భూనాయకుండు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEsha shatakamu ( telugu andhra )