శతకములు వేంకటేశ్వర శతకము
1 11 21 31 41 51 61 71 81 91
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య
ఉ. శ్రీసతి నీల జాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా
త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱు\న్‌
జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ
మూసినముత్యమై యురము ముంగిటఁ జెంగట వేంకటేశ్వరా!
1
ఉ. కన్నులుగల్గి కొమ్మ నిను గప్పముఁ జేకొన లేఁతనవ్వు నీ
కెన్నఁడు మోవి నిచ్చినదో యేగతి మెచ్చితో యెట్టులుండెనో
యన్నిట, నేనెజాణ నని యుందువు శ్రీయలమేలుమంగకే
మన్నన నెట్టు లిచ్చితివో మాటలఁ జిక్కవు వేంకటేశ్వరా!
2
చ. కిలకిల నవ్వు నవ్వి తిలకించితి మంచి సుధారసంబు నీ
పలుకులతేనెలన్‌ విభునిఁ బట్టముఁ గట్టితి నీదుకౌఁగిట\న్‌
వలదని చెప్పినన్‌ వినవు వద్దు సుమీ యలమేలుమంగ నీ
కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా!
3
ఉ. నీవును దాను గూడెఁ దరుణీమణి శ్రీయలమేలుమంగ నా
నావిధవైభవంబుల ననారతముం జెలువొందు నేఁడు నీ
వావలిమోము చేసి తన యప్పటినుండియుఁ బల్కవిట్టులా
దేవర చిత్తమెవ్వరికిఁ దేర్పఁగ శక్యమె వేంకటేశ్వరా!
4
ఉ. ఓలలితాంగి! యోకలికి! యోయెలజవ్వని! యోవధూటి! యో
గోల! మెఱుంగుఁజూపుకనుఁగోనల నోయలమేలుమంగ మ
మ్మేలినతల్లి నీవిభున కించుక మాదెసఁ జూపు మంచు నీ
పాలికిఁ జేరి మ్రొక్కుదురు పద్మభవాదులు వేంకటేశ్వరా!
5
చ. చికురభరంబుచే (నదిమి) శ్రీలలితాంగివి నీవు నాగుణా
ధికునియురంబుపై రతులఁ దేలుచు శ్రీయలమేలుమంగ నీ
లికుచకుచ ప్రభావమున లేఁతవయస్సున నింత నేతురా
వెకలి వటండ్రు నెచ్చెలులు వేడ్కల నీసతి వేంకటేశ్వరా!
6
చ. ఒకమఱి నీవు కన్గొనల నొయ్యనఁ జూచిన నీవిభుండు లోఁ
గకవికఁ దర్చుఁ జేరునట కౌఁగిటి కోయలమేలుమంగ నీ
వికచవిలాస మంచు నరవిందమరందపుఁ దేనెపల్కులన్‌
బికశుకపంక్తి నీకుఁ దలఁపించును నీసతి వేంకటేశ్వరా!
7
ఉ. కూరిమి సానవట్టిన చకోరపుఁ గన్నుఁగొన\న్‌ దళుక్కునన్‌
జేరువ మించులై మెఱయఁ జిమ్ములబొమ్మలఁ బంపు నవ్వు దై
వారఁగఁ గాంచి నీతరుణి వన్నెల శ్రీయలమేలుమంగ నీ
సారపు నేర్పుఁ జక్కగొనెఁ జక్కని మోమున వేంకటేశ్వరా!
8
ఉ. ఆయలసంబు లానడపు లాకనుఁగ్రేవల ముద్దుచూపు లా
యాయెలనవ్వు మాటల ప్రియంబులు నీ కలమేలుమంగ నీ
మాయలొ ప్రాణవల్లభుని మక్కువ చేఁతలొ చెప్పు మంచు లేఁ
బ్రాయపు నీసతిం జెలులు పల్కిరి పల్మఱు వేంకటేశ్వరా!
9
ఉ. కిన్నెర మీటి పులకించి తలంచి మనోజలీలఁ దా
నున్న తెఱంగు నెచ్చెలుల కొయ్యనఁ జెప్పఁగబూనుఁ జెప్పరా
కన్నువ సిగ్గుతో నలరు నల్లన శ్రీయలమేలుమంగ నీ
వన్నెలసేఁత లెట్టివో సువాళము లెట్టివో వేంకటేశ్వరా!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEshvara Satakamu - vEMkaTEshvara shatakamu - annamayya - annamAchArya - ( telugu andhra )