శతకములు వృషాధిప శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
  శ్రీగురులింగమూర్తి! సువిశేష మహోజ్జ్వలకీర్తి! సత్క్రియో
ద్యోగ కళాప్రపూర్తి! యవధూత పునర్భవజార్తి! పాలితా
భ్యాగత సంశ్రితార్ధి కవిపండితగాయక చక్రవర్తి! దే
వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
1
చ. ప్రమథవిలోల! భక్తపరిపాల ధురంధరశీల! సంతతా
స్తమిత సమస్తదేహ గుణజాల! సుఖప్రదలీల! లింగ జం
గమ మహిమానుపాల! గతకాల సమంచిత నాదమూల! దే
వ మము భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
2
ఉ. అప్రతిమప్రతాప! సముదంచిత నాదకళాకలాప! దీ
ప్త ప్రమథస్వరూప! శివభక్తగణాత్మ గతప్రదీప! ధూ
త ప్రబలేక్షుచాప! విగతప్రకటాఖిలపాప లింగ త
త్త్వప్రద! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
3
ఉ. భక్తిరసాభిషిక్త! భవపాశవితాన విముక్త! జంగమా
సక్త! దయాభిషిక్త! తనుసంగతసౌఖ్యవిరక్త! సంతతో
ద్యుక్త గుణానురక్త! పరితోషితభక్త! శివైక్యయుక్త! ప్ర
వ్యక్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
4
ఉ. శత్రు లతాలవిత్ర! గుణజైత్ర! భవాబ్ధివహిత్ర! జంగమ
క్షేత్రవిచిత్ర! సూత్ర బుధగీత చరిత్ర! శిలాదపుత్ర! స
త్పాత్ర! విశుద్ధగాత్ర! శివభక్తి కళత్ర! శరణ్యమయ్య! భా
స్వత్త్రిజగత్పవిత్ర బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
ఉ. త్ర్యక్షసదృక్ష! సంచితదయాక్ష! శివాత్మక దీక్ష! సత్ప్రసా
దాక్ష! ప్రతాప శిక్షిత మహాప్రతిపక్ష! మహోక్ష! భూరి క
ర్మక్షయదక్ష! జంగమ సమక్షమ భక్తిపరోక్ష! లింగ త
త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
ఉ. అక్షయభక్తిపక్ష! బసవాక్షర పాఠక కల్పవృక్ష! రు
ద్రాక్ష విభూతిపక్ష! ఫలితార్థ ముముక్ష! శివప్రయుక్త ఫా
లాక్ష! కృపాసమంచిత కటాక్ష! శుభాశుభ పాశమోక్ష! త
త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
7
ఉ. ఆర్య వితానవర్య! భువనాదిక శౌర్య! యుదాత్త సత్పదా
చార్య! యవార్యవీర్య! బుధసన్నుతచర్య! విశేష భక్తి తా
త్పర్య! వివేకధుర్య! పరిపాలితతుర్య! శరణ్యమయ్య! దు
ర్వార్య యనూన ధైర్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
8
ఉ. తజ్ఞ! జితప్రతిజ్ఞ! యుచిత ప్రమథానుగతజ్ఞ! నమ్ర దై
వజ్ఞ! కళావిధిజ్ఞ! బలవచ్ఛివభక్తి మనోజ్ఞ! ధూతశా
స్త్రజ్ఞ! సువాదపూరిత రసజ్ఞ! తృణీకృత పంచయజ్ఞ! స
ర్వజ్ఞ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
9
ఉ. క్షీణజనప్రమాణ! యసికృత్త కుయంత్రక ఘోణ! జంగమ
ప్రాణ! వినిర్జిత ప్రసవబాణ! సమంచిత భక్తియోగ సం
త్రాణ! కళాప్రవీణ! శివధర్మ రహస్యధురీణ! దత్తని
ర్వాణ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vR^ishhAdhipa shatakamu ( telugu andhra )