బాల సాహిత్యము నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి మిత్రభేదము

అనంతరము రాజపుత్రులు విష్ణుశర్మతో నిట్లనిరి. 'స్వామీ! మీ యనుగ్రహము వలన మిత్రలాభము వింటిమి. ఇంక మిత్రభేదము విన గోరెదము' అనిన విష్ణుశర్మ యిట్లు చెప్పఁ దొడఁగెను.

ఒక వనములో సింహవృషభములు మిక్కిలి చెలిమి గలిగియుండెను. ఒక మాయావి యయిన గోమాయువు వానికి విద్వేషము పుట్టించి సింహముచేత వృషభమును జంపించెను. ఆ కథ మీకు సవిస్తరముగా వినిపించెదను. సావధానముగా వినుండు.

దక్షిణాపథమందు రక్షావతియను పట్టణము గలదు. అందు వర్ధమానుడను సార్థవాహుడు వాసము చేయుచుండెను. అతఁడు తనకంటె సంపన్నులయిన తన బంధువులను జూచి వారికంటె మిక్కిలిగా ధనము సంపాదించవలెనని యెంచి యిట్లు చింతించెను.

'అర్థము పురుషార్థములలోపల నుత్తమము. అర్థవంతున కసాధ్యము లోకమందేదియుఁ గానము. కాఁబట్టి పురుషుఁడు న్యాయము తప్పక యే యుపాయము చేతనయినను ద్రవ్యము సంపాదింపవలెను. ఇంత సంపాదించితి నింకేల? యని తనియ రాదు. బుద్ధిమంతుఁడు జరామరణములు లేనివానివలె విద్యాధనములు గడియింపవలెనని పెద్దలు చెప్పుదురు. ధనార్జనమునకు సాధనములు పెక్కు గలవు. వాని లోపల వాణిజ్యము సర్వప్రకారములచే మేలయి కానఁబడుచున్నది' అని విచారించి పరదేశమునకు వలసిన తన దేశమందలి మేలు సరకులు సేకరించుకొని పెక్కు సరకులు బండ్లమీఁద గుర్రములమీఁద వేసడములమీఁద నెత్తించి కొన్నిటికి భారవాహులను నియమించి మంచికంచర మొకటి సిద్ధము చేసికొని దానిని సంజీవక నందకములను నఱ్ఱలను బూన్చి యెక్కి సముచిత పరివారముతో నుత్తరదేశమునకుఁ బయనమాయెను. ఇట్లు బయలు వెడలి కడుదూరము గడచి సుదుర్గమను పర్వము చేరువ కాంతారమందు బోవుచుండఁగా సంజీవకము కంచరమును లాగ జాలక లాగుచు జాఱి మోఁకాలు విఱుగ నేలఁబడియె. అంత నా వర్తకుఁడు కంచరము దిగి శీఘ్రముగా సంజీవకము మెడకాఁడి కట్టు వదలించి రెండవ యెద్దును విడువఁ బంచి యిట్లు చింతించెను. 'ఈ పాటిది నా కంచరపు టెద్దులలో నొకటిగాని లేదు. ఇది మంచి నఱ్ఱ. ఇక్కడ నిలిచి తగిన చికిత్స చేయించుకొని పోదునంటినా యిది మహారణ్య మధ్యము. నిలువఁ జోటుగాదు. దీనికీ యడవిపాలు కావలసినగతి యున్నది కాఁబోలును. ఎట్టి పౌరుషముగాని దైవగతి విపరీత మయినప్పుడు పనికిరాదు. కీడో మేలో యేకాలమందేది రావలెనో యది రాకమానదు. కాఁబట్టి యొక యిమ్ము దప్పి వచ్చి నప్పుడు వెనుఁబడరాదు. వెనుఁబడితిమిపో దానిచేత సాధ్యమేమి?' అని చింతించి తన సరకుబండ్లు కావళ్ళు మొదలయినవి దారిసాగిపో సెలవిచ్చి తన కొంత పరివారమును కంచరమునకు బళకర ముంచి యక్కడికి సమీపమందు ధర్మపురమను గ్రామమునకు బోయి పోతరించి లావుగలిగిన యొక యెద్దును విలిచి తెచ్చి కంచరమునకుఁ గట్టించుకొని సాగి పోయెను.

తరువాత నా కాటియందు సంజీవకము భాగ్యము మంచిది కాఁబట్టి క్రూరసత్వములబారికిఁ దప్పి విఱిగిన మోకాలు చక్కఁబడి లేచి నడయాడసాగెను. "ఆయువు గట్టిగా నుండెనా, మహామృత్యువువాతఁ జొచ్చియయిన మరలి రావచ్చును. కాలము సమీపించెనా, కోటి వేల్పులయిన మరణము మానుపఁ జాలరు." పిమ్మట నా వృషభము వనములో విచ్చలవిడిగాఁ దిరుగుచు నానాఁడు మంచి పచ్చికమేఁత కడుపార దొరకఁబట్టి లెస్సగా బలిసి యొకనాఁడు పర్వతగుహలు మాఱుచెలఁగ గణిల్లని ఱంకె వేసెను.

ఆ కాననమందుఁ బింగళక మను సింహము గలదు. అది పుండరీకముల ఖండించుచు నలుగుల నలుగులంపడఁ జేయుచుఁ గాసరముల మీసరము గాసించుచు ఋక్షముల శిక్షించుచుఁ దక్కిన మ్రుక్కడి మృగముల లెక్కింపక యిచ్చకు వచ్చినట్టు విహరించుచు నాఁడు దప్పివడి పిపాసితమై యమునాకచ్ఛము నకుంబోయి ప్రళయసమయ పర్జన్య గర్జానుకారి యయిన సంజీవకము భీషణ ఘోషము విని వెఱఁగుచే రాపడి నిలుచుండెను. ఆ యరణ్య మందుఁ గరటక దమనకములను జంబుకములు గలవు. కరటకుఁడు దమనకునితో ముచ్చటలాడుచుండి సంజీవకము రావము విని యదిరిపడి గుండెలు తటతటఁ గొట్టుకొనఁ గొంతవడికి సంబాళించుకొని యావలనికిఁ గ్రేఁగంటిచూపు నిగిడించి చెవి నిక్కించి యాలించి యిట్లనియె. "మఱి సద్దు గానము. నీవును వింటివిగదా? ఇది యేమి? ఇంతకాల మాయెను! ఈ యరణ్యములో నున్నారము. ఇట్టి బెట్టిదపుఁ గూఁత యెన్నడుగాని విన్నదిలేదు." అనిన దమనకుఁ డిట్లనియె. "ఔనౌను. ముందు విన్నదిగాదు. ఈ శబ్దము మహాశ్చర్యము. అదిగో చూడు మనరాజు పింగళకుఁడు యమునాకచ్ఛమునకుఁ బోవువాఁడు రాపడి నిలుచున్నాఁడు. ఆధ్వని విని కాఁబోలు" అని చిఱునవ్వు నవ్వి, "యంతవాఁ డట్లాయెను. మన మనగా నెంత వారము?" అనినఁ గరటకుఁ డిట్లనియె - "ఇట్టి బెట్టిదపుటులివు గావించిన జంతువు కొంచెపాటిగా నుండదు. ఎక్కడినుండి వచ్చి యా జంతు వీవనము చేరినది? ధ్వనిమాత్రము విన్నారము గాని యా జంతువును గానము. నిన్నమాపో, నేడు ఱేపో యిక్కడి కది వచ్చి చేరియుండును. ఇంక నేమి యిడుముపాటు రానున్నదో యెవరెరుంగుదురు?" అనిన దమనకుండి ట్లనియె -"ఈ యరణ్యము మనకు మాన్య క్షేత్రమా? లాఁతి చోటికిఁ బోఁగూడ దని నియమమా? మరి యరణ్యము లేదా? అభిజన మెవ్వరికిఁ గాని దుస్త్యజమే. అట్లని చావున కొప్పుకోవచ్చునా? ఈ విచారమేల? ఇప్పుడు మనకు వలస దీయునంత యిడుము యేమి వచ్చినది? ఈ వరకా జంతువు నల్లనిదో, తెల్లనిదో యెరుఁగము. అది క్షుద్రజంతువో, మహాజంతువో ముందు తెలిసికొని పిమ్మటఁ గర్తవ్యము విచారింతము. పిట్టకొంచెము, కూత ఘన మన్నట్టు క్షుద్రజంతువునకు సయితము పెద్ద నోరుండవచ్చును. జంతువంత బెట్టిదము గాదనుటకు నాకు సూచన కొంతఁ గానఁ బడుచున్నది. నీవును జూడుము. ఆ వంక జంతువులు కలగుండుపడిన లక్షణ మేదియుఁ గానరాదు గదా! మంచిది, యాలకింపుము. క్షోభమేమాత్రము పుట్టిన నలబలము వినరాకుండునా?" అనినఁ గరటకుఁ డిట్లనియె - "అవునది నిజమే. కాని కడపట నది యిట్టి జంతువు కూఁత యనిమాత్ర మాకళింతకు రాలేదు." అనిచెప్పి కొంత తడ వూరకుండి చిరునవ్వు నవ్వి యిట్లనియె - "ఇప్పటికి స్మరణకు వచ్చినది. మరియేమిగాదు. విను. కొన్నాళ్లకు మునుపు వర్తకుఁడొకఁడు దారిన బోవుచుండి యీడువ జాలక యీడిగిల బడిన యొక బక్క యెద్దును బ్రయాణ త్వరఁ బట్టి యీ యడవిలో విడిచిపోయినాఁడు. అది యీ కాటిలో గడ్డి పరకలు కొరికి తేరుకొని కొంత చియ్య బట్టి యక్కడక్కడ నఱ్ఱాడఁగాఁ జూచితిని. ఇప్పుడు మనము విన్నది దాని ఱంకె. దానికి సందేహము లేదు. ఊరక యీ వఱకుఁ బనికిమాలిన పిరికితనము తెచ్చుకొంటిమి. మనకంటె శూరుఁడు మన రాజు." నావుడు దమనకు డిట్లనియె - "మనము పింగళకునకు మంత్రి పుత్రులమై యుండి యిప్పుడొప్పరికింపరాదు. డాయఁబోయి యాతని భీతి మానింతము. ఈ నెపము చేత నాతని కొలువు సంపాదించుకొని యనుగ్రహము పడయవచ్చును. రాజానుగ్రహముఁ బొందినవానికి సర్వసంపదలు గలుగును. మన మాతని తొంటి నిగ్రహము పాటించరాదు. మనకుఁ దదనుగ్రహ సంపాదనము ముఖ్యముగాని తక్కిన మోఱకుఁ దన మేల?" అనిన గరటకుఁడిట్లనియె - "దమనకా! వినుము. ఈతని సంగతి నాకు సరిపడదు. మునుపు కొలువుండి పడ్డ పాట్లు చాలును. ఈతఁ డెత్తువారి చేతి బిడ్డగాని యొక తెన్నునఁ బోవువాఁడు గాడు. ఇట్టివాని కొలువు మిక్కిలి కష్టము. అది యుండనిమ్ము. ఉదరపోషణముకయి పరులకు శరీరమమ్ముకొనుట మిక్కిలి హేయము. పరాయత్త వర్తనుడు మృత కల్పుఁడు. అయినను సేవకుఁడు స్వకృత్యములయందు స్వామి చేత మన్ననం బడసెనా సేవాదుఃఖము కొంత నిస్తరించును. ఉపేక్షితు డయ్యెనా దానికంటె దుఃఖము లేదు. పరాభూతుఁ డయ్యెనేనిఁ జెప్పవలసిన దేమి? సేవావృత్తిచే వచ్చు పాయసము కంటె స్వచ్ఛంద వృత్తిచే లభించు గంజి మేలు. కాఁబట్టి ప్రాప్త లాభముచేఁ దృప్తిపడి సుఖ ముండుదము. ఇప్పుడాతని భీతి మానుపవలసిన జోలి మనకేమి గలదు? జోలి మాలినపని పయిఁబెట్టుకొన్న వాఁడు మేకును బెఱికిన కోఁతివలెఁ దప్పక ముప్పుఁ జెందును. ఆ కథ చెప్పెదను వినుము.

***

(మి.భే.-1)

మగధ దేశమునఁ దరిదుర్గమను పట్టణము కలదు. అందు మహావిభవ సంపన్నుఁడయి శుభదత్తుఁడను వైశ్యుఁడు కలఁడు. అతఁడు సంతానము లేనివాఁడు కాఁబట్టి తన ధనమారామ తటాకాది ప్రతిష్ఠలకు వెచ్చించుచు నా పట్టణములో నొక దేవళము జీర్ణమై యుండగాఁ జూచి కారువులను రావించి తగిన వేతనములు నియమించి దాని గట్ట నియోగించెను.

వారు దాని గట్టు చుండగా నొకనాఁడు చేవదూలము ఱంపముచేఁ గోయించుచు నది సుకరముగా వ్రీల్చుటకు సూత్రధారుఁ డక్కడక్కడ మ్రాని మేకులు దిగగొట్టి మధ్యాహ్న భోజనార్థము కూలివాండ్రును దానును బోయెను. అప్పుడా పరిసర తరువులందుఁ దిరుగుచున్న కోఁతులు దేవాలయము దాపునకు వచ్చి ప్రాకారములు ప్రాఁకుచు బ్రాంత మహీరుహముల మీఁదికి గుప్పించి దాఁటుచు బెనుఁగొమ్మలు కరములతోఁ బట్టి యూఁచుచు విమానముల మీఁదఁ గూర్చుండి వికృతముగా బరులు వీఁపు గీరుకొనుచు నిక్కుచు బొమలెత్తి యురుగొట్టి బెదరించుచుఁ బండ్లికిలించుచు వెక్కిరించుచు నొకటి నొకటి కురుపు మీఁద బండించుకొని మేనిపేల నేరి నోరవేసికొనుచుఁ గిలకిలారావములు గావించుచు నొండొంటితోఁ బోరుచు ఫలములు భక్షించుచు మధువు లానుచు స్వాభావిక చపల భావముతోఁ దిరుగుచుండెను. ఒక ముసలి మల్లు కాల చోదితమై చేవ దూలము డాసి యెక్కి దాని నెరియలోఁ దన ముష్కము వ్రేలం గూర్చుండి, యందు బిగియ గొట్టిన కొయ్యమేకును రెండు చేతులతోఁ జిక్కబట్టి బలిమితో నూడ బెరికి యా నెరియలో వ్రేలుముష్కము చదియుటఁజేసి ఱోలుచుఁ గాల ధర్మము నొందెను. కాఁబట్టి జోలిమాలిన పనికిఁ బోరాదు.

***

మన మిప్పుడాతని భృత్యపదమందు లేము. అతనికి గ్రొత్త కొలువుకాం డ్రనేకు లున్నారు. స్వామి హితాహితముల విచారము వారిదిగాని మన కా యధికారము లేదు. పరాధికారము పయి వేసుకొన్న వాఁడోండ్ర వెట్టి మోఁదు పడిన గాడిదవలె వినాశముఁ బొందును. ఆ కథ చెప్పెదను. సావధానముగా వినుము.

***

(మి.భే.-2)

వారణాసియందు ధావకమల్లుఁడను చాకివాఁడు గలడు. ఒకనాఁడు వాఁడు మిగుల బట్టలు గుంజిన బడలిక చేత మయిమఱచి గుఱువెట్టి నిద్రపోవుచుండెను. ఆ నడిరేయి వాని యిల్లొక దొంగ చొచ్చెను. అప్పుడు వాని యింటి వాకిటఁ గాలి బందముతో గాడిద నిలుచుండెను. ఆ యింటి కావలికుక్క దాపునఁ గూర్చుండి చూచుచుండెను. అవి యొండొంటితో 'లోనికి దొంగ చొచ్చినాఁడు. చూచితివా?', 'చూచితిఁ జూచితి', 'మఱి యేల మొఱుగవు?', 'నాపని విచారింప నీకేమి నిమిత్తము?', 'మన దొరయిల్లు దొద్దవోఁగా నొప్పరికింపవచ్చునా?', 'నీవే మెఱుఁగుదువు? రాత్రి దినము నిమిషమాత్రమయినఁ బ్రమాదపడక తలవాకిలి వదలక యిల్లు గాచుకొని యుండుదును. ఆవంతయయిన నావలని ప్రయోజన మెఱుఁగక యేలిక నాయందు సాతకము లేకయున్నాఁడు. కాఁబట్టి కూడు కమికెఁడయిన దొరకుట కఱవయ్యె. పాటెఱుఁగని దొరను సేవించుట కంటె మిన్నకుంట మేలు.'

ఇట్లు ఖరశ్వానములు ప్రశ్నోత్తరములు జరుపుచుండఁగా గాడిద మిక్కిలి కోపించుకొని 'యోరి దురాత్మ! వినుము. ఒక పోరామి వచ్చినపుడు స్వామి దోషములు దడవి యుపేక్షించి యుంట భృత్యునకు ధర్మము గాదు. అదియును గాక స్వామి రక్షణము విచారింపక సేవకుఁడు స్వార్థపరుఁడయి స్వకృత్యము నందుఁ బ్రవర్తింపఁడేనిఁ గృతఘ్నుఁ డగును. నీవు పాపిష్ఠుఁడవు. దొసఁగు పొసఁగినప్పుడు స్వామికార్య ముపేక్షించితివి. ఇంతటితో నేదియు మునిఁగిపోదు. నీపని నాచేతఁ గాదా? చూడు. మన యేలిక నిప్పుడు ప్రబోధించెదను' అని చెప్పి గట్టిగా నోండ్ర పెట్టెను. అంత నా మడివేలు మేలుకొని నిద్రాభంగమాయెనని మహాకోపముతో లేచి యొక బడియతో గాడిదను మోదెను. ఆయమందా మోఁదు తాఁకుట జేసి యా గాడిద ప్రాణములు విడిచెను. కాబఁట్టి పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.

***

అక్కడక్కఁడ బసరముల డొక్కలు వెదుకుట మన కార్యము. అది మాని యీ విచార మేల? భక్షితావశిష్టమయిన మాంసము కావలసినయంత యున్నది. రా, రా, భక్షింతము."

అనిన దమనకుఁడిట్లనియె - "ఇప్పుడు త్వర యేల? మెల్లగాఁబోయి భక్షింతము. ఎల్ల జంతువుల కాహార నిద్రా భయములు సహజ ధర్మములు. కుక్షింభరిత్వముచే గారవము రాఁబోదు. మిత్రామిత్రుల కుపకారాపకారములు చేయ వేఁడి బుద్ధిమంతులు రాజాశ్రయము గోరుదురు. స్వోదరమాత్రము భరియింప నేఁడు లేఁడు? ఏవాఁడు జీవింప ననేకులు జీవింతురు, వాని మనుగడయే సఫలము. వాఁడొకఁడు జీవించువాఁడు. అమిషశూన్యమయి వసాగంధిలమైన శల్యము దొరకిన మాత్రాన వేఁసి మిక్కిలి సంతోషపడును గాని దానిచే దాని యంగద గొంతయైన నడంగదు. కేసరి యాసన్నమైన మ్రుక్కడి మృగమును లెక్కింపక నిజఖరనఖర విదారిత హస్తి మస్తమస్తిష్కము కోరును. ఎల్లవారు సత్త్వానురూపమైన ఫలమే వాంఛింతురు. శునకము తన కోగిరము పెట్టువాని కడ జేరి తోకాడించును. నేలఁబడి నోరు కడుపు చూపును. ఇన్ని పాట్లుపడు కుక్క కొక్క ముద్ద వంటకము కంటె మిక్కిలి పెట్టరు. ద్విరదము కరము ధీరముగా విలోకించుచు సారెకాధోరణాపలాలితమై మెల్లగాఁ గబళముఁ గొనియెడిని. హీనుఁడెంత దీన భావముతో వేఁడినను వాని కెవ్వరును దనియఁబెట్టరు. గారవము గలవానికి వినయ వచనములతో గోరికకు మీఱ నిత్తురు. అనవద్యమగు విద్యచే నవక్రమగు విక్రమముచే నిరపాయమైన యుపాయముచే నృపాలుర మెచ్చు వడసినవాని మనుగడయే మనుగడ. శునకము సయితము కమికె డన్నము దిని మనలేదా? గుఱువతనము మానక తన కలిమి కొలఁది నిలాఁతులకు మేలొనరించు వాని జీవన మొక్కనాఁటిది యయినంజాలును. స్వోదర మాత్ర పూరకమగు కరటము చిరకాలము మనిన ఫలమేమి? అలతి జలముచే మొరవనేల వెల్లి వొడిచి నట్లు, కొలఁది లాభముచే క్షుద్రునందు హర్షము వొడమును. హితాహిత వివేకము లేక విహితకర్మములు మాని స్వోదర మాత్రము పూరింప గోరువాఁడు పశుతుల్యుడు. అంతియ కాదు. భార వాహియయి తృణమాత్రాశనమయి కృష్యాది కర్మముల కత్యంతోప కారకమయి పవిత్రజన్మమయిన వృషభము నరపశువు కంటె మేలు గాదె?"

అనినఁ గరటకుఁ డిట్లనియె "దమనకా! మనము ప్రధానులము గాము. మన కీ విచారముతో నేమి ప్రయోజనము?"

అనిన దమనకుఁ డిట్లనియె "ప్రధానుఁడు కావుట కెంతసేపు పట్టును? పురాకృత సుకృతము వలనఁ బ్రజ్ఞావంతుడగు ప్రాజ్ఞుఁడు రాజ పూజితుఁ డవును. రాజ సమ్మానముచేతఁ బ్రజ్ఞ మిక్కిలి ప్రకాశించును. వానివలనఁ దంత్రావాపములు నడప సమర్థుఁడవును. ఆ సామర్థ్యముచేతఁ ప్రధానత్వము పడయును. ఎట్టి ప్రజ్ఞావంతుఁడు గాని పేఁటికాంతర్గత రత్నముంబోలె నినాలోక యోగము లేక ప్రకాశింపఁడు. పురుషుఁడు సాధువర్తనుఁ డయ్యె నేని సర్వలోక పూజ్యుఁడగును. కానిచో గర్హ్యుఁడగును. మానావమానములు ప్రవర్తనాయత్తములయి యుండును. గుణవంతుఁడని పేరువడుట దుర్లభము. లాఁతి విధము సులభము. మహాగ్రావమును గ్రావాగ్రము నెక్కించుటం బోలెఁ గ్రిందికిఁ ద్రోచుట దుష్కరము గాదు."

నావుడుఁ గరటకుఁడిట్లనియె "రాజసేవలని ప్రయోజన మెఱుఁగని వాడనుఁగాను. తొల్లి యీతనివలనఁ బడ్డపాట్లు తలంచుకొన్న మాత్రానఁ దల కంటగించుచున్నది. కాబట్టి యట్లు వచియించితిని. భృత్యుల గుణదోషములయందు వివేకము చాలని రాజును గొలుచుట దుష్కరము. నీవు వివేకివి. అన్యులచేతఁ జెప్పించుకొనవలసిన యర్థము నీకొకటి లేదు. ఉచితమయినట్లు చేయుము. ఇప్పుడు నీవు చేయఁబూనిన కార్యమేమి?"

నావుడు దమనకుడిట్లనియె "మనరాజు పింగళకుఁడు జలపానార్థము కాళిందికిఁ బోయి యెద్దు ఱంకెవిని భయపడి తీర్థావతరణము మాని వెఱఁగుపడి యున్నవాఁడు. పరహృదయము ప్రత్యక్షముగాదు. కాఁబట్టి యాతని చిత్త వృత్తి నీవెట్లు తెలిసికొంటివనబోకు. ఈ యర్థ మాతని యాకారము చేతనే నా కవగత మయినది. ధీమంతునకుఁ బరుల భావము సుగమమై యుండును. తురంగ మాతంగాదులు సహితము చెప్పిన యర్థము గ్రహించి వహనాది కార్యములఁ బ్రవర్తిల్లు చున్నవి. పరేంగితావగాహి యయిన బుద్ధి యొక్కటియె పండితునకు విశేషము. అదిలేనినాఁడు పండితునకుఁ బామరునికంటె విశేషమేమి? అది యటుండనిమ్ము. కర్తవ్యాంశము వినుము. నేనిప్పుడు రాజు పాలికి బోయి తద్భావానురూపముగా ననుసరించి వలసిన మాటలాడి యీకార్యము నీవు సేయుమని యాజ్ఞాపింపఁ జేసికొని మనసునకెక్కఁ బ్రవర్తించి యాతని మన్ననలు వడసెదను."

అనినఁ గరటకుఁ డిట్లనియె "రాజుల కొలువు గోరువారు మెలఁకువ గలిగి ప్రవర్తించవలెను. వారి చిత్తవృత్తి యెఱింగి మెలఁగుట కడింది. అది స్వచ్ఛంద వృత్తి వంటిది గాదు." నావుడు దమనకుఁ డిట్లనియె "ఉద్యోగికి దూరభూమియు విద్వాంసునకుఁ బరదేశమును బ్రియవాదికి శత్రువును లేని యట్లు బుద్ధిమంతున కసాధ్య మొకటిలేదు. సద్వర్తనము గలిగి నిచ్చలు తమ్ము గొలుచు వారిని రాజులాదరింతురు. భృత్యుఁడు ఱేని కోపప్రసాదముల యంగమచ్చములెఱిఁగి మెలఁగెనేనిఁ దదనుగ్రహమునకుఁ బాత్రుఁడవును." అనవుడుఁ గరటకుఁ డిట్లనియె - "తొలుత రాజును జూచి నుడువ దొరఁకొను నర్థ మేది?" నా విని దమనకుఁడిట్లనియె "ఈ యర్థము వచియింప వలెనని నియమము గలదా? ప్రతిభాశాలికి ప్రభువు నెదుర సమయోచితముగా వచియింప వలసినది బహువిధములుగా నుండును. సేవకుఁడడఁకువ దోప గట్టెదురు పట్టుదలగి యేలిక మొగమున చూపు నిలిపి యాతఁడు తనవలను చూచునెడఁ దత్కాలోచితముగఁ పౌర్వాపర్యము విచారించి ఱేని భావమూహించి తక్కుఁగల రాజభృత్యులకు నవిరుద్ధముగ నేరిమి మీఱఁ బలుకవలసిన యర్థము పలుకవలయును."

అనినఁ గరటకుఁడు "నీకుఁ గార్యసిద్ధిఁ గావుత. అదె ఱేఁడును మరలి తన యిరవునకుఁ జనుచున్నవాఁడు. అతఁడిరవు చేరునంతకు నీవుం బోయి దాఁకొనవచ్చు బొమ్ము." నావుఁడు దమనకుఁడు పింగళకుని పాలికింబోయి అడఁకువ తోడ నొదుఁగువాటున నిలిచి భయభక్తులుప్పిరిగొనఁ దొట్రుపడుచు జోహారు నొనరింప మృగేంద్రుఁ డతని సాదరంబుగ వీక్షించి కూర్చుండ నియమించి "కుశలమా! బహుకాలమునకు నిన్నుఁ జూడఁ గలిగె" నావుడు దమనకుండిట్లనియె.

"దేవా! తావకంబగు నపాంగావలోకంబునకుం బాత్రంబైన యీ వనక్షేత్రంబున జంతుసంతానంబుల కావంతయేనిఁ గొఱంత కుశలంబునం గలుగుదనం దావకసేవకులగు మావంటి వారి కయ్యది యడుగంబనియేమి? అవసరంబగుడు సేవకుండనాకారితుండయ్యు రావలయుఁగాదె? స్వామికి దఱి యెరిగి భృత్యుండు హితాహితంబు లెరిఁగింపవలయు. ఉపేక్షకుండయినం బ్రియవాది యయినను స్వామి ద్రోహియగు. స్వామి ద్రోహికి సర్వశ్రేయంబులు చెడును. సదసద్వివేక సంపన్నుండయిన ప్రభువునకు మాబోఁటి క్షుద్రులవలన నరయందగిన యర్థం బొకటి గలదే? యని విచారింపఁ బనిలేదు. చక్షుష్మంతునకే దీపంబుగాని యంధునకుం గొఱయగునె? ఒక్కటి విన్నవించెద నవధరింపుఁడు. బహు దేశాటనంబును బహుశ్రుతులతోడ నిరంతర సాంగత్యంబును గావ్య శాస్త్ర విచారంబును రాజాస్థానంబుల బహుకాల సేవనంబును బురుషున కెట్టివానికేని వివేకంబు పుట్టింప సమర్థంబులయి యుండు. ఈ నాలుగింట నొక్కండే నెవ్వానికి లేకుండ వాఁడు కూపస్థ మండూకంబుంబోలెం దన ముక్కునకుఁ జక్కని మీఁదిదె యాకాశంబు తన గొందియ లోకం బని యెంచి స్వజీవన మాత్రంబునకుం దుష్టివొంది లోకవృత్తంబున మూఢుండయి నశియించును. చిరకాలం బేలిన వారి పాదంబుల కొలువు సేయుచున్న మాబోంట్లు మ్రుక్కుడులయ్యు విద్యావివేక సంపన్నులగుట సన్నిధాన ప్రభావంబు చేతంగాదె? స్వామికి క్షేమంబు గాంక్షించు భృత్యుండ ప్రాప్తానుయోగుండయ్యుం దరి యెరింగి వలయు నర్థంబు వచింపవలయును. అయినను స్వామి చిత్తంబునకు వేఱొండుగఁ దోఁచునేమో యని మనంబు తేకువం బొరసెడు." నావిని పింగళకుండు "దమనకా! నీవు మాకు హితభృత్యుడవు. నీ వచనంబు మా కవశ్య గ్రాహ్యంబు. మేము నీకుఁ గ్రొత్తవారమే? ఏల జంకువడియెదవు? నీ యిచ్చ వచ్చిన చొప్పునం జెప్పవచ్చును." నావుడు దమనకుండు కరంబున నోరు మూసుకొని యావచనంబు లాలించి బుద్ధి బుద్ధి యని, "దేవా! యింతకు గొంతముందు యమునా కచ్ఛంబునకుం బోయి యచ్చట రిచ్చవడిన తెఱంగు దోఁపం గొంతసేపు చిత్రరూపంబు పగిదిం జూపట్టి మరలి యిరవున కరుదెంచితిరి. ఇందులకు నిమిత్తంబు గానక చిత్తంబుత్తలంబు నొందెడు. అయ్యది చెప్పవచ్చునని దేవర చిత్తంబునకుం దోచిన సేవకుండు వేచియున్నవాఁడు." నావిని పింగళకుండు "దమనకా! విను. మాకు నీవు పరమాప్తుండవు. నీకు దాపురము చేయు నర్థము మాయందొకటియైనఁ గలుగదు. అఖిలసత్త్వశరణ్యం బయిన యీ యరణ్యంబు మదధీనంబు. ఈ దేశంబున నా యాదేశంబునం గాక యాకయినం గదల వెఱచు. వింటివా నే డొక్క విపరీతంబు? పిపాసార్థితుండనయి యమునా తరంగిణి కరుగుచుండ నురుము తెఱంగున మొరపం బొక్కటి కర్ణ గోచరంబయ్యె. ఆ నినదంబు వినినచోటనె వితాకుపడి నిలిచితిని. ఇసుమంత యయిన నంతరంగంబున భయంబునం బొరయక యిట్లు ఘోరంబయిన యారావంబు గావించిన జంతువలంతిగ నుండదని చింతించెద. లోకంబున నుత్తముండగు శూరునకుం బర ప్రకర్షంబు సహ్యంబగునే? అలతివాని నేనిం బగవాని నొప్పరికింపఁ జనదన లాఁతివానిఁ జెప్పనేల? ఎట్టి వానికేనిం బల దర్పంబునఁ బగతు నొప్పరికించునట్టివాని కశక్తి భీరుత్వంబులు లోకులారోపింతురు. వలదని వాకొనకుండ మూఁకుట నోళులు గ్రమ్మవచ్చునే? ఇట్టి సడివడు కంటె నొడలు విడుచుట మేలుగాదె? ఊరక దోరుకంటెఁ బోరనది శ్రేయోదాయకంబయి యుండు. దైవయోగంబున మారుతుండు దోరెనేనిం గడుమేలయ్యె. కావున నిప్పుడ దాయపయి నొండె బోవుదము. అరాతి నిరాసంబ పరమార్థంబుగం గోరితిమేని దదుపాయాన్వేషణం బావశ్యకంబు; బలవంతుం బగతు నుపాయంచేతన సాధింపవలయును. కావున నిప్పటికిఁ దొలంగి చని కాలదేశోచితంబుగ వలయు నుపాయంబు సముపార్జించుకొని విపక్షుశిక్షింత మొండె. ఇందు నీకెయ్యది పోలియున్నది. చెప్పు"మనిన దమనకుండు కొంతవడి చింతించి "తుదముట్ట గారణంబు దెలియక తమకింప రాదు. శబ్దమాత్రంబునకు నివ్వెఱఁ బొరయం జనదు.

***

(మి.భే.-3)

తొల్లి యొక జంబుకంబు వనమ్మునం గ్రుమ్మరుచు నెక్కడ నాహారంబు చేకూఱమిం గరంబుదరం బాఁకట నకనకంబడ డిల్లపడి నికలాంగంబులయి నేలంగూలిన శతాంగంబులును ఖండిత శుండాదంతకాండంబులయి కెడసి కొండల పిండు విడంబించు వేదండతండంబులును ముంగాళ్ళు విఱిగి డొక్కలు పెరిగి మాఱు మెడలు వైచి దాఱుమాఱుగం బడియున్న వారువంబులను నెఱమగంటిమి మెఱయు నా తెఱం గొరుకుచుం జూపుజంజెనల పొంకంబు వదలని శిరంబులును వాలు దొఱంగని కరంబుల గరంబు మెరయు వీరశయనంబు నొందిన యోధవారంబుం గలిగి ఘోరంబయి వివిక్తంబయిన యొక్క పొలికల నింగని తఱియంజని యొక్క దారుణారావంబు విని గుండియ లవియబెండువడి మూర్చిల్లి కొంతవడికిం దెప్పిరి ఱెక్కలు విచ్చి యప్పొలంబు నలువలఁకులు విలోకించి గాలిం గదలు వ్రేలు గొమ్మలతాకున మ్రోగుదుందుచింగని మనంబునం దలంబగు కొందలంబు మాని దాని డాయంబోయి యద్దానితోలు వ్రీలం గొఱికి చొరంబడి వెడలి వచ్చి 'దీనికలరూపు తొలుతం దెలియం జాలనయితిని. ఇప్పుడు గదా దీని చొప్పు నెఱింగితి. ఎద్దియేని సవిమర్శంబుగం బరికింపక కానియున్న తెఱంగెరుఁగంబడదు గదా' యనియె ననుకొనుచుం దన చుట్టు బట్టునం జూపట్టు శవనిహంబు జూచి 'యహా! యిట్టి యాహారంబు దొఱంగి సురుంగం జూచితింగా' యని వగచుచు వలయునంత పలలంబు దిని తనయిచ్చం జనియె.

***

కావున శబ్ద మాత్రంబునకు నివ్వెరఁ బొరయం జన దని వచించితి. స్వామి ముదల యిచ్చినం జాలును. ఈ క్షణంబయా చప్పు డుప్పతిల్లిన చాయకుం బోయి తత్కారణం బారసి నీలెంక రాఁగలండు" అనినం బింగళకుండాతని మొగం బట్టె చూచి కొంత చింతించి "యిదియ యిప్పటి కుచితంబని తోఁచు చున్నది. కరంబు పరికింపక యేకార్యమునకేనిం దమకింప లగ్గుగాదు. ఎదిరి సమ్ముఖంబున మాటలాడ సూటిపడెనేని బలా బలంబు కొలంది యెఱింగి తత్కాలోచితంబుగ నావుత్తెంచిన మాటలుగ నాడవలసిన నీకుం బోలిన తెఱంగున నాడి యెదిరిని గొనవచ్చునేని నట్లు నడుపుము. నీ వన్నిటం జతురుండవు. నీకుం జెప్పవలయునే? పోయిరమ్ము" నావుడు దమనకుండు గ్రక్కున వెడలి తొల్లి యా మ్రోఁత వీతెంచిన జాడన పోయి యా పొలంబు నలుఁగెలంకులు కలయంజూచి యడుగుల చొప్పు వట్టి డాయంబోయి సంజీవకుంగాంచి "యోయి వృషభేంద్రా! నేను మృగేంద్రుని భృత్యుండను. అతండునుప నీ పాలికి వచ్చితిని. అతండు దానుగ నీతోడ నాడు మాటలు నాకుం గఱిపుత్తెంచినవాఁడు. వినుము.

'ఈ యరణ్యంబు మదధీనంబు. దీనం గల సత్త్వంబు లన్నియు నా శాసనంబు వహించి వర్తించుచున్నయవి. నీవును నా యాజ్ఞానువర్తివయి యుండునది. ఇంతియ కాదు. మదీయాను చరులం గూడి వర్తింప నీకు బ్రియంబేని ననురూపంబగు రాచకార్యం బొసంగెద. నీ యిష్టంబెయ్యది యది యనుసరింపవచ్చు' నని యానతిచ్చె. ఇంతకు మునుపు నీవు నిశ్శంకంబుగ ఱంకియ వైచితివి గాబోలు! దాని విని యేలికకు నీ పొలఁకువ విచారణీయం బయ్యె. నీవు భయంపడకుము. అమ్మహామహుండు కరుణాళుండు, ధార్మికుండు గావున సజ్జనులకు గమ్యుండై యున్నవాఁడు. నీవు శంకింపక యే తె"మ్మని నుడివి యొడంబఱచి, ముందు మృగేంద్రుని పాలికింజని "స్వామీ! దేవర యాజ్ఞ చొప్పునం బోయి పరికించితి. మీ విన్న యా రావంబు గావించినవాఁడు మీ కనుగ్రాహ్యుండు గాని, నిగ్రాహ్యుండు గాఁడు. తావకంబగు నవక్రవిక్రమంబు విని భయాక్రాంతుండయి యున్నవాఁడు. ప్రభంజనుండు మహాభూజంబుల భంజించుం గాని వినతంబులగు తృణవితానంబులు పెకలింపం గడంగునెట్లు? శక్తి సంపన్నుండు దన్ను మాఱుకొనువానియందుఁ దనబలంబు వెలయించుఁగాని మ్రుక్కడుల లెక్కింపఁడు. ఇట్టి గుణంబు లేలినవారికి సహజంబులై యున్న యవి. అవసరంబడుగు వచియింపవలసెంగాని దేవరకు ముందఱ వాక్రువ్వ వలయునె? అతఁడు సంజీవకుండను వృషభేంద్రుండు, బుద్ధిమంతుండు. యేలిన వారి యోలగంబున వర్తింపఁ జాలినవాఁడు. అతని స్వామి పాదంబుల చెంతకుం గొనివచ్చెద ముదలమే" యనం బింగళకుండు చిఱునగవుతోడ నంగీకార సూచకంబుగ మొగం బెగరవేయ మహాప్రసాదం బనుచు వినమితగాత్రుండై యెదుంగుచు వేళంబు చని సంజీవకున కెదురువోయి "నీ భాగ్యంబు కతంబున మృగరా జొంటినున్నవాఁడు, కానిపించుకొన నిదియె సమయంబు, మసలక యేతె"మ్మని వెంటం దోకొని వచ్చి ఱేని కట్టెదురు దొలగించి కొంత చెంత నిలుప సంజీవకుండు భయ వినయ సంభ్రమంబులు ముప్పిరిగొన వినమ్రుండయి వందనం బాచరింప మృగేంద్రుండు సాదరంబుగం బ్రసాదమేదురంబగు క్రీఁగంటి చూపతని పయిం బొలయ "నిను మా దమనకుండు పెక్కు తెఱంగుల నుగ్గడింప విని సంతసించినారము. నీ యట్టి ధీమంతుండు మా కొలువు నీయకొనుట మాకుం బరమ లాభంబని యెన్నుచున్నవారము. మంత్రిపదంబు నీ కొసంగినారము. జాగరూకుండవయి మన్నియోగంబులందు మాకు మాఱుగఁ గార్యంబులు నిర్వహించుచుఁ బరివార సంరక్షణాది కార్యంబులు కొఱఁత వడకుండ జరుపునది." అని యానతిచ్చి యది దొరంకొని తానును మంత్రియు బద్దసఖ్యంబున నుండి నానాఁటం దక్కుంగల పరివారంబువలన నిరాదరుండై యుండె. దానంజేసి దమనకుండు తన యిరువున కరుదెంచి చింతా క్రాంతుడయి యుంటఁగాంచి కరటకుండు "తమ్ముడా! నెమ్మొగంబు విన్నంబోవ ఖిన్నుండవయి యున్నవాఁడవు కతంబేమి." యని యడిగి యాతని చేతం దత్కారణం బారసి కొండొక దడవు మిన్నకుండి "మీఱిన పని కూరక విచారంపడ నేమి ఫలంబు? మనకేల యీ పెద్దతనంబులని మొదలనె పెక్కు విధంబులం జాటి చెప్పితిని. నీవు నేర్చిన నీతులన్నియు బెల్లుగ వల్లించితివి గాని నా పలుకొకటి యయినం జెవి జొర నిచ్చితివె? తన్నుగట్టఁ ద్రాళ్ళు దాఁ దెచ్చుకొన్నట్లు రాఁగల హాని గానక ఱేని తోడ లేని పెద్దరికంబులు కొన్ని నోరి కసిదీఱ నా యెద్దునకుం గలుగం బలికి చెలికారంబు చేయించితివి. ఇప్పుడనుభవింపక తీరునె? అది నీ నేరమింగాదె?" నావుడు దమనకుండు నిట్టూర్పు నిగిడించి తలపంకించి మొగం బెగనెత్తి "కరటకా! నీవచనంబు సత్యంబు. దూరము విచారింపక చేసితిని. ఇంకనేమి చేయవచ్చు? దైవంబు ప్రతికూలం బయినం పురుషకారం బెల్ల వ్యర్థంబయిచను. కావున నన్నూరక దూరకుము. ఇట్లు నేనొక్కండన కాను. ఆషాఢభూతి యను వానిచే నొక్క సన్న్యాసియు మేషయుద్ధంబుచే నొక్క జంబుకంబును ధన ప్రాణంబులు గోలువోయిరి. ఆ కథ వ్రాక్కుచ్చెద నాకర్ణింపుము.

***

(మి.భే.-4)

దేవశర్మాభిధానుండగు పరివ్రాజకబ్రువుం డొక్కరుండు గలఁడు. అతండు లోభాకృష్టచేతస్కుండయ్యు వీత స్పృహుండుంబోలె జనంబులకు మనంబులు తనియ నశ్రాంతంబు వేదాంతార్థంబు లుపన్యసించుచుఁ దదాకర్ణన కుతూహలంబున మూఁగి లోకులు భక్తిం దెచ్చి యెదుర నిడిన విత్తంబుల నాదర సూచక మందహాస రోచిరుదంచిత సుందర వదనుండగుచు గాంచి తదనుగ్రహార్థంబుం బోలెఁ జూపుల నంగీకరించుచు నట్లు నానాఁట సముపార్జించిన విత్తం బొక్కబొంతం బదిలంబుగ నునిచి కూర్పువోసి యది కప్పికొని క్రుమ్మరుచుండు. అతం డొక్కనాఁడు జనులకుం గర్ణరసాయనంబుగ మోక్షధర్మంబు లుపన్యసించుచుండ నొక్క మాయావి యామస్కరి ధనంబు తస్కరింపంగోరి పెక్కుదినంబుల నుండి వేచియుండి లాఁతి వెరవు దొరకమింజేసి డాయం బోయి సర్వాంగాలింగిత భూతలంబుగం బ్రణామంబు గావించి లేచి ముకుళిత కరుండగుచు నాతనికి మఱువడకుండ నొక్క ప్రక్క కొదిఁగి నిలుచుండి యాతండు నాక్రుచ్చు ధర్మంబులు తదేకాగ్ర హృదయుండుం బోలె నాలకించుచు విలక్షుండుం బోలె దూరితతారళ్వ విస్తారిత నయనుండగుచుఁ జిరంతనాత్మీయ ధర్మసంశయ నిరాకరణ చణ ప్రస్తుత ప్రకరణార్థ శ్లాఘమానుండుం బోలెం బరివాహిత మస్తకుండగుచు శ్రవణాంతరాయా సహిష్ణుండుం బోలెం దత్రత్య జన సల్లాపంబులు భ్రుకుటిత ముఖుండయి సీత్కార పూర్వకంబుగ నిక్షిప్తకర సంజ్ఞచే వారించుచు నిర్భరానంద వివశుండుం బోలె బాష్పనిమీలిత లోచనుండగుచుం దదుపన్యాసా వసానంబున నచ్చటి జనులంగాంచి 'స్వాములు కడు బడలి యున్నవారు. ఇక్కడి వారందరు గొంతసేపెడ గలుగనుండుడు. భిక్షానంతరంబు రండు, పొండు' అని యవ్వలి కనిపి యొక్క తాళవృంతంబు పుచ్చికొని ప్రక్కన నిలువంబడి యల్లన వీచుచుండె. అంత నయ్యోగి యాతని సాదరంబుగం జూచి 'యోయి నీవెవ్వండవు? మాకు భక్తి సేయుచున్న వాఁడవు. మావలన నీకు వలయు ప్రయోజనం బేమి?' నావుడు 'స్వామీ! నేనాషాడభూతి యనువాఁడ. తమయందు గుప్తంబై యనన్య సాధ్యంబయిన యర్థంబు తమకు శుశ్రూష యొనరించి పడయం గోరినవాఁడ. నన్ను శిష్యుంగాఁ గొని నా యీప్సితార్థంబొసంగి యనుగ్రహింపుండు. మరియొక్కండేనొల్ల. యథార్థంబు విన్నవించితి.' నావుడు నప్పారాశరి యట్లకానిమ్ము నావుడు వాఁడు మహా వినయ భయభక్తులు కరంబు మెఱయించుచు శుశ్రూష సేయుచు నాతని వెంబడి దేశాటనంబు సలుపుచుండె. ఒక నాఁడా పారాశరి దారిం బోవుచుండ నా టక్కుదారి సత్వరంబున నాతనిఁ జేరంజని 'యో స్వామీ! నిన్న రాత్రి మనము నిద్రించిన యింటివారిది గడ్డిపరక నా గుడ్డ నంటి వచ్చినది. తృణమ్మైనం బరుల సొమ్ము గొనంజనదు. ద్రుతగతిం బోయి యిది యా యింటివారి కిచ్చి వచ్చెద'నని వాక్రుచ్చి కొంత దవ్వు వెనుగకుం జని యా పరకం దొరుఁగ విడిచి కొండొక దడవు దారిమసలి యరుదేరం గాంచి యాకర్మంది వెఱఁగంది 'యీతండు వీతస్పృహండవిగీత చరిత్రుండు విశ్వాసపాత్రుం' డనియెంచి చిరసంచిత ధనసంచయంబు నించిన తన బొంతమోపం బ్రాలుమాలి వెంటవచ్చు నా వచ్చెకానింగాంచి 'వార్థకంబున హీన సత్త్వుండ నగుటంజేసి యింత మాత్రంబు కప్పుడుబొంత మోపం జాలకున్న వాఁడ. దీనింబదిలమ్ముగం గొనిరమ్మా' యని చేతికిచ్చిన వాఁడు సంతోష భరాక్రాంత స్వాంతుండగుచు వినమ్రుండయి మహాప్రసాదంబని గైకొని పెచ్చు హెచ్చరికతోడవహించి తెచ్చుచు వలసినచో నా భిక్షునకుం బఱవుగం జలికప్పుగ వినియోగించుచుం దొంటి కంటె హెచ్చుగ నచ్చికఁ బుట్టించు వాలకంబుఁ బూని యూడెంబు సేయుచుండెను. ఒక్కనా డక్కావితాల్పు మార్గంబునం బోవుచు సమయజామదగ్న్యుండు కరసహస్రంబు ఖండింప రక్తప్రభాభా సమానుండును బ్రతాపహీనుండునయి కృతవీర్యసూనుండుంబోలె భానుండు చూపట్టుడు నచ్చోటికిం గుఱంగలియగు జలాశయంబునకుం బోయి వార్చుచుండె. అప్పుడు కట్టెదురం దత్తీరంబున మేషంబులు రెండురోషంబు మీఱ నగంబులు ప్రతిఘోషంబు లీనం బెల్లురేఁగి పెడిల్లన ఢీకొంచు దారుణంబుగం బ్రవిదారణంబులు సలుపుచుండ వాని మధ్యంబున నల్లం దాఁకువడి మూర్ధంబులు వగులం గారి పేరిన దాని పేరవం బొక్కండు గాంచి పలల ఖండంబని తలంచి సంతసించి డాయంబోయి యిది యుధ్యన్మేష మధ్యమంబని గణింపక దాని భక్షించుచుండ నంతకుముందు ఢీకొని పిరిందికి జరిగిన యురణంబులు మరలం బరితెంచి ఢీకొనుడు నడుమం దగులు పడి యా వంచకంబు పంచత్వంబు నొందె.

సన్న్యాసి యయ్యది విలోకించి 'యాహా! అమిష లోభంబు గోమాయువు నిట్టిదశకుం దెచ్చె గాదే? ఏరికేనింగాని గుణంబు లోభంబుకంటె నొక్కండు గలదే?' యని చింతించుచు మరలి తీరంబారోహించి యా దారి శిష్యుంగానక 'యోహో యాషాఢభూతి! యోహో యాషాఢభూతి!' యని యెలుంగెత్తి పిలిచి పిలిచి సంజప్రొద్దు వెలుంగునకుఁ గరంబు మఱుంగు పెట్టుకొని కనుమేరదూరంబు చూపు సారించి పాఱం జూచుచు యాతాయత జనంబులం జేరంబోయి వాని యంగమచ్చము చెప్పి యిట్టివాని బొంతమోచుకొని పోవువానిం జూచితిరా యని యడిగి యడిగి నలువలంకులకుం బాఱిపాఱి వెదకి వెదకి వేసారి కడకుం దన్నా దురాత్ముండు ప్రతారించెనని యెఱింగి శిరంబు పంకించి నిట్టూర్పు నిగిడించి 'మేష యుద్ధంబుచే జంబుకంబును నాషాఢభూతిచే నేనును స్వదోషంబువలనం జెడితిమి. ఇంక నేమి చేయవచ్చు?' నని చింతించుచుం జనియె.

***

అని చెప్పినం గరటకుం 'డెట్టిధీమంతునకే నొక్కొక్క కాలంబునం ప్రమాదంబు వాటిల్లుట స్వాభావికంబు. దానికి వగవం బనిలెదు. నీవింకం జేయందలంచిన కార్యంబేమి?' యని యడిగిన దమనకుండిట్లనియె. 'వినాశోన్ముఖకార్యంబు మేలు వఱచుటకు భావ్యర్థ సంగ్రహంబున కనర్థ ప్రతీకారంబు నకు నర్హంబగు మంత్రంబే శ్రేయంబు. కావున నదియ ఇపుడు కర్తవ్యంబు. అందుఁ బింగళక సంజీవకులకు భేదంబు పుట్టించు నుపాయంబు పరికించుట ముఖ్యంబు. దానంజేసి మనకెల్ల యర్థంబులు సిద్ధించు. మనమిప్పు డుపేక్షించినం బిదపం బింగళకు డాయుట దుష్కరంబు.' నావిని కరటకుం డది యెట్లు సాధ్యం బగుననిన దమనకుండిట్లనియె. 'ఉపాయంబుచే నేయది శక్యంబగు నాయది పరాక్రమశతంబుచేత నయిన శక్యంబు గాదు. కాకం బొక్కండుపాయంబుచేఁ దనకు విరోధియగు సరీసృపంబును దోరించె. అక్కథ వక్కాణించెద నాకర్ణింపుము.'

***

(మి.భే.-5)

యమునాతీరమందలి వనములు మర్రిమాఁకుమీద గూఁడు కావించుకొని వాయసమిథునము వాసము చేయుచుండెను. ఆ మర్రిక్రింద పుట్టలో సర్పము వాసము చేయుచుఁ గాకి పెట్టిన గ్రుడ్లు భక్షించిపోవుచుండెను. దానికి వాయసము మిక్కిలి ఖేదపడి తన మిత్రమయిన నక్క పాలికిఁబోయి త్రాఁచువలన దనకు మాటిమాటికి వచ్చు నుపద్రవము చెప్పుకొని యంగలార్చెను. అప్పుడు నక్క యిట్లనియె. 'తొల్లి యొక కొలనులోని మీనములనెల్ల బలవంతముచేతఁ భక్షించిన కొంగ నొక్క యెండ్రి యుపాయంబుచేతఁ జంపెను. అట్లు నీవును నీ శత్రువును గడముట్టింపుము. నీ కాకథ చెప్పెద వినుము.'

***

(మి.భే.-6)

బదరికావనమందు సారోదంబను కాసారంబు గలదు. అక్కడికొక్క ముసలి కొక్కెర వచ్చి నయనంబులు నిమీలించి యాహారంబు మాని దుష్కరంబయిన తపంబు చేయుదానివలె నొంటికాలితో నిలువంబడి యుండెను. ఒక యెండ్రి యా తెఱంగు జూచి కరము వెఱగుపడి డాయంబోయి యిట్లనియె. 'ఓయి బకోత్తమా! నీవనయంబు క్రశిమంబు వహించుచున్న వాఁడవు. చేరువఁ బాఱాడు మీనంబుల జూడనయిన నొల్లవు. ఈ యునికి యేదియో నొక్కమహార్థం బర్థించి పూనిన యనశన వ్రతానుష్ఠానంబు గాఁబోలు. నీ విచిత్ర చరిత్రంబు మదీయ శ్రోత్రపేయంబు గావించుము.' అనిన విని బకం బల్లన నిట్లనియె. "ఓయి కర్కటకోత్తమా! నీవు మిక్కిలి బుద్ధిమంతుఁడవు. ఆకారంబుచేతన భావంబు భావింప సమర్థుండవు. నిస్సంగులమయి మౌనముద్రాధారులమగు మాదృశులకు సహితము నీ వచననాతురిమంబు సల్లాపంబునందుల్లాసంబు పుట్టించెడు. పుట్టువుఁదొట్టి నా కడుపుఁజిచ్చునం బడి మడిసిన జంతువు లిన్నియని యెన్నికకు రావు. ఇట్లు మదీయ జాతికి స్వాభావికంబయిన భూతహింసా ధర్మంబుచే శరీర భరణంబు గావించుచుండుదును. గంగోత్తర తీరమందు మర్రి వృక్షము కొమ్మమీద నేను గూర్చుండియుండఁగా నా మ్రాని క్రింద నొక యోగిపుంగవుండు తన శిష్యులకు నానాధర్మంబు లుప దేశించువాఁడిట్లనియె. 'పురుషార్థం బర్థించువారి కవశ్యా చరణీయంబులగు ధర్మంబులు వినుఁడు. సకలదోషంబులకు మూలంబయిన లోభంబు విసర్జింపవలయును. సర్వభూతంబులయందు సదయుండయి యుండవలయును. ఆ లోభంబును భూతదయయును లేనివానికి సర్వధర్మంబు లనుష్ఠితంబులయ్యు నిరర్థకంబులగు. జీవనంబు క్షణభంగురంబు గావున మోసపోక పురుషుండు కాలంబు పుచ్చక యుత్తమధర్మంబు లనుష్ఠింపవలయును.' అని వక్కాణింప విన్న వాఁడను. ఎట్టి సుకృతవిశేషంబుననో నాఁటగోలె నా మహానుభావుండు వచియించిన ధర్మంబులు మనంబునంబట్టి స్వప్నావస్థయందయిన మఱపునకు రావు. అదిగో నాఁడు మొదలుకొని పురుషార్థంబు నంద బుద్ధి నిలిపితిని. హింసా కర్మంబునకు రోసితిని. జలశైవాలాదులతో దేహధారణంబు చేయుచు ముముక్షుత్వంబుం బూని మునివృత్తి నున్నవాఁడను." నావుడు విని యచ్చో వసియించు మీనంబులు మోదమానంబులయి 'యాహా! యీ మహామహుండు నీఱుగవిసిన నిప్పువలె నున్నవాఁడు. ఈతండు బకమాత్రుండు గాఁ'డని పరికించి డాయంబోయి యిట్లనియె. 'ఓ మహానుభావా! నీ కృపావలోకంబు మాపయింబొలయింపుము, అనావిలభావంబులతో మీ సేవఁ గోరి వచ్చిన వారము' నావుడు నా బకంబు ప్రసాదభాసురంబగు దరహాసంబు గావించుచు వాని ప్రార్థనంబు కటాక్షంబుల నంగీకరించి నాటంగోలె వానితో సఖ్యంబు గావించుచుండె. అంత నొక్కనాఁడు వఱువాత నాఖగంబు సౌఖశాయనికంబులయి డాయం జనుదెంచిన మీనంబుల దీన వదనంబుతో బాష్ప వారి పూరిత లోచనంబయి నిట్టూర్పు నిగుడ విలోకించి తల పంకించి యుంకించి 'కాల నియోగంబు మీఱ నేరికి శక్యంబు' నా విని మీనంబు లిట్లనియె. 'ఓ తపోధనా! తడవులంబట్టి నిన్నె ఱుంగుదుము. నీవు నిత్య సంతుష్టుడు నా నెగడితివి. అట్టి నీకు నే డిట్టిఖేదంబు రాఁగతం బేమి?' అనవుడు నాటక్కరి కొక్కెర యెలుంగు రాలుపడ నిట్లనియె. 'కాలము చెల్లినవాఁడను గాఁబట్టి యింక నూరకుండరాదని విచారించి ముముక్షుండ నయి పుత్రాది బంధంబుచే విడిపించుకొని నుంటిని. సుఖింప గంటినని యుండగాఁ బ్రారబ్ధకర్మవశంబున మీతగులం బొక్కటి ప్రాప్తంబయ్యె. మీకొక యాపద వచ్చునన్న నుల్లంబు తల్లడిల్లుచున్నది.' అనుచు జొటజొటఁ గన్నీరువిడుచుచు నిట్లనియె. 'ఇంతకుముందు కొందరు జాలరులు వచ్చి యీ కొలని జలంబుకొలది పరికించి యింకఁ గొంత నీ రింకిన వత్తమని పోయిరి. ఆమాట వినఁగానే నా గుండెలు బ్రద్ద లయ్యెను. అది మొదలుకొని విషణ్ణుండనయి యున్నవాఁడను.' నావుడు మీనంబులు విని భయంపడి యిట్లనియె. 'ఎట్లయిన మమ్మీ బారివలనఁదలగు నెరవు పరికింప నీవొక్క రుండవు వలంతివి. ఖేదంబు పేర్మిని విషాదంబు నొందియున్న వాఁడవు. ఇంతియ కాని లెస్స పరికించిన నీకుం దోఁపని యుపాయంబు లేదు. నీవ మాకు శరణంబు.' అనిన బకంబు కొంతవడి చింతించి యిట్లనియె 'ఇచ్చటికిఁ గొంతదవ్వున నిత్యాపంబను కొలను గలదు. అందులకు మిమ్మందఱ నొక్క నాఁటనె కొంపోవశక్తుండఁ గాను గాని యోపినంతవట్టు నానాఁటం గొంపోయి విడిచెద' అని చెప్పి ప్రతి దినము వలసి నన్నింటిని ముక్కునం గఱచుకొనిపోయి యొక్క కొండ బండమీదం బెట్టుకొని భక్షించుచుం గొన్ని దినంబులలో నా కొలను నిర్మీనంబు గావించె. అంతఁ దొలి మిత్రంబయిన యెండ్రి బకముతో నిట్లనియె. 'నా ప్రియ మిత్రుడా! యిక్కడ మీలను బారి వలనఁదలఁగి రక్షించితివి. అట్లు నన్నును రక్షింపుము.' నావుడు బకంబు వల్లెయని యెండ్రిని జంచువుల నిఱికించుకొని మిక్కిలి పొడవునకెగసి తాను మీలఁదిన్న కొండ కొమ్మునకుఁ జక్కఁగా సాగి మింటఁబోవుచుండెను. ఆ పోకడ చూచి యెండ్రి యిట్లు చింతించెను. 'ఇప్పుడీ బకంబు నన్నుఁ గొనిపోక యీ కొండ కొమ్మునకుఁగాని వేఱొండు చోటికి గాదు. ఈ కొండ శిఖరంబున జలంబు లెక్కడివి? ఈ గుంటిమీఁద గాని దీని చుట్టుఁ బట్టునఁగాని జలంబులు లేవని యాప్తులవలన విని యున్నాఁడను. ఈ బకంబు కపటంబున మీనంబులం బట్టుకొని వచ్చి యీ కొండకొమ్మునఁ బెట్టుకొని తినియె గాఁబోలును. ఆహా! తెలియక యీ ఖలుని పలుకులు విని మోసపోయితిని గదా! మాయికులయందు బుద్ధిమంతుండు మాయావియయి ప్రవర్తింప వలెగాఁని ఋజువుగా ప్రవర్తింప గూడదు. కాబట్టి యే విధము చేతనేని దీని వంచించి తప్పించుకొను నుపాయంబు కావింతుఁ గాక' యని వగచి కర్తవ్యంబాలోచించి లెస్సగా బుద్ధి యందుఁగుదుర్చుకొని యిట్లనియె. 'ఓయి బకోత్తమా! నీవు నన్ను గడుదవ్వు దుసికిలకుండఁ బట్టుకొని పోఁజాలవు. జాఱి పడితినా భూమిని సంచరించు జంతువులు నన్నుఁ బొలియించి భక్షించును. ఆవల నీ యభిమతంబు సిద్ధింపదు. ఇప్పుడొక యుపాయము చెప్పెద వినుము. నేను నీకంఠంబు కవుఁగిలించి పట్టుకొని వచ్చెదను. గమ్యస్థానంబునకు బోకమునుపు నాపట్టు విడువను. ఇంత చెప్పనేల? నా రక్షణభారంబు నీది. చిత్తము వచ్చినట్లు చేయుము.' అనిన విని యా కొక్కెర సమ్మతించి యెండ్రిచేతఁ గంఠంబు గౌగిలింపించుకొని కొండ మీఁదిఁకిఁ బోయి కాళ్ళూనఁబోవునపుడు కుళీరంబు తన గిట్టలతో దాని కంఠంబు కరుక్కునఁ ద్రెంచి నేల బడి ప్రాణంబు తప్పించు కొని తన యిచ్చం బోయెను.

***

కాఁబట్టి నీవును సదుపాయము విచారించుకొని నీశత్రువును జంపు మని నక్క చెప్ప విని దానిచేత సెలవు తీసికొని కాకి తన యిరవునకు వచ్చి చేరెను. యమునాదాపున విలాసధామంబను పట్టణంబు గలదు. అందలి రాజాంగనలు క్రీడార్థంబు వనంబునకుంజని కుసుమాపచయం బొనరించి శ్రాంతి యడంగ జలంబులాడంగోరి యొక్క సరసిం గాంచి యనూనంబగు దాని మనోజ్ఞకంబునకు మానసంబుల నానందంబు నిట్టవొడువం దత్తీరంబుఁ జేరి హారాది పరిష్కారంబు లూడ్చి యచ్చోటనునిచి చనుకట్టులుగట్టి యొండొరుల చెట్టలు పట్టుకొని సుందర మందగమనంబుల నొయ్యారంబు మీఱ నీరంబుల డిగి యల్లల్ల నడుగు లిడుచు విసారవార పరిస్ఫురణంబులం గాంచి యంతకంటెం దను మించులు మించుగ మెఱయించు తెఱంగున వెలితళుకుంజూపులు కళవళింప నులుకుచుఁ గటిద్వయసంబుగ డిగి సలిల విహారంబు సలుపుచుండ నొక్క లతాంగి తోయంబులు దోయిలించి యొక్క తోయజాక్షి పయిం జల్లి యది మాఱుకొని 'యేదేది నిలుపక చల్లుమా చూత' మనుచు మీఱం జల్లిన ధారా సారంబునకుఁ దాళంజాలక కేలొడ్డి పెడమొగం బిడి పెఱకేలెత్తి మ్రొక్కుచు 'నమ్మమ్మ చాలుం జాలు నీజోలి కింక రాను మాను' మన నయ్యది 'యిస్సిరో యింత పిఱికివె' నా మఱి యొక్క తెఱవ 'నెఱజాణ వేని నావంక మరలుము. చిరుతుక దానితోడనా యింత బింకంబులు పొంకించెద?' వని పురికొలిపి తాను నదియు మలంగక తొలంగక పట్టు వదలక నట్టు గదలక పరస్పర కమలమీరిత వారి ధారం లోఁగక లోఁగుడు నొండొరుల హెచ్చుచు మెచ్చుచు నిదియేఁటి తోటివారలు వారింప దరహాసాంకురంబు లాననాంబుజంబుల నలంకరింప నార్ద్రాంశుకోత్తరీయాంతర్గత నిస్తుల స్తన స్తబకంబు లుబ్బి నిబ్బరంబుగ నిక్కం గడు రోఁజుచు నిలువంబడ మరి కొందరు ముద్దియ లుద్దులయి యొండొరుల రవణంబులు పణంబుగం బన్నిదంబు సఱిచి సారంబు సౌర వేగంబు మీఱ నీఁదుచుంబోవ నేల యూరక కరంబు కలగుండు పఱిచెదరే యని లాఁతిచేడియ లాడ 'మనలం జేరినవారి కతనుక్షోభంబు దుర్వారంబుగాదె?' యని చదురు లాడుచుం బారంబు ముట్టుచు ముట్టని వారిం గరంబులం జప్పటలు గొట్టి యోడితి రోడితిరని గేలి సేయుచు స్తన గమన సామ్యాసహనత్వంబునం బోలె రథాంగ చక్రాంగములం బాఱం దోలుచు స్వోపప్లవకారణ మార ప్రహరణంబులను నీరసంబునంబోలె సారసంబులం దునుముచు జలవిహారంబు సలుపుచుండ మున్నా తీరంబు చేరువ నునిచిన పరిష్కారంబులం దుదారప్రభారమణీయంబగు మణిసరంబా కాకంబు ముక్కునం గఱచికొని పఱచి యల్లంత నొక్క తరుశాఖం గూర్చుండం గనుంగొని 'యిది యేమివిచిత్రంబె! రత్నసరంబు కరటంబు గొంపోయెం జూచితిరే?' యనియొక్క సీమంతినీలలామంబు వాక్రువ్వ నందఱొక్క మొగి వదనారవిందంబు లెత్తి పారిప్లవేత విస్తారిత చారులోచనలై యస్పంద మిళింద సుందరవికసిత కుసుమరాజి విరాజమాన మల్లికా వల్లికామ తల్లికా విభ్రమానుకారిణు లగుచు సూచీముఖాలంకృత నాసికాగ్రలగుచు దూరీకృత నిమేషంబుగ దృష్టి సారించి కాంచుచు 'నిక్కాకంబు పద్మరాగప్రభారింఛోళిం గాంచి యామిషంబని భ్రమియించెఁ గాఁబోలు' ననుచుఁ 'గాదు గాదు, మెడం దగిలించుకొని కులుకులాడంబోయెడు' నని నవ్వుచు 'నీ యందంబు నకు హారంబొక్కటి తక్కువ' యని మొగం బడ్డంబుగ సుందరంబుగ బంకించి చేయెత్తి జుట్టన నెటిక విరుచుచుఁ 'జక్కని హారమమ్మ, యిప్పలుగాకి కాకి యెక్కడనుండి వచ్చెనో? యింక నెక్కడం బాఱవైచెడునో, యెవ్వరికిం జేపడునో' యనుచు 'నయినం గొఱంతలేదు. జలవనాది దుర్గమస్థానంబు లంబడి యేరికం జేరక పోవుటకంటెం గొంత మేలుగాదె?' యనుచు 'నండజంబునకు మంజడనంబుతోడంబనియేమి?' 'దీనికిం గతంబు పరికింపవలయు' ననుచు 'నెద్దియేనియు నొక్క నిమిత్తంబు లేక తక్కదు. నిలుకడమీదం దెలియనగు' ననుచు నొండొరులు ముచ్చటలాడుచుండఁ దత్పరిచారికలు కొందఱా వాయసం బేచాయకుం బోయెడినో యేమరక కనుగలిగి యుండుఁడని యచ్చటి వనపాలకుల నియమించి సత్వరంబుగం బోయి యా వృత్తాంతంబు రాజపురుషులకు నివేదించి వారిచేఁ బ్రేరితులగుచు జనులం దోకొనివచ్చి కానిపించుడు నాకాకంబు మందగమనంబునం జని యాత్మావాసంబగు వటకుటంబు కొమ్మం జేరి నేరిమి మీఱం గ్రింది వల్మీకంబునకు సూటిపడ విడువ నా సరంబు మీసరంబుగం గెంపుమెరుంగులు దుఱంగలింపఁ దత్తత్యకాలవ్యాళ వినాశ పిశునోల్కా పాతానుకారి యగుచుం గోమక్రతం బడ రాజభటులు గాంచి గునపంబులు లోనగు సాధనంబులు దెప్పించి దానిం గ్రొప్పించిన నందలి దందశూకంబు విషానలంబు దరికొలుపుటకుంబోలె పూత్కారంబులు నిగిడించుచుం బరప్రాణానిలంబులు గ్రోలుటకుంబోలె నాభీలంబుగ నాలుక లార్చుచు నిర్గమించి పయింబడి కఱవం గనుకించుడు వారలు చిక్కని పెక్కుబడియలం జదియ నడిచి దాని మడియించి యానేపళంబుం గొంపోయిరి. అది దొరంకొని కరటంబు కరంబు సుఖంబడి యుండె. కాఁబట్టి యుపాయంబుచే సాధింపరాని కార్యంబులు లేవు.

బుద్ధిబలంబు గలవానికిం దక్కుబలంబు లేకుండినం గొఱఁత లేదు. ధీశక్తివిరహితునకుం దక్కుంగల బలిమి యెంత గలిగిన నసత్కల్పంబయి చను. తొల్లి యొక్క శశకంబు నేర్పునం జేసి యొకసింగంబునం ద్రుంగించె. నక్కథ వక్కాణించెద నవధానంబుతోడ వినుము.

***

(మి.భే.-7)

ఒక్క యరణ్యంబున సత్త్వ సారంబను కంఠీరవంబు గలదు. అయ్యది యయ్యడవింగల జంతుసంతానంబులం బొలియించి భక్షించుచుండు. అందుల కచ్చటి సత్త్వంబులెల్లం బెల్లు భీతిల్లి యొక్క చక్కటిం జేరి పెక్కు తెఱుంగులం బరికించి తమకుం బాటిల్లిన బారికిం బ్రతీకారంబు గానక తుదకుం గర్తవ్యాంశం బొక్కండు విచారించి కలియంబలికికొని బెండగిలి మృగనాథు పాలికింజని మనంబుల ఘనంబుగ దరంబు గదుర నాననంబుల దీనభావంబు నివ్వటిల్ల దవ్వుదవ్వుల నిలచి యభివందనంబొనరించి 'యో మృగస్వామీ! మేము మీకొక్క చిన్న విన్నపంబు గావింప వచ్చి యున్న వారము. మామీఁదం గరుణించి యవధరింపుఁడు. భవదీయ ప్రతాపానలంబునకు లోకంబులోని వ్యాళజాలంబెల్లఁ దృణ ప్రాయంబు నా మాయట్టి మ్రుక్కడుల లెక్కింప నేల? కొంత దయ గలిగి తెగవుగాని యొక్క నిమిషంబులోన మమ్మందఱ నిర్మూలింపం జాలవె? అట్టి కరుణాళుండ వగుటం జేసి మా ప్రార్థనంబు పాలివోవదని తలంచెదము. దేవర సన్నిధికి వంతు మెయిం బ్రతిదినం బొక్కొక్కమృగంబు దమ యాహారార్థంబు పనుపం దలంచి యున్నవారము. ఇందులకు మేకొని మమ్ము భయమ్ము వలనం కాచి రక్షింపవలయును.' నావుడు సింగం బట్ల కానిండని యభయం బొసంగి మృగంబుల వీడి కొలిపె. అంత నా మృగసంతానంబు కొంతవంతఁ దలంగి ప్రత్యహంబు వరువాత వంతుకొలఁది నొక్కొక్క మృగంబును సింగంబు చెంగటికిం బనుచుచుండు. ఇవ్విధంబునం గొంతకాలంబు కడవ మృగంబు లెల్ల యథాసంకేతంబుగ నొక్క చెవులపోతుం బిలిపించి 'యెల్లి మృగవల్లభుపాలికిం బోవలయు, వంతు నీపాలంబడియె.' నావుడు శశంబు భృశంబు మూర్ఛిల్లి కొంతవడికిం దెలిసి చెదరిన హృదయంబు పదిలించికొని 'యెంతవారికికేని విధి విధానం బప్రతివిధానంబు గాదే' యని తల పోయుచు దట్టంబుగ వేఁడి నిట్టూర్పులు నిగుడ శిరఃకంపంబు గావించి యెడరు దొడరిన తరి యెరుక బలిమికొలఁది వెరవు పరికింప వలయుఁ గాని వెఱంగుపాటు తెఱంగుగాదు. ఎట్లయిన నాబుద్ధిబలంబునంజేసి కేసరిం బ్రతారించి దోరింపం గడంగెద. అటమీద దైవంబు పంచినగతి యయ్యెడుగాక యని యచ్చటి తన బలగంబు వలన సెలవు గయికొని నడవం గాళ్ళులాడక యల్లనల్లం బోవుచుఁ జేయంగల యుపాయంబు రోసి మానసంబున కది సరిపరిచికొని దారిం గొంత మసలి యాహారంబు తరి దప్పించి డాయంబోయి సవినయంబుగం బ్రణమిల్లుడు హర్యక్షంబు సటాజాలంబు నిక్కవెక్కసంబగు రోషంబున భీషణంబయి యదరులు చెదరం జూడ్కులు నిగిడించి 'యాహాహా! యస్మదీయ క్షాంతికి ఫలంబు తోడన కలిగె కుట్టినం దేలండ్రు కుట్టకున్నం గుమ్మరపురు వండ్రుగాదె? నాకుం దరి దప్పించి యాహారంబు పనుచుట చూడ నావేఁడిమి చవి యింకొక్క మరి చూడ వేఁడి కాఁబోలు! ఈ యడవి మృగంబు లింతలోనన యింత మత్తిల్లునే? నేఁడ యిప్పొలంబునంగల జంతుజాలంబు నెల్లం జమరి సమయించి యెరియు కడుపుఁ జిచ్చున వ్రేల్చెద' నని వాలంబు నేల తాడించి లేచుడు శశంబు "దేవా! తావకులగు సేవకులవలన లేశంబయిన దోషంబు లేదు. నేఁటి ఱేపు మావారల శాసనంబు శిరంబుబూని యేను సరభసగతిం జనుదేర దారినొక్క హర్యక్షంబు రూక్షంబుగ వీక్షించి 'యోరీ శశాధమా! యెట్టిసత్త్వంబేని మాకట్టెదుర దరవిరహితంబుగ జరింపగానము. మాయురే! నీ యుద్ధతిం జూడ మాకుం గరంబు వెఱంగయ్యెడు. మమ్ము జీరికిం గొనక యొరసికొని పాఱుపోతరంబు నీకు రాఁగతంబేమి? నిలునిలు మెటకుంబాఱెద?' వని యధిక్షేపించి ప్రతిరోధింప నేనాతనిం గాంచి 'మాకెల్లరకు వల్లభుండు సత్త్వ సారాభిధానుండగు సింహరాజు గలండు. అమ్మహామహు సన్నిధికిం జనుచున్న వాఁడ. నన్ను మసలింపకుము. అతండొకింత కోపగించిన లోకం బాకులంబగు.' నావుడు నతండు మధ్యందిన విద్యోతమాన ఖద్యోతమండలంబుంబోలె మండుచు 'నహాహా! యింత కాలంబున కిట్టి వింత వినంబడియె. ఇవ్వనంబు నందలి మృగ సందోహంబునకు నే నొక్కరుండ దొరగాని నాకు దొర యొక్కరుండు గలండె? ఎవ్వండేని నెదిరిందన్నుఁ గానక యందని పదవికి గంతుకొన నుంకించెనేని వాని మదీయ తేజో నలంబున కింధనంబుం గావించెద. నీ విటకు ప్రభువని ముందు పేర్కొనినవానిం గానిపింపుము. ఇప్పుడ కయ్యంబునకుం గడంగెదం జూపవేని నిన్నుం బొలియించెద' నని పలికి యట్ల కానిమ్మని నన్నుం బలికించి నీ పాలికిం బుత్తెంచె. దానం జేసి యింత మసలవలసె." నావిని మృగనాథుండప్రతిరోధ క్రోధుండయి 'యీ క్షణంబ యా దుష్ట మృగంబు గానిపింపుము. దండధరుని వీటికి మసలక పుత్తెంచెద. నాకు మార్గాభి జ్ఞానార్థంబు మునుసనుము.' నావుడు శశకంబు వినయ సంభ్రమంబులు పెనంగొన వల్లెయని కడువడింజని యొక్క బావింగానిపించి 'యో మృగకుల సార్వభౌమా! నీ మూర్తుండీ వాపిక యందున్నవాఁడు. తొంగిచూడు'మన సింగంబు తొంగిచూచి యుదకంబునందలి తన ప్రతిబింబంబు మాఱుసింగంబని భావించి కోపాటోపంబు మీఱ వలంకులు మాఱుసెలంగ గర్జిల్లి గభుల్లున దుమికి కాలధర్మంబు నొందె. కావున నెంత బలవంతునయిన బుద్ధిబలముచే గెలువవచ్చును.'

***

పింగళకుఁ దొల్లి సేవించుచుండి కాటకపాటకంబులను రెండు జంబుకంబుల కృతాపరాధంబులగుటంజేసి నిష్కాసితంబులయ్యె. అయ్యవి వెండియు ఱేనియనుగ్రహంబు సంపాదింపగోరి సంజీవకు ననుసరించుచున్నయవి. ఇదియు మదీయోద్యోగంబున కనుకూలంబయి కానంబడుచున్నయది. సెలవిమ్ము పోయి వచ్చెద.' నావిని కరటకుండు 'వృక్ష మూలంబు జేరిన ప్రువ్వును మెలపున మూలచ్ఛేదంబు గాకుండ వెలార్చి మాయించుట నేర్పరితనంబు. నీ వెఱుంగని యర్థంబు గాదు. నీకుం గార్యంబు సిద్ధించుగావుత, మెడసేయక పొమ్ము.' నావుడు దమనకుండు పింగళకుని పాలికింబోయి మ్రొక్కి మొగంబు వ్రేలయించుకొని దీనభావంబు భావించుకొని నిలుచుండం బింగళకుండు కాంచి 'దమనకా! యేల యిట్లు దెలివిదప్పి యున్నవాఁడవు? మాకుం బరమాప్తుండవు. లోకంబునం దెవ్వండేని జీవింపగోరువాఁడు నీకుం గీడు దలంపఁడు. నీ ఖేదంబునకు నిమిత్తంబు దెలియునంతకు మాచిత్తం బుత్తలం పడియెడు. కొంకక వ్రాక్కుచ్చుము.' నావుడు దమనకుండు "స్వామీ! మతిహీనుండనయి మహాపరాధంబు గావించితిని. నావలనం గరుణింపుఁడు. క్షమియింపుఁడు. భృత్యుండు స్వాపరాధంబు స్వామికి నివేదింపక మొఱంగంజనదు. మొఱంగిన వాఁడు రెండు లోకంబులకుంగాక చెడు. అది యట్లుండ నిమ్ము. పెక్కండ్ర మనుగడకు మూలంబగు పుణ్యపురుషునకొక్క యెదరు వాటిల్లిన నది యొక్కటి శోచ్యంబుగాని మాదృశుండు క్షుద్రుం డొక్కరుండు పొలిసిన దానం గొఱంతలేదు. దాన లోకం బస్తమింపదు. సమక్షంబున భృత్యుల వర్తనంబు లెల్లం గీర్తనీయంబులై యుండుంగాని యందు దోషంబులేశంబు గానంబడదు. అట్లగుటంజేసి యధీశ్వరుండు స్వపరోక్షంబునం దత్తద్వర్తనంబులు చారముఖంబునం బరికించి తాహితుల నిర్ణయించి యనుగ్రహనిగ్రహంబులు మెఱయించుచు బ్రజావృక్షంబునకు మూలంబగు తన్ను రక్షించుకొనవలయును. స్వామీ! సేవకుండేమో విన్నవించెడునని యాలంబు చేయక యాలకింపుడు. సంజీవకుని వర్తనంబు పరికింపందొంటి తెఱంగుగాదు. అన్యాయంబు నుడువగూడదు. మొదల సంజీవకుని ప్రవర్తనంబ నన్యాదృశంబుగ నుండె. అతని చరిత్రంబునకు మేమందఱము మిక్కిలి యాశ్చర్యపడుచుందుము. ఈతఁడు తొల్లి యెల్ల తఱి మిమ్ము నవ్యాజప్రేమంబునం గొలుచుచు మీ కార్యంబులందుఁ బ్రమాదంబు లేక ప్రవర్తించుచుండు. కార్యంబుతరి నీరుపట్టని యాఁకలి యని నిద్ర యని చూడఁడు. చక్కెర దిని చేఁదన వచ్చునే? తొంటి తెఱంగు విచారింప సంజీవకుండు లోకంబు లోనివాఁడే! ఏమి కాలదోషంబొ యిపుడీతం డాతండు గాఁడని తోఁచెడు. నాతఁడు తొల్లి మీగుణంబులు వేనోళ్లం గొనియాడుచుండు. అప్పుడాతని నిర్భరానంత పారవశ్యంబునకు గొలంది లేదు. కొంతకాలంబునకు వెనుక మాబోఁటు లెవ్వరైన మిమ్ముం బ్రశంసించుచో సత్యము సత్యమౌనని యంగీకార సూచక వచనంబులతోడనే నాలించుచు వచ్చె. అనంతరము దేవర ప్రశంసనంబు వచ్చిన మందహాసంబుతో వినుచుండుఁ గాని యట్టిట్టని వచియింపఁ గానము. ఇటీవల నేమికతంబొ యేలినవారి ప్రసంగంబులం దెచ్చికోలు వికాసంబె కాని నిక్కంపు మందహాసంబు లేశంబయినం గానంబడక యున్నయది. ఈతని యనుభావంబు వింతయయి కానంబడుచుచున్నయది. దీనికిఁగతం బేమొకోయని మనంబున రోయుచుండు. నేఁడు మదీయాప్తులు కొందరు మాటవెంబడి 'స్వామిచే నిగృహీతులగు వారితో సంజీవకుండు చెలికారంబు సేయుచున్నవాఁడు. కాటకపాటకుల తోడ నిచ్చలు మంత్రంబు నిర్వర్తించుచున్న వాఁ'డని వినిపించిరి. దీనంజేసి యాతని భావంబు నిర్ణయించితి. స్వామిహితంబు కాంక్షించువాఁడు స్వప్నావస్థయందయిన స్వామిద్రోహులతోడ సఖ్యంబునకుఁ బాలుపడునే?" అని నుడివి ప్రక్క వెనుకలు కలయం జూచి కరంబున నోరుమూసికొని శ్రవణమూలంబుచేర మోర సారించి యల్లన నిట్లనియె 'ఇది దేవర సన్నిధి నున్నభృత్యులకెల్లం దెల్లంబయి యుండవచ్చు. సంజీవకుని వలని భీతిం జేసి యిచ్చటివారు బయలు పొంగకున్నవారు కాఁబోలు. ఇంత యేల యొక్కనింబిలిచి విచారించినం జిత్తంబునకు విశదంబయ్యెడు.' నావిని పింగళకుండద్భుత రోషవిషాదంబులు పెనంగొనం దనసేవకుని నొక్కనిఁబిలిచి 'యిచ్చటి కొలువుకాండ్రేరేనిం గాటకపాటకులతోడ నేస్తంబు సేయుచున్నవారె?' నావుడు వాఁడు భయంపడి గుటకలు మ్రింగ 'వెఱవకుము. సత్యంబు వాక్రువ్వుము. దానం గొఱంత లే'దని ఱేఁడు పలుక విని వాఁడిట్లనియె. 'సంజీవకుండు వారిచేరికకు మేకొనియున్నట్లు కానబడుచున్నది.' నావుడు విని 'మే మడిగిన యర్థం బిక్కడన మఱచిపొమ్ము. బయల నుబ్బనీకుము. పొద'మని వానిం బుచ్చి పింగళకుండు ఖిన్నుండయి క్రిందు చూచుచు మిన్నకుండం గాంచి వెండియు దమనకుండిట్లనియె 'ఇప్పటిచొప్పు పరికింప మనతోడ నింక సంజీవకుండు మనసునం గలిసి వర్తింపబోఁడు. అతని తెఱంగు కొంత యెరింగినవారమగుటం జేసి మనకును దొంటి చందంబున డెందంబు పొందియుండదు. అయిన నీతండు పెద్దకాలంబు దేవరయాస్థానంబునందుండి చిత్తంబున కెక్కంబ్రవర్తించినవాఁడు. చిరకాలసేవియగు భృత్యుండు తెలిసి తెలియములంజేసి యొక్క యపరాధం బొనరించిన క్షమియింపవలయుఁగాని పెఱలంబోలె వానిం ద్రోసిపుచ్చుట ధర్మంబు గాదు. కావున నీతండింతదనుకం జేసిన దుష్కార్యం బావిష్కరించి యలుకు పుట్టించి క్షమియింప వేడుకొలిపి యిటమీఁద నిట్టికార్యంబు జేయకు మని నాతి కఠినంబుగఁ బలికి యెప్పటి చొప్పున నాతనికొలు వీకొనుట సర్వవిధంబుల నుచితంబని తోఁచుచున్నయది.' అనవుడు మృగపుంగవుండాకర్ణించి మొగంబెగయించి దమనకుని బరికించి 'రాజద్రోహుల నెల్లవిధంబుల దండించుట యుచితంబు. అయినను నా హృదయంబు వానివలన బహుకాలంబు స్నిగ్ధంబగుటం జేసి యొక్క తెగువకు జొరదు. కావున వెలార్త మొండె. నీ చెప్పినచొప్పు గావిత మొండె.' నావుడు నక్కలరాయుం డిట్లనియె. "ఇది యిప్పటికిం దోఁచిన తెఱంగు. అయినను సాహసంపడి యొక్క కార్యంబు చేయంజనదు. 'సహసా విదధీత న క్రియా'మ్మని నీతికోవిదులు వక్కాణింతురు. ఇది మరియెవ్వనితోడనేని నొక్క ధీమంతునితో దేవరచిత్తంబునకు వచ్చినవారితో విచారింతము. అప్పటికి దేవరకుచితంబని తోచిన యర్థంబు మేకొందము. దూరంబు విచారించి చేసిన దానం గొఱంత లేదు. ఇంతలోనన మిగిలి చనుకార్యం బేదియుగానము." నావుడు మృగపతి 'యందలి వారందఱు నీ వెఱింగినవారు గాని లాఁతులు లేరు. వారివారి బుద్ధికౌశలంబులు నీ వెఱుంగుదువు. నీ యిచ్చకు వచ్చిన వానింజెప్పుము.' నావిని దమనకుండు కొండొకపడి ఱెప్పలిడక యుప్పరంబు చూచి మరల మృగరాజుం గాంచి 'మదగ్రజుండు కరటకుఁడు ప్రజ్ఞావంతుడు. దేవరహితంబు గోరువాఁడు. అతండు చిత్తంబునకు వచ్చునే నిప్పుడ రప్పించెద' నని చెప్పి యొప్పించి యొక్క రాజభటునిం బుచ్చి రావింపం గరటకుండనయంబు వినయంబు మెరయ వందనంబు గావించి మృగస్వామిచే ననుయుక్త స్వాగతుండయి తదాదిష్టంబయిన యుచితాసనంబునం గూర్చుండ నతండు దమనకుం జూచి 'యా వృత్తాంతంబు ససాకల్యంబుగ నీతనికి వినిపింపు' మనవుడు దమనకుండు కరటకునితోడ సంజీవకుని భూత భవంతి వర్తనంబులును ఱేనికిం దనకు నందులకయిన సల్లాపంబును వినిపించి 'యిందవసానంబున మదుక్తార్థంబును ఱేని వచనంబును వింటివిగదా! ఇందుం నీకుం బోలినయది వాక్రువ్వుము.' నావుడుం గరటకుండు కొండొక మనంబునుం బరికించి దమనకుంజూచి 'ఱేని యెఱుంగని యర్థం బొక్కండులేదు. కార్యాకార్యంబులు నిర్ణయింప మన మెంతవారము? అయిన నమాత్య పదంబున నున్నవార మగుటంజేసి యవసరంబున దోఁచిన యర్థంబు విన్నవింపక మిన్నకుండంజనదు. అంతరం బెఱింగి రాజద్రోహంబు గావించిన వానిని సర్వవిధంబుల వెలార్పంజనదు. వెలార్చిన వాఁడు వగఱం పగ సాధింపంగోరుఁగాని తన చేసిన దోషంబు పరికింపంబోఁడు. మన కప్పుడు గోరంబోవుపని గొట్టడం దీర్ప వలసివచ్చును. కాదని యెప్పటి చొప్పున గలిపికొని వర్తింతుమేనిం బూర్వం బొక్కమది యెడరు వొందింప గడంగి పెఱలెఱుంగుటవలన విఫల మనోరథుం డగువాఁడు వెండియుంజేయు నుద్యోగంబు ఫలానుమేయంబై యుండు. అట్టివానిం జేర్చుకంటెం గీడు వేరొండు గలదె? అధీశుండు తనకు నపాయంబు రోయు భృత్యునుపేక్షింపఁ జనదు.' నావుడుం బింగళకుండు 'కరటకా! నీవు వాక్రుచ్చినయది సత్యంబు. అయినను జిరకాల సఖ్యంబునంజేసి వానింగొండొక కీడునకుఁ జొప్పింప మనం బొప్పదు. నేనేమి చేయుదు?' నావుడుఁ గరటకుండిట్లనియె "ఆరోగ్యంబు గోరువాడు చికిత్సకుని వలన నౌషధంబుంబోలె శ్రేయంబు గాంక్షించు నాయకుండు భృత్యునివలన హితంబవశ్యంబు గ్రహింపవలయు. దేవరకుం దెలియని యర్థం బొక్కండు లేదు. కొండొకదవ్వు పరికించినం గర్తవ్యంబు చిత్తంబునకుఁ దేటపడియెడు. నీతికోవిదుఁడగు భూవల్లభుం డుదధాశుద్ధుం(?) గొలువున గీకొనవలయుఁగాని తక్కు తెఱంగయినం బర్యవసానంబునఁ దప్పక ముప్పు వాటిల్లు. ముందు మందవిసర్పిణియను చీరపోతు డిండిమంబను మత్కుణంబుతోఁ గొలది తెలియక సావాసంబున డీకొని హానింజెందె. ఆ కథ వినిపించెద వినుండు.

***

(మి.భే.-8)

మందవిసర్పిణి యని యొక్క చీరపోతు గలదు. అది తడవులం బట్టి యొక్క నృపాలుని పర్యంకంబుఁ జేరి మెలంకువ మీఱ వసియించి జీవించుచుండు. అంత నొక్కనాఁడు డిండిమంబను మత్కుణంబు తత్పర్యంకంబునం కరుదెంచిన మందవిసర్పిణి యెదురు సని కొనివచ్చి యాతిథ్యం బొనరించి కుశలంబడిగి యిచ్చటికి వచ్చిన బ్రయోజనం బేమని మందలింప మత్కుణం బిట్లనియె. 'పరమమిత్రంబవగు నిన్నొకయర్థం బర్థింప వచ్చితి. నీ యనుగ్రహంబు గలిగిన నా మనోరథంబు వ్యర్థంబు గాదు.' నావుడు మందవిసర్పిణి యిట్లనియె. 'నాకుం బ్రాణ సమానుండవు. నీ యభీప్సితంబు మదాయత్తం బొకండు గలిగిన దానికింత ప్రార్థింపవలయునే? నీ కీరాని యర్థం బొక్కండు నాకుం గలుగదు.' నావిని డిండిమంబు సంతసించి యిట్లనియె. 'తడవుల నుండి నానా మానవసంతాన శోణితంబు లానియున్న వాఁడంగాని మానవనాథు మేనిరుధిరం బేనాఁడేని నెఱుంగ. శాల్యోదనంబును హైయంగవీనంబును మధుర సూపంబును సారతరశాకంబులును రుచ్యంబులగు భక్ష్యంబులును నానాఫలంబులును రసాయనంబులును వివిధ మాంసంబులును గోక్షీరంబులును మద్యంబులును నానావిధోపదంశంబులును బిచ్చిందధియును శర్కరయుఁ బులకండంబును గంధోదకంబులును లోనగు మంచిపదార్ధంబు లనుభవించుచు నెండ కన్నెఱుంగని రాజుల మేనిరక్తంబు కరంబు స్వాద్యంబయి యుండునని విందు. ఈ తలిమంబునందు నా యునుకవ యీకొంటివేని నాకోరిక నెఱవేరును.' నావుడు మందవిసర్పిణి మోమోడి మారాడక యిట్లనియె 'వెల వెరిగి వేగిరపడక మయిమఱచి కూరుకు సమయంబు వేచి ఱేనిమేని మెల్లగం గఱచి నల్ల బీలిచికొని మెలంకువతోడం దొలంగి చనవలయు.' నావిని డిండిమంబ ' నీ చెప్పినయట్లు మెలంగెద' నని పలికి చీరపేనితో మిక్కిలి మైత్రి యొనరించుచు నాశయ్యవసియించి తమి పెల్లిదంబాఁపం జాలక ఱేఁడు పడకంజేరి కూరికి కూరుకక ముంద చేరంబారి కొరుకుడుం బుడమిఱేఁడులికిపడి లేచి సీత్కారంబు గావించుచు బాదసంవాహనంబుసేయు పరిచారకుం గాంచి 'యోరోరి! తేలుగుట్టినట్లు కరంబు నా శరీరం బెరిసెడు. సత్వరంబుగ దీవియ చేరందె' మ్మని పలికిన దివ్వియ దెచ్చునంతలో మత్కుణంబు రూరంబుగ సురిఁగనం బరిచారకులు శయనంబులు నలు వలంకులు కలయం బరికించి యొక్కప్రక్క నెలసువలెం బానుపుం గఱచికొనియున్న చీరపేనిం జూచి 'యిదియె ఱేనిం గరె'నని వారు దానిం బొలియించిరి. కావున స్వరూపం బెరుంగక పరునిం జేరిచినవాని కవశ్యము హాని సంభవించును."

అనిన విని పింగళకుండిట్లనియె 'నాదు విక్రమంబు జంతు సంతానంబులకు మృత్యుప్రాయంబని లోక విశ్రుతంబు. సంజీవకుండు నా పయినెత్తుట కాలాగ్నిపై నురుకుట గాదె? అయిన నిన్నడిగెద. సంజీవకుండు నాకు నే వెరవునం గీడు రోయఁగలండు?' నావిని కరటకుండిట్లనియె. 'క్షుద్రుండయ్యుం జిరపరిచయంబుచే జ్ఞాతమర్ముండగు వాఁడెంత వాని నేనిందఱి వేచి సాధించుట సుకరంబై యుండును. ఏవారికేని నొకప్పుడు గాకుండిన నొకప్పుడు ప్రమాదంబు వాటిల్ల కుండునే? నీతికోవిదుండు శాత్రవుని క్షుద్రునే నొప్పరికింపం జనఁడు.' నావిని పింగళకుండు కొంత చింతించి "మన మీ మంత్రంబు తోడన కార్యంబు నిశ్చయించి సంజీవకు నొక్కకీడునకు లోఁబఱచితిమేని లోకంబు మనల నిందించుంగాని లోగుట్టు తెలియంజాలదు. లోకాపవాదంబునకు భయం పడవలయును.ఇంతియ కాదు. ప్రకృతి వర్గం బవిమృశ్యకారియగు ఱేనియందు విరక్తిం బొందు. దానం జేసి సర్వశ్రేయంబులు చెడును. కావునం దుదకు దోఁచిన యొక్క యర్థంబు వక్కాణించెద. దమనకుండు సంజీవకు పాలికింబోయి వానితోడ నిట్లు వాక్రువ్వవలయు. 'నీవు రాజద్రోహులతోడం జెలికారంబు చేయుచుంట ఱేఁడెరింగినవాఁడు. కరంబు కుపితుండయి యున్నవాఁడు. అయిన నతండు దీనవత్సలుండు గావున నీవు నావెంబడిం జనుదెంచి నిజాపరాధంబు నివేదించి ప్రార్థించితివేనిం బ్రసన్నుండగు'నని వచియింపుము. మనచే నయినంత దనుకం గలుపుగోలు దనంబునక కడంగుదము. 'నీచాః కలహ మిచ్ఛంతి సంధి మిచ్ఛంతి సాధస'యని ధర్మజ్ఞులు వచింతురు గాదె? ఊరక వేఱిమికయి యాడికొంట కెంతసేపు పట్టు? మనము ఋజుమార్గంబునం బ్రవర్తింతము. సంజీవకుండు నీ వచనంబులకు ననుకూలుండయి వచ్చెనేని మేలొందెడు. తక్కినఁ దత్ఫలం బనుభవించెడును." అని పలికి దమనకుం జూచి 'నీవు పోయిరమ్ము. మన యిక్కడి తక్కిన వచనంబు లేవియుం ద్రవ్వకుము.' నావుడు దమనకుండు వల్లెయని యల్లల్లం జని యాననంబున దీనభావంబు గదుర బదంబులు దొట్రిల డాయంబోవ సంజీవకుండు గాంచి ప్రత్యుత్థానం బొనరించి యుచితాసనంబునం గూర్చుండం జేసి తదను భావంబునకు నిమిత్తంబు మానసంబునం బరికించుచు 'మీ యందఱకుం గుశలమే?' యనిన దమనకుండు విని 'పరాధీన వర్తనులకుం గుశలంబున కెంత యంతరంబు? రాజసేవాపరుండు మృత్యుగ్రస్త తుల్యుండు. ఱేని మచ్చిక నచ్చిక యిడి పెద్ద కాలంబు సుఖియింపం గాంక్షించువాఁడు మృగతృష్ణికా ప్రవాహంబు గాంచి యుదన్యాపనోదనంబునకయి ప్రధావించు వాఁడు గాఁడె? ఏకతంబుననేని ఱేనిసాకతంబునకు మోఱకు తీరున ధీరుండు మోసఁబొందఁడు.' నావిని గోవల్లభుండు 'నీ వచన భంగి విచారింప నేదియో యొక్క విశేషంబు గలుగంబోలు నని తోచెడు.' ననుచు నేకాంత కాంక్షా సూచకంబుగం దన యిరుపక్కియలుం బిరు చక్కియు నాలోకింపఁ బిరింది దెసనున్న కాటకపాటకులల్లన లేచి యెడగలుగంబోవుడు దమనకుండు వారిదెస యపాంగ వీక్షణంబున సూచించుచు 'వీరలఁ జేఱుచుటయె నీ యిడుమకు మూలంబయ్యె.' నావుడు సంజీవకుండు భయాధీన మానసుండయి 'యచ్చట జరిగిన వృత్తాంతంబేమి?' యని యల్లన నడిగిన దమనకుం డిట్లనియె. 'చేటెరుంగనిపాటు పడియెదవు. కాటక పాటకులు రాజద్రోహులని యెరింగియుండియు వారలతోడ సఖ్యంబు చేయుచున్నవాఁడవు. ప్రభువునకె కాదెవ్వరి కయిన నిది యనుచితం బని తోపకుండునా? ఈ యర్థంబు పార్థివుండెఱింగి దుర్వార క్రోధ భీషణుండయి యున్నవాఁడు. తొలి నా వచనంబునందు విశ్వాసం బిడి ఱేని పాలం జేరితివి. కావున నున్న రూపు వచియించెద వినుము. "సంజీవకుపక్షం బవలంబించి మత్సమ్ముఖంబున వసియించువారి నెవ్వరినేనిం తత్క్షణంబ కృతాంత నిశాంతా వేశికులం జేసెద" నని హర్యక్షాధ్యక్షుండు కరంబు క్రూరంబుగ సంగరంబొనరించి యీ క్షణంబ సంజీవకుం దోడ్కొని రమ్మని నన్నుఁబుచ్చినవాఁడు. మీది కార్యంబు నీ యిచ్చ వచ్చినట్లు గావింపుము. ఈ యనర్థం బూరక పుట్టదు. చేరువం జేరి యెవ్వరో చెవి గఱచెదరు. వెండియు నిట్టివి యేమి పుట్టెడునో యెరుంగము. నేఁడు నీకయిన యది ఱేపు మా కయ్యెడు. అతీత కార్యంబునకు విచారం పడనయ్యెడు ఫలం బేమి? ఎన్నండు ఱేనికిం బానిస తనంబుకుం బూనికొంటిమి, నాఁడె మృత్యువునోరం జొచ్చితిమి. ఇందులకయి యిప్పుడు వగచుట గతజల సేతుబంధనంబు.' అని నిట్టూర్పు నిగిడించి ఖేదవిషాదంబు లభినయించువాఁడు క్రిందు చూచుచు మిన్నకుండ సంజీవకుండవ్వచనంబు వజ్రపాతంబహార్యంబునట్లు ధైర్యసారం బగలింపం గొంతవడి వెఱపెల్లిదంబున నివ్వెఱ పడియుండి యెట్టకేలకు హృదయంబు పదిలించుకొని దమనకుం గనుంగొని యిట్లనియె. 'అనారతంబు ఱేనికి లగ్గు దలతుం గాని యెగ్గు గలయందయినం దలంచి యెరుంగ. లాఁతివారికయిన నొక యొప్పమి గావింప మనంబు చొప్పడి యుండునే? అకారణంబుగ ఱేని కిట్టి బెట్టిదంపుఁ గ్రోధంబు పుట్టించి సాధువులంజెరుప నొడిగట్టిన పుణ్యాత్ము లా బ్రహ్మ కల్పాంతంబు మనియెదరు గాఁబోలు! సర్పంబులకు విషంబుంబోలె ఖలులకు దోషంబు సహజంబు. వారిం జెప్పనేల? ఱేని యవివేకంబ సర్వానర్థంబులకు మూలంబు. పార్థివుండెద్దీనె ననినం గొట్టంబునం గట్టింపు మనవాఁడయ్యెనేని లెంకలు కొంకు మాని యిచ్చకు వచ్చినట్లు ఱేని నకార్యంబులకు లోఁచి యశోహానింబుట్టించి పరలోకదూరురం జేయుదురు. ఇంత కాలంబు పార్థివుననుగ్రహంబు సంపాదింపఁగోరి నాపడినపాటు లెల్లం బొల్లయయ్యె. వివేకరహితుండగు దొరం గొలుచుట నిష్ఫలంబగుట మాత్రంబు గాదు; ప్రాణహానియు నాపాదించు. మనో వాక్కర్మంబుల నొకప్పుడయిన నీషత్తయిన దోషంబు చేసియెరుంగ. సంతతంబు స్వామికి క్షేమంబ కాంక్షింతును. అట్టి నాకిప్పుడు మృత్యువు వక్త్రబిలంబు చొరవలసి వచ్చెఁగాదె? అన్యులకు నెన్నెండును గీడు రోసి యెరుంగను. నా కొరుఁడు నెరగు వెదకునె యనం జనదు. రాగ ద్వేషదూషితాత్ముల మానసంబులు సాధువుల యందును వికృతిం బొరయును. తొల్లి కాక వ్యాఘ్ర జంబుకంబులు పరమ సాధువగు లొట్టియం గపటోపాయంబుఁ బన్ని తమ స్వామియగు సింగంబుచే ద్రుంగించె.' నన విని దమనకుం డా కథ ససాకల్యంబుగ వినిపింపు మనిన సంజీవకుండిట్లనియె.

***

(మి.భే.-9)

మలయంబు నుపత్యకా విపినంబున దర్పసారంబను కంఠీరవంబు గలదు. దానిం గాక వ్యాఘ్ర జంబుకంబులు మంత్రులయి కొలుచుచుండును. అవి యొక్కనాఁడు గహనంబున విహరించుచు నొక్క యుష్ట్రంబుం గాంచి 'నీనామం బేమి? నీ వెక్కడనుండి వచ్చెద?' వని యడిగిన నా క్రమేలకం బిట్లనియె. 'వర్తకుం డొకండు నా మీఁద ననారతంబు మహాభారం బెక్కించి మోపించుచుండును. ఇట్లు పెద్ద కాలంబు భారవహనక్లేశంబు సహింపంజాలక వాని మొఱింగి యీ యరణ్యంబునకు వచ్చి డాఁగియున్నవాఁడను. ఈ శార్దూలవల్లభుండు లోకభీకరుండు. మీరు మహాప్రాజ్ఞులరు. మీ యనుగ్రహంబు వడసి త్రాసంబు వాసి మనువాఁడ. నాకు మీరు దక్క వేరు శరణ్యంబు లేదు. శరణాగత రక్షణంబు సర్వధర్మంబులం దుత్తమంబని ధర్మవిదులు వక్కాణింతురు.' నావుడు జంబుకం బిట్లనియె. 'ఈ యరణ్యంబునందు మృగరాజొకరుండు గలఁడు. అతండు ప్రతీపప్రతాప దీపనిర్వాపణ మహాబలుండగు మహాబలుండు. మే మాతనిభృత్యులము. నీవు తద్దర్శనం బవశ్యంబుగం జేయుము. మావలన నయినయంత యుపకారంబు గావించెదము. నీకు సర్వంబు మేలయ్యెడు వెఱవకుము. మా వెంట రమ్ము.' నావిని మహాంగం బంతరంగంబునం బొంగి వాని పిరుదం జనుడునయ్యవి మృగనాథు పాలికింబోయి యథాశ్రుతంబుగ దాని వృత్తాంతంబు సాంతంబుగం జెప్పి ముందరికిం ద్రోచి మ్రొక్కు మనుడు సవినయంబుగ మ్రొక్కి నిలువంబడియున్న వాసంతంబుం గాంచి పంచాస్యంబు కృపాయత్త చిత్తంబయి యభయం బొసంగి కొంతతడవు సల్లాపంబు గావించి 'నీకమాత్యపదం బొసంగితిమి. మా పూర్వ మంత్రుల తోడం గూడి యైకమత్యంబు వడసి యస్మత్కార్యంబులు నిర్వహించుచు సుఖంబుండుము.' నావుడు నుష్ట్రంబు మహా ప్రసాదంబని తదుక్త ప్రకారంబునం బ్రవర్తించుచుండె. పెద్ద కాలం బివ్విధంబునం బ్రవర్తిల్లుడు నొక్కనాఁడు సింహంబు మంత్రులతో నిట్లనియె. 'నాకిప్పుడు వ్యాధికతంబునం దేహంబునం బాటవంబు లేకయున్నయది. అరణ్యంబున సంచరింపజాలను. ఆరోగ్యంబు గలిగి కొంత సత్తువ వచ్చి నడయాడునంత దనుక నా కాహారంబు సంపాదించి తెచ్చియిండు.' నావిని వాయసాదు లిట్లనియె. 'స్వామీ! మేము క్షుద్రులము. మీకు వలసినంత యాహారం బొక పూఁటకయినం దెచ్చి యిచ్చునంతవారమె? మీ పాద చ్ఛాయనుండి మీరారగింప మిగిలినది భుజియించి జీవించుచున్న వారము. మా సత్త్వంబు కొలంది దేవరకు దెలియనిది గాదు.' అనవుడు మృగేంద్రుండు వానింజూచి 'దొరకినంతయె కానిండు. తోడెంబుతోడనె ప్రొద్దుపుచ్చికొనియెద. నేనేమి చేయుదు? నా పురాకృత కర్మంబు వ్యాధిరూపంబున నన్ను బాధించుచున్నయది. కొంతపాటి నడయాడుటకు శక్తి యుండిన మిమ్ము శ్రమం పఱుపను. జంపుమాని కానకుంజని యే యెఱచియయిన దొరకినంత కొనిరండు పొండు.' అని శాసింప మాఱుపలుక వెఱచి యా జంతువులు వనంబునకుంజని యెల్ల ప్రదేశమ్ములం గ్రుమ్మరియుఱ వగునెర దొరకమిం గరంబు నిర్వేదించి చెఱియొక్క దిక్కునకుం జెదరి చని వెదకుచుండ నండజ పుండరీక జంబుకంబు లొక్క చక్కటిం జేరుడు బలిభుక్కు తక్కువానిం గనుంగొని 'మీరెంత మాత్రం బేనిఁ బలలంబు సేకరించినజాడ గానము. మీ యంతవారి కసాధ్యంబగు కార్యంబు క్షుద్రంబగు పక్షికి సాధ్యంబగునే? మధ్యాహ్నంబయ్యె. ఇంకం గ్రుమ్మరిన దాన వ్యర్థాయాసంబు కాని ఫలంబు లేదు. ఱేఁడు మన రాక వేచియుండును. అతని పాలికింజెనఁటి చేతులంజనదు. మన మింతకాలంబు ఱేఁడు తెచ్చియిచ్చిన మాసంబు బరులుబ్బ భుజియించి కాలు గదలింపక నిశ్చితంబుగ నుండితిమి. ఱేనికొక్క యిక్కట్టు వాటిల్లిన తఱి నొక్కపూఁటకయిన గ్రాసంబుదెచ్చి యీనోపమేని మన భృత్యభావంబు గాల్పనే? ఇప్పుడొక్క చొప్పు నా డెందంబునకుం బొందుపడి కానంబడియెడి. దాని విని మీకుం బోలిన తెఱఁగు గావింపుఁడు.' అని నలువలంకులు కలయ విలోకించి మఱికొంత చెంతకుం జరిగి చెవిడాసి యిట్లనియె. 'మన మీ లొట్టియను సరిపెట్టి నేఁటికి కార్యంబు జరిపితిమేని రేపు పోలినయట్లు చూచుకొందము. ఱేఁడుపయోగింప శేషించిన యామిషంబు మనము కొన్ని దినంబులనన్యాపేక్షంబుగ భక్షింపవచ్చును.' అన విని జంబుకం బిట్లనియె. 'మన యధీశ్వరుండా క్రమేలకంబు నమాత్యపదంబొసంగి కరంబు గారవించుచున్నవాఁడు. మనము దానికొక్క యుపాయంబు గావించితి మేని మానసంబునకు నొవ్వు పుట్టించి దవ్వగుదుము. కావున నీ చెప్పినచొప్పు చొప్పడదు' నన బలిభుజం బిట్లనియె. 'క్షుధాబాధితుండు కృత్యాకృత్యంబు లారయంజాలఁడు. స్వజన హననంబున కయినం బాలుపడుంగాని యిది యకృత్యంబని తలంపఁడు. వ్యాళియు శార్దూలియు నిజాండ శాబకంబుల క్షుధాబాధంజేసికాదె భక్షించెడు?' నావిని వ్యాఘ్రంబిట్లనియె. 'క్షుధితుండయి తద్దననంబునకు మృగనాథుండు పాల్పడినం గానిమ్ము. మనకది కార్యంబు కాదు. మన మాతని సమ్ముఖమునకుం జని మొఱంగక మనపడిన తెఱంగు నివేదింతము. తదనంతర కర్తవ్యంబాతండును మనమును గలసికొని విచారింతము.' అనిన వల్లెయని లేచి చని క్రమేలకంబు చనుదేరకమున్నతారు మృగరాజుంగాంచి 'స్వామీ! యేమి చేయుదుము. తిరుగరాని చోట్లెల్లం దిరిగితిమి. పడరాని పాట్లెల్లంబడితిమి. ఇన్ని పాట్లుపడిన దానఫలంబేమి? సర్వదా కరుణోదారుండవయి మాభరణ రక్షణంబులు స్వకృత్యంబులుగ నిర్వర్తించు దేవరకు మా వలన నావంతయినఁ బ్రయోజనంబు లేదయ్యె. అయినను మా విన్నపం బొకండు గాదనక యవధరింపుఁడు. దేవరవారాఁకలిచే మిక్కిలి వాడంబారియున్నవారు. మా లోపల నొక్కనిం దమ గర్భంబు జొప్పించి ధన్యుం గావింపుఁడు' అనవుడు మృగనాథుండు హరిహరియని చెవులు మూసికొని 'యెంతమాట వినవలసివచ్చెను! చిరకాలంబు మిమ్ము రక్షించి యిప్పుడొక్కనాఁటి యాహారంబు కయి మీకొక్క కీడు దలంచితినేని లోకంబునవారు నన్ను నిందింపరే? పరిలోకంబునకుం దొలంగనె? ఇట్టిమాటలు తల పెట్టకుఁ'డన జంబుకంబు కాకంబుం గాంచి 'నీవు సైకంబవు. నిన్నుపయోగించుటవలన రేనికిం కడుపుఁ జిచ్చుడుగం బోదు. తొలంగుము. నా మేను ఱేనికి భోజ్యంబు చేసి కృతార్థుండ నయ్యెద'నన విని శార్దూలం బిట్లనియె. 'కాకంబు కంటె నీవు కొంత పెద్ద జంతువువైన నాతని యాఁకలి పోకార్ప నీ నంజుడుం జాలదు. నేను రాజునకు భోజనంబయ్యెద' ననిన వెండియు జంబుకంబిట్లనియె. 'నీవు లావుగలవాఁడవు. నేఁడు గాకున్న ఱేపైన ఱేనింబోలింప వలంతివి. నీ యనంతరము మే ముండినం గొండొకయేనిం బ్రయోజనంబు లేదు. గావున నీవచనంబు గ్రాహ్యంబుగా'దని కుమ్ముసుద్దులాడుచుండఁ జిత్రవర్ణుండు సనుదెంచి తద్వృత్తాంతంబు సాంతంబుగా వారి వలన విని 'యూరక యేల పాలువోక పెనంగెదరు? నే నిక్కార్యంబునకు జాలియున్నవాఁడ. నా మనుగడవలన ఱేని కొక్క ప్రయోజనంబులే'దనిన జంబుకంబు ఱేనింగాంచి 'యా కార్యంబు నాకుంబోలియున్నయది. ఇందుల దేవరకు దురితంబులేదు. శరీరరక్షణంబు పరమధర్మంబు. శరీరంబు గలిగిన నెల్ల ధర్మంబులు సాధించవచ్చు. "శరీరమాద్యం ఖలు ధర్మ సాధన" మ్మని ప్రాజ్ఞులు వక్కాణింతురు. భృత్యుండు స్వామి కార్యహత ప్రాణుండయ్యెనేని నాకలోక సుఖంబనుభవించును. ఇంతకంటె నొండు శ్రేయంబు గలదె? మీ రొల్ల కుండిన మేమెల్లరు ప్రాణంబులు దొఱంగెదము' నావుడు మృగనాథుండు చిత్రవర్ణుని యాననం బవలోకింప 'జంబుకరాజు చెప్పిన చొప్పుదప్పదు. సంశయింపక నా చెప్పిన చొప్పు గావించి నన్ను ధన్యుంజేయుము' నావుడు నెట్టకేలకు క్షుధాబాధ దుస్సహంబగుడు మృగేంద్రంబు లొట్టియం జంపి భక్షించెను.

***

ఎట్టివానితోడనేని నవీన సేవకునితోడ రాజును దద్భృత్యులును మనంబులం గలసియుండరు. క్షుద్రజన పరివృతుండగు పరివృఢుండు దందశూకసందోహ పరివేష్టిత పటీర విటపి వడువున సమాసన్న జనంబులకు దెప్పరంపు ముప్పు పుట్టించును. కావున నట్టి నిన్నేవారుం జేరవెఱతురు. దీనికిం దార్కాణంబుగ నొక్క కథ వక్కాణించెద వినుము.

***

(మి.భే.-10)

ఒకానొక పట్టణంబు నందొక వడ్రంగి గలఁడు. వాఁడు నానాఁడు వనంబునకుంజని తనపనికి నుఱవగు తరు నికరంబు నరికి స్తంభాదికంబు లొనరించి పురంబునకుం గొనివచ్చి విక్రయించుకొని జీవించుచుండు. వాఁ డొక్కనాఁడు కాననమ్మునం గ్రుమ్మరునాఁడు సుహృద్విలోచనంబను పంచాస్యంబుం గనుంగొని భీత చేతస్కుడయి నిశ్చేతనుండుం బోలె నిలువంబడియుండ నాహర్యక్షంబు వీక్షించి కృపాతరంగితాంతరంగంబయి యిట్లనియె. 'హస్తిమస్తక విదళనఖరంబులు మన్నఖరంబులు; మ్రుక్కడులగుట దయనీయులగు భవాదృశ్యులపయిం దెగవు. బెగడుపదకుము.' నా వాఁడు సాఁగిలంబడి మ్రొక్కి పెక్కు భంగుల నా సింగంబుం బ్రస్తుతించి ముదలగొని చని యదిమొదలు కృతజ్ఞుండయి నానా విధంబులగు మధురాహారంబులు దెచ్చి యిచ్చి తనుపుచుండు. ఇట్లు కొన్ని దివసంబులు సన నొక్కనాఁడు మెగంబుల ఱేఁడు తన యనుచరంబులగు కాకజంబుకంబులతోడ ముచ్చటలాడు చుండ నవి యిట్లనియె. 'దేవరవారు కొన్ని దినంబులనుండి వేఁటకుఁ బోవం గానము. కారణంబు దెలిసినదికాదు.' నా విని మృగనాథుం డిట్లనియె. 'రథకారుం డొక్కరుండు మదీయ భక్తుండు గలఁడు. వాఁడు ప్రతిదివసంబు నా కాహారంబు తెచ్చి యిచ్చు చున్నవాఁడు.' నావిని కాకజంబుకంబు లిట్లనియె. 'మీకిట్టి యుపకారం బొనరించు పుణ్యుండు సజ్జనాగ్రగణ్యుండు గాఁడె? దేవర యనుగ్రహంబు గలిగిన నాతని సందర్శనంబుం జేసి మా నేత్రంబులు సాఫల్య పాత్రంబులు గావించెదము.' నావిని మృగవల్లభుం 'డట్ల కానిం డాతండు కొండొక తడవునకు రాఁగలండు. వేచియుండుం'డని పలికి యొక్కయెడ వాని తోడం గూర్చుండియుండ నావడ్రంగి చనుదెంచి కాంచి భీతచేతస్కుండయి సత్వరంబుగ నేదిష్ఠపాదపంబు నారోహించిన సింగంబు డాయంబోయి 'యోయి చెలికాఁడా! యేల యీ పాదపంబు సధిరోహించితివి?' నావుడు 'నన్వర్ధాభిదానంబులగు నరిష్ట పంచకంబులు భవత్పార్శ్వచరంబు లగుటంజేసి వృక్షంబు నారోహించితి. దుష్టపరివృతుండగు రాజును సర్వదా విశ్వసింపం జన'దని వచియించి యచ్చటం గదలక వేచియుండి యొక్క చనుప చనుదేర దానిం గూడి యయ్యరణ్యంబు వెడలి చనియె.

***

'సజ్జనుండయ్యు దుర్జనులతోడి సంసర్గంబునంజేసి దుర్జనుండు నాఁబడు. బకోటఝాటంబుతోడ వసియించు హంసంబును బకం బండ్రుగాదె? భూనాథుండు సాధుచరిత్రుం డయ్యెనేఁ బ్రకృతి వర్గంబు నట్లగు. 'యథా రాజా తథా ప్రజా' యని నీతి కోవిదులు వక్కాణింతురు. ఱేనిపాల నెవ్వండో ఖలుండు కల్ల నిజంబులు విపరీతంబులుగం బలికి యాతనికి నాయం దప్రతిరోధంబుబగు క్రోధంబు పుట్టించినవాఁడు. మించిన కార్యంబునకుఁ జింతించి ఫలం బేమి? ఊరక మరణంబు నొంద నేల? రణంబు గావించి లబ్ధవిజయుండనయి యశోలక్ష్ములం బడసి యిష్టసుఖంబు లనుభవించెద నొండె, వేఱొం డయిన శూరలోక శ్లాఘ్యుండనయి నాకలోకంబు లనుభవించెద నొండె' నా విని దమనకుండు 'నీవు చెప్పినయది శూరలోక శ్లాఘనీయంబ. అయిన నుపాయాంతరంబుచేఁ బగఱ సాధింప నొండెఁ దప్పించికొని తొలంగ నొండె. గొలంది గానియెడం గడ యుపాయంబు సమాదరణీయంబుగాని సాహసంపడి రణమరణంబు శ్రేయంబని కడింది మార్తురతో నరసి యుసురు దొఱంగుట ధర్మంబుగాదు. 'జీవన్భద్రాణి పశ్యతి' యను వచనంబుఁ బాటింప వలదె? తన తరంబుం బగఱతరంబు నెరింగి కరంబు జయంబు నిశ్చయించుకొని మార్కొనవలయు విపరీతంబయినం బరాభవంబు తప్పదు. తొల్లి సముద్రుండు కరం బారయక యొక్క టిట్టిభంబుం బరాభవింపంబూని తాన పరాభూతుండయ్యె. అయ్యది సవిస్తరంబుగ వివరించెద నాకర్ణింపుము.'

***

(మి.భే.-11)

పారావారంబు తీరంబున మహీరుహంబుమీఁదం దీతు వొక్కండు గూఁడు పన్నికొని తనచేడియం గూడి వసించుచుండు. అంతం గొంతకాలంబున కా శకుంతంబు తనకాంత గర్భశ్రాంత కావుటంగాంచి సంతసించి 'నీయిష్టంబు వేఁడు మది యెట్టి కడిందియైన నాగట్టి కడిమి మెఱసి తెచ్చియిచ్చెద' నావుడు నా పులుఁగుఁ జెలువ తన చెలువునితో నిట్లనియె. 'నా యభిమతం బొక్కండు గలదు. వక్కాణించెద నవధరింపుడు. సర్వదివసంబుల సముద్రుండు సముత్తుంగ రంగత్తరంగంబులు చెలంగ నింగిముట్టి పొంగివచ్చును. మన యావాసంబు కరం బాసన్నంబగుటం జేసి నా యిడినయండంబులు కాండాక్రాంతంబులగు, వేళంబ పోలిన యిరవు పరికించికొని చనవలయు. మసలం జనదు. ప్రసూతి సమయంబు డాసిన దేశాంతర గమనంబు సుకరంబు గాదు'. నావుడు నావిహంగంబు తన యంగన పలుకు లాలంబుచేసి మందహాస సుందర వదనంబుతోఁ 'గువలయ నివహంబునకుఁ దుహిన కిరణుండును బుండరీకషండంబునకుఁ జండభానుండును జాతక వ్రాతంబునకుం జీమూతంబు నెట్టట్లు శకుంత సంతానంబునకు నాగాంతకుండు ప్రభుండు. అతండు నిజపక్షవిక్షేపజాత వాతోద్ధూత కాండకాండ చండబలుండు. తదాశ్రయుల మనల నీ జడాశయుండు చెనకి మయిమయిం బోవనోపునే? ఏల యీలీల నా తరం బెరుంగక కొఱమాలిన విచారంబుల జిత్తంబు హత్తించెదు? సమాహిత చిత్తంబున నుండుము'. నావుడుం డిట్టిభి యిట్లనియె. 'ఎట్టివాఁడయిన భావ్యనర్థంబునకుం బ్రహాణకంబగు సాధనంబు పరికించి కృతనిశ్చయుండయి యుండవలయు గాని బలదర్పంబునం బ్రమత్తుండయి కన్ను గానకుండుట నయవిజ్ఞాన సంపన్నులు కరంబు గర్హింతురు. నా నస్మాదృశ దుర్బలులం జెప్పనేల? హితవచనంబులు వినని బాలిశుండు కోల విడిచి పడిన తాఁబేలుంబోలెఁ గాలధర్మంబు నొందు. ఆ కథ సాకల్యంబు మీఱ వ్రాక్కుచ్చెద వినుండు.'

***

(మి.భే.-12)

భువనసారంబను నొక్క కాసారంబు గలదు. అయ్యది చక్ర చక్రాంగ ప్రముఖ వివిధజల విహంగమ సంచార రమ్యంబయి పుండరీకషండ సాంద్ర మరంద ధారాసార సంభ్రమద్భ్రమర ఝంకార సంకులంబయి యొసంగు అందుఁదడవులంబట్టి కంబుగ్రీవంబను కూర్మంబు వికట సంకటంబులను హంసంబులతో బద్ధసఖ్యంబయి యుండు. పిదప గొన్ని వాసరంబులకు వఱపునంజేసి కాసారంబు వారి పూరం బివురం బాఱుడు నా మరాళంబులు దేశాంతర జిగమిషం బూని యా కచ్ఛపంబు కడకు వచ్చి తమ యిచ్చంగల యర్థంబు వాక్రుచ్చి వియోగదుఃఖంబు మీఱం దీఱమి పరికించి యెలుంగు కుత్తుకందగుల 'సఖ్యంబు మఱవకు, పోయి వచ్చెదము.' నావిని కమఠంబు కరం బాననంబు దీనభావంబునఁ గదుర నిట్లనియె. 'పెద్దకాలంబేకోదరులంబోలెం జెలిమి సలిపితిమి. దీని కొక్క బొసంగు పొసంగునని కలనేనిందలంచి యెఱుంగ. మీతోడంగూడ వచ్చెదనంటినా పక్షంబుల బలిమి కలిమిం జేసి వలయు నెలవునకుంబోవ వలంతులగు మీకు నాకునెంత యంతరంబు. నా కొలంది విచారించికోలటుండనిండు. మిమ్ము నొక్కటి వేడెదం. జిరకాల కృతంబగు చెలికారంబున కను రూపంబుగ నా ప్రార్థితార్థంబు తుదముట్టింపవలయు. వెరవు పరికించి యెట్లయిన మీతోడ నన్నుం గొంపొండు. మీ వియోగంబు క్షణంబయిన సయిరింపంజాల.' నావుడు నా యంచ లించుక చింతించి 'యిది యెట్లయ్యెడు? ముక్కునం గఱచి కొనియొండె. రెక్కల నెక్కించుకొని యొండెం గొంపోవ వలయు. విప్రకృష్ట దేశగాములకు మాకది దుస్సాధ్యంబు. సాహసంబుచనదు. ఎటువోయి యెటువచ్చునో యెఱుంగము. వినుము, హృదయంబు వదిలించుకొని కుదురుగదలక యుండుము. భాగ్యంబు గలిగినం బునర్దర్శనం బయ్యెడు.' నని యెంతదూరంబు చెప్పిన వినక కడుం గక్కసించిన నాయండజంబులు కొండొక డెందంబుల విచారించి యెట్టకేలకుం దామేటిం గాంచి 'యొక్క వెరవు పరికించితిమి. అది కొంత మదికి సరిపడియున్నది. ఒక్క యష్టి సేకరించి దాని యగ్రంబులు చెఱియొక్క ప్రక్క ముక్కునఁ గఱచికొని పఱచెదము, దాని నడుమ ప్రమాదంబుం బొరయక కఱచికొని రానోపుదె?' యనవుడు వల్లెయని తదానీతంబయిన కాష్ఠంబు నడుమగరచుకొని వ్రేల నాయంచలు చంచువులం దదంచలంబులు పొంకించి యంబర తలంబున సత్వరంబుగఁ బాఱుచుండ నొక్క పట్టనంబునందలి జనంబులు వీని విలోకించి విస్మయంపడి కావించు సల్లాపంబుల యలబలంబు క్రందుగ వినంబడుడుం గూర్మం 'బీ కలకలం బెక్కడిది?' యని హంసంబుల నడుగ నోరి పట్టువదలి నేలవ్రాలి మాంసలుబ్ధులచే హతంబయ్యె.

***

మతిమంతుఁ డనర్థావహంబగు నభిజనంబు మాని కొనవలయునొండె, ననర్థంబు దలంగు నుపాయ సంపన్నుండు గావలయునొండెఁగాని దైవపరుండయి యుండం జనదు. దైవ పరున కనర్థంబు తప్పదు. ఈ యర్థంబు తేటపడ నొక్క కథ చెప్పెద వినుము.

***

(మి.భే.-13)

ఒక్క జలాశయంబునం దనాగతవిధాతయుఁ బ్రత్యుత్పన్నమతియు యద్భవిష్యంబునని మూఁడు మత్స్యంబులు వసించుచుండు. ఒక్కనాఁ డనాగతవిధాత ప్రత్యుత్పన్నమతి యద్భవిష్యంబులం గాంచి 'యీ యేఁడింతవరకు వాన లేబరంబయ్యె. మీఁదనయినను గురియు నను నాసలేదు. నిమిత్తంబులు ప్రతికూలంబులయి కానంబడియెడు. ఈ కొలని జలంబులు తుదముట్ట నడుగుఁబట్టకమున్న మెలంకువ పడవలయు. మసలిన మోసము వాటిల్లు. ఇటకుం గొంతదూరంబున ధ్రువోదంబను హ్రదం బన్వర్థాభిదానంబు గలదు. ఇచ్చటికి వరవ యచ్చటినుండి వచ్చుచున్నయది. అదియు వెనుమోయం దోయంబు లేక యుండెడు. నడికిరే యిట నల్లల్ల నావరవంబడి యా మడువుంజేరి యీ బారిం దలంగుదము. ఇంతకుం గొంత ముందు కొందరు మైనికులు వచ్చి యిచ్చటి జలంబు కొలంది పరికించి "పది దినంబులకు నివురంబాఱెడు, అప్పటికి వత్త" మని యొండొరులతో నాడికొనుచుం బోయిరి. అది మొదలుగ నా యుల్లంబు పెల్లుగ నుడికిల్లెడు.' నా విని ప్రత్యుత్పన్నమతి 'దీని కింత యేల? అంత వచ్చినప్పుడు చూచికొంద'మనియె. యద్భవిష్యుండు మిన్నకుండె. అంత ననాగతవిధాత యా రాత్రి జలాశయంబు నిర్గమించి యొయ్యొయ్యంబోయి ధ్రువోదంబుం బ్రవేశించె. ఇట నానాఁట నెండల మెండున సలిలంబల్పాన శేషంబుగ శోషిల్లుడు రేవుబోయల వల, ఎత్తైల, కొడమ, గఱ్ఱె, మావు లోనగు సాధనంబులు గొనివచ్చి పెచ్చు వేడుకంపొచ్చి మీలం బట్టిపట్టి గట్టునకుం జేర్చుచుండ నందు యద్భవిష్యంబు మట్టిమిట్టిపడం బడియంగొట్టి కెడయించిరి. ప్రత్యుత్పన్నమతి మృతకల్పంబుగ జలంబులం దేలగిలంబడి యుండంగని నీరంబు చేరువం దీరంబునకుం బాఱంజిమ్మి మీన సంతానంబు నిరవశేషంబుగం బట్టికొని గట్టుచేరుడు నా మత్స్యంబల్లల్ల జరిగి వారింబడి దప్పించుకొని చనియె!

***

అని చెప్పినవిని టిట్టిభంటు 'నీ విందులకయి కొందలం పడకుము. బూటకపు మాటల మూటయని నన్నుఁ దలంపకుము. కార్యంబుతఱి నానెఱమగంటిమి మెఱయించి నీమెచ్చు వడయువాఁడ. మిన్నకుండు.' మానవుడు నావిహంగాంగన తన భర్తకు మాఱుపలక వెఱచి యూరకుండె. అంతం గొన్ని దినంబులకు నా విహంగి సముద్రుండు టిట్టిభంబు పంతంబు పరికింతమని కల్లోలమాలాభీలంబుగం బొంగి తదీయాండంబులన్ని హరించె. అనంతరంబు పులుఁగు వెలఁది తన పెనిమిటిం గనుంగొని 'తొల్లి నా వచనంబులు వినరయితిరి. ఇఁకనేమి చేయవచ్చు?' నని బొటబొటం గన్నీరు దొరుఁగ నంగలార్చుడు నా ఖగంబు దాని మిగుల నూఱడించి పులుంగు బలంగంబులం గూర్చి తనకు సముద్రుండు గావించిన పరిభవంబు తెలియం బలికి 'యజాండసహితంబుగ నావరణ వారి పూరంబు నిశ్శేషంబుగ గండూషింపం జాలిన చండవిక్రముండు వజ్రతుండుఁడు మనకు రక్షకుండని యా జడాత్ముం డెఱుంగఁడు గాఁబోలు. ఇప్పుడవశ్యంబుగ నెఱింగింత మెఱింగింపకున్న గర్వంబు మానఁడు. ఇది యల్పంబు దీనికింత యుద్యమంబేల? యని యొప్పరికింపరాదు. నేడు గోరంతకు వచ్చినది, ఱేపు కొండంతకు వచ్చు. మన మందఱమవహిత చిత్తంబులతో వినతానంద సంధాయకుఁడగు వినతానందనుం బ్రార్థింత మాదయాళుండా మహామహుండు మన యనిష్టంబు దలంగి యిష్టంబు చేయంగలం'డని యొడంబఱిచి యా ఖగంబులుందానును భక్తి తాత్పర్యంబు మీఱ నిరంతర ధ్యానం బొనరించుడుం బక్షి స్వామి సాక్షాత్కరించి, 'హృష్టుండనయితి. మీ యిష్టంబొసంగెద వేఁడుం'డనవుడు నండజాతంబులు మిగులంబ్రీతంబులయి తమకు సముద్రుండు గావించిన యవజ్ఞ విజ్ఞాపించిన నాతండు కుపితచేతస్కుండయి నదీనేతంగాంచి నిజాదేశంబున నయ్యండంబులు దెప్పించి యప్పక్షుల కిప్పించి 'యిప్పటికి క్షమియించితి ఇటమీఁద నస్మజ్జనంబులకు నెగ్గుదలంపకు. నీకది లగ్గుకా'దని నుడివి యంతర్హితుం డయి చనియె."

***

"నావిని సంజీవకుం డిట్లనియె. 'దమనకా వినుము. కలకాలంబు బ్రదుకంబోము. చావు నిక్కంబు మన కన్నుల ముందఱం బుట్టి గిట్టినవారి నెందఱం గానము. నిన్నయున్న వాఁడు నేఁడు లేఁడు. నేఁడు పఁగతు మొగంబునకుం దొలంగిన ఱేపు మృత్యువు మొగంబునకుం దొలంగవచ్చునే? దానంజేసి యపయశంబు దప్పం బ్రయోజనంబు గలదె? పగతు కడిమి దడవక కడిఁగిన వాఁడం గాను. లాంతివెరవు లావు గామింజేసి ప్రకృతోద్యమంబు బూనవలసె. కడమాట యొక్కటి వినుము. ప్రాణహాని కయిన నోర్తుంగాని మానహాని కోర్వంజాల. ఇది నిక్కంబు. నీవింక నాకడంకకు నడ్డవాట్లు వ్రేయకుము. నేనిదె వచ్చెదఁ గట్టాయితం బయియుండు మని ఱేనికిం జెప్పుము. వేగిరింపుము, లెమ్ము, పొమ్ము.' నావుడు దమనకుండు సరభసగమనంబునం జనువాఁడు ఱేనియిరవు మోసలం గరటకుం గనుంగొని 'లోనికిం బోవచ్చునె? యసమయంబు గాదుగద?' నావుడుం 'బోవచ్చును. సమయంబ. ఱేఁడు నీరాక వేచియున్నాఁడు. పోయినపని యేమయ్యె?' నని కరటకుం డడుగ దమనకుండు మొగంబునం జిఱు నగవు మొలతేర విలోకించి 'యేమో యేలయయ్యెడు? గార్యంబు పండించుకొని వచ్చితిం బిదపఁ దుదముట్టం జెప్పెద. నీవు పోయి సన్నిధానంబున నుండుము. వెంబడి నే వచ్చెద'నని కరటకుంబుత్తెంచి కొంతవడికిం దానుం జని ఱేనిం గనుంగొని 'రమ్ము కూర్చుండు వృత్తాంతంబేమి?' యని యాతం డడుగఁ జేరువకుం జేరి యోరసిలం గూర్చుండి యల్లన నిట్లనియె. "నేను బోయిన సమయంబున సంజీవకుఁడు లోని యిరవునం గాటకపాటకులతోడ మాటలాడుచుండి ననుం గనుంగొని వారి తోడి సల్లాపంబు సాలించి ప్రత్యుత్థానంబు గావించి యుచితాసనాసీనుంజేసి కుశల ప్రశ్నంబు గావింపఁ దదవసరోచితంబుగం గొన్ని మాటలాడి యేకాంతం బాకాంక్షించు మాజాడ యెఱింగి కాటకపాటకులు లేచి యెడ గలుగం బోవుడు నయభయంబులు దోఁప వచనీయం బశేషంబు వచియించితి. అతండును దనకుం బోలిన వచనంబులు తెంపరితనంబు దోఁపం బెక్కులు వచియించె. అవియెల్ల నాకు వాకొన మీకు నూకొనం బోలవు. ప్రయోజనంబును లేదు. అతని యుద్యమంబు సమస్తంబు ప్రతికూలం బగుడ తద్వచనభంగి నెఱింగితి. చిరకాలంబు సంగాతంబు గావించినవాఁడం గావునఁ గానిచేతకు నాతండు చేయునుద్యమంబునం దాళం జాలక యాతనికి హితంబుగ నాకుం దోఁచినయంత యొత్తి చెప్పితి. ఎంత చెప్పిన నతండు 'తానుబట్టిన కుందేటికి మూఁడే కాళ్ల'నుచున్న వాఁడు. 'వినాశకాలే విపరీతబుద్ధి' యను వచనం బేల తప్పు? కాలం బాసన్నంబైన నాతని కిట్టకుబుద్ధి పుట్టెం గాఁబోలు. అతఁడు పర్యవసానంబునం దన యుద్ధోద్యమంబు తెల్లంబుగం బలికి 'యింక నాకడంకకు నడ్డవాట్లు వ్రేయకుము. నేనిదె వచ్చెడం గట్టాయితంబై యుండు మని ఱేనికిం జెప్పుము, లెమ్ము, పొ'మ్మని దిట్టతనంబు మీఱం బలికె. అతం డింతకుఁ గృతసన్నాహుండై డాయవచ్చు చుండు. కర్తవ్యాంశంబు దేవరచిత్తంబునకె విదితంబు." నావిని "యహహో సాహసంబు! ప్రళయ జ్వలనంబుపయి శలభంబు విలంఘింపం దలంచె. ఔర! కావరం" బని యధిక్షేపించుచుం గ్రోధ దుర్నిరీక్షుండయి హర్యక్షవల్లభుండు విపక్ష శిక్షా దీక్షంబూని సముత్థితుండయి నిర్గమించి ఖుర ప్రహారంబుల దుమారంబు లాకాశంబు నిరవకాశంబుగం దిరోహించి ప్రావృషేణ్య ధారాధర వారంబు విడంబింప ధరాతలం బబీదుర దురవలోక భీకరాకారంబు మీఱం బారు తెంచు నుక్షాధ్యక్షు వీక్షించి ధరాధరంబులు మారుచెలంగ క్ష్వేళారావంబు గావించి సటాఝాటంబు నిక్కం గర్ణంబులు ఱిక్కించి పింగళేక్షణంబుల విస్ఫులింగంబు లెగయ నరాళ దంష్ట్రాకరాళంబుగ నాస్యగహ్వరంబు దెఱచి జిహ్వాపల్లవం బల్లార్చుచుం గుప్పింపం జొప్పుఁ దప్పించి వృషభేంద్రుండు సముత్క్షిప్తవాల విక్షేపంబు మీఱంబెల్లు ద్రుళ్ళి వెనుకటికాళ్ళం బయల జాడించుచు భూనభోంతరంబు బూరటిల్ల నుదారారావంబు గావించుచు మస్తకంబు వాంచి యేట వాలుగం కొమ్ము లొడ్డుకొని మెఱపు మెఱసిన తెఱగున నుఱికి యురమ్ము గ్రుమ్మ నమ్మెకమ్ములయెకిమీఁడు సొమ్మసిల్లి తెప్పునం దెప్పిరి ముప్పిరిగొను కోపంబు దీపింప నాటోపించి లాఘవంబున లంఘించి వజ్రసఖంబులగు నఖంబు లూడుకొన మూఁపురంబు చఱిచినం దొరుంగుకీలాలజాలంబు నగశృంగ నిస్సరజ్ఝరీ పూరంబు ననుకరింప గోవల్లభుండు తొలంగక మలంగి శాతశిఖరంబులగు ఖురంబులు కరంబు డిగ నురంబు దాఁచిన నత్తాపుకంటెం దత్పరాభవంబు గుండియ లవియింప బెండువడి కంఠీరవ వల్లభుండు దండతాడిత భుజంగంబుభంగి రోఁజుచు నిలువం గరటకుండు దమనకుం జూచి 'యవలోకించితే? భవదీయదుర్మంత్ర శ్రవణఫలంబు ఱేఁడనుభవించెడు. ముందు నీవు మృగరాజు తోడ సంజీవకునకు మైత్రి పుట్టించితివి. పిమ్మట జూపోపక యిరువురకు భేదముఁ బుట్టించితివి. మొదల దూరము విచారింపవయితివి. పండితమాని యగు భృత్యుండు తనక కాదు స్వామికి సహితము హాని పుట్టుంచును. ఆహాహా! మన యధీశ్వరుం డిప్పుడు మహాపదం బొందియున్నవాఁడు. ఇప్పుడీ యిడుమకు రాజును దలంగునెరవు పరికించితిమేని వలంతులమ. పొంకంబుగా బింకంబులు నూఱాడవచ్చును. గాని యొక్క పోరామి వచ్చినప్పుడు కార్యంబు పయివేసికొని సంబళించుట సుకరంబుగాదు. రాజును గుణవంతునేని దుర్జన సేవితుని హ్రదంబును గమలషండమండితంబునేని గ్రాహాక్రాంతంబుం బోలెం బ్రజలు డాయవెరతురు. స్వార్థపరుఁడ వయి యెట్టి యనర్థంబు పుట్టించి రాజు నేకాకింజేసితివి. భృత్యుల నేరిం జేరనీవు. ఏ వారిం జేరనీక యందరి కార్యంబులు పయి వేసికొని తిరుగువాఁడు తాన రాజునకుఁ బగవాండగును. అసాధువులకు హితంబు గావించువాండుంబోలె సాధువుల కహితంబు గావించువాఁ డవశ్యంబు గీడు నొందును. భృత్యుండు స్వామికి హితాపాదియయి తత్ప్రసాదంబునం బడసిన సంపద యెన్నఁటికి నశింపదు. అహితంబు గావించి గడియించినది కడువడిం జెడిపోవును. కొంరఱర్థ శాస్త్రానభిజ్ఞులయ్యుం బండిత మానులయి తామకృత్యంబులు నిర్ణయింతురు. ఫల వైపరీత్యంబున దైవప్రాతికూల్యంబు నిమిత్తంబుగ వచియింత్రుగాని తమ యజ్ఞానంబు దలంపరు. అట్టి మూర్ఖులకు బుద్ధిఁ జెప్పఁగడంగువాఁడు వానరములకు బుద్ధిఁ జెప్పఁబోయిన సూచీముఖమువలె హానిఁ జెందును. నీ కాకథ చెప్పెద వినుము.'

***

(మి.భే.-14)

హిమవంతంబు ప్రాంతంబునం గుసుమ ఫలసంతాన కాంతంబగు కాంతారంబు గలదు. అందలి కపిసందోహం బొక్కనాఁడు శీతంబుచే బాధితంబయి జ్యోతిరింగణ సంఘంబుం గనుంగొని యనలంబను బుద్ధిఁజేసిడాసి చలి గాఁచి కొనుచుండ సూచీముఖం బనుపక్షి వీక్షించిఁ 'యోయి వెఱ్ఱులారా! యివి నిప్పుకలుగావు. మిడుంగుఱుం బురువులు, చూడుండాచాయ నల మహీరుహంబు చేరువ నింగలంబు గానంబడియెడు. అటకుం జని చలి కాచికొం'డన నందొక్క మర్కటం బా మాటలకు గాటంబగు కోపంబు దీపింప 'నీవా మాకుఁ గర్తవ్యోపదేష్ట?'వని నిక్కి వెక్కిరించి గ్రక్కున లంఘించి దానిం బట్టి నేలంగొట్టి కాలంబు తుదముట్టించె.

***

బుద్ధిహీనునికి బుద్ధిమంతుఁడు చెప్పిన వచనము హితంబుగాఁ దోఁపదు. లోకంబునందుఁ బ్రియవాదులు పెక్కండ్రు గలరు. హితమాడువాఁడు దుర్లభుండు. హితవాదికంటె హితశ్రోత కడు దుర్లభుండు. తనకు మేలుగోరి పరులకుఁ గీడు రోయు వాఁడు తప్పక చెడిపోవును. తొల్లి నందిగుప్తుం డను వాఁడు సుదర్శనగుప్తుండను వాని మోసపుచ్చం దలంచి తన తండ్రిని, ధనంబును గోలుపోయెను. ఆ కథ నీకు సాకల్యముతో వాక్రుచ్చెద నాకర్ణింపుము.

జనావతి యను పట్టణమునందు సుదర్శనగుప్తుండు నందిగుప్తుండను నను బేహారు లిద్దఱు తద్దయు సౌహార్దంబు గలిగి వర్తింతురు. వారు ధనంబు సంపాదింప దలంపుగొని లాతివిలాతికిం జని కొంతకాలంబు పాలిబేరంబు గావించి యభిమతం బొడ గూడుడు నభిజనంబునకు మరలి యరుదేర నందిగుప్తుండు సుదర్శనగుప్తున కిట్లనియె. 'మనము ధనంబానయించుట ప్రకటింపంజనదు. న్యాయార్జితం బిది యెవ్వరెఱింగినం గొఱంతయేమి యనకుము. సరఘాసముత్కర సమార్జితంబగు మధువుం గరుణఁ దొరగి లోకులు చేకొండ్రుగాదె? కావున నగరంబు పఱగడ నెక్కడ నే నొక్కయెడ మన రొక్కంబు గుప్తంబు గావించి పోవుదము. వలసినతఱి వచ్చి పుచ్చికొంద'మనిన నొడంబడి యాతండు నాతండును ధనంబు సర్వంబొక బిందియం బొందుపఱిచి సాభిజ్ఞానంబుగ నొక్క వట మహీరుహంబు చేరువ లాఁతు లెఱుంగకుండం బాఁతి తమ యిరవుల కరిగి యెప్పటి చొప్పుదప్పక చెలిమిగలిగి సుఖంబుండిరి. ఇట్లు కొంతకాలంబు గడచిన నొక్కనాఁడు నందిగుప్తుఁడు గుప్తప్రకారంబునం జని యా బిందియం గ్రొచ్చి పుచ్చికొనివచ్చి డాఁపఱికం బొనరించి పిదపం గొంతకాలంబునకు సుదర్శనగుప్తుఁ గనుగొన 'మనము ధనము గొని వత్తము. మనకింక శంకింపం బని లేదు. పెద్దకాలంబు లోకులం గను మూసితిమి. ఇప్పుడు మనయొద్ద రొక్కంబులేదని యుల్లంబులం దెల్లరు విశ్వసించి యున్నవారు. వెఱలెఱింగినం గొఱంత లేదు. రాజస్వంతంబగు విషయంబున వసించుచున్న వారము. చనుదె'మ్మని తోకొని చని గురుతు పరికించి యచ్చటంగ్రొచ్చి చూడ ధనంబు గనంబడదయ్యె. అంత నందిగుప్తుండు తన ముందట విషణ్ణుండయి నిలుచున్న సుదర్శనగుప్తుం జూచి కరంబున నురం బప్పళించుకొని 'యోరి మిత్రద్రోహి! యాహా యెంత పని చేసితివిరా! ఎప్పుడో యొంటివచ్చి ధనంబపహరించి యేదియు నెరుంగనివాని తెఱంగున నాకెదుర విషాదం బభినయించి దక్కించికొనం జూచెదవే. ఇచ్చటం బాతిన ధనంబు మనము దప్ప నన్యులెవ్వరయిన నెరుంగుదురే! అది నీ వెరుంగకుండం గాళ్ళు వచ్చి నడిచిపోయెం గాఁబోలు. కానిమ్మురా నిన్నుం బోనిచ్చెదనే! వారి వీరివలె నందిగుప్తుం డలంతులం బోవువాఁడని తలంపకుము. నా సొమ్ము నీ చేతం గ్రక్కింపకున్న నేనొక్క మగవాఁడనే?' అనుచుం గినుక యెచ్చుగం దెచ్చుకొని గ్రక్కున బయిరవాసంబు పుచ్చి నడుమున బిగియం జుట్టుకొని సుదర్శనగుప్తుం గటి వస్త్రంబునం గరంబునం జొప్పించి 'దివాణంబునకు రమ్ము. నీ వక్కడంగాని చక్కంబడ'వని యాకర్షింప సుదర్శనగుప్తుండు మనంబునం దేవగించి 'యూరక యేల నేల విడిచి సాము చేసెదవు? తాళుము. నా పలుకులు విని యావల నీకుం బోలినట్లు చేయుము. పట్టువదులు' మన నందిగుప్తుండు 'నాలుక మిగుల రానీకుము. నీ కుందాళిక యుండుంగాని సొమ్ముం గోలుపోయిన నాకుం దాళికకు నెంతదూరంబు? భళి! యింతచాలక నీ పలుకులు సహితము వినవలయుగా! నిన్ను విడిచెదనే' యన సుదర్శనగుప్తుండు 'నీవు రమ్మన్న చోటికి వచ్చెదం బోదము. చేపట్టు విడువు' మని విడిపిమ్చుకొని వెంబడింబోవ నాతండు నృపుని పాలికిం బోయి తన వృత్తాంతంబు సమస్తంబు నివేదింప రెండవ యాతండును 'మహాప్రభో! అట్లు మేమిద్దఱము ధనంబు గుప్తంబు గావించి యిప్పుడు గ్రొచ్చిచూడం గానం బడదయ్యె. నేనింత యెరుంగుదు. మరియొక్క పాపం బెరుంగ' నా విని పార్థివుండు ధర్మాధికృతుల రావించి వాదిప్రతివాదుల నప్పగించి 'వీరల తగవు దీర్చుండ'ని నియోగింప వారు వారి వాదం బవధానంబుతోడ నవధరించి వాదిం జూచి 'బ్రతివాది త్రవ్వి ధనము గొనినందులకు సాక్షులున్నారా?' యని యడిగిరి. 'అయ్యలారా! దొంగ పెఱెఁరుగ దొంగలించునా? మేము ధనంబుఁ బాఁతినచోట వటవృక్షం బొక్కండు దక్క నన్యంబు లేదు. కటకటా! యింక నే నెక్కడ నుండి సాక్షిం దెత్తు!' నని యాననంబు దీనంబు గావించుకొని పలికి కొంత చింతించి వెండియున్నిట్లనియె. 'ఇదెనా శపథంబు వినుండు.

నేను మాతాపితలకు భక్తుండనేని స్వప్నావస్థయందయినం బర ద్రవ్యంబు హరియింపం దలంపనేని సత్యశీలుండ నేని నవ్వటవృక్షంబు గుణగణ్యుల రగు మీరెల్లరు విన సాక్షిభావం బవలంబించి సత్యంబు పలుకుంగావుత?' మని యెలుగెత్తి పలుక 'నీతం డెట్టి మహానుభావుండో యిట్టి శపథంబు గావింప మఱి యొక్కనికి శక్యంబే?' యనుయు 'శపథ మాత్రంబున నేమయ్యె జెప్పిన చొప్పు తుదముట్టఁజూడక యిదమిత్థమ్మని నిశ్చయింపరాదు. కల్లనిజంబులు దైవంబెరుంగు' ననియు 'బరికింప నీతండె ధనం బపహరించి యాతనిపయి నిందమోపి తాను సత్యశీలుం డనిపించి కొనవలయునని యింత గొంతు గావించెడుం గాబోలు! ఱంకుటాలికిం గ్రొత్తడి సుద్దులు పెక్కులుగావె?' యనియు నచ్చటం జూపరు పెక్కు తెఱంగుల నాడికొనుచుండ సభాసదులు కరంబు వెఱంగుపడి యన్యోన్యముఖావలోకనంబు గావించి యిట్టి శపథం బశ్రుతచరంబని ముచ్చటించుచు నవ్వణిజులం జూచి 'నేఁడు మిక్కిలి ప్రొద్దువోయె. ఱేపు వరువాత రండు. మీ వివాదంబు పరిశీలించెద' మనవుడు 'వల్లె'యని వారలు తమ నిలయంబుల కరిగిరి. అంత నందిగుప్తుఁడు నాఁటిరేయి నిజగృహ బహిర్ద్వారంబు కవాటపిహితంబు గావించి గర్భాగారంబుంజేరి తన జనకుని రావించి యతనితోడ భూగుప్తధనాపహరణం బాదిగ స్వకృతంబు సర్వంబు నివేదించి యిట్లనియె. 'అర్థంబు సకల పురుషార్థ సాధనంబు. ధనంబునకు దుస్సాధ్యం బొక్కండు లేదు. లోకులు కులవిద్యారూప గుణవిహీనునేని ధనవంతుని సర్వసంపన్నుండని వచియింతురు. సకల దురితంబులకు దారిద్ర్యంబుం బోలె సకల దురితక్షపణంబునకు నర్థంబు నిధానంబు. తదార్జనంబునకయి చేయు దురితంబు పాచితంబునంబాచి కొనవచ్చుఁ గాన నెవ్విధంబుననేనిఁ బురుషుండు ధనం బార్జింప వలయునని నీతికోవిదులు వక్కాణింతురు. దానంబట్టి యొక్కమయి రొక్కంబు సమార్జించితి. హస్తగతం బగు విత్తంబు దక్కించుకొని వెరవు గలిగియు వీఱిండితనంబున జాఱ విడువ నేల? ఒక సదుపాయంబు చింతించియున్నవాఁడ. వినుము. జాగుసేయక వేగకమున పోయి యా మఱ్ఱితొఱ్ఱ నడంగి యదృశ్యండవయి యుండుము. రేపు ధర్మాధికృతులు చనుదెంచి యావృక్షంబు నడుగుతఱి జంపు గావింపక "యిచటి ధనంబు సుదర్శనగుప్తుండు హరియించె" నని యొత్తి పలుకుము. ఇంత మాత్రము నాచెప్పిన చొప్పు గావించితేని మన పక్షంబు జయించు' నన విని యాతండిట్లనియె. 'ఉపాయంబు చింతించుచో రాఁగల యపాయంబు సహితము చింతింప వలయును. లేనిచో శాబకంబుల గాచికొనంబోయి కోలుపోయిన బకంబు చందంబగు. ఆ కథ నీకుం జెప్పెద నాకర్ణింపుము.

***

(మి.భే.-15)

ఒక నింబవృక్షంబు మీఁద ఒక మిథునంబు చేరి వాసంబు చేయుచుండు. అంతం గొంతకాలంబునకు బకాంగన గర్భంబు దాల్చి తన భర్తతోడఁనేగి యక్కడక్కడం జిదుగులు ముక్కునం గరిచికొని కొనివచ్చి గూఁడు పన్నికొని యండంబు లిడి పొదిగి బోదలం గావించి యేదుచు నొక్కనాఁడు తన పెనిమిటి కిట్లనియె. "వినరుగా నేఁడొక్క విహంగమాంగన చెప్పవింటి. తొల్లి యీ వృక్షంబుమీఁదం బక్షు లనేకంబులు వసియించుచుండ వాని పిల్లల నెల్ల నీక్రింది పుట్టలోని కాలభుజంగంబు భక్షించిపోవ దాని రాయిడింబడం జాలక యా పులుంగు లెల్ల వలసపోయె నఁట. ఈ వృత్తంతంబు విన్న యప్పటంగోలె నామనం బెరియు చున్నయది. ఎరుంగక యీ తరువు చేరితిమి. అక్కటా! యీ నెత్తురుఁగందుల నొక్క యిడుమ దొడరిన నేనెట్లు సయిరింతు?" నని బొట బొటం గన్నీరు దొరుగ నెలుంగు కుత్తుకం దగుల మాటరామి నూరకున్న దయితం గనుంగొన్ని బకోటంబు దానుం గొంత చింతించి "యేల యూరక యుమ్మలించెదు? మన మమ్ములికం బడి కొండొక కార్యంబు సాధింపంబోయెదమె? ఊఱడుము. శత్రువుం బరిమార్చు వెరవు మనంబునం దొక్కటి పరికించితి వినుము. ముంగి పొద దొరకకొని యీ పుట్ట దనుక నక్కడక్కడ నొక్కొక్క మీనంబును వయిచి యుంచెద. అట్లు చేసిన మన యిష్టంబు సిద్ధించు" నని పలికి యాక్షణంబు పోయి కొలఁకున మీలంబట్టి యట్లు వయిచి యుంచుడు ముంగిస పొగరు వెడలి యమ్మీనంబులం దినుచు వచ్చి పుట్టపట్టుంజేరి యాయురగంబుం బరిమార్చి యాభూరుహం బారోహించి బకశాకంబుల భక్షించి చనియె.

***

కావున నొకండు సేయంబోయిన మరియొక్కండగు. వ్యవహారం బడుసునం బాఁతిన కంబంబు తుదకు నేవంకకు నొఱగునో యెరుంగం బడదు. కావున నిక్కార్యంబు శ్రేయంబు గాదని నాకుందోచెడు' ననిన నందిగుప్తుండుట్లనియె. 'మొదలం దోఁచిన యుపాయంబుం బట్టి పురుషుడు ప్రవర్తింపవలయుం గాని యుపాయంబున కపాయంబు, నపాయంబున కుపాయంబును జింతింప దొరకొనిన నెక్కడికి మందల? సందియంబు నొందకుము. కాదనక నా వచనంబు నడపుము. మనకు సమస్తంబు శస్తంబయ్యెడు' నని బోము గావించి యెట్టకేలకు నీకొన్న పితరుని దొంగరేయిటం గొంపోయి యా మ్రానిలోని కోటరంబున మాటుపఱచి యిరవుల కరుదెంచికొఱ రేయింబుచ్చి రేపకడ ధర్మాధికృతులకడకుం బోవుడుం బ్రతివాదియు నరుదేర వారిద్దఱరం దోకొని దిదృక్షానుయాయి జనకలకలంబు రోదోంతరంబు నిండం బురంబు వెలువడి శ్రుతచరాభిజ్ఞానంబు బట్టి యవ్వటవృక్షంబు చేరఁబోయి నిలిచి 'యో వృక్షరాజంబ! ఈ వాది ప్రతివాదులిచ్చట ధనంబు గుప్తంబు గావించి యనంతరం బేమి గావించిరి? ఈవు సాక్షివగుటంజేసి యెరింగినది సర్వంబు సత్యంబుగం బలుకు' మనుటయు 'నిచ్చటం బాఁతిన ధనం బొక్కనాఁడర్థరాత్రంబున నొక్కరుఁడు సుదర్శనగుప్తుండు వచ్చి కొంపోయె'నని యావృక్ష విటపమధ్యంబు నుండి శబ్దంబు నీతరందత్రత్య జనంబులు చిత్రంపడి చిత్ర ప్రతిమల రూపంబునం జూపట్ట సుదర్శనగుప్తుండు కొండొక మనంబున విచారించి ధర్మాధికారులం గాంచి 'యార్యులారా! ఇది నిక్కంబని తలంపకుడు. వృక్షంబన నెక్కడ! సాక్ష్యంబు పలికెనన నెక్కడ! "పృష్ఠతాడనాద్దంత భంగ" యన్నట్లున్నది. ముదలయిచ్చితిరే నిప్పుడ యీ వృక్షంబు సాక్షిభావంబు మీకెల్లం దెల్లంబుఁ గావించెద నని వేఁడికొని తదనుజ్ఞాతుండయి యా వృక్షం బారోహించి దానికొమ్మలయుంబడుకొమ్మలయు నంతరంబు లెల్ల నారసి స్కంధశాఖ నొక్కంట మహాగుబాయుం బోలె విశాలాంతరాళంబయి తమోమయంబగు కోటరంబు గాంచి లోనంజొర వెరచి యెండుగాదంబు సందెడు దెప్పించి యందుం జొప్పించి యింగలంబిడి దరికొలుపుడు మహాభీలంబగు జ్వాలాజాలంబుచేఁ బొదువంబడి మేను గమర నంతర్వర్తియగు ముదివగ్గు బెగ్గిలి వెగ్గలంపుఁ దాపంబున కోపక మొఱయిడుచు వెలికుఱికి నేలంబడ "నీ వెవ్వడవు? నీ వృత్తాంతంబేమి?" యని ధర్మాధికృతులచేత ననుయుక్తండయి "యేను నందిగుప్తుని పితరుండ. వాడు నామాట పెడచెవింబెట్టి నాకిట్టి యాపదం బుట్టించె" నని చెప్పి కరం బారటం బడుచుం బ్రాణంబులు దొఱంగె. అంత ధర్మాధికృతులు సుదర్శనగుప్తునకుఁ బాతిన ధనం బెల్ల దెప్పించి యిప్పించి నందిగుప్తుం గొఱుత వేయించిరి.'

అని చెప్పి కరటకుండు వెండియు నిట్లనియె. "మొదల దూరంబు విచారింపక నీ పలుకులీ కొంటి నిది యకార్యంబని ముందు దోఁపదయ్యె. సంజీవకుండెన్నడే నొక్క యపకారంబు మనకు గావించినవాఁడె? నిర్దోషుం డాతని కెడరు పుట్టించితివి. పాపిష్ఠుండ నేనును సహాయుండనయితిని. ఇది మనకు శ్రేయంబు గాదు. పరుల వంచింపబోయినవాడు తాన వంచితుండగును. ఇందులకు నిదర్శనంబుగ నొక్క కథ వక్కాణించెద వినుము.

***

(మి.భే.-16)

అజస్తుందంబను పట్టణంబునం దింద్రపాలితుండను వణిజుండు గలఁడు. అతనికి ధనగుప్తుండను మిత్రుడుగలడు. ఇంద్రపాలితుండు తన యింటనున్న యరువది బారువుల లోహంబు కూలివాండ్రచే నెత్తించికొని తన మిత్రుని కడకుం బోయి 'యోయన్న! ఉన్నట్టుండి దేశాంతరము పోవలసిన పని వచ్చినది. మానువయితిగాదు. ఱేపు పయనము. ఈ లోహము నీ యొద్ద నుంచుకొనుము. నిరుడీ సరుకు నీతోఁగూడి కొన్నది. వెల యెరుంగుదువు గదా? వరహాకు లాభము దుగులము వచ్చినం జాలు. కొను మొదలున కప్పటికైన వడ్డీతో నేఁజెప్పిన లాభము వచ్చెనా విక్రయింపుము. పరుల వలన నీవు పుచ్చుకొను వాడుకచొప్పున సడితి పుచ్చుకొనుము. నేఁజెప్పిన చొప్పున వెలరాని పక్షమున సరుకు కదలింపఁబోకు. లోహము చెడిపోవునదిగాదు. నేఁడు దప్పిన రేపు నిలుకడ మీఁద మంచి వెలకు విక్రయించుకోవచ్చు. పయనము దాపు గనుక మిక్కిలి పనియున్నది. క్షణమయిన నిలువఁదీఱదు. సర కొప్పగించుకొనుము.' నావుడు నవ్వర్తకుం డిట్లనియె. 'నేను నీ కన్యుఁడనా? నాకింత చెప్పవలెనా? నీ విచ్చునట్టి యడితికా పని చూడవలె? గురువుసాక్షిగా జెప్పెద వినుము. నీ సొమ్ము నా సొమ్ముగా జూతునుగాని వేరుగాజూడను. నమ్ము'మని యినుమొప్పగించుకొనియె. అంత నింద్రపాలుతుం 'డన్నా! నావల నీకు మిక్కిలి శ్రమంబయ్యె. పోయి వత్తునా? సెలవిచ్చెదవే?' యని పలికి పోయి 'శీఘ్రముగా సురక్షితముగా వచ్చి చేరు'మని యాతనిచే నాజ్ఞాతుండయి వీడ్కొని చని మరునాడు వేఁ బోక లేచి దేశాంతరము వోయి తన కార్యంబు నెరవేర్చుకొని కొంతకాలమునకు మరలి యరుదెంచి యవ్వర్తకునిం గానం జని తత్కాలోచితంబుగ నాతండభ్యుత్థానం బొనరించి కుశల ప్రశ్నంబు గావించి ప్రయాణ వృత్తాంతం బడుగం వాణిజ్యంబునందలి యోగక్షేమంబులు విచారించి 'యిప్పుడు లోహము కొంతవెల హెచ్చియున్నదని విన్నాఁడను. మన లోహమేమయ్యె!' నన్న వాఁడు మొగంబున విన్నఁదనంబు దెచ్చుకొని యిట్లనియె. 'మునుపు నీతోఁ గొన్న లోహము నిలువ కొంచెముండగా దానితో నీ లోహము గదిలోఁ బెట్టి తలుపుమూసి తాళముబెట్టి పదిలము చేసితిని. నిన్న కొందరు వర్తకులు వచ్చి లోహము కావలెనని యడిగిరి. ఆ మీఁదట గది తలుపుదీసి చూతుఁగా లోపల లోహమను పేరు లేదు. నా సొమ్ము పోయినదానికి నాకంత వెనుఁబాటు లేదు. మిత్రుఁడు విశ్వసించి యిల్లడవెట్టిన సరకాతడు రాగానే "నాయనా యిదిగో నీ సొమ్మ" నక పోయితి నని చెప్పవలసి వచ్చెఁగా యని యేది తోఁపక రాపడి నిలిచితిని. నాయందు విశ్వాసముచేత నీవు నష్టమొప్పుకొంటివిపో లోకులు మెత్తురా? నానాఁడెము దక్కునా?' యని చింతాకులితుండుంబోలె గొంతసేపూరకుండి నిట్టూర్పు నిగిడించి యిట్లనియె. 'గది తలుపుమూసి పెట్టిన తాళము పెట్టినట్టుండగానే లోని సరకు మాయమయిపోకకు నిమిత్తమేమని నిపుణముగా నాలోచించి చూచితిని. మాయింట నెలుకల రాయిడి మెండు. ఏ సరుకు గాని బ్రతుకనీవు. అవి మన లోహమును వాతఁగొట్టుకొని పోయెనని నిశ్చయించితిని.' నావిని యింద్రపాలితుండు వాని మోసము తెలిసికొని యిట్లు చింతించెను. 'వీడు నాసొమ్ము దక్కించుకోవలెనని యీ వఱకిన్ని మాటలు పన్నినాడు. మారు మోసముచేసి వీనివలన సొమ్ము రాఁబట్టుకోవలెగాని లాతి యుపాయముచేత రాబట్టరాదు.' అని తలంచి భావ వికారం బేమియు మోమునఁ దోపనీక యడఁచికొని యిట్లనియె. 'అన్నా! దీనికింత దూరము నీవు చెప్పవలెనా? నేను గ్రొత్త వాఁడనా? నీ స్వభావ మెరుంగనా? దైవము వలన వచ్చిన సేగికి మనమేమి చేయుదుము? దీనికి నీవు చింతపడకు. పోయి వచ్చెదను.' అనిచెప్పి సెలవుపుచ్చుకొని తన యింటికి బోయి యా మరునాడు మొదలుకొని యెప్పటివలె మిత్రభావ మెక్కించుకొని యా వర్తకుని యింటికి రాకపోకలు చేయు చుందెను., ఒక నాఁడింద్రపాలితుండు ధనగుప్తునితో ముచ్చట లాడుచుండగా వీధియందు గొలుగుబండ్లో గొలుగుబండ్లని పండ్లశబ్దము వినబడెను. అది విని ధనగుప్తుని బిడ్డఁడు గజ్జెలు గల్లుగల్లన నజ్జలు ద్రొక్కుచుఁగుసిలించుచు నేడ్చుచుం దండ్రిని బట్టుకొని పండ్లుగొని యిమ్మని లాగుచు రొచ్చు పెట్టెను. అంత నింద్రపాలితుండా బిడ్డని జంక నెత్తుకొని 'నా తండ్రిగా నా బంగారుగా యేడువకేడువకు. పండ్లుకొని యిచ్చెద ర'మ్మని పండ్ల గంప దూపము పోవుంటఁబట్టి వెంబడించు నెపమున గొనిపోయి యొక్క యేకాంత స్థానంబున డాచి యాననంబున దీనభావంబు దెచ్చుకొని మరలి యరుదెంచుచుండ ధనగుప్తుండు గనుగొని 'బిడ్డండేడి?' నావుడు నాతం డిట్లనియె. 'చంకబిడ్డని నేలదించి పండ్లు బేరమాడు చుండితిని. ఇంతలో నెక్కడి నుండియో యొక పాడు గద్ద వచ్చి బిడ్డనిం దన్నుకొని పోయెను.' అనఁగానే ధనగుప్తుండు చేత ఱొమ్మప్పళించుకొనుచు నిట్లనియె. 'ఓరి పాపి! ఎంత పాతకమున కొడిగట్టితివిరా. సొమ్మున కాశపడి యింత తెగువకుం బాలు పడుదువా? ఆ శిశువు మొగముచూచి మెడ విరువ నీకు మనసు వచ్చెనా? నీ చేతులాడెనా? ఓరి ద్రోహి! ఓరి చండాలుడా! బిడ్డని గద్ద తన్నుకొని పోవునా? ఈమాట యెవరయిన నమ్ముదురా?' అని శోక క్రోధపరీత మానసుండయి కన్నుల నీరు దేఱం బట పటఁ బండ్లు గొరుకుచు వెండియు నిట్లనియె. 'కానీరా సొమ్ముదక్కిన దనుకోకు మిదిగో గ్రక్కించెదఁ జూడు'మని లేచి సత్వరముగాఁబోయి ధర్మాధికృతుల కీ వృత్తాంతము వినిపించెను. అంత వారాశ్చర్యపడి యింద్రపాలితుని రావించి యాతనివలన నావృత్తాంతము విని యిట్లనిరి. 'ఓయి యిప్పటి నీ చెప్పిన యర్థం బశ్రుతదృష్టచరంబు. మాకాశ్చర్యంబు నొడమించెడు.' నావిని యింద్రపాలితుం డిట్లనియె. 'అరువది బారువుల లోహ మీతని యింటదాపం బెట్టి పోయితిని. ఆలోహ మెలుకలు దినిపోయె నఁట. పసిబిడ్డని గద్ద తన్నుకొని పోవుటాశ్చర్యమా?' నావిని యధికారులు జరిగిన యర్థం బెరింగి లోహంబును, బాలకునిం దెప్పించి వారి కొప్పించి ధనగుప్తునకు జోరదండంబు గావించిరి."

***

అని చెప్పి కరటకుండు మరియు నానాప్రకారంబుల దమనకు నుపాలంభించుచుండె.

తదవసరంబున మొగంబులరాయండు వొడవొందిన కాతాళంబునం గడు నదరి మెడజుంజురులు నిక్కబెడిదంవుటుఱుము నుఱని నెఱబొబ్బయిడి చంగున నెగిరి కోలగగ్గెరకుంబోలె నేలం గూలంద్రోచి ముంగాళ్ళ నొత్తిపట్టి కుత్తుకం గఱచి నెత్తురు గుటగుటం ద్రావి యా బసవని నుసురునకుం బాచి ప్రశాంత క్రోధుండయి మరలి యిరవున కరిగి యనుతాపపరీత మానసుండగుచు డాయవచ్చిన కరటకదమనకులం జూచి యిట్లనియె. 'కటకటా! ఎంత దారుణకర్మంబు గావించితిని. భరణ రక్షణంబులం బ్రకృతిరంజనంబు గావించువానికిం జెల్లుంగాని నాకు రాజనామంబు గాల్పనే! దూరము విచారింపక సంజీవకునిం జంపుకొంటిని. విషవృక్షమేని సంవర్దించి తాన ఛేదింపం జనదు. ఎఱిగియే నెఱుంగకే నేరమి యొక్కండు నొనరించిన భృత్యుని నయంబు భయంబుఁ జూపివాని వేఁడుకోలునం దెలపం బడినట్లభినయించి తొలుత మిన్నక విడువవలయు. ఆవల మరికావించిన వాని నిజాధికారంబు వలన దలంగవలయు. ఇంతకు హెచ్చుఁ దీండ్రంబు గానిపింపంబోలదు. కానిపించినం దక్కుంగల లెంక కూటువుకాయువుం దొఱంగు. దాన ఱేనికి దొసంగు పొసంగు నిందు సంశయంబు లేదు. ఎట్టి కడిందికర్జం బయిన సాధింపవచ్చుగాని తగిన భృత్యుని గడియించుట సుకరంబుగాదు. అది యట్లుండనిమ్ము. లోకంబునందు గత కాలము దుర్వారంబయిన దుర్యశంబు దెచ్చుకొంటి. ఇంక నేమి చేయుదు' నని మిన్నక క్రిందు చూచుచుండె. అంత దమనకుం డిట్లనియె. 'స్వామీ! దాయంబరిమార్చి యివ్వడువున నుమ్మలంపడం బోలదు. ఱేడు తను నెరగుపఱుపం గడంగు వాని నేని నొప్పరి కింపక దోరింప వలయునని పాడి నెరినెరింగిన గఱువలు పలుకుదురు. నేరమిం బొనరించిన వారియం దోరిమి తాపసులకుంగాని భూపాలురకుం జనదు. రాజ్య లోభంబు వలనంగాని యహంకారంబు వలనంగాని స్వామి పదంబుం గోరువానికి వధంబు దక్క దండంబు లేదు. ఈ యర్థంబు సర్వసమ్మతంబు'. నావిని పింగళకుండు సంతుష్టుండయి భద్రాసనంబు నధిష్ఠించె. దమనకుండు ప్రహృష్టుండయి 'మహాస్వామీ! దేవరకు లోకంబులకు స్వస్తి యగుం గావుత.' మని వచియించి తాను సకల పరిజనంబులును సుఖంబుండె.

అని విష్ణుశర్మ సుహృద్భేదంబు సాంతంబుగ వచియించి యిట్టి భేదంబు మీరు మీ శత్రువులందు ప్రయోగించి విజయంబుఁ బొందుండన రాజపుత్రులు కరంబు హర్షంబు నొందిరి.

AndhraBharati AMdhra bhArati - bAla sAhityamu - mitrabhEdamu - nItichaMdrika - paMcha taMtramu - paravastu chinnaya sUri ( telugu andhra )