బాల సాహిత్యము నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి మిత్రలాభము
మిత్రలాభము
"ధనసాధనసంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలె స్వకార్యములు సాధించు కొందురు." అనిన రాజపుత్రులు విని "యే కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగా వినిపింపుఁ" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్పఁదొడంగె.
గోదావరీతీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కులనుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాఁడు వేకువ లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతునిఁ జూచి "వఱువాత లేచి వీని మొగము చూచితిని. నేడేమి కీడు రాఁగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువఁదగదు. జాగు చేయక యీచోటు విడిచిపోవలె"నని యత్నము సేయుచుండగా వాఁడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వల పన్ని పోయి చేరువ పొదలో దాఁగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుఁడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీఁది నూకలు చూచి తనతోడి కపోతములతో నిట్లనియె: "ఈ నిర్జన వనమందు నూకలురా నిమిత్తమేమి? మన మీ నూకల కాశ పడరాదు. తొల్లి యొక తెరువరి కంకణమున కాశపడి పులిచేతఁ దగులుకొని మృతి బొందెను. మీకా కథ చెప్పెద వినుండు!
పులి-కంకణము-బాటసారి
ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని గట్టుననుండి 'యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, 'యేదీ కంకణము చూపు'మని యడిగెను. పులి చేయిచాఁచి 'యిదిగో హేమ కంకణము చూడు'మని చూపెను. 'నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు'నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. 'ఓరీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము' అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి 'యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు' మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని - 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.
కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు." అని చెప్పఁగా విని, యొక కపోతవృద్ధము నవ్వి యిట్లనియె - "ఆ! యివి యేటి మాటలు? ఒక యిక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది, వినుండు. స్థానాస్థానములు వివేకింపక సర్వత్ర యిట్టి విచారమును పెట్టుకొనరాదు. కొఱమాలిన శంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా? మానుకొని యేలాగున బ్రతుకవచ్చును? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుఁడు, నిస్సంతోషి, క్రోధనుఁడు, నిత్యశంకితుఁడు, పర భాగ్యోపజీవియు నను వా రాఱుగురు దుఃఖభాగులని నీతికోవిదులు చెప్పుదురు." అనఁగా విని కపోతములన్నియు నేల వ్రాలెను.
గొప్ప శాస్త్రములు చదివి మిక్కిలి వినికిడి గలిగి పరుల సంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభమువల్ల వివేకము పోగొట్టుకొని క్లేశ పడియెదరు. ఆహా! లోభమెంత చెడుగుణము! అన్ని యిడుములకు లోభము కారణము.
అనంతరము పావురములన్ని వలలో దగులుకొని కపోతవృద్ధమును జూచి - "నీవు వృద్ధుఁడవు, తెలిసిన వాఁడవని భ్రాంతిపడి నీ మాటలను విని యీ విపత్తు తెచ్చుకొంటిమి. ఎవ్వఁడు బుద్ధిమంతుఁడో వాఁడు వృద్ధుఁడు గాని, ఏండ్లు మీఱినవాఁడా వృద్ధుఁడు?" అని కపోతములు నిందింపఁగా విని చిత్రగ్రీవుఁ డిట్లనియె: "ఇది యీతని దోషముగాదు. ఆపదలు రాఁగలప్పుడు మంచి సహితము చెడుగగుచున్నది. మన కాలము మంచిదికాదు. ఊరకే యేల యీతని నిందించెదరు? ఈతఁడు తనకుఁ దోచినది చెప్పినాఁడు. అప్పుడు మనబుద్ధి యేమయ్యె? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొను సాధనము విచారింపవలెఁగాని, యీ మాటలవల్ల ఫలమేమి? విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము. కాఁబట్టి యిప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుఁడు. ఇప్పటికి నాకొకటి తోఁచుచున్నది. మీరందరు పరాకు లేక వినుఁడు. ఒక్కసారిగా మనమందఱము వలయెత్తుకొని యెగిరిపోవుదము. మన మల్పులము, మనకీ కార్యము సాధ్యమగునా యని విచారింపఁ బనిలేదు. సంఘీభవించి యెంతటి కార్యమయిన సాధింపవచ్చును. గడ్డిపరకలు సహితము వెంటిగా నేర్పడి మదపుటేనుఁగును బంధించు చున్నవి. మీరు విచారింపుఁడు. దీనికంటె మంచిసాధనము మీ బుద్ధికిఁ దగిలెనా యది చేయుదము!" అనిన విని, "మీరు చెప్పినదే సరి, యింతకంటె మంచి సాధనము లే"దని చెప్పి పావురములన్ని విచిత్రముగా గగనమార్గమున కెగిరెను. అప్పుడా వ్యాధుఁడు వెఱగుపడి "ఈ పక్షులు గుంపు గూడి వలయెత్తుకొని పోవుచున్నవి. నేల వ్రాలఁగానే పోయి పట్టుకొనియెదఁగాక" యని చింతించి మొగము మీదికెత్తుకొని ఱెప్పవ్రేయక చూచుచు నవి పోవుదిక్కునకై క్రిందనే పోవుచుండెను. ఈ వింత చూడవలెనని లఘుపతనకము పావురములను వెంబడించి పోవుచుండెను. అనంతర మా పక్షులు చూపుమేర దూరము మీఱి పోగానే వ్యాధుఁడు నిరాశ చేసికొని మరలి పోయెను. అది చూచి యిప్పుడు మనము చేయవలసినది ఏమియని పక్షులడిగెను. చిత్రగ్రీవుఁడిట్లనియె - "లోకమందు మాతాపితలు మిత్రుఁడను వీరు మువ్వురే హితులు. తక్కిన వారందఱు ప్రయోజనముఁ బట్టి హితులగుచున్నారు. కాఁబట్టి యిప్పుడు నాకు మిత్రుఁడొకఁడున్నాఁడు. అతఁడు హిరణ్యకుఁడను మూషికరాజు. గండకీతీరమందు విచిత్రవన మాతని వాసస్థానము. అతఁడు పండ్ల బలిమిచేత వలత్రాళ్లు తెగఁగొఱికి మన యాపదఁ బాపఁగలఁడు. అక్కడికి మనము పోవుదము." అని చెప్పగానే పావురములన్ని చిత్రగ్రీవుఁడు చెప్పిన గురుతు పట్టుకొని పోయి హిరణ్యకుని కలుఁగు దాపున వ్రాలెను. అప్పుడు హిరణ్యకుఁడు కపోతములు వ్రాలిన సద్దువిని భయపడి కలుఁగులో మెదలకుండెను. అనంతరము చిత్రగ్రీవుఁడు కలుఁగుదాపు చేరి యెలుగెత్తి యిట్లనియె - "ఓ చెలికాఁడా! యేల మాతో మాటలాడవు?" అనగానే హిరణ్యకుఁడా మాట సవ్వడి పట్టి శీఘ్రముగా లాఁగ వెలుపలికి వచ్చి యిట్లనియె: "ఆహా! యేమి నా భాగ్యము! నా ప్రియమిత్రుఁడు చిత్రగ్రీవుఁడు నాకు నేత్రోత్సవము చేయుచున్నాడు." అని పలుకుచు వలలోఁ దగులుకొన్న పావురములను చూచి వెఱఁగుపడి క్షణమూర కుండి "చెలికాడా ! యిది యేమని" యడిగెను. చిత్రగ్రీవుఁడిట్లనియె "చెలికాడా! యిది మా పూర్వ జన్మ కర్మమునకు ఫలము. చేసిన కర్మ మనుభవించక తీరునా?" అనగానే హిరణ్యకుఁడు చిత్రగ్రీవుని బంధము ఛేదించుటకయి సమీపింపఁగా చిత్రగ్రీవుఁడిట్లనియె. "చెలికాడా! చేయవలసిన దీలాగున కాదు. ముందుగా నా యాశ్రితుల బంధము వదలింపుము. తరువాత నాకుఁ గానిమ్ము." అనిన హిరణ్యకుఁడు విని యిట్లనియె: "నా దంతములు మిక్కిలి కోమలములు. అన్నిటి బంధములు కఱచి త్రెంపజాలను. పండ్ల బలిమి కలిగి నంతదాఁక నీ బంధము ఛేదించెదను. తరువాత శక్తిగలిగిన పక్షమున మిగిలిన వారి కార్యము చూచుకొందము." అనిన విని చిత్రగ్రీవుఁ డిట్లనియె. "ఆలాగుననే కానిమ్ము. శక్తికి మీఱి యేమి చేయవచ్చును? ముందు యథాశక్తి వీరి నిర్బంధము మానుపుము. ఆవల నాపని యప్పటికయిన యట్లు విచారించుకొందము." అనిన హిరణ్యకుఁడిట్లనియె.
"తన్ను మాలి పరుల రక్షింపవలెననుట నీతికాదు. 'తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము గలదా?' యను లోకోక్తి విన్నాఁడవుగావా? తాను బ్రతికికదా సమస్త పురుషార్థములు సాధించుకోవలె? తాను బోయిన తర్వాత దేనితో నయినఁ బనియేమి?" అన విని చిత్రగ్రీవుఁడిట్లనియె. "చెలికాఁడా! నీవు చెప్పినది నీతి, కాదనను. అయినను నా వారి దుఃఖము చూచి సహింపఁజాలను. కాఁబట్టి యింత నొక్కి చెప్పితిని. ప్రాజ్ఞుండు దన జీవితమునయిన మానుకొని మంచివారికి వచ్చిన కీడు తొలఁగింపవలెనని నీతి కోవిదులు చెప్పుదురు. అది యటుండనిమ్ము. నావంటి వారు వీరు, వీరి వంటి వాఁడను నేను. ఇప్పటి కొదవని నా ప్రభుత్వము వలన వీరికి రాఁగల ఫలమేమి? చెలికాఁడా! హేయమై వినశ్వరమైన యీ కళేబరమం దాస్థ మాని నాకు యశము సంపాదింపుము. నా వలనా జీతమా బత్తెమా యేదియు లేదు. అయినను వీరు సర్వకాలము నన్ను విడువక కొలుచుచున్నారు. నేను వీరి ఋణమెప్పుడు తీర్చుకోఁగలనో యెఱుఁగను. నా బ్రతుకు ముఖ్యముగాఁ జూడకు. వీరి ప్రాణములు రక్షించితేఁజాలును. అనిత్యమై మలినమైన కాయముచేత నిత్యమై నిర్మలమైన యశము లభించెనా దానికంటె లాభము కలదా? శరీరమునకు గుణములకు మిక్కిలి యంతరము. శరీరము క్షణ భంగురము, గుణము లాకల్పాంతస్థాయిలు. ఇట్టి శరీరము నపేక్షించి కీర్తి పోఁగొట్టుకొనవచ్చునా?" అన విని హిరణ్యకుఁడు సంతోషపడి పులకితుఁడై యిట్లనియె. "చెలికాడా! మేలు మేలు. నీ యాశ్రిత వాత్సల్యము కొనియాడ నేనేపాటి వాఁడను. ఈ గుణముచేఁ ద్రిలోకాధిపత్యమునకుఁ దగియున్నాఁడవు." అని పలికి యన్నింటి బంధములు తెగఁగొఱికి వాని నన్నింటిని సాదరముగా సంపూజించి, "చిత్రగ్రీవా, చెలికాఁడా! యెంతవారికిఁగాని పూర్వకర్మ మనుభవింపక తీఱదు. వలఁ దగులుకోలునకు నొచ్చుకోకు. సమస్తము తెలిసినవాడవు. నీకు నాబోఁటులు చెప్పెడుపాటివారుగారు." అని యూఱడించి బలఁగంబుతోఁ చిత్రగ్రీవున కాతిథ్యముసేసి కౌఁగిలించుకొని వీడుకొలిపెను. అనంతరము చిత్రగ్రీవుఁడు తన పరిజనములతో హిరణ్యకుని గుణములు కొనియాడుచు నిజేచ్ఛం జనియె.
మిత్రలాభముకంటె మించిన లాభము లోకమందేదియుఁ గానము. కాఁబట్టి బుద్ధిమంతుఁడు పెక్కండ్రు మిత్రులను సంపాదించుకోవలెను. ఒక్క మూషికము తోడి మైత్రి కపోతముల కెంత కార్యముచేసినది చూడుఁడు. అని చెప్పి విష్ణుశర్మ యిట్లనియె.
అనంతరము హిరణ్యకుఁడు తన లాఁగ చొచ్చెను. పిమ్మట లఘుపతనకము జరిగిన సర్వకార్యమునకు వింతపడి హిరణ్యకుని లాఁగ దాపున వ్రాలి యిట్లనియె. "ఓహో హిరణ్యకా! కొనియాడఁదగిన వాఁడవు గదా! నేను నీతో సఖ్యము గోరి వచ్చితిని. అనుగ్రహింపుము. నా కోరిక సఫలము చేయుము." అనిన విని హిరణ్యకుఁడు లాఁగ లోపలినుండి యిట్లనియె. "ఎవ్వడవు నీవు?" అన విని కాకి యిట్లనియె. "నేను వాయసమును. నా పేరు లఘు పతనకము." అనఁగానే హిరణ్యకుడు నవ్వి "సరి సరి నీతోనా మైత్రి చేయవలె? ఏది యెవ్వరితోఁ దగునో వారితో బుద్ధిమంతుఁడది చేయవలె. తగని కార్యము చేయరాదు. నేను భోజ్యమను, నీవు భోక్తవు. మనకు మైత్రి యేలాగున సరిపడును? నీతో మైత్రి నాకు విపత్తునకే కారణము. పూర్వ మొక మృగము జంబుకమును నమ్మి దాని కపట వచనములకు లోఁబడి పాశములలోఁ దగులుకొని వాయసముచేత రక్షింపఁబడియె." అనిన విని సవిస్తరముగా నాకది చెప్పుమని లఘుపతనక మడిగెను. హిరణ్యకుఁడిట్లనియె.
మృగకాకముల కథ
మగధ దేశమందు మందారవతి యను వనము గలదు. అందు బహు దినములనుండి మృగకాకములు రెండు మిక్కిలి సఖ్యముతో వాసము చేయుచుండెను. ఆమృగము లెస్సగా బలిసి వనములో విచ్చలివిడి సంచరించు చుండఁగా నొక నక్క చూచి యిటుల చింతించె. "ఆహా! యీ జింక యెంత పోతరించి యున్నది! యేలాగున దీని మాంసము నాకు లభించును? మంచిది. దీనికి నమ్మకము పుట్టించెద" నని యాలోచించి తిన్నగా సమీపముచేరి యిట్లనియె. 'మిత్రుఁడా! కుశలమా?' అనగానే విని 'యెవ్వఁడవు నీ' వని మృగమడిగెను. "నేను నక్కను. నాపేరు సుబుద్ధి. నా బంధువులందరు నన్నొంటిఁ జేసి పోయిరి. ఈ యడవిలో మృత కల్పుఁడనయి యున్నట్టి వాఁడను. మరి యెవ్వరితోఁగాదు దైవముతోఁ జెప్పుచున్నాను. వినుము. నిన్నుఁ జూడఁగానే నా బంధువులందరు వచ్చినట్లు తోఁచినది. సజ్జన దర్శనము సమస్త దోషములు పోఁగొట్టును. సర్వ శుభములిచ్చునని పెద్దలు చెప్పుదురు. దానికిదే తార్కాణము. నేను నీతోడ సావాసము చేయవలెనని మిక్కిలి కోరుచున్నాఁడను. నా కోరిక నెఱవేర్పుము." అనిన విని మంచిదా లాగుననే కానిమ్మని మృగము నక్కను వెంటఁబెట్టుకొని పోయి సాయంకాలము తన వాసస్థానము చేరెను. అక్కడ మందారవృక్షము మీఁది కాకి తన మిత్రమయిన మృగమును జూచి యెవ్వఁడీతఁడని యడిగెను. ఈతఁడు సుబుద్ధియను జంబుకోత్తముఁడు. నా చెలిమిగోరి వచ్చినవాఁడని జింకచెప్పెను. ఆ మాటలు వాయసము విని యిట్లనియె. "క్రొత్తఁగా వచ్చినవానిని నమ్మవచ్చునా? ఇప్పుడు నీవు చేసిన పని మంచిది కాదు. కుల శీలములు తెలియక యెవ్వరికిఁగాని తావిచ్చుట తగదు. పూర్వము మార్జాలమునకు జరద్గవమను గృధ్రము తావిచ్చి మృతిఁబొందెను. అది సవిస్తరముగా వివరించెద, వినుము.
జరద్గవము కథ
భాగీరథీ తీరమందు గొప్ప జువ్వి వృక్షము గలదు. దాని తొఱ్ఱలో జరద్గవమను చీఁకు ముసలి గద్ద వాసము చేయుచుండెను. ఆ వృక్షము మీద వసించు పక్షులు దానికి జీవనముకయి తాము తెచ్చుకొన్న యెరలోఁ గొంచెము కొంచెము పంచి యిచ్చుచుండును. అది దానిచేత జీవనము చేయుచుండెను. ఒకనాఁడు దీర్ఘకర్ణమను పిల్లి పక్షి పిల్లలను భక్షించుటకై యా మ్రాని కడకు సద్దుచేయక వచ్చెను. దానిరాక చూచి పక్షిపిల్లలు భయపడి కూయసాగెను. ఆ కోలాహలమును జరద్గవము విని యెవ్వరో పరులు వచ్చుచున్నారని యెంచుకొని, యెవరక్కడ నని హెచ్చరించెను. అప్పుడు బిడాలము గద్దను చూచి భయపడి 'హా! చచ్చితిఁగదా! కడు దాపునకు వచ్చితిని. సురిగిపోయితిని గాదు. తప్పించుకొనుట కుపాయాంతరము లేదు. కార్యము మించినది. ఇప్పుడు వెనుదీయరాదు. కానున్నది కాక మానదు. ఱోటిలోఁ దల దూర్చి రోఁకటి పోటునకు వెఱవ దీఱునా? మంచిది. ఇప్పుడు మంచితనము చూపి దీనికి నమ్మిక పుట్ట చేసెద.' నని యాలోచించి యెట్టయెదుర నిలిచి యిట్లనియె. 'అయ్యా! నమస్కారము.' అనగానే గృధ్రము విని 'యెవ్వడవు నీ' వనియడిగెను. 'నేను బిడాలమును, నన్ను దీర్ఘకర్ణమని చెప్పుదురు.' అన విని గృధ్రమిట్లనియె 'శీఘ్రముగా దూరముగాఁ బో. పోకుంటివా నీ ప్రాణములు నీవి కావు. చూడు నా దెబ్బ.' అనఁగానే బిడాలమిట్లనియె. 'ముందు నా మాట వినుఁడు. నేను వధ్యుఁడనో కానో విచారింపుఁడు. తర్వాత మీకుఁ దోచినట్లు చేయుఁడు. గుణ దోషములు విచారించి వీఁడు పూజ్యుఁడు వీఁడు వధ్యుఁడని నిర్ణయింపవలె గాని జాతిమాత్రముచేత నిర్ణయింపఁగూడునా?' నావుడు 'నీవు వచ్చిన పని యే' మని గృధ్రమడిగెను. పిల్లి యిట్లనియె. 'ఇక్కడ గంగలో నిత్యము స్నానము చేయుచు మాంసాశనము విడిచి బ్రహ్మచారినై చాంద్రాయణ వ్రతము చేయుచున్నాఁడను. మిమ్ము ధర్మజ్ఞులని మంచివారని యిచ్చటి పక్షులప్పుడప్పుడు ప్రశంసింపఁగా విని బహుదినములనుండి నాకు మీ దర్శనము చేయవలెనని కోరిక కలదు. అది యిన్నాళ్ళకు ఫలించినది. మీరు విద్యావయోవృద్ధులు. కాఁబట్టి మీవలన ధర్మములు వినవలెనని సయితము మనసు కలదు. ధర్మజ్ఞులయిన మీరే యిల్లు త్రొక్కుకొని వచ్చినవానిని వధింపను యత్నము చేసితిరి. గృహస్థ ధర్మమా యిది? శత్రువున కయినను గృహమునకు వచ్చినవాని కాతిథ్యము చేయవలసినది. ధనము లేని పక్షమునను మంచి మాటలతోనైన సత్కరింపవలెను. ఉస్సురని యింటికి వచ్చిన యతిథి పోరాదు. అది మిక్కిలి పాపమునకు మూలము.' అనగా విని గద్ద యిట్లనియె: 'పిల్లులకు మాంసమందు రుచిమిక్కుటము. ఇక్కడ నా పక్షి పిల్లలున్నవి. అందుచేతనే నట్లు చేసితిని.' అనఁగానే పిల్లి రెండుచెవులు మూసికొని కృష్ణ కృష్ణ యని యిట్లనియె. 'ఎంత పాపముచేసి యీ పిల్లి జన్మ మెత్తితినో. యిది చాలక యీ పాపము సహితము కట్టుకోవలెనా? ఎంత మాట వినవలసి వచ్చెను! ధర్మ శాస్త్రములు విని నిష్కాముఁడనై యిప్పుడు చాంద్రాయణవ్రతము చేయుచున్నాఁడను. నేనిట్టి పాపము చేయుదునా? పరస్పర విరుద్ధములయిన ధర్మశాస్త్రములు సహిత 'మహింసా పరమో ధర్మః' యనుచో నైకమత్యము గలిగియున్నవి. ఏ హింస గాని చేయక సర్వభూతములయందు దయాళువులయి వర్తించు వారికి స్వర్గము కరస్థము. భూతదయ గలవాఁడే సర్వధర్మములు చేసినవాఁడు. అది లేనివాఁడు చేసియుఁ జేయనివాఁడే. కడపట దాను జేసిన ధర్మములు తనకు సహాయమయి వచ్చునుగాని తక్కినది యేదియు లోకములోనిది తోడ రాఁబోదు. తెలియక హెడిన కాలము పోనిమ్ము. తెలిసి యింకఁ జెడుదునా? అడవిలో స్వచ్ఛందముగా మొలచిన యే శాకముతో నయిన క్షుధఁదీర్చుకొని ప్రొద్దుఁ బుచ్చవచ్చును. ఈపాడు పొట్టకయి యింత పాపము చేయుట కెవ్వఁడు పాలుపడును? ఆహా! యెంత మాటాడితిరి!' అనఁగా గ్రద్ద విని 'కోపము చేయకు. క్రొత్తగా రాఁగానే వచ్చినవారి స్వభావమేలాగునఁ దెలిసి కోవచ్చును? అప్పుడు తెలియక చెప్పినమాట తప్పుగా బట్టఁబోకు. పోయినమాట పోనిమ్ము. నీవు యధేచ్చముగా రావచ్చును, బోవచ్చును. మాకడ నిలువవచ్చును. నీకొక యడ్డంకి లే'దని చెప్పెను. అనంతరము మార్జాలము జరద్గవముతో మిక్కిలి సఖ్యము గలిగి యా తొఱ్ఱలో వాసము చేయుచుండెను.
ఇట్లుకొన్ని దినములు కడచిన తర్వాత మార్జాలము ప్రతిదినము నడికిరేయి చప్పుడు చేయక వృక్షమెక్కి పక్షి పిల్లలను గొంతు కొఱికి తెచ్చి తొఱ్ఱలోఁ బెట్టుకొని తినసాగెను. అక్కడి పక్షులు తమ పిల్లలను గానక మిక్కిలి దుఃఖించి యక్కడక్కడ వెదక నారంభించెను. అది యెఱిగి పిల్లి తొఱ్ఱ వెడలి పాఱిపోయెను. ఆ పక్షులు వెదకుచు వచ్చి తొఱ్ఱలోఁ దమ పిల్లల యెముకలు చూచి యా గద్దయే మన పిల్లలను భక్షించినదని నిశ్చయించి దానిని గోళ్ళతో ఱక్కి చంచువులతోఁ బొడిచి చంపెను.
కాఁబట్టి క్రొత్తఁగా వచ్చినవానిని నమ్మరాదని" అనఁగా విని నక్క కాకిని మిక్కిలి కోపించి చూచి యిట్లనియె. "ప్రథమ దర్శన దినమందు మృగమునకు నీవు సహితము క్రొత్తవాఁడవే. అది యెట్లు నీతో మృగమునకు స్నేహము రాఁగా రాఁగా వర్ధిల్లుచున్నది? నీకు మాఱులేదు గనుక నీతులని నోరికి వచ్చినవి వదరుచున్నావు. విద్వాంసుఁడు లేనిచోట స్వల్పబుద్ధియు సమ్మానింపఁబడుచున్నాఁడు. మ్రానులేని దేశమం దాముదపుఁ చెట్టు మహావృక్షము కదా? వీఁడు తనవాఁడని, వీఁడు పరుండని యెన్నిక లఘుబుద్ధులకు, మహాత్ములకు లోకమే కుటుంబము. ఈ మృగము నాకు బంధువయినట్లు నీవు కావా? ప్రపంచమున్నంతకాలము బ్రతుకఁబోము. ఎప్పుడో కాలుఁడు మ్రింగఁ గాచి యున్నాఁడు. ఉన్న కాల మందఱికి మంచివాఁ డనిపించుకొని పోవలెఁగాని యిట్టి విషమబుద్ధిచేత ఫలమేమి?" అనఁగా విని మృగమిట్లనియె. "ఈ వాదులాట యేల? మన మందఱ మొకచోట మంచిమాటలతో సుఖముగాఁ గాలక్షేపము చేయుదము. వీనికి వీఁడు మిత్రము, వీనికి వీఁడు శత్రువని నియమము గలదా? వ్యవహారముచేతనే మిత్రులుగాని శత్రువులుగాని కలుగుచున్నారు." నావిని కాకి యాలాగే కానిమ్మని పలికెను. అనంతరము మృగకాక జంబుకములు కడు నేస్తము గలిగి తద్వనమందు వాసము చేయుచుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన వెనుక నొక్కనాడు నక్క జింకతో నిట్లనియె. "చెలికాఁడా! ఈ వన మందొకచోట నిండు పయిరులు గల పొలము నేఁడు చూచితిని. నీవు నా వెంబడిరా, నేను నీకాపొలము చూపుచున్నాను." అని చెప్పి మృగమును వెంటఁబెట్టుకొని పోయి క్షేత్రము చూపెను. తరువాతఁ బ్రతిదినమక్కడికి మృగముపోయి పైరు మేయసాగెను.
ఒకనాఁడది క్షేత్రస్వామి చూచి ఈ మృగము పయిరు మేయ మరగినది. దీనిని జీవముతో విడువరాదని యాలోచించి పొలములో గూఢముగా వలపన్ని యింటికిఁ బోయెను. ఎప్పటి వాడుక చొప్పున మరునాఁడు మృగము వచ్చి పొలములో మేయ దిగి వలలోఁ దగులుకొని యిట్లు చింతించె. "అయ్యో! వలలోఁ దగులు కొంటినికదా, యేమి చేయుదును! ఈ కాలపాశమువలన నన్ను విడిపించు దిక్కెవరున్నారు? ఇప్పుడు నా ప్రియమిత్రుఁడు జంబుకోత్తముఁడు వచ్చెనా ఈ విపత్తు మానుపఁగలఁడు." అని చింతించుచుండగా నక్క వచ్చి చూచి లోపల సంతోషపడి "యిన్నాళ్ళకు నా యత్నము ఫలమునకు వచ్చినది. కాఁపు దీనిని నేఁడు చంపక మానఁడు. దీనియొక్క రక్తమాంసములతో గావలసినన్ని యెముకలు దొరుకఁగలవు. నాకు నేడుగా పండుగు!" అని యెంచుకొనుచు దాపునకుఁ బోయెను. మృగము నక్కను జూచి యింక భయములేదని యెంచుకొని యిట్లనియె. "చెలికాఁడా! శీఘ్రముగా వచ్చి వలఁగొఱికి నన్నుఁ గాపాడుము" అనగానే నక్క కదియఁబోయి వలచూచి "చెలికాఁడా! యీ వల నులినరములతోఁ జేయబడినది. నేఁడు భట్టారకవారము. నరములు పండ్లతో నేనెట్లు తాఁకుదును? మిత్రుడా! మనములో వేరుగా దలపఁబోకు. మఱి యేపనిగాని చెప్పితివా యిప్పుడు తలతోఁ జేయుచున్నా" నని పలికెను. అంతట సాయంకాలము కావచ్చెను.
కాకి తన మిత్రము హరిణము తావు చేరమికి మిక్కిలి చింతించి అక్కడక్కడ వెదకుచు వచ్చి యా పొలముకడకు వచ్చి చూచి 'చెలికాడా! యిదియే'మని యడిగెను. 'మిత్రుని మాట వినని దానికి ఫలమిది. చేటుఁగాలము దాపించినవాఁడు హితులమాట యేల విను'నని మృగము పలికెను. అనవిని కాకమా నక్క యెక్కడని యడిగెను. నా మాంసము తినవలెనని యిక్కడనే యెక్కడనో కాచుకొని యున్నదని మృగము చెప్పెను. నా విని కాకి యిట్లనియె. "నేను మునుపే చెప్పితిని. నా మాట వినక పోయితివి. పరులకు నేను గీడు చేయఁబోను, వారు నాకొక కీడు చేయఁబోరని నమ్మరాదు. మంచివారికి సహితము దుష్టులవలన భయము గలదు. పోఁగాలము దాపించినవారు దీప నిర్వాణగంధము నరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు. ప్రత్యక్ష మందిచ్చకములాడి పరోక్షమందుఁ గార్యహాని చేయు సంగాతకాఁడు పయోముఖ విషకుంభమువంటివాఁడు. అట్టివాని సాంగత్యమవశ్యము మానుకోవలెను." అనగా విని హరిణము నిట్టూర్పు విడిచి యిట్లనియె. "సజ్జన సాంగత్యము వలన సర్వ శ్రేయములవలె దుర్జన సాంగత్యము వలన సర్వానర్థములు ప్రాప్తించును. దానికి సంశయములేదు. ఆజిత్తులమారి మృగము యొక్క తేనె మాటలకు మోసపోయితిని. నాలిక తీపు, లోన విషమని యెఱుంగుదునా?" అని చెప్పుచుండగా దూరమందు వచ్చుచున్న పొలముకాఁపును జూచి కాకి యిట్లనియె. "చెలికాఁడా! యిప్పుడు తగిన వెరవు విచారింపక మసలరాదు. అదిగో పొలముకాఁపు బడియ చేతఁబట్టుకొని యముని వలె వచ్చు చున్నాఁడు. నాకొక యుపాయము తోఁచుచున్నది. విను. ఊపిరి బిగియఁబట్టి కడుపు బూరటించి నాలుగుకాళ్ళు చాఁచుకొని బిఱ్ఱబిగిసికొని చచ్చినట్లు పడియుండుము. నేను నీపైనెక్కి ముక్కుతో నీకన్నులు పొడుచుచున్నట్లు కూర్చుండి యుండెద. నేను సమయము చూచి కూసెదను. కూయఁగానే లేచి పాఱిపొమ్మని" చెప్పెను. పిదప మృగము కాకి చెప్పినట్లు పడియుండెను. తదనంతరము పొలముకాఁపు దాపునకు వచ్చి చూచి మృగము చచ్చినదని యెంచుకొని వల వదలింపఁగానే కాకి కూసెను. అది వినిమృగము శీఘ్రముగా లేచి పరుగెత్తెను. ఆహా! యిది యెంత మాయలమారి మృగము! నన్ను మోసపుచ్చినదిగదా! యని యెంచుకొని పొలముకాఁపు తన చేతి బడియను విసరి వ్రేసెను. దైవికముగా దాని తాఁకువడి నక్క చచ్చెను. చూడు నక్క ఏమి తలంచుకొని యుండెను? తుదకేమాయెను?
పరులకు హాని చేయఁగోరువారు తామే చెడిపోవుదురు.
అనిన విని హిరణ్యకునితో లఘుపతనక మిట్లనియె. "ఏల యీ మాటలు? నీతో మిత్రభావము కోరి వచ్చినాఁడను. నన్ను వేఱుగా దలంపకు. నిన్ను నేను భక్షించిన మాత్రాన నా కడుపు నిండునా? నా మనవి విను. చిత్రగ్రీవుని వలె నన్ను సహిత మనుగ్రహింపుము. నీ సౌజన్యమే యింతగా నాచేత నిన్ను వేఁడుకొలుపుచున్నది. నీకు దయవచ్చునంత దాఁక నిన్ను విడిచి కదలను. నీవంటి సజ్జనుని సాంగత్యము చేసి సౌఖ్యము పొందని వాని జన్మమేల?"
అనిన హిరణ్యకుఁడిట్లనియె. "నీవుఁ చపలుఁడవు. చపలునితో మైత్రి సర్వదా చేయరాదు. ఇంతేకాదు. మాకు నీవు శత్రుపక్షమువాఁడవు. ఎంత మంచివానితో గాని దాయతో సాంగత్యము చేయరాదు. కాఁబట్టి నీతో నాకు నేస్తము సరిపడదు. అశక్యము శక్యము గాఁబోదు. శక్యమశక్యము గాఁబోదు. జలము మీఁద బండ్లు నేలమీఁద నావలు నడచునా? ఏల యందని మ్రాని పండ్ల కఱ్ఱు చాఁచెదవు? నీ పని చూడు. మిక్కిలి ప్రొద్దెక్కినది. కడుపు పని విచారించుకో, పో పో" నా విని లఘుపతనక మిట్లనియె. "నా స్వభావము తెలియక యేల యింత దూరము వెగటు మాట లాడెదవు? కడపటిది విను. చిత్రగ్రీవుఁడు లోకోత్తరుండవయిన నీతో సౌహార్దసౌఖ్యమనుభవించుట చూచితిని. నీతో సంగాతము చేయవలెనని మనసు పడితిని. నా ప్రార్థన విని నా కోరిక నెఱ వేర్చితివా సరి, లేదా యింతే నా భాగ్యమనుకొని యిక్కడనే ప్రాయోపవేశము చేసి ప్రాణములు విడిచెదను. ఇది నా నిశ్చయము. మృద్ఘటమువలె దుర్జనుని సులభముగా భేదింపవచ్చును గాని సంధింపగూడదు. హేమ ఘటమందు వలె సుజనుని యందీ లక్షణము విపరీతమై యుండును. ద్రవత్వము వలన సర్వ లోహములును, నిమిత్తము వలన మృగ పక్షులును, భయలోభముల వలన మూర్ఖులును, దర్శనము వలన సజ్జనులును కలసికొందురు. మఱియు శుచిత్వము త్యాగము శౌర్యము సుఖ దుఃఖములయందు సామాన్యము, దాక్షిణ్యము స్నేహము సత్యవర్తనమును సుహృద్గుణములని చెప్పుదురు. ఈ గుణము లన్నియు నీయందుఁ గాన బడుచున్నవి. ఇతరుని నీవంటి వానిని కని విని యెరుగఁను. నీ బోఁటి వానితో సఖ్యము సంపాదించుకొనుట కంటె మేలొకటి లేదు. నా కోరిక యీడేఱిచితివా మేలయ్యెను. లేదా యింతే నా యదృష్టమని యెంచుకొనియెదను." అనిన హిరణ్యకుఁడు లాఁగ వెడలి వచ్చి యిట్లనియె. "లఘుపతనకా! నీ వచనామృతము చేత మిక్కిలి తృప్తి బొందితిని. ప్రీతి పూర్వకమయిన సజ్జన సల్లాపము వలె గంధసారమును హిమాంబుపూరమును వారిజాతవారమును శ్రమము పోగొట్టజాలవు. దుర్జనుఁడు తలఁచునది యొకటి, చెప్పునది యొకటి, చేయునది యొకటి. సజ్జనుఁడు తలంచునది చెప్పునది చేయునది యొకటియై యుండును. నీయందు దోషము లేశమయినను స్వభావము చేత గాన బడదయ్యె, నీ వలన సంతోషించితిని. నీ యభిమతమే కానిమ్ము." అని పలికి హిరణ్యకుఁడు యథోచితసత్కారములుచేసి, వాయసమును సంతోషపరచి, వీడుకొలిపి తన వివరము ప్రవేశించెను. నాఁటఁగోలె మూషిక వాయసములు కుశల ప్రశ్నముల చేత నన్యోన్యాహార దానములచేత విస్రంభాలాపముల చేతఁ గాలక్షేపము చేయుచుండెను.
ఒకనాఁడు వాయసము మూషికము జూచి "చెలికాఁడా! యిక్కడ నా కాహారము కష్టతర లభ్యముగా నున్నది. కాఁబట్టి యీ వనము విడిచి యెక్కడికేనిఁ దగిన యెడకు బోవలెనని యత్నపడియున్న వాఁడను." అనిన విని హిరణ్యకుఁడిట్లనియె.
"దంతములు, కేశములు, నఖములు, నరులును స్థాన భ్రంశమును బొందిరేని రాణింపరు. కాఁబట్టి మతిమంతుఁడీ యర్థము తెలిసికొని స్థానము మారవలెనను బుధ్ధి మానుకోవలెను." అనిన విని కాకి యిట్లనియె. "చెలికాఁడా! నీవు చెప్పిన వచనము దుర్బల విషయము. గజములు, సింహములు, సత్పురుషులును స్థానము విడిచి విచ్చలవిడి సంచరింతురు. కాకములు, మృగములు, కాపురుషులును స్థానము మానఁజాలక వినాశము బొందుదురు." అనిన విని హిరణ్యకుఁడిట్లనియె: "చెలికాఁడా! ఇక్కడ మానుకొని యెక్కడికి బోవలెనని నీయత్నము?" అనిన వాయసమిట్లనియె: "ముందుచోటు చూచి పాదము మోపి కదా వెనుకటి పాదమెత్తవలెను. అట్లు స్థానాంతరము విచారించుకోక పూర్వ స్థానము మానరాదు. కాఁబట్టి ముందు గంతవ్య స్థానము నిరూపించుకొనక ప్రయత్నపడినవాఁడను గాను, విను. దండ కారణ్యముందుఁ గర్పూరగౌర మను సరోవరము గలదు. అందు నా ప్రియ మిత్రుఁడు మంథరుఁడను కూర్మరాజున్నాఁడు. అతడు సహజ ధార్మికుడు. పరులకు వలసినన్ని ధర్మములు చెప్ప వచ్చును గాని తాను నడుచుకోలు దుష్కరము గాదా? ఆ తామేటి మేటి మీనాద్యాహారదానములచేత నన్ను భరింపజాలినవాడు." నా విన హిరణ్యకుఁడిట్లనియె. "నీవు పోయిన తర్వాత నాకిక్కడఁ బనియేమి? సమ్మానము జీవనము బాంధవులు విద్యాగమమును లేని దేశము మానవలెనని పెద్దలు చెప్పుదురు. కాబట్టి నీతో నన్నుఁ దోడుకొనిపొమ్ము. వచ్చెదను." అనఁగా విని లఘుపతనకము సంతోషపడి వల్లెయని పయనమై మూషికముతో సరసాలాపములు కావించుచు గతిపయ దినంబులకా కొలను చేరఁబోఁగా మంథరుఁడు దూరమునందుండి చూచి యెదురు వచ్చి కొనిపోయి లఘుపతనక హిరణ్యకులకు యథోచితముగా నాతిథ్యము చేసెను.
తర్వాత లఘుపతనకుఁడు మంథరునితో నిట్లనెను. "చెలికాఁడా! యీ మూషికరాజును నీవు మిక్కిలి సమ్మానింపుము. ఇతడు పుణ్య కర్ముల లోపల ధురీణుఁడు, గుణరత్నాకరుఁడు, హిరణ్యకుఁడనువాడు. ఈతని గుణములు శేషుఁడు సహితము వర్ణింపజాలడు. నే నేపాటి వాఁడను?" అని పలికి మొదటినుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించెను. అంతట మంథరుఁడు హిరణ్యకుని మిక్కిలి సన్మానించి యిట్లనియె. "హిరణ్యకా! నీవు నిర్జన వనమందు వాసము చేయుటకు నిమిత్తమేమి? చెప్పు" మని యడిగెను. హిరణ్యకుఁడి ట్లనియె.
చంపకవతి యను పట్టణము గలదు. అందు సన్న్యాసులు పెక్కండ్రు వాసము చేయు చుండుదురు. అందుఁ జూడాకర్ణుండను పరివ్రాజకుఁడు గలఁడు. అతఁడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలోఁ బెట్టి చిలకకొయ్య మీఁద నుంచి నిద్రపోవును. నేను సద్దు చేయక దాని మీఁది కెగిరి ప్రతిదినమా వంటకము భక్షించిపోవుచుండుదును.
ఒకనాఁడు చూడాకర్ణుఁడు తన స్నేహితుఁడు వీణాకర్ణుఁడను సన్యాసితో మాటలాడుచుండి మాటిమాటికి మీఁది వంక చూచి తన గిలక కర్రతో నేలమీద గొట్టి నన్ను వెఱపించుచు వచ్చెను. అప్పుడు వీణాకర్ణుఁడు 'చూడాకర్ణుఁడా! యేమది మీదుచూచి నేల కర్రతోఁ దట్టుచున్నాఁడ?' వని యడుగఁగాఁ జూడాకర్ణుఁడిట్లనియె. 'ఒక ఎలుక ప్రతిదినము చిలుక కొయ్య మీఁది కెగిరి పాత్రము నందున్న యన్నము భక్షించి పోవుచున్నది. నాకు దీని యుపద్రవము పెద్దదిగా నున్న' దని చెప్పెను. ఆమాటలు వీణాకర్ణుఁడు విని 'యెక్కడి ఎలుక! ఎక్కడి చిలుక కొయ్య! యింత యల్పజంతువున కింత పొడవున కెగురు బల మెక్కడ నుండి వచ్చెను? దీని కేమయినను నిమిత్తము లేక మానదు. ' --- పూర్వము నేనొక విప్రుని ఇంటికి భిక్షార్థము పోయి యుంటిని. అప్పుడా బ్రాహ్మణుఁడు తన భార్యను జూచి 'ఱేపమావాస్య, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఏమేమి భోజ్య పదార్థములు కూర్చినదాన' వని యడిగిన బ్రాహ్మణి యిట్లనియె. 'పురుషులు పదార్థములను సేకరించి యింటికిఁ దెచ్చిరేని వానిని స్త్రీలు వలసిన పనులకు వాడుకొందురుగాని మీరు తేని పదార్థములెక్కడనుండి వచ్చును?' అనిన విని యాతఁడు కోపించి భార్యను జూచి యిట్లనియె 'ఉన్నంతలో జరుపుకోవలెను గాని విస్తరించి పదార్థ సంగ్రహము చేయవలెనని పేరాస పడరాదు.' అనిన బ్రాహ్మణి యిట్లనియె. 'ఆ లాగుననే కానిండు. రేపటి కార్యము కలిగి నంతటితోనే జరిపెద' నని చెప్పి యాయమ్మ నూవులు కడిగి దంచి ఎండబోసెను. అంతట నొక కోడి వచ్చి యా తిలలు కాళ్ళతోఁ జీరి చల్లులాడెను. అది బ్రాహ్మణుఁడు చూచి 'ఈ నువ్వులంటు పడ్డవి. బ్రాహ్మణ భోజనమునకు బనికిరావు. కాఁబట్టి యివి కొనిపోయి మార్చుకొని ర' మ్మని చెప్పెను. తదనంతర మా బ్రాహ్మణి మఱునాడు నేను భిక్షార్థము పోయియున్న ఇంటి లోఁగిటికి వచ్చి యీ నువ్వుఁబప్పు పుచ్చుకొని నూవులిచ్చెదరా? యని యా యింటి వారి నడిగెను. ఆ యింటి పాఱుత యామాట విని మిక్కిలి సంతోషపడి చేటలో నూవులు పోసికొని వచ్చి మాటలాడుచుండఁగా నామె భర్త వచ్చి ఏమి బేర మాడుచున్నావని యడిగెను. చేరెడు నూవులిచ్చి దంచిన నూవులు పుచ్చుకొనుచున్నానని యామె చెప్పెను. ఆ మాటలు బ్రాహ్మణుఁడు విని యోసి వెఱ్ఱీ! చేరెడు నూవులకు దంచిన నూవులెవ్వరయిన నిత్తురా? ఈమె యీ లాగునఁ దెచ్చి యిచ్చుట కేమయిన నిమిత్తముండును కాఁబట్టి నీవా నూవులు పుచ్చుకోకు మని చెప్పెను. ఆలాగుననే ఈ మూషికమున కింత కలిమియు నిక్కడి ' ---- సదా వాసమును నిమిత్తములేక సంభవింపవు.' అని వీణాకర్ణుఁడు చెప్పఁగా విని, చూడాకర్ణుఁడు 'తడవులఁ బట్టి ఈ ఎలుక ఇక్కడ నొకలాఁగ తావు చేసికొని విడువక వాసము చేయుచున్నది. ఇట్లు వసించుటకు నిమిత్తము తెలిసినది కాదు. త్రవ్వి చూచెదఁగాక' యని చెప్పి యొక గుద్దలితో నేను వసించు వివరము త్రవ్వి చిరకాలోపార్జితమయిన నా ధనము సర్వము గ్రహించెను. తరువాత సత్త్వోత్సాహములు లేక నానాఁడాహారము సహితము సంపాదించుకొనఁజాలక దిగులుపడి కృశించి మెల్ల మెల్లగా సంచరించుచుండగా జూచి చూడాకర్ణుఁడిట్లనియె. 'ధనము గలవాఁడె బలవంతుడు. ధనము గలవాఁడె పండితుఁడు. ధనము సర్వశ్రేయములకు నిధానము. ధనము లేనివాని జీవనమేల? ఈ మూషికము తన ధనము కోలుపోయికదా, తొంటి జవసత్త్వములుడిగి స్వజాతి సామ్యము బొందెను. అర్థ పరిహీనునకు నిరంతరము ఖేదము సంభవించును. నిరంతర ఖేదమువలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును. బుద్ధి హీనత వలన సమస్త కార్యములు నిదాఘనదీ పూరములట్లు వినాశము నొందును. ధనవంతునకే పౌరుషమును మేధాసంపత్తియు బంధుమిత్రులును గలుగుదురు. పుత్ర మిత్ర విరహితుని గృహమును మూర్ఖుని చిత్తమును శూన్యములు. దారిద్ర్యము సర్వ శూన్యము. దారిద్ర్యము కంటె మరణము మేలు. మరణమాపాత యాతనావహము. దారిద్ర్యము యావజ్జీవము తీవ్రవేదనాకరము. ఇంద్రియముల నామమున బుద్ధిని వచో ధోరణిని బురుషుఁడు తొంటివాఁడయ్యు ధనమును బాసిన క్షణముననే లాఁతివాఁడగును. ఇది మహా చిత్రము' అని యా పరివ్రాజకుఁడు చెప్పఁగా విని మిక్కిలి ఖిన్నుఁడనయి యిట్లు చింతించితిని.
'ఇంక నాకిక్కడ వసింప దగదు. ఇప్పుడు నా వృత్తాంతము పరులతో జెప్పికోలును యుక్తముగాదు. అర్థ నాశము మనస్తాపము గృహమందలి దుశ్చరితము వంచనము పరాభవమును బ్రకాశింపఁ జేయఁదగదని పెద్దలు చెప్పుదురు. దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసముకంటె సుఖము లేదు. కుసుమస్తబకము వలె మానవంతుడు సర్వ జనుల మూర్ధము మీఁద నయిన నుండవలె లేదా వనమందు సమసిపోవలె. ఇక్కడనే వాసము చేసికొని యాచనతో జీవించెదనంటినా? దానికంటె గర్హితము లేదు. ఒక్క మ్రుక్కడిని యాచించుకంటె నిప్పులోబడి శరీరము తొఱఁగుట మేలు. అనృత మాడుట కంటె మౌనము మేలు. పరధనాపహరణము కంటెఁ దిరియుట మంచిది. వివేకహీనుఁడయిన ప్రభువును సేవించుట కంటెమరణము శ్రేయము. సేవావృత్తి మానమును వలె యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును. ఒకరి యిల్లు కాచి వారి పెట్టువోఁతలకు దోసిలి యొగ్గి యునికియు మిక్కిలి నింద్యము.' అని నానావిధముల విచారించియు లోభము త్రిప్పులకు లోనయి మరల నర్థసంగ్రహము చేయవలెనని తలఁచి యచ్చోటనే నిలిచితిని. లోభము మోహమును బుట్టించును. మోహము దుఃఖము నుత్పాదించును. దుఃఖము జ్వలనము వలె స్వాశ్రయమునకు నాశనము పుట్టించును. కాఁబట్టి లోభమునకు బుద్ధిమంతుఁడు లోపడఁడు. తరువాత నేనక్కడ వదలకుంట చూచి చూడాకర్ణుఁడు నన్ను గఱ్ఱతో విసరి వ్రేసెను. ఆ వ్రేటు దైవ వశము వలనఁ దప్పి పోయినది. తగిలి యుండెనా యింతకు యమ లోకములోఁ బ్రాత కాఁపనయి యుండనా? అనంతర మిట్లు చింతించితిని. 'ఆహా! ధనలోభము సర్వాపదలకు మూలము గదా? తద్వర్జనము కంటె లోకమందు సుఖమేదియు లేదు. ఆశ దిగినాడిన వాఁడే సత్పురుషుఁడు. వాఁడే సర్వ శాస్త్రములు చదివినవాఁడు. వాఁడే సర్వ ధర్మము లాచరించినవాఁడు.ఉదరముకయి పరుల గోరక ప్రాప్త లాభమునకు సంతోషించు వాఁడొక్కఁడు లోకమందు ధన్యుఁడు. వాఁడే సుఖి. తత్తత్కర్మాను రూపముగా దేహికి దుఃఖములట్లు సుఖములు కోరకయే ప్రాప్తించుచున్నవి. అందులకయి ప్రయాస పాటు నిరర్థకము. ఈ తావు ఆత ముత్తాతలు సంపాదించిన కాణాచి కాదు. ఈ భూ మండలములో నింకఁ దావు దొరకదా? ఇక్కడ నుండ నేల? ఈ చెడగరపు బోడ కఱ్ఱ మోఁదులు వడి ప్రాణములు కోలుపోనేల? ఇంక నెక్కడ నైన నొక్క విజన ప్రదేశము చేరి కాలము పుచ్చుట మంచిది. శిలాంతరాళమందలి కప్పను భరించు దయామయుడైన యీశ్వరుఁడు నన్నుఁ గాపాడకుండునా?' అని చింతించి మనసు గట్టి పఱచు కొని యచ్చోటు విడిచి యానిర్జన వనము చేరితిని. వనములోఁ గాయ గసురులు భక్షించి పడియ నీరు త్రాగి యొక చెట్టు నీడలో వసించి కాలము పుచ్చుట మంచిదిగాని ధన హీనుఁడయి నలుగురిలో నుండరాదు. అనంతరము నా పుణ్యము వలన నాకీ మిత్రుఁడు లభించెను. నా మహా భాగ్యము వలననే యిపుడు నీ యాశ్రయమ మను స్వర్గము దొరికినది. సంసార విష వృక్షమునకు రెండు ఫలము లమృతతుల్యములు. కావ్యామృత రస పాన మొకటి. సజ్జన సంగతి యొకటి. అనిన విని మంథరుఁడిట్లనియె.
యీశ్వరుఁడు నన్నుఁ గాపాడకుండునా?' అని చింతించి మనసు గట్టి పఱచు కొని యచ్చోటు విడిచి యానిర్జన వనము చేరితిని. వనములోఁ గాయ గసురులు భక్షించి పడియ నీరు త్రాగి యొక చెట్టు నీడలో వసించి కాలము పుచ్చుట మంచిదిగాని ధన హీనుఁడయి నలుగురిలో నుండరాదు. అనంతరము నా పుణ్యము వలన నాకీ మిత్రుఁడు లభించెను. నా మహా భాగ్యము వలననే యిపుడు నీ యాశ్రయమ మను స్వర్గము దొరికినది. సంసార విష వృక్షమునకు రెండు ఫలము లమృతతుల్యములు. కావ్యామృత రస పాన మొకటి. సజ్జన సంగతి యొకటి. అనిన విని మంథరుఁడిట్లనియె.
అర్థములు నిత్యములు గావు. యౌవనము ఝరీ వేగ తుల్యము. జీవనము బుద్బుద ప్రాయము. కాఁబట్టి బుద్ధిమంతుఁడు సత్వరముగా ధర్మము సమాచరించవలెను. సమాచరింపనివాఁడు పశ్చాత్తాపముఁ బొంది శోకాగ్ని సంతప్తుఁడగును. నీ వతి సంచయము చేసితివి. దాని దోష మిది. తటాకోదర జలములకు బరీవాహము వలె సమార్జిత విత్తములకు ద్యాగమే రక్షణము. ధనము పాఁతఱలో దాఁపఱికము చేయుట దాని వినాశనమునకు దారి చేయుట గాని వేఱుగాదు. వాయికట్టి కడుపుకట్టి ధనము గడించువాడు పరులకయి మోపు మోయు వాని యట్లు క్లేశమునకు మాత్రము పాత్రము. భోగ త్యాగ్యములకు వినియోగింపని ధనముడుంట వలన ఫలమేమి. పోకడ వలన హాని యేమి? లోభి ధనికుఁడయ్యు భోగ విరహముచే దరిద్రునితో సమానుఁడే. అయినను లోభికి ధనార్జన రక్షణ హానుల యందు దుఃఖ మొకటి శేషము. లోభి తన ధనము పేదలకుఁ బెట్టఁడు చుట్టములకు వినియోగింపడు. తాను గుడువడు. కడపట నేలపాలో దొంగలపాలో చేయుచున్నాడు. ప్రియ వచనములతోటి దానము, గర్వ సహితముగాని జ్ఞానము, క్షమాసహితమైన శౌర్యము, త్యాగయుక్తమయిన విత్త మనియెడు నాలుగు లోకమందు దుర్లభములు. బుద్ధి మంతునకు సర్వదా ధనార్జన మావశ్యక కార్యమే కాని యతి సంచయేచ్ఛ తగదు. తొల్లి యొక్క జంబుకము లోభముచేత మిక్కిలి వస్తువులు సంగ్రహింపఁ గోరి వింటి దెబ్బ పడి చచ్చెను. వినుము నీకా కథ చెప్పెదను.
జంబుక వృత్తాంతము
కళ్యాణ కటక మను పట్టణమందు భైరవుఁడను వ్యాధుఁడు గలఁడు. వాఁడొకనాఁడు వేఁటకయి సింగాణి తూపులు వలయురులు చిక్కము లోనగు సాధనములు పూని వింధ్యాటవికిఁ బోయెను. అక్కడ వాఁడొక వది కావించుకొని మచ్చు వెట్టి పొంచియుండి యొక పోతరించిన మృగము నేసి చంపి యెత్తి, యఱకడఁ బెట్టుకొని వచ్చుచుండగా నడగొండవలె నొక పంది కానఁబడెను. అంతట నా మృగయుఁడు నా భాగ్యము వలన మాంసాంతరము సయితము దొరికినదని సంతోషించి యా మృగమును నేలదించి విల్లెక్కు బెట్టి బాణము సంధించి సూకరము నేసెను. ఏటు వడిన యా క్షణమె యా వరాహము క్రోధ చోదితమయి శరవేగమున ఘుర్ఘురించుచుఁ బాఱివచ్చి కొమ్మున వానిఁ గొట్టెను. వాఁడు మొదలు నఱికిన తరువువలె నేలఁగూలి ఱోలుచుఁ బ్రాణములు విడిచెను. పందియు మృతి బొందెను. అక్కడ నొక్క సర్పము కిరాత వరాహముల త్రొక్కుడులఁబడి మడిసెను. అంతనొక్క నక్క దీర్ఘరావ మనునది యాహారార్థము వనములోఁ గ్రుమ్మరుచు నక్కడికి వచ్చి చచ్చిపడియున్న సర్ప కిరాత వరాహ మృగములను జూచి నాకుభోజనము పుష్కలముగా దొరికినదని సంతోషించి యిట్లు చింతించె. "నాకు మూఁడు నెలల గ్రాసమునకు వీని మాంసములు చాలును. ఒక మాసము కిరాతుని మాంసముతోఁ గడపవచ్చును. మృగ సూకరముల మాంసములతో రెండు మాసములు జరుప వచ్చును. ఒక దినమున కీ పాము చాలును. తొలియాఁకలి యిప్పటి కీ వింటినారి నరముతోఁ దీర్చుకొనియెదఁ గాక" యని చింతించి చేరువకుఁ బోయి గొనయము పంట నొక్కి కొఱకఁ గానే బెట్టు వదలి గొనయము పెట్టు ఱొమ్మునఁ దాఁకెను. ఆ పెట్టు తోనే యా నక్క నేలఁ గూలి ఱోలుచు విలవిలఁ దన్నుకొనుచుఁ జచ్చెను. చూడు లోభము నక్క నే దశకుఁ దెచ్చినది?
కాఁబట్టి యతిసంచయేచ్ఛ తగదని చెప్పితిని. ఒరుల కిచ్చి తాను భుజించినదే తన సొత్తు. పరుల కీక తాను గుడువక కూడఁ బెట్టిన ద్రవ్యము చచ్చిన తఱి వెంట రాఁబోదు. అని చెప్పి కూర్మము మఱియు నిట్లనియె. మిగిలిపోయిన దిప్పుడు త్రవ్వుకోనేల? పోనిమ్ము. బుద్ధిమంతులు రాని దాని కెదురు చూడరు. పోయిన దానికి వగవరు. విపత్తు వచ్చినప్పుడు వితాకు పడరు. కాఁబట్టి మిత్రుఁడా! సదా నీవుత్సాహముతో నుండుము. శాస్త్రములు చదివియు మూర్ఖులయి యున్నారు. పురుషుడెవ్వఁడు క్రియావంతుఁడో వాఁడు విద్వాంసుడు. రోగుల కౌషధము పేరు చెప్పిన మాత్రమున రోగ శాంతి గాబోదు. వివేక హీనునికి శాస్త్రజ్ఞానము గ్రుడ్డివానికి స్వహస్త దీపము వలె నిష్ఫలము. చూడుము, విపత్తు వచ్చి నప్పుడు నాకు ఖేదము లేదు, సంపద వచ్చినప్పుడు మోదము లేదు. దేహి కాపత్సంపదలు పర్యాయమున రాకడ సహజము. అర్థములు నిత్యము గావనియెడు నెఱుక గలవాఁడు తన్నాశమునకు వగవఁడు. అర్థము లేకున్న ధీరునకు లోకమందు మాన్యత కొఱతపడదు. పుష్కలముగా ధనము కలిగి యున్నను క్షుద్రునకు గారవము రాఁబోదు. సింహమునకుఁ గలిగిన నైసర్గిక తేజము శ్వానమునకు నూఱు బంగారు సొమ్ములు పెట్టినను రాదు. నీవు బుద్ధిమంతుడవు. నీ గారవమున కిప్పుడు హాని యేమి? ఏలాగున నైనఁ బుట్టించిన వాఁడాహారము కల్పింపక పోఁడు. చూడు, జంతువు గర్భము నుండి నేల జాఱఁగానే తల్లి ఱొమ్ము చేఁపుచున్నది. కాబట్టి జీవనార్థము మిక్కిలి యాయాసంపాటు సయితము వ్యర్థము. నీవు సకల ధర్మములు తెలిసిన వాఁడవు. నీకు విస్తరించి చెప్పఁ బని లేదు. నీకు లఘుపతనకుఁ డొక్కడు నేనొక్కఁడను గాము. మనలను మూవురను దైవ మొక్క చోట జేర్చెను. దొరికి నంతటితోఁ గాలము గడుపుకొని సుఖముగా జీవింతము.' అనిన హిరణ్యకుఁడు మిక్కిలి సంతోషించి యిట్లనియె.
"మంథరా! నీ వచనామృతము వర్షించి నా దురంత తాపము నివారించితివి. నేను ధన్యుఁడ నయితిని. 'మిత్రలాభ మనులాభ సంపద' యను వచనము నేఁడు నాకు లక్ష్యసమన్విత మయ్యెను. ఎవ్వఁడు హంసములను శుకములను మయూరములను శుక్ల హరిత చిత్రముల గావించె, నా యీశ్వరుఁడా యా జంతువులకుఁ దత్తదను రూపమయిన వృత్తిని గల్పించువాఁడు. మూఢు లీ యర్థ మెఱుఁగక వృత్తికయి పడరాని పాట్లు పడి కాలము వ్యర్థముగాఁ బోఁగొట్టు చున్నారు. విత్తము గడన యందొక దుఃఖము, కాఁపుదల యందొక దుఃఖము, వినాశ మందొక దుఃఖము పుట్టించు చున్నది. ఇట్లు దుఃఖైక మూలమయిన విత్తమేల? కాల్పనా? ధర్మార్థము ధనము గోరుట కంటె నిస్పృహత్వము మంచిది. అడుసు త్రొక్కనేల, కాలు గడుగ నేల? ఆకాశమునందుఁ బక్షులచేత భూమియందు వ్యాళములచేత జలములయందు మీనములచేత మాంసము భక్షింపఁ బడినట్లు సర్వత్ర విత్తవంతుడు భక్షింపఁ బడి యెడును. కాఁబట్టి ధన తృష్ణ మానికోలు వివేక కార్యము. తృష్ణ యొకటి మానెనా, యావల దరిద్రుఁడెవడు? ధనికుఁడెవ్వడు? దాని కెవ్వడెడ మిచ్చును? దాని మూర్ధమే దాస్యమునకు సింహాసనము. నీ సన్నికర్ష ప్రభావము చేత నా యజ్ఞానము సర్వము నివర్తించినది. కృతార్థుఁడనయితిని. నిరంతరముగా నీ తోడి సంగతికంటె నాకు లాభమొకటి లేదు. నీ తోడి ప్రణయమున కొక్క కొఱతయు రాఁబోదు. ప్రణయము లామరణాంతములు, కోపములు తత్క్షణ భంగురములు, త్యాగములు నిశ్శంకములు నగుట మహాత్ములకు సహజము." అని పలికిన మంథరుఁడా మాటలు విని మిగుల సంతోషించి హిరణ్యక లఘుపతనకులునుం దానును యథేచ్ఛ విహారాదులఁ గాలక్షేపము చేయుచు సుఖముగా నుండెను.
తరువాత నొకనాడు మంథరాదులు మూవురు సల్లాపములు సలుపుచు బ్రొద్దు పుచ్చుచుండగా నొక మృగము, మృగయునిచేఁ దఱుమబడి బెదరి మహా వేగముతో నక్కడికి బాఱి వచ్చెను. అది చూచి భయపడి కూర్మము జలములో బ్రవేశించెను. మూషికము లాఁగ జొచ్చెను. వాయస మెగిరి వృక్షాగ్ర మెక్కెను. అనంతరము మ్రాని మీఁద నుండి కాకము నిక్కి నలు దిక్కులు చూచి చూపుమేర దూరములో భయ హేతు వేదియు లేమి నిశ్చయించుకొని మంథర హిరణ్యకులను బిలిచి మీరు వెఱవకుఁడు. చుట్టు పట్టు మిక్కిలి దూరము చూచితిని. భయమునకు నిమిత్త మేదియు నా కంట బడ లేదు. అని చెప్పఁగానే కచ్ఛప మూషికములు జల బిలములు వెడలి వచ్చెను. లఘుపతనకమును వాని చేరువ వ్రాలెను. అంత మంథరుఁడు నీ వేల పాఱి వచ్చితి? వని యడిగిన మృగము ప్రక్క లెగయ రోఁజుచు నిట్లనియె. "నా పేరు చిత్రాంగుఁడు. నన్ను వేఁటకాఁడొకడు తఱుముకొని వచ్చెను. వానికి భయపడి పాఱి వచ్చితిని. వాఁడు నా పఱుగు పట్టఁజాలక వెనుకఁ జిక్కినాఁడు. మీకు నేను శరణాగతుఁడను. సర్వదానములు సర్వవ్రతములు సర్వయాగములు శరణాగత రక్షణముతో సరికావు. శరణాగతునుపేక్షించుటకంటె దురితము లేదని ధర్మజ్ఞులు చెప్పుదురు. మీరు సకల ధర్మ వేత్తలని బుద్ధిమంతులు చెప్పఁగా విని యున్నాఁడను. మనసు కలత పడి యుండుట వలన నిది చెప్పదగిన మాట, యిది చెప్పగూఁడని మాట యని యెరుంగక యేమో చెప్పినాఁడను. మీకు ధర్మములు చెప్పెడు పాటి వాఁడను గాను. నా వాగ్దోషము క్షమియించి నన్ను రక్షింపుడు. మీతో మైత్రి సంపాదించుకొని యిక్కడ వసించి కాలము గడుప వలెనని నా కోరిక. మా బంధువులను, మా దేశమును విడిచి వచ్చితిని. మీ మఱుఁగు చొచ్చితిని. మీఁద నన్నుఁ బాల ముంచెదరో నీట ముంచెదరో మీదే భారము." అనిన విని మంథరుఁడిట్లనియె. "చిత్రాంగా! నీవు బుధ్ధిమంతుఁడవు, సాధువవు. నీతోడి సఖ్య మవశ్యము మాకపేక్షణీయము. దీనికింత దూరము చెప్పఁ బనిలేదు. ఈ తావు నీ యిల్లుగా నెంచుకొని మాతోఁగూడి యథేచ్ఛముగా వర్తించుచు సుఖముగా నుండుము." అని చెప్పఁగా మృగము మిగుల సంతోషించి యా వనమందు లేఁబచ్చిక జొంపములు మేయుచు మడుఁగులోని నీరు త్రావుఁచు జేరువ మ్రాని నీడలోఁ బండుకొనుచు నిట్లు చిరకాలము సుఖముగా వసించెను.
అంతట నొకనాఁడు మృగము మేఁతకుబోయి తొల్లిటి వలె వేళకు వచ్చి తావు చేరమికి మిక్కిలి చింతపడి మంథరుఁడు లఘుపతనక హిరణ్యకులతో నిట్లనియె. "మన చెలికాఁడు చిత్రాంగుఁడింత మసలుటకు నిమిత్తమేమి? ఎన్నఁడుగాని యింత తడవు రాక నిలిచినవాఁడు కాడు. అక్కడక్కడ మేఁతకుఁ బోయిన శకుంత సంతానములు కొఱకులు మాని యిరవులకు రాఁ దొడఁగె. వ్రేలు తమతమ పసుల కదుపులను ద్రోలుకొని పల్లియలకుఁ బోవుచున్న వారు. సూర్యుఁడు ప్రతీచీ ముఖమునందు సిందూర తిలకము నందము వహించుచున్నవాఁడు. తరణి కిరణ వారము చల్లారఁ జల్లార నా కారాటము పెల్లు మీఱుచున్నది. కొంతదూరము పోయి వెదకి వచ్చెదనంటినా నాకు గమన వేగము లేదు. మిమ్ముఁ బంచితినా మీఁదుమిక్కిలి మీరు మరల వచ్చి నాకంటఁ బడునందాఁక నా చిత్తము తత్తర పడుచుండును. నేనేమి చేయుదు?" నని కన్నీరు నించి దిక్కులు చూచు చూరకుండ లఘుపతనకుడిట్లనియె.
"నాకు నెల్లపక్షులకంటె జవాతిశయము గలదు. బహుయోజనములయినను క్షణమాత్రములోఁ గ్రుమ్మరి మరలి రానోపుదు. దానిఁ బట్టియే కదా లఘుపతనకుఁడని యన్వర్థ సంజ్ఞఁ బడసి యున్నాఁడను. నీవు కొందలపడకుము. నేనిక్కడ నున్నట్టే యెంచుకొనుము. ఇదిగో నిమిషమాత్రాన వెదకి వచ్చి చిత్రాంగుని వృత్తాంతము చెప్పెద" నని పలికి తక్షణమే యెగిరిపోయి యా యరణ్యము నానా ప్రదేశములు వెదకి యొక్కచో నురులలోఁ జిక్కుపడియున్న చిత్రాంగునిఁ జూచి కన్నుల నీరు వెట్టుకొని చేరఁబోయి "చెలికాఁడా! నీవు పరుల సొమ్మున కాశపడవు. పరులను బాధింపఁబోవు. అడవిలోని గడ్డి మేసి పడియ నీరు త్రాగి యొక చెట్టు నీడలోఁ బడియుండి ప్రొద్దు బుత్తువు. నీ వొక్క కీడు చేఁత యెఱుఁగవు. నీ వంటి సాధువునకా యిట్టి యాపద రావలె? ఇంత దూరము చింతింప నేల? ఎంత వారికిఁ గాని దైవ మలంఘ్యము. ప్రాప్తించిన వ్యసనమునకు బ్రతీకారము విచారింపఁవలెఁ గాని ఱిచ్చ పడి యుండఁ దగదు. కాఁబట్టి యిప్పుడు కర్తవ్యము నీకుఁ దోచినది శీఘ్రముగాఁ చెప్పుము. మంథర హిరణ్యకులు నా మార్గము చూచు చుందురు. పోవలెను." అనినఁ జిత్రాంగుఁడు విని "వేటకాఁడు రాకముందు హెచ్చరికపడి సదుపాయము చేసితిరా నన్నుఁ దప్పింపవచ్చును, లేదా నా యాశ నేఁటితో మానుండు. ఇప్పుడు పోయి వేగిరము హిరణ్యకుని దోడుకొనిరమ్ము. అతఁడు వచ్చెనా నా కట్లు తెగఁ గొఱికి రక్షింపజాలును." అని చెప్పగానే లఘుపతనకుఁడు మనోవేగముతో నెగిరిపోయి యీ వృత్తాంతము మంథర హిరణ్యకులతోఁ జెప్పి హిరణ్యకుని వంకఁ చూచి "మనము కడు శీఘ్రముగా బోవలెను. నీవు నా వేగము ననుసరించి రాఁజాలవు. ఇంతలో నేమి కీడు మూడునో తెలియము. నా వీఁపెక్కుము. నిమిషములోఁ గొనిపోయి విడిచెద"నని చెప్పి యొడంబఱిచి హిరణ్యకునిఁ దన వీఁపు మీద నెక్కించుకొని ఱింగుమను ఱెక్కల మ్రోఁతతో బాణమువలెఁ బోయి చిత్రాంగుని దాపున వ్రాలెను. అంతట హిరణ్యకుఁడు చిత్రాంగుని బంధములు త్రెగఁగొఱికి "చెలికాఁడా! నీవు బుద్ధిమంతుఁడ వీ యురులలో నెట్లు చిక్కితి?" వని యడిగెను. లఘుపతనకుఁడది విని యిట్లనియె. "మన మిక్కడ నిలువరాదు. ముందు ముచ్చట లాడు కోవచ్చును. లేలెండని" పలికి పయనము చేసి తాను వారికి మీఁద దాపుగా గగన మార్గమందు వచ్చుచుండెను. అప్పుడు చిత్రాంగుఁడు హిరణ్యకున కిట్లనియె. "ఎట్టి బుద్ధిమంతునకుఁ గాని యెట్టి బుద్ధిహీనునకుఁ గాని దుఃఖమో సుఖమో యే కాలమందేది యనుభవింప వలెనో యది యనుభవింపక తీఱదు. ప్రాణులకు సుఖ దుఃఖములు సహజములు. నా పూర్వ కర్మ మెట్టిదో పలు మారిట్టి యాపదలకే పాలయితిని.
ఆఱు నెలల ప్రాయమప్పుడు నేను మా జాతి మృగములతోఁ గూడి సంచరించుచుండఁగా నొకనాడు వేఁటకాఁడు వచ్చి యురులు పన్ని మంచి పచ్చికఁ దెచ్చి మచ్చు పెట్టి కొంత దూరానఁ బొదల మాటునఁ గూర్చుండి చూచు చుండెను. అంతట నేను బాల్య చాపల్యముచేతఁ బదపు విడిచి ముందు పేరెము వాఱుచుఁ జివుకు చివుక్కున జవుకళించి దాఁటుచుఁ జని మచ్చుఁ జూచి మేయఁ బోయి యురులలో దగులుకొని భయపడి కూతఁ బెట్టితిని. అంతట మాపదుపు మృగములన్ని తల లెత్తి చెవులు ఱిక్కించి నిక్కి చూచి బెదరి చట్రాతి మీఁదఁ గొట్టిన కుండ పెంచికల వలెఁ జెదరి నలువలఁకులకుఁ బాఱిపోయెను. అనంతరము వేఁటకాఁడు పొదమాటు విడిచి నా దాపునకు వచ్చెను. నేను మృగమను, శిశువను, మా పదుపుఁ బాసితిని, బంధములో జిక్కుకొంటిని, దాపున యముని వలె వేఁటకానిఁ జూచితిని. ఇంక నేమి చెప్పవలె? నా ప్రాణములు ముక్కాలు మువ్వీసము పోయినది. పిమ్మట వాఁడు నా యొద్దఁ గూర్చుండి యొక దారము నా మెడకుఁ గట్టి పట్టుకొని నాకు నోపకుండ ఉరి విడిపించెను. కొంతాయువున్నది కాఁబట్టి నన్ను జంపఁ గడఁగిన వాడుకాడు. తరువాత నన్ను వాఁడఱకడఁ బెట్టుకొని పోయి యా దేశ మేలుచున్న రాజకుమారునికి సూడిదగా నిచ్చెను. ఆ రాచ కుమారుఁడు తమ సాహిణమునకు నెదురు కొట్టములోఁ గట్టఁబంచి నా కాహార దానాది కృత్యములు తఱి తప్పక జరుపుట కచ్చటి సేవకులకుఁ గట్టడి చేసి నా యందు ముద్దుచేత నానాఁడు నన్ను విచారించు కొనుచుండెను. అంత దిన క్రమమున బెదురు విడిచి మనుష్యులతో మచ్చిక పడితిని. కాఁబట్టి కాచువాండ్రు నన్ను రాచకుమారుని యనుమతిని గట్టు వదలి తిరుగ విడిచిరి. నేను మెడ బంగారు జెంగలు గజ్జెలు మ్రోగఁగా విచ్చల విడిగా మనసు వచ్చిన చోట్లఁ దిరిగి తోఁపులందు దొడ్లయందు లేఁబచ్చిక మేసి కొలఁకు నీరు త్రాగి చల్లని మ్రాని నీడఁ గొంతవడి నెమరు వెట్టుచుఁ బండుకొనియుండి సాయంకాలమునకుఁ గట్టుఁబట్టునకు వచ్చి చేరు చుండుదును. ఒక్కనాఁడా పట్టణము వీథిని సంచరించుచుండఁగా బాలకులు గుంపుగూడి కోయని కూఁకలు పెట్టుచు నన్ను వెంబడించి తరిమిరి. నేను బెదరి చవుకళించి దాఁటుచుఁ బారి సమీపమందున్న ప్రమద వనము చొచ్చితిని. చొరఁగానే యక్కడి రాజాంతః పుర కాంతలు నన్నుఁ బట్టుకొని పోయి యంతిపురములో రాచకుమారుని శయన గృహమునకు దాపుగా నొక కంబమునకు గట్టి పెట్టిరి. నాఁటి రాత్రి గన్నులు మిఱుమిట్లు కొలుపు మెఱుపులతో శ్రవణ కుహరములు విదారించు నుఱుములతోఁ గడవలతో ముంచి వంచి నట్లు నిరంతర ధారమైన మిన్ను మన్నేకమయినట్లు కారు గ్రమ్మి యొక వర్షము గురిసెను. అప్పుడా వర్షము చూచి మిక్కిలి కుతూహలపడి మనుష్య భాషతో నాలో నేను 'మీద వాన చినుకులు పడగా మెల్లని చల్ల గాలి పొలయఁగా మా పదువుతోఁ గూడి చవుకళించి దాటుచు దువాళించుచు సద్యోజాతమయిన కదంబ ముకుళ జాతము మేయుచు విచ్చల విడిగా సంచరించు భాగ్యము వెండియు నా కెన్నడు గలుగునో' యనుకొంటిని. అప్పుడు రాచ కొమరుఁడాచమనము చేయను వసారములో వచ్చుచు నా మాటలు విని దిక్కులు చూచి వెంబడి వచ్చు లంపతానివానిఁ జూచి 'ఇక్కడ వింతవారెవ్వరు లేరు. ఇప్పటి మాటలు నీవును వింటివి గదా! ఇది ఏమి వింత? ఈ జింక పిల్ల యొక్కటియే యీ లోఁగిట నున్నది. ఇది ఈలాగున మాటలాడి యుండునని తోఁచుచున్నది. నీ కేమి తోఁచుచున్న' దనిన వాఁడిట్లనియె. 'ఏలిన వారికి దోఁచినది తప్పదు. మన విన్న మాటలచేఁ దెలియ బడిన కోరిక మానిసికిఁ బుట్ట నేరదు.' అనిన రాచకొమారుఁడు విని యౌనౌను లెస్సగా నూహించితివని పలికి యాచమించి పోయి శయనించి తరువాత లేచి కొలువుఁ గూటమునకు వచ్చి కూర్చుండి జ్యోతిశ్శాస్త్ర పారంగతుని నొక్క బ్రాహ్మణుని రావించి జరిగిన వృత్తాంతము వినిపించెను. అతఁడది విని 'మృగము మానుష భాష భాషించుట మిక్కిలి యనిష్ట సూచకము. దీనికి జప హోమాదులు చేయింపుఁడు. ఇప్పుడా మృగమును ముందుగా దూరపు టడవిలో విడువఁ బంపుఁడు. ఇట్టి మృగమును నిండిన ఇంటిలో నిమిష మయినను నిలుప రాదు.' అన విని రాచకొమారుం డంతఃపురమందుండి నన్నుఁ దెప్పించి 'యీ మృగమును దూరపుటడవిలో విడిచి రం'డని సేవకుల కాజ్ఞాపించెను. వారు నట్లు చేసిరి. అవ్వల వనములో నక్కడక్కడఁ దిరుగుచుండగా వేఁటకాఁడు తఱుముకొని వచ్చెను. నేను భయపడి పాఱి వచ్చి మీ మఱుగు చొచ్చి యప్పటి ముప్పు తప్పించుకొంటిని. నేఁడిక్కడఁ దగులు కొని నీ యనుగ్రహము వలన బ్రదుకు గంటిని. ఇప్పటికిఁ గడ తేఱితి మన రాదు. మీఁద నేమి రానున్నదో యెఱుఁగుదమా? నీ వెంత బుద్ధిశాలివి? నీ వృత్తాంతము మంథర లఘుపతనకుల వలన విన్న వాఁడను. నీవు పడ్డ యిడుములు చెప్పి తీఱునా? వేయిమాట లేల, విను. విధి త్రిప్పులకు లోఁబడని జంతు వొక్కటి లోకమందుండదు." అని చెప్పి 'మంథరుఁడు మన రాక వేచి యుండును. మనలఁ జూచు నందాఁక నాతనికిఁ బ్రాణములు కుదుటఁబడవు.' అని ముచ్చట లాడుచు వచ్చు చుండగా, నింతలోపల నక్కడ మంథరుండు లఘుపతనక హిరణ్యకులు వోయిన దిక్కు చూచుచుం 'బోయిన వారేల ఇంత తడసిరి? పోయిన పని నిరంతరాయముగా సాగెనేఁ దడ వేల పట్టును? కటకటా! ఎట్టి పాపపు మాట వినబడునో కదా! ఏమి చేయుదును?' అని తలపోయు చక్కడ నిలువఁజాలక వెడలి వచ్చువాఁడు మార్గమందు హిరణ్యకాదులను జూచి 'యయ్యలార! వచ్చితిరా! నా కడుపునఁ బాలు వోసితిరి. శీఘ్రముగాఁ బోయి స్థానము చేరుడి.' యని పలికి తానును వారి వెంబటి వచ్చుచుండెను. అంత హిరణ్యకుఁడు మంథరునితో నిట్లనియె. 'నిముష మెచ్చు తక్కువగా రాక మానము. దీనిలో నేమి మునిఁగి పోయినది? ఇట్టి సాహసము చేయ రాదు. ఏదిగాని యిక్కడ నొక్క యిక్కట్టు వచ్చెనా మేము తప్పించుకో నేర్తుము. జలముల యందువలె నీకు మెట్టలో గమన వేగము లేదు. కాబట్టి యిప్పు డిక్కడికి నీ రాక శుభోదర్కముగా నాకుఁ దోఁపలేదు.' అనిన మంథరుఁడిట్లనియె. 'మీరింతాలస్యము చేసితిరి. మీ లోపల నొక్కరయిన ముందు వచ్చి జరిగిన వృత్తాంతము చెప్పవచ్చును గదా! అదియును లేకపోయెను. మీదు మిక్కిలిగాఁ బోయిన వారేమి కీడునకుఁ బాలయిరో యేమయిరో కదా యని మనసు మరి మరి తత్తఱింపఁ దొడఁగెను. నీవు చెపుమా! ఎట్లు నిలువ మనసు వచ్చును? మిమ్ముఁజూచిన వెనుకగా నా గుండె కుదిరినది.' అని సల్లాపములు సలుపుచుండగా మృగయుఁడురులొడ్డిన చోటికి వచ్చి మృగముచ్చు త్రెంచుకొని యుఱికినదని యెఱిఁగి యాశ్చర్యపడి విల్లెక్కు పెట్టి చేతఁబట్టుకొని యడుగుల జాడ చూచుచు మృగము పోయిన దారినే వచ్చు చుండగా లఘుపతనకుఁడు చూచి 'యోహో! మాటల పరాకున మీరు పెండ్లినడక నడచు చున్నవారు. వేఁటకాఁడిదె వెంబడించి పొంచికొని వచ్చు చున్నాఁడు. మాటల కెడలేదు. సత్వరముగా నూడని బాఱుఁ' డనిన విని హిరణ్యకుఁ డొక్కలాఁగ దూఱెను. చిత్రాంగుఁడు పాఱిపోయెను. మంథరుఁడు నిసర్గమునకు భయము తోడ్పడ నడవఁ గాళ్ళు రాక మెల్లఁగాఁ బోవుచుడెను.
అంత మృగయుఁడు తన్నుఁజూచి మృగము పాఱిపోకకు ఖేదపడి యచ్చోటఁ గచ్చపమును జూచి కొంట సంతోషించి డాయఁ బోయి పట్టుకొని గొనయమునఁ గట్టుకొని మూఁపు మీఁదఁ బెట్టు కొని పోవుచుండెను. అప్పుడు చిత్రాంగాదులు మూవురును గూడుకొని మంథరునకు వచ్చిన వ్యసనమునకుఁ గన్నీరు విడుచుచుఁ గొంత దూరాన వేఁటకాని వెనుకనే పోవుచుండిరి. హిరణ్యకుఁడు చిత్రాంగ లఘుపతనకులను జూచి "ప్రాప్తించిన దుఃఖము నిస్తరించితిమి గదా యని క్షణమునకు ముందు సంతోషపడితిమి. ఇంతలోనే యీ దుఃఖము ప్రాప్తించెను. ప్రాప్తించిన దుఃఖమునకు విషాద పడరాదు. వేఁటకాఁడడవి దాఁటి పోకమునుపే మంథరుని విడిపింప ననువయిన యుపాయము వెదకవలెను. మించి పోయిన వెనుక మన కభిమతము సాధించుట దుష్కరము." అనిన విని చిత్రాంగ లఘుపతనకు లిట్లనిరి. "మేను నిప్పులం బొరలి నట్లెరియుచున్నది. చిత్తము స్వాయత్తము గాదు. కర్తవ్య మిట్టిదని మాకుఁ దోఁచినది గాదు. నీవు బుద్ధిశాలివి. నీకుఁదోఁపని యుపాయము లేదు. చెలికానిని విపత్సముద్రము దరి చేర్చి శోక సముద్రము దరిఁ దరివలె మమ్ముఁ జేర్పుము. నీవు దక్క మా కన్యము శరణము లేదు. కర్తవ్యమును మాకుపదేశింపుము. నీ పంపు శిరసావహించి చేసెదము." అనిన హిరణ్యకుఁ డిట్లనియె. "మన లోపల నొక్కరికి వచ్చిన మేలు గీళ్ళకు మనమందఱము పాలివారము. కాఁబట్టి ఇప్పుడు ప్రాప్తించిన వ్యసనమునకు బ్రతికార గవేషణము మీకుఁ బోలె నాకు నావశ్యకమయి యుండఁగా మీరు నన్నింత వేఁడుకోనేల? ఏదో నాకుఁ దోఁచిన యుపాయము చెప్పెదను. మీరు మీ బుద్ధి చేత విచారింపుఁడు. సర్వ సమ్మత మయిన పక్ష మవలంబింతము." అని చెప్పి చిత్రాంగుని జూచి "నీవు వేఁటకాని కంటఁబడకుండ ముందు పోయి వాఁడు వచ్చు మార్గములో నొక జలాశయము తీరమందొదికిలి నాలుగు కాళ్ళు జాచుకొని మ్రాఁగన్నువెట్టి మెడయెత్తి మోరసారించి చచ్చినట్లు మెదలక పండుకొని యుండుము. లఘుపతనకుఁడు నీమీఁద గూర్చుండి కన్నులు పొడుచుకొని తినువాని వలె నభినయించుచు నఱచుచునుండువాఁడు. అంత వేఁటకాఁడు మృగము చచ్చిపడియున్నదని భావించి మంథరునితోడ విల్లుదించి నేలఁబెట్టి చేరువకు వచ్చును. నేను వాని వెంటనే వచ్చి మంథరుని బంధము చిటుకనకుండ దెగఁగొఱికెదను. అంతట మంథరుఁడు జలాశయముఁ బ్రవేశించువాఁడు. నేను బొఱియ దూరెదను. మీరు పారిపొండి. ఇది నాకుఁ దోఁచిన యుపాయము." అనిన విని చిత్రాంగ లఘుపతనకులు హిరణ్యకుని బుద్ధికి మిగుల సంతోషించి తదుక్త ప్రకారమున గార్యము నిర్వర్తింప హిరణ్యకుఁడు దనపాలి కార్యము నెఱవేర్చి మనోరథ సిద్ధిఁ బడసెను. అప్పుడు మృగయుఁడు మిగుల వగఁబొంది యల్లల్లఁ దన మనికి పట్టునకుఁజనియె. హిరణ్యకాదులు తమ యిరవునకుఁజని తొంటియట్లు సుఖమ్ముండిరి.
మిత్రలాభము సంపూర్ణము.
AndhraBharati AMdhra bhArati - bAla sAhityamu - mitralAbhamu - nItichaMdrika - paMcha taMtramu - paravastu chinnaya sUri ( telugu andhra )