వచన సాహిత్యము పీఠికలు శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము

అయ్యలరాజు త్రిపురాంతకకవి - శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము
శ్రీ కె. గోపాలకృష్ణరావుగారి ‘ఆంధ్రశతకసాహిత్య వికాసము’ (1976) నుండి

రఘువీరశతకకర్తృత్వమును గూర్చి పండిత విమర్శకులలో భిన్నాభిప్రాయములు కలవు. కీ.శే. వంగూరి సుబ్బారావు, గన్నవరపు సుబ్బరామయ్య, కేతవరము వేంకట నారాయణరావు ప్రభృతులు అయ్యలరాజు త్రిపురాంతకుడే రఘువీరశతకకర్త అని నిర్ణయించిరి. కీ.శే. కాశీనాథుని నాగేశ్వరరావుగారు రామభద్రకృతమని భావించిరి. ఇట్టి అభిప్రాయము కలుగుటకు అయ్యలరాజు రామభద్రకవి రామాభ్యుదయ కావ్యమున తన్ను గూర్చి చెప్పికొనిన గద్య కారణము. ఆ భాగమిట్లున్నది. “ఇది శ్రీమదొంటిమిట్ట రఘువీరశతక నిర్మాణ కర్మఠ జగదేకఖ్యాతిధుర్యాయ్యలరాజు తిప్పయ మనీషి, పర్వతాభిధానపౌత్రాక్కరాయపుత్ర పరిశీలత సమిద్ధ రామానుజ సిద్ధాంతమర్మ ముమ్మిడి వరదరాజాచార్య కటాక్షవీక్షాపాత్ర, హృదయపద్మాధిష్ఠిత శ్రీరామభద్రకవి ప్రణీతంబైన రామాభ్యుదయంబునందు...”.

ఈ గద్యయందలి “ఒంటిమిట్ట రఘువీరశతక నిర్మాణకర్మఠ” అను భాగమును తిప్పయ మనీషికి అన్వయించి కొందఱును, రామభద్రకవికి అన్వయించి మఱికొందఱును శతకకర్తృత్వముగూర్చి అభిప్రాయమును వెల్లడించిరి.

కీ.శే. వంగూరి సుబ్బారావుగారు పై విశేషణము తిప్పయ మనీషికి అన్వయించి త్రిపురాంతకుడే ఈ శతకమును రచించెనని భావించిరి. తమ అభిప్రాయమునకు బలము చేకూర్చునట్టి మఱియొక ఆధారమునుకూడ వారు చూపిరి. ఈ శతకమునకు గల తంజావూరు ప్రతియందు శతకకర్తృత్వమునకు సంబంధించిన పద్య మిట్లు కలదు.

	అతుల ప్రౌఢిమమీఱు రాయకవి యయ్యల్రాజు సత్పుత్రు డం
	చితభక్తిన్ త్రిపురాంతకుండు రచియించెన్ తెన్గు పద్యంబులన్
	శతకం బొక్కటి, దీని నీవు విని యాచంద్రార్కమై నిల్పు ప
	ర్వత కన్యానుత! ఒంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా!

వావిళ్ళవారు ప్రకటించిన రఘువీరశతకమునకు వ్రాసిన పీఠికలో గన్నవరపు సుబ్బరామయ్యగారు ఈ శతకకర్త త్రిపురాంతకుడని స్పష్ట మొనర్చిరి. కేతవరము నారాయణరావుగారు “ఆంధ్రవాఙ్మయచరిత్ర సంగ్రహము”న వీరి అభిప్రాయములను సమర్థించిరి. కీ.శే. నాగేశ్వరరావుగారు తంజావూరి ప్రతిలోని పద్యము విశ్వాసార్హముకాదని అభిప్రాయపడిరి. గద్యయందలి విశేషణము రామాభ్యుదయకర్తకే అన్వయించునని వారి అభిప్రాయము. నాగేశ్వరరావు పంతులుగారి వాదము అంగీకారయోగ్యము కాదని పలువురు ఆంధ్రవాఙ్మయ చరిత్రకారులు నిర్ణయించినందున ఈ శతకకర్త త్రిపురాంతకుడను అభిప్రాయము సమంజసముగా తోచును.

ఈ శతకము “ఒంటిమిట్ట రఘువీరా జానకీనాయకా” అను మకుటమున రచింపబడినది. కొన్ని ప్రతులలో ఈ శతకము జానకీనాయక శతకముగ పేర్కొనబడినది. కాని ఒంటిమిట్ట రఘువీరశతకముగనే ప్రసిద్ధమగుటచేత ఈ పేర శతకము ముద్రింపబడినది.

త్రిపురాంతకు డొక పద్యమున “ఆ కర్ణాటక మండలాధిపతిచే నాస్థాన మధ్యంబులో నా కావ్యంబులు మెచ్చజేసితివి నానారాజులుం జూడగా” అని చెప్పియుండెను. దీనివలన కవి రచితములు మఱికొన్ని గ్రంథములు కలవని స్పష్టమగును. కాని వానిని గూర్చిన వివరములు తెలిసికొనుట కాధారములు లేవు. కొంతకాలము రాజాశ్రయము నొందియు, దారిద్ర్యము ననుభవించినట్లును శతకము వలన దెలియవచ్చుచున్నది. ఈ కవికి అనంతరదశలో రాజులన్న తిరస్కార భావమేర్పడినది. రామభక్తి హృదయమున నాటిన నాటియుండియు నరాంకితముగ కృతులు రచించుట కిచ్చగింపలేదు. అల్పులమీద చెప్పిన కావ్యములు నిరర్థకములనియు రామాంకిత గ్రంథములు వేద తుల్యములగుననియు నొక పద్యమున స్పష్టమొనర్చెను.

రఘువీర శతకము భక్తి వైరాగ్య ప్రధానమైనది. వీరశైవమునకు దీటుగ తెలుగులో వీరవైష్ణవము బహుళ ప్రచారము నొందిన కాలమున త్రిపురాంతకుడు వీరవైష్ణవ దీక్షనొంది ఈ శతకమును రచించినట్లు తోచును.

	నీ పాదోదక మక్షులం దలముకొంటిన్, గొంటి నాలోనికిన్
	నీ పళ్ళెంబు ప్రసాదముం గుడిచితిన్ నీ పేరునుం బెట్టితిన్
	నీ పెన్ముద్రలు దాల్చితిన్ భుజములన్.

తులసిని పూజించుట, రక్షామంత్రము ధరించుట, తులసిదళోదకము ద్రాగుట, తిరునామము ధరించుట, ముద్రలు దాల్చుట మున్నగునవి వైష్ణవ సద్భక్తుని లక్షణములు.

త్రిపురాంతకుడు నామకీర్తన కధిక ప్రాధాన్యము నొసగెను. రామనామ కీర్తన మొనర్చు చండాలునికైనను ముక్తి లభించుననియు, ప్రాణావసాన సమయమున రామా అను రెండు అక్షరములు పలుకుటకు శక్తి నొసగుననియు, పునర్జన్మ లుండవనియు కవి నామకీర్తన ప్రభావమును వివరించెను. సదాశివుడు సతీసమేతుడై కాశీక్షేత్రమున రామ నామము జపించునని శ్రుతులు బోధించిన దృష్టాంతమును జూపి సురప్రమదా పల్లవ పాటలాధరసుధాపానాది కేళీవిహారులైన దిక్పాలురు రామనామమును జపింతురని త్రిపురాంతకకవి రామకీర్తన ప్రాధాన్యమును, రాముని ఆధిక్యమును చాటెను. శరణు కోరిన భక్తుల ననుగ్రహించుటలో రామలక్ష్మణు లిరువురు తోడుగా వత్తురని శ్రీరాముని భక్తానుగ్రహతత్పరతను దృష్టాంత పూర్వకముగ వివరించెను. కర్మబంధములను త్రెంచుటకు శ్రీరాముడే సమర్థుడైన దైవమని కవి విశ్వసించెను.

త్రిపురాంతకుడు కొన్ని పద్యములలో వైరాగ్య భావమును వ్యక్తీకరించెను. సతీ సుతులని సంసారవ్యామోహ పాశబద్ధులగుటవలన ప్రయోజనము శూన్యమని హితబోధ గావించెను. ముఱికి డొక్కలను నమ్ముకొని రాముని సేవింపనేరనివారు మూఢాత్ములని కవి అభిప్రాయము. త్రిపురాంతక కవి శతకమున పోతన అనుకరణములు కొన్ని కలవు. ఈ శతకము ననంతరకవులెందరో అనుకరించిరి.

	రవిసూనున్ బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినా డందునో
	రవిసూనుం గృపనేలి యింద్రసుతుఁ  బోరన్‌ ద్రుంచినా డందునో

అను ఈ శతక పద్యానుకరణము కృష్ణశతకమున గలదు.

	దివిజేంద్రసుతుని జంపియు
	రవిసుతు రక్షించినావు రఘురాముడవై
	దివిజేంద్రసుతుని గాచియు
	రవిసుతుఁ బరిమార్చి తౌర రణమున కృష్ణా

ఈ శతకమున కోసివేసే, కాచే, చూచే, చూతామన్న, వండుకు తిన్న మున్నగు లక్షణవిరుద్ధములైన ప్రయోగములు వ్యావహారికరూపములు బహుళముగ ప్రయోగింపబడినవి.

AndhraBharati AMdhra bhArati - vachana sAhityamu - Samiksha - K. Gopala Krishna Rao Andhra Sataka Sahitya Vikasamu ( telugu andhra )