వచన సాహిత్యము పీఠికలు వేణుగోపాలశతకము - పోలిపెద్ది వేంకటరాయకవి

వేణుగోపాలశతకము - పోలిపెద్ది వేంకటరాయకవి
పీఠిక
- శ్రీ కె. గోపాలకృష్ణరావు
(అధిక్షేప శతకములు - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ, 1982)

పోలిపెద్ది వేంకటరాయకవి శతకవాఙ్మయచరిత్రలో విశిష్టస్థానము నలంకరించినవాడు. ఈతడు కార్వేటిసంస్థాన కవులలో ప్రముఖుడు. రాజాశ్రయము నొందినను స్వతంత్రదృక్పథముతో జీవించినవాడు. తిట్ల దండకము - లావణ్య శతకము - వేణుగోపాల శతకము లీతని ప్రశస్తకృతులు. దండకప్రక్రియను దూషణోక్తిప్రధానముగ రచించినవారిలో వేంకటరాయకవి ప్రముఖుడు. వ్యక్తిగతద్వేషమును క్రోధమును మూర్తీభవించుకొనిన దండకమిది. లావణ్య శతకము శృంగారప్రధానమైనది. వేణుగోపాల శతకము నాటి అధిక్షేప శతకములలో తలమానికమైనది. భక్తి-నీతి-అధిక్షేప గుణసమ్మిళితమైనను అధిక్షేపప్రధానమై సమకాలిక వ్యవస్థకు దర్పణము పట్టుచున్న కృతి ఇది.

కార్వేటినగర సంస్థానమున వేంకటరాయకవి సముచిత గౌరవస్థానము నొందియుండెను. ఏ అధికారుల వలన అనాదరము నొందెనో తెలియదు కాని, సంస్థానోద్యోగులను గూర్చి ఈ కవి వచించిన నీతులు అధిక్షేపములు నిరసనపూర్వకముగ నున్నవి. ప్రభువులు, అధికారులు మున్నగువారి వర్తనము నీతడు గమనించి కొన్ని విశేషములను సామాన్యీకరించి ఈ అధిక్షేప శతకమును రచించెను. రాజులు- రాజోద్యోగులు- వారి వర్తనమును గూర్చి ప్రత్యేకముగ శతకము రచించినవారిలో వేంకటరాయకవి ప్రముఖుడు. సంస్థానవ్యవస్థను ప్రత్యేకించి చెప్పుటలో వేంకటరాయకవి అధిక్షేపధోరణి కూడా ప్రత్యేకముగ గమనింపదగినది. ప్రభువు నామమునుగాని అధికారుల నామమునుగాని ఎచ్చటను పేర్కొనలేదు. ఒక వ్యక్తిపట్ల గల ద్వేషభావమును కూడ వ్యక్తీకరించలేదు. అధికారుల వర్తనమును ప్రత్యక్షముగ పరిశీలించి లోకానుభవమునకు వచ్చిన అంశములను సామాన్యీకరించి చెప్పిన ధోరణిని నిశితముగ బరిశీలించ, దానిలో వ్యక్తిగతముగ అనుభవించిన వైఖరి తొంగిచూచుచున్నది. వ్యక్తులను కాక వ్యవస్థనే విమర్శించుటలో వేంకటరాయకవి విజ్ఞతను చాటెను. ఈ కవి విమర్శకు గురియైన రాజోద్యోగులలో మీర్‌-బక్షి-ముసద్ది-దివాను మున్నగువారు ముఖ్యులు. వీరి ప్రసక్తి వచ్చినపుడు వేంకటరాయకవి రాజనీతివిశేషముల నెన్నింటినో పేర్కొనెను. రాజు మందుడైనను, మంత్రి దుర్మంత్రపరుడైనను రాజ్యపాలన మస్తవ్యస్తమని కవి ఉదాహరించుట, ప్రభువునకు సుబుద్ధియగు మంత్రి ఉండుట అవసరమని సూచించుట ఇట్టిది. రాజ్యాధిపతి ఉదారహృదయుడై అర్థిజనము నాదరించి సత్కరింపబూనినను మంత్రులు సాగనీయక వారికి దుర్బోధలొనర్చుచుందురని వేంకటరాయకవి విమర్శించెను. రాజాస్థానములో వివిధ అధికారులను, కవిపండితులను గౌరవించని వేశ్యలను కూడ ఈ శతకకర్త ఒక సందర్భములో విమర్శించెను. పాలనలేని భూపతి వలన కవిపండితులకు విద్వాంసులకు దాతలకు ప్రాణసంకటమనియు రాజాస్థానములలో మూర్ఖులు చేరినపు డీ స్థితి తప్పదనియు నాటి వ్యవస్థను తూలనాడెను. ఇటువంటి పరిస్థితులలో రాజసేవయే ప్రమాదకరమని వేంకటరాయకవి భావించెను. కవిపండీతుల నీసడించినవారిని ముచ్చెలతో కొట్టి శిక్షింపవలయునని ఈ కవి భావించెను. దొరసొమ్ము తిని అవసరమునకు రానివారు, పరకాంతల నాసించువారు, దాతను దీవించక వెడలిపోవు యాచకుడు మున్నగువారును ఇట్టి శిక్షకు అర్హులని కవి అభిప్రాయము. వివిధ రంగములకు చెందిన వ్యక్తులు- దుర్వర్తనము మూర్తీభవించినవారు- కపట యోగులు- అజ్ఞులు- ఆత్మాభిమానవిహీనులు- మందబుద్ధులు- ఉన్నతస్థానముల నధిష్ఠించిన మందమతులు మున్నగువారిని గూర్చియు ఈ కవి నిశితవిమర్శ లొనర్చెను.

సాంఘికవ్యవస్థను పరిశీలించినపుడు కొన్నికొన్ని అంశములను యుగధర్మములుగా కవి భావించుట గమనింపదగినది. వీనిలో వర్ణసాంకర్యము ప్రధానమైనది. తండ్రి మధ్వాచారి తనయు డారాధ్యుండు తల్లి రామానుజమతస్థురాలు అని వర్ణసాంకర్యమును గూర్చి కవి చమత్కరించెను. అసమర్థు లున్నతస్థానము నొందుటకు కూడ కలియుగధర్మమే కారణమని కవి విమర్శించుట పరిశీలింపదగినది. కలియుగమున వేశ్యలకు గలిగిన ప్రాధాన్యమును పురస్కరించుకొని ఆడపుట్టువు, అందును ‘లంజె’గా జన్మించుట మేలని కవి భావించెను.

ఈ శతకమున గల కవిపండితుల గూర్చిన ప్రశంసలు విమర్శలు నాటి పరిస్థితులను వ్యక్తమొనర్చుచున్నవి. అరసికులైన రాజుల నాశ్రయించి వారికి కృతుల నొసగకూడదని వేంకటరాయకవి అనేక సందర్భములలో స్పష్టమొనర్చెను, అది ‘రోత’ గలిగించునట్టిదని పరిహరింపదగినదనియు సూచించెను. కవి శాపాపగ్రహశక్తియుక్తుడై యుండవలయునని వచించినపుడు వేంకటరాయకవికి వేములవాడ భీమకవి, అడిదము సూరకవి ప్రభృతులు మనోరంగమున నిలచి యుందురు. సుకవి ఆగ్రహమునకు గురియైన వ్యక్తి ఇంద్రుడైనను బిచ్చమెత్తవలయుననియు, అనుగ్రహమునకు పాత్రుడైనవాడు అతిదీనస్థితినున్న బీదవాడైనను అందలమెక్కవలయునని కవివాక్కున కంతటి శక్తి యుండవలయునని వేంకటరాయకవి వచించెను. సుకవిత అజ్ఞునకు, మోటువానికి పనికిరానిది- కవులు అజ్ఞానుల నాశ్రయించక చిత్రప్రబంధాదుల రచింపవలయునని ఉపదేశించెను. కవుల కీయవలదని కన్నుగీటు లోభుల నీ కవి నిశితముగ మందలించెను.

అనేకాంశముల నొకచో చేర్చి విమర్శించుట, పూర్వశతకకర్తల అనుకరణ ధోరణి ఈ శతకమునందును కనిపించును. రోత జుగుప్స కలిగించునట్టివి- ఉభయభ్రష్టత్వము- పెద్దమ్మ విడిదిచేయు స్థానములు- ఆదర్శజీవనము, దుర్భరజీవనము, నడుమంత్రపుసిరి మొదలగు వానికి సంబంధించిన అంశములిట్టివి.

చౌడప్ప ‘పస’ గల వివిధాంశములను ప్రత్యేకముగ పేర్కొనినట్లు ఈ కవి వీనిని ఒకచో చేర్చి విమర్శించెను. కవివరుల నవమానించుట, పంచాంగములు మోయుట ఇట్టివి. రాజసన్మానము- సంగీతసాహిత్యాభిరుచి- అగ్రజన్మము- అనుకూలవతియైన భార్య- మొదలగునవి భూతలస్వర్గ సుఖదాయకములని కవి వివరించెను. ఆలు గయ్యాళైన కోడలు దొంగైన పొరుగిండ్ల వెంబడి తిరిగి గృహకృత్యములు చెప్పి ఏడ్చెడి చెల్లెలైన నున్నచో వాని జీవనము దుర్భరమని కవి వచించెను. నత్తు లేని ముత్తైద ముక్కు- పెద్దమ్మ విడిది చేయు స్థానమట! వేశ్యాతనయు డబ్బుకు పెట్టు తద్దినము ఉభయభ్రష్టత్వము వంటిదట!

సామాన్యధోరణిలో సాగిన నీతిబోధనలు- పూర్వనీతిశాస్త్రగ్రంథశ్లోక భావములను స్ఫురింపజేయును. మద్యపాన మొనర్చువారితో స్నేహము- శాత్రవు నింట భోజనము- దేవభూసురవృత్తి అపహరణము మున్నగునవి పరిహరింపదగినవని కవి ఉపదేశించుట ఇట్టిది. సామాన్యవ్యక్తులకే కాక రాజులకును సంబంధించిన నీతుల నీ కవి కొన్నింటిని పేర్కొనెను. కవి లోకజ్ఞత వలన, రాజాస్థానములలో సంచరించుట వలన వీనిని గ్రహించి యుండును. పరవధూకాంక్షవలన కలుగు అనర్థముల వివరించిన సందర్భ మీతని లోకజ్ఞతను నిరూపించును.

సమకాలిక సామాజిక వ్యవస్థలోని వివిధరంగములను కవి కన్నులకు కట్టినట్లు వర్ణించెను. జానపదులు- ప్రాకృతజనము- వివిధ వృత్తులవారు- వారి వేషభాషలను వర్ణించెను. ఈడిగ- ఉప్పరి మున్నగు వృత్తులవారి వర్ణన లిట్టివి.

వేంకటరాయకవి వచించిన నీతులు- అధిక్షేపించిన అంశములు సరసములైన ఉపమలతో సూక్తిప్రాయములై శక్తిమంతములైనవి. బొండుమల్లెలు బోడిముండలకేల- శుద్ధవేశ్యకు మంగళసూత్రమేల- వంటి పద్యపాదము లిట్టివి. అధిక్షేపధోరణి ప్రాయికముగ లలితహాస్యచమత్కార స్ఫోరకమై యున్నది. ధవుడు పిన్నైన వైధవ్యంబు దప్పునే- కాదె పెండిలి సన్నెకల్లు దాచ- అనునవి ఇట్టివి.

వైరిసమాసములు ప్రాకృతజనవ్యవహారము నందలి తద్భవరూపములు ఈ శతకమున పెక్కు గలవు. గ్రామదండుగ- ఏదము- వాసివేయ- రామాండము- మున్నగున విట్టివి. ఈ కాలమునాటికి సామాన్యపదములతో పాటు పరిపాలనారంగమునకు చెందిన అన్యదేశ్యములు తెలుగులో బహుళముగ ప్రవేశించినవి. ఈ శతకమున ముసద్ది- సుబా- సాయెబ- దరిబేసి- సుబావస్తాదు- పార్సీ మొహర్లు- కలందాను- తాజీతవాజుము- మీర్‌- బక్షి- దివాను మొదలగు పదములు గమనింపదగినవి.


పోలిపెద్ది వేంకటరాయకవి : కవి పరిచయము
-వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

వేణుగోపాలశతకము - పోలిపెద్ది వేంకటరాయకవి - పీఠిక - కె. గోపాలకృష్ణరావు - అధిక్షేపశతకములు - అధిక్షేప శతకము - అధిక్షేపశతకాలు - అధిక్షేప శతకాలు - ఆంధ్రభారతి - వచన సాహిత్యము - పీఠికలు vachana sAhityamu - pIThikalu - Venugopala Satakam - Polipeddi VenkatarayaKavi ( telugu andhra )