వచన సాహిత్యము పీఠికలు చలం (ప్రజా వాఙ్మయం - చింతా దీక్షితులు)

"ప్రజా వాఙ్మయం - చింతా దీక్షితులు" కి చలం ప్రస్తావన

ఈనాడు ఇంకా దీక్షితులుగారి పుస్తకానికి ఓ ప్రస్తావన కావాలనుకోడం చిత్రంగా వుంది. ఇప్పటి తెలుగు సారస్వతశాఖల కెన్నిటికో ఆయనే ఉపోద్ఘాతం.

దీక్షితులుగారి పుస్తకానికి చలం ఉపోద్ఘాతమా? సారస్వత పితృదేవతలకి ఆ లోకాలలోనైనా శాంతినివ్వరా?

ఈ పుస్తకంలోని వ్యాసాల్ని నేనిదివరకు చదవలేదు. వినడమే గాని, ఆయన ఈ విషయమై చేసిన కృషి నాకు స్వయంగా తెలీదు. ఆయన మెచ్చుకునే ఈ పాత వాంగ్మయంగాని (అసలు వాఙ్మయం అనే spelling నేను ఒప్పుకోను) ఆయన తీసివేసే ప్రబంధ వాంగ్మయంగాని నా మనసుకెప్పుడూ దగ్గిరగా రాలేదు. అసలు "పాత, పూర్వం" అనేప్పటికే నా మనసులో విరోధం ఏర్పడుతుంది. Anyhow they have to prove thier merits to win my favour.

ప్రబంధాల్లోనూ, పాతపాటల్లోనూ, గొప్ప flashes of beauty వున్నాయి, కొందరు ముసిలమ్మల చిరునవ్వులో మల్లే, రెండూ సెంటిమెంట్ల పుట్టలు. ప్రబంధాల్లో సెంటిమెంట్లు అసహజం, అబద్ధం, అప్పుడప్పుడు అసహ్యం. ఈ పాటల్లో అందాలన్నీ సెంటిమెంట్లతో అల్లుకొని హృదయాన్ని సమీపిస్తాయి. అట్లాంటివి దీక్షితులు గారిని అప్రయత్నంగా ఆకర్షిస్తాయి. వాటిల్లో అందం వున్నచోటకూడా ఆ అందాన్ని కనిపించుకోను నేను, నన్ను పీఠిక వ్రాయమని ఆజ్ఞ.

నా బాల మిత్రుడొకరు యిటీవలే దీక్షితులుగారిని చూడ్డానికి వెళ్ళి నాకు రాశాడు. "ఆయనచుట్టూ ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఆవరించివుంది. మీ రున్న అరుణాచలం వంటిది అనుకున్నాను ... ... ఆయనని చూస్తే ఎన్నడైనా జీవితంలో ఈయన కోపమనేది ఎరుగునా? అనిపించింది."

అవును, ఆయన కోపమనేది ఎరుగరు. లోకాన్ని కోప్పడవలసిన అవసరం ఆయనకి రాలేదు. ఎంతవరకైనా ఆయన కోపాన్ని చూడగలిగింది ఈ సహజమైన భాషని పైకి రానీక అణగతొక్కే పండితుల మొండితనం. ఆయన దిగులంతా దిక్కులేక నశించే అందమైన యీ పాత వాంగ్మయంపైన.

ఆయన ఎప్పుడూ ఈశ్వరభక్తులు. ఆయనకి ఎప్పుడూ-- God is in His Heaven All is right with the world.

సర్వజ్ఞుడైన ఈశ్వర స్వరూపం ఈ ప్రపంచం. దాన్నీ, దాని పద్ధతినీ ప్రశ్నించవలసిన అవసరంగాని, అర్థంగాని, ఆయనకి కనపడలేదు. నేనా? నన్ను ఈశ్వరుడు ఒక question mark చేసి సృజించాడు. ఆ question mark తన సృష్టికర్తకే ఎదురునిలిచి "ఏమిటి ఇదంతా? ఏమన్నా బుద్ధీ కరుణావున్న వ్యవహారమేనా?" అని ప్రశ్నించింది.

'ముళ్ళల్లోంచి గులాబిపువ్వు వొచ్చింది, చూడు ఈశ్వర మహిమ!' అని దీక్షితులుగారు.

"ఇంత అందమైన పరిమళమైన పువ్వుచుట్టూ ఈ ముళ్ళేమిటి? ఆ సృష్టికర్తకేమైనా బుద్ధివుందా?" అని నేను.

ఇట్లా ఆలోచించడంతో ఆయన దృష్టి పువ్వుమీద నిలిచి మృదుత్వాన్ని పొందింది. సరే. నేను ఎంతమందికి ఎంత లోతుగా గుచ్చుకున్నానో వ్రాయనక్కర్లేదు.

ఈ పాతపాటల విషయమై కూడా మాకదే భేదదృష్టి.

"చూడండి! ఈ అందాలు ఎంత లాలిత్యమో. ఎంత హృదయం పెట్టారో వీటిల్లో. ఎంత సహజంగా, సులువైన మాటల్లో చెప్పారో?" అని ఆయన కొట్టుకుంటున్నారు ఈ పుస్తకమంతా.

"నిజమే; నేనూ చూస్తాను ఆ కవిత్వం, ఆ అందం, కానీ ఆ పాటలుపాడే ముసిలమ్మలూ, తల్లులూ వాళ్ళ మూర్ఖం వాళ్ళ ప్రేమలో ఆ చీకటీ--"

జోలపాటలో తల్లిప్రేమకన్న ఆ ప్రేమను పిలిచిన పిల్ల ఏడుపు వినపడుతుంది ఎక్కువగా నాకు.

"ఎందుకేడవాలి ఆ పిల్ల?" అని మండిపడతాను నేను.

నా చిన్నప్పుడు అర్థరాత్రులు పసిపిల్లలు నా తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ ఏడుస్తో వుంటే, నిద్రకళ్ళతో మా అమ్మ లేచివొచ్చి ఈ జోలపాటలు పాడుతోవుంటే - ఆ పిల్ల ఏడుపు, "ఇంకా పడుకోవేంరా?" అనే తల్లి అరుపు.

రాత్రి తరువాత రాత్రి విని, ప్రతిరాత్రీ "ఎన్నడూ పిల్లల్ని కనకూడదు" అని శపధాలు చేసుకున్నాను. నా కీ పాటలతో సానుభూతి ఎట్లా వొస్తుంది ఈనాడు?

ఏడ్చే పిల్లమీద, కన్నతల్లిమీద, తల్లినంత బుద్ధితక్కువదాన్నిగా చేసిన సంఘంపైన, దీనికంతా కారణమైన ఈశ్వరునిమీద ఎంతో కోపం!

"ఆ ఏడుపే లేకపోతే తల్లిప్రేమని పాప ఎట్లా పిలుచుకుంటుంది? ఇంత అందాలపాటలు ఎట్లా సృష్టి అవుతాయి?" అని చల్లగా అంటారు దీక్షితులుగారు.

అందం వుంటే వుంది, ఈ పాత బూజు పురాణపు తుక్కునంతా పడేసి నరకమనే నా వీరాలాపాల్నీ, ఈ పాటల్లోని చిన్నచిన్న నాజూకుల్నీ రెంటినీ తన ఆలింగనంలోకి తీసుకోగలిగారంటే, ఆయన హృదయ వైశాల్యం తెలిసికోవచ్చు.

"నేను literary cosmopolitan ని" అన్నారు దీక్షితులుగారు. ఆ cosmopolitanism నా రచనల్నే కాదు; నా ఆచారాల్నీ, నన్నూ కూడా ఆదరించ గలిగినంత వైశాల్యమై పెరిగింది.

నేను రాసిన మొదటి కథనుంచి నన్ను ఆయన Merit వున్న రచయితగా గుర్తించగలిగారంటే, ఆయన కంటికి ఏ ముళ్ళల్లోని అందమూ తప్పించుకోలేదని తెలీదా? అట్లాంటప్పుడు ఈ పాటలకు స్పందించకుండా వుంటుందా ఆ మార్దవ హృదయం?

ఈ కృతకభాషావాదులు పూర్వాచారపరులకన్న అంధులు. వాళ్ళకి ఏది చూసినా శత్రుత్వమే. పూర్వాచారాల్లో నిలిచిపోవలసినవి చాలావున్నాయి. కాని ఈ కృతకభాషలో ఉండిపోవలసింది ఏదీ లేదు. వీరికి తమకన్న పాతవీ పనికిరావు. తమకన్న కొత్తవీ పనికిరావు. దురదృష్టవశాత్తూ ఈ కృతకవాదులే అధికారంలో వుంటోవుంటారు.

కాలం మార్పుని తనంతట అదే తీసుకొస్తుంది అంటారే అదెంతవరకు నిజమోకాని, మూర్ఖత్వంలోనూ Vested interests లోనూ మార్పురాదు.

"ఇప్పటికీ బ్రహ్మ - మూర్ఖ చిత్త విస్ఫురణ మడంపలేక తలపోయుచునున్న వాడొగిన్‌"

Fashions మార్తాయి. కాని, మూర్ఖత్వమూ, కదలనితనమూ, నేర్చుకో నిరాకరించే మంకుతనం, అంధత్వం, స్వార్థం, అట్లానే నిలిచివుంటాయి.

ఈ పాటల్ని విన తటస్థించినప్పుడల్లా వాటిల్లోని రసాన్ని గుర్తించి, అసలు తెలుగుభాషా, భాషా మార్దవమూ, కవిత్వలక్షణమూ వీటిల్లోనే వుందని గ్రహించి వాటి పునరుద్ధరణకోసం దీక్షితులుగారు తహతహపడ్డారు. ఏ కఠిన పదజాలాన్నో కావ్యాలంకారాల్నీ, అసహజ పాండితినీ, ఎరువుతెచ్చుకోక, హృదయంలోంచి వొచ్చే ప్రేమకీ, అందానికీ, రంగులుపూయక స్వచ్ఛంగా, సూటిగా పాడిన ఈ పాటలకన్న కవిత్వం ఎక్కడవుంటుంది? ఎప్పుడూ నా నిశ్చితాభిప్రాయం ఏమిటంటే, సులభమైన భాషలో చెప్పడానికి శక్తిలేనివాడే కష్టమైన భాషని ఉపయోగిస్తాడని. వచనంలో చెప్పలేనివాడు పద్యం రాస్తాడు. సహజంగా అందంవున్న స్త్రీకి, విలువైన బట్టలూ, నగలూ అనవసరం. మనుషులు ఏవిధంగా తమ శరీరపు అందవికారాల్ని అందమైన బట్టలకింద దాచుకుంటారో, తమ మానసికపు వంకర్లని రంజకమైన మాటలవెనుక మరుగు పరుచుకుంటారో, అట్లానే చాలాసార్లు తమ భావశూన్యత్వాన్ని పద్యాలంకారాలవెనుక మాయపుచ్చాలని చూస్తాడు కవి. ఇది అమితంగావుంది తెలుగు సారస్వతంలో. అక్కడక్కడ భాగవతాన్నీ, చాలా వరకు భారతాన్నీ, పూర్తిగా పాత ఎంకిపాటల్ని తప్పిస్తే, తక్కిన తెలుగు కవిత్వం ఈ విమర్శకిందికి వొస్తుంది.

ఈ పాటల్ని పాట లనడమే గాని, వీటికి కవిత్వరసమేగానీ దోషమేమాత్రమూ పట్టలేదు. ఎన్ని ఏళ్ళనించో యివి తల్లి ప్రేమలో, భార్య పాతివ్రత్యంలో, చిన్న పడుచుల కలల్లో, పసిపిల్లల చిరునవ్వుల్లో, నాని, నాని, మెరుగు తీసుకొని, ఎన్నివేల హృదయాల తపనల్నో పోగుచేసుకొని చిత్రికపడి యీ రూపాన్ని పొందాయి.

ఏడవకు అబ్బాయి ఏడవకు తండ్రీ

అంటే, ఆమాటల్లో ఏమీలేదు కాని, మన చెవులకి మాత్రం - ఆ ఏడుపును భరించలేని తల్లి ఆవేదన, ఆమె ప్రేమ నిస్సహాయత్వం, "నే నున్నాను. భయం లేదమ్మా, నువ్వు దిక్కులేని వొంటరి లోకంలోకి రాలేదు. చీకటిని చూసి భయపడకు. నే నున్నాను కదూ" అనే తల్లి యిచ్చే ధైర్యం, అన్నీ వినపడతాయి. "అమ్మా" అనే తన అర్థరాత్రి పిలుపుకి ప్రతిసారీ యింత అందమైన పాటల స్వరంతో బదులు పలికే తల్లి కంఠస్వరం బిడ్డ స్వభావంలో ఎంతలోతుకి యింకి అతని జీవితంలో ఎన్ని పువ్వులుగా వికసిస్తుందో ఎవ రెరుగుదురు? తల్లి, బిడ్డలమధ్య అల్లుకునే ప్రేమకి శబ్దంలో, గానంలో రూపం తీసుకొన్న యీ పాటల్ని, ప్రతి యింటోంచీ, ప్రతి రాత్రీ విని, విని నక్షత్రాలే ఎన్నడూ విశ్రమించని తమ నిరీక్షణా గుణాన్ని యీ పాటల కాపాదించాయి. ఏ దోషమూ ఆవరించని చిన్నపిల్లల హృదయ మార్దవం, ఏ లౌకికానుభవపు చిక్కుల్లోనూ మొద్దుబారని సూనృత స్త్రీ స్వభావం లోని నిర్మలత్వమూ, లోకాతీతమైన పురాణపురుషుల చరిత్రానుభవాన్ని తమ యీ పాటల్లో ప్రతిబింబిస్తాయి. పెళ్ళికి, నలుగుకి, భోజనాలకి, వేళాకోళాలకి, ఏ సమయానికి మనసులోంచి ఏ భావం వొస్తే ఆ భావం పాటలకింద మారింది యీ స్త్రీల నవ్వుల్లో, కన్నీళ్ళలో కలిసి.

ఈనాడిట్లా అయిందిగాని, ఇంటోకి పాప రావడమంటె ఇంకో లోకంనుంచి తమని ఆశలవీ పెట్టడానికి, ఉద్ధరించడానికి దిగివొచ్చిన సౌందర్యరేఖగా చూసుకునేవారు. ఈ పాటలు వింటోవుంటే, తల్లి సంతోషం, ఎట్లా ఎక్కణ్ణించి ఈ ప్రేమమూర్తి తన తొడలమీదికి, కావిలింతలోకి వొచ్చాడు అనే అద్భుతం, వినబడతాయి. తన పాప వొంటిరంగు, చిరునవ్వు, చూపు, అన్నీ ఇంటికి వెలుగు. అతను దీపం. అతన్ని చూసి సంతోషపడనివారు అసంభవం. ఆమె కంటికి తాను గొల్చే దైవమే తనకోసం రూపంపొంది తనచేతుల్లో వాలాడు. ఈనాటి నాగరికతా స్త్రీలలోనైనా కాన్పు అనేది సంతోష మివ్వకండా పోలేదు. పిల్లలు భారమనుకోవొచ్చు. ఇంకో పిల్లను ఎట్లా పోషించడమనే దిగులుపడవొచ్చు. కాని పాలివ్వక పోవాలనుకొన్నా, పాలుపడడం ఎట్లా తప్పదో, అట్లా పిల్ల కలగడం ఇష్టంలేక పోయినా ఆ మాతృభావం కలగకమానదు. ఆ ప్రేమా, సంతోషమూ మనసుని ఆవరించక మానవు. పిల్లని జాగ్రత్తగా చూసే వోపిక లేకపోయినా, ఆ బిడ్డ ప్రేమని ఆనందించే తీరుబడి లేకపోయినా, ఎప్పుడో ఏ నిముషాన్నో బిడ్డనుంచి ఏ ఏడుపో, ఏ చిరునవ్వో తల్లి హృదయాన్ని తబ్బిబ్బు చెయ్యకమానదు. పొరుగమ్మతో కబుర్లో, క్లబ్బులో చీట్లపేకో, సినిమా చూడడమో పిల్లకన్నా ఎక్కువ అయినా, ఆ పిల్ల పిలుపు మనసు వెనుక ఎక్కడో, పీకుతో వుండక మానదు. పిల్లనికని ఆ బిడ్డని అనాధనిచేసి ఏడిపించే తల్లులకి ప్రత్యేకంగా నరకంలో ఒక పేట reserve అయివుండాలని నా ఆశ.

తన వాళ్ళెవ రెటుబోయినా, తాను దరిద్రురాలైనా, తనని గౌరవించేవాళ్ళు, పలకరించేవారెవరూ లేని ఏకాకిఐనా,అందరికీ తాను లోకువైనా తనపిల్ల తన స్వంతం, తనవేపే చేతులు జాస్తుంది, తననితప్ప ఎవరినీ "అమ్మా" అని పిలవదు. తనే దిక్కు. తనలోపాలు పిల్లకి కనపడవు, తనని అసహ్యించుకోదు, తను పిల్లకి అందం, దైవం. అదీ తల్లి తృప్తి. తల్లి హృదయంలోని ఆ ఐశ్వర్యం ఈ పాటల్నంతా ఆవరించింది.

ప్రియుల ప్రేమా, తల్లి పిల్లల ప్రేమా ఈ సృష్టి ప్రోద్బలానికి చాలా సన్నిహితాలు. ఎంత సృష్టించినా ఈశ్వర హృదయానికి ఎట్లా తృప్తిలేదో, అట్లానే ఈ ప్రేమల్లో ఎంతకీ తనివితీరడమనేది లేదు, ప్రియులకీ, తల్లులకీ అందువల్లనే నక్షత్రాలమల్లేనే "ఎప్పటికి?" అనే ప్రశ్నతో అనాదిగా ప్రియులూ, తల్లులూ వెదుకుతున్నారు ఈ విశ్వపు అంచుల్ని. ఆ నిరంతరాన్వేషణావేదనే కవిత్వమై ఇట్లా హృదయాన్నించి హృదయానికి, కంఠాన్నించి కంఠానికి పలుకుతోంది.

పిల్లలకి పాటలు రాయటమంటే సామాన్యమైన పనికాదు. మహాకవి కావడం చాల సులభమైన పని దానికన్న. ఈ లోకాన్ని కొత్తగా తాను చుట్టూచూసి, అర్థమయ్యీ అర్థంకాకా, తనతో దోబూచులాడే ఈ మాయాచ్ఛాయల్లోని ఇంద్రజాలానికి అద్భుతపడి దాన్నంతా తనలోకి తీసుకోవాలనిచూసే పసిబిడ్డ ఆతృతని తిరిగి ఏ కవి జీవించగలడు? ఏవొక్క దీక్షితులూ, ఏవొక్క టాగూరో తప్ప!

రంగులూ, గానాలూ విని పిల్ల, పూర్వజన్మస్మృతుల వల్ల ఎక్కడో చూశానే అనే దూరపు జ్ఞాపకాలతో యీ అందాన్ని సమన్వయించుకోవడం, అనుమానం, భయం, అసహ్యం, ద్వేషం లేని హృదయంతో ప్రతిసృష్టి స్పందనానికీ ఎదురు పలకడం, ఏ మొద్దు పదజాలం వ్యక్తపరుస్తుంది? చివరికి టాగూరు కవిత్వమైనా సరే?

తల్లి ముఖం పిల్లకి మొదటి ఆటబొమ్మ. తల్లి వొడి ఉయ్యాల, తల్లి కావిలింత మొదటి Welcome, తల్లి చిరునవ్వు ఆత్మకి మొదటి వెలుగు. తల్లి మొదటి పిలుపులోంచే అందుకుంటుంది పిల్ల, నిద్రలోంచి తనలోకీ మేలుకోమనే సృష్టి ఆహ్వానాన్ని. ఈ నాటికి, ప్రియుల సనాతనావేదనకి నండూరి సుబ్బారావుగారు, పిల్లల నవ్వులకి దీక్షితులుగారూ, బి.వి.నరసింహారావుగారూ, తల్లుల హృదయ స్పందనాన్ని పలికించేందుకు దీక్షితులుగా రొక్కరూ జన్మించారు తెలుగుదేశానికి.

ఈ పాతపాటలు తాళపత్రాలలో లేవు. వీటికోసమై ఒక ఆఫీసు తెరిచి, పెద్దజీతాల్నిచ్చి, పండితుల్ని నియమించి ఏడాదికి నాలుగుపేజీలు ఓ పత్రికలో ముద్రించే ఏర్పాటు ఎవరూ చెయ్యలేదు. ఈ పాత భాండారమంతా స్త్రీ హృదయంలోనే నిలిచిపోయింది. ఆ హృదయం నశ్వరమైన శరీరంలో యిరికివుంది. అందువల్ల దీక్షితులుగారి తొందర. ఈ పాటలు జనాంగీకారాన్ని పొందడానికి కాలమూ, పండితులూ అభ్యంతరాలు.

కాలం మారిపోతోంది. చలం ధర్మమాఅని, ఈనాడు ఉయ్యాలలూపి పిల్లలకి జోలపాటలుపాడే తల్లులులేరు. విద్యావిధానం ధర్మమాఅని ఈ పాతపాటల్ని బళ్ళలో చేరనీరు. వీరేశలింగంగారి ధర్మమాఅని వితంతువులు తెల్లారకట్ట పాటలు పాడడమే మానివేసి సినిమాల్లో చేరుతున్నారు. ఈ నవీన నాగరికతలో వేదంమల్లేనే ఈ పాటలూ నశిస్తాయని దీక్షితులుగారి భయం. పండితులు వీటిని చేరనీరు. పామరులూ వీటిని నిరసిస్తారు. ఇవి fashion కాదనీ, పాతకాలపునాటివనీ, వీటికి గౌరవంలేదనీ, తెల్లారకట్టే ముగ్గులుపెట్టి మజ్జిగచేసే కాలానికి సరిపోయినాయికాని, కాఫీ కప్పులముందుకు రమ్మంటే ఈ పాటలే వొప్పుకోవు రావడానికి.

ఈ పాటలు ఒక కవిగాని, కవయిత్రిగాని ఒకనాడు రాసినవికావు. దశాబ్దంనించి దశాబ్దానికి మామూలు అక్షరజ్ఞానం లేని స్త్రీల నోళ్ళలోపడి, వాళ్ళ అనుభవాలు, కొత్తపాటల్లోనూ, పదజాలంలోనూ, వాతావరణంలోనూ మార్పులు చెంది నిలిచిపోయినాయి. వీటినోసారి పోగొట్టుకుందా, మళ్ళీ పిలుచుకోగలదా దేశం?

పోనీ కాలంలోనిలిచి ప్రచారంలోకి వొచ్చిన ఈ గానాల్ని వాంగ్మయంలో కలిపివేసి వాటికోస్థానం కలిపిద్దామంటే, ఈ పండితులు అంగీకరించరు. ఈపాటల్లో అందంవుందని అంగీకరిస్తే, భాషనికూడా అంగీకరించాల్సి వొస్తుందేమో, వీటికి గౌరవమిస్తే తమగౌరవం ఎక్కడ పోతుందోననే భయంతో వీటిని స్త్రీల, పిల్లల, పామరుల పాటలని తోసివేశారు. అప్రయత్నంగా దీక్షితులుగారికి చేదోడు ఐన చలం, ఆ స్త్రీలూ, పిల్లలూ పండితులకన్న గౌరవనీయులన్నాడు. కమ్యూనిస్టులూ, నండూరి సుబ్బారావుగారూ "చాకలవాడు చదువుకున్న వాడికన్న మేలు" అని మళ్ళీ బాదారు పండితుల్ని పట్టుకొని.

కాలవశాన అధికారపీఠాన్ని వొదిలి కదిలిపోకతప్పిందికాదు పండితులకి. వాటిస్థానే ఇట్లాంటి పాటల్నీ, భాషనీ అంగీకరించడమే కాకుండా, వాటికోసం యుద్ధాలు చేసిన యువకులు, భాషా నిర్నయ పదవుల్ని స్వీకరించారు. ఇన్నాళ్ళూ దానికోసమే ఎదురుచూస్తోవుంటారు సంస్కరణాభిలాషులు. ఈ ముసలివాళ్ళు ఏదో పాత పద్ధతులకి అలవాటుపడి అంధులై అభ్యంతరంగా వున్నారుగాని, వీళ్ళు తొలిగిపోయిం తర్వాత, ఆ కొత్తతరంవారు ఎంతో ఆతృతతో వీటిని అంగీకరించి గౌరవించి అమలుపరిచి, స్థిరస్థాయిగా నిలపెడతారని, అంతవోపికలేని చలంబోటి వాళ్ళూ 'ఏం లాభంలేదు ఈ అధికారుల్నీ, ముసలివాళ్ళనీ నరకమంటా'రు.

చూస్తుండగానే ఈ యువకులు పెద్దవాళ్ళయి ఉద్యోగాల్ని స్వీకరించి తమ ముందటివారు పలికిన మూర్ఖత్వాన్నే, కొత్తమాటలతో పలుకుతారు, చిన్నచిన్న మార్పులతో. వీళ్ళకి ఉద్యోగాల్ని యిచ్చేముందే వీళ్ళని జాగ్రత్తగా పరిశీలించి, ఎక్కడెక్కడ స్వతంత్రం, ఒరిజినాలిటీ వుందో, ఆ భాగాన్ని కత్తిరించి, విప్లవ కారకాలయిన అవయవాల్ని చితకకొట్టీ, మరీ ఆ ఉద్యోగానికి నియమిస్తారు. ఉద్యోగి ఐ కూడా ఏదన్నా స్వతంత్రపు పోకడలుపోయినా అతనికి అధికారంలో గతులులేవు. అసలు ఈ కొత్తఅధికార్లకీ ఇష్టం వుండదు కొత్తమార్గాలు తొక్కడం. ఆ పాతవారి ప్రాపకం, ఆనుమాయితీ వారికి గౌరవాన్నివ్వాలి. పామరులు పలికే మాటల్ని వీరు గౌరవిస్తే ఎట్లా? వీరు పండితులైనారు ఇప్పుడు.

ఈ విధంగా యీ భాషకిగాని, పాటలకిగాని, వాంగ్మయంలో స్థానం ఏర్పడలేదు యీనాటికీ. లోకమంతా సహజమైన భాషే మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. గట్టిగా పాతది పట్టుకొన్ని వేళ్ళాడిన పత్రికలే, చందాదార్లు తగ్గిపోవడం వల్ల భాషని గతిలేక ఫిరాయించుకున్నాయి. పుస్తకాలు ఖర్చుగాక, గ్రంథకర్తలు పాండిత్యాన్ని మలిచారు. చివరికి రేడియోవారు కూడా, వాళ్ళ అసహజపు గొంతుకలతో సహజమైన భాషని మాట్లాడక తప్పిందికాదు. కాని, ఈ విద్యాలయాలున్నాయే, ప్రతి మనిషి కోసం ఏర్పడ్డామన్న యీ విశ్వవిద్యాలయాలు, ఈ democratic ప్రజా సంస్తలు, ఇవిమాత్రం ఎవరూ మాట్లాడని, అర్థంకాని, కృతక కుళ్ళు, కంపుభాషనే విద్యార్ధులపైన వేసి రుద్దుతున్నారు. పాత వాంగ్మయం పేరన్నా ఎత్తరు. ఇంకా ఆ పాటలు పామరులవీ, స్త్రీలవీ, పిల్లలవిగానే నిలిచిపోయినాయి. "మీరు తక్కువ వారు, మీ మొహాల కీ పాటలు చాలు" అన్నారా ఈనాటి స్త్రీలు మడమ ఎత్తుల చెప్పులు విసురుతారు. స్త్రీలని సాంఘికంగా న్యూనత చెయ్యడానికి ఎవరికీ గుండెలు లేవు. ఆస్తికూడా వాళ్ళ పరమౌతోంది. కాని పాటలుమాత్రం అట్లాగే అణగారిపోతున్నాయి.

ఈనాడు పామరులకీ, స్త్రీలకీ ప్రత్యేకం పాటలూ అఖ్కర్లేదు, కథలూ అఖ్కర్లేదు. కావలిస్తే పండితుల్నే ఒకరు రాసింది ఇంకోరికి అర్థంకాకండా పాండిత్యం చూపుకునే ఉద్గ్రంధాలు రాసుకోమంటారు.

ఎటొచ్చీ పిల్లలకి. వాళ్ళ కేంకావాలో, అఖ్కర్లేదో చెప్పుకోనూలేరు, చెప్పుల్ని విసరనూలేరు. వాళ్ళకి నిర్నయం కావాలి, దిక్కులేని వాళ్ళు కనక. పాటల్ని మించిన అందాలూ, పిల్లల హృదయాలకూ అనుభవాలకూ దగ్గిరఐన పాటలూ, కథలూ సృష్టిఐతే వీటిని పునరుద్ధరించవలసిన అగత్యం కనపడక పోవొచ్చు.

కాని, అది ఎంత అసాధ్యం?

ఎంతమంచి పోపు పెట్టినా, పాతచింతకాయ పచ్చడిలోని, జాడీలో నెలలు వూరిన పరిమళం, కొత్త చింతకాయ పచ్చడికి రాదు. ఆ పరిమళం ప్రత్యేకం. వందల కొలది ఏళ్ళలో ఏర్పడి, పోయిందిపోగా, వాటి మెరిట్‌ వల్లనే నిలిచిన ఈ పాటలతో సరైనవి రాయటం కష్టం. ఈనాడు బి.వి.నరసింహారావుగారు రాసినా, వాటిని కొన్నివందల ఏళ్ళు వూరేస్తేనేగాని, పాత Wineలో వుండే Superior flavour వాటికి పట్టదు.

అందువల్ల ఇప్పుడు చెయ్యవలసిం దేమిటంటే, ఈ వాంగ్మయాన్నంతా తెలుగు సారస్వతంలో కలిపివెయ్యడం. దానికి అభ్యంతరం చెప్పగల గుండెవున్నవాళ్ళు ఈనాడులేరు, దీక్షితులుగారి అకుంఠిత కృషివల్ల. కాని, ఆ వోపికా, ఉత్సాహమూ, ఆపాటల అందానికి ఎదురుపలికిన ఆయన హృదయం, ఎవరికి వొస్తుంది, మళ్ళీ యుగానికో ఇంకో దీక్షితులు పుడితేతప్ప! పునర్జన్మ రాకండా చెయ్యాలని ఆయన ఎంత ప్రయత్నించినా ఆయనకి అది తప్పదు. ఆయనవంటివారు యుగయుగానికీ తిరిగి తిరిగి అవసరమౌతోనే వుంటారు ఈ లోకానికి.

అరుణాచలం 12-12-55 చలం

AndhraBharati AMdhra bhArati - vachana sAhityamu - pIThikalu - chalaM (prajA vaa~NmayaM - chiMtA dIxitulu) ( telugu andhra )