వచన సాహిత్యము వ్యాసములు 1947-1972 : నేనూ - నా సాహిత్య రచనలు : శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

మహతి ఆగష్టు 1972, యువభారతి ప్రచురణ నుండి; వారి సౌజన్యంతో

'నేను - కడచిన పాతికేళ్లలో నా సాహిత్య రచనలు' అనే విషయాన్ని గురించి మీరు నన్ను వ్రాయమన్నారు. ఇది నావంటి వాడి కిచ్చే ప్రశ్న కాదు. ఎవళ్లో అల్పరచనలు చేసేవాళ్లను అడగవలసిన విషయము. నా కిప్పుడు 77 ఏండ్లు. నేను పుట్టింది 1895 లో. 77 లొ పాతిక తీసిపారేస్తే 52 ఏండ్లు. 1947 ఆ ప్రాంతాలలో నాకు 52 ఏండ్లు వచ్చి ఉండవలె.

అప్పటినుంచి ఇప్పటివర కన్నమాట!

నేను ఈ బెజవాడ కళాశాలకు 1938 లో వచ్చాను. ఈ కళాశాలకు వచ్చిన తరువాత 9 ఏండ్లు గడిస్తేకాని మీ తారీఖు అందుకునేటట్లు లేదు. ఎంత లేదన్నా ఆ తొమ్మిదేండ్లలో రామాయణం మొదటి రెండు కాండలే పూర్తిచేసి ఉంటాను. లేదా 3 కాండలు. అంటే కిష్కింధ, సుందర, యుద్ధకాండలు నిస్సందేహంగా ఈ పాతిక ఏళ్లలోవే! అరణ్యకాండ కూడా ఈ కాలంలోదే.

నేను చాలా సోమరిని. నా S.S.L.C. సర్టిఫికేట్‌ కూడా నా దగ్గరలేదు. F.A. సర్టిఫికేట్‌ లేదు. B.A. సర్టిఫికేటూ లేదు. M.A. అసలు పుచ్చుకోలేదు. నా పుట్టినతేదీ తెలుసుకోటానికి ఒక ప్రిన్సిపాల్‌ చాలా ఇబ్బందిపడ్డాడు - నాకు ఉద్యోగవిరమణ ఇప్పిద్దామని. ఇల్లా వుంటుంది నాకథ!

మరి నేను ఎంతసోమరిని అంటే - నిజానికి నేను 'వేయిపడగలు', 'మా బాబు', 'చెలియలికట్ట', 'ఏకవీర' వ్రాసి నవలాకారుణ్ణి అయినాను. తత్పూర్వం నేను అచ్చంగా కవిని. ఇప్పుడు చాలామంది 'ఆయన నవలాకారుడే కాని కవి కాదు' అనేవా రున్నారు. ఇందులో భిన్నాభిప్రాయా లున్నాయి. తత్పూర్వం నేను వ్రాసిన కవిత్వం వారికి తెలియక పోవచ్చు. నేను వ్రాసిన కవిత్వం కవిత్వం కాదని కూడా అనుకోవచ్చు.

ఏది అయితేనేమి? నేను 1934 సం॥ నాటికి దేశము పట్టనంత కవినని కీ. శే. మల్లాది రామకృష్ణశాస్త్రి గారు 'ఆనందవాణి'లో వ్రాశారు. అంటే అప్పటికి నేను 'ఏకవీర' తప్ప మరింకో నవల వ్రాయలేదు. ఇప్పటి సాహిత్యవేత్తలలో చాలామంది అప్పటికి పుట్టియే వుండరు. కనక భారతి, శారద మొదలైన అనేక సాహిత్య పత్రికలలో నేను శరపరంపరగా వ్రాసిన పద్యాలను వారెరగరు. 'కవిభృంగము', 'ఆశావాణి', 'శ్రీహర్షుడు' మొదలైనవి అనేకము అప్పటి పద్యాలన్నీ సంకలనం చేశాయి. పుస్తకంగా వేస్తే కనీసం నా రామాయణంలో సగం అవుతాయి. నేను సంకలనం చెయ్యలేదు. సోమరిని. అక్కడక్కడ కొందరు స్నేహితులు చేశారు. అవేవో రెండు చిన్న పుస్తకా లవుతాయి. ఈ మధ్య ఒకటి అచ్చువేశాను.

అదంతా పోనిస్తే ప్రధానంగా ఈ పాతికేండ్లలో నా 'రామాయణం' నాలుగు కాండలు ఈ పాతికేండ్లలో వ్రాసినవే కదా! గుణాలు అట్లా ఉంచి, ఒట్టి సంపుటి దృష్టితో చూస్తే పాతిక ఏండ్లలో కల్పవృక్షాలు నాల్గు సంపుటాలు వ్రాయటం గొప్పయే. మరిన్నీ ఈ రామాయణం 1961 లో పూర్తిచేశాను. అంటే పూర్తయి 10 ఏండ్లయింది. ఈ పదేళ్లు ఏమి వ్రాశావు అని ప్రశ్న. అసలు ఇంతకూ ఈ దేశంలో పూర్వమార్గాన వ్రాసేది పనికి రాకపోతోంది. కాగా ఎంతని వ్రాస్తే ఏమి లాభం? మీ రడిగిన ప్రశ్నను బట్టిచూస్తే మీకు ఇంత వ్రాశాడన్నది ప్రధానమల్లే కనిపిస్తున్నది. నీకు కాదా అని మీరు నన్నడిగితే నేను వ్రాసింది నాకూ ప్రధానమే. దీనికి 2, 3 కారణా లున్నాయి. మొదటిది నేను ఏమి వ్రాస్తానో నేను తెలిసికొని వ్రాస్తాను గనక. నేను వ్రాసిన దానిని అనంత విషయములు నేను చొప్పించి వ్రాస్తాను కనక. అనాది నుంచీ ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకొంటూ వస్తున్నది. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను సఫలుణ్ణయి వాళ్ళని జ్ఞానవంతులను చేస్తున్నాను అనేభావం నాకు ఉన్నది కనక. ఈభావం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసును కనక. పూర్వ సాహిత్యం ఒకటి ఉన్నది. నేను పోతే నాతో పోయే వాళ్లు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన్న, పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు మొదలయినవారు. ఊరికే ఒట్టి పూర్వకవులని కాదు - పద్యరచనాసామ్రాజ్య పట్టభద్రులు; కథాకథన శిల్పనూత్నాచార్యులు; వేదవేదాంగాది మహాగ్రంథస్థలు; మహావిషయనిర్ణేతలు; బహువిషయ వ్యాఖ్యాతలు; కావ్యకథాశిల్ప రహస్యవేత్తలు; అనే దృష్టితో ఆ పూర్వకవులను నిలబెట్టుకొంటే అప్పుడు నేనూ నిలుస్తాను. నేను చేసినపని అటువంటిది. రోజులు మారిపోయి తెలియటంలేదు.

ఇది అహంకారము కాదు. పొగరుబోతుతనం కాదు. అసలీ దేశంలో అహంకారం ఎట్లా వుంటుందో తెలియదు. స్వశక్తిని చెప్పుకుంటే అహంకార మనుకుంటారు. ఒక మహాశిల్పి యొక్క శక్తిని గ్రహించే శక్తి పోయింది. వాని శిష్యులలో చాలామంది వాడు చెబితే తెలుసుకొన్న వాళ్లే. అది శిష్యులతో చెబితే చదువు, ఇతరులతో చెబితే అహంకారము. 2వ తరగతిలో అహంకారం ఎందుకయిందో తెలుసునా - వాళ్ళకి అక్కరలేదు కనక. వాళ్ళు తెలుసు కుందామని పుట్టినవాళ్ళు కారు. ఆ మహాకవిని ఎట్లాగో ఒకట్లా తిడదామని పుట్టినవారు.

ఈ పాతికేండ్లలో నేను వ్రాసినవి ఒక జాతి జాతిగా తీసి చెబుతాను. మొట్టమొదట రామాయణం నాలుగు కాండలు! ఏ తెలుగుపద్యం యొక్క శక్తిచేత ఇందాక చెప్పిన పూర్వ ఆంధ్రమహాకవులు బ్రతికి ఉన్నారో ఆ శక్తి ఏమిటి? అందరు కవులనీ చెప్పలేదు నేను, ఆ పదిమందిని చెప్పాను. వాళ్ళు ఒట్టి గణ యతి ప్రాసలు కూర్చినవారు కారు.

అనేక జాతు లుంటవి. అన్ని జాతులలో అందరు వ్యక్తులూ ఆర్థికంగా సమానం నిస్సందేహంగా చేయబడ వలయునేకదా! అందరికీ అన్నోదకము లుండవలసిందే! సర్వజనులకూ అన్నోదకాలు లేకుండా చేసెడి రాజు నాకు విరోధి. వాడు నాకూ అన్నోదకాలు లేకుండా చేస్తాడు కనక.

ఇల్లాంటి విషయం ఎత్తుకొని వ్రాయవలెనంటే తీగె కదిపితే డొంక కదులుతుంది. వ్యవహారం పుట్టు - పూర్వోత్తరాల దగ్గరకు పోతుంది.

పాపం ఈ కాలంలో సర్వదేశముల యందలి ప్రజలు కారణాన్ని బట్టి కార్యం ఉంటుందని తెలియని వారు. పాశ్చాత్య దేశాలలో ఈ కాలమేం చేసిందంటే ఊహకి కొక్కు పెట్టి గణితశాస్త్రానికి పట్టం కట్టింది. ఆ గణితశాస్త్రంలో ఊహలేనట్లు. అది మనకెందుకు? తేలదు కదా! వినేవాళ్లు లేరు కదా! పైగా మీదపడి కరుస్తారు కదా! ఇపుడు ఆ పూర్వ మహాకవుల పద్యరచన ఏమిటో చెబుతాను. వాళ్ల పద్యరచన అంటే జాతిలో ఉండే శిష్టులు, ఉత్తమ కులజులు, విద్యావంతులు, సంప్రదాయజ్ఞులు అయిన వాళ్ల జీవలక్షణాన్ని, ప్రాణలక్షణాన్ని, వాక్యవిన్యాస వైఖరిని, కంఠస్వరములో ఉండే హెచ్చు తగ్గులని, ఈ రీతిగా ఆ జాతి యొక్క పరమశిష్టమైన, నాగరకమైన, జీవునిలోనుండి వచ్చెడి వాగ్వ్యాపారమునకు రూపకల్పనము.

ఇంకొక రహస్యము కూడ నున్నది. త్యాగరాజులవారు తాను బహురాగములను కల్పించి (కొన్ని పూర్వమున్నవే), వానికి మూర్ఛన లుండగా, తాను వ్రాసెడి కృతినే ఒక షడ్జమములోననో, ఒక పంచమములోననో ఎత్తికొనును. మూర్ఛన క్రిందినించి ఉండును. ఎందుకు ఎత్తికొనును? ఆ రాగములోని భావన అది. తెలుగు భాషయొక్క పలుకుబడి అది. ఈ రహస్యము కృతి నిర్మాణ సమయమున త్యాగరాజ మహర్షికి ఎంత తెలియునో, పద్యరచనా సమయమున మన ఆంధ్ర సాహిత్యమునందున్న పద్యరచనాశిల్పుల కంత తెలియును. ఇది అంతయూ ఉదాహరణ పూర్వకంగా చెప్పవలసిన విషయము.

కావ్యమునందు కథయొక్క ఆరంభము, అవసానము, సర్గలయొక్క ఆద్యంతములు, లోకమును చిత్రించుట, శబ్ద చమత్కారములు చేయుట, ఆవేశము కలిగియుండుట, ఇటువంటివి వందలైన శిల్పములు కలవు. ఈ పద్య రచనా శిల్ప మన్నది వానిని మించినది. ఇది మనస్సుచేత, తెలివిచేత, పది చోట్ల నేర్చుకొనుటచేత, ఆ రచయిత చేసినాడు - ఈ రచయిత చేసినాడని గ్రహించుటచేత వచ్చెడిది కాదు. ఇది ఒక జాతియందు ఒక మహాకవి ఉద్భవిల్లినచో, వాడు పద్యరచయిత యయినచో, ఛందస్సులోని రహస్యము వానికి తెలిసినచో, భాషకు, ఛందస్సునకు, జీవుని లక్షణమునకు కల యవినాభావ సంబంధము వానికి పరమేశ్వరానుగ్రహము వలన పూర్వజన్మ సంస్కార విశేషమువలన సహజమైనచో తెలిసెడిది. (ఇందుకు కార్యకారణము లున్నచోట వదలిపెట్టబడిన విషయ మిది. జీవుడు, కర్మ, సంస్కారము, జన్మపరంపర ఇదియొక ప్రావాహికమైన ఊహాపద్ధతి. దీనిమీద ఆధారపడి భారతీయ నాగరకతయొక్క మహాసౌధ నిర్మాణము జరిగినది. ఈ సంపుటి లేదన్నవానికి ఇవి ఏవియు లేవు. మన నాగరకతకు ఈనాడు మన భిన్న ప్రాంతములయందు, భిన్నములైన అల్పాల్ప కాలములయందు జరిగిన యాపద ఇక్కడ. దీన్ని కప్పిపుచ్చి శత్రువులిం కెక్కడో మాట్లాడుచున్నారు. ఇది వారికికూడ తెలియని విషయము. వారు విశ్వసింతురు, విశ్వసింపరు.) ఆంధ్ర మహాకవుల యొక్క పద్యరచనాశిల్పము యొక్క ఆయువుపట్టు ఇక్కడ నున్నది. ఆ పట్టు నాకు పరమేశ్వరానుగ్రహము వలన చిక్కినది. నా పద్యరచన అక్కడనుండి చూడవలెను. పద్య లక్షణము లన్నియు సమృద్ధిగానే యుండును. ఆత్మ అక్కడిది అని మనవి చేయుచున్నాను.

ఈ రామాయణమును వదిలిపెట్టినచో 1961 వ సం॥ వరకూ ఒక ప్రక్క రామాయణము వ్రాయుచునే యున్నను - ఇంకొక ప్రక్క పద్యకావ్యములు కూడ వ్రాయుచునే యున్నాను. ఈ పదునొకేండ్లలో వ్రాసిన పద్యకావ్యములను గూర్చి కొంత చెప్పెదను.

మొదటిది 'ఝాన్సీరాణి'. నా కావ్యములకు ప్రబోధకములు మూడు విషయములు. మొదటిది, ఎవడో నా కీ కావ్యము వ్రాసిపెట్టు అని యడగటం. రెండవది, అంతఃప్రబోధము. మూడవది, మనసులో కొన్ని భావములు పేరుకొన వానికొక గ్రంథరూప మీయవలెననుకొనుట. ఎవరికో ఒకతనికి వారము దినములలో నొక పద్యప్రబంధము కావలసి వచ్చెను. ఈ యూరిలో చాలామంది కవులు, వారము దినములలో మాకు చేతకా దన్నచో మాకు చేతకా దన్నారట. ఆ విశ్వనాథ సత్యనారాయణ ఉన్నాడు. ఆయనకు వారము దినములు కూడ నక్కరలేదు, ఆయన దగ్గరకు పొమ్మన్నారు. వచ్చాడు. కథ ఝాన్సీరాణి. కనీసము నాలుగైదువందల పద్యాలైనా వ్రాయవలెను. నాలుగు దినములకన్న నెక్కువ లేదు. సరే వ్రాయవచ్చును కాని, ఇందులో కథానాయకుడు లేడు. లక్ష్మీబాయి కూడ చివర ఓడిపోవును. నాయకుడు కాదు సరికదా! కథానాయిక కూడా కాదు. ఇది ఆమెను గూర్చిన ఒట్టి కథ యగుచున్నది. ఉన్నది ఇది. ఏదో చేయవలయును. అంత పరాక్రమ వంతురాలుగదా! భారతీయ దృష్టితో అంతటి ధర్మమును చేసెను గదా! ఆమె ఎందు కోడిపోవలయును? ఆమె సమకాలికులైన ఇతర భారతదేశపు రాజులు ఆంగ్లేయులకు దాసానుదాసులైరి. సీ! సీ! కాలము యొక్క మహిమ. లేనిచో నామె కథానాయకుడై యుండెడిది. విజయము పొందెడిది. కావ్యము వీరరసకావ్యమై యుండెడిది. అందుచేత ఈ కావ్యమును నేను అధ్యాయములుగా విభజించి, ప్రతి అధ్యాయముల ఆద్యంతములయందు కాలమును వర్ణించితిని. గ్రంథాదియందు కాలముయొక్క స్వరూపమును, దాని యవలక్షణములను, దాని యుగధర్మముల ననుసరించి నడిచెడి పద్ధతిని వివరించితిని. కొంత దోషము పోయినట్లేగదా! ఒకాయన ఋతువులను వర్ణించినచో కవిత్వము కాదని యన్నాడట. మరి దేనిని గురించి వర్ణించినచో కవిత్వము? కవిత్వమనగా వర్ణన. ఉచితముగా, సమర్ధముగా దేనినిగురించి వర్ణించినను కవిత్వమే. వర్ణనయనగా ప్రకృతి వర్ణనయే వర్ణన యని అనుకొందురు. కథను చెప్పుటగూడ వర్ణనయే. కథలోని భిన్న విషయములు వర్ణింపబడుచున్నవి.

మరియొకరు కుమారస్వామికథను గూర్చి వ్రాసిపెట్టుమన్నారు. ఆయనకు నే నాకావ్యమును వ్రాసిపెట్టినచో సంతానము కలుగునని యాశ. వ్రాసితిని; అంకిత మిచ్చితిని. ఆ గ్రంథము పేరు కుమారాభ్యుదయము. తృణమో పణమో పుచ్చు కొంటిని. ఈ కావ్యము మాత్రము కథానాయకు డెవ్వరన్న సందేహమును పుట్టించలేదుగదా! కుమారస్వామి షణ్ముఖుడు. ఆయన కిద్దరు భార్యలు. ఒకామె దేవసేన, రెండవయామె వల్లి. ఈ కావ్యములో నొక పెద్ద కల్పన చేసితిని. దేవసేనయు, కుమారస్వామియు శృంగార రసమును నడుపుదురు. వారు కర్షకులు. వారి శృంగారరసము పంటచేలవెంట, జొన్న కంకులు, మొక్కజొన్న కంకులు తినుచు, మిగుల మెత్తగా నుండును. వల్లియొక్క పెండ్లి మరియొకరీతి. ఆమెకు దేవసేనకు పడదు. ఆమె వెడలి పోయినది. కాని యామె నదులమీద వంతెనలు కట్టించి, ఆ పొలములు సాగుచేయుటకు చాలా సాహాయ్య పడినది. ఈ నాటి పంటలు, సాగులు, వంతెనలు మొదలైన పథకములు, స్త్రీలు సంఘమున కెట్లుపయోగ పడుదురో, వారు తలచుకొన్నచో నెన్నెన్ని పనులు చేయగలుగుదురో అవియన్నియు దీనియం దభివర్ణితములు. మొదటిసారి దేవసేనను స్వామి, తల్లి దగ్గరకు తీసుకొనిపోవును. కొత్తకోడలు వచ్చుట, అత్తగారి మురుపు చాలా విచిత్రముగా వర్ణితము లైనవి. ఇది ఇట్లుండగా కుమారస్వామిని గూర్చి ద్రావిడ దేశమునందు బహుకథలు గలవు. గొప్ప గొప్ప సంప్రదాయములు కలవు. అవి యన్నియు ఈ గ్రంథమునందు పాటింపబడినవి. ఆంధ్రపత్రికలో కాబోలు 'రామచంద్ర' యన్న పేరుగల చక్కని విమర్శకుడు దీనిని గూర్చి వ్రాసినాడు.

మరి తరువాత వ్రాసినది 'విశ్వనాథ మధ్యాక్కఱలు'. తెనాలి వద్ద మున్నంగి యను గ్రామ మున్నది. ఆ ఊరిలో వేణుగోపాలస్వామి విగ్రహమున్నది. శిథిలావస్థలో నున్నదట. అచ్చట పెద్దలు వచ్చి నన్ను కోరిరి - ఆ స్వామివారి మీద నొక శతకమును వ్రాసిపెట్టు మని. ఆ శతకమునకు మకుటము "మున్నంగి వేణుగోపాల!" అని యుండవలయును. ఏ పద్యానికి చివర ఇది వచ్చుటకు వీలులేదు. మధ్యాక్కఱయైనచో చక్కగా కుదురును. అందుచేత 108 మధ్యాక్కఱలు వ్రాసి శతకము చేసితిని. ఇచ్చట నింకొక చమత్కార మున్నది. మా యూరిలో, అనగా నా స్వగ్రామమైన నందమూరిలో, శివ కేశవాలయములు రెండును కలవు. శివాలయము మా నాయనగారు నిర్మించిరి. మా స్వామివారి పేరు విశ్వేశ్వరస్వామి. విష్ణ్వాలయములో నున్న స్వామి వేణుగోపాలస్వామి. మా ఇద్దరు స్వాములు నన్ను పెంచినవారు; పెద్దవానిని చేసినవారు; నా దారిద్ర్యములో న న్నాదుకొన్న వారు; నన్ను బాగుచేసినవారు; నాకు సర్వజ్ఞానమును కుదిర్చినవారు; నాలో కవితాభావమును నింపినవారు. కనుక మున్నంగి వేణుగోపాలస్వామిని గూర్చి వ్రాయుచు, మనస్సులో మాయూరిలోని సంతాన వేణుగోపాలస్వామిని గురించియు భావించుచునే యున్నాను. మున్నంగి శతక మైపోయినది. ఆ మున్నంగి వెళ్ళితిని. మున్నంగి వేణుగోపాలస్వామివారి చరణ సన్నిధిని ఆ శతకము నర్పించి వచ్చితిని. కాని, శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు అనగా మా యూరిలోని స్వామివారు, నా ప్రాణములమీద కూర్చుండిరి. వారిని గూర్చి కూడ మరియొక శతకము వ్రాయనిచో ఆయన నన్ను బ్రతుక నీయడే! ఆయన మీద కూడ మరల మధ్యాక్కఱలే వ్రాసితిని. ఆ స్వామి నాకు స్వప్నములో కనిపించి యొక వాగ్దానము చేసినాడు. నేను చనిపోకముందు ఆ వాగ్దానమును చెల్లించు నని ప్రతీక్షించుచున్నాను. అది వేరేమాట! ఇంతలో నర్సారావుపేట దగ్గర నెకరుకల్లు అను గ్రామము కలదు. అందులో భూమిలో పాతిపెట్టబడిన శివాలయ మొకటి కనిపించినది. ఆ స్వామి చాల మహత్తులు ప్రకటించినాడు. వెళ్ళి నేను ఆ స్వామిని దర్శించి వచ్చితిని. వారి మీద కూడ మరియొక మధ్యాక్కఱ శతకము వ్రాసితిని. శ్రీశైలము, కాళహస్తి, భద్రాద్రి, తిరుపతి వేంకటేశ్వరస్వామి, మా కులదైవమైన శ్రీ విశ్వేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, ఈరీతిగా నివి పది మధ్యాక్కఱ శతకములైనవి. వేయి పద్యములైనవి. దానికే ఢిల్లీలోని కేంద్రసాహిత్యపరిషత్తువారు బహుమాన మిచ్చిరి. నాకే బహుమానము వచ్చినను సరే, దానికెంతో హంగామా జరగ వలయును. ఆ బహుమానము కొందరు నాకు రాకుండచేయుదురు. కొన్ని ఏండ్లు జరుగును. వారు కొంత యప్రతిష్ఠ బడుదురు. అప్పటికి నాయందు అభిమానము కలిగినవారికి బలము చేకూరును. తక్కినవారు నోరెత్తలేని స్థితిలో నుందురు. అప్పుడు బహుమానము వచ్చును. ఇది నా జాతక లక్షణము. నా ఉపాస్య దైవములు నాకు ఎక్కువ యాధ్యాత్మికముగా, తక్కువ లౌకికముగా ఉపయోగింతురు.

నేను వ్రాసిన గ్రంథముల పేర్లన్నియు నాకు గుర్తుండవు. ఏవి అచ్చువేయుదునో అవిమాత్రమే గుర్తు. అన్నట్లుగా 'విశ్వనాథ పంచశతి' యన్న గ్రంథము వ్రాసితిని. నాకు విరోధు లెక్కువమంది. ఎందుకో నాకర్థము కాదు. నన్నెరుగనివాండ్రు నేను దుర్జనుడ నందురు. ఎరిగినవారు చాల మంచివా డందురు. నేను చాలమందికి నా చేతనైనచో ఉపకారములే చేయుదును తప్ప అపకారములు చేయనే చేయను. నాకిది వ్రతము. అవతలివానికి అపకారము జరిగెడి అబద్ధము చెప్పనే చెప్పను. నేను ఎవరినైనా ఏదైనా అంటే వాళ్ళు నాకు చాలా అపకారము చేస్తే అంటాను. ఒక్కటి మాత్రము ఉంది. నేను అనటం ఘాటుగా ఉంటుంది. ఘాటుగా ఉంటుంది కనకనే తరువాత దానిని గురించి నాకు జ్ఞాపక ముండదు. ఎవళ్ళ కర్మను వాళ్ళు పోతారు నాకేమి!

మనస్సునకు ఏదో వెట్ట పుట్టినప్పుడు పూర్వము 'మాస్వామి' అన్న విశ్వేశ్వర శతకం వ్రాసితిని. ఈ పాతికయేండ్లలో, మొదటి పదునొకండేండ్లలో ఒక 4 దినములు కాబోలు, 'విశ్వనాథ పంచశతి' 500 పద్యములు వ్రాసి, వెంటనే అచ్చు వేయించితిని.

ఈ పాతికేండ్లలో మొదటి పండ్రెండేండ్లు పోగా మిగిలిన పది ఏండ్లున్నవి. అప్పటికి రామాయణ రచన పూర్తియైపోయినది. 1961 లోననే యుద్ధకాండము పూర్తి చేసితిని.

ఈమధ్య సంస్కృతభాషలో చాల వ్రాసితిని. తత్పూర్వమే 'మృతశర్మిష్ఠ' మన్న సంస్కృత నాటకమును వ్రాసితిని. 'దేవీత్రిశతి' యని అమ్మవారిమీద సంస్కృతములో 300 శ్లోకములు వ్రాసితిని. మరియు 'శివ సహస్ర'మని వ్రాయుద మని ప్రారంభించి మూడు నాలుగు వందల శ్లోకములు వ్రాసి అట్టిపెట్టితిని. చిల్లర మల్లర సంస్కృత కావ్యములు చాలా వ్రాసితిని. అవి యన్నియు నట్లే అపరిశోధితములు, అముద్రితములు నై యున్నవి.

మరి 'గోపికాగీతలు', 'భ్రమరగీతలు' అన్న రెండు గ్రంథములు వ్రాసితిని. ఇవియు నెవరో వ్రాసిపెట్టు మని యడిగిరి. భ్రమరగీతలు వంద పద్యాల పుస్తకము. గోపికాగీతలు మూడువందలు. భ్రమరగీతలు సంస్కృత భాగవతములో మూడు నాలుగు శ్లోకములలో ఉన్నవి. పోతన్నగారే ఏడెనిమిది పద్యములు వ్రాసినారు. నేను వంద పద్యములు వ్రాసితిని. హిందీ భాషలో నొకకవి యెవరో భ్రమరగీత లన్నపేరుతో కొంచె మెక్కువగా వ్రాసినా రని విన్నాను.

తరువాత మూడు నాలుగు ఏండ్లక్రింద రెండు విలక్షణములైన గ్రంథములను వ్రాసితిని. ఒకదానిపేరు 'శ్రీకృష్ణసంగీతము.' ఇవి 108 శీర్షికలు. ఇందులో సుమారు డెబ్బది ఎనిమిది మంది గోపికలు శ్రీకృష్ణదేవుని యుపసరింతురు. ఆ మార్గములు భిన్నభిన్నముగా వ్రాయబడినవి. అనగా నెనుబది విధములైన గోపికలు వర్ణింపబడి రని యర్థము. ఇవి యన్నియు గీతపద్యములు. గీతపద్య చరణము లొక్కొక్క శీర్షికయందు నలుబది యుండును. పద్యములు విడివిడిగా నుండవు. ప్రతిదినము నొక గీతమాలిక. వ్రేపల్లె శ్రీకృష్ణదేవుని సంగీతము. ఆ గొల్లపల్లెలో నున్న గోపికలు కొందరు కాపురముకు వచ్చి చాల దినములైనది. కొందరు క్రొత్తగా వత్తురు. కొందరు గాయనులు, కొంద రహంకారవతులు, కొందరిని భర్త లదుపులో పెట్టెదరు - ఇందులో సంస్కృతసమాసము లుండవు. అన్నియు దేశీయములైన శబ్దములే. గొల్లపల్లెలలో జానపదులు వాడుకొను శబ్దములు. తెలుగు నుడికారములు. ఒక స్నేహితు డన్నాడుకదా - మరల కిన్నెరసాని పాటలవంటి గ్రంథమును వ్రాసినారండీ - అని. నేను కిన్నెరసాని పాటలు వ్రాసిన నా చిన్నప్పుడు తెలుగు దేశము చచ్చిపోలేదు, సంప్రదాయము చచ్చిపోలేదు, పూర్వకవిత్వపు వాసనను చంపుటకు నేడు జరిగిన, జరుగుచున్నంత బ్రహ్మప్రయత్నములు చేయబడలేదు. తెలుగు భాష, తెలుగు నుడికారము, తెలుగు సామెతలూ, దేశీయములైన కొన్ని అందచందాలొలికెడి మాటలు అన్నియు వెనుకబట్టినవి. అందువల్ల నా శ్రీకృష్ణ సంగీతమునకు తగిన ప్రతిష్ఠ రాలేదు. ఎవరికి నష్టము?

చెప్పదలచుకొన్న వానిలో చివరిది 'రురుచరిత్రము'. ఇదియొక గొప్ప ప్రబంధము. ఏడెనిమిది వందల పద్యముల ప్రబంధము. రురుడు, ప్రమద్వర అన్న కథ భారతములో నున్నది. ఐదారు పద్యములలోనిది. రురుడు భృగువంశీయుడు. అతడు ప్రమద్వర అన్న అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ఒకపాము కరుస్తుంది. ఆమె చచ్చిపోయింది. ఈ రురుడు కనపడ్డ ప్రతిపామునీ చంపటం మొదలు పెట్టినాడు. చివరి కితనికి ఒక ఋషి కన్పించి, నీ ఆయుస్సులో సగం ఆ అమ్మాయి కిస్తే బ్రతుకుతుం దన్నాడు. ఇచ్చాడు బ్రతికింది. ఇది భారతంలోని కథ. దీనిని నేను చాల పెంచాను. ఈ రురుణ్ణి ఒక యోగిని చేశాను. అతడు చావు లేదంటాడు. చావుని మనుష్యులే చేసుకొంటా రంటాడు. మృత్యువనేది మనుష్యుని చేతిలో ఉందని అతని నిశ్చయము. అటువంటప్పుడు, నీ ఆయువులో సగము నీ భార్య కిస్తే ఆమె బ్రతుకుతుంది - అన్న మాట కుదరదు. అప్పు డితని యాయుర్దాయము పూర్వమే నిర్ణయింపబడి ఉండాలి. ఉంటే ఇతని సిద్ధాంతం తప్పు.

ఇతని యోగము ప్రచండమైన యోగము. జంతువులన్నీ ఇతణ్ణి చూచి భయపడుతూ ఉంటాయి. ఒక మహాసర్పం కారణం లేకుండా ఇతనితో విరోధం పెట్టుకుంది. దేవతలుకూడా ఇతని హఠాన్ని తగ్గించవలె నంటే, ఇతడు ప్రేమించిన ప్రమద్వరకు మృత్యువు తేవాలి.

ఇటువంటి యోగము నేడు మన తెలుగుదేశంలో ఒకటి ఉన్నది. ఆసిద్ధాంతము అంత నిజముకాదని చెప్పుటకోసముకూడ నే నీగ్రంథము వ్రాశాను.

ఈ కావ్యంలో జంతువుల స్వభావము, క్రూర మృగాల లక్షణము ఎంతో ఎంతో వ్రాశాను. వేటకాండ్రు వ్రాసిన చాల గ్రంథములు నేను చదివినవాణ్ణి. అడవులు, అడవిమృగాలు - వాటినిగురించి ఆ గ్రంథాలలో ఎంతో ఉన్నది. నేనే స్వయముగా ఎన్ని అడవులు తిరిగానో ఎన్నికొండలు ఎక్కానో చెప్పలేను. ఆనా స్వంత అనుభవాలు. ఆయా గ్రంథాలలో ఉన్న విషయాలు, రామాయణంలో వ్రాశాను. నా నవలల్లో తెగవ్రాస్తాను. అసలు నా కవిత్వంలో నూరు వర్ణనలు నేను చేస్తే తొంబదియైదు నా స్వంతములు. ఉత్ప్రేక్షలు, ఉపమలు, పూర్వకవులవి సామాన్యంగా ముట్టుకోను. ఈ లక్షణము ఈ రురుచరిత్రనిండా ఉన్నది. పద్యరచన కూడా చాలా క్రొత్తక్రొత్త మార్గాలలో చేశాను. రామాయణంలో పద్యరచనకంటే కూడా రురుచరిత్రలోని పద్యరచన కొన్ని కొన్ని చోట్ల చాలా విచిత్రంగా చేశాను. రురుని భార్యకు మరల నైదారుగురు పిల్లలు పుట్టి పోతారు. పాములను చంపితే సంతానం నష్టమవుతుందని ఒక ప్రథ ఉన్నది. దానిని అనుసంధించి చేశాను. ఆ ప్రమద్వర గర్భిణిగా ఉంటే, ఆ గర్భిణీస్త్రీని వర్ణించాను. ఆ వర్ణనలు పూర్వ కవులు చేసినవికావు.

ఇది చాలా గొప్ప ప్రబంధము. ఈ రోజుల్లో ఎవరికి కావాలి. తేలికగా వ్రాస్తేనే అర్థంకాదు కదా! మే మందరికీ అర్థమయ్యేటట్లు వ్రాస్తామని వ్రాసేవారి రచనే అందరికీ అర్థంకాదు కదా! ఒక్కొక్కప్పుడు వాళ్ళకే అర్థంకాదు కదా!

అర్థం కావటమంటే ఏమిటి అన్నది వేరే విచారణ. ఒక శబ్దానికి అర్థం ఎలా వస్తుందో తెలిసికోవాలి. శబ్దం ఎందుకు పుడుతుందో తెలిసికోవాలి.

ఇంకొక విషయం చెప్పి ఈ పద్యాలకథ వదిలిపెడతాను. ఒక ఏడాది క్రింద నాకొక జబ్బు చేసింది. అది ఒంటికి సంబంధించిం దన్నారు. తత్పూర్వము సంస్కృతంలో మరియొక నాటకం వ్రాశాను. దానిపేరు 'గుప్త పాశుపతము'. ఇది ఒక నాటకము. ఈ నాటకములోని విషయము మహాభారత యుద్ధముమీద ఒక భాష్యము, ఒక మహా వ్యాఖ్యానము. మన దేశములో చాలమంది పండితులు విన్నారు; వినిపించాను. 1972 జూన్‌ 29 న అనుకొంటాను - విజయవాడ రేడియో లో ఈ నాటకంలో కొంతభాగం ప్రసారితం చేశారు.

'ప్రద్యుమ్నోదయ'మను ఇంకొక కావ్యము కలదు. గుంటూరు జిల్లాలో గొడవర్రు అను ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో జంధ్యాల వెంకటేశ్వర్లు గారని ఒక సంపన్న గృహస్థు కలడు. ఆయనకి నా కవిత్వమంటే పరమ ఇష్టము. ఆయన, ఆయనభార్యా కలిసి నన్ను వాళ్ళ ఊరు తీసికెళ్ళి ఒక వెయ్యిన్నూటపదహా ర్లిచ్చి సన్మానం చేద్దా మనుకొన్నా మని నాతో చెప్పారు. ఊరికే చెయ్యట మెందుకు బాబూ; నీకో పుస్తక మంకిత మిస్తాను. అని ఈకావ్యం వ్రాశాను. ఇందులో కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకురావటం, వాళ్ళకి ప్రద్యుమ్నుడు పుట్టటం, ఆయనకి అనిరుద్ధుడు పుట్టటం కథ. రురుచరిత్రశైలి ఎట్లా విలక్షణమైనదో ఈ శైలి ఇంకొకట్లా విలక్షణమైనది. నేను సుకుమారంగా వ్రాసినా సరే, మధురంగా వ్రాసినాసరే, పద్యరచనలో జిగి తప్పదు, ప్రౌఢి తప్పదు. కాని ఇందులో విశిష్టాద్వైతములోని వ్యూహములు సంతరింపబడినవి. పండితులైనవారు, భావుకులైనవారు దీనిని తెగ మెచ్చుకొన్నారు. ఇది చాల సొగసైన ప్రబంధము. ఇందులోని శయ్య, శశిదూతములోని శయ్యవలె నుండును. అంతకంటె సుకుమారముగ నుండును.

ఇంక నవలలను గురించి చెప్పవచ్చును. 'తెఱచిరాజు', 'స్వర్గానికి నిచ్చెనలు' ఇవి రెండూ ఈ పాతికేండ్లలో మొదటనే పడతవి. బందరులో మంజులూరి కృష్ణారావని ఒక మహానటుడు ఉండెడివాడు. పూర్వపు కూచిపూడి వాళ్ళలో పరదేశి మొదలైన వాళ్ళు ఎటువంటి అభినేతలో ఆయన అటువంటి వాడు. నాకు అభినయం చాలా తెలుసు. అదంతా అతనిని చూచి తెలుసుకొన్నదే. అత డొక విచిత్రమైన పురుషుడు. అతని నాట్యకౌశల మంతా 'తెఱచిరాజు' నిండా వ్రాసినాను. ఆహార్యకము, వాచికము, ఆంగికము, సాత్వికము మనకు పేర్లు తెలుసు. పెద్ద నటకుల మనుకునే వాళ్లకు కూడా పేర్లు మాత్రమే తెలుసు. ఈ నాటకాలు వేసే వాళ్లలో ఈ నాలుగూ సర్వంకషంగా తెలిసినవా డతడొక్కడే (పూర్వపు కూచిపూడి భాగవతులను వదిలిపెట్టి). తెఱచిరాజులో అతను ఎంత ఉన్నాడో, అతను కానిదీ అంత ఉన్నది. ఒక నవల వ్రాస్తూ ఉంటే మనము ఎరిగున్న మనుష్యుణ్ణే తీసుకొంటాము. కథ, భావము, రసము, పాత్రపోషణ మొదలైన వానిని పురస్కరించుకొని వ్రాస్తూ ఉంటే ఆ ఎరిగి ఉన్న పురుషుడు మారిపోతాడు. చాలా మారిపోతాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టర్‌ బి.వి.కుటుంబరా వని ఉన్నాడు. అతను తెలుగు నవలలను గురించి ఒక పరిశోధకవ్యాసం వ్రాసి డాక్టరేట్‌ పట్టం పొందాడు. ఆయన వ్రాసినట్లు - ఏకవీరలో నేను ప్రారంభించిన త్వగింద్రియస్పర్శ లక్షణము, తెఱచిరాజులో మరల నెత్తికొని వ్రాశాను.

రెండవది 'స్వర్గానికి నిచ్చెనలు'. ఇది ఒక చిత్రమైన నవల. మతము పేరకూడాను, దుర్జనులు ఇతరులను వంచింతురు. ఇతరులను వంచించుట ఈ లోకమునం దొక మహావిద్య, అదొక శిల్పము. ఈ శిల్పవేత్తల సంఖ్య అనంతము. దేవుడు లేడని వంచింతురు. ఉన్నాడని వంచింతురు. ఒక మహా విషయమును, అది మహావిషయము కాదని ఇతరులను వంచింతురు. ఈ వంచకులలో ప్రధానముగా రెండు రకాలు. మొదటి రకము - అది వంచన అని తెలిసి, దోషము కానిదానిని దోషమని చెప్పును. రెండవ రకము దీని తలలో జేజెమ్మ. ఆ రకమునకు అది యథార్థమని తెలియదు. అది యథార్థము కాదని చెప్పుచుండును. మరి వంచన ఏమి యున్నది? మూలవస్తువే వంచన. వంచన యొక్క సగము దోషము చేసెడి పద్ధతిలో నుండును. ప్రచారములో నుండును. తనకిష్టము లేనిదానిని దుమ్మెత్తిపోయుటలో నుండును. పదిమందిని కూడగట్టుకొని లోకమును ప్రతారించుటలో నుండును. ఈ 'స్వర్గానికి నిచ్చెన'లన్న నవల దైవము అన్న విషయములో ఆస్తికుల మనువారు చేసెడి వంచన సర్వస్వము ఉన్నది.

చిన్న చిన్న నవలలు చాల యున్నవి. వాని నట్లుంచి, మూడు రకములైన నవలలను గురించి చెప్పెదను. ఒకటి, 'పురాణ వైర గ్రంథమాల' పన్నెండు నవలలు. రెండు, 'నేపాళరాజ చరిత్ర' ఆరు నవలలు. మూడు, 'కాశ్మీరరాజచరిత్ర' ఆరు నవలలు. ముందు వీనిని గురించి చెప్పెదను.

అనాదినుండీ, అనగా నా చిన్నప్పటినుండీ, ఇంగ్లీషువాడు నేర్పెడి వాని చరిత్ర మన చరిత్రలో పాఠ్యగ్రంథములుగా చదివినప్పటినుండీ, 'Hindu Period' అను పాఠ్యగ్రంథాలలో చెప్పబడే పరిమితపుటలు గల చరిత్ర చదివినప్పటినుండీ, మన పురాణములు పుక్కిటికథ లని మొదలైన ఎన్నో అబద్ధములు చరిత్రలో చదివి చదివి నాకు విసువెట్టినది. తరువాత శ్రీ చిలుకూరు వీరభద్రరావు గారు, మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు, భావరాజు కృష్ణారావు గారు, నేలటూరి వేంకటరమణయ్య గారు, ఈ మొదలైన చరిత్ర పరిశోధకులతో నాకు మిక్కిలి దగ్గరతన మేర్పడినది. ఈ చరిత్రను గురించి నేనెంతయో నేర్చుకొంటిని. భారతయుద్ధము రెండువేల యేండ్లక్రింద జరిగిన దని, రామాయణము కొంచెమించుమించుగా జరిగినదని చదువలేక, వినలేక, నా బొమికెలు చిట్టెము కట్టెను. ఇట్లుండగా నేబదిఏండ్ల క్రిందను, అంతకు ముందును నర్సారావు పేటలో నడింపల్లి జగన్నాథరావుగారని ఒక వకీలు 'మహాభారత యుద్ధకాలము' అను ఒకచిన్న గ్రంథము వ్రాసినారు. అందులో సంస్కృత మహాభారతములో భీష్మ నిర్యాణ దినము - మకర సంక్రమణ దినము - విస్పష్టముగా చెప్పబడి యున్నది. ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరమును వచ్చును. అచ్చటినుండి లెక్క వెయ్యబడినది. ఒక పాతికయేండ్ల క్రిందవరకు ఫ్రాన్సు దేశపు రాజధానియైన పారిస్‌ నగరములో నుండెడి గణితశాస్త్రజ్ఞులు అఖండులు. వాళ్ళు లెక్కలు తేల్చి చూచిరి. విషయము రుజువు చేయబడినది. ఐదేండ్ల కొకసారి సంవత్సర పరిమితి కొన్ని సెకండ్లో, ఒకటి రెండు నిముషములో తగ్గుట ఖండకాల ప్రమాణ స్వరూపము. ఒక ముప్పది ఏండ్లక్రిందినాటి ఈలెక్క ప్రకారము చూడగా భీష్మ నిర్యాణ సమయమున మకర సంక్రమణ మెప్పుడయినది? 1927 సం॥న మకర సంక్రమణ మెప్పుడు జరిగినది? ఈ జరిగిన దానికిని దానికిని మధ్య కాల మెంత ఉండినది. ఆ కాలమును ఐదైదేండ్లకు కొన్నికొన్ని సెకండ్లకు తగ్గెడి కాలముతో విభజించెడిచో, భీష్మ నిర్యాణము జరిగి, మన పంచాంగములలో వ్రాయబడుచున్న మకర ప్రవేశమునకును, తత్పూర్వము నలుబది ఏండ్లకు పూర్వము మహాభారతము యుద్ధము జరిగిన దనుటకు సరిపోవుచున్నది. దీనిని పారిస్‌లోని మహాగణిత శాస్త్రజ్ఞు లంగీకరించిరి.

ఈ విషయమును గురించి తత్పూర్వమే మద్రాసులోని ఒక తమిళ పండితుడు, ప్లీడరు - ఆయనపేరు నారాయణయ్యర్‌ అనుకొందును - ఆయన 'శంకరుని కాలనిర్ణయ'మను నొక గ్రంథము వ్రాసెను.

పాశ్చాత్య చరిత్రకారులు మన పురాణములయం దున్న విషయములన్నియు వాళ్ల ఇష్టమువచ్చినట్లు మార్చివేసిరి. వారు మార్చిన దానికి కారణములతో మన కవసరములేదు. ఈ పైనచెప్పిన లెక్కల ప్రకారము మన పురాణములలో నున్న రాజవంశములయొక్క కాలములు సరిపోవుచున్నవి. ఇవికాక, మనదేశములోనే 'మగధరాజ వంశావళి', 'నేపాళరాజవంశావళి' మొదలైన పూర్వగ్రంథములు కలవు. ఇవికాక, కల్హణుని 'రాజతరంగిణి' కలదు. మనకే చరిత్రగ్రంథములు చాల కలవు. విజయవాడలో శ్రీ కోట వెంకటాచలంగారని ఒక మహాపురుషుడు ఈ మహాపరిశోధన అంతయు జేసి, ఆ నారాయణయ్యర్‌ గారు, ఈ జగన్నాథం పంతులుగారు చేసిన పరిశోధనలకు చెట్టు కట్టించి, పూయించి, కాయించి, పండించిరి. ఆయన చాలా గొప్ప గ్రంథములను వ్రాసెను. వానికి ప్రశస్తి ఎందుకు రాలేదనగా మనము బానిసజాతియై పోయినాము గనుక. నాకొక విషయము జ్ఞాపకము వచ్చుచున్నది. ఫిలిప్పైన్‌ ద్వీపముకింద మాండెనో అని ఒక ద్వీపమున్నది. ఆ ద్వీపమున మంటితో పుట్టిన జను లున్నారు. స్పెయిన్‌ మొదలైన దేశములవారు నాలుగువందల ఏండ్లక్రిందనే ఆ ద్వీపమును కూడ ఆక్రమించినారు. అక్కడ ఆదిమవాసులు తివోలీజాతి. వాళ్ళ ఆచారములు ఇప్పటికికూడా తెలుగువాళ్ళ ఆచారములు. వాళ్ళ భాషపేరు తెగలాగ్‌-తెలుగు అన్నమాట. ఈ తెగలాగ్‌ నాయకు డన్నాడట - "మనము పాశ్చాత్యులను అనుసరిస్తే మనము వాళ్ళ నీడ అన్నమాట. నీడకి నామరూపాలు లేవు. నీడని ఎవరు గౌరవిస్తారు? ఆస్థితికి వచ్చాము" అని.

ఈ మహావిషయాన్ని పురస్కరించుకొని 'పురాణవైర గ్రంథమాల' అని పండ్రెండు నవలలు వ్రాశాను. నేటి ఆంధ్రచరిత్రను బట్టి చూస్తే ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, ఇటువంటిపేర్లు, వాళ్ళు పాలించిన కొద్ది కొద్ది భూభాగాలు, శాసనములు, - ఈ రీతిగా మన యాంధ్రచరిత్ర ధ్వంసమైపోయినది.

భారత యుద్ధమైన తరువాత మగధ సామ్రాజ్య మున్నది. జరాసంధుని వంశమున్నది. గిరివ్రజము రాజధానిగా రెండువేలయేండ్లు మహాప్రభువులు భారతదేశమును సామ్రాజ్యముగా పాలించిరి. అందులో ఆరువందల ఏండ్లు, ఆంధ్రులైన శాతవాహనులు గిరివ్రజమునుండి భారతదేశ సామ్రాజ్యము నేలిరి. 'ద్రవిడభాషల యొక్క తరతమ భేద నిరూపక వ్యాకరణ'మని కాల్డ్వెల్‌ దొర ఒకగ్రంథాన్ని వ్రాశాడు. పాపమా కాల్డ్వెలు శాసించలేదు. పండితులను విచారించవలె నన్నాడు. మనదేశములో అది ప్రమాణ గ్రంథమై పోయినది. పరిశోధనలు దానిమీదనే జరుగుచున్నవి. ఇట్టివి యెన్నియున్నవి? అది వదలి వేద్దాము. ఆ కాల్డ్వెల్‌ ఆఫ్గన్‌స్థానములో బ్రాహూయీ అను ఒక భాష యున్నదనీ ఆభాషకూ మన తెలుగుభాషకూ పలువిషయాలయందు సామ్య మున్నదని వ్రాసినాడు. శాతవాహను లాంధ్రులు - వారు భారత సామ్రాజ్యమును పాలించినప్పుడు ఆయాప్రాంతములందలి అధిపతులందరు నాంధ్రులై యుందురు. ఆనాటి ఆఫ్గన్‌స్థానములో నెవడో ఆంధ్రుడు అధిపతియై, ఆ ఆటవికులచేత మన భాష చదివించియుండును. దీని లక్షణములు అక్కడ పాతుకుపోయినవి.

మన చరిత్ర వేరే యున్నది. ఈ మగధరాజ్యము, మౌర్యచంద్రగుప్తుడు, తరువాత గుప్తరాజ్యము, గుప్తచంద్రగుప్తుడు. అలెగ్జాండర్‌ మనదేశముమీదికి దండెత్తి వచ్చినది గుప్తచంద్రగుప్తుని కాలములో. మౌర్య చంద్రగుప్తుని కాలములో కాదు. మౌర్య చంద్రగుప్తుని కాలములో నని 1200 ఏండ్లు పాశ్చాత్య చరిత్రకారులు మనచరిత్రను వెనుకకు త్రోసివేసిరి. అంతదూరము పోనక్కర లేదు. శివాజీని గురించి ఎన్ని అబద్ధములు వ్రాసిరి? కలకత్తా బ్లాక్‌హోల్‌ అన్నది జరుగలేదని మన చరిత్రకారులు రుజువు చేయగా, పాఠ్యగ్రంథముల నుండి తొలగించలేదు.

మన చరిత్ర విస్పష్టముగా నున్నది. మన పురాణములయందలి మగధరాజ వంశాదుల యందలి యథార్థ చరిత్ర ననుసంధించి నేను పురాణవైర గ్రంథమాలను పండ్రెండు నవలలను వ్రాసితిని. అందులో 'చంద్రగుప్తుని స్వప్న' మన్న నవల గుప్తచంద్రగుప్త, మౌర్యచంద్రగుప్తుల భేదమును చెప్పునది.

రెండవ ఆరునవలలు కాశ్మీర చరిత్రము. కల్హణ పండితుని రాజతరంగిణి కలదు. దీనిని జహ్వర్‌లాల్‌ పండితుని బావమరిదియైన ఆర్‌. ఎస్‌. పండిట్‌ ఇంగ్లీషులో వ్రాసినాడు. జహ్వర్‌లాల్‌ పండితుడు ఆ గ్రంథమునకు పీఠిక వ్రాసినాడు. ఇది కాక, గోరఖ్‌పూర్‌లోనూ, చౌకాంబాలోను 'కాశ్మీర చరిత్రము' సంస్కృతములో దొరుకును. నేను దానిని కూడ తెప్పించితిని. కల్హణుడు కల్యాది విషయములందు పొరపడినాడు. అవి ఆరు నవలలు వ్రాసినాను.

మరి ఇంకొక ఆరునవలలు నేపాళరాజ చరిత్రను గూర్చి వ్రాసితిని.

ఈ ఇరువదినాల్గు నవలలలో మన పురాణములలో ఆయాచరిత్రములలో నున్న యంశములు తారీఖుల ప్రకారము కాలమును చూపించితిని. సందర్భములను వివరించితిని. చరిత్రలోని ప్రధానాంశములను వదలిపెట్టలేదు.

అందరునూ నేను పడ్డ శ్రమ పడరు. ఈనాడు పాఠకులకు శ్రద్ధ ఎక్కడిది? విజ్ఞాన మక్కరలేదు. పాండిత్య మక్కరలేదు. స్వజాతి భావ మక్కరలేదు. ఇది వేదభూమి యన్న అభిమానము ఉండుట తప్పుగా కనిపించుచున్నది.

ఇన్ని నవలలలో చరిత్రాంశములను తీసివేయ, కథలన్నియు నేను కల్పించినవే. వందలాది విలక్షణమైన పాత్రలు నేను సృష్టించినవే. కథ, కథ చెప్పెడి సొగసు, శిల్పము, బూడిద, బుగ్గి - ఒక గొప్ప నవలకు కావలసిన సామాగ్రి యంతయు ప్రతి నవలలో సమకూర్చితిని. ఒక నవలవలె ఇంకొక నవల యుండదు. అనంతమైన కల్పనా వైవిధ్యమున కంతులేదు. భాషయా? ఎక్కడ ఏ భాష ఉచితమో, ఆభాషయే వ్రాయబడెను. నా పద్యప్రపంచక మెటువంటిదో, నేను నిర్మించిన గద్యప్రపంచకము నట్టిదే! ఎంగిలికూడు లేదు. నాజాతి, నాతెలుగువాళ్ళు, తెలుగుభాష నాది. వాళ్ళు - నేను తెలుగువాణ్ణి కాదు, నేను భారతీయుణ్ణి కాదు అంటే చేసేది లేదు. కాని, వాడు ఈ రెండూ కాకపోతే మాత్రం వాడు శ్రమలేకుండా నా నవలలు చదివి మనోజ్ఞానమును సంపాదించవచ్చు. నేను వ్రాసిన సుమారు అరువది నవలలలో ఏవిషయాన్ని గూర్చి వ్రాయలేదు? పాశ్చాత్యులయొక్క సైన్సుయొక్క చరిత్రలో విషయాలు ఉంటవి. వాళ్ళ ఫిలాసఫీ యొక్క విషయాలు ఉంటవి. వాళ్ళ సాహిత్యములోని రహస్యాలు ఉంటవి. వాళ్ళ శాస్త్రాలలోని మహావిషయాలన్నీ ఉంటవి. వృక్షశాస్త్రము, పశుశాస్త్రము, చివరకు 'మనీ' (Money) మారకం - అవసరమయితే ఇది ఉంటుంది అది ఉండదని ఉండదు. ఇటు చూస్తే వేదాలు, ఉపనిషత్తులు, భాష్యాలు, తర్కాలు, వ్యాకరణాలు - అటు చూస్తే పాశ్చాత్య విజ్ఞానములలో నేను నిద్రాహారాలు లేకుండా సంపాదించిన విజ్ఞానమంతా నా నవలలలో, నా పుస్తకములలో ఉంటుంది.

పాశ్చాత్యుల భూగర్భపరిశోధన ఉన్నది. వాళ్ళ డార్విన్‌ థియరీ ఉన్నది. ఈ డార్విన్‌ సిద్ధాంతములో అనుస్యూతంగా, తెగిపోకుండా ఉన్న సాక్ష్యం ఒక్కటే. అది గుఱ్ఱం. వాళ్ళ ఇనుపయుగము - రాతి యుగము - అప్పటి నుంచి ఇప్పటివరకూ అనుస్యూతంగా వచ్చేది అశ్వము. ఇక్కడ మనకు అశ్వమేథయాగ మున్నది. బృహదారణ్యకంలో ఆయాగమును గూర్చి చెప్పెడి ఉపనిషత్పంక్తులకు శంకరాచార్యులవారు వ్రాసిన భాష్యము చదివినచో ఆ అశ్వ మేమియో తెలియును.

వాళ్ళ త్రవ్వకా లున్నవి. వాళ్ళ త్రవ్వకాలలో బయటకు తీసిన వాటిల్లో మకుటాయమానంగా ఉన్నది ఈజిప్టుయొక్క నాగరకత.

నేను 'ఆరునదు'లన్న నవల వ్రాసి కృష్ణాపత్రికలో ప్రకటించితిని. అందులో నీ పరిశోధన యంతయు వ్రాసితిని. మన పురాణకథలు పుక్కిటి కథలని చెప్పినట్లే పాశ్చాత్యులు, గ్రీకు పురాణాలని కూడా చెప్పారు. కానీ అక్కడ చాలా పరిశోధనలు జరిగినవి. ఫర్‌గ్యూస్‌ అన్న గ్రీకు వీరుడు ఎద్దుతల కలిగిన ఒక రాక్షసుని భూగర్భములో నున్న త్రోవలోనుండి పోయి వధించినాడన్న కథ కలదు. అది నిజమని, ఆభూగర్భములోని వంకర టింకర త్రోవను త్రవ్వి చూపి ఒక అమెరికన్‌ దేశస్థుడు నిరూపించినాడు. ట్రాయ్‌ అన్న నగర మున్నదన్న సాక్ష్యములు భూగర్భ శాస్త్రవేత్తలు చూపించినారు. ఈ మహావిషయమంతయు నేను 'ఆరునదుల'లో వ్రాసినాను.

'పునర్జన్మ' యని మరియొక నవల వ్రాసితిని. మాండూక్యోపనిషత్తు లోనుండి తీసి, పునర్జన్మ ఎట్లు సాధ్యమో నిరూపించినాను.

కడచిన నాల్గైదు వందల యేండ్లగా యూరపుఖండము రాజకీయముగా చిత్ర చిత్రములైన విప్లవములు చేసుకొన్నది. రాజు - ప్రతినిధి రాజ్యము - పరిమిత సంఖ్యాకుల రాజ్యము - ప్రజా రాజ్యము - నియంత - ఎన్ని విధములైన రాజ్యాంగములు, విప్లవములు - కొత్త రాజ్యాంగములు! ఈ మహా విషయమును గూర్చి 'సముద్రపు దిబ్బ' యను నవల వ్రాసితిని.

హిందూస్తానీ సంగీతమును గూర్చి, దాని చరిత్రలు, తాన్‌సేన్‌ నాటి సంగీతము మారి మారి ఖ్యాలులలోనికి దిగినది. ఆ సంగీతము మహారాష్ట్ర దేశములో కొంత మారినది. ఈ చరిత్రయంతయు 'మ్రోయు తుమ్మెద' యన్న నా నవలలో వ్రాసితిని.

దయ్యములను గూర్చి 'బాణావతి' యన్న గ్రంథమును వ్రాసితిని. ఈ కథను నేను కల్పింపలేదు. ఒక నా శిష్యుని ఇంటిలో జరిగిన కథ. అతని అన్నగారు దినచర్యగా వ్రాసుకొన్న విషయము. వాళ్ళ కుటుంబము అనుభవించిన విషయము. దయ్యాలు లే వనుట ఎంత తేలిక! దయ్యాలూ లేవు; దేవతలూ లేరు. రేడియో స్టేషన్‌లో పాడుతూ ఉంటే, మనయింట్లో గ్రహణయంత్రం ఉంటే వినిపిస్తున్నదే. ఇది ఆ యంత్రం కనిపెట్టినవాడి గొప్ప కావచ్చును. గాలిలో ప్రసరించు నినాదతరంగములను ఈ యంత్రనిర్మాత సృష్టించినాడా? అక్కడ పాడిన సంగీతము ఇక్కడ వినిపించుచున్నది కదా! సమకాలమునందు వినిపించుచున్నది. అసలు కాలమునందు పూర్వ మెప్పుడో మాటాడినమాటలు ఈనాడు వినిపించకూడదా! తెలిసినదానికి నీవు కర్తవు కాదు. తెలియనిదానికి నీవు కర్తవు.

ఇవి కాక, ఈకాలపు రాజ్యము నడిచే పద్ధతి, నడుపబడే పద్ధతి ధనమూల మిదం జగత్తన్న అర్థమునకు సామ్రాజ్య పట్టాభిషేకము చేయబడిన ఈ నాటి పరిస్థితిలో రాజ్యములో ఊళ్ళూ మంత్రులూ ఎట్లున్నారో 'దమయంతీ స్వయంవర' మన్న ఒక నవల వ్రాసితిని.

నేను పూర్వాచార పరాయణుడను; ఆధునికుడను కాను; ప్రవాహమున కెదురీదుదును - ఈ మాటలు నన్నుగూర్చి అజ్ఞులైన వారు చెప్పుదురు. ఆ చెప్పుట ఇందాక చెప్పిన వంచనా శిల్పములోని భాగము. ఆ విద్యలో వారు అందెవేసిన చేతులు. ఈ మాట ఎందుకు వ్రాయుచుంటిననగా నేను ఏది చదివిననూ సర్వంకషముగా దానిలోని లోతులన్నియూ నా మనస్సునకు తృప్తి కలుగునట్లు చదివెదను. ఇట్లే ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతము - మూడు భాషలు చదివితిని. అక్షర మెచ్చట నుండి పుట్టుచున్నది? ఎట్లు పుట్టుచున్నది? ఏ భాష యొక్క వర్ణ సమామ్నాయ మెట్లున్నది? దేని శక్తి యెంత? ఇక్కడినుండి అక్కడ వాల్మీకి - వ్యాసులు, ఇక్కడ నన్నయ్య - తిక్కనలు, అక్కడ హోమర్‌ - వర్జిల్‌ - షేక్స్‌పియర్ల దాకా పరమేశ్వరుడు నా కిచ్చిన శక్తిని బట్టి (అది అల్పమని నే ననుకొనుటలేదు) తరచి తరచి చూచితిని. ఇంగ్లీషు భాష మనకు పనికిరాదు. దీనిని 'విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు' లో వ్రాసితిని.

ఆంధ్రచరిత్ర త్రవ్విత్రవ్వి పరమరహస్యములు కొన్ని 'ఆంధ్రప్రశస్తి' లో, కొన్ని నవలలుగా 'స్నేహఫలము', 'చందవోలురాణి' మొదలైన గ్రంథములలో వ్రాసితిని. అందుకనియే నా శరీరములో ఎన్నిజన్మల ఆంధ్రరక్తము ప్రవహించుచున్నదో యని నా 'ఆంధ్రప్రశస్తి'లో వ్రాసితిని. ఇచట కొందరు ఆధునికులకు నభ్యంతర మున్నది. సర్వమానవు లొక్కటియే - ఈ భేద ముండ రాదని. ఒక్కొక్క విషయమును గూర్చి విచారించినచో కాగితాలు చాలవు.

ఇంక మిగిలినది నా విమర్శనలు. 'ఒకడు నాచన సోమన్న', 'శాకుంతలము యొక్క అభిజ్ఞానత', 'అల్లసానివాని అల్లిక జిగిబిగి' ఇవి పూర్వము వ్రాసినవి. తత్పూర్వము వ్రాసిన నన్నయ్యకథ చెప్పుట లేదు.

ఒక ఏడాదిక్రింద 'సాహిత్య మీమాంస' యన్న పేరుతో 'కావ్యానందము' అన్న విమర్శ గ్రంథము వ్రాసితిని. దీని వరుసలో మరి మూడు గ్రంథములు వ్రాయవలయును. ఇట్టి విమర్శన గ్రంథములు మరియును గలవు. 'కావ్య పరీమళము' గలదు. 'సాహిత్య సురభి' యనునది గలదు. ఎమెస్కోవారు ప్రచురించు ఆంధ్రప్రబంధముల పీఠికలు కలవు. అవి పది పీఠికలు.

ఇప్పటికే చాల పెద్ద వ్యాస మైనది.

కాని ఒక్కటి చెప్పి వదిలిపెట్టెదను. ఒకటి అనగా రెండు. ఈ రెంటిలో మొదటి దేమనగా నేను వ్రాసిన పద్యముల సంఖ్య, ప్రకటింపబడినవాటి సంఖ్య, సుమారు ఇరువదివే లుండవచ్చును. నేను చించివేసినవి ఒక ఏబదివే లుండవచ్చును.

లోక మింత మారుతూ ఉంటే వీ డెందుకు మారడు? కొండలు, నదులు మారవు.

కవిత్వము ఛందస్సులోనే వ్రాయవలయును. అట్లు వ్రాయనిచో కవిత్వము కాదు. ఈ ఛందస్సన్న శబ్దము రెండు ధాతువులనుండి పుట్టుచున్నది. 'ఛంద్‌-ఆహ్లాదనే'. రెండవ ధాతువు 'ఛది-ఆచ్ఛాదనే'. ఒకటి ఆహ్లాదనము చేయుచున్నది గనుక; రెండవది కప్పుచున్నది గనుక. అందుకని వేదమునకు ఛందస్సని పేరు. వేదము పాడబడినది. జీవుని యొక్క మాయను కప్పుచున్నది. ఆహ్లాదమును కల్పించుచున్నది. అందులో సంగీత మున్నది, లయ యున్నది. లయయు, సంగీతమును - అనగా రాగచ్ఛాయయును దానియం దున్నవి. సామ వేదమునందే లేదు. ఋగ్వేదమునందు నున్నవి. ఈ రహస్యము తెలిసిన త్యాగరాజుల వారు -
'నాద తను మనిశం శంకరం
నమామి మే శిరసా మనసా!'
అన్నారు. అనగా నాదము శివునియొక్క శరీరము. సంగీత విద్యలో నున్న రాగములన్నీ శివునిశరీరము. కనుక ఛందస్సు శివుని యొక్క శరీరము. శివుడు లేనిచో దేవుడు లేడుకదా! ఛంద స్సక్కరలేదు.

మరి రెండవ విషయము. కవిత్వము నాల్గు విధములు. ప్రబంధ కవిత్వము, ఆశుకవిత్వము, బంధకవిత్వము, చాటుకవిత్వము. చాటు కవిత్వానికి అనాది నుండి మన దేశములో తక్కువ వెల; ప్రబంధకవిత్వానికి ఎక్కువ వెల. ఈ ఇంగ్లీషు చదువులో Minor Poetry వృద్ధి పొందినది. ఖండికలు వచ్చినవి. అవి కవిత్వం కావటం మొదలు పెట్టింది. కావ్యము, శిల్పము, మహాపద్యరచనా శిల్పము, పాత్ర పోషణము, అనంతవిజ్ఞానము, ఒక జ్ఞానభాండాగారముగా నగుచున్న మహాకావ్యము, కవియొక్క అనంతశక్తి - మొదలైనవన్నియు ఉప్పునీళ్ళు చల్లుకొని పోయినవి.

చాటు కవిత్వమువంటి దానికి ప్రాశస్త్యము వచ్చినది. పూర్వము మన దేశములో నిది వినోదమునకైన కవిత్వము - రస సిద్ధికైన కవిత్వము కాదు. ఏవో నాల్గు పద్యములు వ్రాయుట - అట్టి పద్యము లొక గ్రంథముగా ప్రకటించుట - వాడు కవి. నిర్దుష్టమైన శబ్ద మక్కర లేదందురు. వదలి పెట్టుదము. ఔచిత్య మక్కరలేదా? ఉచితమైన యర్థ మక్కరలేదా?

ఈరీతిగా మనదేశములో నున్న మహాదివ్యకవితాభావనయే రూపుమాసి పోయినది. ఇపు డాపద్యానికి కూడా ముప్పు వచ్చినది.

ఇంకొక్క మాట చెప్పి మానివేసెదను. ప్రపంచకము - సర్వమానవ సౌభ్రాతృత్వము - ఏదో మిల్లి నీకు వచ్చునట! దాని మాట అట్లుంచి, ప్రపంచకమున ఇన్ని దేశము లున్నవి; ఇన్ని భాష లున్నవి. ఇన్ని దేశము లెందుకు? ఇన్ని భాషలెందుకు? ఎక్కడివాడు అక్కడనే చచ్చుచున్నట్లున్నాడే!

నిజానికి శిల్పముకాని, సాహిత్యము కాని, జాతీయమై యుండవలయును. విజాతీయమై యుండరాదు. వ్రాసినవానికి ముక్తి, చదివినవానికి రక్తి, ముక్తి. ఎంత సముద్రముమీద ఎగిరినను, పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత! ఇది సంప్రదాయము!

AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - 1947-1972 : nEnU - nA sAhitya rachanalu : shrI vishvanAtha satyanArAyaNa ( telugu andhra )