వచన సాహిత్యము వ్యాసములు ఆడవాళ్ల పాటలు
శ్రీ చింతా దీక్షితులు

ఆడవాళ్ల పాటలు - శ్రీ చింతా దీక్షితులు
భారతి రజతోత్సవ సంచిక - జనవరి 1949

పూర్వ గంథాల్లో పేర్కొనబడ్డ కొన్ని పాటల పేళ్లను వ్రాసి వాటికి యక్షగానాదులనుండి ఉదాహరణములు ఇస్తున్నాను. లక్షణగ్రంథాల్లో కొన్ని పాటల పేళ్లు చెప్పబడ్డవి. కావ్యాదులలో కూడ పాటలు పేర్కొనబడ్డవి. ఈపాటలు ఆయా కాలములనాటి సంఘమర్యాదలను పట్టియిస్తున్నవి. ఒక వ్యక్తి జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టములకు సంబంధించి ఉంటవి ఈ పాటలు. పుట్టినప్పుడు పాటలు, నిద్ర పోగొట్టునప్పుడు పాటలు, మేలుకొలుపుటకు పాటలు, బువ్వము లారగించేటప్పుడు పాటలు, ఎగతాళి పాటలు, పెండ్లి కార్యమునకు సంబంధించిన అనేక పాటలు, ఆరతులు, నివ్వాళులు, ఆటలకు సంబంధించిన పాటలు ఇత్యాదులు.

ఈ పాటలకు ఈ కాలములో గౌరవము లేదు. పాశ్చాత్య విద్యాసంపర్కమువల్ల మన జాతీయతా, సంస్కృతీ పెద్ద దెబ్బ తిన్నవి. ఈ పాటలు మళ్లీ పునరుజ్జీవితము లవుతవో, లేదా వేరు రూపముతో అవతరిస్తవో, లేదా మాసిపోతవో చెప్ప వీలు లేదు. మ్యూజియములో ఉంచుకొనే ప్రాచీనవస్తుసముదాయమున కున్న విలువే నేడు ఈ పాటల కున్నది. మ్యూజియమునకు వస్తువులను పోగుచేసి జాగ్రత్తచేసినట్టుగానే ఈ పాటలను మనము జాగ్రత్త చేయవలసి ఉంటుంది.

అప్పకవీయములో లాలిపాటకూ, పెండ్లి పాటకూ, ధవళము, సువాల మున్నగు పాటలకూ లక్ష్యము లున్నవి.

ఆనందరంగరాట్ఛందములో సూళాది తాళ కొట్నములు, ధవళములు, శోభనములు, ఆరతిపాటలు, జోలలు, ఏలలు, గొబ్బిళ్లు మున్నగు పాటలు పేర్కొనబడ్దవి.

గుడారు వెంకటదాసకవి బలరామచరిత్రలో ధవళము, సువ్వాల, శోభనము, ఆరాత్రిక, లాలి మున్నగు పాటలు పేర్కొనబడ్డవి.

గణపవరపు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ధవళము, శోభనము, ఆరాత్రిక, సువ్వాల, లాలి మున్నగు పాటలు పేర్కొనబడ్డవి.

లక్షణదీపికలో ధవళములు మున్నగు పాటలు పేర్కొనబడ్డవి.

భాగవతములో - యశోదకు చిన్ని మగవాడు పుట్టెనని గోపికలు చూడ వత్తురు. వారు చిన్ని కృష్ణుని చూచి, సంతసించి, తెచ్చిన కానుక లిచ్చి -

    పాపనికి నూనె దలయంటి, పసుపు బూసి
    బోరు కాడించి హరిరక్ష పొ మ్మటంచు
    జలము లొక కొన్ని చుట్టిరా జల్లి తొట్ల
    నునిచి దీవించి పాడి రయ్యువిద లెల్ల

    జోజో కమలదళేక్షణ
    జోజో మృగరాజమధ్య జోజో కృష్ణా
    జోజో పల్లవకరపద
    జోజో పూర్ణేందువదన జోజో యనుచు\న్‌.

ఇచ్చట పోతన్నగారు జోలపాట కంద పద్యములో బిగించినారు. సాధారణముగా జోలపాటలు ద్విపదలలో ఉంటవి.

పూతన శ్రీకృష్ణునికి చన్ను గుడిపి మరణించినది. అప్పుడు గోపికలు శ్రీకృష్ణునకు రక్షచేసి దీవించిరి. అప్పుడు -

    ఆ పెద్ద వేడబంబుల,
    పాపనికినిఁ జన్నుఁ గుడిపి పానుపు పై సం
    స్థాపించి కప్పి 'కూరుకు
    మో పాపఁడ!' యని యశోద యొయ్యన పాడె\న్‌.

యశోద పాడిన పాట జోలపాట. మరిన్నీ గోపకులు వ్రేపల్లెలో ఉండుటకు భయపడి బృందావనము తరలి వెళ్లిరి. అప్పుడు -

    పసుపు లాడి, యురోజకుంకుమ పంక శోభితలై లస
    ద్వసనలై, కచభార చంపక దామలై, సులలామలై,
    పసిడిమాడల కాంతు లఱ్ఱుల బర్వ దేరులమీద బెం
    పెసగబాడిరి, వ్రేతలా హరిహేల లింపగు నేలల\న్‌.

గోపస్త్రీలు ఈ సంతోషసమయమున ఏలలు పాడిరట.

కళాపూర్ణోదయములో జోలపాటలు, పెండ్లిపాటలు పేర్కొనబడ్డవి.

    పొలుపఱ దన్ను వే నిదుర - బుచ్చుటకై తమ తల్లి పైడి యు
    య్యెల నిడి యూపుచో, గువల - యాధిపు పాటల పాడినం, గరం
    బలరుచు గేరికేరి నగు - నన్యుల పాటలు పాడినం, గరం
    బలయుచు నేడ్చు, లోకులవు - రా పతిభక్తి యటంచు నవ్వగ\న్‌.
    మంగళసూత్రము గట్టె గు - రంగాక్షికి నంతరంగ రాజేంద్రుడు పు
    ణ్యాంగనలు పెండ్లిపాటలు - మంగలికోళ్ల మృదుగీతి మధురిమ నెనయ\న్‌.

గౌరన వ్రాసిన హరిశ్చంద్ర ద్విపదలో మాతంగ కన్యలు వీణ వాయించి రాగములు -

    యాలాపములు చేసి, యారాజుమీద
    సూళాదు లింపులు సొగయ బాడుటయు

అని ఉన్నది. గౌరన హరిశ్చంద్రఛాయనే వ్రాసిన శంకరకవి హరిశ్చంద్రోపాఖ్యానములో ఈ విషయమే ఇట్లు వర్ణింపబడినది -

    గాణ ల్మెచ్చగ బాడి దింపు దొలకం - గా దాళమానంబుల\న్‌
    క్షోణినాథజయాంకసంకలితముల్‌ - సూళాది గీతావళుల్‌
    వాణీపాణిసరోరుహాంగుళినఖ - వ్యాపారలీలారణ
    ద్వీణాసంచిత పంచమక్వణ కళా - విఖ్యాత కంఠధ్వని\న్‌.

చేమకూర వేంకటకవి తన విజయవిలాసములో సుభద్ర పెండ్లి సందర్భమున ధవళములనూ, అయిరేని పాటలనూ పేర్కొన్నాడు. అయిరేని పాతలనే వ్యవహారములో అవిరేడు పాట లంటారు. వీటికి ఉదాహరణము ఇప్పుడీయలేదు.

ఉ.    కట్టిరి మంచిలగ్నమునఁ గంకణముల్‌ కరపంకజంబులం
    బెట్టిరి మేనుల న్నలుఁగు మేలిమృగీమదకుంకుమంబులం
    జుట్టిరి కైశికంబుల విశుద్ధమనోహర పుష్పమాలికల్‌
    పట్టిరి పేరఁటాండ్రు ధవళంబులు పాడుచు నుల్లభంబులన్‌.     3-76

సీ.    కులదేవతను దెచ్చి నిలిపిరి మాణిక్య చకచకల్‌ గలపెండ్లిచవికెదండ
    నైరేనిఁ గొనివచ్చి రైదువుల్‌ పాటలు పాడుచు శుభవేళ వేడు కలరఁ
    బులుకడిగినముత్తెముల బాసికంబులు సరవిఁ గట్టిరి నేర్పు సంఘటిల్లఁ
    ... ... ... ... ... ... ... ... ... ... ... ...        3-95

పైన పేర్కొనబడ్డ పాటలకు ఉదాహరణము లీ క్రింద ఇస్తున్నాను. సూళాది గీతముల స్వరూప మెట్టిదో తెలియలేదు. వాటికి ఉదాహరణము చిక్కలేదు.

ఏలలు

రుద్రకవి సుగ్రీవవిజయ మనే యక్షగానము (నాటకము) వ్రాశాడు. అందు సుగ్రీవునకు మొదట పట్టముగట్టారు. తరువాత అంగదునకు యువరాజ్య పట్టాభిషేకము చేసిరి. అప్పుడు సకల వానర సమేతంబుగా సుగ్రీవుడు రామచంద్రునకు కానుకలు గొంచుక వచ్చెను. అప్పుడు అగ్గిరి ప్రాంతంబున నున్న చెంచితలు ఏలలు పాడిరట, యెటువలెను -

    "భానువంశమున బుట్టి
    దానవకామిని గొట్టి
    మౌనివరులు సన్నుతించగా - ఓ రామచంద్రా
    పూని మఖము నిర్వహింపవా.

    రాతి నాతి జేసి పురా
    రాతిచేతివిల్లు విరిచి
    భూతలేంద్రు లెల్ల మెచ్చగా - ఓ రామచంద్రా
    సీతను వివాహమాడవా.

    పరశురాము భంగపరచి
    భరతునకూ రాజ్యమిచ్చి
    గురుడు బనుప నడవి కేగవా - ఓ రామచంద్రా
    సురలు భూసురులు మెచ్చగా."

రుక్మిణీ పరిణయము, సహస్రకంఠరామాయణము మొదలైన బహువిధ ప్రబంధములు నిర్మించిన త్వరకవి రామకృష్ణ ప్రధాని రచించిన భవానిశంకరవిలాస మనే యక్షగానములో పార్వతీ పరమేశ్వర సంవాద రూపమున ఏలలు రచింపబడినవి.

తులాభారము, లేపాక్షి కృష్ణ నాటకము, చిక్కయ్య చరిత్రము మున్నగు యక్షగానాలలో కూడా ఏలలు రచింపబడినవి. కాని పైని ఉదాహరించిన ఏలపాటలకును, వాటికిని కొద్ది భేదము కనిపిస్తూ ఉన్నది. నిమ్మనాథుడు వ్రాసిన చిక్కయచరిత్ర లోని ఏలపాట ఈవిధముగా ఉన్నది -

    "శరణుశరణు దేవరాయ
    శరణుశరణు జనవిధేయ
    శరణు దేవతారాధ్య
    శరణు వేదాంతవేద్య
    ఎన్ని జన్మములను నిన్ను
    ఏను పూజచేసినానొ
    కన్నులార నిన్ను జూడ
    కలిగె నే పవిత్రమైతీ."

అధునాతన గ్రంథము ప్రహ్లాదవిజయ మనే యక్షగానములో ఏలలు, రుద్రకవి ఏలలవలెనే ఉన్నవి.

    "ఉక్కుకంబమున వెడలి
    రక్కసునీ ఉక్కడంచి
    మక్కువతో బాలు గావవా - ఓ నరసింహా
    దిక్కు నీవే మమ్ము బ్రోవుమా."

ధవళములు

రుద్రకవి వ్రాసిన సుగ్రీవ విజయమున సుగ్రీవ పట్టాభిషేకానంతరము పుణ్యాంగనలు ధవళంబులు పాడిరట, యెటువలెను -

    "శ్రీరాముడు గుణధాముడు వారిజలోచనుడూ
    శూరత రావణు గూల్చీ నారీమణి దేవలయు\న్‌
    రాముని కృప కపిరాజ్యము క్షేమంబున బాలించే
    శ్రీమంతుడు సుగ్రీవుడు భూమండలి బొగడొందు
    సంగరవిజయముతో నుప్పొంగెడు సుగ్రీవునకు
    సంగతిగా యువరాజ్యత నంగదు డిల పెంపొందు."

మన్నారుదాస విలాస నాటకములో, "విజయ రాఘవ నృపతికిన్నీ, కాంతిమతికిన్నీ వివాహము జరుగు సందర్భమున బ్రాహ్మణస్త్రీలు ధవళములు పాడిరట -

తిమ్మక్క:ఔ, పొరుగింటి తిమ్మావధాని పెండ్లాం! వీరమ్మ పాటలు పాడుచున్నది, అంటుకొని నీవున్నూ పాడ్రాదషవో?
యల్లమ్మ:యిదేందో నీవు నాగపసానివై పెద్దరికం చేసుకవుండేదానవున్నూ, కడమవారు పాటలు పాడేవారున్నా?
తిమ్మక్క:వోళమ్మా! నాకు పాటలు పాడే టందుకున్ను ప్రొద్దు వున్నదషే? మాపుట్నింటిలో వుండేప్పుడు క్రొండవీటి సర్వమచేత పదినుడుగులు నేర్చుకొంటి. పాడుదునో అంటే శిగ్గవుచున్నది. యిక్కడంతా మొగవారే వున్నారు. నీవు ధవళ మెత్తు, నేనుంగూడా పాడేగాని.

    జయజయ తంజపురవాసా - జయజయ మంజుళహాస
    జయజయ మదనవిలాస - జయజయ మన్నారుదాస
    జయజయ సుజనవిధేయ - జయజయ సమరగాంగేయ
    జయజయ దానరాధేయ - జయజయ దక్షిణరాయ."

అప్పకవి తన లక్షణ గ్రంథంలో ఉదాహరణగా ఇచ్చిన ధవళము -

    "అక్షరహరివికచాంబురు - హాక్షా యక్షపసఖ
    రక్షక సురవిదురద్విప - రక్షారాక్షస విదళన
    పక్షగపతిరథపౌండ్రవి - పక్షాభక్షితదవశిఖి
    వృక్షగ సహచరఋక్షస - దృక్షాఋక్షపదుహితృప."

భవానీశంకరవిలాస మనే యక్షగానములో -

"అని యిట్లు ప్రసన్నులగు ఉమామహేశ్వరుల నొక్క రమ్యంబగు నవరత్న స్థగిత హేమడోలిక నుంచి చెలికత్తియలు కైవారంబులు చేయుచు ధవళంబులు బాడి రెట్లనిన -

    జయజయ జగదాధారా జయజయ జలధగభీరా
    జయజయ శైలవిహారా జయజయ మందరధీరా
    జయజయ పన్నగహారా జయజయ వైరివిదారా"

శోభనములు

గోకులపాటి కూర్మనాథకవి రచించిన మృత్యుంజయ విలాసములో పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవము వర్ణింపబడింది.

    "సలలిత క్రమ మొప్ప సని కంటిమీద, తరుణిని సప్తపాదములు ద్రొక్కించె;
    మరుని జేగంట నా మంగళసూత్ర మంగనామణి కంఠమం దుంచి యొసగ
    మంగళస్థితి సర్వమంగళము, నందు బొందుగ గట్టె నర్ధేందుమౌళి ...

అప్పుడు పేరంటాండ్రు పాటలు పాడిరట, యెటువలెను -

    శోభనమే శర్వునకు, శోభనమే పార్వతికి
    శోభనమే కైలాస శుభమందిరునకు - శోభానమే.
    మణితతుల హారతులు, మదవతులు ఇయరమ్మా
    మతియుతడు శివ్వన్న మగువ గౌరమ్మాకు - శోభానమే."

మన్నారుదాస విలాస నాటకములో ధవళములు పాడిన పిమ్మట బ్రాహ్మణ స్త్రీలు శోభనంబులు పాడిరట. "యెటువలెను -

    చోళాధినాథునకు - శుభకీర్తి సనాథునకు
    బాలార్క తేజునకు భామా మనోజునకు - శోభానమే.
    కనకాచలధీరునకు కవిజనమందారునకు
    మనసిజ విలాసునకు మన్నారు దాసునకు - శోభానమే."

అమ్మనూరి వేంకటసుబ్బసత్కవి రచించిన రసవంతమగు వేములపల్లి ఉషాపరిణయము అను నాటకమున -

"శ్రీకృష్ణుడు ఉషాపరిణయమైన పిమ్మట దంపతులను వెంటబెట్టుకొని ద్వారకాపురంబు డాయంజని, సచివ పురోహిత సుహృద్భాంధవ ముఖ్యు లెదురుకొన భూసురాశీర్వాదంబులును, పుణ్యాంగనా కరకలిత లలితాక్షతంబులు గైకొనుచు నిజగృహ ద్వారంబున రథంబు డిగ్గినం గనుంగొని కొంద రిందుముఖులు బంగారుపళ్లెరంబుల కర్పూరనీరాజనంబులు దెచ్చి నివాళింపుచు హరి నుద్దేశించి శోభనంపు పాటలు పాడిరట. యెటువలె నంటేని -

    దేవతలును ప్రార్థింపగను - భూవలయంబును బ్రోచుటకై
    దేవకి కడుపున ధీరత బుట్టిన - దేవునకును వాసుదేవునకూ - శోభనమే.
    కొట్టక తల్లి గుట్టుగను - పట్టుక రోటికి కట్టినను
    మట్టుమీరి యా మద్దుల గూల్చిన - రట్టడి శ్రీకృష్ణరాయునకు - శోభనమే."

ప్రహ్లాద విజయమందున్నూ శోభనపు పాటగలదు.

కొట్నములు : సువ్వాల

అప్పకవీయములో సువ్వాల కిచ్చిన ఉదాహరణము -

    "అక్షరహరివికచాంబురుహాక్షా
    యక్షపసఖనుత యదుకుల దక్షా
    రక్షక సురవిదురద్విపరక్షా
    రాక్షసవిదళన ప్రరుచిరవక్షా - సువ్వీ.
    పక్షగపతిరథ పౌండ్రవిపక్షా
    భక్షితదవశిఖిబహుసవదీక్షా
    వృక్షగసహచరఋక్షసదృక్షా
    ఋక్షపదుహితృపఋషిజనపక్షా - సువ్వాలే."

మృత్యుంజయవిలాసమున -

"శేషహోమంబు సలిపినాక బలికై సమకట్టిరంత. అప్పుడు కప్పురగంధులు పెండ్లికొట్నంబుల పాటలు పాడిరట, యెటువలెను -

    ఇంతి రావె గొజ్జంగి బంతి రావె రత్నాల
    దొంతి రావె మదనుని దంతి రావె,
    కొమ్మ రావె బంగారుబొమ్మ రావె చివురు లే
    గొమ్మ రావె ముద్దులగుమ్మ రావె,
    చెలియ రావె చేడె రావె చిన్ని రావె పొన్న రావె
    వెలది రావె కొట్నములు వేగ దంచుదము.

    గరుడవాహనములు మంచిగౌరికుంకుమములు రత్న
    సరులు పచ్చ గన్నేరు సన్నదినుసులు
    కలయగూర్చి కరములందు కంకణక్వణము మెరయ
    నలరుటందె లెల్ల ఘల్లు రనగ దంచిరి
    సువ్విసువ్వి సువ్విసువ్వి సువ్విసువ్వి సువ్విసువ్వి
    సువ్వి సువ్వన్న సువ్వి సువాల."

మన్నారుదాస విలాసనాటకములో -

"అచ్యుతవిజయరాఘవాధిపు పెండ్లికి ముచ్చట లాడుచు ముత్తైదువులు వచ్చిరి. ఈసరణి వచ్చిన సువాసినులు సేసలు వెట్టి కొట్నంబులు కొట్టిరట. యెటువలెను -

    సువ్వి మన్నారుదాస సువ్వి రమ్యహర్మ్యవాస
    సువ్వి రుచిరముఖవిలాస సువ్విసువ్వి
    సువ్వి చోళభూమిపాల సువ్వి సుజనవినుతశీల
    సువ్వి యువతిపాంచాల సువ్వి సువ్వి."

ద్రౌపదీ కల్యాణ నాటకమునందు -

    "ఖ్యాతిమీర పాండవులకు నాతియైన ద్రౌపదికిని
    ప్రీతితోడ నలుగు లిట్లు పెట్టి పిదపను
    కుందనంపు పుటికెలందు కోరి రాజనములు నించి
    సుందరాంగులు పాటలు పాడుచు సుంకులు దంచిరీ
    సువ్వి కావేటిరంగ సువ్వి కస్తూరిరంగ
    సువ్వి రామాభిరామ సువ్వాల."

ప్రహ్లాదవిజయము నుంచి ఒక ఉదాహరణము - (కర్త: నిశ్చింత ఎంబారయ్య.)

    "సువ్వి లక్ష్మీనృసింహ సువ్వి శమితపాపరంహ
    సువ్వి యనుచు బాడ రమ్మ సుదతులందరు
    కరిమొ రాలించి వేగ కరుణతోడ వచ్చి మకరి
    శిరము ద్రుంచి కరిని గాచు హరిని బాడరే."

లాలిపాటలు : జోలలు

అప్పకవీయములో లాలిపాట కిచ్చిన ఉదాహరణము సువ్వాల కిచ్చినదే. పాటచివర 'సువాలా' అనుటకు బదులు 'లాలీ' అనవలెననే నియమము మాత్రమే కానవస్తున్నది.

మన్నారుదాసవిలాస నాటకములో -

వివాహశేషహోమంబులు శేఖరించువేళ, కుల క్రమాగత శుభాచారానుకూలంబుగా బాలునకు బాలలు జోలలు పాడి రట. యెటువలెను -

    "జోజోజో బాణాసురారి, జోజోజో చాణూరవైరి
    జోజోజో వేణుగానానుకారి, జోజోజో పద్మావిహారి
    జోజోజో గోపికాజార, జోజోజో నవనీతచోర
    జోజోజో జగదాధార, జోజోజో నందకుమార."

ఇంకోమాదిరి జోలపాట రామదాసు చరిత్రలోనిది -

    "జో రవికులశుభాంగ, జో సన్నుతాంగ
    రార కరుణాపాంగ రమ్యాంతరంగా - జోజో.
    శ్రీవెలయు పాలవారిధి పవ్వళింపా
    దేవబృందము లెల్ల దివి సన్నుతింపా
    భావ మెంచినవారి భక్తి పాలింపా
    దైవరాయా మాకు తరమె వర్ణింపా - జోజో."

మృత్యుంజయ విలాసములో -

    "ఆరూఢి పా న్పెక్కి యాసతి పురుషు
    లుయ్యలలో బొమ్మనుంచి వసంత
    మొయ్యన జిలికించి యువిద లవ్వేళ
    జోజో కుమార జోజో చిన్నియన్న
    జోజో ననుం గన్న చొక్కపు తండ్రి
    యనుచు పాటలు పాడి రట దంపతులకు."

ప్రహ్లాదవిజయములో లాలిపాట ఇట్లున్నది.

    "లాలి కరునాపాంగ లాలి భవభంగ
    లాలి శయనభుజంగ లాలి సత్సంగ - లాలీ
    నీలనీరదగాత్ర నిరుపమచరిత్ర
    ఫాలలోచనమిత్ర పాపలవిత్ర - లాలీ."

ఇట్టి లాలిపాటలూ, జోలపాటలూ అనేక తరహాలుగా తెలుగుదేశములో ప్రచారమం దున్నవి.

పైన ఉదాహరించిన పాటలకేగాక మంగళహారతులకు, అప్పగింతల పాటలకు, తలుపుతీసే పాటలకు, నలుగుపాటలకు, బువ్వంబంతి పాటలకు, గొబ్బిళ్ల పాటలకు మున్నగు పాటలకు యక్షగానాదులలో ఉదాహరణములు దొరుకుచున్నవి. అందు మంగళహారతులు అనేక విధములైన వరుసలలో ఉన్నవి. గ్రంథవిస్తరము కాగల దని ఉదాహరణము లిచ్చుట లేదు. ఇవిగాక జంపెలు, కురుజంపెలు, అర్ధచంద్రికలు మున్నగు వాటిని గురించి ప్రత్యేక వ్యాసము వ్రాయవలసి ఉన్నది.

హెచ్చరిక

ఇక హెచ్చరిక అనే పాటకు రామదాసు చరిత్ర నుండి ఉదాహరణము -

    "హెచ్చరిక శ్రీరామ హెచ్చరిక రామా
    హెచ్చరిక రఘురామ హెచ్చరిక రామా
    బంగారుగిన్నియల పొంగుదీరిన పాలు
    అంగనలు దెచ్చినా రన్న హెచ్చరికా
    పచ్చకపురపు విడెము హెచ్చుగా సీతా
    ఇచ్చుచున్నది రామదేవ హెచ్చరికా."

ఈపాట వేరొక విధముగా ప్రహ్లాద విజయమున కనబడుచున్నది -

    "శ్రీరామారమణా యాశ్రితదోషహరణా
    కారుణ్యాభరణా నతశరణా హెచ్చరికా,
    శరణాగతజనరక్ష సరసీరుహాక్ష
    మురదానవశిక్ష కరివరదా హెచ్చరికా."

పెండ్లిపాటలు

అప్పకవి పెండ్లి పాటలకు ఈ క్రింది ఉదాహరణ మిచ్చెను -

    "లక్ష్మీకల్యాణవైభవమే
    అక్షర హరి వికచాంబురుహాక్షా
    యక్షపసఖనుత యదుకులదక్షా
    రక్షక సురవిదురద్విపరక్షా
    రాక్షసవిదళన ప్రరుచిరవక్షా
    లక్ష్మీకల్యాణవైభవమే."

మృత్యుంజయవిలాస మందలి పెండ్లిపాట ముచ్చటగా ఉన్నది. అది ఇందు ఉదాహరిస్తున్నాను -

    "శ్రీమహాలక్ష్మిని శ్రీవిష్ణు బోలీ
    తామరతంపరై దగి దంపతులు
    పూవున తావియు బొందినయట్లు
    ఈ వధూవరు లుందు రెనసి యెల్లపుడు
    కలికి మాగౌరమ్మ కడగంటి చూపు
    కలువ పూవుల దండ గద శంకరునకు
    చెన్నుగ పూవుల చే రెత్తినట్లు
    కన్నె మాగౌరమ్మ కాపురం బొప్పు
    కడువేడుకలచేత కడుపు చల్లగను
    కొడుకుల కోటవై కొమరొందరమ్మ
    వెలయంగ దగు చోట్ల వియ్యంబు లంది
    కలకాల మఖిలభోగముల వర్ధిల్లు."

భక్తికి, యోగమునకూ సంబంధించిన పాటలే గాక, శృంగారపరమైన పాటలున్నూ అనేక మున్నవి. వేదాంతమునకు సంబంధించిన పాట ఒకటి ఉదాహరించి ఇంతటితో ఈ వ్యాసము ముగిస్తున్నాను. పాటల స్వరూపము తెలపడమే ఈ వ్యాసముయొక్క ఉద్దేశము కాబట్టి ఇతర విషయము లేమీ ఎత్తుకొని చర్చించలేదు.

వేదాంతకీర్తన

    "భక్తురాల యిటు రమ్మని ననుచే
    పట్టి పిలుచుకొనెనే
    రక్తిలేని సంసారము విడిచి వి
    రక్తి బొందు మనునే- భక్తురాల.

    జలజనయన శాంభవి ముద్రకు
    జననస్థల మనునే
    కలికిరో యున్మనియను ముద్రకు సం
    కలితభూమి యనునే - భక్తురాల.

    ఎల్లలోకముల నిండి చెలంగెడు
    ఎరుకే నీ వనునే
    సలలితహృత్కమలాంతరంగమున
    సౌఖ్య మొందు మనునే - భక్తురాల."

AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - ADavALla pATalu - SrI chiMtA dIkShitulu - Chinta Deekshitulu ( telugu andhra )