వచన సాహిత్యము వ్యాసములు ఆంధ్ర నాటకముల ఆరంభదశ
శ్రీ దివాకర్ల వేంకటావధాని

ఆంధ్ర నాటక పితామహుఁడు
(కీ. శే. ధర్మవరము రామకృష్ణమాచార్యుల వారి నాటకములపై విమర్శ)
డా. దివాకర్ల వేంకటావధాని
(ఆంధ్ర విశ్వ విద్యాలము M.A.(Hons) పట్టమునకై సమర్పించిన వ్యాసము - 1937)
ప్రథమాధ్యాయము

ఆంధ్ర నాటకముల ఆరంభదశ

నన్నయకుఁ బూర్వ మాంధ్రభాషకు స్థిరమైన రూపము కాని, కావ్య రచనావశ్యకము లైన ఛందోవిస్తృతులు గాని లేకుండె ననుట సర్వపండిత సమ్మతమైన విషయము. అప్పటి యాంధ్ర వాఙ్మయము ప్రాయికముగా శాసనాది రూపమునే దాల్చి యుండెను గాని యింకను గావ్యాకృతిని వహింపలేదు. తొలుఁదొలుత నీ భాషాపాదపమునఁ గావ్యరూపస్వాదు ఫలమును బండించినవాఁడు నన్నయ. ఈతఁడు రాజరాజ నరేంద్రుని ప్రేరణచే సర్వధర్మ సమన్వయసంధాన దక్షమయి పంచమ వేదమునాఁ బరఁగు భారతము నాంధ్రీకరింప నారంభించెను. ఈతఁడు స్వతంత్ర కావ్యరచనానుకూలములైన ప్రతిభావ్యుత్పత్తులు కలవాఁడే యయ్యు నొకవంకఁ దననాఁటి కసంస్కృతమై యవ్యవహితమై యున్న భాషకు సుస్థిరాకారము నొసఁగు భారమటుండ స్వతంత్ర కావ్యరచన భారమును గూడ వహించుట కష్టతర మని కాఁబోలు నట్టి పనికిఁ బూనుగొనఁ డాయెను. అదిగాక తత్కాల పరిస్థితులును, బ్రభు శాసనమును భారతమువంటి వైదిక మతప్రచారక గ్రంథము యొక్క యావిష్కరణమునకు మిక్కిలి యనుకూలములై యుండెను. నన్నయ తరువాతఁ దిక్కనయు, నెఱ్ఱనయు నాతనిచే నారంభింపఁబడిన యా యుత్తమ కావ్యము నాంధ్రీకరణము పూర్తిచేసిరి. ప్రతిభాశాలులయిన యీ మూగురు కవులును తమతమ యుగములందలి కవుల కెల్లరకును నాదర్శప్రాయులగుటచే నప్పటి యాంధ్రకవులు పెక్కురు వీరి మార్గమునే యనుసరించి ప్రసిద్ధములైన యితర పురాణములఁ గొన్నిటి నాంధ్రీకరించిరి. నన్నెచోడుని కుమారసంభవము వంటి స్వతంత్ర కావ్యములు కూడ నొండు రెండు వెలువడినను ఆంధ్రీకృతము లయినవానిలో నివి పదింట నొక్కటి కూడ నుండవు. మొత్తముమీఁద నెఱ్ఱన యుగాంతమువఱకు వెల్వడిన యాంధ్రవాఙ్మయమునఁ బురాణ పరివర్తనమే ప్రధాన లక్షణమని భావింపవచ్చును.

భారత కవుల యాంధ్రీకరణ పద్ధతి యసామాన్యమైనది. వ్యాసరచిత భారతము నుండి కథాంశములను మాత్రము గైకొని వారు తక్కిన మెఱుఁగుల నన్నిటిని దామే తీర్చిదిద్దిరి. వలయునెడలఁ బూర్వోత్తర కథాభాగములను సైతము తారుమారు చేయుటకు వారు వెనుదీయలేదు. కథాగమనమున కడ్డుకలిగించునట్టియు, నప్రసక్తము లైనట్టియు, గూఢ వేదాంత గర్భితము లగుటచే దుర్గ్రహములై నట్టియుఁ గథాభాగములను గేవలము సూచించి విడిచివైచిరి. సనత్సుజాతీయము, భగవద్గీత మొదలగున విట్టి వానికిఁ దార్కాణములు. వీరు వర్ణన భాగములను రచించుటలో మిక్కిలి స్వాతంత్ర్యము వహించి మూలగతములయిన వర్ణనలతోపాటు స్వకపోల కల్పితములయిన వర్ణనలఁగూడ గొన్నిటి నందుఁ బ్రవేశపెట్టిరి. పాత్రముల శీలస్వభావములను వర్ణించుపట్ల గూడఁ గొన్నియెడల మూలవిరుద్ధమైన పద్ధతి నవలంబించిరి. తిక్కన ద్రౌపదీ పాత్రకును, వ్యాసుని ద్రౌపదీ పాత్రకును స్వభావ విషయమునఁ గల తారతమ్యమే దీనికిఁ బ్రబల దృష్టాంతము. కాన వ్యాసుని భారతము చెంత నుంచుకొని యందలి శ్లోకము లన్నియు నియ్యెడ నాంధ్రీకృతములయినవని చూచుటకాని, యందలి వర్ణన లన్నియు నిందు మక్కికి మక్కిగా ననువదింపఁ బడినవని చూచుట కాని మిక్కిలి నిష్ఫలములయిన కార్యములు. మొత్తము మీఁద నాంధ్రీకరణమన్న పేరున్నను నాంధ్రమహాభారతమొక స్వతంత్రరచనము వలెనే చూపట్టును గాని మూలగ్రంథము నతి సన్నిహితముగా ననుసరించిన కేవల పరివర్తనము వలెఁ గానిపింపదు. కవిత్రయము వారి యీ పరివర్తన పద్ధతి నంత సమగ్రముగా ననుకరింప లేకపోయినను బురాణ పరివర్తకులు పెక్కు రా మార్గము వెంటనే పోయిరని చెప్పవచ్చును.

స్థూలముగాఁ జూచినచో సంస్కృత వాఙ్మయము నంతను బురాణములు, కావ్యములు, నాటకములు అని మూఁడు ముఖ్యభాగములుగా విభజింపవచ్చును. అందుఁ బురాణములు వివిధవిషయ సంకలితములును, నతివిస్తృతములును. కావ్యములు వర్ణన ప్రధానములు; వస్త్వైక్యముతోడి ప్రౌఢ రచన కునికిపట్టులు. నాటకములు ప్రధానముగా రసాశ్రయములు, సంవాదపూర్వకములయి యవి యనతి విస్తృతములుగ నుండును. ప్రథమాంధ్రకవులా కాలప్రభావమును బట్టి ధర్మోపదేశ బాహుళ్యము గల పురాణముల నాంధ్రీకరించి భాషాసేవఁ గావించిరి. ఎఱ్ఱన యుగానంతరము వెలసిన యాంధ్రకవులు పురాణపరివర్తనమును విడిచి విశేష ప్రసిద్ధినందిన సంస్కృత కావ్యముల నాంధ్రీకరింప మొదలిడిరి. నన్నెచోడుఁడు తన కుమార సంభవమున నుద్భటుఁడను సంస్కృతకవి రచించిన గుమారసంభవము నందలి వానిని వలె నెచ్చట నైనను గ్రహించి యుండెనేమో కాని దాని ననుపదముగ ననువదించిన వాఁడు మాత్రము కాదు. కాఁగా సంస్కృత కావ్య పరివర్తనకుఁ బ్రప్రథమమున నారంభించినవాఁడు శ్రీనాథుఁడు. ఇతఁడు శ్రీహర్షుని నైషధము నాంధ్రీకరించుటయేకాక హరవిలాసమునందుఁ గుమారసంభవమునందలి శ్లోకములఁ బెక్కింటి నాంధ్రీకరించెను. ఈతని యాంధ్రీకరణమునకును గవిత్రయమువారి యాంధ్రీకరణమునకును విశేష తారతమ్యము కలదు. ఇతని పద్ధతి కవిత్రయము వారిదివలె నతి స్వతంత్రము కాదు. ఔచిత్యంబు పాటించి యనౌచిత్యంబు పరిహరించి యతిమనోహరముగ నాంధ్రీకరించుచు వచ్చినను, ఇతఁడు మూల గ్రంథమునందలి శ్లోకములను సన్నిహితముగా ననుసరింపక మానినవాఁడు కాఁడు. సీసపద్యములం దితఁడు స్వకల్పిత పాదములఁ బ్రవేశపెట్టిన చోట్లును, గ్రంథకర్త యభిప్రాయము గూఢముగా నున్నప్పుడు దానిని స్వేచ్ఛగా వివరించిన పట్లును, నచ్చటచ్చటఁ గలవు. మొత్తము మీఁద నితని పరివర్తనము కవిత్రయము వారి దానివలె నతి స్వతంత్రమును, నధునాతనుల నాటక పరివర్తనముల వలె మక్కికి మక్కియును గాక మూలభిన్నము కాని స్వతంత్ర పరివర్తనమై విలసిల్లుచున్నది. పురాణకావ్య పరివర్తనము సాగిన తరువాత నాటకముల పరివర్తింపఁ బడుట సహజ పరిణామక్రమము. శ్రీనాథ యుగము నందలి కవులు నైసర్గికమైన యీ క్రమమును పరిశీలింపక పోయినవారు కారు. శ్రీనాథుని పరివర్తన పద్ధతినే యవలంబించి వీరు ప్రసిద్ధములయిన సంస్కృత నాటకములఁ గొన్నిటి నాంధ్రీకరించిరి. పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి తన శృంగార శాకుంతలమునఁ గాళిదాసుని శాకుంతలము నందలి శ్లోకములఁ గొన్నిటిఁ దెనిఁగించి యచ్చటచ్చటఁ జొప్పించెను. నందిమల్లయ ఘంటసింగనలు వేదాంతపరమయిన ప్రబోధచంద్రోదయమును సంపూర్ణముగ ననువదించిరి. రాజశేఖరుని విద్ధ సాలభంజిక యేకదేశముగనో, పూర్ణముగనో మంచన కేయూరబాహు చరిత్రమున ననూదితమని యనుకొనుట కాధారములు పెక్కు గలవు.

కాని యీపరివర్తనమునం దొక విశేషము కానవచ్చుచున్నది. పురాణ పరివర్తకులుగాని, కావ్యపరివర్తకులుగాని మూల గ్రంథముల నాంధ్రీకరించుచో వాని యాకృతులం దెట్టి మార్పును గావించి యుండలేదు. వర్ణన భావముల విషయమున వారు కొంత స్వాతంత్ర్యము వహించినను ఆకృతిజోలికి మాత్రము పోయినవారు కారు. ఈ నాటక పరివర్తకు లట్లుకాదు. వీరు నాటకములను యథారూపముగా నాంధ్రీకరింపక ప్రబంధములుగా నాంధ్రీకరించి యుండిరి. దీనితో సాదృశముగల విషయ మాంధ్ర వాఙ్మయమునందు మఱియొకటి కలదు. కేతన సంస్కృతమున దండి విరచితమైన దశకుమార చరిత్రము నాంధ్రీకరించుచు దాని రూపము నిట్లే మార్చి యుండెను. సంస్కృతమున గద్యరచితమైన యా గ్రంథము నాతఁడు పద్యమయ కావ్యముగాఁ జేసెను. గద్యమైనను, బద్యమైనను రసాత్మకమయిన వాక్య ప్రపంచము కావ్యమే యగు నను విషయము నెఱింగియును కేతన యీ గ్రంథము నట్లు మార్చుట కప్పటి వాఙ్మయ పరిస్థితులే కారణములై యుండును. కేతనకుఁ బూర్వముండిన కవుల రచనలలో నెడనెడఁ బద్యములతోపాటు గద్యముకూడ వ్రాయఁబడి యుండినను అంతయు గద్య మయమైన కావ్యమొక్కటియు లేదు. వాఙ్మయమునం దపూర్వమైన క్రొత్తమార్గము నొకదానిని ద్రొక్కుటకుఁ గాని పద్యమయ కావ్యమునం దభిమానము సూచముట్టుగా విడుచుటకుఁ గాని కేతనకు మన సొగ్గి యుండదు. అట్లే యా నాటక పరివర్తకులు గావించిన మార్పునకును బ్రబల మయిన హేతువు లుండి తీరవలయును. వీరి పరివర్తనము ఉన్నంతవఱకు శ్రీనాథుని పద్ధతినే యనుసరించి యుంట నాతి మూలమును, నాతి స్వతంత్రము నై మిక్కిలి మనోహరముగా నున్నది. ఆంధ్ర వాఙ్మయమున కా భాగ్యము లేకపోయెను గాని వారే యీ పద్ధతిని సంస్కృత నాటకముల నాంధ్ర నాటకములుగా ననువదించి యుండినచో సంస్కృతనాటకముల యంద మాంధ్ర పరివర్తనములఁ గొఱవడిన దను కించలేక యాంధ్రులు తద్రసమును మనసారఁ గ్రోలి యానందించి యుండెడివారే!

పాల్కురికి సోమనాథుని రచనలలో దృశ్య కావ్యప్రశంస కలదు. శివరాత్రి జాగరణము సందర్భమున వేడ్కలు, వినోదములు, ప్రదర్శనములు బహువిధములుగ నుండె నని యాతఁడు వర్ణించి యున్నాఁడు.

"ప్రమథపురాతన పటుచిత్రములు
క్రమమొంద బహునాటకము లాడువారు
భారతాది కథలఁ జీరమరుగుల
నారంగ బొమ్మల నాడించువారు"
"వెండియు భవు బహువిధ చరిత్రము ల
ఖండితగతి నాటకంబు లాడుచును"

మున్నగు వాక్యముల వలన నప్పుడొక విధమయిన నాటక ప్రదర్శనము లుండెడివని విదిత మగుచున్నది. అప్పుడు "తోలుబొమ్మల నాడించుచు భారతాది కథలను బ్రదర్శించుట, వీథి భాగవతములను బోలు ననేక విధములగు ప్రదర్శనములలో శివుని బహువిధ చరిత్రములను నాటకములుగాఁ జేసి యాడుట మొదలగు వేడ్కలు జరిగినవి. దీనివలన నాటకరచనయుఁ బ్రదర్శనమును గూడ నా కాలమున జన సామాన్యమునఁ బ్రబలముగనే యుండె నని తెలియుచున్నది. అది యిటీవలి కాలమునఁ బ్రదర్శింపఁబడు వీథినాటకములను బోలియుండునని సోమనాథుని వర్ణనలను బట్టి మన మూహింపవచ్చును. ఆంధ్రలోకమున నిట్టి నాటక ప్రదర్శనములు పండిత పామర జనుల కా కాలమునుండియు నానందమును గూర్చుచున్నవి కనుకనే కాఁబోలును శిష్టకవులు 19వ శతాబ్దివఱకును నాంధ్రమున నాటకరచనాభారమును వహింపలేదు."

నాటకముల మాట యిట్లుండఁ గవి సార్వభౌముఁడగు శ్రీనాథుని రచనముగాఁ బ్రసిద్ధి గాంచిన వీథి నాటక మొండు కానవచ్చు చున్నది. దశరూపకములలో నొకటి యైన వీథికి లాక్షణికు లొసఁగిన లక్షణము దీనఁ గానిపింప దనుట నిర్వివాదము. ఇందు శృంగార రసాలంబనములును, నసభ్యములును నగు చాటుపద్యములు కొన్ని గలవు. మహాకవియైన శ్రీనాథుఁడు వీథీ లక్షణము నెఱుంగక యుండఁడు; ఎఱిఁగి యెఱింగి యీ రీతిగాఁ గొన్ని పద్యములు రచించి వీథి యను నామము పెట్టియు నుండఁడు. వీథి యను నామ మా పద్య సముదాయమున కవాంతరముగాఁ గలిగి యుండ నోపు. లేదా పలువురు పండితులు సందేహించున ట్లిది శ్రీనాథ రచితమే కాక మఱి యెవ్వరిదో యయ్యు శ్రీనాథుని పేరఁ బరఁగు చుండవచ్చును 1 . దీనిని బట్టి యాతని కాలమునకే యక్షగానము లనఁబడు దేశినాటకము లున్నట్లు తెలియుచున్నది. తంజావూరు మధుర నాయకుల కాలమున నీ దేశినాటకములు విరివిగా రచింపఁబడి ప్రదర్శితము లయినవి. రచనలో వీనికిని సంస్కృత నాటకములకును బోలిక కానరాదు.

ఇట్లు పదునేఁడవ శతాబ్ది యారంభము వఱకును దెనుఁగున స్వతంత్ర నాటకములు గాని, సంస్కృతనాటకముల యథా రూప పరివర్తనములుగాని వెలువడి యుండలేదు. ఈ కారణములచే నంతకుఁ బూర్వమున నున్న యాంధ్రకవులు రస దోహలములగు సంస్కృత నాటకముల యౌత్కృష్ట్యమును గమనించి యుండలేదని కాని, తామై స్వతంత్ర నాటక సృష్టి చేయఁ గడంగుటకుఁ దగిన సామర్థ్యము లేని వారని కాని మనము తలంచుట పొరపాటు. పూర్వ కవులలోఁ బెక్కు రీ యుత్తమ సృష్టికిఁ గావలసిన ప్రతిభా సామర్థ్యములు కలవారయ్యు ననివార్యములగు కొన్ని కారణములచేఁ దద్రచన విషయమున నౌదాసీన్యము వహించి యుందు రనుటకుఁ బెక్కు నిదర్శనములు కలవు. కథోపాఖ్యాన రచన కౌశలమే ప్రధానముగఁ గావలసిన భారతమువంటి యితిహాసమునందుఁ గూడఁ బ్రతిఘట్టమునందును నాటక సరణు లచ్చొత్తించిన తిక్కన స్వతంత్ర నాటకము నొకదానిని రచింపఁ బూనకుండుట కాతని శక్తిలోపమే ప్రధాన హేతు వని యనుకొనుట మిక్కిలి పరిహాసపాత్ర మగును. రూపమునఁ గాకపోయినను గుణపరంపరచే నాటకమే యనిపించుకొనుచున్న ప్రభావతీ ప్రద్యుమ్నమునంత నిపుణముగ నిర్మించిన పింగళి సూరన నాటక మొండు వ్రాయఁగడంగమికి నుపజ్ఞాలోపము కంటె భిన్నమైన హేత్వంతరమును సూచించుట లెస్స. ఇట్లే శ్రీనాథాద్యన్య కవీశ్వరులు సైత ముత్తమ నాటక రచనోత్సాహమును గానిపించ కుండుటకుఁ బ్రజ్ఞాభావము కాక వేఱు నిమిత్తములు బలవత్తరములై యుండవలెను. ప్రతిభాశాలులగు కవులు క్రొంగొత్త పోకడలఁ బోయి తమ బుద్ధివైశిష్ట్యముచే నవనవ కావ్య భూజముల మొలిపించి తద్రస పరిమళములచే వాఙ్మయ మహావనములఁ బరితోవాసితములఁ గావింతు రనుట సుప్రసిద్ధమే. పై మూగురు కవుల ప్రతిభయుఁ బ్రధానముగా నాటకోచితము. సంస్కృత నాటకముల సారమును బర్యాప్తముగ నాస్వాదించిన యీ మహాకవులు స్వతంత్ర నాటకములను బరిమితముగ నైన సృష్టించి యుండవలసినది. వీరేకాదు, మన పూర్వ కవు లందఱును సంస్కృత వాఙ్మయ పయోధిపారమును ముట్టినవారే. దీనికి వీరాంధ్రమునకుఁ బరివర్తించిన సంస్కృత గ్రంథజాలమే తార్కాణము. కొంచె మించుమించుగాఁ వీరు సంస్కృతమునఁ గల ప్రసిద్ధ కావ్యముల నన్నింటిని దెనిఁగించిరని చెప్పవచ్చును. అట్టి వీరు స్వతంత్రముగా నాటకముల వ్రాయకుండినను రసనిధానములై కావ్యముల నుత్తమము లని యెన్నఁ బడుచున్న సంస్కృత నాటకములలో నొక దానినిగూడఁ దెనుఁగున నావిష్కరింపమి మిక్కిలి విస్మయావహము. కొందఱు సంస్కృత నాటకముల పరివర్తనమును బ్రారంభించియు వాని రూపమును మార్చి ప్రబంధములుగా ననువదించుట చూడ నాటకరచనమున కా కాలమున నేవియో యనివార్యములైన యాటంకము లుండవలయు ననుట నిర్వివాదము.

సంస్కృత నాటకములలో నొండు రెండు తక్కఁ దక్కిన వన్నియు శృంగార రస ప్రధానములు. మత ప్రచారమ్మే ప్రయోజనముగాఁ గల ప్రబోధచంద్రోదయము వంటి నాటకము లంతకు ముందు లేవు. తెనుఁగు వాఙ్మయము యొక్క పుట్టుక యా నాఁటి పరిస్థితులనుబట్టి చాలవఱకు వైదిక మతోద్ధరణముతో సంబంధించి యుండుట సంభవించెను. అప్పటి యాంధ్ర సమ్రాట్టులు కూడ దానికొఱకే విశ్వప్రయత్నములు చేయుచుండిరి. అట్టి యెడ పంచమవేద మనఁ బరగి సర్వధర్మ సమన్వయ సంధాన క్షమము లగు భారతము వంటి యుత్తమ గ్రంథముల యొక్క పరివర్తనమే మిక్కిలి యావశ్యకమై కనుపట్టెను. అందుచేతనే శ్రీనాథుని యుగము వఱకును గల తెనుఁగు వాఙ్మయము మత ప్రచారమున కనువగు పురాణముల పరివర్తనము తోడనే భాసిల్లు చుండెను. పైఁగా శ్రీనాథునికిఁ బూర్వముండిన యాంధ్ర కవులలో నన్నెచోడుని వంటి స్వతంత్ర కావ్యకర్తలు తక్కువ. వాఙ్మయారంభమున నాద్యులయిన నన్నయాదుల మార్గమును వీడి నాటక పరివర్తన మారంభించి భిన్న మార్గమును ద్రొక్కుట కప్పటి కవులకు ధైర్యము చాలినదికాదు.

సంస్కృత నాటకములలో సంస్కృత ప్రాకృతములకు రెంటికిని విరివియైన యుపయోగము కలదు. సంస్కృతము వలెనే ప్రాకృతము కూడఁ బూర్వ వైయాకరణులచే నిబద్ధమై నియమితమై యుండుటచే నది సంస్కృతముతోపాటు స్వతంత్రమై కావ్యములయందు నిరాక్షేపముగ నుపయోగింపఁ బడుచు నొక ప్రత్యేక భాషగఁ బరిగణింపఁబడు చున్నది. అంతియకాక సంస్కృత లాక్షణికులు నాటక నిర్మాణమునఁ బాత్ర లుపయోగించు భాష విషయమునఁ గొన్ని నియమముల నేర్పఱిచిరి. బ్రాహ్మణులును, నాయకులును, రాజులును శుద్ధ సంస్కృతము నుపయోగింతురు. స్త్రీలును, నీచజనులును బ్రాకృతము నుపయోగింతురు. మరల నీ ప్రాకృత ప్రయోగ విషయమునఁ గొంత వేఱుపాటు కలదు. కులీన లగు స్త్రీలు గీతములలో మహారాష్ట్రీ ప్రాకృతమును నుపయోగింతురు. సాధారణ సంభాషణమున వీరును, బాలాదులును, సేవకులును శౌరసేని నుపయోగింతురు. అంతఃపుర పరిచారకులు మాగధిని, నీచసేవకులు పైశాచిని వాడుదురు. ఇట్లా యా పాత్రల యంతరములను బట్టి సంస్కృత నాటకములలో భాషాప్రయోగము నియమితమై యున్నది. సర్వసాహిత్య మార్గము లందును సంస్కృత ఫక్కినే యనుకరించు నలవాటుకల తెనుఁగువారి కీ నిబంధనము కొంత యాటంకము కల్గించినది. ఏలయన సంస్కృత ప్రాకృతముల వలెఁ దెలుఁగున గ్రాంథిక గ్రామ్య భాషలు రెండును వ్యాకరణ పరిసంస్కృతములై యుండలేదు. తెలుఁగున గ్రామ్యమునకు స్థిరమైన యాకృతి లేదు. కాఁగా సంస్కృత నాటక కర్తలు ప్రాకృతమును, దద్భేదములను నుపయోగించిన చోటులలోఁ దెలుఁగువా రెట్టి భాషావిశేషము నుపయోగింప వలెనో స్పష్టపడి యుండదు. పోనీ, లాక్షణికులు చెప్పిన యా ఒక్క నిబంధనము నుల్లంఘించి సర్వపాత్రలకు నొకటే భాష నుపయోగించి నాటక రచనకుఁ గడంగుటకుఁ బూర్వాంధ్రకవుల కంత నిరంకుశత్వమును, స్వాతంత్ర్యమును లేకపోయెను. దీనికి ఫలితమే తెలుఁగున నాటకములు తరుణములో వెలువడకుండుట.

సంస్కృత నాటకములయినను బ్రసిద్ధములయినవి సంఖ్యేయములే. అవి పదవ శతాబ్దికిఁ బూర్వ మేమి వ్రాయఁబడెనో కాని తరువాత వాని నంత విరివిగా వ్రాయఁ గడంగిన వారు చాల తక్కువ. వ్రాయఁబడిన నాటకములలోఁ గూడ ప్రబోధచంద్రోదయము వంటి నాటకము లే యొకటి రెండో తక్కఁ దక్కినవి ప్రసిద్ధికి రాలేదు. ప్రాచీన సంస్కృత నాటకములు కాళిదాసాదుల కాలములో నప్పుడప్పుడు ప్రదర్శింపఁ బడుచుండిన నుండవచ్చును. కాని తరువాత వానిని బ్రదర్శింపఁ బూనినవారెవరును లేరు. ఏలయన సంస్కృత నాటకములు బహుభాషా భూయిష్టము లగుటచే విద్వత్సామాజిక పరిషత్తుల కొరకే యూహింపఁ బడినవి కాని, నిరక్షరులయిన సామాన్య జనుల కొరకుఁగాదు. అదిగాక పదియవ శతాబ్దికిఁ తరువాత, అంతకుఁ బూర్వమునుండి సైతము, దేశభాష లధిగమించుచు వచ్చిన యధిక ప్రాధాన్యము కతమున సంస్కృతమునకుఁ బ్రాముఖ్యము తగ్గుచుండెను. ఈ కారణములచే సంస్కృత నాటకముల ప్రదర్శనము లేకుండె ననియే చెప్పవచ్చును. అట్టి ప్రదర్శనము లుండినచో వానిని జూచినప్పుడయిన నాంధ్రకవులకు నాటక రచనాభిలాష కలిగియుండెడి దేమో!

నాటకము గద్య పద్యమయమై సారస్వత ప్రయోజనమునేకాక (Literary purpose) రంగ ప్రయోజనమును గూడ (Theatrical purpose) నిర్వహించు కావ్య విశేషము. ఈ ప్రయోజన ద్వితయమునం దేది కొఱవడినను నది సమగ్రమైన, శ్రేష్ఠమైన నాటకము కాఁజాలదు. శ్రవ్య కావ్యములుగా మాత్రము చదివి యానందింపఁ దగిన ప్రబోధచంద్రోదయాది నాటకములలో నిట్టిలోపము కొంతపట్టు కాననగును. శ్రవ్య కావ్యములయందు మనోనయన గోచరము మాత్రమే కాఁదగు కథా జగత్పాత్రలు దృశ్య కావ్యములయందుఁ జర్మచక్షుర్గోచరములగు చుండుటచే నిష్పాదిత మగు ప్రత్యక్షతయే "కావ్యేషు నాటకం రమ్య" మ్మను నానుడికి ముఖ్య కారణము. శ్రీనాథుఁడు హర్షనైషధము నాంధ్రీకరించి యాతనిఁ తరువాతఁ దండోప తండములుగ వెలువడిన ప్రబంధములను నొక జాతి వాఙ్మయమున కాదర్శభూతుఁడయ్యెను. ఈ ప్రబంధములు కూడ గద్య పద్యమయములై దండిచే నిర్వచింపఁబడిన చంపూ కావ్యజాతికిఁ జేరును. వర్ణన ప్రధానములే యయ్యు నివి శృంగారాది రస పరిపోషకములై హృద్యముగ నుండును. కాని నాటకములలోఁ గాననగు సంవాదక్రమముగాని, యవి నిర్వహింపఁగల రంగ ప్రయోజనముగాని వీనియందుఁ జూపట్టవు. పూర్వాంధ్ర కవులు రంగ పరికర సాహాయ్యముచేఁ ప్రయోజితములయిన సంస్కృత నాటకములను గాని, యాంధ్రనాటకములనుగాని చూచి యానందించి యెఱుఁగరు. అందుచేఁ గించి దూనముగా నాటకాకృతినే వహించిన బ్రబంధములఁ బఠించి తదాపాదితానందానుభవము చేతనే సంతుష్టులయిరి. ఈ కారణము చేతనే పినవీరభద్రాది కవులు సంస్కృత నాటకములను బ్రబంధములుగా ననువదించిరి. దీనినిబట్టి వీరు నాటకములను శ్రవ్యకావ్యములు గానే చూచి వాని సారస్వత ప్రయోజనముతో మాత్రమే తుష్టి నొందిరని స్పష్టపడుచున్నది.

విజయనగర వినాశానంతరము తంజావూరు మధుర సంస్థానములు ప్రసిద్ధికి వచ్చెను. ఈ సంస్థానముల నాయకులు వాఙ్మయాభిరుచి కలవారై యనేక కావ్యములను దాము వ్రాసియుఁ, దమ యాశ్రితులచేత వ్రాయించియు నాంధ్రభాషను సర్వవిధముల నభివృద్ధి చేసిరి. వీరి పోషణమున యక్షగానములు విరివిగా రచింపఁబఁడి ప్రదర్శింపఁ బడుచుండెను. ఈ యక్షగానములు "జక్కుల పాటలు" అను తెనుఁగు పదమునకు సంస్కృత రూపమని పండితు లూహించుచున్నారు. వీని ప్రాచీనతను నిర్ణయించుటకుఁ దగిన సాధన సామాగ్రి యిపు డందుబాటులో లేదు. తొలుఁదొలుత నివి సత్కవి రచితములు కాక నటులచేతనో, మఱి యే స్వల్ప పాండిత్యము కలవారిచేతనో వ్రాయఁబడిన వచనరూప సంబంధముకల పురాణ పద్యములతో విలసిల్లు చుండెను. తరువాత వీనిని జను లాదరించుటచే విద్వత్కవులు గూడ స్వతంత్రముగా నిట్టివానిని వ్రాయ నారంభించిరి. వీనిలోఁ గూడఁ బలు తెఱఁగులు కలవు. అందు కూచిపూఁడి వారు ప్రఖ్యాతిలోనికిఁ దీసికొని వచ్చిన యభినయ ప్రధానములయిన కలాపము లొక విధము. ఈ యక్షగానము లన్నియుఁ బద్యగద్యగేయమయములై సూత్రధారునిచే నుచ్చరింపఁ దగిన యుపోద్ఘాత పూర్వకములై నట్టియుఁ, బాత్రప్రవేశ సూచకములై నట్టియు వచనములతో నిండి యుండును. కాని వీనిలో నేదియు రసవస్తునాయక స్వరూపములయందు స్థిరత్వము గాంచినది కాదు. ఇవి శుద్ధ దేశి మార్గమునకుఁ జెందినవి. రూపమునందుఁ గాని, లక్షణమునందుఁ గాని సంస్కృత నాటకములకును వీనికిని సన్నిహిత సంబంధ మేమియుఁ గానరాదు.

ఇప్పు డిప్పుడు మన భాషలో వెలయుచున్న నాటకములకు సంస్కృత రూపకములే యాదర్శములు. యక్షగానములే యిట్లు పరిణమించిన వనుకొనుట పొరపాటు. ఇంకను ఈ యక్షగానములు కాలక్రమమున మాఱి రూపమునందుఁ గించిద్భిన్నములే యయ్యును హరికథలుగాఁ బరిణమించిన వనుకొనవచ్చును. ఇట్టివి పాల్కురికి సోమనాథుని కాలము నుండియు వ్రాయఁబడి యప్పు డప్పుడు ప్రదర్శింపఁ బడుచుండుటచే నప్పటివారు వీని ప్రదర్శనముల నవలోకించుటతోడనే సంతుష్ఠులై సంస్కృత నాటకములను బోలిన నాటకములను మన భాషలో వ్రాయుటకుఁ బూనుకొనరైరి.

పైఁగా నాటకము లాడుటకుఁ కావలసిన నాటకశాలలు కాని, రంగ పరికరములు కాని యప్పు డాంధ్రదేశమున నెచ్చటను లేకుండెను. కృష్ణదేవరాయల వంటి రసికులయిన సార్వభౌములు కూడ శ్రవ్య కావ్య పఠన మాత్రముచేతనే తృప్తి గాంచిరి కాని, దృశ్య కావ్యములఁ గన్నారఁ జూచి యానందింపఁ దగిన యేర్పాటులు కావించి యుండలేదు. కృష్ణదేవరాయల సభలో నృత్యములు జరుగుచుండెనని స్వరోచి పుర ప్రవేశ సందర్భమున మనుచరిత్రలో పెద్దనార్యుఁడు రచించిన "చిలుకలకొల్కి కల్కి యొకచేడియ నాటకశాల మేడపై నిలువున నాడుచుండి" (-63) అను పద్యము వలనఁ దెలియుచున్నది. కాని యవి నాటకసంబంధులగునో కాదో, యయినను ఆంధ్ర నాటకములకును వానికిని గల సంబంధ మెట్టిదో తెలిసికొనుట కాధారములు లేవు. ఇట్లే తంజావూరు రాజుల కాలమునఁ గూడ నృత్యగీతాది వినోదములకై యొకశాల నిర్మింపఁబడెను. అది "సరస్వతీ మహలు" అను పేరితో నిప్పటికిని నిల్చి యారాజుల కళాభిరుచిని వేనోళ్ళ నుద్ఘోషించుచున్నది. ఇందుఁ గూడ నాటకసంబంధులు కాని నృత్యములును, ఆ కాలమున విరివిగా నుండిన యక్షగానములు, భాగవతములు మున్నగువాని ప్రయోగములును జరుగుచుండె ననుట కవకాశము కలదు కాని, నాటకములు ప్రయోగింపఁబడె ననుటకుఁ దగిన నిదర్శనములు లేవు.

ఇట్లు నాటక ప్రయోగమునకు ముఖ్యావశ్యకములయిన రంగ పరికరాదులు లేక పోవుటచేతను, నాటక పాత్రధారు లార్యధర్మము ననుసరించి సంఘమున నీచముగఁ జూడఁబడు చుండుట చేతను, బ్రభువులు సైతము నాటకకళ నభివృద్ధిచేయ నంత శ్రద్ధ వహింపక పోవుట చేతను నానాఁటి కవు లీ వాఙ్మయశాఖయం దభిరుచి వహించి కావ్యరచనముచే దానిఁ బరిపోషింపఁ బూనుకొనరైరి. ఈ కారణముచేఁ బ్రజాసామాన్యమునకు నాటక ప్రయోగ మెంత నీతిప్రదాయకమో, యెంత యానంద ప్రశాంతి ప్రదమో తెలియక పోవుట సంభవించెను. సంస్కృత నాటక ప్రయోగములు క్షీణించిన తరువాత వీథీనర్తకుల యొక్కయు (Street Dancers), వీథీగాయకుల యొక్కయు (Street Singers) సంఖ్య యధిక మగుటయు విద్యావిహీనులగు ప్రాకృతజనులు వాని నాదరించుటయుఁ దటస్థించెను. కాని నాగరులును, విద్యావంతులును వీనియెడ నసహ్యభావమునే ప్రకటించుచుండిరి. ఈ పరిస్థితులవలనఁగూడ నాటక వాఙ్మయ మన్నను, దద్రచన మన్నను నాఁటి కవులకు నీరసభావమేకాని గౌరవము లేకపోయెను.

నాటక కళ సంస్కృతమున సమగ్రత్వమును బ్రాపించినది. తల్లక్షణముల సమగ్రముగా వివరించు లక్షణగ్రంథము లందుఁ బెక్కు వెలువడినవి. ఆంధ్రకవులు సంస్కృత కావ్యముల నాంధ్రీకరించినట్లు కొన్ని నాటకముల నాంధ్రీకరింపక పోవుట యటుండ నీ లక్షణ గ్రంథములయినఁ దెలుఁగున వెలయింపరైరి. తెలుఁగుభాషకుఁ దత్కావ్యములకు స్వల్పముగ లక్షణములను వివరించినవారు కూడ నీ రూపకలక్షణమును బరిత్యజించిరి. పదమూఁడవ శతాబ్దియందలి విన్నకోట పెద్దన తన "కావ్యాలంకార చూడామణి"లో నీ రూపక ప్రశంస కొలఁదిగ నైన నొనర్చి యుండలేదు. పదునాఱవ శతాబ్దియందలి భట్టుమూర్తి "నరసభూపాలీయ"మను పేర విద్యానాథుని "ప్రతాపరుద్రీయ"మును గొంచె మించుమించుగఁ బరివర్తనము చేయుచు నందలి రూపక ప్రకరణమును విడిచివైచెను. ఆంధ్రనాటక రచనము కాని తత్ప్రయోగము కాని లేదుకదా దాని లక్షణము నియ్యెడ వివరింపనేల యని యతఁ డద్దాని యెడ నౌదాసీన్యము వహించియుండును. నిజము పరికింప నీలాక్షణికుల యెడఁ గొంచెమైనను దోషము లేదు. లాక్షణికుఁడున్న గావ్యములను, దదంతర్భాగములను బరికించి వానికి లక్షణము వ్రాయునేకాని లేనివానికిఁ దానై యొక లక్షణము సృష్టించి భావికవులీ మార్గము ననుసరింపవలెనని శాసించునట్టివాఁడు కాఁడు. అందుచే రూపక నామ వాచ్యములగు కావ్యముల యభావముచే లాక్షణికు లా శాఖ వాఙ్మయమునకు లక్షణము వివరింపరైరి. 2 లక్షణాభావముచేఁ గవులు రసాశ్రయములయిన రూపకములను రచించి యాంధ్రభాషాయోష నలంకరింపరైరి. ఫలితార్థమేమనఁగా సాటి దేశభాషలలో బెక్కు ఆ నాఁడే కళాసర్వస్వములయిన రూపకములచే విరాజిల్లుచుండఁగా నాంధ్రమునకు నిన్న మొన్నటిదాఁక నా భాగ్యము లేకపోయినది.

ఇఁక పదునేడవ శతాబ్దిలోని వాఁడగు ఎలకూచి బాలసరస్వతి తాను రచించిన రాఘవయాదవపాండవీయములో "కవిసమీహిత రంగ కౌముదీనామ నాటక విధాన ప్రతిష్ఠాఘనుండ"నని వ్రాసుకొనెను. ఈ రంగకౌముది నాటకవిధానమని చెప్పఁబడుటచే నాటక లక్షణములను నిరూపించు నొక లక్షణగ్రంథమై యుండవచ్చును. ఆ గ్రంథము నామమాత్రావశిష్టమగుటచే నందెట్టి నాటకములకు లక్షణము విధింపఁ బడెనో, యే లక్షణమునుబట్టి యది వ్రాయఁబడెనో, లేకయది యేదేని సంస్కృత లక్షణమునకుఁ బరివర్తనమేమో తెలిసికొనుట కవకాశము చిక్కకున్నది. ఆ కాలమున యక్షగానమనియెడి ప్రదర్శనోచితమైన వాఙ్మయభాగము కొంచెము కొంచెముగాఁ దలచూపుచుండె నని యిదివఱకే చెప్పఁబడినది. ఈ రంగకౌముది యట్టివాని లక్షణమును నిరూపించు గ్రంథ మేమోయని సందేహించుటకు వీలు కలదు. లేదా యిదికూడ నట్టి యక్షగానములలో నొకదాని పే రను కొన్నను నంత బాధ లేదు. అది లక్షణ గ్రంథమైనను యక్షగానమైనను దాని నామమును బట్టి పదునేడవ శతాబ్దిలో రంగోద్ధరణమునకై కొంత ప్రయత్నము జరుగుచుండెనని మాత్రము విశ్వసింప వచ్చును.

పదునెనిమిదవ శతాబ్ది మొదటివాఁడగు కుందుర్తి వేంకటాచలపతి తాను రచించిన కార్తిక మాహాత్మ్యములో "చాటుకృతులును బహువిధ నాటకములు ... ... రచన గావించి పాండ్యవిభుచేఁ బ్రభుత్వ సంపదలఁ గనితి" నని వ్రాసికొనెను. ఈతఁడు రచించిన బహువిధ నాటకము లెట్టివో నిర్ణయించుట కవి యుపలభ్యమానములు కావు. పైఁగా నితని ప్రభువులును, రసికులు, కవులు, కవిపోషకులు నైన విజయరంగ చొక్క భూపాలాది పాండ్య భూపతులు కూడ నట్టి నాటకముల నభినయింపఁ జేసినట్లు కానఁబడదు. ఈతఁడు వ్రాసిన యీ నాటకములు కూడ నప్పుడు బహుళప్రచారమున నుండిన యక్షగాన భేదములే యయి యుండును. కాఁగా మనమిప్పుడు కాంచుచున్న యాంధ్రనాటకములకుఁ బదునెనిమిదవ శతాబ్దిలో సగమువఱకు బీజారోపణము కావింపఁ బడలేదని యూహింప వచ్చును.

పందొమ్మిదవ శతాబ్ది యుత్తరభాగమున విజయనగర పురాధీశ్వరులగు శ్రీమదానంద గజపతి మహారాజులుంగారు సంస్కృత నాటకముల సారము చూఱలు గొన్నవా రగుటచేఁ దత్ప్రయోగ దిదృక్షువులై నాటకసంఘము నొకదానిని స్థాపించి ప్రదర్శనము లారంభించుట కదియే ప్రథమమని స్థూలముగాఁ జెప్పవచ్చును. కాని యీ వుద్యమము చాలకాల మవిచ్ఛిన్నముగా సాగినదికాదు. మహారాజుగారి మరణముతో నాయనచే స్థాపింపఁబడిన నాటక సంఘము కూడఁ దూష్ణీంభావము వహింపవలసి వచ్చెను. ఆ కాలమునఁ దెలుఁగు ప్రజలలో నాటకాభిరుచి విస్తరింపఁ జేసిన కొన్ని విశేషపరిస్థితు లంకురించెను. మహారాష్ట్రమునను, దదితర స్థలము లందును అప్పుడు పార్శీ, హిందీ నాటక సంఘములు బయలుదేరి యా భాష యందలి నాటకములను విరివిగాఁ బ్రదర్శింప మొదలుపెట్టెను. ఈ నాటక సంఘములు తమతమ దేశములయందే నాటకములను బ్రదర్శించుటతోఁ దృప్తి నొందక తెలుఁగు కన్నడ దేశములకుఁ బోయి కొన్ని నాటకముల నభినయింప నారంభించెను. క్రొత్తగా వచ్చిన ఈ నాటక ప్రదర్శనములు తాత్కాలికముగా జరుగుచుండుటచేఁ దెలుఁగువారిలో స్వభాషయందుఁ గూడ నట్టి నాటకములు కొన్ని యుండి ప్రదర్శింపఁ బడుచో వాని నుత్సాహముతోఁ జూచుట కభిరుచి జనించెను. ఈ పరిస్థితుల నన్నిటిని బరికించుచుండిన పండితు లప్పుడప్పుడే సంస్కృత నాటకముల నాంధ్రమునకుఁ పరివర్తింప మొదలిడిరి. తొలి దినములలో నాంధ్రవాఙ్మయము వలెనే నాటక వాఙ్మయము గూడ ముందు పరివర్తనము తోడనే ప్రారంభ మగుట యిటఁ బరిశీలింపఁ దగినది.

ఈ నాటకముల పరివర్తన పద్ధతికిని, బూర్వకవుల బరివర్తన పద్ధతికిని విశేష తారతమ్య మున్నది. పూర్వకవులు తగిన స్వాతంత్ర్యము వహించి పరివర్తనములు సైతము స్వతంత్రములుగాఁ గానిపించున ట్లొనరించిరి. వీ రట్లు గాక నాటకములందలి పద్యములకుఁ బ్రతిపద పరివర్తనము చేయుట కారంభించుటచే నీ పద్యముల నడక సామాన్యముగాఁ గుంటుపడి శ్రుతి కటువుగా నుండును. వీరాశ్లోకముల నాంధ్రీకరించు పట్ల నందలి పదములెల్లఁ బరివర్తనము లైనవో లేవో పరిశీలింతురు కాని యందలి భావములు మూలమునందు వలె సులభద్యోతితములై సమగ్రముగా వ్యక్తములైనవో లేదో చూడరు. అందుచే నీ పద్యములు కొన్నిచోట్లఁ గేవల నీరస పదముల సముదాయము వలెఁ దోఁచును. పైఁగా వీరు భావవ్యక్తికంత ప్రాధాన్యము నీయకపోవుట చేతను, మూలము కంటె పరివర్తనము సులభముగ నున్నచోఁ దమ పాండిత్యమునకు భంగము వాటిల్లునను భ్రాంతిచేతను, మూలములోని పదములకంటెఁ గ్లిష్టతరములైన పదముల నీ పరివర్తనములయందు వాడఁ జూతురు. అందుచే మూలసాహాయ్యము లేనిదే వీరి పరివర్తనముల సంపూర్ణభావము చదువరులకుఁ దెలియనే తెలియదు. అనువాదకుఁ డెంత యసామాన్య ప్రజ్ఞ కలవాఁడైనను ననువాదము గుణమునందును, నర్థ సౌలభ్యము నందును, రస స్ఫురణ యందును మూలమునంత పటువుగా నుండుట దుర్లభము. అందును బైని చెప్పఁబడిన యట్టి దోషములుకూడఁ గొన్ని యుండినచోఁ బరివర్తనములు మూలముతోఁ బోల్చి చూచిన మిక్కిలి నీరసములై కానవచ్చుటలో వింత యుండదు. ఈ కారణము చేతనే తెలుగువారికి సంస్కృత నాటకములు పూర్వ కవులచే నాంధ్రీకరింపఁ బడలేదను విచారము.

ఎట్లైనను సంస్కృత నాటకముల పరివర్తనము ప్రారంభ మగుట తోడనే యాంధ్ర వాఙ్మయమున కొక నూతనోత్సాహము పొడసూపినది. ఆ కాలమున మచిలీపట్టణమున నుపాధ్యాయులుగా నున్న శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రిగారు నాటకాభావముచే మన వాఙ్మయమునకుఁ గల్గిన కొరంతను వారింప భట్టనారాయణుని "వేణీసంహార" నాటకము నాంధ్రీకరించిరి. కాని యే కారణముచేతనో యా పరివర్తనము ముద్రితము కాలేదు. వీరు "మధుకరీ మంజరీయ" మను స్వతంత్ర నాటకమును గూడ రచించిరి. తరువాతఁ జెన్ననగర వాసులగు శ్రీ కొక్కొండ వేంకట రత్నము పంతులుగారు ధర్మభట్టకృతమైన "నరకాసుర విజయవ్యాయోగము" ననువదించి ప్రకటించిరి. ఈ కాలముననే విశాఖపట్టణ వాసులగు శ్రీ పరవస్తు వేంకట రంగాచార్యులుగారు కాళిదాసుని యభిజ్ఞాన శాకుంతలము నాంధ్రీకరింప నారంభించి యందలి కొంత భాగమును దాము ప్రకటించుచుండిన మాస పత్రిక ముఖమున వెలువరించిరి. కాని యా గ్రంథ మసంపూర్ణముగ నుండఁగనే యాచార్యులుగారు దివంగతులగుటచే నది యట్లే యుండిపోవలసి వచ్చెను. తరువాత శ్రీకందుకూరి వీరేశలింగము పంతులుగా రానాటకమునే తమ నిసర్గమధురమైన శైలిలో ననువదించి తొలుత వివేకవర్ధనీ పత్రికా మూలమునను, దరువాతఁ బుస్తక రూపమునను వెలయించిరి. వీరిట్లు సంస్కృత నాటకములను మఱి కొన్నింటిని దెలిఁగించుటయే కాక యాంగ్లేయ మహాకవియగు షేక్స్పియరు రచించిన "మర్చెంటు ఆఫ్‌ వెనిస్‌" (Merchant of Venice), "కామెడీ ఆఫ్‌ ఎర్రర్సు" (Comedy of Errors) మున్నగు నాటకములను గూడఁ దెలుఁగునకు దర్జుమా జేసిరి. ఈ కాలముననే శ్రీ గురజాడ రామమూర్తి పంతులు గారు, శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రిగారు మొదలగు మఱికొందఱు పండితులు సంస్కృతాంగ్లములనుండి మఱికొన్ని నాటకముల ననువదించి ప్రకటించిరి.వీరేశలింగము పంతులుగా రిట్లు నాటకములను రచించుటయే కాక యొక నాటక సంఘమును గూడ స్థాపించి తమ రత్నావళిని, భ్రమప్రమాద ప్రహసనమును నప్పుడప్పు డభినయింపఁ జేయుచుండిరి. ఇట్టి సంఘములు మఱికొన్ని విశాఖపట్టణము, విజయనగరము మొదలగు పెద్ద పెద్ద పట్టణములలో స్థాపింపఁబడి యచ్చటి ప్రజలను పరివర్తిత నాటకములచే నానందింపఁ జేయుచుండెను. గుంటూరులోని శ్రీ కొండుభొట్ల సుబ్రహ్మణ్యముగా రిట్టి సంస్థనే యొకదానిని నెలకొల్పి తాము గావించిన పరివర్తనములను బౌరాణిక కథావస్తు విలసితములగు స్వతంత్ర నాటకములను బ్రదర్శింపఁ జేయుచుండిరి.

ఈ కాలముననే (క్రీ॥ శ॥ 1880 మొదలు) బళ్ళారి నగరమున సరసవినోదినీ సభ యనియు, సుమనోరమా సభ యనియు రెండు నాటక సంఘము లేర్పడి మిక్కిలి సమర్థులును, నాటక రచనా ప్రదర్శనములయం దసమాన ప్రతిభాశాలులును నగు నిరువురు న్యాయవాదులచే జయప్రదముగాఁ గొనసాగింపఁ బడుచుండెను. వీరిరువురును సంస్కృత నాటకములఁ బరివర్తించు జోలికిఁ బోక చరిత్రనుండియు, బురాణ ప్రబంధములనుండియు వస్తువులను గ్రహించి పెక్కు నాటకములను రచించిరి. ఆంగ్ల గీర్వాణాంధ్ర భాషలయం దసమాన వైదుష్యము కలవారగుటచే వీరి నాటకముల యం దాంగ్ల సంస్కృత సరణులు రెండును గాన నగును. ఆంగ్ల భాషా సంప్రదాయము ననుసరించి యిరువురును విషాదాంతనాటములు (Tragedies) రచించిరి. వానిలో రామకృష్ణమాచార్యుల విషాద సారంగధరమును, శ్రీనివాస రాయల విజయనగర రాజ్యపతనమును నాంధ్రులందఱు నెఱింగినవే. ఈ కవు లిరువురును గొంచె మించుమించుగా సమకాలికులును సహ పౌరులును నగుట వీరిని గూర్చి యొక విషయము చెప్పవలసి యున్నది. అది వీరి నాటక వస్తువులు సమానభావము, పరస్పర స్పర్థచే వలె వీరిలో నొకరు నాటకీకరించిన వస్తువునే రెండవవారును మరలగ్రహించి నాటకముగా వ్రాయుట కాననగును. వీరిరువురును మంచి నటకులుకూడ నగుటచేఁ దమ రచించిన నాటకములను దాము స్థాపించిన నాటక సమాజములచే బళ్ళారి, మదరాసు మున్నగు పట్టణములలోఁ బ్రదర్శింపఁ జేయుచుండిరి. వీరు రచించిన నాటకములు పెక్కు అముద్రితములైనను నప్రదర్శితము లైనవి తక్కువ. ఆంధ్ర నాటక వాఙ్మయమున కింత రూపమొసంగి ప్రాణము పోసిన యీ మహనీయ మూర్తు లిరువురు నంధ్రులకుఁ జిరస్మరణీయులు. అచ్చటచ్చట నాంగ్ల నాటక పద్ధతుల ననుకరించిన వీరి నాటకములలో సంస్కృత నాటక ప్రాతికూల్యము కొంత కానవచ్చుటచేఁ బండితులకు వీరి నాటకములపై నంత యభిమానము కలుగకుండినను బ్రదర్శన కాలమున నవి యాకర్షించు ప్రేక్షక సమూహము వాని యభిరంజకత్వమును జెప్పక చెప్పుచున్నది. ఏ కారణము చేతనో శ్రీనివాస రాయల నాటకములకుఁ కృష్ణమాచార్యులవారి నాటకముల కున్నంత వ్యాప్తి కానరాదు. వారు రచించిన నాటకము లన్నింటిలో విజయనగర రాజ్యపతనము మాత్రమే యెడపదడప ప్రదర్శింపఁబడుట కాననగును. ఆచార్యులు గారి 3 నాటకములలోఁ బ్రదర్శనానుకూల్యము మెండగుటచేఁ గాఁబోలును జనాదరము పడయని నాటకమే లేదు. ఇట్లు నాటకము లనినఁ దెలుఁగు ప్రజలకును, గవులకును విశేషాభిరుచిని గలిగించిన యా పార్శీ నాటక సంఘములు ప్రశంసనీయములు. తరువాత బయలుదేరిన కవులు కేవల పరివర్తనములతోఁ తృప్తిపడక సంస్కృత మార్గానుసారముగనే కొన్ని స్వతంత్ర నాటకములను బ్రాయఁబూనిరి. ఆధునికులు వ్రాయుచున్న దృశ్యకావ్యములలో నింతింతనరాని వైవిధ్యము గోచరించు చున్నది. అందు సాంఘికనాటకములు, విషాదాంతములు, ఏకాంకికలు, గేయనాటికలు, శ్రవ్య నాటికలు ముఖ్యములైనవి. వీని యన్నింటియందు నాంగ్ల పాశ్చాత్య రూపక ప్రభావము పొడగట్టుచుండును.


1[1] కీర్తింతురెవ్వాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి (3-69).
వెనక్కి

2[2] క్రీ. శ. 16వ శతాబ్ది యందలి చిత్రకవి పెద్దన మాత్రము లక్షణసారసంగ్రహమున నాటకలక్షణములు తెల్పి యున్నాఁడు.
వెనక్కి

3[3] ధర్మవరము కృష్ణమాచార్యులు గారు.
వెనక్కి

AndhraBharati AMdhra bhArati - Andhra nATakamula AraMbhadaSa - divAkarla vEMkaTAvadhAni - Dr. Divakarla Venkatavadhani - telugu vachana sAhityamu - vyAsamulu - ( telugu andhra )