వచన సాహిత్యము వ్యాసములు బుఱ్ఱకథ
- శ్రీ శ్రీనివాస చక్రవర్తి

తెలుగువాణి
ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచిక
ఉగాది, 1975

శుద్ధయక్షగాన కళారూప ప్రభేదమే బుర్రకథ. కాలపరిణామములో యక్షగానమే బుర్రకథగా రూపొందింది. ఈ రూపాంతరము ఎప్పుడు ఏప్రాంతములో జరిగిందో కూడ స్పష్టముగా చెప్పలేము. అయితే దీనిని పల్నాటికథ, బొబ్బిలికథ అని కూడ అంటారు. కాబట్టి పల్నాడు ప్రాంతంలోనో, బొబ్బిలి ప్రాంతంలోనో రూపాంతరము జరిగిందని కొంతవరకు ఊహించవచ్చును.

కథకుడు వాయించే తంబురా బుర్రనుబట్టి బుర్రకథ అని పేరు వచ్చింది. ఈకథలో వంత "తందానతాన", కాబట్టి దీనిని "తందానపాట" అనికూడా అంటారు. యక్షగానంలో కథచెప్పేది స్త్రీ. బుర్రకథలో కథ సామాన్యంగా పురుషుడు చెబుతాడు. ఇపుడు స్త్రీలు కూడా బుర్రకథ చెపుతున్నారు.

ఈ కథకుడు తంబూరాగానీ, సితారుగాని పుచ్చుకొని వాయిస్తూంటే ఒకరు హాస్యం చెప్పేవారు, ఒకరు వంతపాడేవారు. అందుకే పూర్వపు కథకులు ఇద్దరు స్త్రీలను వివాహమాడటం రివాజు అయింది. దీనిని వృత్తిగా స్వీకరించి ప్రచారంలోకి తెచ్చినవారు జంగాలు. అందుకే దీనికి "జంగం కథ" అనికూడ పేరు వచ్చింది. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిచ్చేవారు. ఇప్పుడు కులంతో నిమిత్తంలేకుండా స్త్రీ పురుషులు, బాలబాలికలు బుర్రకథ చెపుతూ ప్రజలను రంజింపచేస్తున్నారు.

శ్రీనాథుని కాలమునాటికే బుర్రకథలు బాగా ప్రచారంలో వున్నాయని "క్రీడాభిరామము"లోని క్రింది పద్యంవలన తెలుస్తున్నది.

ద్రుత తాళంబున వీరగుంభి తకధుం ధుం ధుం కిటాత్కార సం
గతి వాయింపుచు నాంతరాళికయతి గ్రామాభిరామంబుగా
యతి గూడం ద్విపద ప్రబంధమున వీరానీకముంబాడెనొ
క్కతి ప్రత్యక్షరముం గుమారకులు ఫీట్కారంబునదూలఁగన్‌.
        (సాహితీ సుగతుని స్వగతం - తిరుమల రామచంద్ర)

మొన్నమొన్నటివరకు ఈకథలను మంజరీ ద్విపదలో వ్రాశేవారు. ఈపూర్వకవుల పేర్లుకూడా గట్టిగా తెలియవు. ద్విపదను "ముదిలంజ" అని కొందరు ఈసడించగా శ్రీనాథుడు పల్నాటివీరచరిత్రను ద్విపదలో బుర్రకథగా వ్రాసి ఒక మహోత్తమ గ్రంథాన్ని ఆంధ్రులకు సమర్పించాడు. ఇపుడును లభ్యమగుచున్న బుర్రకథలలో ప్రాచీనమైనదీ పల్నాటివీరచరిత్ర అని తెలుస్తూ ఉన్నది.

బుర్రకథ దేశిసాహితీ శాఖకు చెందినది. చక్కటి జాను తెనుగులో రచితమై ప్రేక్షకులకు రసానుభూతి కలిగించడంలో ప్రముఖస్థానం అందుకున్నది. వీటిలో ఎక్కువ ప్రాధాన్యం వహించేవి వీరకరుణ రసాలు. నేర్పరి అయిన కథకుడు కథ చెబుతూ ఉంటే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.

కథకుడు సామాన్యంగా నిలుచుని కథ చెప్పడు. ముందుకు వెనుకకు అడుగులు వేస్తూ, నృత్యంచేస్తూ, గిర్రున తిరుగుతూ, మధ్య మధ్య కూర్చొని అభినయిస్తూ కథ చెపుతాడు. దీనితో ప్రేక్షకుల హృదయాలు రసార్ద్రమవుతాయి.

ఈ విధంగా ద్విపదలో రచితములై ఎక్కువ ప్రజాభిమానం చూరగొన్న బుర్రకథలు పల్నాటివీరచరిత్ర, పెద్దబొబ్బిలియుద్ధం, బాలనాగమ్మకథ, ఆఱుమరాటీలకథ, కామమ్మకథ మొదలగునవి. కామమ్మకథలో కరుణరసం పరాకాష్టకు చెందింది. ఈ అర్థశతాబ్దంలో ఈ కథలను చెప్పడంలో పెద్దపేరు పొందింది రెంటపాళ్ళ గుడ్డి జంగం.

దేవరకొండ వెంకయ్యామాత్యుడు ఉత్తరగోగ్రహణం బుర్రకథతో రంగంలో ప్రవేశించడంతో ఈబుర్రకథారూపం ఇంకోదశ అందుకుంది. ఇందులో ద్విపదలేకాక కీర్తనలు, దరువులు, కందార్థాలు మొదలగునవి వాడడం గమనించదగ్గది. ఈ విధమయిన బుర్రకథలను చెప్పడంలో యావదాంధ్ర విఖ్యాతి గాంచింది దొడ్డవరపు వెంకటస్వామి. నిండయిన విగ్రహం, పెద్దజరీఅంచు తలపాగ, నవరసాలు ఆవిష్కరించే ముఖం. ఇతను ఉత్తర గోగ్రహణం చెపుతుంటే ప్రేక్షకులు తన్మయులవుతుండేవారు.

ఇక మూడవదశ నాయకులు సుంకర సత్యనారాయణ. ఇతను బుర్రకథ రచనకు పూనుకొనక ముందు బుర్రకథలన్నీ పౌరాణిక చారిత్రక సంబంధాలే. ఇతను సమకాలీన ప్రజాసమస్యల్నీ, మహాపురుషుల జీవితాలను బుర్రకథలుగా రచించాడు. ఉదాహరణకు కష్టజీవి, కందుకూరి వీరేశలింగం, అల్లూరి సీతారామరాజు బుర్రకథలు. ఇవి ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి.

బుర్రకథలు చెప్పడంలో ఇప్పుడు నాజరు ఎక్కువగా ప్రముఖస్థానం వహిస్తున్నాడు. ఇతడు ఇతరరచనలేగాక సొంతంగా బుర్రకథలు రాసుకొని చెబుతున్నాడు. బుర్రకథకు ప్రత్యేకమయిన దుస్తులు ధరించడం ఇతనితోనే ప్రారంభమయింది. ఇద్దరు వంతలలో ఒకరు రాజకీయాలు చెప్పడానికి కూడ ఇతనే దారితీశాడు. ప్రస్తుతం నాజరు యుగం నడుస్తోంది. ఎంతమంది బుర్రకథలు చెప్పినా కొద్దో, గొప్పో ఇతనిని అనుసరిస్తున్నారు.

ఉదాహరణలు:

కామమ్మ తన భర్త చితిని కౌగిలించుకొని
"ఎంతచల్లగ ఉన్నది నీ జాజివనము మారయ్య"
        (కామమ్మ కథ)

--------

మరాటీల దేశమున్నాదీస॥
ఆరే వాండ్లదేశమున్నాదీస॥
పడమటొక్కయా దేశమందునాస॥
ఆ పత్తికొండ తాలూకా అయినస॥
అక్కడ పన్నెండు కోటలున్నాదీస॥
అక్కడ ఆరే వాండ్ల భూములున్నదిస॥
ఆ కోటలుయేలే దొరలుయున్నారూస॥
వాడు భాయి భజేరావున్నాడుస॥
భజేరావు కొడుకులున్నారూస॥
భాయి భజేరావు కొడుకులుస॥
వారు ముగ్గురు అన్నదమ్ములుస॥
వారి ముగ్గురికి పేరు ఉన్నదిగాస॥
పెద్దవాడుగా నారాయణరావుస॥
చిన్నవాడుగా సిద్ధోజిరావుస॥
కడగోటివాడు కండేరాయుడుస॥
వాండ్లు అన్నదమ్ములు భాగాలుబోయిరిస॥
వాండ్లు దాయాదిబోగాలు బోయిరిస॥
వాండ్లు భాగాలుబోయిన వెనుకానుస॥
కుక్కలభాగాలు యివ్వరాస॥
మీరు కుక్కల పేరు యెత్తితేస॥
అరవంగ గొంతులు కోసేనూస॥
అన్నాయిప్పుడైన భాగమియ్యకపోతేరస॥
ముందుగయైన భాగము యివ్వరాస॥
వాండ్లకు దాయాది పగలేగలిగేనాస॥
దాయాదిపోరు గలిగిన తర్వాతస॥
అరవై యేండ్ల పగలున్నావీస॥
ఇరువైయేండ్ల యీర్ష్యయున్నాదీస॥
ఎవరిభూములు వారలు యేలిరిస॥
ఎవరి కోటలు వాండ్లు యేలిరిస॥
సిద్ధోజిరావుకు సంతానములేదుగాస॥
కండేరాయుడికి సంతానములేదుగాస॥
నారాయణరావుకు సంతానముకలిగెనూస॥
వాండ్లముగ్గురికీ పేరువున్నాదీస॥
కొడుకులు పుట్టినవేళలు స॥
వాండ్లకు మరాటీపేరు ఉన్నాదీస॥
        (ఆఱుమరాటీల కథ)

--------

వ॥        యీ ప్రకారంబున సేనలన్నీ -

"పట పటపట పండ్లుగొరుకుచు - పటుతర గతివేగ
కటకట కటకట కోరలొరిపిరిడికి - చిటపటయనెనిప్పుల్‌
రెట్టలు దట్టుచు అరేరేరేయని - మిట్టపడుచువేగ
పొట్టిమీసములు పట్టిదువ్వి - కనుబొమలు మడియబట్టి
పఠాకత్తులూ కఠారుబాకులు - తటాలునందుకొని
పెఠిల్లుమని కక్కటిల్లుచును - దిక్తటంబుల దరగను
గండ్రగొడ్డండ్లు కత్తులుబాణా - కర్రలు చేబూని
వేండ్రమైన రోకండ్లు గుదపలును - బిండివాలములును
తళతళ నాకసమందు మెరియగా - తలపడె నిరువాగు
కరులు సేనలను నురుమాడుచు - మున్ముందు కేగుచుండు
రణభేరి ధణధణలకు ధరణి - దద్దరిల్లుచుండ
శరవేగంబున శత్రుసేనలో - చొరబడి బాలుండు
ధరణిమీద నరివీరులతలలు - తరుగుచు బాలుండు
విచ్చుకత్తి నరి వీరులరొమ్ముల - కుమ్మిచిమ్ముచుండ
గుండెలు ప్రేవులు వొక్కుమ్మడిగా - తుండెములైజార
కొండలరీతిగ శవములన్నియు - గుట్టలుబడుచుండ
నెత్తురుచిమ్ముచు తలలు మొండెములు - దొర్లాడుచునుండ
శత్రుసేనలు చెదరి జెదరెను - చెట్లకు గుట్టలను"
        (పల్నాటి యుద్ధం - నాజర్‌)

--------

రాజుబేటికి వస్తున్నాడు పాపారాయుడు
రాజుగారి సేవకుడయ్యా చల్లారాముడు
పాపారాయుడు వస్తున్నాడు చల్లారాముడు
చలోయంటు చప్పడియంటు యెదుట వచ్చెను
నీదువంతు వచ్చిందయ్యా మిర్యాలసీతన్న
పచ్చలబాకు నడుమునుంచి భగ్గునతీసెను
వానినోట పొడచినాడయ్య మిర్యాలసీతన్న
పొడిచినంతలో తిరిగి తిరిగి భూమినిపడ్డాడు
రాజుగారు నావంతన్నాడు పాపారాయుడు
వాని రొమ్ముమీదనే కొలువుతీరెను పాపారాయుడు
కాళ్లుయప్పుడు గట్టిగపట్టెను మిర్యాలసీతన్న
అప్పుడేమని చెప్పినాడు పాపారాయుడు
తట్టితట్టిలేపెనయ్యా విజయరామరాజును
మెలకరించి లేచినాడయ్యా విజయరామరాజు
వోరోయీటి యెక్కడ బల్లెమెక్కడ చల్లారాముడా
యోరియీటియెందుకు బల్లెమెందుకు విజయరామరాయ
పక్కలోనే బాకైయున్నాను పాపారాయున్ని
నీతలకు గుండైయున్నాను పాపారాయున్ని
దొంగబాట వస్తివిగదర విజయరామరాజా
బొబ్బిలికోట తీస్తామని ప్రతిజ్ఞ చేసితివి
యెవ్వరిపంతము సాగిందోయి విజయరామరాజు
యిట్లుచెప్పుతూ బాకుతీసెను పాపారాయుండు
రొమ్ముమీద గుమ్మినాడయ్య పాపారాయుండు
గుభల్‌ గుభళ్లని రక్తమువచ్చి జీవము విడిచెను
భూమిమీదనే తోసినాడయ్య మంచముపైనుంచి
        (పెద్ద బొబ్బిలిరాజు కథ)

--------

కీర్తన
గంటందొర:కూడదయ దీనులయ - ఏడిపించ తగదయ
వేడుకొను చుంటినయ - నేడు జూడుమయ
కూడ
బాస్టియను:వేడినను వీడనుర - బూడిదగ చేసెదర
బేడలివ్వ చాలదని - వీడిరిదె రోడ్డుపని
వేడి
గంటందొర:క్రూరమగు హింసలట - మీరలట పెట్టిరట
ధారలుగ చెమ్మటను - కారిచిన కూలీలను
కూడ
బాస్టియను:ఓరి తెగవాగకుర - గోరీలను కట్టెదర
మీరితిర యాజ్ఞలను - వారి మిము నరికెదర
వేడి

వ.
ఈ తిట్లను సహియించలేక కన్నులెర్రజేసి మల్లుదొర ఏమంటున్నాడు?

భళా భళానోయ్‌ తమ్ముడాసై
భాయి భళానోయ్‌ దాదానాసై
పిచ్చి పిచ్చిగా వాగకుసై
పిలిచి తిట్టుచున్నావుగాసై
పైసకు గడ్డిని మేసెడి సై
పశువు జన్మమేమెత్తం సై
చావుకు వెరువము తెలుసున?సై
జాగ్రత్తగ మాట్లాడాలిభళా
ముఠాదార్ల బెదరించుచూసై
రైతుల గొంతులు కోయుచుసై
కూలీల పీకలు నొక్కుచుసై
కూడ బెట్టి ధనరాసులుసై
మేడలు గట్టగ దలచావభళా
అధికారము, కంట్రాక్టులుసై
అన్నీ నీవే చేతువా సై
కూలికి రోడ్లను పోసినసై
కూలినంత ద్రిగ మింగియుసై
చాలక నాపై కేసులు సై
చంపివేయగా తలచావాభళా
జానెడు పొట్టను నింపగ సై
సత్యము తప్పము తప్పము సై
కూట సాక్ష్యముల నివ్వముసై
మాటలేల పొమ్మన్నారుభళా
        (సీతారామరాజు - సుంకర)

--------

భళా భళానోయ్‌ కూలన్న 
మేల్‌ భళానోయ్‌ రైతన్నాసై
వింతచూచుటకు నాయన సై
అంతులేని ప్రజ కదిలిరి సై
వచ్చే వారొస్తుండిరిసై
పొయ్యేవాళ్ళు పోతుండిరిసై
బంధువు లందరు వచ్చిరిసై
పంతులు గారిని జుట్టిరిసై
బతిమాలారొక కొందరుసై
బెదరించిరి మరికొందరుసై
అలిగే వారొక కొందరుసై
అదిరిపడిరి మరికొందరుభళా
బందుగులందరు యిట్టులసై
బాధలు పెట్టుచు నుంటెనుసై
పంతులు గారేమంటరుసై
ప్రాణి భయము లేదంటరుసై
నాకు యిట్టి వాడందున సై
నమ్మకము లేదంటరుసై
నమ్మని పని నేనెప్పుడుసై
నరికిన చెయ్యనంటారుభళా
        (వీరేశలింగం - సుంకర)

--------

వ.    నీకోర్కెలన్నింటిని, స్థితి గతులన్నింటికి కట్టుబడి యుండి ఓపికతో మేము తప్పక తీర్చెదమనిన రైతుల మాటలకు ఆ వీరుడు సంతోషించి తన తమ్ముడగు భీమయ్యను దగ్గరకు పిలచి, తమ్ముడా -

"అమల చరితులగు అమ్మను అయ్యను ఆదరముగచూడు
సుమతిని నారాయణు నేతీరున చూతువో భీమయ్యా
మిమ్ముల బెంచెడి భాగ్యము నాకిక తమ్ముడ లేదోయి
అమ్మకు నాన్నకు నాదు వందనము లందించర పోయి."

వ.    అని ఏకధారగా కన్నీరు కార్చుచూ చెంతనున్న తమ్మునకు జెప్పి బాధ భరింపలేక డొక్కలో నున్న బాకును తానే లాగివైచు కొనెను. అప్పుడు -

"విలవిల తన్నుక నాగయ జీవుడు - వెళ్ళిపోయె నండి
జల జల కన్నుల జలము కారెనా - జనసమూహమునకు."

        (కష్టజీవి - సుంకర)

--------

"తైతత్తతై - తకదికతకదిక తదిగిణం దోదిక - తళాంకుతకదిక - తత్తతై."

మనుజులలోన రకములు జూడు
మనసులలోన మాయలు జూడు
మారేదానికి గోడలు జూడు
మార్చేవారికి
మాటలలోన మోసము జూడు
మాటచేతలకు తేడా జూడు
చెప్పి చేయని చేసి చెప్పని చుప్పనాతులను
లోకము నాకము జేయుట కొరకై
ఏకధాటిగ ఎదురు నిలిచెడి
త్యాగధనులయా తపములు జూడు
వారల త్యాగపు ఫలములు జూడు
సూర్య బింబముల సొగసును జూడు
అగ్ని కణముల నిగ్గును జూడు
అహోరాత్రములు మహోపకారులై మెప్పులగట్టి
        (పుత్తడి బొమ్మ పూర్ణమ్మ)

--------

వ. అప్పుడు తాంతియా యెలా వున్నాడు?

కరకర జాబుల చదివెరాసై
కనుగుడ్లెర్రన జేసెరా సై
గిర్రున మీసం దువ్వెరా సై
చర్రున ఖడ్గం దూసెరాసై
కుంఫిణి గుంపుల కిప్పుడేసై
కాలం తీరిన దంటాడు
ముందూ గుర్రాల్‌ దండురాసై
మధ్యన కాల్బాలమ్మురాసై
వెనుకను యేనుగ గుంపుతోసై
వీర మరాఠా తాంతియాసై
వైరి బలగముల పైననూసై
వెనుక తట్టువచ్చు చున్నాడూ
        (లక్ష్మీబాయి - లక్ష్మీకాంతమోహన్‌)
AndhraBharati AMdhra bhArati - buRRakatha - telugu vachana sAhityamu - vyAsamulu - SrI Srinivasa Chakravarti Srinivasa Chakravathy burrakadha burra katha burra kadha ( telugu andhra )