వచన సాహిత్యము వ్యాసములు హరికథ
- డా॥ ఎస్‌. గంగప్ప

తెలుగువాణి
ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచిక
ఉగాది, 1975

హరికథ అన్నది చాలా విచిత్రమైన కళ; సాహిత్య ప్రక్రియ. తెలుగులో దీనికొక ప్రత్యేకత ఉంది. ఇది ఏ ఇతర సాహిత్యాల్లోనూ లేని విశిష్టతను తెలుగులో సంతరించుకొంది.

హరికి సంబంధించింది హరికథ; ఇది సామాన్యార్థం. కానీ క్రమంగా చాలా మార్పు చెందుతూ వచ్చింది. సంగీతాభినయాలతో కూడుకొన్న కథాకథనం ఏదైనా హరికథగా పరిణతి చెందింది. దాన్ని క్రమంగా పరిశీలిద్దాం.

నిర్వచనం:

హరికథ పలువిధాలుగా నిర్వచింపబడింది. "దేవకథా కథనము లోకమున 'హరికథ' నామముగ ప్రసిద్ధముగా ఉన్న" 1దని జమ్ములమడక మాధవరామశర్మగారూ, "హరికథలు నృత్య, సంగీత, సాహిత్యాత్మకములైనవి. 'హరికథ'ను తౌర్యత్రిక కళ అనికూడా వ్యవహరిస్తా" 2రని పాతూరి ప్రసన్నంగారూ, "హరిని కీర్తించుటయే 'హరికథ'. కథ అనగా 'క' బ్రహ్మము, 'థ' ఉండునది. అనగా దేనియందు బ్రహ్మఉండునో, దేనియందు బ్రహ్మము తెలియబడునో, దేనియందు బ్రహ్మమును పొందునో దానిని కథ యందురు. దీనిని గానముచేయుటయే కథాగానము.గానము అనగా కీర్తనము ... 'సమ్యగ్గీతం సంగీతమ్‌' బాగుగా లెస్సగా విచారించిచేయుగానము సంగీతము అందురు ... ఇట్టి గానముతో బ్రహ్మను ధ్యానించుట, కీర్తించుటయే 'సంగీతకం', 'హరికథ' అని పిలువబడుచున్న" 3 దని వైదిక సంబంధాన్ని జోడించి తంగిరాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు హరికథను నిర్వచించారు. కాని ఇంతకంటే "గద్య పద్య గేయాత్మక సంగీత నృత్యకళావిశిష్టమగు నొకరూపక ప్రక్రియ 'హరికథా' కాలక్షేప" 4 మన్న నిర్వచనం సముచితమైంది. పోతే, 'హరికథ పితామహ' బిరుదాంకితులైన ఆదిభట్ల నారాయణదాసుగారి మాటలిట ఉట్టంకించదగ్గవి. "ఆస్తిక్యమును ధర్మాధర్మములను, సర్వజన మనోరంజనముగ నృత్యగీత వాద్యములతో నుపస్యసించుట హరికథ యనఁబరగును. అట్టి ఉపన్యాసకుడు కథకుఁడనఁబడును. దైవభక్తియు, సత్యము, భూతదయయు హరికథయందలి ముఖ్యాంశములు." 5

లక్షణం:

హరికథా నిర్వచనంతోపాటు తల్లక్షణం సైతం కొంతవరకు పైని స్పష్టమయింది. హరికథాగానం చేసేవారిని భాగవతులనీ, హరిదాసు, హరికథాదాసులనీ అంటారు. ఇంకా వీరిని పౌరాణికులనీ, కథకులనీ, దాసులనీ అనడంకద్దు. 6 కవి కవసరమైన ప్రతిభాది లక్షణాలతోపాటు సరసవచనా పాటవమూ, సందర్భోచిత హాస్యకుశలతా, చతురోక్తిమయ సంగీతాభినయాలు గలవాడే ఉత్తమకథకుడని నారాయణదాసుగారి అభిప్రాయం. ఇంకా

"ఘనశంఖమో యనఁగంతంబు పూరించు
     మేలుగ శ్రుతిలోన మేళగించి
నియమము తప్పక నయఘనంబులఁ
     బెక్కురాగ భేదంబుల రక్తిగొల్పి
బంతులెగిర్చిన పగిదికాలజ్ఞతన్‌
     జాతి మూర్ఛనలొప్ప స్వరముపాడి
చక్కని నృత్యము సర్వరసానుకూ
     లంబుగాగ నభినయంబుజేసి
స్వకృత మృదుయక్షగాన ప్రబంధసరణి
వివిధ దేశంబులం చిన్న పెద్దలుగల
పలుసభల హరిభక్తి లుపన్యసింప
లేని సంగీతకవితాభిమానమేల?" 7

అని వారు కథకలక్షణం చెప్పారు. హరికథకుడు చేతిలో చిరతలు, కాలికి మువ్వలు, పట్టుధోవతి పంచెకట్టు, పట్టుకండువా నడుముకి బిగించి, మెడలో పూలమాల కలిగి చక్కటి విగ్రహపుష్టితో, ఆడిపాడి, కథచెప్పి సభారంజనం చేయగలవారు. సామాన్యంగా వయొలిన్‌, వీణ, హార్మోనియాల్లో ఒకటీ, మృదంగమూ సహకార వాద్యాలుగా చేసుకొని పాత్రోచితంగా, సందర్భానుసారంగా, కథ చెప్పగలవాడు కథకుడు. ఈ హరికథల్లో దోరా, తొహరాలతోపాటు తెలుగులోని ద్విపదలూ, కందార్థాలూ ఉంటాయి. లావణి మొదలైన అన్యదేశ్యచ్ఛందస్సులు సైతముంటాయి. సంగీత సాహిత్యాలతోపాటు అభినయ పూర్వకంగా భక్తిని, విజ్ఞానాన్ని, వినోదాన్ని గూర్చగలది చక్కటి హరికథ.

ప్రాదుర్భావం:

"హరికథ వేదకాలమునకే బీజరూపమున నున్నట్లును, నైతిహాసిక యుగమునఁ గుశలవుల రామాయణగానము మొదలగు సందర్భములందు దాని స్వరూపము విస్తరించినట్లును గొందఱి తలంపు." 8 నారాయణదాసుగారు సైతమిలాగే తలంచారు. 9 "నారఁదుడు దొట్టి పరమమునులు భగవన్నామ సంకీర్తనము సేయుచు నాడుచుఁబాడుచు లోకులం దరింపఁజేసిరి." 10 "హరికథల స్వరూపం వేదకాలమునాటిదనీ, సర్వజ్ఞులైన అగ్నివేశాది మహర్షులు హరికథా శిల్పాన్ని తొలుదొల్త సృష్టించారనీ పండితులు నిర్ణయించారు. బ్రహ్మమానసపుత్రుడైన నారదుడు భక్తిసూత్రాలను ఉపదేశిస్తూ హరికథాగానం చేస్తూ వుంటాడని ప్రతీతి. వేద విభజన చేసినా, అష్టాదశ పురాణములను లిఖించినా మనశ్శాంతి పొందనేరని శ్రీవ్యాసునకు శ్రీమద్భాగవతమును విరచించి, హరికథామృతమును పంచిపెడుతూ మానవోద్ధరణ గావింపుమని నారదుడు ఆదేశించాడు. తర్వాత శుకదేవుడు శౌనకాది మహర్షులు, సూతుడు హరికథారూపకమైన భాగవతాన్ని భారతదేశం అంతటా ప్రచారం చేశారు." 11 అని పాతూరి ప్రసన్నంగారు భాగవతంలోని12 విషయాన్ని వివరించారు. సామగానమే కథాగానానికి మూలమంటారు జమ్ములమడక వారు. 13 భాసుని నాటకాల్లోని సూత్రధార ప్రయోగానికీ, కాళిదాసు విక్రమోర్వశీయంలోని చతుర్థాంకంలో ఊర్వశీ విరహితుడైన పురూరవుని ప్రవేశపెట్టడానికీ విశిష్టత ఉంది. ఇందులో ఏకపాత్రాభినయముంది. "నాట్యవేద నిర్ణీతములైన నామరూపకములలో భాణమను రూపకమున్నది. అది ఏకపాత్ర ప్రయోగ సుందరము. ఒక్కడు ఉజ్జ్వల వేషధారణమున రంగమున ప్రవేశించి నానావ్యక్తుల భాషణముల నిరూపించును. వారివారి స్వరశ్రుతులను తానె అనుకరించును. ఉక్త వైవిధ్యమును అనుసరించు భాణప్రయోక్తనుచూచు సామాజికులు కథకుని నైపుణ్యమును నిరీక్షింపగలరు." 14 ఈ విధంగా అభివృద్ధిచెంది హరికథలు తెలుగులో ఒక విశిష్టరూపాన్ని సంతరించు కొన్నాయి ఆధునిక యుగంలో.

యక్షగానాలే హరికథలుగా రూపొందినట్లు కవిత్వవేది మొదలైన పండితులు తలంచుతున్నారు. 15 యక్షగాన కర్తల్లో శ్రీ బాగేపల్లి అనంతరామాచార్యులుగారు ప్రప్రథమంగా హరికథా యక్షగానాలొక్కటే అన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇలాగే నారాయణదాసుగారూ, పసుమర్తి కృష్ణమూర్తిగారూ తలంచారు. 16 కానీ ఇవి అభిన్నాలని డా. యస్వీ జోగారావుగా రంగీకరించలేదు. అందుకువారిచ్చిన కారణాలివి. హరికథ మహారాష్ట్రలో 17శ. లో ఆరంభమైంది. దీన్ని ఆభాషలో 'అభంగ్‌' అంటారు. తంజావూరు నాయకరాజులు స్వయంగా యక్షగానాలు రచించారు; ఆస్థానకవులచే రచింప జేశారు. వారెవరూ ఈ యక్షగానాలను హరికథలుగా పేర్కొనలేదు, కానీ ఆధునిక యుగంలో తెలుగులో ఆరంభించిన హరికథకులు మాత్రమే తమ హరికథలను యక్షగానాలుగా పేర్కొన్నారు. 17 ఇంక "జక్కులకథలు, జంగంకథలు, హరికథలు, బుఱ్ఱకథలు - ఇవి యన్నియుఁగానరూపమునఁ గథాఖ్యానమే ప్రధానాశయముగాఁ బ్రారంభింపబడినవి. కావునఁ దత్తద్రచనా ప్రక్రియలలోఁ గొంత సాదృశ్యము గోచరించినను వాని వాని ప్రయోగ ఫక్కికలు వేఱు. ప్రయోజనములు వేఱు. వాని పుట్టువు పొలఁకువలే వేఱువేఱు." 18 యక్షగాన రచనాకాలంలో హరికథారచన చేయబడినట్లు తెలియరాదు. కేవలం ఆధునిక యుగంలో ఈ హరికథలు వెలిశాయి. మహారాష్ట్రలో 'అభంగ్‌' అనీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కథాకాలక్షేపమనీ, కాలక్షేపమనీ పిలువబడుతూంది.

వికాసదశ:

ఏదిఏమైనా ఈకథకు ఆధునిక యుగంలో ముఖ్యంగా ఆదిభట్ల నారాయణదాసుగారే కారకుడనడంలో విప్రతిపత్తిలేదు. "ఆంధ్రదేశములో పల్లెటూళ్లయందేమి, పట్టణములందేమి అనేక విధములైన విద్యాప్రదర్శక వినోదములు కలవు ... శ్రావ్యముగా పురాణముచదివి అర్థముచెప్పుట -భజన - పాట కచ్చేరీ - ఉపన్యాసమొనరించుట - అష్టావధానము చేయుట మొదలగు పనులన్నియు ప్రత్యేకముగా నొక్కడే చేయగలిగి మెప్పుపొందజాలిన శ్రీదాసుగారు వీటినన్నిటిని సంపుటిచేసి క్రొత్తవినోదమును కల్పించుటొక వింతగాక పోవచ్చును. కాని దేశమునందీ హరికథ యొకనూతన విద్యా ప్రదర్శక వినోదమనవలెను. దీనికి ప్రశస్తమైన సంగీత సాహిత్యములు, చక్కని నృత్యము, సర్వరసానుకూలమగు నభినయ ధోరణులు - శ్రోతల మనముల కింపగుమాటల నేర్పు, అన్నిటికన్న నెక్కువగ రమ్యరూపము కావలసిన అంగములు. ఇవన్నియు దాసుగారికి సహజసిద్ధముగానే యున్నవి. పైగా త్రిస్థాయిగమక మేఘగంభీర స్వరము ఈశ్వరానుగ్రహమువల్ల కల్గునవి. వీటికి తోడు సమస్తశాస్త్ర పురాణేతిహాస పరిచయము, వివిధ భాషా కోవిదత్వము లోకజ్ఞానము దాసుగారు స్వయంకృషివల్ల సాధించెను. కనుకనే వీరి హరికథాగానము ఒకదానికన్న నొకటిమించి క్రొంజవుల నొప్పి పలుతెరగుల తురగలించు వంటకములతో చేసిన గొప్ప విందు వంటిది." 19 అమేయ ప్రతిభావ్యుత్పత్తి లోకజ్ఞతలతో సంగీతాభినయాలు, సరస, చతురోక్తిమయ భాషణ నారాయణదాసుగారి సొత్తు. హరికథ అనే వినోదాన్ని విశిష్టగుణ గరిష్ఠుడైన నారాయణదాసుగారు కల్పించి ఆంధ్రదేశ మందంతటా అరవై సంవత్సరాలు ప్రదర్శించి ఘనతకెక్కారు. దివ్యవేదాంతం మొదలుకొని చక్కటి చిక్కటి హాస్యంవరకు దాసుగారు చక్కగా ప్రదర్శించి పేక్షకులను రంజింపజేసేవారు. 'ఆట పాట మాట మాటలమేటి'గా ఆయన ప్రసిద్ధికెక్కారు. మహాకవుల ప్రశంసలకు పాత్రులైన దాసుగారి ప్రతిభ ఎలాంటిదో స్పష్టం. పాశ్చాత్య విపశ్చిద్వరులచేత సైతం స్తుతింపబడ్డారు. ఎన్నో రచనలున్నా, వీరు స్వయంగా రచించిన హరికథలు 12. వీటిని యక్షగానాలని కూడా వారు పేర్కొన్నారు. వీరి జననం 1864లో. వీరు సంస్కృతం, ఆంధ్రం, పార్శీ, ఇంగ్లీషు మొదలైన బహుభాషాకోవిదులు. వీరికి గల "హరికథాపితామహు" డన్న బిరుదం సార్థకమైంది. వీరి కీర్తికి జయపతాక ఆంధ్రదేశంలోనేగాక భారతావని అంతటా తిరిగి సన్మానాలు పొందిన ఘనులు. గజారోహణం, గండపెండేరాది సత్కారాలకు అర్హులై, దాసుగారు ప్రఖ్యాతిగాంచి 1945లో దివంగతు లయ్యారు.

నారాయణదాసు గారి శిష్యులు ప్రశిష్యులు ఎందరో హరిదాసులు ఆంధ్రదేశంలో వెలిశారు. దాసుగారి సమకాలికుల్లో అనకాపల్లి వాస్తవ్యులు బి. బాలాజీదాసుగారు, బొబ్బిలి వాస్తవ్యులు చేవూరి ఎరుకయ్యదాసుగారు ముఖ్యులు. బాలాజీదాసుగారిలో భరతశాస్త్రానికీ, నారాయణదాసుగారిలో భరత, సంగీత శాస్త్రాలకీ, ఎరుకయ్యదాసుగారిలో భరత, సంగీత సాహిత్యాలకూ ప్రాధాన్య మెక్కువ. 20 వీరితోపాటు పాణ్యం సీతారామ భాగవతార్‌, ప్రయాగ సంగయ్య, కోడూరి భోగలింగదాసు పేర్కొన దగ్గ హరిదాసులు. దాసుగారి శిష్యులలో పసుమర్తి కృష్ణమూర్తి, వాజపేయాజుల వెంకటసుబ్బయ్య, నేతి లక్ష్మీనారాయణ భాగవతులు ముఖ్యులు. పుచ్చల భ్రమరదాసు, మైనంపాటి నరసింగరావు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు, ముసునూరి సూర్యనారాయణ, పరిమి సుబ్రహ్మణ్యశాస్త్రి, ములుకుట్ల పున్నయ్య, అద్దేపల్లి లక్ష్మణదాసు ప్రభృతులు ఈ సందర్భంలోనే పేర్కొనదగ్గవారు. నారాయణదాసు ప్రశిష్యుల్లో ములుకుట్ల సదాశివశాస్త్రి, పాతూరి మధుసూదనశాస్త్రి, కుప్పా వీరరాఘవశాస్త్రి, నౌడూరి విశ్వనాథశాస్త్రి, అమ్ముల విశ్వనాథం, జి. ఉమాకాంతదాసు ప్రభృతులు ఉత్తమ హరికథకులు. నేటి ప్రసిద్ధ కథకుల్లో కూచిభొట్ల కోటేశ్వరరావు, అక్కిపెద్ది శ్రీరామశర్మ, బుర్రా శివరామకృష్ణశర్మ, రాజశేఖరుని లక్ష్మీపతిశాస్త్రి, ఆత్మకూరి గురుబ్రహ్మగుప్త, కోట సచ్చిదానందశాస్త్రి, తెల్లాకుల వేంకటేశ్వరగుప్త, ప్రతాప వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలైనవారు చెప్పదగ్గవారు. శ్రీమతి ఆర్‌. దుర్గాంబ, శ్రీమతి బెజవాడ నగరాజకుమారి వంటి భాగవతారిణులను సైతం పేర్కొనడం సముచితమే 21. ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 25-12-64 నుంచి 2-1-1965 వరకు జరిపిన హరికథోత్సవాల్లో 22 మంది హరికథలు చెప్పి సత్కృతులయ్యారు. ఇంకా 79 మంది సన్మానితులయ్యారు. 22 ఇది ముదావహ విషయం.

"హరికి సంబంధించిన కథలేగాక, భారతరామాయణాది ఇతివృత్తాలేగాక, క్రమంగా పోతనవంటి కవులూ, త్యాగయ్యవంటి వాగ్గేయకారులూ, గాంధీమహాత్మునివంటి నాయకుల జీవితవిశేషాలు హరికథలుగా చెలామణి కాజొచ్చాయి. సంఘశ్రేయస్సుకు, తన్మూలంగా దేశశ్రేయస్సుకు ఉపకరించేలా భక్తిప్రాధాన్యంగా ఉండి జనతకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించగలదిగా ఉండడం ఎంతైనా అవసరం. ఆంధ్రదేశంలో అన్ని జానపద రూపాలతోపాటు వర్ధిల్లి ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాల్లో ముఖ్యమైంది హరికథాగానం."23 అని మిక్కిలేని రాధాకృష్ణమూర్తిగారు హరికథను జానపదకళారూపాల్లో ఒకటిగా పేర్కొన్నా, ఇది కేవలం పామర ప్రజానీకాన్నేగాక, పండితులనుసైతం మెప్పించగల కళారూపమనడంలో సందేహంలేదు. ఆనందంతోపాటు లోకశ్రేయస్సు కుపకరించడమే ఉత్తమ కళాప్రయోజనంగదా!


పాదసూచికలు
1.నాట్యకళ - ఆదిభట్ల నారాయణదాసు ప్రత్యేక సంచిక - ఫిబ్రవరి, 1965 పు. 25
వెనక్కి

2.పైదే - పు. 21
వెనక్కి

3.పైదే - పు. 33, 34
వెనక్కి

4.పైదే - సంపాదకీయం - పు. iii
వెనక్కి

5.హరికథాపితామహ శ్రీమజ్జాడాదిభట్ల నారాయణదాస శతజయంత్యుత్సవ సంచిక. పు. 5
వెనక్కి

6.పైదే
వెనక్కి

7.పైదే
వెనక్కి

8.డా. యస్వీ జోగారావు: ఆంధ్రయక్షగాన వాఙ్మయ చరిత్ర - ప్రథమ భాగము - పు. 78
వెనక్కి

9.హరికథాపితామహ శ్రీమజ్జాడాదిభట్ల నారాయణదాస శతజయంత్యుత్సవ సంచిక. పు. 5
వెనక్కి

10.హరికథాపితామహ శ్రీమజ్జాడాదిభట్ల నారాయణదాస శతజయంత్యుత్సవ సంచిక. పు. 5
వెనక్కి

11.నాట్యకళ - ఫిబ్రవరి, 1965 - పు. 21
వెనక్కి

12.పోతన - శ్రీమదాంధ్ర మహాభాగవతము,ప్రథమస్కంధము, పద్యాలు 38-108
వెనక్కి

13.నాట్యకళ - ఫిబ్రవరి, 1965 - పు. 27
వెనక్కి

14.నాట్యకళ - ఫిబ్రవరి, 1965 - పు. 31
వెనక్కి

15.ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము పు. 145
వెనక్కి

16.డా. యస్వీ జోగారావు: ఆంధ్రయక్షగాన వాఙ్మయ చరిత్ర - ప్రథమ భాగము - పు. 74-78
వెనక్కి

17.డా. యస్వీ జోగారావు: ఆంధ్రయక్షగాన వాఙ్మయ చరిత్ర - ప్రథమ భాగము - పు. 74-78
వెనక్కి

18.డా. యస్వీ జోగారావు: ఆంధ్రయక్షగాన వాఙ్మయ చరిత్ర - ప్రథమ భాగము - పు. 74-78
వెనక్కి

19.మరువాడ వేంకట చయనులు: శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదాసు జీవిత చరిత్రము పు. 36, 37
వెనక్కి

20.లక్ష్మీనాథ్‌: 'కవికుంజర' ఎరుకయ్యదాసు, ఆంధ్రప్రభ కళాసాహిత్య విజ్ఞాన వేదిక, 24-5-1970
వెనక్కి

21.ప్రతాప వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి హరికథ - మహతి
వెనక్కి

22.నాట్యకళ - ఫిబ్రవరి, 1965 - పు.138-140
వెనక్కి

23.ఆంధ్ర నాటకరంగ చరిత్ర - పు. 308
వెనక్కి

AndhraBharati AMdhra bhArati - harikatha - telugu vachana sAhityamu - vyAsamulu - SrI Dr. S. Gangappa hari katha harikadha hari kadha ( telugu andhra )