వచన సాహిత్యము వ్యాసములు ఖండకావ్యము - భావకవిత్వము
శ్రీ శంఖవరం 'సంపత్‌' రాఘవాచార్యులు

ఖండకావ్యము - భావకవిత్వము

"తెలుగు సంస్కృతి"
"తెలుగు విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము"
తెలుగు భాషా సమితి, మద్రాసు 1959.

పునర్ముద్రణ: సాహితీ వ్యాసాలు, సంపత్‌ సాహితి-2, 2004.

ఖండకావ్యమన్న పదానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు "చిన్న కావ్యము, మహాకావ్యలక్షణములన్నియు లేని కావ్యము"అన్న అర్థాన్ని ఇస్తున్నది. ఇది "సాహిత్యదర్పణ" కారుని "ఖండకావ్యం భవే త్కావ్య స్యైకదేశానుసారిచ" అన్న నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని చెప్పిన అర్థం, అనగా ఖండకావ్యము కావ్యములో ఏకదేశమని తాత్పర్యము. దీనికి ఉదాహరణము మేఘదూతమట. ఈ లక్ష్యలక్షణ సమన్వయం చేస్తే, కావ్యలక్షణము లన్నీ లేకపోయినా స్వయంసంపూర్ణమై, పూర్వాపర నిరాకాంక్షమై, పరిసమాప్తార్థకమై రసపర్యవసాయి కాగలిగిన కావ్యైక దేశము ఖండకావ్యమని నిర్వచనము చేయవచ్చును. మహాకావ్యంలో కవిభావన బహిర్విషయోపాధికమై, నాయికానాయకాదుల నాశ్రయిస్తుంది. స్వీయానుభూతి అన్యాపదేశముగా ఇతివృత్తానురోధిగా సముచిత పరిమాణాన్ని పొందుతుంది. ఖండకావ్యములో కవిభావన అంతర విషయోపాధికమై, ఆత్మనాయకమై, స్వాశ్రయమై ఉంటుంది. అతని అనుభూతి అనన్యారోపితమై తీవ్రంగా పలుకుతుంది. నవ్య కవిత్వంలో ఖండకావ్యమన్న పదము పై అర్థంలోనే నియతము కాలేదు. ఆధునికార్థములో ముక్తకము, కులకము, పర్యాయ బంధము వంటి కావ్యభేదాలు కూడా గతార్థము లవుతున్నవి. నాతి దీర్ఘములై ఏకవిషయములైన పద్య రచనలను ఆధునికులు ఖండకావ్యాలుగా పరిగణిస్తున్నారు. స్థూలమైన ఈ నిర్వచనాన్ని అంగీకరిస్తే ఆధునికులు వ్రాసే అనేక కావ్యజాతులను ఇందులో చేర్చవచ్చును. అవాంతర భేదాలను అంగీకరిస్తూ ఖండకావ్యమంటే చిన్న కావ్యమని నిర్వచనము చేయటమే ఇప్పటికి సముచితముగా కనిపిస్తుంది.

ఖండకావ్యమన్న పేరు ఇటీవలనే రూఢమైనది. దీనికి కారణ మిప్పటి కవులు పూర్వులవలె కాక సుదీర్ఘ రచనలు మాని చిన్నచిన్న కావ్యాలు వ్రాయటమే. ఖండకావ్య రచనా వ్యాప్తికి మూలపురుషుడు గురజాడ అప్పారావు. ఆయన 1905 ప్రాంతాలలో నాటక రచనతో పాటు ఖండకావ్య రచనకు కూడ ఉపక్రమించినాడు. పద్యకావ్యాన్ని నవ్యమార్గాలలో కొత్త ఛందస్సులలో నడప వచ్చునని సూచించి శకకర్త అయ్యాడన్న ఖ్యాతి ఆయనకు దక్కింది. కాని నిజానికి ఆయన ప్రతిభ మరొక కావ్య శాఖకు చెందింది. అతడు గొప్ప నాటక కర్త - ఉద్యమ ప్రవక్త, దూరదర్శి, కాలముతో మారి జీవితాన్ని, సమాజాన్ని నిశితంగా ప్రతిపాదించగలిగిన సమీక్ష్యకారి. ప్రయోగ సాహసమున్న ప్రతిభావంతుడు. తీవ్ర సమీక్షకు లభ్యములయ్యే సత్యాలను అనుభవముతో పిండి పలికినా, ఆయన కవితా రచనలో బంధచ్ఛాయ కనిపించదు. కాని కొన్ని పంక్తులు మాత్రం అర్థ గౌరవములోనే కాక శిల్ప దృష్టిలో కూడ ప్రౌఢములై సచేతనములుగా ఉంటాయి. అంత మాత్రానికే అతనిని మహాకవి కోటిలో చేర్చడం సముచితం కాదు. అతడు మహాకవి కాకపోయినా ఖండకావ్య రచనకు ప్రేరకుడు, మార్గదర్శి, శకకర్త.

వస్తు నిర్వహణభేదాన్నిబట్టి ఖండకావ్యాలలో కొన్ని తెగలు కల్పించవచ్చును. కొన్ని వర్ణనాత్మకములు, కొన్ని కథనాత్మకములు, కొన్ని ప్రచారాత్మకములు, కొన్ని గేయములు, కొన్ని భావగీతాలు. వీనిలో చివరి తెగ 1910కి తరువాతను, 1930కి లోపుగాను ఆంధ్ర దేశంలో బాగా ప్రచారానికి వచ్చి నిశితమైన ఆలోచనకు, తీవ్రమైన విమర్శకు గురి అయినది. "భావకవిత్వ" మా రోజులలో గొప్ప గాలి దుమారాన్ని రేపింది. కొత్త ఉద్యమం ఏదైనాసరే కొంత ప్రతిరోధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మార్పును సంప్రదాయం వెంటనే అంగీకరించదు. కొత్త ప్రయోగాలు కూడా నిరోధాన్ని జయించి సంబాళించుకొని నిలువ గలిగితే సంప్రదాయంగా పరిణమిస్తాయి. నిన్నటి ప్రయోగమే ఈనాటి సంప్రదాయమౌతుంది. భావకవితా ఉద్యమం కూడా క్రమంగా జనసమ్మతి పొంది ఒక కవితా శాఖగా అంగీకారాన్ని సంపాదించుకొన్నది.

ఒక కృతిని కావ్య మనిపించే లక్షణాలు కొన్ని. అవి కొన్ని చోట్ల భావ సౌందర్యంగాను, కొన్ని చోట్ల శబ్ద సౌందర్యంగాను, కొన్ని చోట్ల రీతి సౌందర్యంగాను భాసిస్తాయి. కావ్య లక్షణాలన్నీ ఈ మూడు తెగలలోను ఒదిగిపోతాయి. ఈ మూడు తెగల సౌందర్యాలు సమపాకంలో కలిసి ఒదిగి వచ్చేది కావ్యపు జీవస్థానాలలో మాత్రమే. కవి మనోధర్మ మెంత తీవ్రమై కావ్యజాతికి చెందుతుందో అంత భావతీవ్రత, బుద్ధి ఎంత సూక్ష్మమో అంత శబ్దశుద్ధీ, రీతి వైవిధ్యమూ కావ్యంలో కనిపిస్తుంది. భావకవి మనో ధర్మమైన భావతీవ్రత నెక్కువ ఆరాధించేవాడు కనుక తన మనోధర్మం ప్రతిబింబించే కావ్యజాతికి భావకవిత అని పేరు పెట్టెను.

వెనుకటి దీర్ఘ కావ్యాలలో ఒక కథ, దాని అంగ ప్రత్యంగాలు, సన్నివేశాలు, పాత్ర పోషణము మొదలైనవన్నీ కలిసి, ఒక అనుభవాన్ని కల్పించి రసాస్వాదనకు హృదయాన్ని ఆయత్తం చేస్తాయి. కథలోని ఒకానొక సన్నివేశపు అనుభవము పూర్వ కథాపరిచయ బలంచేత, ఆర్ద్రార్ద్రమై, రసపర్యవసాయి కాగలుగుతుంది. పూర్వకథను చెప్పక ఆ సన్నివేశాన్ని మాత్రమే వేరుగా పృథక్కరించి చెప్పినప్పుడు అది భావగీతమవుతుంది. పాఠకుడు ఆ సన్నివేశాని కుచిత పరిణతి పొందిన చిత్తవృత్తినీ, ఉన్ముఖత్వాన్నీ సంపాదించుకో గలిగితే పూర్వ కథా ప్రసక్తి లేకుండా ఆ కావ్యాన్ని ఆస్వాదించ గలుగుతాడు. శాకుంతలములోని ప్రసిద్ధములైన కణ్వుని నాలుగు శ్లోకాలు చాలా చిత్తద్రావకంగా ఉంటాయి. వానిని వేరుగా తీసి "కణ్వనిర్వేద" మని వ్రాస్తే అది భావగీతమవుతుంది. అప్పుడది ఖండకావ్యమై, పూర్వాపర నిరాకాంక్షమై పరిసమాప్తార్థక మవుతుంది. దాన్ని అవగాహన చేసుకో గలిగిన శక్తి పాఠకుని మనఃపరిపాకము మీద ఆధారపడి ఉంటుంది. అనూచానంగా వచ్చి మనకు పరిచితమై, సంప్రదాయబద్ధమైన కథా సన్నివేశాలు మన మనస్సులలో సులభంగా పరిణామాన్ని కల్పిస్తాయి. కాని విషయము కొత్తదైనప్పుడు, అందులోనూ లౌకిక జీవిత సన్నివేశాలకు సంబంధించినప్పుడు దానిని అవగాహన చేసుకోవడానికి సానుభూతి, సహనము ఎక్కువగా ఉండాలి. భావగీతాన్ని చదివేటప్పుడు ఆ సన్నివేశాన్ని చిత్రించుకోగలిగిన హృదయ సంవాదం, ఆవేశ సామగ్రిని అందుకో గలిగిన అర్హత ఉండాలి. ఇట్టి మనోధర్మాన్ని ఆలంకారిక పరిభాషలో సత్వప్రకాశనము గల అంతరంగ మని అంటారు. కవి ఏ మనః పరిపాకంతో, ఏ అనుభవ ఉగ్రతతో, ఏ భావతీవ్రతతో కావ్యగానం చేశాడో తెలుసుకొని కావ్యాస్వాదనకు సిద్ధం కాగలిగిన సహృదయత పాఠకునిలో ఉండాలని భావకవుల వాదం.

భావగీతమే నిజమైన కవిత్వమనీ, మహాకావ్య మన్నది లేనే లేదనీ కొందరి వాదము. మహాకావ్య మన్నది భావ కవితాశాఖకు చెందిన ఖండకావ్యాల సంపుటమే కాని వేరు కాదని వారి ఉద్దేశము. మహాకావ్యములో ఆయువు పట్టులైన భాగాలన్నీ భావగీతాలనీ, అవే దాని మహత్త్వానికి కారణాలవుతాయనీ వారి అభిప్రాయము. దీనిలో సత్యము కంటె అభిమానపూర్వకమైన దృష్టి ఎక్కువ గోచరిస్తుంది.

తెలుగులో వచ్చిన భావకవితను సవిమర్శంగా పరిశీలన చేస్తే పైన చెప్పిన లక్షణాలే కాక మరికొన్ని చూడవచ్చును. భావగీతము ఆత్మానుభవ పూర్వకమైనది. భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పక స్ఫుటాస్ఫుట ప్రతీతితో వ్యక్తంచేసి, అనిర్వాచ్య మనోదశలలోని అనంతానంతచ్ఛాయలను శబ్దశబలిత చిత్రంలో పొదగడానికి భావకవి ప్రయత్నం చేస్తాడు. అభిద, లక్షణ, వ్యంజనలే కాక శబ్దాలకు రంగులు, వాదనలు ఉన్నాయని భావకవి అంటాడు. వానిని గుర్తింపక పోతే భావ కవితలోని సౌందర్య సమర్పకత్వం అర్థం కాదని భావకవుల వాదం. కొంత అస్పష్టత భావకవితకు శోభను గూర్చే లక్షణమని వారి విశ్వాసము. సంవేదనకు లొంగక వ్యక్తావ్యక్త ప్రతీతి కలిగిన అనుభూతిని లీలగా, ఛాయగా దానికి తగిన శబ్దాలతోనే వెల్లడి చేయగలమనీ, అందుచేతనే కొంత అస్పష్టత అనివార్యమనీ భావకవులు సమర్థించుకుంటారు. సాంకేతికమైన పద్ధతితో పలకడంచేతను, అనుభూతిని కొత్త దృష్టితో, కొత్త నుడికారముతో ప్రకటించడంచేతను సంప్రదాయ రీతులకంటె భిన్నంగా ఉండి, సానుభూతి అభ్యాసము లేని పాఠకునికి అర్థ ప్రతీతిలో కొంత క్లేశాన్ని కలిగిస్తుంది. కొంత అలవాటు పడితే ఆస్వాదయోగ్య మవుతుంది.

భావకవులుగా ఖ్యాతిని గడించిన వారిలో గణనీయులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, వేదుల సత్యనారాయణశాస్త్రి, అబ్బూరి రామకృష్ణారావు, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి (స్వామి) ప్రభృతులు. వీరిలో కృష్ణశాస్త్రి అచ్చమైన భావకవి. ఆయన 1925లో "కృష్ణపక్షా"న్ని విడుదల చేశాడు. అప్పటికి తెలుగుదేశంలో బ్రహ్మసమాజపు ప్రభావం వీరేశలింగం, వెంకటరత్నం నాయుడు వంటి వ్యక్తుల ద్వారా యువకుల మీద పనిచేసింది. బ్రహ్మసమాజం వంగదేశములో రాజా రామమోహనరాయలతో ప్రారంభమై రవీంద్రనాథ ఠాకూరువంటి కవుల మన్నన పొంది, ప్రాక్పశ్చిమ సంస్కృతి సమ్మేళన ప్రయత్నానికి పూనుకుంది. ఈ ఉద్యమం సామాజిక సంస్కారాన్నే కాక సాంస్కృతిక పరిణామాన్ని కొంతవరకు సాధించింది. ఆ రోజులలో అది పురాతన సంస్కృతి మీద, సమాజం మీద వచ్చిన తిరుగుబాటు. అది క్రైస్తవ మతమూ, ఆంగ్ల సాహిత్యమూ వంగీయుల దృక్పథంలో తెచ్చిన మార్పు. దీనికి తోడుగా బెంగాలు (వంగ) విభజన ప్రయత్నం ఒక కొత్త ఉద్యమానికి కారణమయింది. వంగదేశమునుండి వచ్చిన బ్రహ్మసమాజపు సిద్ధాంతాలే కాక వంగసాహిత్య రీతులు కూడా కృష్ణశాస్త్రి యువక హృదయానికి ప్రోద్బలకములయినవి. ఆయన జీవితంలో వచ్చి పడిన అనుభవాలు ఈ మనస్తత్వానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించాయి. విద్వత్కవుల వంశములో పుట్టిన కృష్ణశాస్త్రికి హూణవిద్యతోపాటు తండ్రుల సాహిత్య గోష్ఠీ సంస్కారం లభించింది. ఈ ప్రభావాల ఫలమే కృష్ణశాస్త్రి కవిత్వం. పతనోన్ముఖమైన ఆంధ్ర సారస్వత రీతులతో విసుగెత్తి, గురజాడ అప్పారావు ఇచ్చిన వైతాళిక గానంతో మేల్కొని, బ్రహ్మసమాజము, వంగాంగ్ల సాహిత్యాలు చూపించిన కొత్త బాటలలో ఆనువంశికంగా వచ్చిన సాహిత్య సంస్కారముతో కృష్ణశాస్త్రి "కృష్ణపక్షా"న్ని 1925లో ప్రకటించాడు. ఆ తరువాత ఆయన "ప్రవాసము," "ఊర్వశి" వచ్చాయి. ఇవన్నీ భావగీతాల సంపుటాలే. స్వచ్ఛంద ప్రియత్వం, భగ్నప్రేమ, నిర్వేదము, తాత్త్విక దృష్టి ఆయన కావ్యాలలో కనిపిస్తాయి. పద్య రచనలలో తెలుగు జిలుగు ఎక్కువ. తెలుగు నుడికారాన్ని పేశలంగా మెలకువతో ఉపయోగించిన కవి ఇతడు. మాటలను కొత్త పద్ధతిలో కలిపి, చమత్కారమైన విరుపులతో తనదే అయిన ఒక శైలిని నిర్మించుకున్నాడు. కృష్ణశాస్త్రి గేయాలలో ఒక ప్రత్యేకత ఉన్నది. మాటలను పాటగా చేసే గుణం ఆయన పద్యాలలోనే ఉన్నది. గేయంలో అది మరింత పాటవాన్ని సంపాదించుకుంటుంది.

కృష్ణశాస్త్రిని భావకవిగా చేసిన సామాజిక పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. వంగదేశమునుండి దిగుమతి అయిన బ్రహ్మసమాజపు ప్రాబల్యం కూడా క్రమంగా క్షీణించింది. వానితోపాటు కృష్ణశాస్త్రి కవితా వాహిని కూడా ఇంకిపోయింది. ప్రేరకసామగ్రి అంతా దూర ప్రాంతాలనుండి రావటంచేత దానిలో తీవ్రత చాలక రవీంద్రుని వంటి గొప్ప భావకవిని తెలుగు దేశం సృష్టించుకోలేకపోయింది.

తరువాత కృష్ణశాస్త్రిలో భావ పరివర్తనం వచ్చింది. మారుతున్న సామాజిక పరిస్థితితోపాటు జీవితపు విలువలు మారాయి. వానితోపాటు ఆయన దృష్టి మారింది. తాత్త్వికంగా ఆయన మరోరకమైన కావ్య రచనలను ఆకాంక్షించినా వానిని అందివ్వగలిగిన హృదయ సామగ్రి తన దగ్గర లేదని ఎన్నో ఉపన్యాసాలలో ప్రకటించాడు.

కాని తెలుగు దేశములో భావకవితకు కృష్ణశాస్త్రి ఉద్యమ నాయకుడు. ఆయన వెనుక అనుయాయులు చాలామంది బయలుదేరారు. అందులో గణింపదగినవాడు మల్లవరపు విశ్వేశ్వరరావు. ఆయన "మధుకీల," "కల్యాణకింకిణి" అన్న ఖండకావ్య సంపుటాలు ప్రకటించాడు. కృష్ణశాస్త్రిలోని ప్రతిభావ్యుత్పత్తులు విశ్వేశ్వరరావులో కనిపించకపోయినా ఆయనలో ఒక భావ తీవ్రత ఉన్నది. ఆ లక్షణమే ఆయనను కవిగా చేస్తున్నది. "మధుకీల"లోని కొన్ని గేయాలు ఏ ఆధునిక కావ్య సంకలన సంపుటానికైనా శోభను చేకూర్చ గలవు.

భావకవిగా పరిగణించదగ్గ మరొక కవి వేదుల సత్యనారాయణశాస్త్రి. ఆయన సంస్కృతాంధ్ర సాహిత్యాలు ప్రాచీన మార్గంలో చదివినా, భావకవితా శాఖనే అభిమానించాడు. ఆయన రచనలలో కృష్ణశాస్త్రిలో లేని చిక్కణత్వం కనిపిస్తుంది. మాటలో బరువూ, సంప్రదాయచ్ఛాయ ఉంటాయి. కృష్ణశాస్త్రి కున్నంత ఆంగ్లసాహిత్య పరిచయ బలం లేనందువల్ల ఆయనలో కనిపించినంత ప్రత్యేకత, ప్రత్యగ్రత ఈయనలో కనిపించవు. కాని సంస్కృత వాణీ సౌకుమార్యం ఆతని రచనలోని ప్రత్యేక గుణం. "వేదుల" సౌందర్య స్పృహయాళువు. సుఖ శూన్యమైన క్లేశ జీవితాన్ని ఎరిగినవాడు. ఈ రెంటి ప్రభావము ఆయన "దీపావళి"లో చూడవచ్చును. ప్రేమ, సౌందర్యము, నిర్వేదము, కరుణ "వేదుల"కు అభిమాన కవితాద్రవ్యాలు. కొన్ని సమయములలో దేశాభిమానం ఆయన చేత కావ్యగానం చేయించినది. "కాంక్ష," "ఆషాఢమేఘము" వంటి ఖండకావ్యాలు చాల విలువైనవి. ఆయన కవితలోని స్వాదుత్వాన్ని గుర్తించిన వారికి "గౌతమీ కోకిల" అన్న ఆయన బిరుదు ఎంతో అర్హమైనదిగా కనిపిస్తుంది.

రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావు ఒక తెగకు చెందిన కవులు. వారు భావగీతాలే కాక కథనాత్మకమైన రచనలు కూడా చేశారు. రాయప్రోలు సుబ్బారావు 1913లో తృణకంకణ మన్న కావ్యాన్ని ప్రకటించాడు. ఆధునిక కవిత్వానికి తృణకంకణ మాదిమ గ్రంథమని కొందరి యభిప్రాయము. "ఆ రోజులలో ఈ కృతి వల్ల ఏదో కొత్తలోకంలోకి మార్గం ఏర్పడినట్టయింది. అంతకుముందు ఆధునిక విధానానికి తోవతీసినవారు అనూరు ప్రాయులు. ఈ సూర్యాలోకం వల్ల సాహిత్యసీమలో నూతన రుచి వ్యాపించి కన్నులు మిరుమిట్లు కొల్పింది. కొంతమంది కన్నులు మూతలు పడ్డాయి. కొంతమంది నేత్రపటలాలు నీరయిపోయినవి" అని తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి 1938లో తృణకంకణ రజతోత్సవ ముద్రణానికి పీఠికా ప్రాయమైన "నీరాజనము"లో వ్రాస్తాడు. తృణకంకణం పాతమార్గాలు కొన్ని విసర్జించి కొత్తబాణిలో నడచిన కావ్యం. సుబ్బారావుకు శాంతినికేతన నివాసం, ఆంగ్ల కవుల ప్రభావం కొత్త రచనా పద్ధతికి ప్రోద్బలములయినవి. ఆయన కవితలో నూతనమై, ఉత్పాద్యమై, లౌకికమైన వస్తువున్నా, రచనా విధానము సంప్రదాయపు సాధుశీలాన్ని విసర్జించదు. పద్యశిల్పములో చేమకూర వేంకటకవి, పెద్దనవంటి కవుల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సరళమైన కోమల ప్రకృతులమీద ఆయన కభిమాన మెక్కువ. ఆయన ప్రాచీన ఔన్నత్యాన్ని స్మరించి ఉద్రిక్తుడౌతాడు. భావాలలో కొంత కాళిదాసుమీది అభిమానం వెల్లడి అవుతుంది. "తృణకంకణం," "కష్టకమల," "స్నేహలతాదేవి," "స్వప్నకుమారము" రాయప్రోలువారి కథనాత్మక కావ్యాలు. "జడకుచ్చులు," "ఆంధ్రావళి" ఖండకావ్యాల సంపుటాలు. వీనిలో దేశభక్తి గీతాలు కూడా ఉన్నాయి. ఇవి జనప్రీతి నెక్కువగా చూరగొన్నాయి. "మధుకలశము" ఉమరుఖయ్యామునకు పరివర్తనము. "రమ్యాలోక" మొకవిధమైన ఆలంకారిక గ్రంథము. ఆధునికులలో కొంత విరివిగా కావ్యరచన చేసిన వారిలో సుబ్బారావు ఒకడు. ఆయన భావనలో, భాషలో, శయ్యలో స్వచ్ఛతను, సరళతను, సౌకుమార్యాన్ని సాధించాడు. మొత్తముమీద సుబ్బారావు కవిత మధుర మార్గానికి చెందుతుంది.

రాయప్రోలుకు కొంచెము తరువాత వచ్చినా, ఆయనతో సమాన స్కంధుడుగా నిలువగలిగినవాడు అబ్బూరి రామకృష్ణారావు. ఆయన "ఊహాగానము," "పూర్వప్రేమ" 1918లో ప్రకటించినాడు. "మల్లికాంబ" అతని మరొక ఖండకావ్య సంపుటము. రామకృష్ణారావు మంచి వ్యుత్పన్నుడే కాక చక్కని భావుకుడు. తన ప్రసన్న వాణితో కొన్ని చక్కని భావగీతాలు వ్రాశాడు. కాని రామకృష్ణారావు ఏ కారణము చేతనో కవితా రచన మాని చాలా కాలమైనది.

భావగీతాలు వ్రాసిన మరొకకవి తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి (స్వామి); "హృదయేశ్వరి" ఆయన భావగీతాల సంపుటి. శివశంకరశాస్త్రి గొప్ప వ్యుత్పన్నుడు, గోష్ఠీ చతురుడు; సరసుడు. ఆయన భావగీతాలలో అస్పష్టత గాని, అనన్వయ దోషం గాని ఉండదు. ఆతని కవిత సరళంగా, స్వచ్ఛంగా ఉంటుంది.

ఖండకావ్య రచనలలో భావనాపటిమ , ఉదాత్త కావ్యలక్షణము, సంప్రదాయపు చేవ, రచనాశిల్పము చూపించిన కవి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన గొప్ప ప్రతిభాశాలి. ప్రౌఢమైన దృష్టి, తీవ్రమైన వాణి, ఉజ్జ్వలమైన రీతి సత్యనారాయణలో కనిపిస్తాయి. కాని ఆయనలో అచ్చమైన కవితా హృదయ మెంత ఉన్నదో, పాండిత్య వైయాత్య మంత ఉన్నది. ఖండకావ్యాలలో సత్యనారాయణ తొక్కని మార్గము లేదు. ఆతని "కిన్నెరసాని పాటలు" గేయ కవితకు, "ఆంధ్రప్రశస్తి" కథనాత్మక కవితకు, "గిరికుమారుని ప్రేమగీతాలు" భావగీతాలకు, "కొండవీటి పొగమబ్బులు," "తెలుగు ఋతువులు" వంటి కావ్యాలు వర్ణనాత్మక కవితకు, "శృంగారవీథి" శృంగారానికి ఉదాహరణాలు. వెనుకటి, ఇప్పటి కవితా సంవిధాన చాతుర్యాలన్నీ పుణికి పుచ్చుకున్న కవి సత్యనారాయణ. సంప్రదాయ శీలమైన అతని బుద్ధి పౌరాతనత్వాన్ని అభిమానిస్తూనే అద్యతన రీతులను బాగా జీర్ణం చేసుకున్నది. భావన, రచన, ప్రౌఢము కావడంచేత ఆయనలో ప్రసాద గుణం తక్కువ ఓజస్సు, పటిమ ఎక్కువ. భాష ఆయనకు ఊడిగం చేస్తుంది. ఆయనది "మురారిపంథా." ఆంధ్ర సాహిత్యములో "విశ్వనాథ" ఒక సమున్నత శిఖరము. ఆయన సామాన్యుల కవి కాడు. "కవీనాం కవిః."

ఖండకావ్యాలతో జనప్రీతిని బాగా చూరగొన్న మరొక కవి జాషువా. ఇతనిది నిమ్నోన్నతములు లేని సరళమైన మార్గం. హృదయానికి సూటిగా, వేడిగా, వాడిగా వచ్చి తగిలే మాటలతో అతని కవిత సామాన్య జనాన్ని ఎంతగా ఆకర్షిస్తుందో చదువుకున్నవాళ్ళనూ అంతగా ఆకర్షిస్తుంది. తనదే అయిన కొత్త పలుకు తీరుతో జనరంజకమైన ఇతివృత్తాలను తీసుకొని వ్రాస్తాడు జాషువ. క్షుద్ర వస్తువులలో కూడ ఉదాత్తతను చూడగలడు. యక్షునికి మేఘ మెంతటిదో కటిక దరిద్రుడికి గబ్బిల మంతటిది కావచ్చునని "గబ్బిలము"లో జాషువా ధ్వనిస్తాడు. ఆతని ఇతర కృతులు "ఫిరదౌసి," "తాజమహలు" మొదలైనవి అశేషజన ప్రీతికి పాత్రము లయ్యాయి.

ఆధునికులలో ఖండకావ్య రచయితలుగా పేర్కొనదగిన వారు చాలామంది ఉన్నారు. నాయని సుబ్బారావు, కొడాలి ఆంజనేయులు, కొడాలి సుబ్బారావు, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు, బొడ్డు బాపిరాజు, అడవి బాపిరాజు, ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి, పిలకా గణపతిశాస్త్రి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, ఏటుకూరి నరసయ్య, జంధ్యాల పాపయ్యశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి, కవికొండల వెంకటరావు, వేంకటపార్వతీశ్వర కవులు, బుచ్చి సుందరరామశాస్త్రి, పాటిబండ మాధవ శర్మ, పెమ్మరాజు లక్ష్మీపతి ప్రభృతులు లెక్కింప దగినవారు.

రాయలసీమలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, బెళ్ళూరి శ్రీనివాసమూర్తి ప్రభృతులు పరిగణనీయులు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ "గాథాసప్తశతి," "పరివర్తనము" ఆంధ్రదేశపు ఆదరాభిమానాలను పొందినవి. "పుట్టపర్తి" పండితుడు; బహుభాషాకోవిదుడు; రసజ్ఞుడు; బహుగ్రంథకర్త. అతనిది తీవ్రమైన వాణి. "పెనుగొండ లక్ష్మి," "సాక్షాత్కారము," "షాజీ" వంటి ఖండకావ్యాలు, "శివతాండవ" మనే గేయ రూపకమైన కావ్యము అతనికి మంచి పేరు తెచ్చాయి. బెళ్ళూరి శ్రీనివాసమూర్తి "ప్రేమ తపస్విని," "అపశృతి" వంటి కావ్యాలు ప్రకటించాడు.

గేయకవులలో నండూరి సుబ్బారావుకు విశిష్టమైన స్థానమున్నది. ఎంకి, నాయుడు బావల ప్రేమ పలువిధాలుగా రూపొందిన "ఎంకిపాటలు" తెలుగు హృదయాలలో ఇంకిపోయినాయి. వాని ముగ్ధ సౌందర్యానికి మురిసిపోని సహృదయుడుండడు. నండూరి సుబ్బారావు పామరజన జీవితం వ్యావహారికభాషలో, ఉదాత్తశిల్పంతో, నిపుణంగా పొగడితే ఎంత హృదయహారిగా ఉంటుందో చూపించాడు. ఈ పద్ధతిలో ఆయన అద్వితీయుడు. ఆయన మార్గాన్ని మరెవ్వరూ అనుసరించలేదు.

ఇంతవరకూ పేర్కొన్న కవులందరూ 1910 నుండి సాగి వచ్చిన నవ్య సాహిత్యోద్యమానికి యథాశక్తి తోడ్పడ్డవారే. అందులోని భావకవితా శాఖ 1930 నాటికి ఉన్న చమురంతా పీల్చి కొడిగట్టి ఆరిపోయింది. ఆ రచనలన్నీ అంతకు పూర్వ ముండిన కవిత్వంమీద తిరుగుబాటుగా వచ్చినా, సామాజిక సమస్యలతో సంబంధము లేక మధ్యమ వర్గాల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ వచ్చాయి. అప్పుడప్పుడే వికాసము పొందుతూన్న సామాజిక చైతన్యానికి రూప మిచ్చి మాటలలోనికి మార్చే కవికోసం తెలుగుదేశ మెదురు చూస్తున్నది. అంతర్జాతీయ, జాతీయ రంగాలలో అత్యంత ఉద్యమ శీలమైన చిత్తప్రకృతిని ప్రచారానికి తెచ్చే విప్లవ శక్తులు విజృంభిస్తున్న రోజు లవి. ఆ పరిస్థితిలో "శ్రీ.శ్రీ." (శ్రీరంగం శ్రీనివాసరావు) తన కొత్త గొంతుక విప్పాడు. అభ్యుదయ కవితా మార్గాన్ని సృష్టించాడు. "మహాప్రస్థానము"తో కొత్త కవితారీతులు తెలుగులోకానికి పరిచయం చేశాడు. ఇతనిది విప్లవాత్మకమైన ప్రగతివాదం. మొదటి అపరిణామ దశలో భావకవుల అడుగుజాడలలో నడచినా "శ్రీ.శ్రీ." మార్క్సీయ సిద్ధాంత ప్రభావంచేత మేల్కొని స్వతంత్ర మార్గాన్ని వెదుకుకున్నాడు. ఎంతటి తీవ్ర విమర్శకుడైనా మెచ్చుకోక తప్పని సంవిధాన చాతుర్యం, వైవిధ్యం "శ్రీ.శ్రీ." కి స్వార్జితమైన ఆస్తి. అగ్గిపుల్లనో, అరటి తొక్కనో, హారతి పళ్ళాన్నో - దేన్నైనా సరే కవితామయంగా చేసే స్పర్శవేది "శ్రీ.శ్రీ."కి తెలుసు. మార్క్సు సిద్ధాంతము "శ్రీ.శ్రీ."కి జీవితాన్ని విమర్శించే విచారదృష్టినీ, సమాజ పరిస్థితుల వెనక ఉండే రహస్యాలను అవగతం చేసుకునే శక్తినీ ఇచ్చింది. సాహిత్యాన్ని బుద్ధిపూర్వకంగా విప్లవాత్మకమైన ఆచరణకు సాధనగా వినియోగించాలన్న దృష్టి మార్క్సీయ వర్గకలహ సిద్ధాంతమునుండి బయలుదేరుతుంది. వర్గకలహంలో సాహిత్యాన్ని బ్రహ్మాస్త్రముగా మార్చడమే విప్లవవాదుల ఆశయం. "ప్రతిజ్ఞ"లో ఈ భావాన్నే "శ్రీ.శ్రీ." ప్రతిపాదిస్తాడు. "ధనస్వామ్య వ్యవస్థలో పరస్పర వైరుధ్యాలే దాని పతనానికి కారణమవుతాయనీ, తరువాత అంతకన్న న్యాయబద్ధమైన, సామ్య సిద్ధమైన వ్యవస్థ ఏర్పడుతుందనీ చేసిన జోస్యం ఫలోన్ముఖానికి వస్తోంది" అన్న ప్రగాఢ విశ్వాసమే "జగన్నాథ రథచక్రాల"లో కనిపిస్తుంది. కాని "శ్రీ.శ్రీ."లో ఈ ఆశావాదం సార్వత్రికంగా ఉండదు. ఒక్కొక్కసారి సంశయాళువుగాను, వేరొక్కసారి జీవితానికి వైయర్థ్య మారోపించే నిరాశావాదిగాను "శ్రీ.శ్రీ." కనిపిస్తాడు. "శ్రీ.శ్రీ."లో ఆశావాదం లోతుగా వేరూని నిలువలేదు. వస్తువరణంలోనే కాక రచనా సంవిధానంలో కూడా "శ్రీ.శ్రీ." విప్లవాన్ని సాధించాడు. భాషలో, భావములో, ఛందస్సులో అతడు కొత్త మార్గాన్ని చూపాడు. అతని ప్రతిభ అత్యంతోద్యమశీలమైనది. ఆధునిక సాహిత్య చరిత్రలో అతడొక మైలురాయి.

"శ్రీ.శ్రీ."లో మూడు దశలు గుర్తింపవచ్చును. 1932కు ముందు వ్రాసిన రచనలు అపరిపక్వంగా అనుకరణశీలములై ఉండేవి. 1932 నుండి సుమారు 1940 దాకా రెండవ దశ. ఈ దశలోనే అతని ప్రసిద్ధ రచనలు వచ్చాయి. 1940 తరువాత మూడవ దశ. ఈ దశలో అధివాస్తవిక ధోరణి అతని రచనలలో బాగా ప్రవేశించింది.

ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన "సైకో ఎనాలిసిస్‌" సిద్ధాంతం కళాక్షేత్రంలో అధివాస్తవిక (సర్‌ రియలిజమ్‌) మతాన్ని అవతరింపజేసింది. మొదట్లో యమ్‌. ఆండ్రే బ్రెటన్‌ అధివాస్తవికుల ఆశయాలను వివరిస్తూ "మనస్సును విడుదల చేయడమే వారి ప్రధానోద్దేశ" మన్నాడు. క్రూర నిరోధక శాసనాలలోని పరిమితత్వాన్ని అధివాస్తవికులు ఖండిస్తారు. సీమితమైన పరిధులను దాటే స్వేచ్ఛ మానవుడి కవసరం. అనుభూతిక్షేత్రం విశాలమై అదే కావ్యవస్తువు కావాలి. సుప్త చైతన్యపు (సబ్‌ కాన్‌షస్‌ మైండ్‌) లోతులలో అనుభూతిక్షేత్రాన్ని విస్తరించుకోవాలి. చైతన్యపు (కాన్‌షస్‌ మైండ్‌) నిరంకుశాధికారం లేకుండా బాహిరిల్లే సుప్త చైతన్యానికి శబ్దరూప మివ్వడమే అధివాస్తవిక రచన అవుతుందని ప్రాథమిక దశలో వారి వాదం. 1924లో మొదటిసారిగా అధివాస్తవికుల ప్రణాళిక సిద్ధమయినా క్రమక్రమంగా రాజీధోరణి హెచ్చి సిద్ధాంత పరివర్తనం వచ్చింది.

సుప్తచైతన్యం అనేక శబ్దచిత్రాలకు (వెర్బల్‌-ఇమేజస్‌), స్మృతి శేషాలకు (మెమొరీ- రెసిడ్యూస్‌) పెద్ద భాండాగారం వంటిది. అసంఖ్యాకములైన పూర్వసంవేదనలు సుప్తచైతన్యములో నిక్షిప్తములై ఉంటాయి. సరియైన అనుబోధ (కరెక్ట్‌ అస్సోసియేషన్‌) యాదృచ్ఛికంగా స్ఫూర్తికి వచ్చినప్పుడు దానివెంట సహచారి - సంవేదనలు పైకి జ్ఞానభూమిలోనికి చొచ్చుకొని వస్తాయి. కాబట్టి జీవితంలో, ముఖ్యంగా మానసిక జీవితములో రెండు అంతస్తులు గుర్తింపవచ్చును. ప్రతిదీ స్ఫుటంగా తోచి, సరిహద్దులు కనిపించే దొకటి; ఎంతవరకు వ్యాపించిందో తెలియక మరుగు పడిపోయి అస్పష్టమైన దింకొకటి. ఇదే జీవితములో పెద్ద భాగమేమో! మానవుడు పెద్ద మంచుగడ్డలా కొంచెమే పైకి చైతన్యంలో తేలుతూ, కాలప్రవాహంలో పడిపోతున్నాడు. మరుగు పడిపోయిన ఆ జీవితపు కొలతలు తీసి, దాని స్వరూప పరిశీలన చేసే ప్రయత్నం అధివాస్తవికులు చేస్తామంటారు. ఈ ఉద్యమంలో వీళ్ళెన్నో సంకేతాల సాయం తీసుకుంటారు. ఆధునిక మనస్తత్త్వ శాస్త్రం సంకేతాల స్వరూపాన్ని - ముఖ్యంగా స్వప్న సంకేతాల స్వరూపాన్ని - వ్యాఖ్యానించే ప్రయత్నం చేసింది. ఈ శాస్త్రాధ్యయనం కొందరిని అధివాస్తవిక రచనలకు ప్రేరేపించింది.

"స్వచ్ఛందానుబోధ పద్ధతి" మీద నిర్మింపబడ్డ "అధివాస్తవిక సంవిధానం" నిజానికి స్వచ్ఛందం కాదన్న సంగతి ఫ్రాయిడ్‌, జ(య)ంగ్‌, మెకర్డీ నిరూపణలే ఋజువుచేస్తాయి. సయుక్తికాను బోధలో (రేషనల్‌ అస్సోసియేషన్‌) యాథార్థ్యంపట్ల ఏర్పడే సామాజికానుభూతి, ఆవశ్యతాజ్ఞానం భావనాప్రక్రియను పాలిస్తాయి. స్వచ్ఛందానుబోధలో భావనా ప్రక్రియ మీద సుప్తచైతన్యం అధికారం వహిస్తుంది. కాబట్టి అది స్వచ్ఛందం కాదు. సంఘానికెదు రీది మానవుడు ముక్తుడు కాడు. సమాజము ద్వారా ముక్తిని సాధించాలి. అనుబోధక పద్ధతిలోను కొన్ని సంప్రదాయాలూ, ఆచారాలూ ఉన్నాయి. అవే ముక్తి చిహ్నాలు. "అధివాస్తవిక రచయిత బూర్జువా కావడం వల్లనూ, అతనికి సామాజిక అనుబంధముమీద స్వాధీనము తప్పడముచేతనూ ఆ సంప్రదాయాలమీదా, ఆచారాల మీదా తిరుగుబాటు చేయడంలోనే ముక్తి ఉన్నదని విశ్వసిస్తాడు. ఆదర్శ ప్రాయమైన ముక్తిని కళలో ఐంద్రజాలిక శక్తి చేతను, కళాశీలి మనోవైలక్షణ్యం చేతను సాధించగలనని భావిస్తాడు" అని అధివాస్తవికతపై విమర్శన మొకటి ఉన్నది.

లోతుగా విమర్శిస్తే కళ కళ కోసమే నన్న వాదమే అధివాస్తవిక రచనా విధానానికి మాతృక. రాజకీయ పరిభాషలో అధివాస్తవిక రచయిత అరాజకవాది. అరాజక వాదమువలెనే అధివాస్తవిక కవితకూడా ఆచరణలో తన్ను తాను ప్రతియోగిస్తుంది.

"శ్రీ.శ్రీ."లో అధివాస్తవిక ధోరణి "కోనేటి దినం," "చక్కని ముత్యాలసరాలు," "విదూషకుని ఆత్మహత్య" వంటి కావ్యాలలో కనిపిస్తుంది. శ్రీరంగం నారాయణబాబు వ్రాసిన కొన్ని రచనలలో కూడ ఈ ధోరణి కొంత కనిపిస్తుంది. కాని అతనిలో "శ్రీ.శ్రీ."లోని ప్రౌఢ నిర్వహణ సామర్థ్యము కానరాదు. ఈ రకమైన రచన ఏ కొంతమంది రచయితలనో ఆకర్షించింది.

"శ్రీ.శ్రీ." తరువాత వచ్చిన కవులలో సామాజిక దృష్టి ఎక్కువ. వారిలో "శ్రీ.శ్రీ." ప్రభావ మేదో కొంత కనిపిస్తుంది. సామాజిక సమస్యలను పరిష్కరించే దృష్టి వారి కావ్యాలలో ఎక్కువైనది. "త్వమేవాహ" మన్న కావ్యములో "ఆరుద్ర" దీనిని కొంత సాధించినట్లుగాను, కవితా రీతులలో అతడు తనకంటె ఒక అడుగు ముందుకు వేసినట్లుగాను, తా నింక కవనసన్యాసము చేయడమే సబబన్నట్లుగాను ఆ కావ్యానికి పీఠిక వ్రాస్తూ "శ్రీ.శ్రీ." అంటాడు.

"ఆరుద్ర"లో వైచిత్రి, చమత్కారము, కొత్తగా యుక్తిగా పలుకుదామన్న కాంక్ష ఎక్కువ. ఆంగ్ల సాహిత్య ప్రభావము తగని మోతాదులో పని చేసిన ఫలితమే ఈ కావ్యం. ఏ ఉద్యమం కాని ఆయా దేశాలలో, ఆయా భాషలలో కలిగిన అవసరాలను బట్టి తప్పనిసరిగా వచ్చినప్పుడు నైసర్గికమైన ఉత్తేజనాన్ని పొందుతుంది. కాని దూరదేశాలలో కలిగిన మార్పులను, రీతులను, "విచిత్రమే సౌందర్యము, సౌందర్యమే విచిత్రము" అన్న అభిమానంతో స్వీకరిస్తే అది కేవలం తెలివిగా, యుక్తిగా పలికినామని సంతృప్తి పడే ధన్యమ్మన్యుల లక్షణమౌతుంది. సంస్కృతాంధ్ర సారస్వతములతో కాని, ఆంగ్ల సారస్వతముతోగాని హృదయదఘ్నమైన పరిచయంలేని కొత్తకారు రచయితలలో అవ్యుత్పత్తి, ప్రతిభాదారిద్ర్యం, పరానుకరణం ప్రధాన లక్షణాలు. శిల్పశూన్యమైన అత్యాధునిక ధోరణిలో వ్రాయడమే ప్రగతి అనుకొనే వారిని చూస్తే జాలివేస్తుంది.

"శ్రీ.శ్రీ." తరువాత వచ్చిన కవులలో సామాజిక దృష్టి ఎక్కువగా కనిపించినా శిల్ప పాటవం చాలినంత ఉండదు. "అగ్నివీణ" ఆ జాతికి చెందుతుంది. దాన్ని వ్రాసింది అనిసెట్టి సుబ్బారావు. ఇతడు భావుకుడు. "అగ్నివీణ"లో కొన్ని ఖండకావ్యాలు విలువైనవి.

ఆధునిక కావ్యాలలో ప్రత్యేకమైన ప్రశంసకు పాత్రం కాదగినది పఠాభి వ్రాసిన "ఫిడేలు రాగాల డజన్‌." కవి ప్రతిభాశాలి. నూతనమైన మార్గంలో, విచిత్రమై, సంప్రదాయాతిరిక్తమైన పద్ధతిలో ఆధునిక సమాజములోని కుళ్ళును క్షాళనం చేసే దృష్టితో, "వచన పద్యాల"తో ఆ కావ్యాన్ని వ్రాశాడు పఠాభి. ఒక్క మెరపు మెరసి ఇతడు ఊరుకోవడం న్యాయం కాదు.

నవ్య కవిత్వములో చక్కని వేళాకోళపు కావ్యాలు కూడా వచ్చాయి. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, మాచిరాజు దేవీప్రసాద్‌ "హేళన" కవిత వ్రాసి సారస్వతేయులకు చిరపరిచితులయ్యారు.

ఇటీవల వస్తున్న కవులలో "దాశరథి" వంటివాళ్ళు వికసనక్షమమైన ప్రతిభారేఖలను ప్రదర్శిస్తున్నారు.

1940 తరువాత వచ్చిన రచయితలలో వ్యుత్పత్తి దారిద్ర్యం బాగా కనపడుతుంది. ఒకనిని కవిగా చేయగలిగిన సామగ్రి వస్తువు, భావము మాత్రమే కాదు. వాటికి తగిన శిల్ప ముండాలి. విప్లవాత్మకమైన విలువలు మాత్రమే రచనలను రసత్కావ్య పంక్తులుగా మార్చవు. కావ్య శిల్పముతో పొదిపినప్పుడే అవి సాహిత్య శ్రేణిలో చేర్చడానికి అర్హమౌతాయి. కావ్య శిల్పం లేని విప్లవాత్మకమైన రచన ఎంత నీరసమో విప్లవాత్మకమైన విలువలు లేని కావ్య శిల్పమంత నిరర్థకము. ఈ రెంటి ప్రౌఢమేళనమే కవి సాధించవలసినది. తాత్కాలికంగా విలాసార్థం వచ్చిన ఛత్రాక సాహిత్య రీతులలో కాక, నిసర్గమైన ప్రతిభా వ్యుత్పత్తుల దాంపత్యముతో ప్రజాజీవితపు లోతులనుండి చేదుకున్న శక్తులతో సజీవ సాహిత్య నిర్మాణం చేస్తే ఖండకావ్య సరస్వతి ఇంకా ఇంకా పెరగ గలదు.


"తెలుగు విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము" - "తెలుగు సంస్కృతి" తెలుగు భాషా సమితి, మద్రాసు 1959.

పునర్ముద్రణ: సాహితీ వ్యాసాలు, సంపత్‌ సాహితి - 2, 2004.


కృతజ్ఞతలు:

శ్రీ శంఖవరం పాణిని, వారి తండ్రిగారు రచించిన యీ వ్యాసమును ఆంధ్రభారతిలో ఉంచుటకు అనుమతిని యిచ్చుటేకాక, తమ విలువైన సమయమును వెచ్చించి దీనిని Transliterate చేసి యిచ్చి సహకరించినందులకు, వారికి మా హృదయపుర్వక కృతజ్ఞతాభివందనములు.


AndhraBharati AMdhra bhArati - SaMkhavaraM saMpat rAghavAchAryulu - telugu vachana sAhityamu - vyAsamulu - khaMDakAvyamu - bhAvakavitvamu Sankhavaram Sampat Raghavacharya Sankhavaram Sampat Raghavacharyulu ( telugu andhra )