వచన సాహిత్యము వ్యాసములు పదవాఙ్మయంలో స్త్రీ - నాయని కృష్ణకుమారి

పదవాఙ్మయంలో స్త్రీ - నాయని కృష్ణకుమారి
ప్రథమ ప్రచురణ: కిన్నెర, సంపుటము 3, సంచిక 10, అక్టోబరు 1951.
మలి ప్రచురణ: సారస్వత వ్యాసములు, రెండవ సంపుటము, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 1969

జానపదులచేత ఏనాటినుండో పాడబడి నేడు ఉండడమా, ఊడడమా అన్న స్థితిలో ఉన్నపాటలు పాతపాటలు. పాతపాట లనగానే దీనికి వెనుక ఎంతో చెప్పవలసి ఉంటుంది. నన్నయగారే మొదటి తెలుగుకవి కాడనీ, భారతమే ఆది ఆంధ్ర కావ్యం కాదనీ అనవలసి ఉంటుంది. అంతకుముందు ప్రజలు కావ్యాత్మ కలవారనీ, వారి నోట పాటలకు మల్లే భావావేగం కవిత్వమై పొంగిపొరలిందని వారే తెలుగుకు ప్రాణప్రతిష్ఠ చేసి విడిచిన విరాణ్మూర్తు లనీ అంగీకరించవలసి ఉంటుంది. ఇట్లా అనడంలో చిక్కులు వస్తాయనీ అందరికీ తెలుసు. తేలికగా చప్పున అనడంకూడా కష్టమే; అయినా ఇది సత్యం.

నన్నయగారు సంస్కృత కవుల సొత్తుకు తెలుగు బురఖా తొడగి మనదనుకొమ్మన్నారు. ఈ రసోన్మాదులు వాళ్ళజాతికి అనువైనట్లు వాళ్ళభావాలనే స్వంతంగా వాళ్ళమాటల్లో పాడుకున్నారు. ఇందులో ఎవరు మెరుగు త్రోవలు త్రొక్కింది, ఎవరిని మనం విస్మయంలో ఆమోదించవలసిందీ మనమనస్సులకు తెలుసు.

పాల్కురికి సోమన తుమ్మెదపదాలూ, చంద్ర, వెన్నెలపదాలూ పాడుతూ యాత్రికులు శ్రీశైలయాత్ర సాగిస్తుండే వారని చెప్పాడు. ఇంకొక సోమన వీటి కొక లక్షణం చేకూరుద్దామని యత్నించి విఫలుడై విసిగి కాబోలు "అనియతగణైః యతిర్వా ప్రాసోవా" అని మాత్రం చెప్పి సరిపెట్టుకున్నాడు. కాకపోతే వీటికి బంధ మేమిటి? యతిప్రాసల గొడ వేమిటి?

మనుష్యుడు కష్టంకానీ, సుఖంకానీ ఇనుమిక్కులై పట్టరానపుడు దానినే గొంతువిప్పి స్వేచ్ఛగా పాడుకుంటాడు. తన ఉద్వేగ ఉత్సాహాలను బహిఃప్రపంచంలో మూకంగా ఉన్న శక్తులకుపంచి బరువు దించుకుంటాడు. అక్కడికి అతనికి ఒక తృప్తి. అటువంటి భావతైక్షణ్యం కల మనిషి పదాలు సరిగా పడ్డవా అని చూడడు; పండితులు మెచ్చుకుంటున్నారా అని చూడడు. యతీప్రాసా కుదరాలని చూడడు. కాని చిత్ర మేమంటే అతని ముఖంలో పాటగా రూపొందుతున్న పాదాలు ఎక్కడి కక్కడే సొంపుగా విరగడం మొదలు పెడ్తవి. అది తెలుగు మాట్లాడేవాడి మనస్తత్వంలో ఉన్న రహస్యం. తనకు తెలియకుండానే మాట్లాడుతున్నప్పుడూ వాడు మొదట పలికిన పదానికి ఉచ్ఛారణలో సమీపంలో ఉన్నపదం మళ్ళీపలకాలని చూస్తాడు.

అంటే "ఆకూ అలమూ" అన్న జంట ఉన్నదనుకోండి. అక్కడ "అలానికి" అర్థంఉంది. అట్లా గడ్డీగాదంలో గాదానికి అర్థంఉంది. కాని వంకర టింకర అన్నప్పుడూ టింకరకు గానీ, మంచీ గించీలో గించికి కానీ అర్థంలేదు. అట్లా అవి వ్యర్థపదా లయినా మొదట పలకబడ్డ మాటలకొక సౌష్ఠవాన్నీ, సౌందర్యాన్నీ తెచ్చిపెడతవి. వినేవారి చెవులకు ఇంపును కలిగిస్తవి.

ఇటువంటి పాతపాటల్లో పాండిత్య ప్రకర్ష ఉండదు. కాకపోతే భావావేగముంటుంది, లౌకికజ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. కావ్యాల్లో కవి తన పాత్రల్ని నఖశిఖ పర్యంతం నిండుగా అలంకరించి మంచిబొమ్మల్లా నిలబెడతాడు. ఆ కన్నూ, ఆ ముక్కూ, ఆ తీరూ దూరంగా ఉండి చూడడానికే గాని దగ్గరికి వచ్చి తడవి పరిశీలించే టట్లయితే నిర్భాగ్యుడి స్వప్నంలా ఎక్కడి కక్కడ ఛిద్రమై పోతుంది.

ఇంకొకవిషయం చెప్పాలంటే కావ్యనాయికలూ నాయకులూ రాచకుటుంబంలో పుట్టినవారు లేదా ఉన్నతవంశోద్భూతులు. నాయికలు ఆకాశంలో విహరిస్తుంటారు. కాని భూమిమీద నిలువరు. వారికి తల్లీ తండ్రీ, అన్నా చెల్లెలూ, భర్తా, అత్తా మామా మొదలైన బంధువర్గమంతా ఉన్నట్లు కవి చూచాయగా తెలుపుతాడు. అదీ కథావసరాన్ని బట్టి మాత్రమే. అంతేకాని అండకు వారిలోగల పొత్తు ఎట్లాంటిదో, వాళ్ళవాళ్ళ మెలుకువలు ఎట్లాంటివో మనకు తెలియదు. ఎంతసేపూ నాయిక విరహవేదన పడుతుంది. నాయకుడికోసం ఎదురుతెన్నులు చూస్తుంది. చెలికత్తెలు శైత్యోపచారాలూ, చంద్రాద్యుపాలంభనాలూ చేస్తారు. చివరకు వివాహం. ఇదీ జరిగే కలాపం. నాయకుడుకూడా ఏ ధీరోదాత్తుడో, దక్షిణనాయకుడో. ధీరోదాత్తుడే అయితే ప్రియాన్వేషణ, సమాగమంతోనే కావ్యాంతానికి వచ్చేస్తాడు. దక్షిణ నాయకుడే అయితే ముందటిభార్య కాళ్ళకు మ్రొక్కుతూనే ఆవిడ "చెల్వగు పద పల్లవంపు తాకిళ్ళ"తో తను పులకాగ్ర కంటక వితానుడవుతూనే మరికొందరు స్త్రీల కోసం ఆరళ్ళు పడుతూ ఉంటాడు.

ఎప్పుడూ ఇటువంటి ఇతివృత్తాలను తీసుకుని పాండిత్య ప్రకర్ష కోసం పాకులాడుతూ యతిప్రాసలతో తమ భావాలను బిగించుకుంటూ నడిచే కవిలో మనస్సుకు తట్టిన ఊహను, హృదయం వెలువరించా లనుకున్న భావాన్ని అప్రయత్నంగా చెవులకింపుగా వెలువరించే నిష్పండితుడి పాటకున్న మార్దవం కాని, భావస్ఫోరకతకాని ఉండడం కష్టం.

అతని పాటల్లో అర్థంలేని పదాలు ఉండవచ్చు. వేంకట పార్వతీశకవుల గీతాల మాదిరి కేవలం శ్రుతిమాధుర్యమే కలిగి తీసివేసినా చెప్పబోయే భావం చెడని పాదాల ఆవర్తన ఉండవచ్చు. అయినా అతణ్ణి భావలోపం లేని మహారసికు డనాలి. చెప్పదలుచుకున్నది వినేవారికి సులువుగా స్ఫుటమయేటట్లు చెప్పగలిగిన ధన్యశీలి అనాలి.

ఇటువంటి పాటలు ఎవరిచేతనన్నా రచింపబడనీ, ఎక్కువగా పాడబడేది స్త్రీలచేత. అసలు నా ఉద్దేశంలో వీటిలో ఒక గుంపుకు కేవలం స్త్రీలే కర్తలని, అవి జోలపాటలూ, సంసారి సంబంధి అయిన మరికొన్ని పదాలూ.

ఈ సంసారానికి సంబంధించిన వాటిలో సామాన్య సంసారి జీవితం విస్పష్టంగా విదితమౌతుంది. తెలుగు సంసారంలో తల్లి, తండ్రి, కూతురు, అల్లుడూ, కొడుకు, కోడలు వీళ్లకున్న స్థానం ఎటువంటిది? ఎవరిది రాచరికం? ఎవరిది కొత్తరికం? అనే సమస్యలకు జవాబులు దొరుకుతవి.

సంసార శకటానికి స్త్రీ పురుషులు రెండు చక్రాలు. అయినా ఈ గీత వాఙ్మయంలో స్త్రీలకున్న ప్రాముఖ్యమూ, ప్రాబల్యమూ పురుషుడికి లేదు. ఆవిడ బిడ్డగా, కోడలుగా, భార్యగా, తల్లిగా, అత్తగా సంసారరంగంలో విశ్వవిహారం చేస్తుంది. ఆరితేరిన అనుభవశాలిగా, అన్నిరంగాల్లోనూ, తన్ను నిరూపించుకుంటుంది. మగవాడి విషయం అట్లా కాదు. అతడు బాల్యంలో మాత్రమే గోముగా లాలించబడతాడు. బాల్యదశ గడచిన పురుషుడికి ఈ పాటల్లో అంతగా స్థానం ఉండదు. ఆ బాల్యంలో నైనా, ఆ ముచ్చట అతడికి జరగడం, తల్లికి మగపిల్లలమీద మోజు జాస్తిగా ఉండడం వల్లనేమో!

ఇటువంటి సంసారాల్లో ఆడబడుచులు హంసలు; చిన్నకోడళ్ళు చిలకలు; పావురాలు బాలపాపలు; కొత్తకోడళ్ళు కోయిలలు.

    "చిలకల్లు చిలకల్లు అందురేకాని
    చిలకలకు రూపేమి పలుకులేకాని!"

అని ఒక ఇల్లాలు ప్రశ్నించుకుంటుంది. ఆవిడకు చిలకలో అందమేమీ కనిపించదు. కాకపోతే దానికి పలుకు సొగసు ఉన్నది. ఇంతమాత్రమేనా మా చిన్నకోడలికి పలుకుతోపాటు అన్నీ ఉన్నవని ఆ ఇల్లాలు గర్వపడుతుంది. ఆ భావనలో అసలు చిలకలని త్రోసిరాజని "చిలకల్లు మా ఇంటి చిన్నకోడళ్ళు" అని సృష్టికర్త మీదికే సవాలు తీస్తుంది. అట్లా

    "హంసలకు రూపేమి ఆటలేకాని
    పార్వాలకు రూపేమి పాటలేకాని
    కోయిలలకు రూపేమి గొంతులేకాని"

అని నిరసించి

    "హంసల్లు మాఇంటి ఆడబడుచుల్లు
    పార్వాలు మాఇంటి బాలపాపల్లు
    కోయిల్లు మా ఇంటి కొత్తకోడళ్ళు"

అని నిర్ధారిస్తుంది. ఆ విధంగా ఆ సంసారమొక పూలరథం.

ఇక తల్లిగా స్త్రీకి చక్కని బాధ్యత ఉన్నదని నిరూపిస్త వీపాటలు. ఆవిడ పిల్లల్ని లాలిస్తుంది. గోముగా పెంచుతుంది. ఉయ్యాలలో ఊచుతూ తన మనోభావాల్ని ఆ హృదయంలేని పసికూనతో చెప్పుకుని మురుస్తుంది. తన బిడ్డనుగూర్చి అడిగినవారికీ, అడగనివారికీ చాటుతుంది. అందులో ఆవిడకు ఆడపిల్లలమీదకన్న మొగపిల్లలమీద మోజుహెచ్చు. కాబట్టే,

    "కొడుకుల కననివాళ్ళ కడుపేమి కడుపు"

అని నిశ్చలంగా ఒకగిరి గీచుకుంటుంది. ఇట్లాంటి కొడుకు పక్షపాతం చాల ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. ఒక ఇల్లాలికి వాంఛనీయాలు చాలా ఉంటవి. చూడండి: అందులో ముఖ్యమైనవి ఇవి,

    "తింటేను తియదోసపండు తినాలి
    కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి
    అందితే అన్నతో వియ్యమందాలి
    ఆడితే వదినతో జగడ మాడాలి."

అటువంటి కొడుకులకోసమై గొడ్రాళ్ళంతా సింహాద్రి అప్పన్న గుళ్ళముందు ప్రాణాచారం పడతారు. "కొమాళ్ల నియ్యమని కోరిపడతారు" అందుకు లంచంగా దేవుడికి,

    "గుడిదిరుగు వస్త్రమ్ము గుమ్మడిపండూ
    దాగళ్ళవడపప్పు దమ్డిబెల్లాలూ."

అర్పిస్తారు. అంతకష్టపడి కొడుకును కన్న బాలెంతరాలికి తోటిస్త్రీమండలిలో గౌరవం అతిగా జరుగుతుంది. చూడండి.

    "గోరింట పువువంటి కొడుకు నెత్తుకొని" --

బాలింత ఒకతి బావికి నీళ్ళకువచ్చెనా? ఆ వచ్చినదాని చుట్టూ చేరి అమ్మ లక్కలు విరగబడి చూస్తారు. ఏదేది బాలింత ఎంత చక్కనిది? అని చోద్యాలు పోతారు. తరువాత వారిలో

    "మాసిన్న పటుచీర మణవలకు పసుపు
    కళ్ళాది కాటుకా పళ్ళాది ఎరుపు
    ఆవాడ బాలింత అబ్బాయి తల్లీ!" --

అని అబ్బాయి తల్లిగాబట్టి అన్నట్లు ధ్వనించే గౌరవసూచకమైన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ చెప్పుకుంటారు.

ఇటువంటి కొడుకును కన్న తల్లి వాడిని ఎట్లాపెంచుతుంది అనేది ప్రశ్న. కిందవద్దురా నెత్తిమీదనడువు అన్నట్లుగా పెంచుతుందని మనం చప్పున ఊహించ వచ్చు. ఆ ఊహను బలపరిచే ఉదాహరణలు కొల్లలు --

ఆ తల్లికి వాడు ఒక దీపం. వాడి మాట మంచిగంధం కంటె చల్లన. చూడండి --

    "ఇంతింత దీపమ్ము ఇల్లెల్లవెలుగూ
    ఈశ్వరుడు చందమామ జగతెల్లవెలుగూ
    గోరంతదీపమ్ము కొండలకు వెలుగూ
    మాడంత దీపమ్ము మేడలకువెలుగూ
    మాఇంటి అబ్బాయి మాకళ్ళవెలుగూ"

అంటే అటు కృష్ణుడికీ ఇటు ఈశ్వరుడి తలమీదవెలిగే జాబిల్లికీ, ఆ తల్లి దృష్టిలో ఆవిడకొడుకు ఏమాత్రమూ తీసిపోడు. ఇంకా వాడినిచూస్తే చిలుక లాడుతవి హంస లాడుతవి పావురా లాడుతవి.

    "వీథి నెందరు ఉన్న విసర దేగాలి
    రచ్చనెందరు ఉన్న రాదమ్మవాన."

వాడు వీథిన నిల్చుంటే ఆ తల్లికి విసిరేదీ కురిసేదీ --

    "మొగలిపువ్వులగాలి, ముత్యాలవానా"

ఇక ఆవిడ, పిల్లవాడికి జోలపాడుతూ--

    "ఏడవకు ఏడవకు వెఱ్ఱినాతండ్రీ
    ఏడిస్తే నీకళ్ళు నీలాలుకారూ"

అని విచారిస్తుంది.

    "నీలాలు కారితే నే చూడలేను
    పాలైన కారవే బంగారుకండ్లా!"

అని అర్థిస్తుంది.

తన కొడుకుకు సేవచెయ్యమని సృష్టిలో తానెరిగిన జీవజాలానికంతటికీ ఆనలు పెడుతుంది - ఆ సేవ విశిష్టంగా ఉండవలెనంటుంది.

    "పిల్లిరావే పిల్లి పిల్లలతల్లీ
    పల్లేరు ముళ్ళలో పాలిచ్చిపోవే!"

అన్న తల్లి ఊహలో దానిపిల్లలకు పాలుపోసి అది పనులకు పంపవలె; తన బిడ్డకు పాలుపోసి ఆడుకో పంపవలె.

ఇంకా ఆవిడ దృష్టిలో ఒకరి అందం తనకొడుకు అందం ముందు లొచ్చు.

    "పిల్లెమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లూ
    అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లూ"

అని పాడుతూ అటు కొడుకును ఉబ్బిస్తుంది. ఇటు తాను మురుస్తుంది. వాడి అతి అందగాడాయెను. వాడి చిన్ననాటి చిరుమొగం చూచి,

    "సిగ్గుపడి చంద్రుడు పొడవజాలడు"

వాడు పుట్టినపుడు తల్లి ఊహలో

    "స్వాతివానలు కురిసె సముద్రాలకడనూ
    పాలవానలు కురిసె బంధువులఇండ్లా"

వాడు ముంగిల్లు ఆడుకుంటే

    "ముంతమామిడనీ ముసిరె చిలకల్లు
    పండుమామిడనీ బ్రమిసె చిలకల్లు
    వట్టుమామిడనీ వచ్చె చిలకల్లు" -

ఆ తల్లికి కొడుకు అంతేకాదు. వాడు నిద్రపోవడానికి కృష్ణుడు జోలపాడితే బ్రహ్మ జోకొట్టాలి. భద్రకాళి పాలిస్తే శివుడు నిద్రపుచ్చాలి. అట్లా ఆ ఇల్లాలి గారాబం పట్టికి దేవతలూ సేవకులే.

ఇక తల్లి ఊహించే వాడి అలంకారాలన్నీ చిత్రవిచిత్రంగా ఉంటవి. బాగా అలంకరించి కొడుకుని చల్లగాలికి తిరిగిరమ్మని పంపుతుంది. వాడు ఏటిగట్టున వెళ్తుంటాడు. ఆ గట్టుమీది చెట్లు గాలికి అల్లాడుతుంటవి. ఆ కదలికకు అబ్బాయి ధరించిన గొలుసులు అల్లాడుతవి. బంగారు తలపాగ అంచులల్లాడుతవి. అప్పుడు వాడు గాలికి చెదిరిన మేఘశకలంగా ఉంటాడుట. ఇక తల్లి వాడి అలంకారాల విషయాల్లో అందరినీ పురమాయిస్తుంది.

    "తేరె మా అబ్బాయికి ముత్యాలచుట్టూ
    ముత్యాలచుట్టుకీ మూడురేకల్లూ
    రత్నాలచుట్టుకీ రావిరేకుల్లూ"

దానికి

    "వజ్రాలు తాపిరీ వాడిమామల్లూ
    కెంపుల్లు తాపిరీ వాడిబాబుల్లూ" -

దీనిబట్టి ఇంకొకవిషయం అబ్బాయికి తండ్రితోనేకాక మేనమామలతో ఎక్కువబంధం కట్టిపెడుతుంది తల్లి. "అందితే అన్నతో వియ్యమందాలి!" అనేది స్త్రీ వాంఛించే వాంఛలలో ఒకటని ఇందాక చెప్పుకున్నాం. అందుకని ఈ పాటల్లో మేనమామల ప్రసంగాలు తరుచూ వస్తూ ఉంటవి. వారిని వర్ణిస్తూ,

    "చెవి చెవికి బారడే పోగుల్లవారూ
    అంచుపంచెలవారు అంగీలవారూ
    పట్టుపంచెలవారు పాగాలవారు
    పెసరకాయలవంటి పెదిమల్లవారూ
    కందికాయలవంటి మీసాలవారూ" -

అనిచెప్పి "వారు మామల్లు మేనమామల్లూ" అని ఠీవి నొలకబోస్తుంది. అదే కూతురి మామగారిని, అనగా వియ్యంకుడుని పాడేటప్పుడు ఆవిడ ధోరణి వేరు. అక్కడ ఆమె ఎంత ఎగతాళైనా వేసి హాస్యాన్ని చిలకరిస్తుంది. చూడండి!

    "అమ్మాయి మామల్లు ఎటువంటివారూ
    చేపగంపలవద్ద చెయిజాచువారూ
    గుడ్డిగుఱ్ఱాన్నెక్కి గోజారువారూ
    పందిపిల్లా నెక్కి పరుగెత్తువారూ"

ఇట్లా అనడానికి కారణం ఆ"మామ" తన తోడబుట్టినవాడు కాడు కనుక. ఏమంటే ఆకాలంలో ఎదురు మేనరికాలు నిషిద్ధం - అన్న కూతుర్ని తనకొడుక్కి చేసుకుంటుంది. లేదా తనతమ్ముడికి కూతుర్నిచ్చి చేస్తుంది. అంతేకాని అన్న కొడుక్కి తనకూతురిని ఇవ్వదు.

అటువంటి మామలదగ్గర తనకొడుక్కు ఎక్కడలేని అధికారం. వాడంటే వాళ్ళు బెదరాలి. అల్లుణ్ణి మంచి చేసుకోవడానికి అవీ ఇవీ తెస్తూ ఉండాలి. తెచ్చినా తేకపోయినా తల్లిమాత్రం,

    "పెదమామ తెచ్చాడు పచ్చల్లదండ
    నడిమామ తెచ్చాడు నాగబంధాలు
    చినమామ తెచ్చాడు చిలకల్ల తొట్టి" -

అని పాడడానికి ముచ్చట పడుతుంది.

పెద్దవాడై ఆ అబ్బాయి మామగారింట పిల్లకోసం కాచుకొని ఉంటాడు. పూవులు తస్కరిద్దామని దొంగలు తోటకు కాపువేసినట్లు అబ్బాయిమామ ఇల్లు

"కానకుండా పుస్తె కట్టేద" మని కాస్తాడు. తీరా ఆ మామలు పిల్లనివ్వ వచ్చినపుడు మాత్రం బిగిసి కూర్చుంటాడు. అప్పు డామామ వచ్చి "మాపట్టి నిచ్చేము దిగవయ్య రాజా" అని బ్రతిమలాడుకోవలె. వాడెంత అల్లరి చేసినా అందరూ సహించాలని ఆతల్లి కోరిక.

    "ఆడంగ ముద్దమ్మ పాడంగ ముద్దూ
    అల్లరీ అబ్బాయి అందరికి ముద్దూ"

అని వాడిని ఆవిడ సమర్ధిస్తూ ఉంటుంది.

ఇంత శ్రద్ధతో చూచే తల్లిపని

    "ఉంగరమ్ములు పెట్టి ముంగురులు దువ్వి"

వద్ద పెట్టుకుని ముద్దులాడేవరకే. తండ్రిమాత్రము

    "పలకబలపము లిచ్చి పద్యాలు పాడి"

సరస పెట్టుకొని చదువు నేర్పుతాడు - చెప్పినవి వినక మారాము చేసినట్లాయెనా తండ్రి దయచూపడు. చిన్న దెబ్బలన్నా తగిలిస్తాడు. కాని తల్లి మెల్లిగా

    "చదువంటె అబ్బాయి మొండికేశాడు
    బద్దె పలుపా రావె బుద్ధిచెప్పాలి" -

అని బెదిరిస్తుంది. అదీ చాలదేమోనని మూణ్ణాళ్ళ ముచ్చటగా పరిణమించబోయే కూతురు చదువును మెచ్చుకుంటూ కొడుకు వినేటట్లు

    "చదువంటె అమ్మాయి సంతోషపడును
    అగసాలి రావయ్య నగలుచెయ్యాలి"

అని పురికొల్పుతుంది. అంతటితో ఆగక,

    "చదువుకో నాయనా చదువుకో తండ్రి
    చదువుకుంటే నీకు సౌఖ్య మబ్బేను" -

అని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. వాడు చిన్నబుచ్చుకొని యేడ్చె నట్లాయెనా,

    "ఎవ్వరే మా తండ్రి నేమి అన్నారూ
    వెలలేని వీథిలో ఏనుగన్నారూ
    మత్తేభమన్నారు మావాడలోనూ" -

అని వినకపోతే ఏడ్చే అబ్బాయికి ఎఱ్ఱావుపాలు పోస్తానంటుంది. నవ్వితేనే నల్లావుపాలు. నల్లావుపాలు అన్ని ఆవులకంటే రుచి అని ప్రతీతి.

తల్లి దృష్టిలో వాడు ఒకరాజు. "ఈ ఇంటి పేరేమి? ఇందరి పేరేమి" అని ఎవరైనా తన్ను ప్రశ్నించి నట్లాయెనా,

    "ఈ ఇల్లు మాదమ్మ వీరు మావారు
    దంతపూ తలుపుల్లు దరవాజులు మావి"

అని చెప్పినతల్లి, ఆ సంపత్తుకు స్వామిగా తనభర్తను చెప్పదు. తానెవరిని ఉయ్యాలలో చూస్తూ పాడుతున్నదో వాడే దానికి రాజు కావాలి కాబట్టే "ఈరచ్చ కూర్చున్న రాజు మాబాబు" అని గర్వంగా చెప్పుకుంటుంది.

ఊరి వారందరూ తనబిడ్డను తను చూచినట్లే చూస్తారని ఆమె నమ్మకం. వాడికి దారినపోయేవారు బహుమతు లిస్తారు. కంసాలి మువ్వలు కడ్తాడు. నగల వర్తకుడు రాళ్ళమువ్వలు కడ్తాడు. ఇదంతా "కలవారి పట్టని" గారాములన్నీ కూర్చివారు చేసేచేష్టలు.

తల్లి కెప్పుడూ తనబిడ్డ లక్ష్మీ సంపన్నుడు కావాలని ఆశ. కాని ఆవిడనోరు తెరచి నీవు ధనవంతుడివి కావాలి నాయనా అనదు. కాని ఆ ఉద్దేశాన్ని చిత్రవిచిత్రంగా వెలువరిస్తుంది. ఆవిడను శ్రీలక్ష్మీ వరలక్ష్ములు ఎవరిని పొందమంటావమ్మా అని అడగవచ్చేరట. వస్తే ఆమె,

    "తూర్పు ఇంట్లో ఉన్న పెదబాబును పొందు
    పడమ టింట్లో ఉన్న చినబాబును పొందు
    దక్షిణ ఇంట్లో ఉన్న బుచిబాబును పొందు
    ఉత్తర మింట్లో ఉన్న చిటిబాబును పొందు"

అని అత్తగారైననట్లుగానే ఆజ్ఞలు పెడుతుంది. ఈ విధంగా తల్లి తనకొడుకుని చూచేతీరు అద్వితీయం.

అట్లా అని ఆవిడకు కూతురిమీద ప్రేమ ఉండదనికాదు. అదెట్లా లేకుండా పోతుంది? తాను ఒకరి కూతురేనాయె! కాని అక్కడ ఆమె అనురాగ ప్రకటనకు పరాయి ఇంటికి పోయేపిల్ల అనే దిగులు అడ్డువస్తుంది. దానితో ఆ కొత్తచోట ఎట్లా మెలగవలెనో ఎన్ని జాగ్రత్తలు కలిగి ఉండవలెనో ఆ విధంగా కూతురిని తయారు చెయ్యవలెననే జిజ్ఞాస కలుగుతుంది. కాబట్టి ఆమె గురువు. కుమార్తె శిష్య - ఈ విధంగా కొడుకువిషయంలో ప్రకటించే అంతగోము ఈ సంబంధములో ప్రకటిత మవడానికి వీలు చిక్కదు.

కూతురు పుట్టిననాటినుండి ఇంటెడు చాకిరీ చెయ్యడంలో తరిఫీదు కావలె. వంటవండడంలో, చేయెత్తి పోటువెయ్యడంలో, ఎద్దడినీళ్ళు తేవడంలో, ఆఖరికి ఏరుపిడకలు సంగ్రహించుకోవడంలో దానికి నేర్పుకావలె. ఇవన్నీ అత్తింటి కోడలైనప్పుడు ఆ పిల్లను అత్తగారి ఆగ్రహంనుండి కాచుకు వచ్చే సాధకాలు.

కాబట్టి ఒక చెల్లెలు అన్నను వస్తు వాహనా లడగదు. చీరసారె లడగదు. కాగా -

    "నా చేతి రోకళ్ళు నల్లరోకళ్ళు
    చేయించు అన్నయ్య చేవరోకళ్ళు
    వేయించు అన్నయ్య వెండిపొన్నుల్లు"

అని అర్థిస్తుంది. అనగా ఈనాడు ఒక వీణెకు, ఒక ఫిడేలుకు ఉన్న గౌరవం ఆనాడు రోకళ్ళ కుండేది కాబోలు. ఇక ఆమె ఆరోకలితో సువ్వని ఒకపోటు వేస్తే

    "దిక్కులు పిక్కటిల్ల సూరన్న కదులు"

స్పృష్టం గాదు.

చిన్నపిల్లగా స్త్రీ పొందే సరదాలలో వదినెలతోనూ, బావలతోనూ సరసాలాడడం ఒక దొడ్డసరదా. అవి చాలసార్లు హద్దులు మీరుతుంటవి. అయినా ఎవ్వరికీ కోపం రాదు. ఒక పిల్ల తన మరదిని ఇట్లా మర్యాద చేస్తానంటుంది -

    "మేనత్త కొడుకమ్మ నామేన మరిది
    నన్ను చూడావచ్చి పాతర్లో పడెను
    పాతర్లో పడ్డవాణ్ని రోకళ్ళ కుమ్మి
    మూలమంచంవేసి ముంత పొగ బెడుదు
    కందకడిగిన నీళ్ళు కాళ్ళ కందించి
    తవ్వకడిగిన నీళ్ళు దాహాని కిస్తు"

ఇంకొకచోట వదిననూ, బావనూ కలిపి

    "వదినగారూ మీరు వాసి కలవారూ
    వండబోయినచోట కుండ నాకేరు
    బావగారూ మీరు ప్రతిభ కలవారూ
    నిండిన సభలోన పిండి బొక్కేరు"

అని ఎగతాళి చేసి అంతకూ తృప్తిలేక -

    "చక్కిలాల బుట్ట చంకపెట్టుకుని
    సభలోన మాబావ సంగీతపరుడు"

అని చెణుకు విసురుతుంది.

పెళ్ళయిన తరువాత ఆవిడ ఇంటికి అన్నలు వస్తే కూర,

    "అరటి కాకరకాయ అరచందపప్పు"

తమ్ములు వస్తే

    "గుత్తి చిక్కుడుకాయ గుమ్మడికాయ"

అదే బావలు మరుదులు వస్తే

    "మంచాన నల్లుల్లు గోడబల్లులూ
    వెలుగులో వేటాడిన తొండలున్నూ"

అత్తా ఆడబిడ్డల అఘాయిత్యాలే అస్సని ఒక పోటువేస్తే

    "ఆకాశం తల్లడిల్లు చంద్రన్నకదులు"

ఇంకా ఆమెకు దంపు.

వదినెల్లు మరదల్లు వాదించినట్లు, పుట్టిల్లు ఎంత దూరమున్నా నాలుగడుగుల దూరమే ఎట్లాగో, నల్తూము బియ్యమున్నా ఆవిడకు నాలుగు వాయిలే ఆ పిల్ల దృష్టిలో.

"చేఫలము లే నోరిమాట" మాట ఎట్లా కాదో "చేయెత్తి వేయని పోటు" పోటు అట్లా కాదు. ఇదే ప్రజ్ఞ ఆడపిల్లకు వంటచెయ్యడంలో కూడా ఉంటుంది. ఆమెకు "వంట వంటనగానె వంటెంతసేపూ! - ధాన్య రాసులమీద చెయివేసినట్లు." అబ్బాయి అందలాలు గుఱ్ఱాలూ కోరితే, అమ్మాయి పసుపూ కుంకుమా కోరుతుంది. పిల్లలతల్లి అయిన తరువాత ఉయ్యాలలమోజు ఆవిడ కెక్కువ. కుంకంమీద ఉన్న సరదా కొద్దీ ఆడపిల్ల -

    "ఊరికే కుంకమ్ము అమ్మ వచ్చింది
    కొంగు మాడలు పోసి కొనరె కుంకమ్ము
    చేతి మాడలు పోసి చేయించు బరిణె
    గోల్కొండ తీసుకెళ్ళి గొలుసు వేయిస్తు
    పాలకొండ తీసుకెళ్ళి బందు లేయిస్తు"

అనుకుంటుంది. ఇటువంటి సరదా లీనాడే ఉంటే ఏమిటమ్మా నాడం దొరికిందని గుఱ్ఱాన్ని కొనమంటావా అని ఎగురుతారు పెద్దవాళ్ళు. పసుపుకు ఆ స్త్రీల చేతుల్లో చక్కని గౌరవం ఉన్నది. ఒక్కొక్క దశలో ఉన్న స్త్రీ రాచుకుంటే ఒక్కొక్క విధంగా అది శోభలీనుతూ ఉండేది ఆ కాలంలో.

    "నీలాటి రేవంత నిగ్గుదేలిందీ
    ఏచేడె కడిగింది ఈ చాయపసుపు"

అన్న ప్రశ్నకు

    "పచ్చిపసుపు బావల్ల మరదలాడింది
    అణప్పసుపు అన్నల్ల చెల్లెలాడింది
    కొట్లపసుపు కొమాళ్ళ తల్లి ఆడింది
    బావల్ల మరదలే తాను అమ్మాయి
    పణతి ఆడిని పసుపు బంగారుచాయ
    అన్నల్లచెల్లెలే తాను అమ్మాయి
    అతివ ఆడిన పసుపు ఆవపూచాయ
    కొమాళ్ళ తల్లియే తాను అమ్మాయి
    గొంతి ఆడిన పసుపు గోవపూచాయ"

అని జవాబు వస్తుంది. ఇక్కడీ వర్ణనలు చక్కనివీ నిరాడంబరమైనవిన్నీ. అసలు ఈ వాఙ్మయంలో వర్ణనలన్నీ ఇట్లాగే ఉంటవి. చూడండి! తల్లి తన కూతురిని గూర్చి చెప్పుకుంటూ,

    "చిక్కుడూపు వ్వెరుపు చిలకము క్కెరుపు
    చిగు రెరుపు చింతల్ల దోపం డెరుపు
    రక్కెసపం డెరుపు రాగిచెం బెరుపు
    తా ఎఱుపు అమ్మాయి తనవారిలోన"

అని వర్ణిస్తుంది. తన కూతురితోఉపమించినవన్నీ రోజూ తనదృష్టిలో పడే ఎఱ్ఱని వస్తువులు. తన కూతురు ఎఱ్ఱగా ఉంటుంది ఆ సత్యం అందరికీ తెలియాలే గాని ఎట్లా చెప్తే ఏం? కాగా ఆమెకు నిత్యమూ వ్యవహారంలో ఉండే కొన్ని పదాలకన్నా ఎక్కువ తెలియవు. కాబట్టి మెరిసిపోతున్న తన కూతుర్ని శంపాలతాభ అనలేదు, ఉషాదేవత అనలేదు. కాని ఆవిడ రాగిచెంబుకూ, రక్కెస పండుకూ ఉన్న వర్ణం తనపిల్లకు ఉంటే అందంగానే ఉండవచ్చునని ఊహిస్తుంది. అట్లాగే చెప్పుకుంటుంది.

ఇక తల్లి తన కూతురికి ఎంతసేపూ చీరలూ నగలూ కావాలని ఆరాటపడుతుంది.

    "చిన్న నా అమ్మన్న చీర కేడిస్తే
    నెయ్యవోయి సాలివాడ నేత్రంపుపట్టు
    వెయ్యవోయి కంసాలి వెండి జల్తారు" -

అని వారికీ వీర్కీ పురమాయిస్తుంది. ఆ తయారైన చీరను తన కూతురు వెయ్యేళ్ళు కట్టాలని ఆతల్లి ఆశ. ఇట్లాగే గాజుల సరదా ఒకటి.

    "పట్నం నుంచి వచ్చాయి పచ్చగాజుల్లు
    పచ్చన్న మాచిన్ని అమ్మి చేతుల్లు
    ఊరు తిరిగి వచ్చాయి ఉత్తగాజుల్లు
    గుత్తాన్న మాచిన్న అమ్మిచేతుల్లు" -

అని తల్లి కూతురి చేయి మెచ్చుకుని

    "చిన్నారి పొన్నారి గాజుల్లసెట్టి
    తేరె మా అమ్మాయికి తేనెగాజుల్లు
    పాడుతూ తొడిగిస్తు పచ్చగాజుల్లు
    నవ్వుతూ తొడిగిస్తు నల్లగాజుల్లు
    ఏరేరి తొడిగిస్తు ఎఱ్ఱగాజుల్లు" -

అని మోజుపడుతుంది.

ఏమీ తెలియని పసికూన ఉయ్యాలలో పాల కెడ్చినా అదుగో నమ్మా వారు నీకు బుట్టెడు నగలు తెస్తున్నారు. ఇదుగోనమ్మా వీరు నీకు పెట్టెడు చీరలు తెస్తున్నారు అని సముదాయిస్తుంది. అట్లా తెచ్చేవారిలో తన పుట్టినింటి తరఫు వా రెక్కువ. వాళ్ళు పిల్లను మెచ్చి ముత్యాలు గుప్పించిన నత్తు చిలకలు వేయించిన చీర, రత్నాలు తాపించిన రవికలు పంపుతారు. వాళ్ళ ఆశ అంతా ఆ పిల్లమీద. తల్లి ఊహకూడ ఎప్పుడూ తన తమ్ముణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలని ఉంటుంది. అట్లా కొత్తగా పెళ్ళయిన ఒక కూతురు -

    "అలసందపప్పొంది ఆవునెయి కాచి
    అమ్మ నీ తమ్ముణ్ణీ ఏపేర పిలుతు?"

అని తల్లి నడిగితే, ఆవిడ

    "శంభులింగమ్ము లెమ్మి జపమూర్తి లెమ్మి
    నందికేశవలెమ్మి నా ప్రాణ విభుడా!"

అని పిలువమంటుంది. తల్లి తండ్రి తాత కూడా మనుమరాలితో మనుముకు తయారవుతారు

    "ఊచకర్రోచేత ఉగ్గమోచేత
    ఊగుతూ వచ్చిన తాతెవ్వరమ్మ"

అని ఒక ముదుసలిని చూచు పిల్ల తల్లి నడిగితే, దానికి ఆ తాత

    "మానిక నిండాను మాడలోసుగుని
    మనుమరాలా నిన్ను మనుమడుగ వస్తి" -

అని సరసమాడుతాడు. ఈ విధంగా తల్లిపాడే పాటల్లో తన వారి ప్రసక్తే గాని, భర్తవైపువారి చుట్టరికం లేకుండా ఉంటే ఇంటికోడలూ ఆడపడుచూ కలిసి హాస్యరసస్పంది అయ్యే ఇటువంటి సంబంధంతో ఆ ఇంటిని స్వర్గం చెయ్యవచ్చు.

కాని ఈ వాఙ్మయంలో అత్తాకోడలూ కలిసిమెలిసి పూసల్లో దారానికిమల్లే ఉన్నట్లు ఎక్కడా కనిపించదు. ఎప్పుడూ అత్త కోడలిమీద కారాలు మిరియాలు నూరటం, కోడలు చాటున మాటున గ్రుడ్లనీరు గ్రుడ్లకుక్కుకుంటూ ఈ శని ఎప్పుడు విరగడవుతుందా అని దణ్ణాలు పెట్టడం పరిపాటి. అత్త కోడల్ని సాధించ లేని మేదకురాలైతే, కోడలే తిరిగి అత్తను సాధిస్తుంది. వారిద్దరిమధ్యా ఎప్పుడూ పులిమేకా సంబంధం - అత్త అడుగుతుంది కోడల్ని,

    "కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
    పచ్చిపాలా మీద మీగళ్ళు ఏవి?
    వేడిపాలా మీద వెన్నల్లు ఏవి?
    నూనెముంతల మీద నురగల్లు ఏవి?"

దానికి కోడలు ఎదురుగా సమాధానం చెప్పదు. కళ్ళువప్పజెప్పి ఊరుకుంటుంది. కాని సందు దొరికితే వారినీ వీరినీ పిలిచీ

    "ఇరుగు పొరుగులార ఓ చేడెలారా
    అత్తగా రారళ్ళు చిత్తగించండి
    పెత్తనం లాగేస్తే పేచీలు పోను" -

అని ఎత్తి పోస్తుంది. అంతే కోడలూ స్వతహాగా మెత్తనిది కాదు. కాకపోతే అత్త అనే శక్తికి భగవంతుడు లొంగి ఉండమన్నాడని ఆవిడ నమ్మకం. కాబట్టే తన అత్త తన మీద చెలాయించిన అధికారం తన కోడలిమీద చూపడానికి ఎదురు చూస్తుంది. ఈ కత్తికి రెండు వైపులా పదును. ఇది ఒక చక్రం. కాబట్టే -

    "అత్తలేని కోడ లుత్తమూరాలూ
    కోడలూ లేనత్త గుణవంతురాలూ!"

అనే పాడుభావన సత్యమై కూర్చున్నది.

ఒక దొడ్డకాలంలో అత్తవచ్చి కోడలికి దణ్నం పెట్టిందట. ఇక కోడలు దీవిస్తుంది.

    "చాలు చాలత్తయా చాలత్తగారూ
    నీకొడుకు వెయ్యిళ్ళ మొదలు కావాలీ
    నీ కోడలు పట్టంపురాణి కావాలీ" -

ఇంతటితో ఆగితే చక్కగానే ఉండేది. కాని చిగురు మాటగా,

    "నువ్వెళ్ళి పంచల్లపాలు కావాలి!"

అని ఊరుకుంటుంది. అత్తమీద కోడలికి కసి అంత. కాని అత్తగారిని ఆరడిపెట్టే కోడళ్ళకన్న అత్తగారింట తిప్పలు పడేవారే హెచ్చు.

అక్కడ అరణాలు లేవు, కట్నాలు లేవు అని వేధిస్తారు.

    "వేసంకాలం వచ్చె వలువల్లు చిరిగె
    వనిత నీ పుట్టింటి వారేలరారు
    మారుకాలం వచ్చె మడతలూ చిరిగె
    మగువ నీ పుట్టింటి వారేలరారు?"

అని ఎత్తిపొడుస్తారు. ఇంటెడుపని చేసి అడుగులకు మడుగులు ఒత్తుతున్నా అత్త

    "దంచకా నలగవే ధాన్యరాసుల్లు
    వంచకా వంగరే వనిత కోడళ్ళూ!"

అని ప్రచారం చేస్తుంది.

చెల్లెలిని పుట్టింటికి తీసుకుపోవాలని అన్నలు వస్తారు. వాళ్ళను చూచి సంతోషమే కాని వాళ్ళతో తనను పంపుతారో లేదో అని దిగులే ఆ కోడలికి. కాబట్టి ఆవిడ, కాళ్ళకూ నీరిచ్చి కన్నీరు నింపుతుంది. కాని,

    "ఎందుకూ కన్నీరు ఏల కన్నీరు
    తుడుచుకో కన్నీరు ముడుచుకో కురులు
    ఎత్తుకో పాపడిని ఎక్కు అందలము"

అని ఇంకా చెల్లెలు చలనం లేకుండా నిలుచుని ఉంటే, సందేహించి,

    "మీ అత్తమామలకు చెప్పిరావమ్మా!"

అని ప్రోత్సహిస్తారు. ఇక ఆవిడ అప్పుడు బయలుదేరుతుంది.

    "కుర్చీపీటమీద కూర్చున్న అత్తా
    మా అన్న లొచ్చారు మమ్మంపుతారా?" -

అని అడుగుతుంది. దానికి "నేనెరుగ మీ మామ నడుగూ" అని సమాధానం. ఇట్లాగే మామ నడగమని అత్తా, బావ నడగమని మామా, వదిన నడగమని బావా, ఎవరికి వారు తప్పించుకుంటారు. మీ అన్న లెవరెరుగు, మిమ్ము లెవరెరుగు? అని నిర్లక్ష్యాన్ని చూపుతారు.

పుట్టినింటి మీద ఆడపిల్లలకు ఆశ ఎక్కువట!

    "కాశి కెడదామంటే కదలవే కాళ్ళు
    ఢిల్లి కెడదామంటె తిరగదే మనస్సు
    దూరాన పుట్టింటి కెడదాము అంటే
    నా కాళ్ళు పన్నినా రథములై నడచు
    నాచేతు లుయ్యాలు చేరులై దాగు"

అని ఆమె అనుకుంటుంది. అటువంటి పుట్టింటి ప్రయాణానికే విఘాతం కలిగినప్పుడు స్త్రీ,

    "ఎన్నెన్ని జన్మాలు ఎత్తినా కాని
    ఈ ఆడజన్మమూ ఇక నెత్తరాదు
    ఆడజన్మా ఎత్తి అడలుటా కంటే
    అడవిలో వృక్షమై అట్లుంటె మేలు!" -

అని చింతిస్తుంది.

అట్లాగని అత్తింటికోడలు అలిగిపడుకుంటే "అలకల్లు తీర్చేది ములుకల్ల కఱ్ఱ" - ఇది కోడలుజీవితం.

ఆ దశ దాటినభార్యబ్రతుకు చక్కనిదే. ఆవిడ అక్కడ అన్నీ సమర్థించు కోగలదు. భర్తప్రమేయం లేకుండా ఇల్లు సరిదిద్దుకోగలదు. దానికీ దీనికీ అనక చాలావరకు భర్తపై అధికారం చెలాయించగలదు. వారిద్దరికీ మధ్య అప్పుడప్పుడు అలుకలు సాగుతవి. అప్పుడు భార్య భర్తతో మాట్లాడదు.

    "వంకాయ వండాను వరికూడు వార్చాను
    తినమనీ చెప్పవే తడికా తడికా!" -

అని భర్త వినేటట్లు మధ్య నిర్జీవవస్తువుతో సంభాషణ సాగిస్తుంది. దానికి సమాధానంగా అతడు,

    "వగలాడి మాటలకు వళ్ళంత మండింది
    వద్దనీ చెప్పవే తడికా తడికా!"

అని తిప్పి కొడతాడు. దానితో ఆ కోపం పెరుగుతుంది. దానిని సహించలేక ఈసారి కొంచెం మెత్తబడేవంతు భర్తది. ఈ మారు అలిగేవంతు భార్యది.

    "పట్టుచీర తెచ్చాను పెట్టిలో పెట్టాను
    కట్టమని చెప్పవే తడికా తడికా!"

అంటాడు భర్త. దానితో చప్పున లేచి చీర చూచుకుంటుంది. కాని మూతి విరిచి,

    "చీర కంచులు లేవు చుట్టుచెంగులు లేవు
    వద్దనీ చెప్పవే తడికా తడికా!"

అని తన నిరసన తెలియజేస్తుంది. కాని తరువాత వారిద్దరికీ ఎట్లాగో ఒకట్లా రాజీ కుదురుతుంది. వారికీ ఇక ఆకోపాలు ఉండవు. తెల్లగా తెల్లవారినా భర్త నిద్ర లేవకపోతే, భార్య సరసంగా,

    "చుక్క తెల్లవారె తూర్పు తెలవారె
    బూరుగ పూచింది బారువనంలో
    కలువలచెర్లోకి నీళ్ళు చేరాయి
    కాళ్లు కడుగ మీకు వేళాయె లెండి!"

అని లేపుతుంది. ఆవిడ భర్తను ఉడికించాలని ఎప్పుడూ అతనిముందు తన వారిని పొగుడుతుంది. దానికి ఊరుకోక భర్తకర్మ చాలక,

    "అన్నల్ని పాడేవు తమ్ముల్ని పాడేవు
    నన్నేల పాడవే!"

అని అడిగెనే,

    "ఏమని పాడేది వెఱ్ఱిమాధవుడా!"

అని అమాయికతను నటిస్తూనే, నీవు వెఱ్ఱివాడవని వెక్కిరిస్తుంది.

ఈ పాటల్లోదే ఒక ఘట్టం. సీతారాముడూ తమతమవారితో దోవన వెళ్తుంటారు. కాని సీతకు చిరిదబ్బముళ్ళు కాలిలో విరుగుతవి. చుట్టూ ఉన్నవారు,

"తియ్యవోయి రామన్న తియ్యవోయి ముళ్ళు" అని ఆజ్ఞాపిస్తారు. రాముడు తీయడు.

    "ముళ్ళేల తీస్తును ఈ మూకలోన
    చెయ్యేల ఎత్తుదును చెల్లెళ్లలోన"

అని అభిజాత్యాన్ని వెలువరిస్తాడు. సీత అంతకన్నా గడుసరి. అందనిపండ్లు పుల్లగా ఉంటవనాలని ఆవిడకూ తెలుసు.

    "కాలేల ఎత్తుదును కలవారిలోన!"

అంటుంది. అప్పటికి రాముడిమీద సీతదే పైచెయ్యి. ఇట్లాంటి సరసాలు ఈ పాటలద్వారా బోలెడు విదితమౌతవి.

అటువంటి ప్రేమగల భార్య బిడ్డకు జోల పాడేటప్పుడు కూడా భర్తను మర్చిపోదు.

    "నిద్రపో బలభద్ర రాజకుమారా
    నిద్రకూ నూరేళ్ళు నీకూ నూరేళ్ళు" -

అని భర్తనుకూడా కలుపుకుని ఆశిషాలు కురిపిస్తుంది.

తన ఇంటి చుట్టాలు పక్కాలు రావాలని ఇల్లాలు ఎప్పుడూ ఆశపడుతుంది.

    "కాకమ్మ కుయ్యవే తరిమికుయ్యావే
    కుయ్యవే మాయింటి గుమ్మాలలోన!"

అని అర్థిస్తుంది.

    "వెళ్ళవే మావారి అరటి చెట్లకూ
    మెసలవే మావారి మల్లసాలల్ల!"

అని ఆహ్వానిస్తుంది. కాకి అరుపు చుట్టపురాకకు సూచనకాబట్టి ఆమె ఆశ చక్కనిదే.

భూమిగల ఇల్లాలైతే వానలు కురిపించమని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థన భక్తుడు భగవంతుడికి విన్నవించినట్లు కాదు. ఒక బంధువు మరొక బంధువు నడిగినట్లు.

    "వానదేవుడ నీకు వరస చెల్లెలిని
    వర్షాలు కురిపించు వరిమళ్లలోన"

అని దేవుడితో ఆవిడ వరసలు కలుపుకుంటుంది. లాలనలోనే కాన కోపం వచ్చినప్పుడు ఆమె శాపాలు పెట్టడానికీ సమర్థురాలే.

ఆ కార్యం జరిగే పక్షంలో,

    "వరుసగా నీవార్ని వరుసాడబోతే
    పురుషుడా నీసిరసు ధరణి కొఱిగేనీ
    కాని వార్నీ నీవు కారాడబోతే
    కాముడా నీ శిరసు కాటి కొరిగేనీ"

అని కోపోద్రిక్త అవుతుంది. ఇక వారి తుష్టినీ, నిష్కామ లబ్ధినీ గూర్చి ముక్తసరిగా చెప్పాలంటే వాళ్ళకు ఉండే కోరికలు చాలా కొద్ది. అయినా ఆశ పాశలులేని వారి సంసారం సజావుగా నడుస్తుంది. వరి అన్నం వండినా, చారు చేసినా, వారికి పండు, కూర, తాలింపు పెట్టుకున్న రోజు పర్వదినమే. వడ్లు దంచి కూలి తెచ్చుకునే ఇల్లాలు చూడండి ఎట్లా విలపిస్తుందో!

    "ఈవేళ మావడ్లు నలగవు కాబోలు
    వెలగపూడి సంతకు వెళ్ళవుకాబోలు
    ఏగాణి వెల్లుల్లి తేను కాబోలు
    ఎగరేసి తాలింపు పెట్టను కాబోలు"

ఆమెకు పరాయివారి ఎదుట జంకు ఉండదు. వాళ్ళనుండి సహాయం కోరడానికి ఆవిడ సందేహించదు.

    "వడ్లబత్తూడా ఓరియన్నా!
    వడ్డింపుకోసమని తెడ్డొక్క టియ్యి
    కమసాలి నాయన్న ఓరి నాయన్న!
    కమ్మని నేతిలోకి గరి టొక్క టియ్యి"

అంటుంది.

నీళ్ళు తేవడానికి ఏటికి వచ్చి వారావీరా అని కేకలువేసి

    "ఆవులూ కలవారి ఆడమనిషిని
    కోడెలూ కలవారి కోడల్నినేను
    మేకలూ కలవారి మేనకోడల్ని"

అని తనస్థితి చెప్పి -

    "బిందెత్తి పోవయ్య బిందెత్తిపొమ్ము"

అని ఎవరైనా సరే ప్రార్థించి పని సాగించుకుంటుంది.

ఈ విధంగా స్త్రీ అన్ని రంగాల్లోనూ ఉన్నది. ఆవిడ కూతురు, కోడలు, భార్య, తల్లి, చివరకు అత్త. ఈ పాత్రల శీలాలు ఒకస్థితిలో ఉన్న విధంగా మరొక స్థితిలో పొసగవు. అయినా వీటిని ఆవిడ ఒక్కొక్క దశలో అతినేర్పుగా నిర్వహిస్తుంది. తన శక్తిని సర్వతోముఖంగా విజృంభింపజేసి విశ్వవిహారం చేస్తుంది. కుటుంబాన్ని పదిముఖాల నుండీ కాచుకుని వస్తుంది.

ఇటువంటి స్త్రీ లేనినాడు మగవాడు ఏనాడో మూలపడి ఉండవలె. ఇక స్వాతంత్ర్యం వారు ఇచ్చేదేమిటి, వీరు పుచ్చుకునే దేమిటి?

చిగురుమాటగా స్త్రీ జీవితాన్ని ఆ జానపదుల మాటల్లోనే చెప్పాలంటే,

    "అడుచుకోను పొడుచుకోను ఆడవారివంతు
    కూర్చొని భోంచెయ్య మగవారివంతు!"

AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - pada vA~MayaMlO strI - nAyani kRiShNakumAri - Dr. Nayani Krishnakumari ( telugu andhra )