వచన సాహిత్యము వ్యాసములు యక్షగానము - డా. యస్‌ వి. జోగారావు

యక్షగానము - డా. యస్‌ వి. జోగారావు
ఏప్రిల్‌, 1975
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున ప్రచురితము
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ

ప్రస్తావన
యక్షులు - గానము
జక్కుల జాతి అనుబంధము
ప్రాచీనత - ప్రాధమికావస్థ
పరిణామము
యక్షగాన ప్రయోగము
ఉపసంహారము

ప్రస్తావన

నిచ్చలు పచ్చి బాలెంతరాలగు ప్రకృతి సవిత్రికి స్తనంధయుఁడైన ప్రాక్తన మానవుఁడా మాతృహృదయ మాధుర్యమును చూఱఁగొని కొట్టిన కేరింతయే మానవజాతి గానకళాభ్యుపాసనకు సత్సంకల్పమైనది. తనకంఠము నుండి వెలువడిన మధురస్వరములేవో తనకర్ణపుటములనేపడి మరలఁ దనలోనే బ్రవేశించి మాఱెలుఁగిచ్చినట్లు దన నాడీ తంత్రులలోఁ గలిగించిన కదలికయే యతని కరచరణములనుండి బహిర్గమించి నృత్యకళా సరస్వతికేటికోళ్ళెత్తినది. ఆటపాటల నపుడే ప్రవీణుఁడై నిరంతర వర్ధమానుఁడగు చుండిన మానవుని యనుకరణ ప్రవణశీలము, నందులో యంతర్భూతమైయున్న సృజన కళా కుతూహలము బొమ్మలాటకు, నాటక కళకును బురుడుపోసినవి. అతని సంతానమే ప్రపంచమున వివిధ ప్రదేశములలో శాఖోపశాఖలై విభిన్న కళాభిరుచులతో విరాజిల్లుచు వచ్చినది. ఒక్కొక్క జాతియొక్క భాష సాహిత్య స్థితికి వచ్చిన తరువాత నందుఁ గొంతకాలమున కాయాజాతియొక్క నిసర్గ గీతాభినయ కళాభిమాన ప్రత్యేకతలకును గాణాచియైన కావ్యజాలము వెలయఁగలదు. జావాదేశమునందలి వాయంగ్‌వోంగులు, జపానీయుల 'నో' రూపకములు, బర్మాదేశపు 'లూసన్‌', 'హౌసా', సింహళ దేశీయుల 'కోలమ్‌నాటిమా', టిబెట్‌ ప్రభృతి దేశముల మిస్టరీలు, మనదేశమందలి యాత్రలు (బెంగాలు), కథకళి (మళయాళము), గంధర్వగానము (నేపాలు), గంధర్వ నృత్యము (మార్వారు), యక్షగానము (ఆంధ్ర కర్ణాట తమిళ ప్రాంతములు) మొదలగునవట్లు వెలసినవే. ఒక్కొక్కదాని యుత్పత్తి కొక్కొక్క కారణముండవచ్చును. కాని, యన్నిటఁ దత్త్వతః ఏదో సమీచీనమైన సమానత గోచరించును. అది మానవ స్వభావ నిసర్గ మధురములగు నభిరుచులకును దత్తజ్జాతీయాశయము లకును సంప్రదాయములకును గల భావ బాంధవ్యము. కొన్నికొన్నిట వస్తువులలో రచనా ప్రక్రియలో, ప్రదర్శన సంప్రదాయములలోఁ గూడఁ గొంత సామ్యము గోచరించిన గోచరింపవచ్చును. భిన్నదేశములందు భిన్న కాలోత్పన్నములైన కళాస్వరూపములందు సామ్యమున్నదనగా నది మానవ స్వభావములోనేయున్న సమానతా ప్రతిపత్తియేగాని వేఱుకాదు. ఆ సమానతా ప్రతిపత్తిని బట్టి యాయా భిన్నదేశ కళా ప్రక్రియల కన్నిటికినిఁ బరస్పరానుకరణ సంబంధము నూహించుట సమంజసము గాదు. ఏనాఁడో కొన్నిటికట్టి సంబంధమేర్పడి యుండినను నీనాడు నిజము నిక్కచ్చిగా నిరూపించుట కష్టసాధ్యము.

ఆంధ్రతా ముద్రను భద్రపరచిన మనదేశి సాహిత్య ప్రక్రియలకెల్లఁ దలమానికము యక్షగానము. అది ప్రాదుర్భవమున నేదో సాధారణ మతబీజక వినోద కాలక్షేపమై యుండినదేమో కాని రానురాను ఒక ప్రత్యేక సాహిత్యశాఖగా వర్ధిల్లుచూ వచ్చినది. అట్లని అది వట్టి సాహిత్య ప్రక్రియ మాత్రము కాదు. సంగీతాభినయ కళలకునుఁ దానకమై దేశి సంస్కృతికోశమై పరిఢవిల్లినది. యక్షగాన గ్రంథములు ఆంధ్రమునఁ బరశ్శతముగా వెలసినవి. కథకళి కళాప్రతిష్టలుగల మలయాళ రాష్ట్రము వినా యావద్దక్షిణ భారతదేశ వ్యాప్తమైన కళాస్వరూపము యక్షగానమని చెప్పనొప్పును.

యక్షులు - గానము

ఆంధ్ర జాతీయ రూపక ప్రక్రియగా యక్షగానమున కాపేరెట్లు వచ్చినదో విచార్యము. యక్షగానమనఁగా యక్షుల యొక్క పాట యని సామాన్యార్థము. మఱి యాంధ్రులకు యక్షులకు నేమి సంబంధమో దురూహ్యము. ఈనాఁడు మన కుపలబ్ధమగు యక్షగానములలోఁ బ్రాచీన కృతులందుఁ గూడ యక్షగాధలుగాని, యక్షపాత్రలు గాని, యక్షస్తోత్రములుగాని, మఱియెవ్విధమైన యక్షసంబంధములుగాని కానరావు. కాని, ప్రత్యక్షముగ యక్షు లతోఁ గాకున్నను యక్షశబ్ద వాచ్యులగు నెవరితోనైన నేనాఁడో ప్రగాఢమైన సంబంధమేదో యుండి యుండ కున్నచో ఈపదముయొక్క పుట్టుక కవకాశమే యేర్పడియుండదు.

ఆంధ్ర వాఙ్మయమున మొట్టమొదట యక్షాది నేపథ్యములతోడి యాటపాటల ప్రసక్తి పాల్కురికి సోమనాథుని (క్రీ॥శ॥ 1280 - 1340) పండితారాధ్యచరిత్రలో బర్వతప్రకరణమునఁ గన్పట్టును. అది శ్రీశైలయాత్ర శివరాత్రి జాగరణ సందర్భము. ఆవేళ నచటఁ జేరిన యాత్రికుల వినోదకాలక్షేపము లనేకము వర్ణింపఁబడిన చోట - "ఆదట గంధర్వ యక్షవిద్యాధ రాదులై పాడెడు నాడెడువారు(రి?) విధమునఁ బ్రచ్ఛన్న వేషముల్‌ దాల్చి యధికోత్సవము దులుకాడనట్లాడు" వారును ప్రశంసింపఁబడిరి. తదుపరి క్రీ॥శ॥ 1430 ప్రాంతమున రచితమైన శ్రీనాథుని భీమేశ్వర పురాణమున (ఆశ్వా 3, పద్య 65) దక్షారామ ప్రశంస సందర్భమున - "కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి" అని యున్నది. యక్షగాన మను సమస్తపద మొక విశిష్టార్థమున గనఁబడుట కిదే మొదలు. "కీర్తియంతి స్మ మాహాత్మ్యం గంధార్వాస్త్రిదివౌకసః గాంధర్వ విద్యా నిపుణౌ గాంధర్వేణగరీయసా" అని సంస్కృత భీమేశ్వర పురాణము (అధ్యా 10 - శ్లో 19.) అమూలకమగు యక్షగాన శబ్దమాంధ్ర భీమేశ్వర పురాణమున నుటంకింపఁబడినదనఁగా శ్రీనాథుని కాలమున యక్షగానమున కొక ప్రత్యేకతయుఁ బ్రచారమునేర్పడి యుండును. అసలు గానకళా ప్రావీణ్యమునకు గంధర్వులది పెట్టినది పేరుగదా. వారిపేరనే గాంధర్వవేదము వెలసినది. అట్టి గంధర్వులు "యక్షగానసరణి" బాడిరనఁగా నది శ్రీనాథుని కాలము నాఁడొక ప్రత్యేక గానశైలిగాఁ బఱిగణింపఁ బడుచుండెడిదని తోచును. క్రీడాభిరామమున (క్రీ॥శ॥ 15 శ.) నొక వ్యాజమున మాణిభద్రకులోద్వహలైన యక్షకన్యల నృత్య ప్రశంస గలదు. (పద్య 37-138) 16వ శ. ప్రబంధములలో - మనుచరిత్రమునఁ (2-19) బ్రవరుఁడు హిమవత్పర్వత ప్రాంతమున "గంధర్వ యక్షగాన ఘూర్ణితమగు నొక్క కోనఁగనియె" నని యున్నది. పారిజాతాపహరణమున "యక్షగ్రామవాస్తవ్యులు", "నిర్జరీజనతా నృత్త సహాయలాలసు" లనియు, "యక్షులు మేళముగూడి పాడుచుందురు దిక్పాల సభల" ననియున్నది (2-92, 93) రామాభ్యుదయమున (3-42) "... గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్షగానంబులనూనంబులై బేరయ ..." అనియున్నది. చిత్ర భారతమునఁ జతుర్ధనుని యలకాపురీ సందర్శన సందర్భమున, (4-80) గిన్నరులు పాట పాడుచుండఁగా "తాళసంఘ ప్రభేదంబుల గతులచే యక్షకామినులు నాట్యంబులాడ" దొడఁగిరనియు, నందే కృష్ణుఁడర్జునునిపై దాడివెడలిన సందర్భమున (7-21) "మంగళమస్తు రమానాథయని యక్షవనితలు కర్ణపర్వముగబాడ" దొడఁగిరనియుఁ గలదు. కర్ణాటాంధ్ర వాఙ్మయములందు యక్షుల గానాభినయ కళానుబంధములకిట్లెన్నియో ప్రమాణములు గలవు. కాని యవి క్రీ॥శ॥ 12వ శతాబ్దికంటేఁ బ్రాచీనములుగావు. అంతకంటేఁ బ్రాచీనములు ప్రబలములైన ప్రమాణములుగా గానరావు. కావునఁ గర్ణాటాంధ్రములందు యక్షగానమను పేరనొక ప్రత్యేకమైన గానశైలికి ప్రచారమేర్పడిన తరువాతనే తన్నిమిత్తముగాఁ దత్తత్సాహిత్యములందు భంగ్యంతరముగాను, నౌపచారికముగను యక్షుల గీతాభినయకళానుబంధములకా ప్రసక్తి గల్గినదని తలంపవలసియున్నది. అదియుఁగాక దేవయోనులైన యక్షులవలన నాంధ్ర కర్ణాటములందు యక్షగాన మేర్పడినదనుటకంటే నెవరో భౌమజీవులైన యక్షులవలన నేర్పడి యుండుననుట సమంజసముగాఁ దోచును. యక్షజాతి ప్రతిష్ఠ హిందూ బౌద్ధ జైన మత గ్రంథములు మూడింటను నిటు సింహళమునుండి యటు నేపాళము వఱకును వ్యాపించినట్లు తెలియుచున్నది. కర్ణాటాంధ్రదేశములకు నేపాళము కంటే సింహళము సన్నిహితమైనది. ప్రాచీన కాలమున సింహళమున యక్షుల రాచరికము గొన్నినాళ్ళు కొనసాగిన విషయము పూర్వోక్తము. అచట నేఁటికిని యక్షారాధన ప్రధానముగా "వడ్డా" యను జాతివారి యుత్సవ నృత్యములు జరుగుచుండునని తెలియుచున్నది. ఆ యుత్సవములు మతబీజకములఁట. ఆ యక్షులెవరో నృత్య ప్రియులవలె నున్నారు. ఆట తోడిదే పాట మత ప్రచారమునకు గీతాభినయ కళాత్మక ప్రక్రియలు గొప్ప సాధనములు. పూర్వమెపుడో సింహళమునుండి యీ యక్షులో యక్షారాధకులో మత ప్రచారము నిమిత్తమో మరెందులకో కర్ణాటాంధ్రదేశములు బ్రవేశించిరేమో! యనునదొక విచికిత్స. కర్ణాట దేశమునందలి యెక్కలగాణలు లేక యెక్కగిసలు, నాంధ్రదేశమందలి జక్కులవారును వీరి సంతతివారే యగుదురేమో! ఎక్క జక్క శబ్దములు యక్ష శబ్ద భావములగుటకు భాషా శాస్త్రము సమర్థింపగలదు. తొల్లికర్ణాటాంధ్రములందు యక్షగానము వీరివల్లనే ప్రవర్తిల్లినదేమో!

పూర్వకాలమున వివిధ దేశములందు వెలసిన నాట్య సంగీత ప్రక్రియలనేకము మత ప్రచారము కొఱకేర్పడియుండుట లేదా మత బీజకములై యుండుట ప్రసిద్ధ విషయము. కాత్యాయని శ్రౌత సూత్రములలో (21-3-11) బితృమేథకర్మ కాండమున నొకవిధమగు గీతాభినయ ప్రక్రియ యాచరణీయమని సూచింపఁబడినది. సింహళ దేశీయుల యుత్సవ నృత్యములలోఁ బితృదేవతా పూజా సంప్రదాయముఁ బాటింపఁబడుచున్నది. గ్రీసుదేశపు నాటకోత్పత్తికి మతసంబంధ ప్రతిపత్తియే మౌలికతత్త్వము. ఆనాఁటి గ్రీసు "ట్రాజెడీ" (విషాదాంత రూపకము) మొదట నొక మృతయోధుని సమాధికడ జరుపబడు నపకర్మ కలాపముగా నవతరించినది. అశోక చక్రవర్తి విగ్రహ ప్రదర్శనాదికము ద్వారమున బౌద్ధమత ప్రచారము చేయించినట్లాతని నాగిర్నారువ శిలాశాసనమువలనఁ దెలియుచున్నది. వంగదేశపు "యాత్రలు" మత విషయకములైన యుత్సవములలో నూరేగింపుల సందర్భములలోఁ ప్రయోగింప బడునట. మార్వారు ప్రాంతమున వైశ్య జాతికిఁ జెందిన గంధర్వులను నొక తెగ వారది యొక వృత్తిగాఁ బ్రదర్శించు అంజనసుందరి, మేనాసుందరియను నృత్య రూపకములందా యితివృత్తములు ప్రసిద్ధ జైన గాథలనియు నా ప్రదర్శనములను జైనులెక్కువగా నాదరింతురనియు, నా గంధర్వుల కదియొక వృత్తియైనను నది మత బీజకమైన దనియుఁ దెలియుచున్నది. ఇట గంధర్వ శబ్దోపయోగము గమనింపఁదగినది. ఈ గంధర్వులకును దేవయోనులైన గంధర్వులకును సంబంధము లేదు. గానకళా ప్రావీణ్య విషయమునఁ బురాణ ప్రసిద్ధులైన దేవయోని గంధర్వులపేరే వైశ్యజాతి ప్రదర్శకులు తమ గానకళా వైదగ్ధ్యమునకు సూచకముగాఁ బెట్టుకొని యుందురు. లేక జనవ్యవహారమున వీరికా ప్రసిద్ధి గలిగియుండును. ఇంతకన్నను జిత్రమైనది నేపాళదేశపు గంధర్వగానము. ఇది వంగదేశపు యాత్రవలె నేపాళ దేశముయొక్క దేశి సరణికిఁ జెందిన (నర్తన) నాటకమని పేర్కొనఁ బడినది. ఇది మతబీజకమైనదో కాదో తెలియదు. కాని దీనికిని మన యక్షగానమునకును బేళ్ళలో నేదోయొక వింతసామ్యము గోచరించును. ఇఁక యక్షగానమున కేమైన మత సంబంధమున్నదేమో చూడవలసియున్నది. సింహళదేశపు యక్షులచేఁగాని యక్షారాధకులచేఁగాని ప్రవర్తితమై యుండునెడల నది యంతయో యింతయో మత సంబంధి యని చెప్పనొప్పును. లేదా మీఁదఁజెప్పబడిన కర్ణాటదేశపు ప్రదర్శన సంప్రదాయమును గమనించినను మతబీజకమై యుండునని దోఁచును. కాక, పాల్కురికి సోమనాథుఁడు చెప్పినట్లు శివరాత్ర్యుత్సవ సందర్భమున శ్రీశైలాది క్షేత్రములందుఁ బ్రవర్తితమగుచుండిన యక్షవేషధారుల యాటపాటలలో యక్షగానమునకు సంబంధముండి యుండునెడల నదియు మత సంబంధక స్ఫోరకమగుచున్నది. జక్కుల జాతి సంబంధముగూడ యక్షగానము యొక్క మత బీజకత్వమును స్థాపింపఁగలదు. అది యెట్లు స్థాపింపఁబడఁగలదో, యసలు యక్షగానమునకును జక్కులకు గల సంబంధమేమిటో విచారింపవలసియున్నది.

జక్కుల జాతి అనుబంధము

యక్షగానముతో సంబంధము గలిగినవారుగా నూహింపఁదగిన యెక్కడిగలు లేక యెక్కలగాణలు నేఁడు కన్నడ దేశమున నెక్కడను గానరారు. కాని జక్కుల వారాంధ్రదేశమున గుంటూరు, గోదావరి మొ॥ మండలములలోఁ దేవాలి, పెద్దాపురము మొ॥ ప్రాంతములలోఁ గానవచ్చుచున్నారు. నేఁడు వీరు కళావంతుల తెగకుఁ జెందినవారై యున్నారు. వీరి గుఱించి ఇ. థర్ట్సన్‌ (E. Thurston) వ్రాసిన Castes and Tribes of South India అను గ్రంథము ద్వితీయ భాగము 438వ పుటలో నిట్లున్నది.

"Jakkula-Described as an inferior caste of prostitutes, mostly of the Balija caste; and as wizards and a dancing and theatrical caste. At Tenali in the Krishna District, it was customary for each family to give up one girl for prostitution etc. etc." దీనినిబట్టి జక్కులవారికి నాట్యకళతో సంబంధముండినట్లు విశదమగుచున్నది. కళావంతులనిపించుకొను వారియెడ నట్టి సంబంధము సహజము; వారి కొలము బిరుదుసార్థకము. మార్వారు గంధర్వుల సామ్యమున నీ జక్కులవారు తొల్లి మతప్రచార నిమిత్తముననో లేక యదియొక ప్రధాన వృత్తిగా నవలంబించియో యక్షగాన ప్రవర్తకులైన వారెల్లఁ గాలక్రమమునఁ గలసి యేర్పడిన జాతియనియు, వారి వృత్తికి సంబంధించిన యక్ష (జక్క) శబ్దము తరువాత వారికి జాతి వాచకముగాఁ బరిణమించి యుండుననియు నూహింపవచ్చును. వివిధ జాతుల చరిత్రలు తఱచి జూచిన నిట్టి పరిణామ మసహజముగాదు. అందులకు మార్వారు గంధర్వుల విషయమునే దృష్టాంతముగా గ్రహింపనగును. మన 'ఎఱుకల' జాతియు నట్లే యేర్పడినదిగదా.

ఆంధ్రదేశమున జక్కులవారి ప్రశస్తి చిరకాలానుగతముగా వినవచ్చుచున్నది. ఈనాఁడు రాయలసీమలోనున్న జక్కసానికుంట్ల (కర్నూలు జిల్లా, పత్తికొండ తాలూకా), జక్కుల చెఱువు (గుత్తి తాలూకా), జక్కల చెఱువు (పెనుగొండ తాలూకా), జక్క సముద్రము (హిందూపురం తాలూకా), జక్కులాడి (బళ్లారి జిల్లా) మొదలగు గ్రామముల నామములు ప్రాచీన కాలమున నాయా ప్రాంతము లందలి జక్కులజాతి ప్రాచుర్యమును సూచించును. అందుఁగొన్ని గ్రామములొకప్పుడు వారి కినాములుగా నీయఁబడినట్లు స్థానికమైన ప్రతీతిగలదు. క్రీ.శ. తే. 9-7-1481న జక్కుల కన్నాయి యను నామె తిరుమలదేవస్థానమున వేయించిన శాసనమొక్కటి కలదు. అది క్రీ.శ. 15వ శతాబ్దినాఁటి జక్కులవారి ప్రభావమును సూచించును.

ఇఁక నానాఁడు గానాభినయ కళా ప్రదర్శనలందు వారికిఁగల పేరు ప్రతిష్ఠలెట్టివో యరయవలసియున్నది. పదునైదవ శతాబ్దారంభమున వెలసిన క్రీడాభిరామమున (135వ పద్యము) "జక్కుల పురంధ్రి" గానకళా కౌశలము విశేషముగఁ ప్రశంసింపఁ బడినది. అందే యా వెంటనే (పద్య 136-138) భంగ్యంతరమున 'అక్కలు' లేక 'యక్షకన్యల' అనఁగా జక్కుల పడుచుల నృత్య ప్రదర్శనము గూడఁ బ్రసక్తమైనది. జక్కుల రేకులను పదములు జక్కిణియను నృత్య విశేషము వీరిపేరనే ప్రసిద్ధమై యుండును. క్రీ.శ. 1500 ప్రాంతమునఁ బ్రోలుగంటి చెన్నశౌరి యనునాతఁడు సౌభరిచరితమను "జక్కులకథ" చెప్పినట్లు తెలియుచున్నది. అది జక్కులవారు చేయు గానరూప కథాఖ్యాన పక్కిక మూఁదలగా రచింపబడి యుండును. పురాణాదులలోఁ గానరాని యక్షుల గానకళా ప్రశంస మన భీమఖండమునను 16వ శతాబ్ది ప్రబంధములందును గన్పట్టుచున్నదనఁగా (ఈ విషయము పూర్వోక్తము) నది యీ జక్కుల వారి పాటలు వ్యాప్తికి వచ్చిన తరువాత వానికే భంగ్యంతర సూచనయని గ్రహింపవచ్చును. చిత్రభారతమున "యక్షకామినుల నాట్యము", "యక్షవనితల పాట"యుఁ బ్రత్యేకముగ బేర్కొనబడిన వనగా నవియు నీజక్కుల పురంధ్రుల యాటపాటలకే భంగ్యంతర సూచనలగునేమో! 17వ శతాబ్దినాటి పురుషోత్తమ దీక్షితుని తంజాపురాన్నదాన మహానాటకమున జక్కుల రంగసానియను నామె సత్రములోఁ బదకేళిక పట్టినట్లు గలదు. ఈ విషయములెల్ల జక్కుల జాతికి గీతాభినయ కళలతోఁగల సంబంధము నూహించుటకుఁ దోడ్పడుచున్నవి.

ప్రాచీనత - ప్రాధమికావస్థ

యక్షరాత్రి, బౌద్ధయక్షులు, జక్కిణి మొ॥ విషయములతోడి సంబంధమునేదైన స్థిరపఱుఁపగల్గినచో యక్షగాన చరిత్ర మతి చిరంతనమైనదని చెప్పవచ్చును. కాని యట్టి సంబంధమును స్థాపించుటకుఁ దగిన యాధార సామాగ్రీ సౌలభ్యము కానరాని యీనాఁడది కడు కష్ట సాధ్యము. ఆధారము లుపలబ్ధమానము లగుచున్నంతలో యక్షగాన చరిత్రమంత ప్రాచీనమైనది కాదనియే చెప్పవలెను. కాని కన్నడ పండితులు కొందఱు తమ వాఙ్మయమున యక్షగానము కొంత ప్రాచీనమైనదనియే తలంచుచున్నారు. "kannada scholars are of the opinion that as early as the 9th Century A.D., this kind of composition could be traced. They suggest that Chattana "Nalpagarana" etc., mentioned in Kavirajamarga of Nripatunga (814 - 817 AD) are nothing but Yakshagana Works. కాని కవిరాజ మార్గమునఁ బేర్కొనఁ బడిన చత్తాణాదులకు లక్ష్యగ్రంథము లిపుడు కన్నడ వాఙ్మయమున లభించుటలేదు. "But unfortunately no composition of this kind has come down to us to verify their statements" అని యనియున్నారు గోవిందరావుగారు. అయితే కవిరాజ మార్గమున వాని లక్షణముక్తమైనది, అది పరిశీలనార్హము. "కందము మమళిన వృత్తము మొందొందడెగొందు జాతి జాణెనెయెచెడం గొందివరళ మరెపేఱ ల్సుందర రూపింబిం దెండె గబ్బమదక్కుం" - కవిరాజ మార్గము 1-34. "కందళ్పల వాగిరె సుందర వృత్తంగళక్కరం చవుపది మ త్తంగ్గీతకె తివదిగ ళందంబుత్తెసెయె పెఱ్ఱాడదు చత్తాణం" - కవిరాజ మార్గము 1-35. అనఁగా నొక కందము, పిదప నొక వృత్తము చొప్పున రచించుచు నొక్కొకయెడ జాతుల ననుసంధించినచో నది 'బేదండె' కబ్బమగును. పలు కందపద్యములతో నందమైన వృత్తములకు అక్కర, చవుపది, గీతిక, తివది (త్రిపది) మొదలగు వాని నందముగా ననుసంధించినచో నది చత్తాణచందమగును, పైరెండింటను గందపద్యము ప్రాధాన్యము, వృత్తముల ప్రతిపత్తి, అక్కరాది జాతుల యక్కఱ విశదమగును. కాని నేఁ డుపలబ్ధమగు కన్నడ యక్షగానములను పరిశీలించినచోఁ గందములు నందందు వృత్తములును గలవు కాని అక్కరాది జాతులన్నియును లేవు. అక్కరలసలు లేవు. కడమ వాని ప్రయోగ మతివిరళము. వానిలోఁ గవిరాజమార్గమున జెప్పఁబడని రగడ వికారములగు తాళ ప్రధానములగు రేకులకును, ద్విపదలకే ప్రాధాన్యము మరియు వానిలో వచనములు, పదములు, అర్ధచంద్రికలు, షట్పదులు, ధవళ శోభనములు, మొ॥ రచనా విశేషములు కలవు. ఇవియు గవిరాజ మార్గబేదండే చత్తాణ కావ్యలక్షణములందుఁ బేర్కొనఁబడలేదు. పైఁ బేర్కొనఁ బడిన కన్నడ యక్షగాన లక్షణములే తెలుఁగు యక్షగానములందును గన్పట్టును. చూఁడగా నా బేదండె చత్తాణము లేవో సామాన్యములైన నిర్వచన పద్యకావ్యములై యుండునని తోఁచునుగాని యక్షగానము లనిపించవు.

ఇఁకఁ గవిరాజ మార్గమునఁ బేర్కొనఁబడిన నాళ్‌ పగరణాల విషయము : నాళ్‌ - నాడు అనఁగా దేశము, పగరణ - ప్రకరణము అనఁగా రూపకము. (అసలు ప్రకరణము ప్రసిద్ధ సంస్కృతదశ రూపక ప్రభేదము. మాలతీ మాధవ, మృచ్ఛకటికాదు లట్టివి. కాని యాలక్షణమిటఁ బ్రసక్తము కాలేదు. ప్రకరణ శబ్దమిట రూపక సామాన్య వాచిగాఁ బ్రయుక్తమైనట్లు తోచును.) అనఁగా దేశీయమగు నొక రూపక విశేషమని యర్థము. ఇందుఁ గ్లిష్ట కల్పనాదులు దోషములనియు, గ్రామ్యాశ్లీల భూషణములు హాస్యరస భాజనములు కాగఁలవు కాననవి దోషములనిపించుకొనవనియుఁ కవిరాజ మార్గమునఁగలదు. (చూ ఆ. 1 - ప. 66-68) ఈ లక్షణము యక్షగానములకేగాదు సామాన్య జనామోదములగు దేశిరూపకముల కన్నిటికిఁ దగియున్నది. అవి యక్షగానములేయని నిష్కర్షతోఁ జెప్పవలనుపడదు. ఇట్లే నృపతుంగునకు సుమారొక శతాబ్ది (పైచిలుకు) యర్వాచీనుఁడగు నాగవర్మ రచించిన కన్నడ కావ్యావలోకనములోఁ బేర్కొనఁబడిన 'పారుగబ్బాలు', 'భాజన గబ్బా'లు ననునవి గేయకావ్యములు, గేయాభినయానుకూల దృశ్యప్రబంధములనియుఁ దెలియుచున్నది. కాని యవియు యక్షగానములని నిష్కర్షతోఁ జెప్పవలనుపడదు. అయితే యివి యన్నియుఁ గన్నడ దేశమున సంగీత నాట్యకళల కానాఁడు గల "పరపతి"ని దెలియఁ జేయఁగలట్టివైనఁ గానవచ్చును.

అసలు కన్నడమున యక్షగానరచన మిగుల నర్వాచీనమైనది. ఆ విషయమును బలువురు కన్నడపండితులే యంగీకరించుయున్నారు. ప్రత్యేకముగ కన్నడ యక్షగాన వాఙ్మయము గురించి పరిశోధన చేయబూనిన శ్రీ ఎం. గోవిందరావుగారు దాని గురించి వ్రాయుచు "In a study of a good number of Yakshagana works, I was not able to come across a work earlier than the end of the 17th Century." అని వక్కాణించియున్నారు. తమిళమున యక్షగాన రచన మరియు నర్వాచీనమైనది. తెనుఁగుననే ప్రాచీనతమమైనది. ఈ సందర్భమున డా॥ నేలటూరి వేంకటరమణయ్య వాక్యములు స్మరింపఁదగినవి - "తెలుగు యక్షగానములు ప్రాచీనతమములు. తమిళ కన్నడ యక్షగానము లాదేశము లందాంధ్రుల వ్యాపన మతిశయించిన పిమ్మటనే రచింపబడెను. అయితే తెనుఁగు యక్షగాన రచనమెంతో ప్రాచీనము గాదు. క్రీ॥ శ॥ 16వ శతాబ్దికి ముందునాటి యక్షగాన రచన తెనుఁగున గానరాదు. క్రీ॥ శ॥ 15వ శతాబ్దికి ముందు యక్షగాన రచన జరిగినట్లే తెలియవచ్చుటలేదు. కాని యక్షగాన మొక సాహిత్య ప్రక్రియగా నవతరించుటకుఁ బూర్వ రంగముగాఁ గొంత చరిత్ర యుండకపోదు. 15వ శతాబ్దికి పూర్వార్థమున వెలసిన మన క్రీడాభిరామమున జక్కుల పురంధ్రుల పాటలును యక్షకన్యల యాటలును ప్రసక్తములైనవికదా! అసలు యక్షగాన శబ్దమే యదియొక ప్రత్యేకమైన గానశైలి యనునర్థమున నానాఁటి భీమఖండమునఁ బ్రయుక్తమైనదికదా. పండితారాధ్య చరిత్రయందలి యక్షాది నేపథ్యములతోడి యాట పాటల ప్రసక్తిని బరిగణించినచో యక్షగానము చరిత్రమింకొక శతాబ్ది వెనుకకుబోవును. కన్నడ వాఙ్మయమందలి 'అగ్గళుని చంద్రప్రభాపురాణము' అభినవ పంపని మల్లినాథ పురాణములందలి 'ఎక్కలగాణ'ల ప్రసక్తి నెత్తుకొన్నచో యక్షగాన చరిత్ర క్రీ॥శ॥ 12వ శతాబ్దిదాఁక నెగఁబ్రాకఁగలదు. అంతకుమించిన దంతయు నుపాధి సమగ్రముగాని యూహాగానమే.

ఇఁక యక్షగానముయొక్క ప్రాథమిక స్థితి యెట్టిదో యించుక పరిశీలింతము. క్రీ.శ. 12వ శతాబ్దినాటికి కన్నడ చంద్రప్రభా పురాణములో వనవిహారం చేస్తూన్న నాయకుఁడు మేళతాళాలతో నిమిత్తం లేకుండా దేశీయ గీతాన్నొకదానిని ఒక 'ఎక్కలగాణ' యింపుగా పాడుతూ వుంటే విన్నాడని వర్ణించబడింది. దీనిని బట్టి మేళతాళములతో నిమిత్తములేని యెక్కలగాణల జాతీయ గీతాలాపము యక్షగానోత్పత్తికిఁ బ్రాతిపదికయైనదని తోఁచుచున్నది. ఆ శతాబ్దిలోనే వెలసిన మల్లినాథ పురాణములో ""కమలామోదియైన తుమ్మెద ఝంకారం కమలాలయయైన లక్ష్మినికీర్తిస్తూ పాడే 'ఎక్కల' గానంతో పోల్చి వర్ణింపబడింది" అనఁగా యెక్కల గానము లేక యక్షగానము దేవతాస్తుత్యాత్మకమైనదని తెలియుచున్నది. శ్రీనాథుని భీమఖండమునందలి దక్షారామ ప్రశంస సందర్భమునఁగల 'కీర్తింతురెద్దాని కీర్తిగంధర్వులు, గాంధర్వమున యక్షగాన సరణి' అను వాక్యమును జూచినను నాఁడు యక్షగానము దైవస్తుత్యాత్మకమైన యొక ప్రత్యేక గానశైలిగాఁ బరిఢవిల్లుచుండినదని స్ఫురింపజేయుచున్నది. మల్లినాథ పురాణములోనే 'యక్షాందోళన'మను నృత్యముగూడఁ బ్రసక్తమైనది. ఈ యాందోళికా (ఆందోళనమన్నను ఆందోళికయన్నను నర్థమొక్కటే - చూ. సూ.రా.ని.) నృత్యముగూర్చి శ్రీ ముట్నూరి సంగమేశంగారిట్లు వ్రాయుచున్నారు "కన్నడ యక్షగానాల్లో నటివేషాన్ని యక్షిణీవేషమని, శ్రీవేషమని, మోహినీవేషమనీ పరిపరివిధాల పిలుస్తారు. ఈమె మొదటిసారి రంగస్థలానికి వచ్చినపుడు నడుము వఱకు అట్టతో కట్టిన తొట్టెవంటి చౌకంలో నిల్చి నృత్తగతులు ప్రదర్శిస్తుంది. ఈ నృత్తాన్ని ఆందోళికా నృత్యమనీ, మంచె చప్పర నృత్యమనీ పిలుస్తారు. యక్షగానములలో యక్షిణీవేషముతో నొక రాందోళికా నృత్యము నెఱపుటజూడ యక్షగానమునకును యక్షాందోళనమునకును ఏదో సంబంధముండి యుండుననిపించును. అనఁగా క్రీ.శ. 12వ శతాబ్దినాఁటికే యక్షగానమునకు నృత్యకళా సాహచర్యమును కలిగినదన్నమాట. ఎక్కలగానము నీయక్షాందోళనము ననునవి రెండును, ఆటతోడిదే పాట పాటతోడిదే యాట అనునట్లెవరో యక్షగానవేషధారుల జాతీయ వృత్తి విద్యయొక్క కవలరూపులై యుండును. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో యక్షాది నేపథ్యములతోపాటు పేర్కొనఁబడిన పాటయు, నాటయు, క్రీడాభిరామమునఁ బేర్కొనబడిన జక్కుల పురంధ్రి యక్షకన్యల యాటయు నీవిషయమును సమర్థింపఁగలవు. పండితారాధ్య చరిత్ర వక్కణలో యక్షనేపథ్య సూచనయు, క్రీడాభిరామ జక్కుల పురంధ్రి పాటలోఁ బాటతోపాటు పకరణములు నామెగానముతోఁ గథాఖ్యానము చేసిన వైనను పేర్కొనబఁడుటయు, యక్షకన్యల నృత్యములో మతాశయిస్ఫురణమును విశేషములు."

యక్షగానముయొక్క ప్రాథమిక స్వరూప మాపేరే చాటుచున్నట్లు గానమైయుండుననుట నిర్వివాదము. అయితే పురాణ చరిత్ర ప్రసిద్ధులైన యక్ష జాతీయులెవ్వరికిని గానకళా ప్రతిష్ఠలున్నట్లు తగిన యాధారములు గానరానందున నెన్నఁడో యక్ష వేషధారణమొక వృత్తిగా నవలంబించినవారని యూహింపఁదగిన యెక్కల గాణల, జక్కుల పురంధ్రుల గానకళాభిమానములే యక్షగానోత్పత్తికి బీజాక్షర ప్రాయములైనవనియు, నా గానము స్తుత్యాత్మకముగాఁ గథాఖ్యానోపయోగిగా నృత్యానుకూలముగా నుండెడి యొక ప్రత్యేక శైలికిఁ జెందియుండుట యక్షగానము యొక్క ప్రాథమికావస్థయై యుండుననియుఁ జెప్పవచ్చును.

పరిణామము

యక్షగాన పరిణామ చరిత్రమతి చిత్రమైనది. రచనలోఁ బ్రదర్శనలోఁ దరతరమునకును పరిణామమందుచు వచ్చినది. మొదట యాత్రాస్థలములు, కామేశ్వరీవ్రత సంప్రదాయ పరాయణులైన కామందుల లోగిళ్లును, తదుపరి పల్లె పట్టుల రచ్చసావడి, పాడి గలిగిన రాచదేవిడీలును యక్షగానము ప్రదర్శనల కధిష్ఠానములైనవి. అది వివిధ ప్రదేశములకు విస్తరించుటవలన నాయాప్రాంతములందలి వివిధ శ్రవ్య దృశ్యాత్మకములైన సాహిత్య ప్రక్రియలతో ననుబంధము పెంపొందించుకొన్నది. వివిధ గీతి ఛందస్సులను దనలో నిముడ్చుకొన్నది. యక్షగాన రచన గ్రామకరణములు, బొమ్మలాట రైతులు మొదలగు జానపదకవుల గంటమునుండి నగరములందు రాజాస్థానముల నాశ్రయించిన సంగీతకవులపైడి గంటములకును బ్రాకినది. కవిరాజుల గంటములే కాదు, రాజకవుల గంటములును యక్షగాన సరస్వతి కాశ్రయములైనవి. కలుకులముల పలుతరగతుల కవులకుఁ దద్రచనావకాశములు గలిగినట్లే జక్కులు, నెరుకులు, నేనాదులు, గొల్లలు, బ్రాహ్మణులు మొదలగు పలుతెగలవారికిఁ దత్ప్రదర్శనావకాశములు గలిగినవి. మొదట గానరూప కథాఖ్యానముగ గ్రామసీమలఁ బామర గాత్రమాత్రోపజీవిగా నుండిన యక్షగానము నాడు నాటికి వాడవాడల నాడఁ బడుచుండిన వీధినాటకపు వాటమెరిగి రాచనగరి మొగసాలల కెగఁ బ్రాకి రంగభోగము నవధరించుటతో మార్గరూపక ప్రభావము నభిసరించి నాటక నామకరణము చేయించుకొన్నది. కోటలోని రాజుగారికిని బేటలోని ప్రజలకును సమానముగా నాదర పాత్రమైనది. తెలుగు భాషకు బలుకుబడిగల పలుతావుల వెలసినది యక్షగానము. పలు తరగతుల ప్రజాజీవితోదంత విశేషములను ప్రతిబింబించుకొన్నది. పలువిధముల కథల కాశ్రయమైనది. పాఠ్యగేయ నాట్యాత్మకములైన పెక్కు ప్రయోజనముల కిక్కువయై నిలిచినది. అదియొక సార్వజనీనమైన బహుముఖ ప్రయోజన సనాధమైన సాహిత్య ప్రక్రియగాఁ బరిణమించినది. ఈ పరిణామమంతయు నేఁడెనిమిది శతాబ్దుల చరిత్ర గలది.

యక్షగానము యొక్క ప్రాచీనత యెంతయో, ప్రాథమిక స్థితి యెట్టిదో మీదఁ బరిశీలింపఁ బడినది. క్రీ.శ. 12వ శతాబ్దికి ముందు కాలము యక్షగాన చరిత్రలో నజ్ఞాత యుగము. అది యక్ష వేషధారణము వృత్తిగా నవలంబించి యుండుటచే నేర్పడియుండదగునని యూహింపదఁగిన, ఎక్కలగాణల, జక్కుల జాతుల ప్రాదుర్భవస్థితి గర్భితమైన కాలమైయుండునని యూహింపవచ్చును. అనఁగా వారి మూలమున వాసికెక్కి యుండునని యూహింపఁ దగిన యక్షగానము ప్రారంభదశలోనే రూపారోపముగలదని చెప్పవలసివచ్చును. కాని, యారూపారోపమా జాతుల యుత్పత్తికేగాని యక్షగాన రూపకళా పరిణతికి సద్యః కారణమై యుండునని చెప్పలేము. ఆ యక్షరూపారోపముతోని యాటపాటల ప్రసక్తి పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోగలఁ దనఁగా నా సంప్రదాయము 14 శతాబ్ది దనుక వచ్చుచున్నట్లే చప్పవచ్చును. కాని యిం దితివృత్తము మొదలగు విషయముల ప్రసక్తి కానరానందున నాఁటి కది రూపకళా సమగ్ర స్వరూపమును నిరూపించుకొన్నట్లుకాదు. సాహిత్య ప్రక్రియగానైన రూపొందినట్లు గానరాదు. అట్లేయై యుండినచో వీరశైవమత ప్రవర్తకుఁడైన ద్విపద రగడోదాహరణాద్యనేక దేశిసాహిత్య ప్రక్రియల నతిప్రీతి నాదరించిన సోమన రగడ ద్విపదలకే ప్రాధాన్యముగల యక్షగానమును గూడ నొక్కటైన రచించి దానినొక ప్రచార సాధనముగా వినియోగించుకొని యుండడా? అసలు 15-16 శతాబ్దములకు ముందునాఁట యక్షగానమొక సాహిత్య ప్రక్రియగాఁగాని, రూపక ప్రక్రియగాఁగాని రూపొందినట్లాధారములు గానరావు. అయితే అంతకుముందు మన యాంధ్రులకు మార్గనాటకము వంటి నాటకములు (క్రీడాభిరామము వినా) లేకపోవచ్చుగాక. కాని యక్ష గానమువలె దేశిసరణికిఁ జెందిన నాటకములు కొన్ని లేకపోలేదు. మనవలెనే పూర్వకాలమునఁ దమిళులు, కన్నడిగులు మొదలగు మరికొందరికి మార్గనాటకముల వంటి నాటకములు లేనట్లు తెలియవచ్చుట యబ్రము. కాని యాటవిక జాతులకే యాటపాటల యందాస్థ యున్నట్లు తెలియుచుండ నాగరక జాతులకు నాటక కళాభిరుచి యన్నది సహజముగదా. ఆనాఁటి మనదేశి నాటకములే వీధి నాటకములను పేరఁ బ్రసిద్ధి కెక్కినవి. అట వీధిలో నాడబఁడు నాటకములని యర్థము. (వీధియనగా నిటదశరూపక ప్రబేధముగాదు. నాటక శబ్దమిట రూపక సామన్యసూచి) ఇది కన్నడిగుల 'బయలాట', తమిళుల 'తెరుక్కూత్తు' అనువానికి సమానార్థకమైనది. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనే నాటకములు, బహురూపకములు, వెడ్డంగము, తోలుబొమ్మలాటలు మొదలగు రూపక ప్రక్రియలనేకము పేర్కొన బడినవి. జవనికలు, పాత్రల యాహార్యకము, ప్రదర్శన ప్రరోచక, అభినయభంగులు, సంగీతపు హంగు మొ॥ నాటకపు తంతు వివరింప బడినది. త్రిపురవిజయము, కామదహనము, అర్థనారీశ్వరము, అంధకగంధగజాసురవధము, దక్షాధ్వరధ్వంసము, క్షీరసాగర మధనము, సిరియాళ చరిత్ర మొ॥ నాటి నాటకేతివృత్తములును బేర్కొనబడినవి. ఇందలి కథలు కొన్ని పిదప కాలమున యక్షగాన వస్తువులు నైనవి. ఇవికాక క్రీడాభిరామమున బేర్కొనబడిన మాచల్దేవి చరిత నాటకము, విజయనగర ప్రభువు వీరనరసింహరాయల (క్రీ.శ. 1506-1509) కొలువులోఁ గూచిపూడి బ్రాహ్మణ భాగవతులు ప్రదర్శించినట్లు తెలియ వచ్చిన సంబేట గురవరాజు నాటకము, క్రీ.శ. 1514 నాఁటి కర్నూలు జిల్లా చెరువు బెళగళ్ళ శిలాశాసనము నందుఁ బేర్కొన బడిన తాయికొండ నాటకము మొ॥ యక్షగానములుగా నీనాఁడు కొందరు పరిశోధకులచే భావింపబడుచున్నవి. కాని యట్లు భావించుటకుఁ దగిన యాధారమేమియు లేదు. అవి వీధి - తెర నాటకముల కోవకు జెందినవి మాత్రమేయై యుండును.

పూర్వము బహుధా సంస్కృత సాహిత్య ప్రవీణులైన మన కవులు సంస్కృత నాటకముల వంటి నాటకములను దెనుగున సృజింపరైరి సరికదా ఆ నాటకములనే నాటకములుగా నాంధ్రీకరింపలేదు. కొన్నిటిని పద్య ప్రబంధములుగా మాత్రమే పరివర్తించిరి. క్రీడాభిరామ మొక్కటి అందుల కపవాదము. ఆనాఁడు రాజాస్థానములందు సంస్కృత నాటకములు బ్రదర్శింప బడుచుండెడివనియు, జనస్థానములలో వీధినాటకములు, బహురూపములు మొదలగు తెర నాటకములును బ్రచారమందుండెడిననియు నూహింప వలసియున్నది. కాలక్రమమున వాని ప్రభావము యక్షగానములపై గూడబడి యది యాకృష్టులైన శిష్టకవులు కొందరు తద్రచన చేపట్టగనే రూపకకళ కొంత సంతరించుకొని యొక విశిష్టప్రక్రియగా రూపొంది రాజ ప్రమోదములను సమపాళముగా జూరగొని వీధి నాటకమనియు బేరొంది దేశి సరళికి జెందిన నాటకములకెల్ల బ్రతినిధిగా నిలిచినది. మనకు నాటక కృతులు లేనిలోటు తీర్చినది. దీని ప్రభావము మూలముగనే మొన్న మొన్నటిదనుక గూడ మన కవులకు మార్గనాటకములవంటి నాటకములు రచింపవలసిన యావశ్యకత కన్పింపక పోయి యుండవచ్చును.

పాల్కురికి సోమనాథుని నాటికే యక్ష నేపథ్యముల తోడి పాటగా నాటగా వెలసియుండునని యూహింప దగిన యక్షగానమున కాంధ్రమున నాప్రదర్శకులొక విశిష్ట జాతిగా నేర్పడిన పిదప గొంత కాలమునకు యక్షనేపథ్యములతోడి సంబంధము సడలి గానమునకే ప్రాధాన్యము హెచ్చియుండును. పదునైదవ శతాబ్దిలో భీమఖండోదాహరణమును బట్టి యది స్తోత్ర పాఠోపయోగియైన యొక ప్రత్యేకగాన శైలి యనియు క్రీడాభిరామోదాహరణము బట్టి యది జక్కుల పురంధ్రిచే నెక్కటిగా శ్రుతిలయాత్మక వాద్యోపసహితముగా రాగతాళమానస్థాయి గమక నిహితముగా గాధాఖ్యాన పురస్సరముగా బ్రయోగింపబడు చుండెడిదనియు తెలియు చున్నది. ఉదా. క్రీడాభిరామమున నా జక్కుల పురంధ్రి పాటతో అక్కల ('యక్షకన్యల') యాటయు వర్ణితమై యుండుట (క్రీ.రా. 136-137) నా గానము నృత్యానుకూలమైనదనియుఁ దెలియదగును. ఇంకను నానాఁటి దాని ప్రత్యేకత యెట్టిదనగా క్రీ.శ. 1408-1502 సం.ల నడుమనుండిన సంకీర్తనాచార్యుడని ప్రఖ్యాతుడైన చినతిరుమలాచార్యుడు (1537 ప్రాంతము) సంకీర్తన లక్షణమను సంస్కృత గ్రంథమును స్వపితామహ కృతమును స్వజనక వ్యాఖ్యాతమును (ఇదియుపలబ్ధము) దెనుగుజేయుచు దరువులు జక్కుల రేకు లేలలు, చందమామ పదములు మొదలగు వానిని మొదట బేర్కొనుచు బిదప గొన్నిటి లక్షణములు నిర్వచించి యక్షగాన పదములగూర్చి యిట్లు వ్రాక్కుచ్చెను. "యక్షగాన పదంబులు నవ్విధమున సముచితానేక విధ తాళ సంగతులను నవరసాలం క్రియా సవర్ణంబులనుచు నలరునని హరికీర్తనా చార్యుడనియె" - సం.ల. 66 వ పద్యము అతడు దరువులు నేలలు మొదలగు పదములకు లక్షణములు చెప్పియుండెను. కాని వానితోపాటు మొదట జక్కుల రేకుల పేరెత్తుకొనియు (చూ. 50వ పద్యము) ప్రత్యేకముగా నాపేర లక్షణము చెప్పియుండలేదు.

అందుచేతను యక్షగాన పదముల నేలాదులతోపాటు మొదట బేర్కొనకపోయినను నేలాలక్షణము వెంట వాని లక్షణమును చెప్పి యుండుటను జూడ జక్కులరేకులన్నను యక్షగాన పదములన్నను నొక్కటేయని నూహించ వచ్చును. "యక్షగాన పదంబులు" అని బహువచనము వాడబడుటచే యక్షగానమనగా నేదోయొక్క గీతి చ్ఛందోఘటితమైనదని కాక పలువిధములైన పదములతో కూడినదని తెలియనగును. అవి తాళ బహుళములును, నవరసాలంకృతములు నైనవని స్పష్టముగా చెప్పబడినది. పై విషయములను బట్టి 15వ శతాబ్దిలో యక్షగానము, కథావలంబనము, సముచితానేక విధతాళ సంగీతములు, నవరసాలంక్రియా సవర్ణములునగు పదములును కలిగి కావ్య రచనోపయుక్త స్వరూపమును కల్గియున్నదని చెప్పనగును.

రచనా ప్రక్రియను బట్టి సాహిత్యమంతయు ముత్తెఱగులు - పద్యము, గద్యము, పదము లేక గేయము. ఆ మూడింటి ప్రత్యేక ప్రయోగము వలనగాని సంకలన ప్రయోగము వలనగాని బహువిధ సాహిత్య ప్రక్రియలను సాధింపవచ్చును. తెలుగులో బదునాఱవ శతాబ్ది చివరిదాకా వెలసిన శిష్టవాఙ్మయ మెక్కువగా బద్యగద్య ఉభయాత్మకమైన చంపూధోరణిలో సాగిన పురాణములు, ప్రబంధములు, పద్య కేవలముగా నడచిన శతకములే. కాని అప్పటికే చాలకాలముగా నే పల్లె యెల్లలలోనో పలుకుచున్న గేయ సరస్వతి శిష్టకవులచే నుపేక్షింపబడినది. అయినను నిష్టపడిన శిష్టకవులే కొందఱు పద పద్యములకు నడిమి వాటముగా నడచునట్టి ప్రక్రియ నొకదానిని స్వీకరించిరి. అదే ద్విపద. అట్లే యటు మార్గపద్ధతికి చెందిన కళికోత్కళికల రూపమున నవతరించిన పదకవితా ప్రబేధమగు రగడయు గలిసి వచ్చిన ఉదాహరణమును గూడ స్వీకరించిరి. ఆ ప్రక్రియలన్నింటికి నేకవాక్యత సంఘటింప గలట్టిది యక్షగానము. ఆ రహస్యము గ్రహించియే కాబోలు కాల క్రమమున వైవిధ్య ప్రవీణులైన మన కవులు కొందఱు తద్రచన చేపట్టిరి.

మన కిప్పటికి తెలిసినంతలో తెలుగున వెలసిన మొట్టమొదటి యక్షగాన రచన క్రీ.శ. 15వ శతాబ్దికి యుత్తరార్థమున నుండిన ప్రోలుగంటి చెన్నశౌరి సౌభరిచరితమే. అదియైన నతడు రచించినట్లు తెలిసినదే కాని గ్రంథము లభింపలేదు. అది జక్కుల కథయని పేర్కొన బడినది. అది తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు చెప్పిన యక్షగాన లక్షణమట్లు "నవరసాలంకృతముగ" నున్నదని పేర్కొనబడుట గమనింప దగియున్నది. కవి దానిని జక్కుల కొఱకు వ్రాసెనో, జక్కులవారి గానరూపకథాఖ్యాన ఫక్కినే మూదలగా రచించి యుండుటచేత నాపేరు పెట్టియుండెనో, లేక యానాడు యక్షగాన సామాన్యముగా జక్కుల కథయను పర్యాయ వ్యవహారమున్నదో తెలియదు. సౌభరి చరితము భాగవత విష్ణు పురాణములందు గలదు. కాని దానికి యక్ష పాత్రలతో గాని జక్కుల కులదేవతయగు కామేశ్వరితో గాని సంబంధము లేదు. మనకీనా డుపలబ్ధమగు యక్షగానములన్నియు నట్టివే. చెన్నశౌరి కృతి యక్షగాన మని యూహించుటయే సమంజసమగును. 15వ శతాబ్దినాటి యక్షగాన రచన తీరెట్టిదో చూతమన్న నాకృతియు కృతిమాసిపోయినది. క్రీ.శ. 1500 సం. ప్రాంతమువాడగు వెల్లంకి తాతంభట్టు తన కవిచింతామణియను లక్షణ గ్రంథమున భాషా లక్షణాధికారమున "లక్ష్మీకళ్యాణములోని రేకు"లను పేర "నీరజోదరు రాణి నీలవేణికిని" అను నుదాహరణ మిచ్చెను. రేకులను రచనా విశేషము యక్షగానములందు మాత్రమే కన్పట్టును. యక్షగాన పదములకు జక్కుల రేకులను పేరున్నట్లు సంకీర్తన లక్షణమునుండి గ్రహింపనగునుగదా. అయితే తాతంభట్టు నుదాహరణము ద్విపద పాదము కాని యిది జంపెగతి గలది. ఆ ప్రక్కనున్న రేకను మాట కాదనరానిది. ఇది చిత్రకవి పెద్దన యక్షగానము లందుండునని చెప్పిన "జంపెరేకు" లక్షణమునకు సన్నిహితముగా నున్నది. పై లక్ష్మీ కల్యాణము యక్షగానమై యుండునని తలంపనగును. కాని యీ గ్రంథము కూడ లభింపలేదు. ఇది యత్కృతమను విషయము గూడ తెలిసినది కాదు. దీనిని బట్టి నాటి యక్షగానములందు రేకనునది యొక రచనాంగమని యూహింపనగును. దాని స్వరూపమెట్టిదో యెఱుగుట కాంధ్రమున యక్షగాన లక్షణముగూర్చి చెప్పుటకు గొంత ప్రయత్నము చేసిన వారిలో మొదటివాడు చిత్రకవి పెద్దన (16వ శతాబ్ది పూర్వార్థము) రచించిన లక్షణసార సంగ్రహమును పలుకరింపవలెను. అతడు నవవిధ రగడల లక్షణములను చెప్పి వెనువెంట యక్షగానము గూర్చి యిట్లెత్తుకొనినాడు - సీ॥ "వృషభగతి త్రిపుటరే కంఘ్రియుగమగుఁ - దుదనేడు లఘువులు తొలగజేయు జంపె రేకునకు లక్షణము ద్విరదగతి - యగుగొన నొక లఘువందుమాన రచ్చరేకగును దురగవల్లనముగతి - మరి యేకతాళి యౌ మధురగతిని అట తాళమున మాత్ర లంఘ్రికిర్వది నాల్గు - నాల్గిట విరతి పధ్నాలుగింట తే॥ నిలుచు నర్థంపు నర్థచంద్రికలు దీన - యక్షగానాది కృతులలో నార్యులిడిన రగడ భేదంబు లివి యౌను రమ్యచర్య - యవిత నిజదాస సముదాయ! యాంజనేయ" ల. సా. సం. 2-141. ఇందు పేర్కొనబడిన త్రిపుటాదులు సంగీత ప్రపంచమున సూళాదితాళములుగా బ్రసిద్ధములు. మఱి "త్రిపుటరేకు", "జంపెరేకు" అనగా నవి తత్తత్తాల ప్రధానములగు గీతములందేకైక చరణములు లేక దళములను విభాగముల వంటివై యుండును. అందలి యర్థము లర్థచంద్రికలు. "యక్షగానాది కృతులలో నార్యులిడిన రగడ భేదంబులివి" రగడ భేదములు కాని రచనా విశేషము లింక నెన్నిగలవో యానాటి యక్షగానములందది యెఱుగరాదు.

క్రీ.శ. 1450-1550 సం.ల నడుమ యక్షగాన లక్ష్య లక్షణములిట్లు లాక్షణిక పరిగణమున కెక్కినవనగా నా ప్రాంతమున యక్షగాన రచన కొంత సాగినదనియే చెప్పవచ్చును.

ఈనాడు దొరికేవానిలో కవికాలం తేలినంతలో కందుకూరు రుద్రకవి సుగ్రీవ విజయమే ప్రాచీన తమమైనదిగా పరిగణింపబడుతోంది. అతడు పెద్దనకు ఒక్కింత అర్వాచీనుడు. అయితే చక్రపురి రాఘవార్యుని విప్రనారాయణ చరిత్రమనే యక్షగానాన్ని పెద్దనకు సమకాలీనమైన దానిగా అంటే ఇప్పటికి మనకు లభ్యమయ్యే వానిలో మొదటిదానిగా నేను గుర్తించి నా పరిశోధన నిబంధనలో దానినిగూర్చి వ్రాసియున్నాను. ఇదీ సుగ్రీవవిజయము రెండును కవులచే యక్షగానాలుగా పేర్కొనబడినవే. రెండింటిలోను రచనా సామ్యము స్పష్టముగా గుర్తింపవచ్చును. రెండింటిలోను ఎత్తుగడ అర్ధచంద్రికలలో దశావతార ప్రశంసాత్మకముగానే షష్ఠ్యంతాలు. గ్రంథాంతమున కర్తృత్వ ద్విపద, రచనలో ద్విపదకు జంపె, త్రిపుట మొ॥ తాళ ప్రధానమైన రేకులకు ప్రాచుర్యము, యెడనెడ సంధి ప్రయోజనాత్మకాలయిన చిన్న చిన్న వచనాలు, ఏలలు, అర్ధ చంద్రికలు మొ॥ దేశీయ మధుర కవితా ఛందో విశేషములు, అతివిరళంగా పద్యములు ఉండుట చూడగా అదియే ప్రాచీనయక్షగాన రచనా ఫక్కియని యనిపిస్తుంది. చిత్రకవి పెద్దన యక్షగానాల్లో ఉపయోగింపబడు రగడ భేదాలను ఉదాహరిస్తూ ఏరగడకు ఏతాళము సరిపడునో అంతమాత్రమే చెప్పియున్నాడు. ఆంధ్రదేశంలో యక్షగాన రచన యించుమించు రెండు శతాబ్దముల కాలము ఆ ప్రాచీన ఫక్కిలోనే సాగినది. మధ్యమధ్య కంకంటి పాపరాజువంటి విదగ్ధులు కొందఱు మఱికొన్ని వేషాలు చేరుస్తూ వచ్చిరి. 1650 ప్రాంతపు అప్పకవి స్వయముగా యక్షగాన రచన చేసినవాడైనప్పటికిని దాని లక్షణ విషయమున మాత్రము పెద్దన నుడివిన విషయమునే పునశ్చరణ చేసెను. ఆ లక్షణం పరిపూర్ణమైనది కాకపోయినా వారిరువురు యక్షగాన రచనాంగములలో ముఖ్యమైన దానినిగూర్చి మాత్రమే చెప్పదలచినట్లు తోస్తుంది. అదే తాళము ప్రధానమైన రేకు. దాని మూల ప్రకృతి రగడ. దరువు అన్నది సంస్కృత "ధువా" శబ్ద భావమై ఉండనోపును. నాట్యములోవలె యక్షగానములోను యిది అనేక ప్రయోజనాలకు ఉపయోగపడుచున్నది. ఇది రాను రాను కర్ణాటక హిందూస్థానీ సంగీత పద్ధతులకు ప్రచారము కలిగిన రోజులలో కవుల నేర్పుకొలది రగడ వికృతి విడనాడి రాగ ప్రాధాన్యము వహించినది. అప్పకవి తర్వాత యక్షగానపు టూసు ఎత్తుకొన్న లాక్షణికులు ఒకరిద్దరు లేకపోలేదు. కాని ఎవరు చెప్పినా ఆ లక్షణానికి అవ్యాప్తి పడుతూనే వచ్చినది. అసలు ఎలాంటి ఛందోబంధమునైనా తనలో ఇముడ్చుకో కలిగినటువంటిది యక్షగానము. కాలము గడచిన కొలది దేశములో నాట్య సంగీతములకేర్పడిన వికాస వ్యాప్తులను బట్టి, ప్రయోక్తల అవకాశములనుబట్టి యక్షగానము అనేక వాలకములు వేసినది.

సుగ్రీవ విజయాన్ని పరిశీలిస్తే అది ప్రదర్శన సౌలభ్యముగల రచనయే అనిపించును. ఆనాడు యక్షగానములు ఏవిధముగా ప్రదర్శింపబడినవోగాని, అప్పటికే వీధినాటకాది ప్రదర్శనములలో ప్రతిష్ఠలనందికొన్న భరత విద్యా దురంధరులైన కూచిపూడి భాగవతులవలన పిదప కాలములోనే యక్షగాన ప్రదర్శనలకు ఒక నూతన చైతన్యము ప్రచారము కలిగినట్లు చెప్పవచ్చును. 17వ శతాబ్ది ఉత్తరార్ధములో వారి కులపతి శ్రీసిద్ధేంద్రయోగియొక్క అపూర్వ సృష్టియైన కలాప ప్రదర్శన ప్రక్రియలో నృత్యప్రధానమైనది. కాని దాని రచనా ప్రక్రియకు యక్షగానమే మూదల కావచ్చును. ఆ కలాప ప్రభావము అర్వాచీన యక్షగానములమీద పడినది. కూచిపూడి భాగవతులు తెలుగునేల నాలుగు చెరగులను తిరుగుదురు. వారి ప్రదర్శనలు కారణముగా ఆయా గ్రామములందు మొలిచిన యక్షగాన మేళముల వారు కూచిపూడి కత్తును ఎవరికి చేతనైనంత వారు అనుకరింపసాగిరి. ఏనాదులు, గొల్లలుకూడ యక్షగాన ప్రదర్శనలకు పూనుకొనిరి.

యక్షగానము ప్రదర్శనల కెక్కిన తరువాత కూడ చాల కాలము దనుక దాని ఆద్యప్రకృతియైన శ్రవ్య ప్రయోజనముకూడ ప్రక్కప్రక్కల సాగుతూనే వచ్చినది. 19వ శతాబ్ది ఆంధ్ర దేశములో యక్షగానము ఎక్కువగా పరిణతి చెందిన కాలము. యక్షగానములు కోకొల్లలుగా వెలసినవి. ఇంచుమించు అన్ని నాటక నామముతో ప్రదర్శనలకు ఎక్కినవే. దేశములో పలుతావుల యక్షగాన మేళములు కూడ వెలసినవి. యక్షగాన రచనలో ప్రదర్శనలో స్త్రీలును పాల్గొన జొచ్చిరి. బొమ్మలాటలకు పనికివచ్చునట్లు యక్షగానములు రచింప బడినవి. కొందఱు హరిదాసులు తమ హరికథలను యక్షగానములని వ్యవహరింపసాగిరి. క్రమేపి యక్షగానము మీద సంస్కృత రూపక ప్రభావము ఆధునిక రంగస్థల నాటక ప్రభావము పడసాగెను.

ఆంధ్రదేశపు యక్షగానములలో ముక్కాలు మువ్వీసము పౌరాణికేతివృత్తములే. కొందఱు ప్రసిద్ధ చారిత్రక పురుషుల జీవితోదంతములును యితివృత్తములైనవి. ముందువాటి ప్రసిద్ధ ప్రబంధములును కొన్ని యక్షగానములుగా ప్రదర్శింపబడినవి. కొన్ని యక్షగానముల రచనా ప్రక్రియలో కూడ ప్రబంధపు పలుకుబడి బాగుగా కనుపించుచున్నది. అసలు కొన్ని ప్రబంధములుగా వ్యవహరింప బడినవి.

ఆంధ్రదేశములో యక్షగాన రంగ విషయములో మాత్రము అభివృద్ధి కనుపట్టదు. అప్పటికప్పుడు ఏయూరిమొగనో ఏదేవాలయము ముంగిటనో తటా తుటంగా నిర్మింపబడిన పందిరి క్రింద కటిక నేలయే రంగస్థలము. చుట్టూ కనుచూపుమేర అంతా ప్రేక్షాగారమే. కూచిపూడి భాగవతులు భరత విద్యాదురంధరులైనను ఊరూర సంచారము చేయువారు అగుటచే రంగస్థల విషయమున వారు శ్రద్ధ వహించలేదు. అటు యిటు చెరి యొకనిచే పట్టుకొనబడిన తెల్లని గుడ్డయే తెర. తెరకటు నిటు నూనె దివిటీలువుండును. తెర వెనుక హంగుదారులు వంత పాటకులు ఉందురు. హంగు - తిత్తి - మద్దెల, తాలపు చిప్పలు; తెర ముందు సూత్రధారుడు కన్పట్టును. అతడే ప్రదర్శన ప్రవర్తకుడు. ఆ పాత్రల ఆహార్య విషయములో కూచిపూడి వారి గడియాలు, సరంజామా పేరుపడినవి. ఆంధ్రదేశములో వారి ప్రదర్శన పద్ధతులే ఆదర్శ ప్రాయములైనా ఆ పద్ధతుల లగువు బిగువులు కడమ చోట్ల కానరావు. ఈనాడు ఆంధ్రదేశములో కుచ్‌ కుచ్‌ గా కూచిపూడి వారివి తప్ప ఇతరత్రా యక్షగాన ప్రదర్శన ప్రతిష్ఠలు అడుగంటినవనే చెప్పవలసి యున్నది.

దక్షిణ దేశములో మొదట తంజావూరునందు యక్షగానమునకు రాజభోగము పట్టినది. నాడు యక్షగానానికి నాటక నామము ధ్రువపడినది. నాటి కవులనేకులు అలాటి రచనలు చాల సాగించినారు. అవి కొలువు నట్టువ మేళముల వారిచేత ప్రదర్శింపబడెడివి. అందులో పద్యముల కంటే గద్యమునకే ప్రాధాన్యము పెరిగినది. ప్రాచీన మధుర కవితారీతుల ప్రాచుర్యము తగ్గి పదకవితలు కర్ణాటక సంగీత ఫక్కికలు ఎక్కువగా చోటు చేసికొనెను. సంధి వచనముల సంఖ్య తగ్గి పాత్రల సంవాద వచనముల సంఖ్య బెరుగ జొచ్చెను. అక్కడక్కడ రంగ ప్రయోగ సూచనలు కూడ నుండెను. మార్గ రూపక మర్యాదలు కూడ ఆదరింప బడినవి. తాత్కాలిక విషయములును ఇతివృత్తములైనవి. నాటి రాజాస్థానముల వైభవములు, ప్రజాజీవిత విశేషములు కూడ ముమ్మరముగా చిత్రింపబడినవి. తదుపరి తంజావూరు ప్రభువులైన మహారాష్ట్రులు కూడ మన తెలుగు యక్షగాన రచనా ప్రదర్శనముల యెడ అధికారము జూపి ఉండుట ముదాహవము. శహాజీ ప్రభువొక్కడే (1684 - 1712) ఇరువది గ్రంథములకు కర్త. అతని ఆస్థానాంధ్ర యక్షగాన కవులలో దర్భా గిరిరాజగ్రేసరుడు. అతడు ఆరు యక్షగాన ప్రాయ రచనలు చేసెను. అందు ఒకటి రాజమోహన కురవంజి. కురవంజి తమిళ శబ్దము. అనగా కొరవ జాతి స్త్రీ యని యర్థము. అనగా ఎరుకత. తత్పాత్రవిశిష్టములైన యక్షగానములకే అది ఒక నామాంతరముగా కనిపించుచున్నది.

శహాజీ నాటినుండి చిట్టచివరి శివాజీ (1685 - 1855) వఱకు తంజావూరు మండలము, తత్పరిసరములలో యక్షగాన నాటక రచన ప్రదర్శనములు బాగుగా సాగినవి. సంస్కృత రూపక ప్రభావము యినుమడించి యక్షగానము ఉత్పత్తిలో దేశియైనను పరిణామములో మార్గియైనదని చెప్పవలయును. నాడు యక్షగాన కవులకును, కృతులకును రాజాశ్రయము రంగభోగము విస్తరించినవి. రాజాశ్రితులుకాని యక్షగాన కవులలో ముఖ్యులు నారాయణతీర్థులు, త్యాగయ్య, మేళత్తూరు వెంకటరామశాస్త్రి. సుప్రసిద్ధమైన మేళత్తూరు భాగవతమేళ నాటక సంప్రదాయమునకు ఆద్య ప్రవర్తకుడు వెంకటరామశాస్త్రియే.

18వ శతాబ్దిలో మధుర పుదుక్కోట మైసూరు రాజాస్థానములలోను కడమ కన్నడ తమిళ ప్రాంతములందును తెలుగు యక్షగానములు కొన్ని వెలసినవి. తమిళ కన్నడ యక్షగాన రచనలకు మార్గదర్శకాలైనవి.

తెలంగాణములో యక్షగానములు శతాధికములు కనబడుచున్నవి. రచన 18వ శతాబ్దమునుండియే విరళముగా ప్రారంభమైనది. అవి మొదట ప్రదర్శనలో కంటె పారాయణమునందే ఎక్కువ ప్రచారము పొందెను. 1780 నాటి శేషాచలపు ధర్మపురి రామాయణము 1834 నాటి ముద్దయ కవి మంథెన రామాయణము మొ॥ 19 శ. నుండి ప్రదర్శన కనువైన రచనలు ప్రారంభమైనవి. గోవర్థనం నరసింహాచార్యులు, శేషభట్టరు కృష్ణమాచార్యులు, వట్టెము పాపకవి మొ॥ పండిత కవులు కూడ యక్షగాన రచన చేపట్టిరి. ఆత్మకూరు సంస్థానాధీశుల ప్రాపుల యక్షగానమునకు రాజాశ్రయము లభించినది. ఒక గొల్లకలాపము, ఒక కురవంజి (రూప్‌ఖాను పేట రత్తమ్మ గారిది) కూడ వెలిసినవి. ఈ శతాబ్దిలో ఇప్పటి తెలంగాణాలో యక్షగాన రచన ప్రదర్శనములు సజీవములై ఉన్నవి. అందులో రచనా పాటవము ప్రాచీన ఫక్కి తక్కువై, నాటకీయత వస్తువైవిధ్యము ఎక్కువై ప్రజామోదాన్ని బాగుగా జూరగొనినవి.

యక్షగాన ప్రయోగము

యక్షగాన రచనా ప్రక్రియ పరిణామ చరిత్రను గూర్చిన ముందటి ప్రకరణమున బ్రసక్తానుప్రసక్తముగ యక్షగాన ప్రయోగమును గూర్చియు గొన్ని విశేషములు తెలుపబడినవి. ప్రయోగ సూచనలు, ప్రయోగానుకూల ప్రక్రియయు గల కొన్ని య. గా. ల యుదంత ముదాహరింపబడినది. ఈ విషయమై ద్వితీయ భాగమున నే యే గ్రంథముల యందే యే విశేషములు గలవో తగు సూచన చేయబడినది. యక్షగానము మన దేశినాటక కోశమంతటికిని ప్రాతినిధ్యము వహించిన విశిష్ట ప్రక్రియ కావున దాని ప్రయోగ ఫక్కికను గూర్చి ప్రత్యేకముగ నీ ప్రకరణమునకు బ్రసక్తికల్గినది.

యక్షగాన ప్రయోగము యొక్క ప్రాథమిక స్వరూపము గానరూప కథాఖ్యాన మను విషయము పూర్వోక్తము. ఆ పద్ధతి యొకవంక నప్పటప్పట సాగుచునే వచ్చినదని యూహింప నవకాశము కలదు. ఇందుల కుపబలకముగా తంజావూరు విజయ రాఘవ నాయకాస్థానకవియైన చెంగల్వ కాళకవి తన రాజగోపాల విలాసమున యక్షగానము నంతగా ప్రవర్తితమగు సంగీత గోష్టిగా సూచించిన వైనము, కన్నడదేశమున నీనాడు యక్షగానము 'తాళమద్దల' యను పేరుతో హరికథ వలె వ్యాఖ్యానింపబడుటయు గలదను విషయము, మన హరిదాసులును తమ హరికథలను యక్షగానములని పేర్కొనిన విషయమును బూర్వోక్తములే. అది యొక పదకేళికగా బ్రదర్శింప బడుచుండిన దనుటకాధారములును (పరమానంద యతి, కంఠీరవ రాజుల రచనలు) బొమ్మలాటకు వెనుకపాటగా నుపయోగింపబడు చుండిన (ఇందులకు 19 శ. యక్షగానముల గురించియే తగిన యాధారము గలదు) దను విషయమును బూర్వోక్తమే. అది యెప్పటి నుండి యెట్లొక రూపక ప్రక్రియగా బరిణమించినది వివిధ దశలలో వివిధ ప్రదేశములలో దాని ప్రయోగము తీరెట్టిది అను విషయము గొంత పూర్వోక్తమయైనను బ్రత్యేకముగనే తత్ప్రకరణోచితముగ విపులీకృతమై యిట బునశ్చరణ మొనర్పబడుచున్నది.

క్రీ. శ. 16 వ శతాబ్దమునుండి ఆంధ్రదేశమున యక్షగాన రచన మెక్కువగా సాగుచుండినది. అప్పటికే దోరసముద్రపు నటులు కూచిపూడి భాగవతులు, జంగాలు మొ॥ వారు వివిధములగు వీధినాటకములు, తెరనాటకములు నూరూర ప్రదర్శించుటలో బ్రసిద్ధులై యుండిరి. అట్లు దేశి నాటక కళకు విశేష ప్రచారము కలిగిన యా దినములలో వెలసిన యక్షగానము లందును నాటకోచితమైన రచన సాగినది. అందుల కానాటి సుగ్రీవ విజయాదులే తార్కాణలు. సుగ్రీవ విజయ మానాడు ప్రదర్శితమై యుండుననియే డా. నేలటూరి వెంకటరమణయ్యగారు మొ॥ పండితుల తలంపు. 'ఆ యా పాత్రముల పాటల తత్తద్వేషధారులువచ్చి పాడునట్లును తక్కిన సంధి వచనాదులు ఒకరిద్దరు సూత్రధారప్రాయులు పఠించునట్లును సుగ్రీవ విజయము వీధి యాటగా నాడబడుచుండెడి'దని కీ.శే. వేటూరి వారి వక్కణ.

17వ శ. ఉ. భా. ఆంధ్రదేశమున యక్షగానమునకు కూచిపూడి వారి కలాపముతో సంపర్కము కలిగినది. ఆ కలాప మాత్మాశ్రయ ఫక్కికము; నృత్య ప్రధానమునగు నొక యుపరూపక ప్రాయమైన దృశ్యప్రక్రియ. నాటినుండి యట్టి ప్రక్రియతో యక్షగానములు ననేకము వెలసినవి. పారిజాతములను పేరవెలసిన వందులకు బరమోదాహరణములు.

18వ శతాబ్ది యందాంధ్రదేశ యక్షగానములు కొన్నిటిపై మార్గనాటక ప్రభావము కొంత పొడసూపినది. అది 19వ శ. ఉ. భా. న జిక్క పడినది. అది యట్లు చిక్కపడనున్న కాలముననే దానిపై నాధునిక రంగస్థల ప్రభావము కూడ పడి యక్షగానమందు నాటకీయత యినుమడించినది.

ఆంధ్రదేశమున యక్షగాన రంగ విషయమున తగిన యభివృద్ధి కన్పట్టదు. అప్పటికప్పుడే యూరి మొగనో యే కోవెల మొగిలి వాకిటనో, యే సంపన్న గృహస్థునింటి ముంగిటనో తాటా తూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరిక్రింద గళ్ళాపు జల్లిన కటిక నేలయే దాని రంగస్థలం. కేవల మారుబయట గాక పందిరి క్రింద ప్రదర్శింప బడుటయే దాని యభివృద్ధి. దాని చుట్టును కనుచూపు మేర నంతయు బ్రేక్షకాగారమే. అటునిటు చెరియొకరిచేత బట్టుకొన బడునొక తెల్లని గుడ్డయే తెర. తెరకటునిటు దివిటీలు పట్టబడును. తెర వెనుక హంగుదారులు, తిత్తి, మద్దెల, తాళపు జిప్పల వారును, వంతపాటకులు నుందురు. తెర ముందొక డతడే సూత్రధారుడై ప్రదర్శనారంభమునందు ప్రార్థనాదికముపచరించుట, కథాసందర్భము వివరించుట, పాత్రలకు వంతపాటకులకు పాటల మొదటి ముక్క లందించుట, పాత్రల అభినయమున కనుకూలముగ తాళమువేయుట నడుమ సంధి వచనములను, వస్తుగత వర్ణనాత్మక ద్విపదలను చదువుట మొదలగు పనులొనర్చును. ఒక్కొక్కప్పుడు హాస్యగాడని యొకడు వేరయుండి హాస్యప్రసంగముల నెరపుటతో పాటు సూత్రధారునికి సహాయకుడుగా నుండును. వంతపాటకులు పాత్రలతోపాటు పాడుదురు. భామాకలాపము 'బాణీ'కి ప్రచారము కల్గిన నాటినుండి యక్షగానమున సాధారణముగా బాత్రలు తెరలో నుండియే తమ యుదంతము తామే (ప్రదర్శక ప్రముఖుని పృచ్ఛలపై) చెప్పుకొని (ఈ పద్ధతి సామాన్యజనుల బోధశాలిత కనుగుణముగా కల్పితమై యుండును) గుగ్గిలము ప్రోక్షణతో భగ్గుమను దివిటీల వెలుగు చూపర కనులు మిరుమిట్లు గొల్పగా, సూత్రధారునివెంత వంతపాటకులందుకొను ద్రుతగతి ప్రావేశిక ద్రువతో, హంగుదారుల తాళ మృదంగాదుల హడావుడితో తమ కాలిగజ్జెల గలగలలతో బయల్వెడలి యా యా మేళము సంప్రదాయమును బట్టి సభా నమస్కార సూచకముగా సాభిప్రాయముగా నమ్రశిరస్కతయో, కరముకుళనమో, పుష్పాంజలి సమర్పణమో, కావించి కథా ప్రవర్తనలో పాల్గొనుట పరిపాటి. కూచిపూడి వారి భామావేష మెంతకుగాని తెర బయల్పడదు. ఆ సందర్భమున జడవర్ణన యొకటి మిగుల విశిష్టమైనది. అది యొక ప్రబంధమే - 'వేణీప్రబంధము' భామవేషగాడట్లు తెరపై జడవైచుట భరతమునందు తనకు సాటివారులేరని పందెము చరచుట యట! యక్షగానములలో తెర, ప్రక్కవాటుగా గాకపైనుండి క్రిందు వాటముగా తొలగింపబడును. తెర తొలగునంత హంగుదారులును రంగముపై బాత్రపార్శ్వముల నుందురు. సాధారణముగా యక్షగాన ప్రదర్శనలలో పాత్ర నిష్క్రమణము మాత్రము ప్రత్యేకముగా సూచింపబడదు. తన ప్రయోజన భాగ (portion) మై పోవునంత నా పాత్ర వెనుకకు జరిగి వంతపాటకుల నడుమ నిలబడును. అట్టిచో నా పాత్రలు వంతలో పాల్గొనుటయు కద్దు. ప్రదర్శన సుమారు జాము రాత్రికి ప్రారంభమై తెల్లవారులు సాగును. తెల్లవారు సరికెట్లో ప్రదర్శనము తెముల్చుకొని మంగళము పాడి మేళము వారా వాలకములతోనే యూరి పెద్దల యింటింటికేగి వారి లోగిళ్ళ మఱలనేదో పదాభినయము పట్టి యధోచిత సత్కారములంది పోవుదురు. ఆంధ్రదేశ యక్షగాన ప్రదర్శకులకివి సామాన్య లక్షణములు. ఒక్కొక్కచో నాయా ప్రదేశములందలి ప్రదర్శకుల కౌశలమును బట్టియు నవకాశములను బట్టియు నభిరుచి భేదమును బట్టియు గొన్ని కొన్ని విశేషములు విపర్యాసములు నుండవచ్చును.

ఇక్కడ నాంధ్రదేశ యక్షగానములందు స్త్రీ పాత్ర నిర్వహణము గూర్చి యొకమాట చెప్పవలసియున్నది. 16వ శ. మొదట తప్పిదారి యొక్క తాయికొండ నాటకమున మాత్రము స్త్రీ పాత్ర నొక స్త్రీయే నిర్వహించినట్లు తెలియుచున్నది. కాని 18వ శ. చివరి దనుక స్త్రీ పాత్రలను పురుషులే నిర్వహించినట్లు తెలియనగును. ఆ తాయికొండ నాటకమైనను యక్షగానమని యూహింపనవకాశము గానరాదు. అదియొక వీధి నాటకమైయుండును. పోనీ, నాటి వీధి నాటకములందయిన నన్నిట స్త్రీలు పాల్గొనుచుండిరా యనగా నట్లు గాదు. ఆనాడే కూచిపూడి భాగవతులు వీర నరసింహరాయల యెదుట ప్రదర్శించిన నాటకములలో బురుషుడే స్త్రీ పాత్ర ధరించినట్లు స్పష్టముగా గలదు. వారు గరితల కభినయ విద్య గఱపుదురు. కాని గణికలనైనను తమ నాటకములలో బాల్గొననీయరు - అది కూచిపూడి భాగవతుల ముఖ్య నియమములలో నొకటి. వారి 'భామవేషగాడు' అనుమాటనొకటి తెనుగు దేశమున దఱచు వినిపించుచుండును. భామ వేషమనగా భామా శిరోమణియైన సత్యభామ వేషము. ఆ వేషమే పురుషులచే నిర్వహింపబడినప్పుడు కడమ స్త్రీ వేషములమాట తడవంబనిలేదు. యక్షగానోప స్థితికి జక్కుల పురంధ్రుల యాటపాటలే కారణమైనను యక్షగానము కూచిపూడి భాగవతులు వీధి నాటక ప్రదర్శకుల దృష్టినాకర్షించి యొక రూపక ప్రక్రియగా బరిణమించినంతట దాని జక్కుల జాతి తోడనే సంబంధము పోయినట్లుతోచును. కూచిపూడివారి యాలంబనము గల్గినంతట వారి యాచారముద్ర దానిపై హత్తుకొని యిదియే తదితర ప్రదర్శకులకు నాదర్శప్రాయమగుచు వచ్చినది కొంతకాలము. 18వ శ. నడుమ కూచిమంచి జగ్గకవి చంద్రరేఖా విలాపమున "ఆడు భాగవతుని జాడ గడ్డము మూతి నున్నగా గొరిగించుకొన్నవాడు" అని యన్నమాటను బట్టియు నా కాలముననే తురగా రామకవి యొక చాటువులో భాగోతుల బుచ్చిగానిని స్త్రీపాత్ర ధారిగా బేర్కొనుట బట్టియు నప్పటికి బురుషులే స్త్రీ పాత్ర ధారణము సేయుచుండినట్లు తెలియనగును. కాని 18-19 శతాబ్దుల సంధికాలమున వెలసినట్లూహింప దగిన పురిజాల లక్ష్మీనారాయణ కవి పారిజాత య.గా.న సఖిపాత్ర భాగవతములందు బురుషులు స్త్రీ పాత్రధారణ సేయుటుచితము గాదని వాదించుటయు సత్యభామ ప్రత్యాఖ్యానము సేయుటయు జూడ నా కవికాలమున నక్కడక్కడ స్త్రీలును య.గా.న ప్రదర్శనములందు బాల్గునుటకు బూనుచుండిరనియో లేక స్త్రీ పాత్రలు స్త్రీలే నిర్వహించుటుచితమను వాదము బయలుదేరి యుండుననియో యూహింపదగును. 19శ. నుండి యిటనట స్త్రీలును బ్రదర్శనములలో పాల్గొనుచుండిరనుటకు దగిన యాధారములు గన్పట్టుచున్నవి. విశాఖపట్టణము జిల్లా వృత్తాంత సంగ్రహము (పుట 130) లో "జనరంజక నాటకములు స్త్రీలు పురుషులు వేషములు వేసికొని వినికి చేసెడివారు" అని యున్నది. 19శ. ఉ.భా.న నెల్లూరు మండలము ఆత్మకూరు తాలూకా పడకండ్ల గ్రామ కరణమగు పడకండ్ల స్వామి రాయకవి నట మేళములను రప్పించి నెలల తరబడి వారికి వాసగ్రాసములు గల్పించి, గణియములు, వస్త్రములు ప్రదర్శన శిక్షణయు నిచ్చి తన రచించిన లక్షణా పరిణయాది యక్షగానములను ప్రదర్శింప జేసెడి వాడనియు నా మేళములో "గొనుదిన్నె బుగ్గసాని" యను నామె కవియాజ్ఞపై నాయకవేషము గట్టినట్లును బుగ్గసాని (లక్షణ) మాటగా నా లక్షణా పరిణయ గ్రంధమందే యున్నది. ఇట్టి సందర్భములను బట్టి రానురాను యక్షగాన ప్రదర్శనములందు గొన్ని గొన్ని చోటుల వారికిని బాల్గొనుట కవకాశము గల్గినదని చెప్పనగును.

ఇఁక నీ యక్షగాన ప్రదర్శన ప్రక్రియ యందలి మౌలికమైన తత్త్వము యొక్క లక్షణము లెట్టివనగా-

1. ఇందు రూపారోపము (పాత్రానుకూల వేషధారణము) గలదు. కావున నిది రూపక సమాఖ్యకు దగియున్నది. ("రూపారోపాద్రూపకమ్‌".)

2. ఇందు రసాశ్రయమైన యితివృత్తము, చతుర్విధాభినయ ఆంగిక వాచికాహార్య సాత్త్విక విశిష్టమైన యవస్థానుకృతియు గలవు. కావున నిది నాట్యోపేతమైనది. ("అవస్థాను కృతిర్నాట్యమ్‌", "చతుర్ధాభినయోపేతం నాట్యముక్తం మనీషిభిః నాట్యం రసాశ్రయమ్‌".)

3. ఈ యక్షగాన నాట్యము నృత్త నృత్యాను ప్రాణితమైనదని యెరిగిన పెద్దలెల్లరు చెప్పుదురు. (నృత్తం తాళలయాశ్రయమ్‌, భావాశ్రయం నృత్యమ్‌".)

ఇట్లు నృత్త నృత్య నాట్యాత్మకమైన యక్షగానముపై నిటీవలి కాలమున మార్గరూపకము ఆధునిక రంగస్థల నాటకముల ప్రభావము పడినను దాని ప్రాక్తనమైన ప్రదర్శన ఫక్కిక యొక్క వ్యక్తిత్వము, నంతకంటె ప్రాక్తనమైన దాని జీవ లక్షణమునగు గానకళా ప్రాముఖ్యమును సంరక్షింపబడుచునే వచ్చినవి. నాటక నామ వ్యవహృతమైనను నీ యిరువదవ శతాబ్దియందును యక్షగాన శబ్దము విస్మృతము గాలేదు. మార్గాధునిక నాటకములు యక్షగానమువలె నృత్త నృత్య గాన ప్రధానములు గావు. నృత్త నృత్య ప్రాధాన్య సాదృశ్యము కారణముగా మన పండితులు కొందరు యక్షగానము పాశ్చాత్య దేశము లందలి "ఓపెరా" వంటివని యభిప్రాయపడి యున్నారు. కాని ఓపెరాలు గాన కేవలములైనవి. యక్షగానములు గానప్రధానములే కాని, గాన కేవలములు గావు. అందు గేయ ప్రయోజనమునకేగాని సాధారణ పఠనోద్దిష్టములైన గద్య పద్యములుండును. అదిగాక యక్షగానములందు బ్రయుక్తమగు నృత్త నృత్యముల తీరు వేరు. అది కూచిపూడి భాగవతుల వంటి శిష్టుల చేతిలో నిబిడతర శాస్త్ర ప్రక్రియా నికషాయితమైనది; విశిష్ట సంప్రదాయ చోదితమైనదియును.

అసలు యక్షగాన నాట్యము భరతశాస్త్ర సంప్రదాయానుసారము నృత్త నృత్యాను ప్రాణితమగుటకు, యక్షగానము వీధినాటకము నేకమగుటకును గూచిపూడి భాగవతులే కారకులై యుందురేమోయని కూడ ననిపించును. యక్షగానము రూపక ప్రక్రియగా రూపొందిన నాటికాంధ్రదేశమున కూచిపూడి భాగవతులు భరతవిద్యా దురంధరులుగా విశేష ప్రసిద్ధి గాంచినారు. దేశాటనము సేయుచు నాటక ప్రదర్శనములిచ్చుట వారి వృత్తి. వారు రాజ సన్మానములు గూడ గాంచినారు. (ఈ విషయము పూర్వోక్తము.) ఏ సుముహూర్తముననో యక్షగానము వారిదృష్టి నాకర్షించియుండును. తోడనే వారు తమ వీధి నాటక ప్రదర్శనానుభవమును, భరత విద్యా విదగ్ధతనుబట్టి దానినొక విశిష్టరూపక ప్రక్రియగా తీర్చిదిద్దుటకు కృషిచేసి యుందురు. ఈ యూహ కుపాధి సిద్ధేంద్రయోగి భామాకలాపము సృష్టి. అదికాక యక్షగానములు ప్రదర్శించుట యందును వారు ప్రసిద్ధులు. వారు ప్రదర్శించువానిలో బ్రసిద్ధములైనవి ప్రహ్లాద, ఉషాపరిణయము, శశిరేఖాపరిణయము, రామనాటకము, హరిశ్చంద్ర, నలచరిత్రము మొ॥ అందు కొన్ని నాటకములు వ్యవహరింపబడినను నవి యక్షగాన ప్రాయములైనవే. సాధారణముగా వారి ప్రదర్శనములన్నియు నందు బ్రత్యేకముగా వారి భామా కలాపమును భరతవిద్యా నవద్య ప్రమాణ పటిష్ఠములైనవను సంగతి ఆంధ్రలోకమంతయు నెరింగినదే. వారి భామాకలాపమేకాగ్రముగా నెనిమిది ప్రదర్శనల కుద్దిష్టమైనదట. కూచిపూడి ప్రదర్శనములన్నిట దీని కెక్కువ ప్రచారము. దీని "బాణీనిబట్టి" ఆంధ్రదేశమున వివిధ ప్రదేశములలో నెన్నో భామాకలాపములు వెలసినవి. ఆ "బాణీ"తో యక్షగానములుననేకము వెలసినవి. అయితే ఆదిని యక్షగాన రచనా ప్రక్రియయే భామా కలాపమునకు మూదల. అనగా సిద్ధేద్రునికి (17 శ. మధ్య కాలము) ముందే కూచిపూడివారు యక్షగాన ప్రదర్శనకు పూనుకొని యుందురను నూహకు గొంత యవకాశము గలదు. (అప్పటికే యక్షగాన రచన బాగుగా సాగుచుండినదిగదా.) 16 శ. ఆరంభమునకే వారు నాట్యకళా ప్రచారకులుగా ప్రసిద్ధులుకదా. రంగ విషయమునను, హంగు విషయమునను గూచిపూడివారి ప్రత్యేకత యంతపోయినను బహువిధాభరణములు, కరాళములు (Masks నృసింహాది పాత్రలకు) గలవారి "సరంజాము" దొడ్డది. వారి ప్రదర్శనప్రక్రియ సరేసరి. ఆంధ్రదేశ వివిధ ప్రాంత యక్షగాన ప్రదర్శకులకు వారి ప్రదర్శన పద్ధతులే యాదర్శ ప్రాయములైనను ఏనాదులు, గొల్లలు మొదలగు తక్కువ తరగతి ప్రదర్శకులు బయలుదేరుట వలన కూచిపూడి కత్తునందలి లగువుబిగువులు వారియెడ నంత కానరావు. కూచిపూడి భాగవతులు నూరూర మేళములుగ బర్యటించు చుండుట వలన నాయా వూళ్ళలోను కొన్ని మేళములు మొలిచినవి. సిద్ధేంద్రయోగి మేళము, భాగవతుల దశరథరామయ్య గారి మేళము. 18 శ. న భాగోతుల బుచ్చిగాని మేళము, 19 శ. న రాయలసీమలో లేపాక్షి, వేములపల్లి, తాడిపత్రి మేళములు, 19-20 శ. ల సంధికాలమున నెల్లూరు మండలమున పడకండ్లస్వామి రాయకవి, త్వరకవి రామకృష్ణయ్య గారల మేళములు, విశాఖమండలమున నరసింగపల్లి, కళ్లేపల్లి కందాళ చిదంబరకవి మేళములు, పల్నాటిసీమ మేళములు మున్నగునవి కొన్ని ప్రసిద్ధికెక్కినవి. కాని యొకనాడాంధ్రుల నాట్యకళా ప్రతిష్ఠల కధిష్ఠానమైన కూచిపూడి లోనే యీనాడా భాగవతులకు గతులులేకుండా బోయినవనగా నిక గడమ యెడల యక్షగాన ప్రదర్శన మేస్థితిలో నున్నదో తడవంబనిలేదు.

17 వ శతాబ్ది ప్రథమ పాదముననే తంజావూరులో యక్షగానమునకు రాజాశ్రయము లభించి రంగభోగము విస్తరిల్లినది. రఘునాథ విజయరాఘవ నాయకుల కాలమున నగరి పెత్తనము క్రింద నాటకశాలలు వెలసిన జాడదోచుచున్నది. ఆ రాజులు స్వయముగ యక్షగాన రచన గావించిరి. విజయరాఘవాస్థానమున దానికింకను బ్రోత్సాహము కలిగి యిది వీధినాటక వైఖరితో రంగమున కెక్కినది. విజయరాఘవుని పూతినాహారము, ప్రహ్లాద చరిత్ర మొ॥ కృతులలో రంగప్రయోగ సూచనలనేకము గలవు. (అవి ముందటి ప్రకరణమున నుదాహృతములు.) ప్రహ్లాద చరిత్రమున 'నాటకశాల', 'విదూషకుల' ప్రశంసలు గలవు. ఇది (ఫలానా) 'పాత్ర వాక్య'మని కలదు. చివర నిందలి పాత్ర వివరములును గలవు. దీనిని బట్టి నాడు యక్షగానము రంగమున కెక్కెననుట విస్పష్టము. కాని యా రంగరచన తీరెట్టిదియో తేటపడులేదు. భరతవిద్యా దురంధరులైన నాయక రాజుల నగరినాటక శాలలందైన రంగరచన భరతశాస్త్రోక్తముగ జరిగియుండునని యూహింప నగును. తదుపరి మహారాష్ట్ర ప్రభువులకాలమున తంజావూరిలో యక్షగానముపై మార్గనాటక ప్రభావము కూడ బాగుగా బడి యుండుటచే (ఈ విషయము బూర్వోక్తము) నాడును యక్షగాన రంగము రాజాస్థానమునందైన శాస్త్రోక్తముగానే తీర్పబడి యుండుననుకొనవచ్చును. కాని యా మహారాష్ట్రుల నాటక గ్రంథములలో సూత్రధారుడు భాగవతులను పాత్రలను బలుకరించినట్లుండుట చూడ నా ప్రదర్శన తీరు కొంతవర కాంధ్ర యక్షగానములను బోలినదనియు చెప్పనగును. అందు గణపతి సరస్వతుల స్తుతులతో పాటు పాత్రప్రవేశములును చెప్పబడి యుండుట మహారాష్ట్ర దేశపు 'లలిత' నాటక ఫక్కి. చివరి మహారాష్ట్రప్రభువగు శివాజీ కొలువున భాగవత మేళములుండినట్లు స్పష్టముగా దెలిసినది. (పూర్వోక్తము.) ఆయా యాధారముల వలన నాడు నాయక మహారాష్ట్ర రాజాస్థానములందు నాటక శాలలు భాగవతమేళములు విలసిల్లినట్లును భరతవిద్యా ప్రియంభావకులగు నా ప్రభువుల ప్రోత్సాహమున యక్షగాన రంగరచన, ప్రదర్శన భంగి గొంతయైన భరత శాస్త్ర విధాసంవాదిగాఁ దీర్పపడి యుండునని నూహింపనగును.

17-18 శతాబ్దులలోతంజావూరులోను, మధుర మైసూరు రాజాస్థానములందును యక్షగాన ప్రదర్శనలలో స్త్రీలును బాల్గొనుచుండినట్లాధారములు కన్పట్టుచున్నవి. తంజావూరి రఘునాథుడు 'రంగస్థలంబు రామా లంకృతంబు చేసి' నాడు. (చూ. విజయ విలాసము అవతారిక.) విజయరాఘవాస్థానమున యక్షగానమును గొందరతివలు వినిపించుచుండెడివారని చెంగల్వకాళకవి చెప్పినాడు. (చూ. రాజగోపాలవిలాసము అవతారిక.) వినిపించుట అనగా సంగీత గోష్టి యనియేకాక ప్రదర్శించుట యనియు నూహించుట కవకాశము కలదు. విజయరాఘవాదుల యక్షగాన నాటక ప్రరోచన సర్వసాధారణముగ 'పరాకు స్వామివారు హవణించిన ..... నాటకంబు నటన పటిమ గనుపించ వినుపించేము విన నవధరించుచుండ' అని యుండును. అందుచే కాళకవి వక్కణలో నటన పటిమగతార్థమైనదనియే భావింపనగును. అదియుగాక విజయరాఘవ నాయకమైన విజయరాఘవ చంద్రికా విహారమున నాయనివారి "బైటి నాటకశాల పడుచు" నాయకయైన దనగా నిక నొక నట్టువకత్తె యా వాలకం వేసి దాటకమున బాల్గొనుట కభ్యంతరముండునా నాయనివారి కొలువులో! మైసూరు కంఠీరవ మహారాజు కొలువునను దదుపజ్ఞములగు యక్షగాన ప్రాయ రచనలు పదకేళికలవలె నట్టువరాండ్రచే బ్రవర్తింపబడి యుండునను నూహకుగల సామంజస్యమిదివరకే పరిశీలింపబడినది. మధుర విజయరంగ చొక్క నాథ "సభార్హముగా" వెలసిన తిరుమల కవి తిల్లగోవిందరాజ నాటకమును "ఉదుటు వగకోపుల వైపులమర ... ఇంచుబోణులు నటించు" వారని యందేకలదు. ఆ యాధారములను బట్టి నాడు దక్షిణదేశ రాజాస్థానములందు యక్షగాన ప్రదర్శనలలో స్త్రీలును బాల్గొనుచుండిరని చెప్పవచ్చును. ఇది 17-18 శతాబ్దుల ముచ్చట. కాని 19 శ. పూ. భా. తంజావూరు శివాజీ నగరి భాగవత మేళము "సబనీసు" దగ్గర నుండిన శివాజీ అన్నపూర్ణా పరిణయ నాటకము "వేషాలనావనీసు"న్ను (తం.స. మ.నం. 622) గాని, తం.స.మ.నం. 799 "నాటక పాత్రలు" అను పట్టికలనుగాని పరిశీలించినచో నొక్కయపవాదమైన లేకుండా నన్ని స్త్రీ పాత్రల నెదుటను పురుషనామములే కన్పట్టును. అనగా నానాడు పురుషులే స్త్రీ పాత్రలను ధరించుచుండిరనుట స్పష్టము. దీనికి కారణము 18శ. చివర తంజావూరుకి మిక్కిలి సమీపముననున్న మెలట్టూరున వెలసిన భాగవత మేళ నాటకముల సంప్రదాయము కావచ్చును. అవి నాటి తంజావూరు రాజస్థాన నాటకములవలె యక్షగాన ప్రాయములైనవే యయ్యు కూచిపూడి వారి ప్రదర్శనల వలె నొకగొప్ప విశిష్ట సంప్రదాయ పటిష్టమైన ప్రక్రియగలట్టివి. (ప్రత్యేకముగా వీని గురించి వివరములకు చూ. నా ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర పుట 190-95.)

ఉపసంహారము

సర్వోపభోగ్యమైన సమాహార కళాస్వరూపమై, వివిధ ప్రక్రియాను బంధబంధురమై, బహువిధ పదకవితల పాలవెల్లియై, అతిమాత్ర వస్తు రసచ్ఛందో భాషావైవిధ్య భాసురమై, భిన్నదేశ భిన్నకాల కమ్యపజ్ఞమై అనేక లోకవృత్త విశేష ప్రదర్శకమై ఆంధ్ర జాతీయ రూపక కళాసరస్వతి ప్రతినిధియై అన్యభాషీయులకు అనుకార్యమై యావదాంధ్ర వాఙ్మయమున బహుముఖ వైవిధ్యము, వైశిష్ట్యము కలిగి విశాల సారస్వత శాఖగా విలసిల్లిన ప్రక్రియ యక్షగాన మొక్కటే.

(గమనిక: ఇంకను వివరములకు, విశేషములకు, ఆధారములకు, ఆకరములకు నా "ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర" అను గ్రంథము చూడదగును. ప్రచురణ: ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, వాల్తేరు.)

AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - yakShagAnamu - DR. S. V. Joga Rao DR. S.V.JogaRao ( telugu andhra )