| 1. |
ప్రాతిపదిక సంబోధనోక్తార్థంబులం బ్రథమ యగు.
ప్రాతిపదికార్థమునందు : రాముఁడు - రావణుఁడు.
నియతోపస్థితికము - ప్రాతిపదికార్థము.
సంబోధనమునందు: ఓరాముఁడ - ఓరావణుఁడ.
ఉక్తార్థమందు: రాముఁడు రావణుని సంహరించెను. ఉక్తమనఁగా చెప్పబఁడినది.
ఈ వాక్యమందు నాఖ్యాతము కర్తను జెప్పినది గావునఁ దద్వాచకమగు
రామ శబ్దమునకుఁ బ్రథమమయ్యె.
రామునిచే రావణుఁడు సంహరింపఁ బడియె.
ఈ వాక్యమం దాఖ్యాతము కర్మమును జెప్పినది గావునఁ దద్వాచకంబగు
రావణ శబ్దమునకుం బ్రథమమయ్యెనని యెఱుంగునది. |
|
| 2. |
కర్మంబున ద్వితీయ యగు.
ధాత్వర్థఫలాశ్రయంబు కర్మము నాఁబడు.
దేవదత్తుఁడు వంటకమును వండెను. ఇట వండె ననుమాటకు వంట చేసెనని యర్థము.
వంట ఫలము - చేయుట వ్యాపారము. వంట యనంగ బాకము.
పాకమున కాశ్రయము కావుటంజేసి వంటకము కర్మం బయ్యెనని యెఱుంగునది. |
|
| 3. |
చేతవర్ణకంబు కర్త కగు.
ధాత్వర్థ వ్యాపారాశ్రయంబు కర్తనాఁబడు.
దేవదత్తుని చేతి వంటకము వండఁబడియె.
వండఁబడియె ననఁగా వంట చేయఁబడియెనని యర్థము.
చేయుటం కాశ్రయుఁడగుటం జేసి దేవదత్తుండు కర్తయయ్యె. |
|
| 4. |
చేతవర్ణకంబు హేతుకరణంబులకు, గ్రహ్యాదియోగజంబగు పంచమికిని
బహుళంబుగా నగు.
ఫలసాధనయోగ్యం బగు పదార్థంబు హేతువు. క్రియాసిద్ధిం బ్రకృష్టోపకారంబు కరణంబు.
హేతువునకు: ధనముచేత సౌఖ్యంబు గలుగు. విద్యచేత యశంబు గలుగు.
పక్షంబున వలన వర్ణకంబగు.
కరణంబునకు: ఖడ్గంబుచేత ఖండించె, కోలచేతఁ గూలనేసె.
పక్షంబున దోడవర్ణకంబగు.
గ్రహ్యాది యోగంబునందు: జరాసంధుఁడు రాజులచేతఁ గప్పంబు గొనియె.
మైత్రుండు చైత్రునిచేత ఋణంబు గొనియె. ఈ యర్థంబులు నీచేత నెఱింగితి.
ఈ వృత్తాంతంబు వానిచేత వింటి.
పక్షంబున వలన వర్ణకంబగు. ఇత్యాదికంబు లెఱుంగునది. |
|
| 5. |
కరణ సహార్థ తుల్యార్థయోగంబులం దృతీయకుం దోడవర్ణకం బగు.
కరణంబునందు: కోలతోడఁగూలనేసె.
సహార్థంబునందు: రాజు సేనలతోడ వచ్చె - సేనాసహితుండయి వచ్చెనని యర్థము.
తుల్యార్థ యోగంబునందు: చైత్రుని తోడ మైత్రుండు తుల్యుండు.
తృతీయకనుటంజేసి చైత్రునకు మైత్రుండు తుల్యుండని తుల్యార్థయోగంబున షష్ఠియునగు. |
|
| 6. |
వచ్యర్థాముఖ్యకర్మంబునకుఁ దోడఁ కువర్ణకంబులు ప్రాయికంబుగా నగు.
మైత్రుండు చైత్రుని తోడ నిట్లనియె - మైత్రుండు చైత్రున కిట్లనియె.
ప్రాయికం బనుటచే వొకానొకచో ద్వితీయయునగు. |
|
| 7. |
ఉపయోగంబునం దాఖ్యాతకుం దోడవర్ణకం బగు.
నియమపూర్వక విద్యాస్వీకారం బుపయోగం బనంబడు.
రామకృష్ణులు సాందీపునితోడ వేదంబుల జదివిరి - సాందీపునివలన నని యర్థము. |
|
| 8. |
సంప్రదానంబునకుం జతుర్థి యగు.
త్యాగోద్దేశంబు సంప్రదానంబు నాఁబడు.
జనకుండు రాముని కొఱకుఁ గన్యనిచ్చెను.
కొన్నియెడల నుద్దేశ్యమాత్రంబున కగు.
పురుషార్థంబు కొఱకు ప్రయత్నింపవలయు.
చతుర్థికి మాఱుగా షష్ఠియె తఱచుగా బ్రయోగంబులం గానంబడియెడి.
జనకుండు రామునకుం గన్యనిచ్చెను. పురుషార్థంబునకు యత్నింపవలయు. |
|
| 9. |
అపాయ భయ జుగుప్సా పరాజయ ప్రమాద గ్రహణ భవన త్రాణ
విరామాంతర్థి వారణంబు లెద్దాననగు, దానికి వలన వర్ణంకం బగు.
అపాయము - విశ్లేషము, భయము - వెఱపు, జుగుప్స - ఏవ, పరాజయము - దయ్యుట,
ప్రమాదము - పరాకు, గ్రహణము - కొనుట, ఎఱుంగుట - వినుట ఇత్యాది, భవనము - పుట్టుట,
త్రాణము - కాచుట, విరామము - విరమించుట, అంతర్థి - మఁఱుగుట, వారణము - వారించుట.
అపాయంబునకు - మైత్రుండు రాజ్యంబువలన భ్రష్టుండయ్యె.
భయంబునకు - చోరునివలన భయపడియె.
జుగుప్సకు - పాపంబు వలన నేవగించె.
పరాజయమునకు - అధ్యయనము వలన డస్సె.
ప్రమాదంబునకు - పాడివలనం బరాకు వడియె.
గ్రహణంబునకు - మైత్రుని వలన ధనంబు గొనియె.
భవనంబునకు - మనువు వలనం బ్రజలు పుట్టిరి.
త్రాణంబునకు - చోరునివలనం గాచె.
విరామంబునకు - భోగంబుల వలన విరమించె.
అంతర్థికి - కృష్ణుండు తల్లి వలన దాఁగె.
వారణంబునకు - శోకంబువలన వారించె.
ఈ పంచమికి షష్ఠియుం గొండొకయెడల నగు.
చోఱునకు వెఱచె. పాపంబున కేవగించె. అధ్యయనంబునకు డస్సె.
పాడికిం బరాకువడియె. మనువునకు నిక్ష్వాకుండు పుట్టె - ఇత్యాదు లూహించునది. |
|
| 10. |
ఉండిపదం బొకానొకచో వలన వర్ణకంబున కనుప్రయుక్తంబగు.
| హిమగిరివలన నుండి గంగవొడమె - నాకంబువలన నుండి నారదుండు వచ్చె. |
|
| 11. |
ఉండిశబ్దము పరంబగునపుడు వలనకు ద్వితీయాసప్తములు ప్రాయికంబుగ నగు.
వనమునుండి వచ్చె - వనమందుండి వచ్చె. ఊరినుండి వచ్చె - ఊరనుండి వచ్చె.
వనమునుంచి, ధనమునుంచి యని యుంచి శబ్దాను ప్రయోగంబుతోఁ గొందఱు
వ్యవహరించెదరు. గాని యది సాధుకవి ప్రయోగారూఢంబుగాదని యెఱుంగునది. |
|
| 12. |
కంటెవర్ణకం బన్యార్థాది యోగజం బగు పంచమికగు.
రామునికంటె నన్యుండు ధానుష్కుండు లేఁడు. లోభంబుకంటె నితరంబు దోషంబు లేదు.
ఇచట షష్ఠియునగు.
రామున కన్యుండు ధానుష్కుండు లేఁడు.
అన్యము - ఇతరము - పూర్వము - పరము - ఉత్తరము ఇత్యాదు లన్యాదులు. |
|
| 13. |
కంటెవర్ణకంబు నిర్ధారణపంచమి కగు.
ఎచ్చట నిర్ధార్యమాణంబు జాత్యాదులచే భేదంబు కలిగియుండు, నచటం బంచమియగు.
ఆ పంచమికిం గంటె వర్ణకంబగునని యర్థము.
జానపదులకంటె నాగరులు వివేకులు. మానహానికంటె మరణము మేలు. |
|
| 14. |
పట్టివర్ణకంబు హేతువులగు గుణక్రియల కగు.
జ్ఞానముఁబట్టి ముక్తుఁడగు - నీవు వచ్చుటంబట్టి ధన్యుడనయితి.
ఇచట వలన వర్ణకంబు నగు.
జ్ఞానము వలన ముక్తుండగు. |
|
| 15. |
శేషషష్ఠికి యొక్కయు నగు.
ఇచట శేషంబనఁగా సంబంధంబు.
రాముని యొక్క గుణములు - నా యొక్క మిత్రుఁడు - వానియొక్క తమ్ముఁడు.
కువర్ణకంబును గొన్ని యెడల సంబంధంబునం దగు.
నాకుం దమ్ముఁడు - మీకు నెచ్చెలి. |
|
| 16. |
నిర్ధారణషష్ఠికి లోపల వర్ణకంబగు.
జాతి గుణ క్రియా సంజ్ఞలచేత సముదాయంబునుండి యేకదేశంబునకుం
బృథక్కరణంబు నిర్థారణం బనంబడు. ఎద్దానివలన నిర్థారణంబగు నచ్చటి షష్ఠికి
లోపల వర్ణకం బగునని యర్థము.
మనుష్యులలోపల క్షత్రియుండు శూరుండు - గోవుల లోపలఁ గపిల బహుక్షీర -
అధ్వగుల లోపలం బాఱువాఁడు శీఘ్రగామి - ఛాత్రులలోపలఁ మైత్రుండు సమర్థుండు.
ఇచట సప్తమియు గలదు.
మనుష్యులయందు క్షత్రియుండు శూరుండు. ఇత్యాదులెఱుంగునది. |
|
| 17. |
అధికరణంబునకు సప్తమి యగు.
అధికరణంబు నానాధారంబు.
ఔపశ్లేషికంబు వైషయికం బభివ్యాపకంబని యాధారంబు త్రివిధంబు.
ఘటమందు జలమున్నది - మోక్షమం దిచ్ఛ గలదు - అన్నిటియం దీశ్వరుండు గలడు. |
|
| 18. |
ఉకారాంత జడంబునకు నవర్ణకం బగు.
| ఘటంబున జలంబున్నది - దేవదత్తునకు మోక్షమున నిచ్ఛ గలదు. |
|
| 19. |
విశేష్యంబునకుంబోలె విశేషంబునకు లింగవిభక్తి వచనంబు లగు.
| నందతనయుండు కృష్ణుండు నాకు దిక్కు - దేవకీపుత్రు హరిని నుతింతు నెపుడు -
శుభవిధాయుల రామకృష్ణుల భజింతు - భువనవంద్యను రుక్మిణిఁ బ్రస్తుతింతు. |
|
| 20. |
స్త్రీసమంబులగు విశేషణంబులయు మువర్ణకాంత విశేషణంబులయు
బహువచనంబున కేకవచనంబు బహుళంబుగానగు.
మాటలు పెక్కేల - మాటలు పెక్కు నేల.
కులిశధార ల్కుంఠింతం బయ్యె - కులిశధారల్కుఠితంబు లయ్యె.
ఇష్టమగు పదార్థములు - ఇష్టములగు పదార్థములు. |
|
| 21. |
ఒకానొకచో నొక విభక్తికి మఱియొక విభక్తియు నగు.
మైత్రుండు గృహమున వెడలెను - గృహమునుండి యని యర్థము.
వాఁడు వాహనమును దిగెను - వాహనమునుండి యని యర్థము.
వారు సుఖమున్నారు - సుఖముతో నని యర్థము. ఇత్యాదులెఱుంగునది. |
|
| 22. |
జడంబు తృతీయా సప్తములకు ద్వితీయ బహుళంబుగా నగు.
రాముఁడు వాలినొక్క కోలంగూలనేసె - కోలతో నని యర్థము.
లంకం గలకలంబు పుట్టె - లంకయందని యర్థము.
బాహుళకంబుచే నిక్కార్యం బుదంతంబునకు బహుత్వమందెయగు.
అర్జునుండు శత్రుసేనలను బాణంబులను రూపుమాపె - బాణములచే నని యర్థము.
మీనంబు జలంబులనుండు - జలంబులందని యర్థము. |
|
| 23. |
ఉదంత జడంబు తృతీయకు నవర్ణకం బగు.
| రాముఁ డొక్క బాణంబున వాలింగూలనేసె - బాణముచే నని యర్థము. |
|
| 24. |
జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు.
వాఁడు పూవులు దెచ్చె - వాఁడు పూవులను దెచ్చె.
ఆకె సొమ్ములు దాల్చె - ఆకె సొమ్ములను దాల్చె.
వాఁడిల్లు వెడలె - వాడింటిని వెడలె.
బహుళకముచేఁ దృతీయా సప్తములకు విధించిన ద్వితీయకుం బ్రథమ రాదు. |
|
| 25. |
కాలాధ్వములకుం బ్రాయికంబుగాఁ బ్రథమ యగు.
| వాఁడు నిన్నవచ్చె - వీఁడు నేఁడు వోయె - మాపు నిలువుము - ఱేపు పొమ్ము -
వారు క్రోశము నడచిరి - వీ రామడవోయిరి. |
|
| 26. |
సర్వనామ సంఖ్యాభిధాన తద్విశేష్యంబుల యందెయ్యది ముందు ప్రయోగింపబడు,
దాని ద్వితీయాదులకుం బ్రథమ బహుళంబుగా నగు.
అన్ని గుఱ్ఱములకు - అన్నింటికి గుఱ్ఱములకు - గుఱ్ఱము లన్నింటికి -
గుఱ్ఱముల కన్నింటికి సాహిణులు మువ్వురు.
రెండు గుఱ్ఱములకు - రెంటికి గుఱ్ఱములకు - గుఱ్ఱములు రెండింటికి -
గుఱ్ఱములకు రెండింటికి సాహిణులు నలుగురు.
లక్ష గుఱ్ఱములకు - లక్షకు గుఱ్ఱములకు - గుఱ్ఱములు లక్షకు -
గుఱ్ఱములకు లక్షకు - గుఱ్ఱములకు లక్షకు రవుతులు లక్ష - ఇత్యాదు లెఱుంగునది. |
|
| 27. |
ఒకానొకచో విశేషణంబుల షష్ఠికిం బ్రథమ విభాష నగు.
| సుగుణాభిరాముఁడు రామునకు జోహారు వొనర్చెద -
సుగుణాభిరామునకు రామునకు జోహారు వొనర్చెద. |
|
| 28. |
భవత్యర్థ వ్యవహితంబులగు విశేషణంబులకుం బ్రథమ యగు.
అగు మొదలగునవి భవత్యర్థములు.
విద్యాశాలియగు పురుషుని సకల జనులు సన్మానింతురు.
భూతదయాళురగు మహాత్ములకు శ్రేయంబు గలుగును.
అతిమానుష మత్యద్భుత మతిదుష్కర మయిన కేశవార్జున కృతి. |
|
| 29. |
భవత్యర్థకంబు సన్నిహిత విశేషణంబునకును, దాని ముందు విశేషణంబుల
కయి పదంబును బహుళంబుగా ననుప్రయుక్తం బగు.
అతులుఁడయి యప్రమేయుఁడౌ హరిని గొలుతు. |
|
| 30. |
అయి పదానుప్రయోగంబు లేనిచోఁ దుదివిశేషణంబున కేని, విశేషణంబు లన్నింటికేని
మీఁద సముచ్చయార్థంబు విభాషం బ్రయోగింపఁబడు.
ఆద్యుఁ డప్రమేయుఁడు నగు హరిని గొలుతు.
ఆద్యుఁడు నమేయ గుణుఁడు నౌ హరిని గొలుతు.
ఆద్యుఁ డప్రమేయుండగు హరిని గొలుతు. |
|
| 31. |
ధాతుజ విశేషణ వ్యవధానంబున విశేషణంబు లన్నింటి కయి పదంబనుప్రయుక్తం బగు.
| ఆద్యుఁడయి యప్రమేయుఁడై యఖిల సేవ్యుఁడై యెసంగెడు దేవుని నభినుతింతు.
ఇచట మఱియుం ప్రయోగ వైచిత్ర్యంబు గలదది ప్రయోగంబుల నెఱుంగునది. |
|
| 32. |
భావార్థకాది యోగంబునం గర్తకుం బ్రథమ యగు.
| రాముఁడు వచ్చుట - రాముఁడు రాఁగా లక్ష్మణుఁడు గాంచె -
రాముఁడు విల్లందినం ద్రిలోకంబు లాకులంబులగు -
రాముఁడు పట్టిన ప్రతిన వారింపం దరంబుగాదు. |
|
| 33. |
ప్రథమాంతంబు లగు యుష్మ దస్మ ద్విశేషణంబుల కేకత్వంబున
| వు ను లు ను బహుత్వంబున రు ము లు నంతాగమంబులు ప్రాయికంబుగ నగు. |
|
| 34. |
ఈ యాగమంబులు పరంబులగునపు డుత్వంబున కత్వం బగు.
నీవు ధన్యుఁడవు - నేను ధన్యుఁడను - మీరు ధన్యులరు - మేము ధన్యులము.
ఇకారంబు మీఁది కు-ను-వు క్రియా విభక్తుల యుత్వంబున కిత్వంబగు నను
సూత్రముచేత వు ను ల కిత్వంబగు.
నీవు సుకృతివి - నేను సుకృతిని - ఆర్తి హరుఁడ వౌ నినుఁ గొల్తు నంబుజాక్ష - గర్వ
గర్విష్ఠుండను నన్ను - మీరలు పెద్దలు - ఇత్యాదులు ప్రాయిక గ్రహణముచే రక్షితంబులయ్యె. |
|
| 35. |
అది శబ్దంబునకు వు ను లు పరంబు లగునపుడును
సంబోధనంబు నందును దాన యను నాదేశం బగు.
నీవు చిన్నదానవు - నేను జిన్నదాన - ఓ చిన్నదాన. |
|
| 36. |
అన్య యుష్మ దస్మ త్కార్యంబులం దుత్తరోత్తరంబు బలీయంబు.
| వారును మీరును ధన్యులరు - మీరును మేమును ధన్యులము. |
|
| 37. |
ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వపదంబులు
క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపం జను.
పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు
వలచినట్లు ప్రయోగింపదగును.
ఏని ప్రభృతి శబ్దములు కొన్ని నియమ సాపేక్షంబు లయియుండు.
గాలి చల్లగా వీచెను - వీచెను జల్లగా గాలి - చల్లగా గాలి వీచెను -
వీచెను గాలి చల్లగా - గాలి వీచెను చల్లగా - చల్లగా వీచెను గాలి. |
|