| 1. |
ధాతువునకు.
| ఇది అధికార సూత్రంబు. ఇంక నెయ్యది యుపక్రమింపం బడునయ్యది ధాతువున
కగునని యెఱుంగునది. |
|
| 2. |
వర్తమానంబున ల ట్టగు.
| వర్తమాన క్రియావృత్తియగు ధాతువునకు లడ్వర్ణకంబగు. వర్తమానంబు నాఁ
బ్రారబ్ధాపరిసమాప్తంబుం - అప్పటికి ముగియకుండునది. |
|
| 3. |
భూతంబున లి ట్టగు.
| భూతక్రియావృత్తియగు ధాతువునకు లిడ్వర్ణకంబగు. భూతంబు నా విద్యమాన
ధ్యంస ప్రతియోగి - ముందుండి యప్పటికి లేకుండునది. |
|
| 4. |
భావిని లృ ట్టగు.
| భావిక్రియావృత్తి యగు ధాతువునకు లృడ్వర్ణకంబగు. భావి నా విద్యమాన
ప్రాగభావ ప్రతియోగి - అప్పటికిఁ బుట్టకుండునది. |
|
| 5. |
తద్ధర్మాదులందు లా ట్టగు.
| తద్ధర్మాతి క్రియావృత్తియగు ధాతువునకు లాడ్వర్ణకంబగు. తచ్ఛీల సంభావనా
సంప్రశ్న సాతత్య వర్తమాన భావ్యాశీరాదులాదిపద గ్రాహ్యంబులు. |
|
| 6. |
ఆశీశ్శాస సంప్రార్థనవిధులందు లూ ట్టగు.
| ఆశీరాదులందు ధాతువునకు లూడ్వర్ణకంబగు. |
|
| 7. |
వ్యతిరేకంబున లఙి యగు.
| వ్యతిరేక విశిష్ట క్రియావృత్తియగు ధాతువునకు లఙివర్ణకంబగు. |
|
| 8. |
లకారంబునకు డుఙ్రువురును ముఞ్ఞగు.
లడాది లకారంబులం దొక్కొక్కటికి డుజాదు లాదేశంబులగు.
ఇందు ఞాకారంబు ప్రత్యాహారార్థంబు. |
|
| 9. |
అందు వరుసను రెండేసి ప్రథమమధ్యమోత్తమంబు లనంబడు.
| డుఙ్ - రు - ప్రథమము, వు - రు మధ్యమము, ను - ము ఉత్తమము. |
|
| 10. |
వానిలో రు ము లు బహువచనంబులు, పెఱ లేకవచనంబులు.
|
| 11. |
నామ యుష్మదస్మ దర్థములందుం బ్రథమమధ్యమోత్తమంబు లగు.
|
| 12. |
అమహదర్థంబునందు డుఙ్రులకు దు వు లగు, నున్నానుబంధంబు మీఁద దివియగు.
|
| 13. |
ఉదంతంబునకు లట్టు పరంబగునపు డున్నానుబంధం బగు.
| ఉదంతంబయిన ధాతువునకు లట్టు పరంబగునపుడు - ఉన్న అను శబ్దంబనుప్రయుక్తంబగు. |
|
| 14. |
ఉన్న శబ్దంబు పరంబగునపుడు చువర్ణకం బగు.
|
| 15. |
దివీతరం బగు డుఞ్ఞు పరంబగునపు డున్నానుబంధంబు నకు దీర్ఘం బగు.
ప్రథమము: వాఁడు వండుచున్నాడు - వారు వండుచున్నారు -
అది వండుచున్నది - అవి వండుచున్నవి.
మధ్యమము: నీవు వండు చున్నావు - మీరు వండుచున్నారు.
ఉత్తమము: నేను వండుచున్నాను - మేము వండుచున్నాము. |
|
| 16. |
లిడ్లాట్టుల డుఙ్ఙున కెను ను వర్ణంబు లగు.
| లిడాదేశంబగు డుఙ్ఙునకు - ఎను - అనునదియు, లాడా దేశంబగు
డుఙ్ఙునకు - ను అనునదియు నాదేశంబగు. |
|
| 17. |
భూతంబునం దిగాగమం బగు.
| భూతార్థ వృత్తియగు ధాతువున కిగాగమంబగు. |
|
| 18. |
లిట్టు వుఙ్ఙు పరంబగునపుడు తి వర్ణకం బగు.
ఇకారంబు మీఁది కు - ను - వు క్రియా విభక్తుల యను సూత్రముచే
రుఞ్ఞున కిత్వంబు.
ప్ర: వండెను, వండిరి.
మ: వండితివి, వండితిరి.
ఉ: వండితిని, వండితిమి. |
|
| 19. |
కలఙ్యనుబంధంబు లృట్టు పరంబగునపు డగు.
| లృట్టు పరంబగునపుడు ధాతువునకు - కలఙి అనునది యనుప్రయుక్తంబగు. |
|
| 20. |
ఙీత్తు పరంబగునపు డుత్వంబున కత్వం బగు.
| ఙీత్తు పరంబగునపుడు ధాతువు నుత్వంబున కత్వంబగు. |
|
| 21. |
కలఙి పడుఙులు పరంబులగునపుడు నుగాగమం బగు.
ద్రుతకార్యంబు.
ప్ర: వండఁగలడు - వండఁగలరు - వండఁగలదు - వండఁగలవు.
మ: వండఁగలవు - వండఁగలరు.
ఉ: వండఁగలను - వండఁగలము. |
|
| 22. |
లాట్టు రుఞ్ఞు పరంబగునపుడు దుగాగమం బగు.
ప్ర: వండును - వండుదురు.
మ: వండుదువు - వండుదురు.
ఉ: వండుదును - వండుదుము.
లాడర్థంబులయం దోలి నుదాహరణంబులు వక్కాణించెద.
తద్ధర్మంబు: కులాలుఁడు కుండలు వానును.
తచ్ఛీలంబు: జ్వలనజ్వాలంబు లుప్పరం బెగయును.
సంభావన: ఇప్పుడు వాడింటనుండును.
సంప్రశ్నము: ఉందునా - పోదునా.
సాతత్యము: సర్వంబునం దీశ్వరుఁడుండును - సర్వంబీశ్వరుని యందుండును.
వర్తమానంబు: మేననిప్పుడుం బులకలు వొడమెడును.
వక్ష్యమాణవిధిచేఁ బ్రాయికంబుగ వర్తమానంబునం దెడు గాద్యాగమంబులగు.
భావి: వాఁడు ఱేపు వచ్చును.
ఆశీస్సు: శుభం బగును.
వచ్యర్థంబుల కొకానొకచో భూతంబున లాట్టు గానం బడియెడును. |
|
| 23. |
లాట్టు రుఞ్ఞు పరంబగునపు డెదగాగమంబును, బ్రథమ నువర్ణకంబు పరంబగునపు డెడు గెడి గాగమంబులును బహుళంబుగా నగు.
ప్ర: వండెడును - వండెడిని - వండెదరు.
మ: వండెదవు - వండెదరు.
ఉ: వండెదను - వండెదము. |
|
| 24. |
లిడ్లాట్టుల వకారంబునకు లోపంబు విభాష నగు.
| వండితి - వండితిని, వండుదు - వండుదువు, వండెదు - వండెదవు. |
|
| 25. |
తిర్యగ్జడంబులు వాచ్యంబు లగునపుడు లిడ్లాట్టుల ప్రథమ బహువచనంబున కేకవచనం బగు.
చిలుకలు వలికెను - చిలుకలు వలుకును - చిలుకలు వలికెడును.
మేఘములు గర్జిల్లెను - మేఘములు గర్జిల్లును - మేఘములు గర్జిల్లెడును. |
|
| 26. |
లూట్టు డుఞ్ఞున కెడు త వర్ణంబులు ద్రుతాంతంబులగు.
ఆశీస్సు: మీకు మేలు గలిగెడును - మీకు మేలు గలుగుతను.
శాపంబు: నీకు రాక్షసత్వంబు గలిగెడును - నీకు రాక్షసత్వంబు గలుగుతను.
సంప్రార్థనంబు: హరి ననుఁ గృపగాంచెడును - హరి ననుఁ గృప గాంచుతను. |
|
| 27. |
విధియందు లూట్టునకు మాఱుగా నది యను తచ్ఛబ్దంబును ముందు నుగాగమంబు నగు.
| మైత్రుండు నా నిర్దిష్ట కార్యంబు చేయునది. వానికి నీవు బాసటయయి యుండునది. |
|
| 28. |
ఎడు త ల ద్రుతంబున కచ్చు పరంబగునపుడు మకారం బగు.
| నీకు మేలు గలిగెడు మనియెను - నీకు మేలు గలుగుత మనియెను. |
|
| 29. |
లూణ్మధ్యమ వు రు లకు ముడుఙ్ఙు లగు.
ఆశీస్సు: దీర్ఘాయువ వగుము - దీర్ఘాయులరగుఁడు.
శాపంబు: రాక్షసుఁడ వగుము - రాక్షసులరగుఁడు.
సంప్రార్థనంబు: నన్ను రక్షింపుము - నన్ను రక్షింపుఁడు.
విధి: నా చెప్పిన పని చేయుము - నా చెప్పిన పని చేయుఁడు. |
|
| 30. |
ఉభయప్రార్థనంబునం దుగాగమంబున కత్వం బగు.
|
| 31. |
మధ్యమ ముడుఙ్ఙులు ముఙ్ఙులు నాఁబడు.
ఙీత్తుపరంబగునపు డుత్వంబున కత్వంబగునను సూత్రముచే లఙిపరంబగునపుడు డత్వంబు.
ప్ర: వండఁడు - వండరు - వండదు - వండవు.
మ: వండవు - వండరు.
ఉ: వండను - వండము. |
|
| 32. |
వ్యతిరేకంబున ముఙ్ఙు పరంబగునపుడు కుఙి యగు.
| నీవు వండకుము - మీరు వండకుఁడు. |
|
| 33. |
సంప్రార్థనంబుల ముఙ్ఙున కదాదులు విభాష ననుప్రయుక్తంబు లగు.
వండుమ - వండుమా - వండుమి - వండుమీ -
వండుఁడ - వండుఁడా - వండుఁడి - వండుడీ.
అ - ఆ - ఇ - ఈ - ఎ - ఏ - ఒ - ఓ - అమ్మ - అయ్య ఇత్యాదు లదాదులు. |
|
| 34. |
ఎదాదు లనుప్రయుక్తంబులగునపుడు ముఙ్ఙునకు వుఙి రుఙి యగు.
| వినవె - వినవే - వినరె - వినరే - వినకువె - వినకువే - వినకురే. |
|
| 35. |
ట వర్ణకంబు భావంబునం దగు.
భావంబనఁగా ధాత్వర్థంబు.
వండుట - పండుట - వినుట - కనుట. |
|
| 36. |
కఙి వర్ణకంబు పురార్థయోగంబున విభాషను భావంబునం దగు.
| వండక మునుపు - వండుటకు మునుపు - చేయక మునుపు - చేయుటకు మునుపు -
మునుపు - ముందు - మున్ను - తొల్లి. |
|
| 37. |
వ్యతిరేకభావంబున మిఙి యగు.
వ్యతిరేక విశిష్ట క్రియాభిదాయి ధాతువునకు మిఙియగు.
వండమి - పండమి. |
|
| 38. |
సమానాశ్రయంబులం బూర్వకాలంబునం దివర్ణకంబగు.
ఏకాశ్రయంబులకు క్రియలలోపల నెయ్యెది పూర్వకాలికం బగుం
దద్వాచియగు ధాతువున కివర్ణకం బగు. ఇదియె క్త్వార్థంబు నాఁబడు.
వండి - పండి - విని - కని.
సమాన కర్తృకంబులనక సమానాశ్రయంబులనుటంజేసి
చైత్రునిచేత మైత్రుండు కొట్టంబడి మడిసె నిత్యాది సిద్ధంబయ్యె. |
|
| 39. |
కఙి వ్యతిరేక క్త్వార్థంబునం దగు.
| వండక - పండక - కొట్టక - తిట్టక. |
|
| 40. |
తుమర్థ భావలక్షణంబులందు నుఙి యగు.
భావలక్షణంబు నా నన్యక్రియకు లక్షణ భూతంబగు క్రియ.
తుమర్థంబందును, భావలక్షణంబు నందును ధాతువునకు నుఙి వర్ణకంబగు.
తుమర్థంబు: చైత్రుండు వండను బోయెను. పాకక్రియార్థము పోయెనని యర్థము.
భావలక్షణము: చైత్రుండు వండ నతిథి వచ్చెను. ఇచట వంట లక్షణము, వచ్చుట లక్ష్యము. |
|
| 41. |
చేదర్థంబునందు, వృత్తంబగు భావలక్షణంబునందు న వర్ణకంబు ద్రుతాంతం బగు.
| వానలు గురిసినం బంటలు పండును. వాఁడు రమ్మనినఁ బోయితిని. |
|
| 42. |
ఆనంతర్యంబున డు వర్ణకంబు ద్రుతాంతం బగు.
| జాబిలి తోతెంచుడుం గువలయంబులు వికసిల్లె. |
|
| 43. |
చువర్ణకంబు ద్రుతాంతంబు క్రియాస్వయంబున శత్రర్థంబునం దగు.
| చూచుచుం బోవుచున్నాఁడు - చూచుచుం బోయెను - చూచుచుం బోవఁగలడు. |
|
| 44. |
తృ వర్ణకార్థంబునం దెడి యెడు వన్నియ లగు.
| ప్రవహించెడి వాఁడు - ప్రవహించెడు వాఁడు. ప్రహర్తయని యర్థము. |
|
| 45. |
వానికి లోపంబు బహుళంబుగా నగు.
| ప్రహరించువాఁడు. ప్రహర్తయని యర్థము. |
|
| 46. |
ఉన్న కలఙి న వర్ణకంబులు భవద్భావి శతృక్త వదర్థంబులం దగు.
ఉన్న వర్ణకంబు వర్తమానార్థక శత్రర్థంబునందగు - కలఙి వర్ణకంబు
భవిష్యదర్థక శత్రర్థంబునందగు - నవర్ణకం బుక్తవదర్థంబు నందగు.
ఇవి సత్వాభిధానంబునం దగునని యెఱుంగునది.
సుబంత వాచ్యంబు సత్వంబునాఁబడు.
వండుచున్నవాఁడు - వండఁగలవాఁడు - వండినవాఁడు. |
|
| 47. |
వ్యతిరేకి తృ వర్ణకార్థంబున నిఙీ యగు.
వండనివాఁడు.
ఎడి ప్రభృతి వర్ణకాంతంబు లేడును ధాతుజ విశేషణంబులని ప్రాచీనులు వ్యవహరింతురు. |
|
| 48. |
లకారాదులు సకర్మకంబునకుం గర్తృకర్మంబులందును లాఁతికిం గర్తయందు నగు.
| సకర్మకంబు నాఁ గర్మకాంక్షోత్ణాపకంబు - అకర్మకంబు నాఁ గర్మా కాంక్షానుత్థాపకంబు. |
|
| 49. |
పడుఙ్య నుబంధంబు కర్మంబు నందగు.
| కొట్టఁబడుచున్నాఁడు - కొట్టఁబడుచున్నది - కొట్టఁబడుట - కొట్టఁబడనివాఁడు. |
|
| 50. |
గురువిరహితంబు లయి యయాంతంబులయిన యేకస్వర ద్విస్వరంబుల యించుగ్వక్రంబుల కియుడాగమంబు విభాష నగు.
ఏకస్వరధాతు ద్విస్వరధాతువుల మీఁది యించుగ్వక్రంబుల కియుడాగమంబు విభాషనగు.
గురుమంతంబగు ధాతువునకును, యాంతంబగు ధాతువునకును మీఁది యించుగ్వక్రంబుల
కియుడాగమంబురాదు.
భుజ్ - ఇయ్ - ఇంచు - భుజియించు. పక్షంబున భుజించు.
గున - ఇయ్ - ఇంచు - గుణియించు - గుణించు.
ఇంచుగ్వ్యవధానంబునం జేసి సంస్కృతధాతువులు వక్రపరకంబులు లేవని యెఱుఁగునది.
యాచ్ - అర్థ - ఇత్యాదులు గురుమతంబులు. వ్యయ - ఇది యాంతము.
యాచించు - అర్థించు - వ్యయించు.
జి - ఇంచు - అనుచో నిత్యంబగుటం జేసి యయుగమంబు రాఁగా
యాంతంబగుటంజేసి యియుడాగమంబులేదని యెఱుంగునది.
కృతాకృత ప్రసంగి నిత్యంబు నాఁబడు.
నగు - ఇయ్ - ఇంచు - నగియించు - నగించు.
నగు - ఇయ్ - ఎను - నగియెను - నగెను.
పడు - ఇయ్ - ఎను - పడియెను - పడెను ఇత్యాదు లెఱుంగునది. |
|
| 51. |
పడ్వాదుల న వర్ణకంబున కత్వంబును, గడహల్లునకు ద్విత్వంబును విభాష నగు.
పడ్డ - పడిన - పడ్డను - పడినను.
పడు - ఇడు - చెడు - తగు - అను - కను - కొను - తిను -
మను - విను - చను ఇవి పడ్వాదులు. |
|
| 52. |
క్రియాఫలంబు కర్తృగామి యగుచోఁ కొను ధాతు వనుప్రయుక్తం బగు.
ఇదియె యాత్మనేపదార్థంబని వ్యవహరింతురు.
వండుకొనుచున్నాఁడు. |
|
| 53. |
కొను ధాతువు పరంబగునపు డిగాగమంబు బహుళంబుగా నగు.
వండికొనియె - వండుకొనియె.
బహుళం బనుటచే యాంతంబునకు నిత్యంబు.
చేసికొనియె. |
|
| 54. |
ఇకార వక్రంబు లుక్తంబులందలవి పరంబులగుచోఁ యాకు సకారం బగు.
| చేయు - చేసిరి - చేసి - చేసికొను - చేసెను - చేసెడిని - ఇత్యాదు లెఱుంగునది. |
|
| 55. |
చువర్ణకంబు పరంబగునపు డన్వాదుల కుత్వలోపంబేని, ను స్థానంబున బిందువేని విభాష నగు.
అన్చున్నాఁడు - అంచున్నాఁడు - అనుచున్నాఁడు -
అన్చును - అంచును - అనుచును.
అను - కను - కొను - తిను - మను - విను - యివి యన్వాదులు. |
|
| 56. |
ఉన్న శబ్దంబు పరంబగునపు డుండు ధాతువునకు లోపం బగు.
ప్ర: ఉన్నాఁడు - ఉన్నారు - ఉన్నది - ఉన్నవి.
మ: ఉన్నావు - ఉన్నారు.
ఉ: ఉన్నాను - ఉన్నాము. ఉన్నవాఁడు. |
|
| 57. |
చేదాద్యర్థనాంతం బయిన యుండు న కున్నాదేశంబు విభాష నగు.
|
| 58. |
తి దు ట లు పరంబులగునపు డన్వాదుల నుస్థానంబున సున్నయు, నుండు డు లోపంబును విభాష నగు.
అందురు - అంట - ఉందురు - ఉంట.
పక్షంబున అనుదురు - అనుట - ఉండుదురు - ఉండుట ఇత్యాది. |
|
| 59. |
ఇట బిందువుమీఁద త ద లకు నిత్యవైకల్పికంబు లయి ట డ లగు.
అంటిని - అనితిని - అండురు - అందురు.
ఉంటిని - ఉండితివి - ఉండురు - ఉండుదురు. |
|
| 60. |
ముఙ్ఙు పరంబగునపుడు కో శబ్దంబు కొనునకు బహుళంబుగా నగు.
| బహుళంబనుటచే దీనికి నొకానొకచో నతిచారంబని యెఱుంగునది. |
|
| 61. |
ముఙ్ఙు పరంబగునపుడు దీర్ఘంబునకు హ్రస్వంబును, మువర్ణకంబునకు మాముడియు నగు.
| కొమ్ము - కొనుము - కొండు - కొనుఁడు. |
|
| 62. |
రు వర్ణకంబు పరంబగునపుడు సున్నమీఁది త ద డ ల యుత్వంబునకు లోపంబు విభాష నగు.
| పోషింత్రు - పోషింతురు, కొంద్రు - కొందురు, కొండ్రు - కొండురు. |
|
| 63. |
సంస్కృతంబున కంగలాదుల కించు క్కగు.
సంస్కృతధాతువుల కంగలాదుల కించు గాగమంబగు.
పచించు - వచించు - త్యజించు - భజించు - అంగలించు.
అంగల - అడక - ఆరగ - ఆవుల - ఉంక - ఉగ్గడ - ఓసర -
కార - గాల - జాడ - తిలక - తులక - పంక - పరిక - పలవ -
అప్ప - ఒప్ప - ఆల ఇత్యాదు లంగలాదులు. |
|
| 64. |
ఇ ఉ ఋ ల కించుక్కు పరంబగునపు డ యు గ పు గరుక్కు లగు.
జి: జయించు. నీ: నయించు. ద్రు: ద్రవించు.
లూ: లవించు. ధృ: ధరించు. తౄ: తరించు. |
|
| 65. |
నిర్జి నామంబుల కయుగాగమంబు గలుగదు.
నిర్జికి, నామధాతువుల కయుగాగమంబు గలుగదు.
నిర్జించు - నుతించు - స్తుతించు.
ఈ జ్ఞాపకంబుచేతనే నామంబులకు ధాతుత్వ వివక్షయం దించు గాగమంబగునని
యెఱుంగునది.
శయనించు - పయనించు. |
|
| 66. |
సంస్కృతంబునకు లఘూపధంబున కించుక్కు పరం బగునపుదు గుణం బగు.
ఆ - ఏ - ఓ. ఈ మూఁడును గుణంబులు నాఁబడు.
ఋ స్థానికంబగు గుణంబు ర పరంబయి యుండు.
సంస్కృతధాతూపధలకు ఇ - ఉ - ఋ అను వానికి సొరిదిని ఏ - ఓ - అర్ -
అనునవి యించుక్కు పరంబగునపు డగునని యెఱుంగునది.
ఛిద్ - ఛేదించు, భిద్ - భేదించు, ఘుష్ - ఘోషించు,
పుష్ - పోషించు, వృష్ - వర్షించు, హృష్ - హర్షించు. |
|
| 67. |
స్పృశికి గుణంబు విభాషనగు.
|
| 68. |
లిఖ భుజ రుచ కృశంబులకు గుణంబు లేదు.
లిఖించు - భుజించు - రుచించు - కృశించు.
కుచధాతువునకు గుణంబులేదని యొకండు వక్కాణించె, నది గ్రాహ్యంబు గాదు. |
|
| 69. |
సృజికి నిర్మితిని గుణంబు లేదు.
| చతుర్ముఖుండు ప్రజలను సృజించె. అతండు విషయంబుల విసర్జించె. |
|
| 70. |
సర్వంబునకుం బ్రేరణంబునం దించు క్కగు.
| పచింపించు - వచింపించు - ఆవులింపించు - వండించు - పండించు. |
|
| 71. |
రంజాదుల యించుక్క కారంబునకు సబిందుకంబున కప్రేరణంబున ద్విరుక్తలకారం బగు.
రంజిల్లు - భాసిల్లు - వర్ధిల్లు - విలసిల్లు - రాజిల్లు.
ఈ యాదేశయోగంబున భిదాదు లకర్మకంబులగు.
భేదిల్లు - కంపిల్లు - సంధిల్లు. |
|
| 72. |
ఇంచుక్కు పరంబగునపుడు రంజాదుల యించుక్కునకు లోపం బగు.
లాదేశంబున కపవాదంబు.
రంజించు - భేదించు - సంధించు. |
|
| 73. |
చుగాగమం బాచ్ఛికంబున కసంయుక్త న ల డ రాంతంబునకుం బ్రేరణంబున బహుళంబుగా నగు.
వూను - వూనుచు - వూనించు.
తేలు - తేలుచు - తేలించు.
మగుడు - మగుడుచు - మగిడించు.
కుదురు - కుదురుచు - కుదురించు.
విను - వినుచు.
వక్ష్యమాణంబు పుగాగమంబు.
వినిపించు.
బాహుళకంబుచేఁ గొన్నింటికిఁ జుగాగమంబు లేదు.
అను - అనిపించు, తిను - తినిపించు, కను - కనిపించు.
దీని యత్వంబునకు దీర్ఘంబునగు.
కానిపించు. |
|
| 74. |
అట్లు పుగాగమంబును మాన్వాదుల కగు.
మాను - మానుపు - మానుచు, మను - మనుపు - మనుచు.
బాహుళకంబున దీని కించిక్కులేదు. |
|
| 75. |
చుక్పువర్ణంబులు పరంబులగునపు డిత్వంబున కుత్వం బగు.
|
| 76. |
అట్లు చుక్పుగాగమంబు లడంగ్వాది మాయ్వాదుల కగునగుచో, వాని కడవ్రాలు లోపించు.
అడఁగు - అడఁచు - అడఁగించు, మాయు - మాపు - మాయించు.
అడఁగు - కరగు - కలఁగు - నలఁగు ఇత్యాదు లడంగ్వాదులు.
మాయు - ఉడుగు - కడగు - కుడుచు - బిగియు ఇత్యాదులు మాయ్వాదులు.
ఆఁగు ప్రభృతు లుభయగణంబులు.
బాహుళకంబునంజేసి కొన్నింటి కించుక్చుక్పుగాగమంబులు మూఁడును,
గొన్నింటికందు యథా సంభవముగా రెండును, గొన్నింటి కొక్కటియు
నగునని యెఱుంగునది.
ఆఁగు - ఆఁచు - ఆఁపు - ఆఁగించు.
రేఁగు - రేఁచు - రేఁపు - రేగించు.
పాయు - పాచు - పావు.
విఱుగు - విఱుచు.
చూచు - చూపు.
నేరుచు - నేరుపు.
మేయు - మేపు.
రేచు - రేపు.
కలియు - కలుపు.
తడియు - తడుపు.
తెలియు - తెలుపు ఇత్యాదు లెఱుంగునది. |
|
| 77. |
ఇంచుక్చుక్పుగాగమంబులు పరంబులగునపు డాగమాదేశ లోపంబులు పెక్కు దెఱంగులం గానంబడియెడి.
ఆగు - కావించు. వచ్చు - రావింపు - రప్పించు.
విన్నపము - విన్నవించు. మోకాలు - మోకరించు. కేక - కేకరించు.
పలవ - పలవరించు - పలవించు. ఆల - ఆలకించు - ఆలించు.
ప్రక్క - ప్రక్కలించు. నొచ్చు - నొంచు - నొప్పించు.
ఉండు - ఉనుచు - ఉంచు. డిగు - డించు - డిగించు.
పెరుగు - పెనుచు - పెంచు. తునుఁగు - త్రుంచు.
మునుఁగు - ముంచు - మునుచు.
మొగుడు - మొగుడుచు - మొగుచు - మోడుచు - మొగిడించు.
చొచ్చు - చొనుపు - చొప్పించు.
చినుఁగు - చించు - చింపు. త్రెగు - త్రెంచు - త్రెంపు.
తిరుగు - త్రిప్పు. చచ్చు - చంపు.
నిలుచు - నిలువరించు - నిలుపు. కొను - కొలుపు.
పోవు - పుచ్చు. పనుచు - పంచు. పనుపు - పంపు.
అనుచు - అంచు. అనుపు - అంపు.
అనుప్రయుక్తంబగు పోవునకుం బుచ్చు మాత్రంబగు.
మోసపోవు - మోసపుచ్చు ఇత్యాదు లెఱుంగునది. |
|
| 78. |
అన్వాదుల కించుక్కు పరంబగునపుడు పుగాగమం బగు, మానునకు విభాష నగు.
| అనిపించు - అను - కను - తిను - విను. మానిపించు - మానించు. |
|
| 79. |
అడ్డాదుల కించుక్కు పరంబగునపుడు గుగాగమం బగు, అప్పాదులకు విభాషనగు.
అడ్డము - అడ్డగించు.
అడ్డము - ఓర - చిత్తము - పంతము - పెల్ల - బోర - మట్టము - మెళము ఇత్యాదు లడాదులు.
అప్ప - అప్పగించు - అప్పించు.
అప్ప - ఒప్ప - పల్లము - కోపము ఇవి యుప్పాదులు. |
|
| 80. |
ఆడోడు కూడుల డకారంబునకుం కుంజుక్కుపరం బగునపుడు రేఫం బగు.
ఆడు - ఆరుచు - ఆడించు.
ఓడు - ఓరుచు - ఓడించు.
కూడు - కూడుచు - కూడించు. |
|
| 81. |
చెడునకుం జుక్పుగాగమంబులను డాకలఘు రేఫంబు నగు.
|
| 82. |
పడునకుం జుక్కును డాకలఘు రేఫంబు నగు.
|
| 83. |
శబ్ద పల్లవం బగు పడున కించుక్కు విభాష నగు, నగుచో డాకలఘు రేఫం బగు.
| వెలువడు - వెలువరించు - వెలువఱుచు. చొప్పడు - చొప్పరించు - చొప్పఱుచు. |
|
| 84. |
ప్రేరణంబునం దించుక్కు మీఁద నించుక్కు లేదు.
ఇటనుటంజేసి ప్రేరణార్థంబయిన యితరాగమంబు మీఁదం బ్రేరణార్థేం
చుగాగమంబగునని యెఱుంగునది.
నొచ్చు - నొంచు - నొంపించు. చచ్చు - చంపు - చంపించు. |
|
| 85. |
ఇత్వంబుగాని యెత్వంబుగాని కూడుచో, ననాద్యంబయిన యుత్వంబున కిత్వం బగు.
నిగుడు - నిగిడి - నిగిడె. మగుడు - మగిడి - మగిడె.
ఉడుగు - ఉడిగి - ఉడిగె. మునుఁగు - మునిఁగి - మునిఁగె. |
|
| 86. |
ముఙ్ఙీత్తులు ముత్తు నాఁబడు.
|
| 87. |
ప్రేరణేంచుక్కు పరంబగునపుడు పకారంబు చకారంబున కగు.
పచించు - పచింపించు. వచించు - వచింపించు.
పిలుచు - పిలిపించు. వలచు - వలపించు.
పత్వంబు హెచ్చునకుం గలుగదు. మెచ్చునకు విభాషనగు.
హెచ్చించు, మెప్పించు - మెచ్చించు. |
|
| 88. |
ఆగమాన్య చకారంబుల కద్విరుక్తంబులకు ముత్తు పరంబగునపుడు పవ లగు.
| ఆగమంబు: పచింపఁడు - పచింపుము, అడఁపఁడు - అడఁపుము,
అన్యము: పిలువఁడు - పిలుపుము. |
|
| 89. |
ఖండబిందువుమీఁది సిద్ధచకారంబునకు ముత్తు పరం బగునపుడు పకారంబు ప్రాయికంబుగ నగు.
తలఁపక - త్రేఁపక - తోఁపక.
ఏచునకు వైభాషికంబు.
ఏఁపక - ఏచక.
నోచునకుం గలుగదు.
నోచక. |
|
| 90. |
ఆగమ చకారంబునకు నెఱసున్న మీఁదిదానికి దుక్కు పరంబగునపుడు పకారంబు విభాష నగు.
ఆకర్ణింపుదురు - దంపుదురు - చింపుదురు.
పత్వంబురాని పక్షంబున వక్ష్యమాణ తాదేశంబు.
ఆకర్ణింతురు - దంతురు - చింతురు. |
|
| 91. |
అగు వచ్చు చొచ్చు చూచులకు ముత్తు పరంబగు నపుడు కా రా చొరు చూడు లగు.
| అగు - కాఁడు - కమ్ము, వచ్చు - రాఁడు - రమ్ము,
చొచ్చు - చొరఁడు - చొరుము, చూచు - చూడఁడు - చూడుము. |
|
| 92. |
ఇచ్చునకు సర్వంబున కీ యగు.
ఇచ్చు - ఈఁడు - ఇమ్ము.
ఈయ యనునాదేశంబు నొకానొకచోఁ గానంబడియెడి.
బలిమినీయని భూమి వలయపతుల. |
|
| 93. |
తే తేరులు తెచ్చున కగు.
| తెచ్చు - తేఁడు - తేరఁగు - తెమ్ము - తేరుము. |
|
| 94. |
చావు నోవులు చచ్చు నొచ్చుల కగు.
చచ్చు - చాఁవడు - చావుము, నొచ్చు - నోవఁడు - నోవుము.
వక్ష్యమాణంబు ద్విత్వంబు.
నొవ్వండు. |
|
| 95. |
ఙిత్తు పరంబగునపుడు వాని వువర్ణంబు విభాషను లోపించు.
చాక - చావక - చాకుము - చావకుము.
నోక - నోవక - నోకుము - నోవకుము. |
|
| 96. |
అగున కను కనులకు ముఙ్ఙీత్తులు పరంబులగునపుడు కానా కానలు విభాష నగు.
అపదాద్య సూత్రముచే గాకు వకారంబు.
వక్ష్యమాణం బౌత్వంబు.
కమ్ము - అగుము - అవుము - ఔము.
కండు - అగుఁడు - అవుఁడు - ఔడు.
నాఁడు - అనఁడు - కానఁడు - కనఁడు. |
|
| 97. |
నేరుచునకు లిడ్లాట్టులు ముత్తుం బరంబులగునపుడు రుచులకు లోపంబు బహుళంబుగా నగు.
| నేచెను - నేరిచెను, నేచును - నేరుచును, నేరఁడు - నేరువఁడు. |
|
| 98. |
పోవునకు దుఙ్ముత్తులు ముఙ్ఙుం బరంబులగునపుడు వులోపంబుం, బొద పద లును విభాష నగు.
| పోదురు - పోవుదురు, పోఁడు - పోవఁడు, పోవుము - పోదము, పదము - పొమ్ము. |
|
| 99. |
అగు పోవుల కడవ్రాల కిద్వక్రంబులు పరంబగు నపుడు యకారం బగు.
వక్ష్యమాణం బైత్వంబు.
అయి - ఐ, అయిరి - ఐరి, పోయి - పోయిరి, పోయెను - పోయెడును. |
|
| 100. |
అగునకు వక్రంబు గూడుచో దీర్ఘం బగు.
వక్ష్యమాణంబు ద్విత్వంబు.
ఆయెను - అయ్యెను, ఆయెడును - అయ్యెడును. |
|
| 101. |
పిలుచు మొదలగువానికి ముత్తు పరంబగునపుడు కడ వ్రాయి బహుళంబుగ లోపించు.
పిలఁడు - పిలువఁడు - పిలుము - పిలువుము.
లేచునకు ముఙ్ఙు పరంబగునపుడు చులోపంబగు.
లెమ్ము - లెండు.
పిలుచు - నిలుచు - తలఁగు ఇత్యాదులు. |
|
| 102. |
లాఁతిచో సహితము కాదేశాదులు కానంబడియెడి.
| కావుతను - కాతను, అగుట - కావుట,
అగుడును - కావుడును, కానను - కావునను,
అనుడును - అనవుడును - నావుడును ఇత్యాదు లెఱుంగునది. |
|
| 103. |
ఆచ్ఛికంబులం దయి యవులకు వక్రతమంబులు బహుళంబుగా నగు.
| అయిదు - ఐదు, అయిరేని - ఐరేని, అవుడు - ఔడు, గవుసెన - గౌసెన. |
|
| 104. |
కలుగున కస్త్యర్థంబునందు లట్టు పరంబగునపుడు కల యగు.
ప్ర: కలఁడు - కలరు - కలదు - కలవు.
మ: కలవు - కలరు.
ఉ: కలను - కలము. |
|
| 105. |
త్రర్థంబునం గలాదేశంబు విభాష నగు.
ఎడి యెడు లకు లోపం బిట నిత్యంబు.
కలఁవాడు - కలుగువాఁడు. |
|
| 106. |
అస్త్యర్థంబునకు లఙి మి క ని వడి వర్ణకంబులు పరంబు లగునపుడు లే యగు.
ప్ర: లేఁడు - లేరు - లేదు - లేవు.
మ: లేవు - లేరు.
ఉ: లేను - లేము - లేమి - లేక - లేని - లేవడి. |
|
| 107. |
వ్యతిరేకంబునందు వలచున కొల్ల విభాష నగు.
ప్ర: ఒల్లఁడు - ఒల్లరు - ఒల్లదు - ఒల్లవు.
మ: ఒల్లవు - ఒల్లరు.
ఉ: ఒల్లను - ఒలము - ఒల్లమి - ఒల్లక - ఒల్లని.
పక్షంబున వలవఁడిత్యాది. ఒల్లమి కొల్లఁబాటని ప్రయోగంబులం గానంబడియెడి. |
|
| 108. |
చువర్ణంబుతోడ దుగ్ధకారంబు తకారం బగు.
| నిలుతురు - పిలుతురు - అడఁతురు - కడతురు -
చింతురు - పెంతురు - పచింతురు - వచింతురు -
చేతురు - కోతు రిత్యాదు లసాధువులని యెఱుఁగునది. |
|
| 109. |
పడుఙి కొను లొకానొకచో స్వార్థంబునం దనుప్రయుక్తంబు లగు.
చొచ్చు - చొరఁబడు. నిలుచు - నిలువబఁడు.
కూడు - కూడఁబడు. పండు - పండుకొను. |
|
| 110. |
తెంచు ధాతు వగ్వాదుల కనుప్రయుక్తం బగు, నగుచో నుత్వంబుపయిని దాని తకారంబు దకారం బగు.
అగుదెంచు - నెగయుదెంచు - పోవుదెంచు.
అగు - నెగయు - పోవు - చొచ్చు - పుచ్చు - తోఁచు - నడచు -
పఱచు - మొలచు - వీచు ఇత్యాదులు. |
|
| 111. |
అభ్యాగతి నరుగ్వాదుల కయ్యది యనుప్రయుక్తం బగు, నగుచో గువర్ణకంబు విభాషను లోపించు.
| అరుదెంచు - అరుగుదెంచు. ఏతెంచు - ఏగుదెంచు. చనుదెంచు. |
|
| 112. |
అయ్యది పరంబగునపుడు చువర్ణకంబు లోపించు.
| చొచ్చు - చొత్తెంచు, పుచ్చు - పుత్తెంచు, తోఁచు - తోతెంచు. |
|
| 113. |
అద్దానికి ముత్తు పరంబగునపుడు తే తేరు లగు.
| అగుదేఁడు - అగుదేరఁడు, అగుదెమ్ము - అగుదేరుము. |
|
| 114. |
భూతంబున లఙికి లిడంతంబగు, నగు ధాతు వనుప్రయుక్తం బగు.
ప్ర: వాఁడు రాఁడయ్యెను - వారు రారయిరి - అది రాదయ్యెను - అవి రావయ్యెను.
మ: నీవు రావయితివి - మీరు రావయితిరి.
ఉ: నేను రానయితిని - మేము రామయితిమి. |
|
| 115. |
నుఙ్యంతం బగు నగు ధాతువు క్రియావిశేషణంబుల కనుప్రయుక్తం బగు, నుఙీకి విభాష నగు.
| కాను - అనునది నుఙ్యంతంబగు నగు ధాతువు రూపంబు. |
|
| 116. |
దానికి హ్రస్వంబు విభాష నగు.
| లెస్సగాను - లెస్సగను, న్యాయముగాను - న్యాయ్యముగను. ఇట సరళంబు నిత్యంబు.
చూడఁగాను - చూడఁగను - చూడను. ఇట స్వత్వంబు లేదు. |
|
| 117. |
ఉన్న కల న వర్ణకంబుల మీఁది తచ్ఛబ్ద వకారంబునకు లోపంబు విభాష నగు.
బాహుళకంబుచే నిట సంధి నిత్యంబు.
ప్ర: వండుచున్నవాఁడు - వండుచున్నాఁడు, వండుచున్నవారు - వండుచున్నారు.
మ: వండుచున్నవాఁడవు - వండుచున్నాఁడవు, వండుచున్నవారరు - వండుచున్నారరు.
ఉ: వండుచున్నవాఁడను - వండుచున్నాఁడను, వండుచున్నవారము - వండుచున్నారము.
ఇట్లు వండఁగలవాఁడు - వండఁగలాఁడు, వండినవాఁడు - వండినాఁ డిత్యాదు లెఱుంగునది. |
|
| 118. |
ధాత్వాదులకు ధాతువు లనుప్రయుక్తంబు లయి విలక్షణార్థాభిధాయకంబు లగు, నీయవి శబ్దపల్లవంబులు నాఁబడు.
| కూరుచుండు - నిలుచుండు - పరుండు - పన్నుండు - ఆఁకొను - ఈకొను -
ఈయకొను - ఇయ్యకొను - రక్కొను - త్రెక్కొను - మేకొను - మయికొను -
మేలుకొను - మేలుకను - మేలుకాంచు - అలవడు - ఏరుపడు- చొప్పడు -
వెలువడు - తలపోయు - వానపోయు - ఆపోవు - కొంపోవు - కొనిపోవు -
విజయం చేయు - కయివ్రాలు - తూపొడుచు ఇత్యాదులు శబ్దపల్లవంబులు. |
|
| 119. |
చేదర్థయోగంబున లృట్టునకు లి ట్టగు.
ఆ ఋషీశ్వరుండు వచ్చెనా ఫలించుఁ గార్యముల్.
వాఁడు ఱేపు వచ్చెనేని నీవు కార్యంబు దొరఁకొనుము. |
|
| 120. |
ఆత్మార్థం బభిహితం బగుచోఁ దల్లింగసంఖ్యాభిధాయి వచనంబు ధాతువిశేషణంబుల కగు.
| రాముఁడు రావణుం బరిమార్చి సీతయుం దాను సౌమిత్రి సహితంబుగం
బుష్పకారూఢుం డయి సాకేతంబున కేతెంచె. |
|
| 121. |
ఆగతికంబులగు భ్వాదుల కిందు యోగంబు లేదు.
భూ - నృ - కృ - రేకృ - లోకృ - లోచ్క - పచి - లప ఇత్యాదులకు,
గతి విరహితంబులగు ధాతువులకీ భాషం బ్రయోగంబులేదు.
ప్ర - పరా - అప - సమ్ - అను - అవ - నిన్ - నిర్ - దుస్ -
దుర్ - వి - ఆజ్ - ని - అధి - అపి - అతి - సు - ఉద్ -
అభి - ప్రతి - పరి - ఉప - ఊరీ ప్రభృతులను సాక్షాత్ప్రభృతులును గతి
సంజ్ఞాకంబులు, ప్రాదులిరువది రెండు నుపసర్గంబులు నాఁబడు.
ప్రభవించు - ఆవిర్భవించు - ప్రసరించు - సంస్కరించు - భస్మీకరించు -
సాక్షాత్కరించు - అతిరేకించు - ఆలోకించు - ఆలోచించు - ప్రపంచించు -
ప్రలవించు ఇత్యాదు లార్యప్రయోగంబుల నెఱుంగునది. |
|
| 122. |
వలయ్వాది క్రియలకుం, గర్త యగు భావంబునందు నుఙి యగు.
వలయ్వాది క్రియలకుం, గర్తృభూత క్రియావృత్తి యగు ధాతువునకు నుఙి వర్ణకంబగు.
ప్ర:వాఁడు చూడవలయు - వారలు చూడఁగావలయు.
మ: నీవు చూడవలయు - మీరు చూడవలయు.
ఉ: నేను జూడవలయు - మేము చూడవలయు - మనము చూడవలయు.
వలయును - వలదు - కూడును - కూడదు - చెల్లును - చెల్లదు -
తగును - తగదు ఇత్యాదులు వలయ్వాదులు.
సకర్మకంబునకు స్వరూప ప్రేరణార్థంబులు రెండును గొను
పడ్వనుబంధంబులం దొక్కొక్కటి తోడ రెంటితోడం గూడుచో నగునవి
యాఱుం గూడ రూపంబు లెనిమిదయ్యె. వాని సొరిది నుదాహరించెద:
కర్త్రర్థకము: మైత్రుఁడు వంటకమును వండెను.
ఆత్మనేపద కర్త్రర్థకము: మైత్రుఁడు వంటకమును వండుకొనియెను.
కర్మార్థకము: మైత్రునిచేత వంటకము వండఁబడియెను.
ఆత్మనేపద కర్మార్థకము: మైత్రునిచేత వంటకమును వండుకొనఁబడియెను.
ప్రేరణ కర్త్రర్థకము: చైత్రుఁడు మైత్రునిచేత వంటకమును వండించెను.
ప్రేరణాత్మనేపద కర్త్రర్థకము: చైత్రుండు మైత్రునిచేత వంటకమును వండించుకొనియెను.
ప్రేరణ కర్మార్థకము: చైత్రునిచేత మైత్రునిచేత వంటకమును వండింపఁబడియెను.
ప్రేరణాత్మనేపద కర్మార్థకము: చైత్రునిచేత మైత్రునిచేత వంటకము వండించుకొనఁబడియెను. |
|
| 123. |
గతిబుద్ధి ప్రత్యవసానార్థ శబ్దకర్మాకర్మంబుల కప్రేరణంబునం గర్త యగునది ప్రేరణంబునం గర్మం బగు.
పొందు మొదలయినవి గత్యర్థకంబులు.
తెలియు మొదలయినవి బుద్ధ్యర్థకంబులు.
తిను మొదలయినవి ప్రత్యవసానార్థకంబులు.
విను - చెప్పు - చదువు - మొదలయినవి శబ్దకర్మంబులు.
అకర్మకంబులు ప్రసిద్ధంబులు.
మైత్రుండు గ్రామంబు బొందెను.
చైత్రుండు మైత్రుని గ్రామంబుం బొందించెను.
లాఁతిచో సహిత మిక్కార్యంబు గానంబడియెడి.
మైత్రుండు పుడమి నేలెను -
చైత్రుండు మైత్రునిం బుడమి నేలించెను. |
|
| 124. |
అనభిహితకర్త కొకానొకచో షష్ఠి బహుళంబుగానగు.
రాముఁడు మిథిలం గనియె - రామునకు మిథిలం గనంబడియె -
రామునిచే మిథిల గనంబడియెను.
మైత్రుండు తత్త్వంబుం దెలిసెను - చైత్రుండు మైత్రునకుం దత్త్వంబు దెలిపెను.
కన్వాదియోగంబునం బ్రయోజ్య కర్తకు షష్ఠి నిత్యంబుగానగు.
విశ్వామిత్రుఁడు రామునకు మిథిలం గానిపించెను.
కృష్ణుం డర్జునునకు విశ్వరూపంబు జూపెను.
అకర్మకంబున కప్రేరణంబునం దాత్మనేపద కర్మాను బంధంబులు లేమింజేసి
రూపభేదంబు లయిదని యెఱుంగునది.
కర్త్రర్థకము: మైత్రుండు మనియెను.
ప్రేరణ కర్త్రర్థకము: చైత్రుండు మైత్రుని మనిచెను.
ప్రేరణాత్మనేపద కర్త్రర్థకము: చైత్రుండు మైత్రుని మనుచుకొనియె.
ప్రేరణ కర్మార్థకము: చైత్రునిచేత మైత్రుండు మనుపఁబడియె.
ప్రేరణాత్మనేపద కర్మార్థకము: చైత్రునిచేత మైత్రుండు మనుచుకొనఁబడియె.
వెండియుం బ్రేరణంబునం దించుగాగమంబు గలిగినచో సకర్మకంబునకుం
బండ్రెండు, నకర్మకంబునకుం దొమ్మిదియు భేదంబులని యూహించునది. |
|