| 1 |
సంస్కృతమునకు వర్ణము లేఁబది
| అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఏ ఐ ఓ ఔ అం అః |
| క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ. |
| |
| ఇందకారాదు లచ్చులు, కకారాదులు హల్లులు. |
| అజ్ఘల్విభాగ మీలాగుననే మీఁద నెఱుంగునది. |
|
| 2 |
ప్రాకృతమునకు వర్ణములు నలువది
| అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఓ అం అః |
| క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స హ ళ. |
| |
| కొందఱ మతంబున హ్రస్వవక్రంబులును బ్రాకృతంబునందుఁ గలవు. |
| కొందఱ మతంబున వక్రతమంబులుం గలవు. |
| ఎ ఏ ఒ ఓ లు వక్రములని, ఐ ఔ లు వక్రతమములని ప్రాచీనులు వ్యవహరింతురు. |
|
| 3 |
తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు
| అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః |
| క గ చ ౘ జ ౙ ట డ ణ త ద న ప బ మ య ర ల వ స హ ళ. |
|
| 4 |
ఋ ౠ ఌ ౡ ః (విసర్గ) ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఙ ఞ శ ష లు సంస్కృతసమంబులను గూడి తెలుఁగున వ్యవహరింపఁబడు
| ఋతువు, పితౄణము, కౢప్తము, ౡకారము, దుఃఖము, ఖడ్గము, ఘటము,
ఛత్రము, ఝరము, కంఠము, ఢక్క, రథము, ధరణి, ఫణము, భయము,
పఙ్క్తి, ఆజ్ఞ, శరము, షండము. |
|
| 5 |
క చ ట త ప లు పరుషంబులని గ జ డ ద బ లు సరళంబులని చెప్పంబడు
|
| 6 |
ఇతరములగు హల్లులు స్థిరములు
| ఖ ఘ ఙ చ ఝ ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ల వ శ ష స హ ళ. |
|
| 7 |
దంత్యతాలవ్యంబు లయిన చ జ లు సవర్ణంబులు
| తాలవ్య చకారంబు దంత్య చకారంబునకును, తాలవ్య జకారంబు
దంత్య జకారంబునకును గ్రాహకములని తాత్పర్యము. |
|
| 8 |
ఇ ఈ ఎ ఏ లం గూడిన చ జ లు తాలవ్యంబులు
| చిలుక, చీమ, చెలి, చేమ, జిల, జీడి, జెఱ్ఱి, జేజె. |
|
| 9 |
అ ఆ ఉ ఊ ఒ ఓ ఔ లం గూడిన చ జ లు దంత్యంబులు
| ౘలి, ౘాప, ౘుక్క, ౘూపు, ౘొక్కు, ౘోటు, ౘౌక, ౙముఁడు, ౙాతర, ౙున్ను, ౙూలు,
ౙొన్న, ౙోలి, ౙౌకు. ఐదంతములయిన చ జ లు సమేతర శబ్దములందు లేవు. |
|
| 10 |
సంస్కృతసమంబులం దికారాంతము లయిన శబ్దముల యుపధా చ జ లు బహువచనంబు పరంబగునపుడు దంత్యము లగును
| ఇవి దప్ప సంస్కృత సమంబులందు దంత్య చ జ లు లేవని తాత్పర్యము.
ఉపధ యనఁగా దుదివర్ణమునకు ముందు వర్ణము.
అర్చి- అర్ౘులు; రోచి- రోౘులు; వీచి- వీౘులు; రాజి- రాౙులు; వాజి- వాౙులు;
మఱియు రాజు శబ్దం బొక్కటి దంత్యయుక్తంబు కానంబడియెడి.
ఇతరములయిన చ జల కుదాహరణములు: చంద్రుఁడు, చామరము, చుక్రిక, చూర్ణము,
చోఁరుఁడు, చౌర్యము, జయము, జాతి, జుగుప్స, జూటము ఇత్యాదులు. |
|
| 11 |
నకారంబు ద్రుతంబు
|
| 12 |
ద్రుతాంతము లయిన పదములు ద్రుతప్రకృతికములు
| ప్రథమా, కయి, పట్టి, యొక్కేతరములయిన విభక్తులు, ఉత్తమ పురుషైక వచనంబులు,
భూత తద్ధర్మాద్యర్థక ప్రథమ పురుషైక వచనంబులు, ఆశీరాద్యర్థంబులయిన యెడుత
వర్ణకంబులు, శతృతుమానంతర్య చేదాద్యర్థకంబులు, నేను తాను పదంబులును,
వలె ప్రభృతులును, ద్రుత ప్రకృతికంబులు. |
| నన్నున్, నాచేతన్, నాతోడన్, నాకొఱకున్, నావలనన్, నాకంటెన్, నాకున్,
మాలోపలన్, మాయందున్, వత్తున్, వచ్చెదన్, వచ్చెన్, వచ్చున్, వచ్చెడున్,
ప్రసన్నులయ్యెడున్, కావుతన్, కొట్టుచున్, కొట్టఁన్, కొట్టఁగన్, కొట్టుడున్, కొట్టినన్,
వలెన్, ఎంతయున్, పోలెన్, అయ్యున్ ఇత్యాదు లూహ్యంబులు. |
|
| 13 |
ద్రుతప్రకృతులు గాని శబ్దంబులు కళ లనంబడు
| రాముఁడు, రాములు, హయము, విష్ణువు, గోడ, మేడ, అయ్య, అమ్మ, రామునికయి,
జ్ఞానముఁబట్టి, నాయొక్క, వచ్చిరి, వచ్చితిని, వచ్చితిరి, వచ్చితిమి, రాఁడు, రారు, రాదు,
రావు, రాము, కొట్టక, తిట్టక, ఎత్తిలి, ఒత్తిలి, ఊరక, మిన్నక, బళి, అక్కట, ఏల
ఇత్యాదు లూహించునది. |
|
| 14 |
హ్రస్వము మీఁది ఖండబిందువునకుఁ బూర్ణబిందువు వైకల్పికముగ నగును
| అడఁకువ- అడంకువ; అరఁటి- అరంటి; ఎఱుఁగుట- ఎఱుంగుట;
బలఁగము- బలంగము; మగఁటిమి- మగంటిమి. |
|
| 15 |
దీర్ఘముమీఁద సాధ్యపూర్ణము లేదు
| వాఁడు, వీఁడు, రాఁడు, లేఁడు, కాఁబోలు, కాఁబట్టి, గోఁగులు, రేఁగులు. |
|
| 16 |
సంస్కృత సమేతరములయిన తెలుఁగుశబ్దములయందుఁ బరుష సరళంబులకు ముందే బిందువు కానంబడుచున్నది
| వంకర, కలఁకువ, మంౘు, త్రాఁౘు, దంట, దాఁటు, కొంత, కోఁత ఇత్యాదు లూహ్యంబులు. |
|
| 17 |
యకారంబును వు వూ వొ వో లును దెలుఁగుమాటలకు మొదట లేవు
| ఎవఁడు, ఎక్కడ, ఏమి, ఏల, ఉండ, ఊరు, ఒకడు, ఓడ, హరియతఁడు, నిద్రవోయె
నిట్టిచోట్ల సంధి వశంబున వచ్చిన యకార వకారంబులుగాని పూర్వసిద్ధంబులు గావు.
వోఢృ వోఢవ్య శబ్దములు దప్ప సంస్కృత సమంబులందు సహితము వు వూ వొ వో
వర్ణాదులగు శబ్దంబులు లేవని యెఱుంగునది. ఉదకము, ఊర్మిక, ఓదనము. |
|
| 18 |
య ర ల వ లు లఘువు లని యలఘువు లని ద్వివిధంబులగు
| హరియతఁడు ఇత్యాదులం దాగమ యకారము లఘువు, తక్కిన యకారమలఘువు.
విఱుగు, మెఱు గిత్యాదులందు రేఫంబలఘువు. ఇదే శకటరేఫమని చెప్పబడును.
శకట రేఫము తత్సమ తద్భవములందు లేదు. పెరుఁగు కరు గిత్యాదులందు రేఫంబు లఘువు.
ఏళులు పాళులు త్రాళులని బహుత్వమందు రలడల కాదేశ మయిన ళకార మలఘువు.
తల, నెల యిత్యాదులందలి లకారము లఘువు. వర్ణ సమామ్నాయమందలి ళ కారము
వర్ణాంతరముగాని యలఘు ళ కారము గాదని యెఱుంగునది.
అతఁడు వలికె నిత్యాదులందున్న పాదేశవకారము లఘువు. తక్కిన వకార మలఘువు. |
|
| 19 |
సంస్కృత ప్రాకృతతుల్యం బగు భాష తత్సమంబు
| సంస్కృతము | సంస్కృతసమము |
| రామః | రాముఁడు |
| విద్యా | విద్య |
| హరిః | హరి |
| ధేనుః | ధేనువు |
| భూః | భువి |
| పితా | పిత |
| గౌః | గోవు |
| నౌః | నావ |
| దౌః | దివి |
| హృద్ | హృది |
| జగత్ | జగత్తు, జగము |
| ఇత్యాదు లూహ్యంబులు. |
| సంస్కృతము | ప్రాకృతము | ప్రాకృతసమము |
| అగ్నిః | అగ్గీ | అగ్గి |
| ఆటిః | ఆడీ | ఆడి |
| ఆలిః పఙ్క్తౌ | ఓలీ | ఓలి |
| కటుః | కారో | కారము |
| గౌరవమ్ | గారవం | గారవము |
| జటా | జడా | ౙడ |
| మిరా | మేరా | మేర |
| యమః | జమో | ౙముఁడు |
| రాజ్ఞీః | రాణీ | రాణి |
| శృఙ్గారః | సింగారో | సింగారము |
| శ్రీః | సిరీ | సిరి |
| ఇత్యాదు లెఱుంగునది. |
|
| 20 |
సంస్కృత ప్రాకృతభవంబగు భాష తద్భవంబు
| ఆకాశః | ఆకసము |
| కుడ్యమ్ | గోడ |
| చన్ద్రః | ౘందురుడు |
| తమఙ్గః | తమగము |
| తామరసమ్ | తామర |
| నారాచః | నారసము |
| నిభః | నెపము, నెవము |
| ముఖమ్ | మొకము, మొగము |
| మృగః | మెకము, మెగము |
| వక్రః | వంకర |
| వేసరః | వేసడము |
| సముద్రః | సముద్రము |
| సూచీ | సూది |
| స్మరః | మరుఁడు |
| హరిణమ్ | ఆరణము |
| హరితాళమ్ | హరిదళము |
| ఇత్యాదులు గ్రహించునది. |
| సంస్కృతము | ప్రాకృతము | ప్రాకృతభవము |
| అఙ్గారః | ఇంగాలో | ఇంగలము |
| అప్సరా | అచ్చరా | అౘ్చర |
| ఆశ్చర్యమ్ | అచ్చేరం | అచ్చెరువు |
| పఞ్చాశత్ | పణ్ణాసా | పనస |
| పృథివీ | పుఢవీ | పుడమి |
| ప్రయాణమ్ | పయాణం | పయనము |
| ప్రవాళః | పవాళో | పవడము, పగడము |
| మత్సరః | మచ్చరో | మౘ్చరము |
| యజ్ఞః | జణ్ణో | ౙన్నము |
| లక్ష్మీః | లచ్చీ | లచ్చి |
| విష్ణుః | విణ్ణూ | వెన్నుఁడు |
| వైద్యః | వెజ్జో | వెౙ్జు |
| స్తమ్భః | ఖంభో | కంబము |
| స్థూలమ్ | థోరం | తోరము |
| ఇత్యాదులు తెలియునది. |
|
| 21 |
త్రిలింగదేశ వ్యవహారసిద్ధం బగు భాష దేశ్యంబు
| ఊరు, పేరు, ముల్లు, ఇల్లు, కోట, పేట, దూడ, మేడ, కోఁత, లేఁత,
తావి, మోవి - ఇత్యాదులరయునది. |
|
| 22 |
లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబు
| వస్తాఁడు, తెస్తాఁడు, వచ్చేని, తెచ్చేని, వచ్చేవాఁడు, తెచ్చేవాఁడు,
వచ్చేటివాఁడు, తెచ్చేటివాఁడు ఈ భాష ప్రయోగంబున కనర్హంబు. |
|
| 23 |
ఆర్యవ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు
| పెద్దలు వ్యవహరించిన మాట గ్రామ్యంబయిన గ్రహింపఁదగునని తాత్పర్యము.
కఱకంఠుఁడు, ప్రాణగొడ్డము, జీవగఱ్ఱ, కపిలకన్నులు, కపిల గడ్డము, కపిలజడలు. |
|