| 1. |
ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగు.
| పూర్వపరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధి యనఁబడు. |
| రాముఁడు | + | అతఁడు | = | రాముఁడతఁడు. |
| సోముఁడు | + | ఇతఁడు | = | సోముఁడితఁడు. |
| మనము | + | ఉంటిమి | = | మనముంటిమి. |
| అతఁడు | + | ఎక్కడ | = | అతఁడెక్కడ. |
| ఇతఁడు | + | ఒకఁడు | = | ఇతఁడొకఁడు. |
|
| 2. |
ప్రధమేతర విభక్తి శత్రర్థ చువర్ణంబు లందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగును.
| నన్ను | + | అడిగె | = | నన్నడగె, నన్నునడిగె. |
| నాకొఱకున్ | + | ఇచ్చె | = | నాకొఱకిచ్చె, నాకొఱకునిచ్చె. |
| నాకున్ | + | ఆదరువు | = | నాకాదరువు, నాకునాదరువు. |
| నాయందున్ | + | ఆశ | = | నాయందాశ, నాయందునాశ. |
| ఇందున్ | + | ఉన్నాఁడు | = | ఇందున్నాఁడు, ఇందునున్నాఁడు. |
| ఎందున్ | + | ఉంటివి | = | ఎందుంటివి, ఎందునుంటివి. |
| వచ్చుచున్ | + | ఉండెను | = | వచ్చుచుండెను, వచ్చుచునుండెను. |
| చూచుచున్ | + | ఏగును | = | చూచుచేగెను, చూచుచునేగెను. |
|
| 3. |
సంధి లేని చోట స్వరంబుకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
| ఆగమం బనఁగా వర్ణాధిక్యంబు. |
| మా | + | అమ్మ | = | మాయమ్మ. |
| మీ | + | ఇల్లు | = | మీయిల్లు. |
| మా | + | ఊరు | = | మాయూరు. |
|
| 4. |
అత్తునకు సంధి బహుళముగా నగు.
| మేన | + | అల్లుడు | = | మేనల్లుడు, మేనయల్లుడు. |
| పుట్టిన | + | ఇల్లు | = | పుట్టినిల్లు, పుట్టినయిల్లు. |
| చూడక | + | ఉండెను | = | చూడకుండెను, చూడకయుండెను. |
| బహుళ గ్రహణముచేత స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధిలేదు. |
| అమ్మ | + | ఇచ్చెను | = | అమ్మయిచ్చెను. |
| దూత | + | అతఁడు | = | దూతయితఁడు. |
| చెలువుఁడ | + | ఇందము | = | చెలువుఁడయిందము. |
| సంస్కృతీయంబునకు సంధి యగునని యధర్వణాచార్యులు చెప్పిరిగాని దానికిం బూర్వకావ్యంబులందుఁ బ్రయోగంబు
మృగ్యంబు. ఆధునిక కృతులం దొకానొకచోట స్త్రీవాచక తత్సమంబులకు సంధి గానం బడియెడు.
గంగనుకాసె, నెలఁతిచ్చెను.
వెలయాల్వాదుల సంధిలేమి బాహుళకముచేతనే యని యూహించునది. |
|
| 5. |
ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
| ఏమి, మఱి, కిషష్టి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి, ఇది యాకృతి గణంబు. |
| ఏమి | + | అంటివి | = | ఏమంటివి, ఏమియంటివి. |
| మఱి | + | ఏమి | = | మఱేమి, మఱియేమి. |
| హరికిన్ | + | ఇచ్చె | = | హరికిచ్చె, హరికినిచ్చె. |
|
| 6. |
క్రియాపదంబులం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
| వచ్చిరి | + | అప్పుడు | = | వచ్చిరప్పుడు, వచ్చిరియప్పుడు. |
| వచ్చితిమి | + | ఇప్పుడు | = | వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు. |
|
| 7. |
మధ్యమపురుష క్రియలయం దిత్తునకు సంధి యగును.
| ఏలితివి | + | అపుడు | = | ఏలితివపుడు. |
| ఏలితి | + | ఇపుడు | = | ఏలితిపుడు. |
| ఏలితిరి | + | ఇపుడు | = | ఏలితిరిపుడు. |
|
| 8. |
క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.
| వచ్చి | + | ఇచ్చెను | = | వచ్చియిచ్చెను. |
|
| 9. |
ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు.
| ప్రథమేతర విభక్తివిధి నిరవకాశంబుగావున దీనిని బాధించెడిని. |
| వచ్చున్ | + | ఇపుడు | = | వచ్చునిపుడు |
| చూడన్ | + | అయితి | = | చూడనయితి. |
| ఉండెడిన్ | + | అతఁడు | = | ఉండెడినతఁడు. |
| ఇఁక, ఇఁగ, ఎట్టకేలకు, ఎట్టకేని, ఈయవి - యికాదులని యెఱుంగునది. వీనికి సంధి వైకల్పికము. |
|
| 10. |
అచ్చున కామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగ నగు.
| ద్విరుక్తము యొక్క పరరూప మామ్రేడిత మనంబడు. తఱచుగ ననుటచేత నొకానొకచోట
వైకల్పిక సంధియుం గలదని తాత్పర్యము. |
| ఔర | + | ఔర | = | ఔరౌర. |
| ఆహా | + | ఆహా | = | అహాహా. |
| ఎట్టూ | + | ఎట్టూ | = | ఎట్టెట్టూ. |
| ఓహో | + | ఓహో | = | ఓహోహో. |
| ఏమి | + | ఏమి | = | ఏమేమి, ఏమియేమి. |
| ఎగి యేగి యనుచోఁ గ్త్వార్థంబగుట సంధిలేదు.
|
|
| 11. |
అంద్వవగాగమంబులం దప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధి యగు.
| మూర | + | ఎఁడు | = | మూరెఁడు |
| వీసె | + | ఎఁడు | = | వీసెఁడు |
| అర్థ | + | ఇంచు | = | అర్థించు |
| నిర్జి | + | ఇంచు | = | నిర్జించు |
అంద్వవగాగమంబులు పరంబగునపుడు యథాసంభవముగా గ్రహించునది.
రాములందు - రాములయందు, హరియందు, ఎనిమిదవది - ఎనిమిదియవది. |
|
| 12. |
కుఱు చిఱు కడు నడు నిడు శబ్దముల ఱ డ ల కచ్చు పరంబగునపుడు ద్విరుక్తటకారం బగు.
| కుఱు | + | ఉసురు | = | కుట్టుసురు |
| చిఱు | + | ఎలుక | = | చిట్టెలుక |
| కడు | + | ఎదురు | = | కట్టెదురు |
| నడు | + | ఇల్లు | = | నట్టిల్లు |
| నిడు | + | ఊరుపు | = | నిట్టూరుపు |
|
| 13. |
ప్రథమమీఁది పరుషములకు గ స డ ద వ లు బహుళముగా నగు.
| వాఁడు | + | కొట్టె | = | వాఁడు గొట్టె, వాఁడు కొట్టె |
| అపుడు | + | చనియె | = | అపుడు సనియె, అపుడు చనియె |
| నీవు | + | టక్కరివి | = | నీవు డక్కరివి, నీవు టక్కరివి |
| మీరు | + | తలఁడు | = | మీరు దలఁడు, మీరు తలఁడు |
| వారు | + | పోరు | = | వారు వోరు, వారు పోరు |
| అపు డిప్పు డెప్పు డను శబ్దములు నిత్యైక వచనాంతములు. వాగనుశాసనులు యదాతదా యని గ్రహించుట
ప్రపంచార్థమని యెఱుఁగునది. ఈ కార్యము కళలగు క్రియా పదముల మీఁద సహితము కానంబడియెడి. |
| రారు | + | కదా | = | రారు గదా, రారు కదా |
| వత్తురు | + | పోదురు | = | వత్తురు వోదురు, వత్తురు పోరుదు |
|
| 14. |
తెనుఁగుల మీఁది సాంస్కృతిక పరుషములకు గ స డ ద వ లు రావు.
| వాఁడు | + | కంసారి | = | వాఁడు కంసారి |
| వీఁడు | + | చక్రపాణి | = | వీఁడు చక్రపాణి |
| ఆయది | + | టంకృతి | = | ఆయది టంకృతి |
| అది | + | తథ్యము | = | అది తథ్యము |
| ఇది | + | పథ్యము | = | ఇది పథ్యము |
|
| 15. |
ద్వంద్వంబునం బదంబు పయి పరుషములకు గ స డ ద వ లగు.
| కూర | + | కాయ | = | కూరగాయలు |
| కాలు | + | చేయి | = | కాలుసేతులు |
| టక్కు | + | టెక్కు | = | టక్కు డెక్కులు |
| తల్లి | + | తండ్రి | = | తల్లిదండ్రులు |
| ఊరు | + | పల్లె | = | ఊరువల్లెలు |
|
| 16. |
ద్రుతప్రకృతికము మీఁది పరుషములకు సరళము లగు.
| పూచెను | + | కలువలు | = | పూచెను గలువలు |
| తోఁచెను | + | చుక్కలు | = | తోఁచెను జుక్కలు |
| చేసెను | + | టక్కులు | = | చేసెను డక్కులు |
| నెగడెను | + | తమములు | = | నెగడెను దమములు |
| మొగిడెను | + | పద్మము | = | మొగిడెను బద్మము |
|
| 17. |
ఆదేశసరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాష నగు.
| సంశ్లేషం బనగా మీఁది హల్లుతోఁ గూడికొనుట. |
| పూచెను గలువలు .... పూచెంగలువలు, పూచెఁగలువలు, పూచెన్గలువలు |
| తోఁచెను జుక్కలు .... తోఁచెంజుక్కలు, తోఁచెఁజుక్కలు, తోఁచెన్జుక్కలు |
| చేసెను డక్కులు .... చేసెండక్కులు, చేసెఁడక్కులు, చేసెన్డక్కులు |
| నెగడెను దమములు ... నెగడెందమములు, నెగడెఁదమములు, నెగడెన్దమములు |
| మొగిడెను బద్మము ... మొగిడెంబద్మము, మొగిడెఁబద్మము, మొగిడెన్బద్మము |
| పక్షంబున స్వత్వంబగు. స్వత్వంబనఁగా ద్రుతంబునకుఁ బ్రకృతి భావము. |
|
| 18. |
ద్రుతంబునకు సరళస్థిరంబులు పరంబు లగునపుడు లోపసంశ్లేషంబులు విభాష నగు.
| వచ్చెను | + | గోవులు | = | వచ్చె గోవులు, వచ్చెన్గోవులు, వచ్చెను గోవులు |
| మెఱసెను | + | ఖడ్గము | = | మెఱసెఖడ్గము, మెఱసెన్ఖడ్గము, మెఱసెను ఖడ్గము |
|
| 19. |
వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి.
| వచ్చెను | + | ధాత్రీపతి | = | వచ్చెంధాత్రీపతి |
| పాడెను | + | గంధర్వుఁడు | = | పాడెంగంధర్వుఁడు |
| కన్ | + | దోయి | = | కందోయి |
|
| 20. |
అవసానంబునందు ద్రుతస్వరంబునకేని ద్రుతంబున కేని లోపంబు బహుళంబుగా నగు.
| వాఁడువచ్చెన్ - వాఁడువచ్చె - వాఁడువచ్చెను. |
| ఈలోపంబు పద్యాంతములయందు గణానుసారంబుగ వ్యవస్థితంబయియుండు గుర్వవసాయియగు
పద్యంబుతుదను స్వత్వంబులేదు.
అతిశయముగ బుద్ధిమంతుఁడగు బుధసేవన్. |
|
| 21. |
కొన్నియెడల ద్రుతంబుమీఁద నకారంబు గానంబడియెడి.
| అదియునున్గాక, దివంబునుంబోలె. |
|
| 22. |
అఁట యిఁక చుఁడు శబ్దంబులం దప్ప నుడి తొలి హ్రస్వంబుమీఁద ఖండబిందువును ద్రుతంబునకు లోపంబును లేవు.
| ముంగొంగు, క్రొంబసిఁడి, కన్దోయి. |
|
| 23. |
తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు.
| తాను | + | ౘదివె | = | తాఁ ౙదివె, తాను ౙదివె |
| తాను | + | వినె | = | తా వినె, తాను వినె |
| దీర్ఘంబు మీఁదిది గాన దీనికి నెఱసున్న లేదు. |
|
| 24. |
సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు.
| ఎల్లయర్థములు, ఎల్లకలుషములు.
సర్వపర్యాయంబయిన యెల్ల శబ్దంబు ద్రుతాంతంబయిన యవ్యయంబు. దీని కసమాసంబున
విశేష్యంబునకు ముందు ప్రయోగంబు లేదు. |
|
| 25. |
సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.
| ఇచటం బరుషంబులు పరంబులగునపుడు ద్రుతంబునకు బిందు సంశ్లేషంబులచే మూఁడురూపంబులు.
సరళంబులు పరంబులగునపుడు లోప సంశ్లేష పూర్ణబిందువులచేత మూఁడు రూపములు. విధాన
సామర్థ్యము వలన దీనికి లోపము లేదు. వక్ష్యమాణవిధిచే స్వత్వములేదు. |
| చిగురు | + | కయిదువు | = | చిగురుంగయిదువు, చిగురుఁగయిదువు, చిగురున్గయిదువు |
| తళుకు | + | గజ్జెలు | = | తళుకుంగజ్జెలు, తళుకుగజ్జెలు, తళుకున్గజ్జెలు |
| సింగపు | + | కొదమ | = | సింగపుంగొదమ, సింగపుఁగొదమ, సింగపున్గొదమ |
| ఉన్నతంపు | + | గొడుగు | = | ఉన్నతంపుంగొడుగు, ఉన్నతంపుగొడుగు, ఉన్నతంపున్గొడుగు |
| నలుఁగడాదులు నీ యాగమంబు లేదండ్రు.
ఈ యాగమంబొకా నొకచోట స్థిరంబు పరంబగుచోఁ గానంబడియెడి.
గఱునపున్మురువు. |
|
| 26. |
సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబు లేదు. |
| 27. |
తలఁబ్రాలు మొదలగు సమాసంబుల ద్రుతమునకు లోపము లేదు.
| తలఁబ్రాలు, ఒడిఁబ్రాలు, సేసఁబ్రాలు, ఊరఁబంది, ఊరఁబిచ్చిక, తోడఁబుట్టువు, తోఁబుట్టువు,
ఒల్లన్బాటు, ఒడఁబాటు ఇత్యాదులు. |
|
| 28. |
కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమం బగు.
| కఱకు | + | అమ్ము | = | కఱకుటమ్ము |
| నిగ్గు | + | అద్దము | = | నిగ్గుటద్దము |
| సరసపు | + | అలుక | = | సరసపుటలుక |
|
| 29. |
కర్మధారయంబునందుఁ బేర్వాదిశబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు.
| పేరు | + | ఉరము | = | పేరటురము, పేరురము |
| చిగురు | + | ఆకు | = | చిగురుటాకు, చిగురాకు |
| పొదరు | + | ఇల్లు | = | పొదరుటిల్లు, పొదరిల్లు |
|
| 30. |
పేదాది శబ్దంబుల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమం బగు.
| పేద | + | ఆలు | = | పేదరాలు |
| బీద | + | ఆలు | = | బీదరాలు |
| పేద, బీద, ముద్ద, బాలింత, కొమ్మ, జవ, అయిదవ, మనుమ, గొడ్డు ఇట్టివి పేదాదులు.
ఇందు జవ్వని శబ్దంబునకు జవాదేశంబని యెఱుంగునది.
"ఏకాంతమునందు నున్న జవరాండ్ర" నని ప్రయోగము. |
|
| 31. |
కర్మధారయంబునం దత్సమంబుల కాలుశబ్దము పరంబగునపు డత్వంబున కుత్వంబును రుగాగమంబు నగు.
| ధీర | + | ఆలు | = | ధీరురాలు |
| గుణవంత | + | ఆలు | = | గుణవంతురాలు |
| ఇచట వృత్తియం దాలుశబ్దము స్త్రీమాత్రపరము. |
|
| 32. |
కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపు లగు.
| సరసము | + | మాట | = | సరసపుమాట, సరసంపుమాట |
| విరసము | + | వచనము | = | విరసపువచనము, విరసంపువచనము |
|
| 33. |
ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం బగు.
| చేయు | + | అతఁడు | = | చేయునతఁడు |
| చేసెడు | + | అతఁడు | = | చేసెడునతఁడు |
|
| 34. |
షష్ఠీసమాసమునం దుకార ఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమం బగు.
| విధాతృయొక్క | + | ఆనతి | = | విధాతృనానతి |
| రాజుయొక్క | + | ఆజ్ఞ | = | రాజునాజ్ఞ |
|
| 35. |
ఉదంత స్త్రీసమంబులకును, బుంపులగు నదంతగుణవాచకంబులకును దనంబు పరంబగునపుడు నుగాగమంబగు.
| సొగసు | + | తనము | = | సొగసుందనము, సొగసుఁదనము, సొగసున్దనము |
| సరసపు | + | తనము | = | సరసపుందనము, సరసపుఁదనము, సరసపున్దనము |
| తెల్ల | + | తనము | = | తెల్లందనము, తెల్లఁదనము, తెల్లన్దనము |
|
| 36. |
సమాసంబునఁ బ్రాఁతాదుల తొలియచ్చుమీఁది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగా నగు.
| ప్రాఁత | + | ఇల్లు | = | ప్రాయిల్లు, ప్రాఁతయిల్లు |
| లేఁత | + | దూడ | = | లేదూడ, లేఁతదూడ |
| పూవు | + | రెమ్మ | = | పూరెమ్మ, పూవురెమ్మ |
|
| 37. |
లుప్త శేషంబుకుం బరుషములు పరములగునపుడు నుగాగమం బగు.
| ప్రాఁత | + | కెంపు | = | ప్రాఁగెంపు |
| లేఁత | + | కొమ్మ | = | లేఁగొమ్మ |
| పూపు | + | తోఁట | = | పూఁదోఁట |
| మీఁదు | + | కడ | = | మీఁగడ |
| కెంపు | + | తామర | = | కెందామర |
| చెన్ను | + | తోవ | = | చెందోవ |
| చెన్ను శబ్దము వృత్తిని శోణార్థకంబు. బహుళ గ్రహణముచే మీఁదు ప్రభృతులం నిట లోపంబు నిత్యంబు.
వ్యవస్థిత విభాషచే నీ ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు. |
|
| 38. |
క్రొత్తశబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్ని యెడల నుగాగమంబునుం గొన్ని యెడల మీఁదిహల్లునకు ద్విత్వంబు నగు.
| క్రొత్త | + | చాయ | = | క్రొంజాయ |
| క్రొత్త | + | చెమట | = | క్రొంజెమట |
| క్రొత్త | + | పసిఁడి | = | క్రొంబసిఁడి |
| క్రొత్త | + | కారు | = | క్రొక్కారు |
| క్రొత్త | + | తావి | = | క్రొత్తావి |
| పరుషేతరంబులు పరంబులగునపుడు నుగాగము ప్రాప్తి లేమిఁ జేసి వానికి ద్విత్వంబగు. |
| క్రొత్త | + | గండి | = | క్రొగ్గండి |
| క్రొత్త | + | నన | = | క్రొన్నన |
| క్రొత్త | + | మావి | = | క్రొమ్మావి |
| కెంధూళి కెంజడలని ప్రయోగంబులు కానంబడియెడి. బహుళ గ్రహణముచేతఁ గ్రొత్తకుండ లిత్యాదుల
లోపంబులేదు. క్రీఁగడుపు, క్రీఁగాలు, క్రీఁదొడ ఇత్యాదులం గ్రిందుశబ్దమునకు లుప్తశేషంబునకు దీర్ఘంబు
బహుళ గ్రహణముచేత నని యెఱుఁగునది. |
|
| 39. |
అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచోఁ గానంబడియెడి.
| ఒకానొక శబ్దంబున నొకానొక శబ్దము పరంబగునపుడు తొంటియటు లోపనుగాగమంబును,
గొండొక శబ్దమున కొకానొక శబ్దము పరంబగునపుడు లోపద్విత్వంబులును ప్రయోగంబులందుఁ
జూపట్టెడునని తాత్పర్యము. |
| పది | + | తొమ్మిది | = | పందొమ్మిది |
| తొమ్మిది | + | పది | = | తొంబది |
| వంక | + | చెఱఁగు | = | వంజెఱఁగు |
| సగము | + | కోరు | = | సంగోరు |
| నిండు | + | వెఱ | = | నివ్వెఱ |
| నిండు | + | వెఱఁగు | = | నివ్వెఱఁగు |
| నెఱ | + | తఱి | = | నెత్తఱి |
| నెఱ | + | నడుము | = | నెన్నడుము |
| నెఱ | + | మది | = | నెమ్మది |
| నెఱ | + | వడి | = | నెవ్వడి |
| ఇత్యాదులు ప్రయోగంబుల వలనం దెలియునది. |
|
| 40. |
ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదులం దొలి యచ్చు మీఁది వర్ణంబుకెల్ల నదంతం బగు ద్విరుక్త టకారం బగు.
| ఈ సూత్రమునకు భృశార్థంబునందు ద్విరుక్తంబు విషయంబని యెఱుంగునది. |
| కడ | + | కడ | = | కట్టకడ |
| ఎదురు | + | ఎదురు | = | ఎట్టఎదురు |
| కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు, మొదలు ఇత్యాదులు కడాదులు. |
|
| 41. |
ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తిలోపంబు బహుళంబుగా నగు.
| అప్పటికిన్ + అప్పటికిన్ = అప్పటప్పటికిన్, అప్పటికప్పటికిన్ |
| అక్కడన్ + అక్కడన్ = అక్కడక్కడన్, అక్కడనక్కడన్ |
| ఇంటన్ + ఇంటన్ = ఇంటింటన్, ఇంటనింటన్ |
| ఊరన్ + ఊరన్ = ఊరూరన్, ఊరనూరన్ |
| ఇంచుక నాఁ డిత్యాదులందు బహుళగ్రహణముచేత నంతిమాక్షర లోపంబు నగు. |
| ఇంచుక + ఇంచుక = ఇంచించుక. ఇంచుకించుక |
| నాఁడు + నాఁడు = నానాఁడు, నాఁడునాఁడు |
|
| 42. |
అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.
| అందదుకు, ఇఱ్ఱింకులు, ఇల్లిగ్గులు, చెల్లచెదరు, చెల్లాచెదరు, తుత్తుమురు,
తుత్తునియలు, మిఱుమిట్లు ఇత్యాదులెఱుంగునది. |
|
| 43. |
చేత తోడ వలనల కిత్వంబు సమాసంబులం దగు.
| నీచేతన్ + ప్రోపు = నీచేతిప్రోపు |
| నాతోడన్ + చెలిమి = నాతోడిచెలిమి |
| నీవలనన్ + భయము = నీవలనిభయము |
|
| 44. |
అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునం దగు.
| నాయందున్ + కరుణ = నాయందలి కరుణ |
| ఇందున్ + జనులు = ఇందలిజనులు |
| ఎందున్ + వారు = ఎందలివారు |
| ఎందు శబ్దమున కలిగాగమము కొందఱు లేదండ్రు. |
|
| 45. |
అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగ నగు.
| నా + అది = నాది, నాయది |
| నా + అవి = నావి, నాయవి |
| ఉదంతములగు తద్ధర్మ విశేషణంబులకు మీఁద లోపంబు లేదనియు నిదంతంబులగు తద్ధర్మ విశేషంబులకు
మీఁద నిత్యంబనియు బహుళగ్రహణముచే నెఱుంగునది. |
| వచ్చునది - వచ్చునని, వచ్చెడిది - వచ్చెడివి. |
|
| 46. |
పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోపపూర్ణబిందువులు విభాష నగు.
| భయము + పడె = భయపడె, భయంపడె, భయముపడెను |
| సూత్రము + పట్టె = సూత్రపట్టె, సూత్రంపట్టె, సూత్రముపట్టె |
| ఈ కార్యము కర్తృవాచి మువర్ణకమునకుఁ గలగదు.
గజము పడియె, అశ్వము పడియె. |
|
| 47. |
మధ్యమపురుష మువర్ణకంబునకు హలవసానంబులు పరంబులగునపుడు లోపము విభాష నగు.
| చూడుము + నన్ను = చూడునన్ను, చూడుము నన్ను |
| ఇటు + చూడుము = ఇటుచూడు, ఇటు చూడుము |
| చూడుమనియె, వినుమనియె.
ఇచ్చట నచ్చు పరంబయినది. కాబట్టి లోపములేదు. |
|
| 48. |
వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాష నగు.
| నమ్మకము + ఇట = నమ్మకిట, నమ్మకు మిట |
|
| 49. |
ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుఙ్ఙు లోపంబు విభాష నగు.
| ఉండుము + ఉండుము = ఉండుండుము,ఉండుముండుము |
| కొట్టుఁడు + కొట్టుఁడు = కొట్టు కొట్టుఁడు, కొట్టుఁడు కొట్టుఁడు |
|
| 50. |
విసర్గంబున కనుకరణంబున లోపం బగు.
| వర్ధతాం శ్రీః + అనియె = వర్ధయాం శ్రీ యనియె. |
|
| 51. |
అనుకృతిని నమశ్శబ్దము తుది యత్తున కోత్వము విభాష నగు.
| తుభ్యంనమః + అనె = తుభ్యంనమో అనె, తుభ్యం నమ యనె |
| ఈ కార్యము లాఁతిచో సహితము గనంబడియెడి.
గతాను గతికో లోకో యటంచున్. |
|
| 52. |
అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు.
| కింతత్ + అనియె = కింతత్తనియె |
| కస్త్వమ్ + అనియె = కస్త్వమ్మనియె |
|
| 53. |
అనుకరణంబునం దహమాదుల మకారంబునకు ద్విరుక్తి విభాషనగు.
| దాసోహమ్ + అనె = దాసోహమ్మనె, దాసోహమనె |
| తత్కర్తవ్యమ్ + అనె = తత్కర్తవ్యమ్మనె, తత్కర్తవ్యమనె |
|
| 54. |
ఉదంతనామంబున కనుకరణంబునందు వుగాగమం బగు.
| ఇయంధేనుః + అనె = ఇయంధేనువనె |
| అనుకృతిని నిడుదకుం గుఱుచ యగునని యొకండు పలికెనది నిరాకరంబు.
దుర్బలస్య బలం రాజా యన వినవే. |
|
| 55. |
వాక్యావసానంబున సంధిలేమి దోషంబు కాదని యార్యు లండ్రు.
| సత్యము సర్వశ్రేయము - అదిలేనిచో సర్వధర్మములు వ్యర్థములు.
ఇట్లు సంధి విరహంబు కావ్యంబులం బాదాంతమంద చూపట్టెడు. |
|