భాష బాల వ్యాకరణము సమాస పరిచ్ఛేదము
1. సమర్థంబులగు పదంబు లేకపదం బగుట సమాసంబు.
ప్రథగ్భూతంబులగు నర్థంబుల కేకార్థీభావంబు సమర్థ్యంబు.
పృథక్ప్రసిద్ధార్థంబులగు పదంబుల కేకార్థంబునందు వృత్తి సామర్థ్యము.
2. సాంస్కృతికాచ్ఛిక మిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు.
సాంస్కృతికంబని యాచ్ఛికంబని మిశ్రంబని సమాసంబు త్రివిధంబు.
అందు సాంస్కృతికంబు సిద్ధంబని సాధ్యంబని ద్వివిధంబు.

కేవల సంస్కృత శబ్దంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు.
రాజాజ్ఞ - తటాకోదకము - లక్ష్మీవల్లభుఁడు.

సంస్కృత సమంబుల సమాసంబు సాధ్యంబు నాఁబడు.
రాజునాజ్ఞ - తటాకంబు నుదకము - లక్ష్మీవల్లభుఁడు.

తక్కిన తెనుఁగుల సమాసం బాచ్ఛికం బనంబడు.
ఱేని యానతి - చెఱువు నీరు - సిరి చెలువుఁడు.

ఉభయంబు గూడినది మిశ్రమంబనంబడు.
రాజు ముదల - చెరువునుదకము - సిరివల్లభుఁడు.
3. తత్పురుషాదులకు లక్షణంబు ప్రాయికంబుగ సంస్కృతోక్తంబ యగు.
తత్పురుష బాహువ్రీహి ద్వంద్వంబునని సమాసంబులెల్లం ద్రివిధంబులయి యుండు.
అవి ప్రాయికంబుగా నుత్తరాన్యోభయపదార్థ ప్రధానంబు లయియుండు. అందుఁ దత్పురుషంబు వ్యధికరణంబని సమానాధికరణంబని ద్వివిధంబు.

ద్వితీయాదులకు మీఁది పదఁబుతోడ సమాసంబు వ్యధికరణంబు నాఁబడు.
నెలతాల్పు - నెల తక్కువవాఁడు - దేవరమేలు - దొంగభయము - రాముని బాణము - మాటనేర్పరి.

విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికరణంబు నాఁబడు.
ఇదియె కర్మధారయంబు నాఁబడు.
సరసపు వచనము - తెల్ల గుఱ్ఱము - మంచిరాజు.

ఇది సంఖ్యాపూర్వంబు ద్విగువునాఁబడు.
ముజ్జగములు - ముల్లోకములు.

బాహువ్రీహి
ముక్కంటి - చలివెలుఁగు.

ద్వంద్వము
తల్లిదండ్రులు - అన్నదమ్ములు.

ప్రాయికంబుగా ననుటచే సంస్కృత లక్షణంబుఁ దొడరని సమాసంబుం గలదని సూచింపంబడియె. దానంజేసి చిగురుఁగేలు - జుంటిమోవి ఇత్యాదులయిన యుపమాన పూర్వపద కర్మధారయంబులు గ్రాహ్యంబులు.

ముఖపద్మము - చరణకమలములు.
ఇట్టి యుపమానోత్తర పదంబులు గలవుగాని విపరీతంబులు సిద్ధంబులు లేవని యెఱుంగునది.

సిద్ధంబు సర్వంబు గ్రాహ్యంబు.
రాజపురుషుఁడు - నీలోత్పలము - పీతాంబరుఁడు - రామలక్ష్మణులు.

కేవల సంస్కృత శబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు.
దానంజేసి యనేకమాఱు లల్పదండిత్యాదులు దుష్టములని తెలియునది.
4. ఆ ఈ ఏ యను సర్వనామంబులు త్రికంబు నాఁబడు.
5. కర్మధారయంబు త్రిక స్త్రీ సమముగంత ధాతుజ విశేషణపూర్వపదం బయి యుండు.
ఆ చందము - ఈ చందము - ఏ బృందము - వాఁడిమాట - పోఁడిపాట - బెడిదపుటడిదము - మడిసెడుదడములు.

ఈ నియమముచేఁ బల్లిదుఁడు మల్లుఁడు - కావాలుఁడు వారణుఁడు ఇత్యాదుల సమాసంబు లేదు.
6. స్త్రీ సమఘటితంబ యొకానొకండు బహువ్రీహి చూపట్టెడు.
ముక్కంటి - వేగంటి - చలివెలుఁగు - వేవెలుఁగు - మోటబరి ఇత్యాదులు వ్యవహార సిద్ధంబులు గ్రాహ్యంబులు.
7. ఆచ్ఛికశబ్దంబుతోడ స్త్రీ సమంబు ప్రాయికంబుగా ద్వంద్వం బగు.
అన్నదమ్ములు - తల్లిదండ్రులు - ఊరుపల్లెలు - ఆలుమగలు. మగఁడును బిడ్డలును - పల్లమును గళ్ళెమును ఇత్యాదులు సమసింపవని యీ నియమంబున నెఱుంగునది.
8. సర్వశబ్దంబులు సంబంధమునందుం దచ్ఛబ్దంబుతోడ సమసించు.
నావాఁడు - నాయది - ఇంటివాఁడు - ఇంటిది - రామునివాఁడు - రామునిది.
9. ధాతుజ విశేషణంబులకు విభక్తి వివక్షించునపుడు తచ్ఛబ్దం బనుప్రయుక్తంబగు.
వచ్చినవాఁడు - వచ్చినది - రానివాఁడు - రానియది.
10. ఎల్ల యెడల ధాతుజ విశేషణంబుల కట్టి యను పదంబు విభాష ననుప్రయుక్తం బగు.
వచ్చినట్టి రాముఁడు - వచ్చిన రాముఁడు - వచ్చునట్టి వాఁడు - వచ్చువాఁడు.
11. యుష్మదస్మదాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాష నగు.
నీదు కరుణ - నీ కరుణ, నాదు నేరిమి - నా నేరిమి, తనదు రూపు - తనరూపు.
12. గుణవచనంబు లగు నల్లాదులకుం గర్మధారయంబునందు నిగాగంబు బహుళంబుగా నగు.
నల్లని గుఱ్ఱము - నల్ల గుఱ్ఱము.

నల్ల - తెల్ల - పచ్చ - యెఱ్ఱ - చామ - తియ్య - కమ్మ - పుల్ల - విన్న - తిన్న - అల్ల ఇత్యాదులు నల్లాదులు.
13. ద్విరుక్తం బగు హల్లు పరంబగునపు డాచ్ఛికం బగు దీర్ఘంబునకు హ్రస్వంబగు.
14. త్రికంబుమీఁది యసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు.
అక్కన్య - ఆ కన్య, ఇక్కాలము - ఈ కాలము, ఎల్లోకము - ఏ లోకము, అయ్యశ్వము - ఆ యశ్వము.

బహుళకముచే నూష్మరేఫంబు లగు ద్విత్వంబు గలుగదు.
ఆ రూపము - ఏ శబ్దము - ఏ షండము - ఆ సుకృతి - ఆ హయము.
15. కృత హ్రస్వంబగు త్రికంబు మీఁది చోటు శబ్దంబు నోత్వంబున కత్వ హ్రస్వంబులు విభాషనగు.
అచ్చోటు - అచ్చటు - అచ్చొటు, ఇచ్చోటు - ఇచ్చటు - ఇచ్చొటు, ఎచ్చోటు - ఎచ్చటు - ఎచ్చొటు.

వీని ద్విత్వంబునకు వక్ష్యమాణవిధిచేఁ బాక్షికంబుగ లోపంబగు.
అచటు - అచొటు - ఇచటు - ఇచొటు - ఎచటు - ఎచొటు - ముచ్చొటులు - ముచ్చటులు - ముచ్చొటులు అను రూపంబగు ప్రయోగంబులం గానంబడియెడి.
16. ఉత్తరపదం బగు చోట శబ్దముటాక్షరమునకు లోపంబు విభాష నగు.
చోటు శబ్దం బౌపవిభక్తికంబు గావున దాని యంతిమాక్షరంబు సప్తమ్యాదేశమయిన యకారంబుతోడం బాక్షికంబుగ లోపించునని యర్థము.
అచ్చోనున్నాఁడు - అచ్చోట నున్నాఁడు, ఒకచో నుండె - ఒకచోట నుండె.
17. సమానాధికరణంబగు నుత్తరపదంబు పరంబగునపుడు మూఁడు శబ్దము డుఙ్వర్ణంబునకు
లోపంబును మీఁది హల్లునకు ద్విత్వంబునగు.
మూఁడు జగములు - ముజ్జగములు, మూఁడు లోకములు - ముల్లోకములు.
18. ద్విగువున కేకవచనంబు ప్రాయికంబుగా నగు, మిశ్రంబునకుఁ గాదు.
ముచ్చిచ్చు - ముక్కారు - ముప్పాతిక - ముత్త్రోవ - మువ్విధములు.
19. కొండొకచో సమాసంబులందు నామ్వాది కనుమ్వాదుల మువర్ణంబులు పఙ్పవర్ణంబు లగు.
నాఁపచేను - పాఁపఁఱేడు.

కనుపపులు - జనుపనార - నాము - పాము - ప్రేము - వేము - అమ్ము - ఎమ్ము - ఇవి నామ్వాదులు.
కనుము - ఇనుము - ఉడుము - ఎనుము - జనుము - మినుము ఇత్యాదులు కనుమాదులు.
20. నిక్కలాదులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.
నిక్కల - కవ్వడి - పువ్విలుకాఁడు ఇత్యాదులు.
21. ఆకారంబున కామ్రేడితంబునకుం దదర్థకంబున కయి యాయి యను శబ్దంబులు విభాష నగు.
వక్ష్యమాణ విధిచేత నయి యనుదాని కైకాదేశంబునగు.
ఆయయికాలము - ఆయాయికాలము - అయ్యయికాలము - అయ్యాయికాలము - అయైకాలము - అయ్యెకాలము - ఆయాకాలము - ఆయక్కాలము - అయ్యాక్కాలము - అయ్యక్కాలము.
22. బహువ్రీహిని సమాసాంత కార్యంబులుం గానంబడి యెడి.
ముక్కంటి - కడలిరాచూలి - నలువ - గట్టువిలుతుఁడు.
23. బహువ్రీహిని స్త్రీవాచ్యం బగుచో నుపమానంబు మీఁది మేనునకుఁ బోఁడి యగు.
అలరుబోఁడి - ననబోఁడి - పూబోఁడి - విరిఁబోఁడి.
24. ద్వంద్వంబునందు ఋకారంబునకు ర వర్ణంబు విభాషనగు.
మాత్రుపితలు - మాతాపితలు ఇత్యాదులు.
25. సమాస విభక్తికి లోపంబగు లట్టునకుం గాదు.
రాముని బాణములు - సరసపు వచనములు - వేవెలుఁగు - గుణములప్రోక.
26. కర్మాదులకుఁ బ్రాధాన్య వివక్షయందు ధాతుజవిశేషణంబులు కర్తతోడంబోలె వానితోడ సమసించు.
రాముఁడు రక్షించిన భృత్యుఁడు - రాముఁడు వాలినేసిన బాణము - రాముఁడు గోవునిచ్చిన విప్రుఁడు - రాముఁడు వెడలిన వనంబు - రాముఁడు వసించిన పర్ణగృహము - రాముఁడు వసించిన చోటు.
AndhraBharati AMdhra bhArati - bhAshha - bAla vyAkaraNamu - samAsa parichchhEdamu - chinnaya sUri - andhra telugu tenugu ( telugu andhra )