| 1 |
డు-ము-వు-లు ప్రథమ. |
| 2 |
నువర్ణంబు ద్వితీయ. |
| 3 |
చేత-తోడ తృతీయ. |
| 4 |
కొఱకు-కయి చతుర్థి. |
| 5 |
వలన-కంటె-పట్టి పంచమి. |
| 6 |
కు-యొక్క-లోపల షష్ఠి. |
| 7 |
అందు-న సప్తమి. |
| 8 |
తృతీయాదులకు నుగాగమం బగు.
| రాముని చేతను, రాముని తోడను, రాముని కొఱకును, రాముని వలనను, రాముని కంటెను,
రామునకును, రామునియందును. |
|
| 9 |
కయి పట్టి యొక్క లకు నుగాగమంబు లేదు.
| రామునికయి, జ్ఞానముఁబట్టి, రామునియొక్క |
|
| 10 |
చేత తోడ లోపల వర్ణకంబుల ప్రథమాక్షరంబులు వైకల్పికంబుగా శేషించు.
| ప్రత్యయంబు వర్ణకంబని ప్రాచీనులు వ్యవహరింతురు.
రామునిచే, రామునితో, వనములలో |
|
| 11 |
డు-ము-వు-న లేకవచనంబులు.
| ఏకత్వసంఖ్యను బోధించు ప్రత్యయం బేకవచనంబు.
రాముఁడు, సోముఁడు, వనము, ధనము, ధేనువు, భానువు. |
|
| 12 |
లు వర్ణంబు బహువచనంబు.
| బహుత్వ సంఖ్యను బోధించు ప్రత్యయంబు బహువచనంబు.
రాములు, సోములు, వనములు, ధనములు, ధేనువులు, భానువులు. |
|
| 13 |
తక్కినవి యుభయంబులు.
మిగిలిన ప్రత్యయము లేకత్వ బహుత్వములకు బోధకములని యర్థము.
వనమును, వనములను, వనముచేతను, వనములచేతను, వనముతోడను, వనములతోడను. |
|
| 14 |
ఓ యామంత్రణంబునం దగు.
ఓయనుశబ్దము సంబోధనంబునం దగునని యర్థము.
ఇది సంబోధ్యవాచకంబునకు ముందే ప్రయోగింపబడును.
ఓశబ్దంబు తొఱంగియు సంబోధ్యవాచకంబు ప్రయోగింపవచ్చును.
ఓ రాముఁడ, ఓ రాములార, రాముఁడ, రాములార. |
|
| 15 |
ఓ శబ్దంబునకుం బురుష నీచ స్త్రీ పురుషామంత్రణంబులందు యి-సి-రి వర్ణంబులు విభాష నంతాగమంబు లగు.
| ఓయి రాముఁడ - ఓ రాముఁడ, ఓసి దుష్టురాల - ఓ దుష్టురాల, ఓరి దుష్టుఁడ - ఓ దుష్టుఁడ. |
|
| 16 |
ఓరి యోసి మైత్రియందుం గలవు.
ఓరి చిన్నికృష్ణ, ఓసి ముద్దుబాల.
ఓయి మొదలయిన వానికి స్వతంత్ర ప్రయోగముం గలదు.
సంతతియె యోయి, ఓసిపోవే, ఓరోరి.
ఇంకెందుఁబోవచ్చు - వీనికి దీర్ఘంబుం గలదు.
ఓయీ విప్రకులావతంస, ఓరి దుష్టనిశాటులార, ఓసీ ననుఁ జెనకరాకు. |
|
| 17 |
స్త్రీ తిర్యగ్జడ భిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులనంబడు.
| తిర్యక్కులనఁగాఁ బశుపక్ష్యాదులు. జడము లనఁగా నచేతనములు. |
|
| 18 |
క్లీబంబులు, మిత్రాదులు, మహద్వాచకంబులు విభాషం బుంలింగ తుల్యంబు లగు.
| మిత్రశరణ ప్రధాన పాత్రాదులు మిత్రాదులు. |
|
| 19 |
ఙిత్తు బిందుపూర్వం బగు.
ఙకార మిత్తుగాఁ గలదానికి ముందు బిందువు వచ్చునని యర్థము.
కార్యార్థము ప్రత్యయాదులందు నిబద్ధమయి ప్రయోగించునపుడు మానంబడు వర్ణ మిత్తు నాఁబడు.
ఉదాహరణము మీఁద స్పష్టంబగు. |
|
| 20 |
డుఙ్వర్ణకంబునకుం బ్రకృతియయినది డుమంతం బనంబడు.
|
| 21 |
పుంలింగంబయి, మహద్వాచకం బయిన నామంబు తుది యత్వంబున కుత్వం బగు.
నామంబనఁగాఁ బ్రాతిపదికము.
డిద్ధ, రామ, భార్గవ, రాజపురుష - ఇట్టివి ప్రాతిపదికములు.
డిద్ధు, రాము, భార్గవు, రాజపురుషు. |
|
| 22 |
పుంలింగ మగు మహద్వాచకమునకు డుఙ్ఙగు.
ఇచ్చట డుఙ్ఙను దానియందు ఙకార మిత్తుగావున ఙిత్తు బిందుపూర్వంబగునను సూత్రముచేత
డువర్ణమునకు ముందు సున్న వచ్చును. బిమ్మట ఙకారము లోపించును.
డిద్దుఁడు - డిద్దుండు, రాముఁడు - రాముండు, భార్గవుఁడు - భార్గవుండు. |
|
| 23 |
డుమంతంబునకు ద్వితీయాద్యేకవచనంబు పరంబగునపుడు నిగాగమంబు సర్వత్ర విభాష నగు.
రామునిని - రాముని, రామునిచేతను - రాముచేతను, రామునికిని - రామునకును.
సర్వత్ర యనుట నగాగమ బాధనార్థము. |
|
| 24 |
అనుదంత మగు తెనుఁగు డుమంతమునకు నిగాగమము నిత్యముగా నగును.
మగనిని - మగనిచేతను - మగనికిని అనుదంతంబను పర్వుదానముచేత
తమ్మునిని - తమ్ముని, తమ్మునిచేతను - తమ్ముచేతను, అల్లునిని - అల్లుని, అల్లునిచేతను - అల్లుచేతను,
బల్లిదునిని - బల్లిదుని, బల్లిదుని చేతను - బల్లిదుచేతను ఇత్యాదులందు నిగాగమంబు పాక్షికంబని యెఱుఁగునది. |
|
| 25 |
డుమంతంబుమీఁది నువర్ణకంబు నుత్వంబున కిత్వం బగు.
నువర్ణంబు ద్వితీయ యను సూత్రముచేత రామును, అని ప్రాప్తింపఁగా
నీ సూత్రముచేత నువర్ణకోత్వమున కిత్వంబు సిద్ధించె.
రాముని, భార్గవుని. |
|
| 26 |
ఇకారంబుమీఁది కు ను వు క్రియావిభక్తుల యత్వంబున కిత్వం బగు.
| హరిని - హరికిని, శ్రీని - శ్రీకిని, వారిని - వారికిని. |
|
| 27 |
ఈ ధాతు యుష్మదర్థంబుల మీఁది వాని యుత్వంబున కిత్వంబు రాదు.
| ఈరు, ఈవు, ఈను, ఈము, ఈకు, నీకు, మీకు. |
|
| 28 |
కువర్ణకంబు పరంబగునపు డుకార ఋకారంబులకు నగాగమం బగు.
| రామునకును, విష్ణువునకును, సవితృనకును, విధాతృనకును. |
|
| 29 |
ఉకార ఋకారంబుల కందు వర్ణకము పరంబగునపుడు నుగాగమం బగు.
| రామునందును, విష్ణునందును, విధాతృనందును. |
|
| 30 |
ఆగమ ము వు వర్ణంబుల కందువర్ణకము పరంబగునపుడు నుగాగమంబు విభాషనగు.
| వనమునందును - వనమందును, ధేనువునందును - ధేనువందును. |
|
| 31 |
బహుత్వంబున ద్వితీయాది విభక్తులకు లడాగమంబగు.
| రాములను - రాములచేతను, విధాతృలను - విధాతృలచేతను. |
|
| 32 |
సంబోధనంబునం దేకార్థంబయిన పదంబు తుదియుకారంబున కకారంబగు.
| ఓ రాముఁడ, ఓ వృక్షమ, ఓ శంభువ, ఓ కొడుక. |
|
| 33 |
సంబోధనంబునందుఁ బదంబు తుది యకారేకారంబులకు దీర్ఘంబు విభాషనగు.
| ఓ రాముఁడా - ఓ రాముఁడ, ఓ చెలియా - ఓ చెలియ, ఓ హరీ - ఓ హరి, ఓ తండ్రీ - ఓ తండ్రి. |
|
| 34 |
కృతోత్కంబగు సంస్కృతనామంబు సంబుద్ధి డుఙ్ఙునకు లోపంబు విభాషనగు.
ఓ రామ, ఓ కృష్ణ.
పూర్వసూత్రముచేత దీర్ఘంబు.
ఓ రామా, ఓ కృష్ణా
సంస్కృత నామంబగుటఁ జేసి ఓ తమ్ముఁడ, ఓ బల్లిదుఁడ ఇత్యాదులందు లోపంబులేదు. |
|
| 35 |
ఉదంత సంస్కృతనామంబు మీఁది సంబుద్ధి డుఙ్ఙునకు నూకారంబు ప్లుతం బాదేశంబు విభాషనగు.
ఓ విష్ణూ, ఓ శంభూ.
పక్షంబునందు, విష్ణుఁడ, శంభుఁడ ఇత్యాది. |
|
| 36 |
సంబోధనంబునందు బహువచనంబున కారగాగమంబగు.
ఓ రాములార, ఓ కృష్ణులార.
దీనికిం బాక్షికంబుగ దీర్ఘంబగు - ఓ రాములారా, ఓ కృష్ణులారా. |
|
| 37 |
మధ్యమపురుష యోగంబునం దార గాగమంబు విభాష నగు.
వినుఁడు బాలకులు - వినుఁడు బాలకులార. వచ్చితిరి కాంతలు - వచ్చితిరి కాంతలార.
అన్నలార మిమ్మునడిగెద నొకమాట.
ఇచ్చట మధ్యమ పురుష యోగంబు లేమింజేసి యారగామంబు నిత్యంబు. |
|
| 38 |
అదంతం బయి దీర్ఘ పూర్వలోపధం బయిన మహత్తు మీఁది విభక్తి లకారంబునకు రేఫంబగు.
బాలురు - బాలురను - బాలురచేతను, నృపాలురు - నృపాలురను - నృపాలురచేతను.
దయాళు శబ్దంబున కిట్లు రేఫంబు గానంబడియెడి.
దయాళురు - దయాళురను - దయాళురచేతను. |
|
| 39 |
అమహన్నపుంసకముల కదంతములకు మువర్ణకంబగు.
వృక్షము, ఋక్షము; దైవము, కళత్రము, ఆపత్యము; క్లీబంబులు మిత్రాదు లనుసూత్రంబునఁ
బాక్షికంబుగం బుంలింగత్వం బతిదేశించుటం జేసి మిత్రాదిశబ్దంబులకు ద్వైరూపం బెఱుంగునది.
మిత్రుఁడు - మిత్రము; శరణుఁడు - శరణము; |
|
| 40 |
వానికి మువర్ణ కేతరం బయిన విభక్తి పరంబగునపుడు ముగాగమం బగు.
| వృక్షములు - వృక్షమును, ఋక్షములు - ఋక్షమును. |
|
| 41 |
మువర్ణకంబునకు విధించు కార్యము ముగాగమంబునకు నగు.
| మువర్ణంబునకు విధించు లోపాదేశాది కార్యములు ముగాగమమునకు సహితము వచ్చునని యర్థము. |
|
| 42 |
మువర్ణకంబునకు మాముడియేనిం బూర్ణ బిందుపూర్వక బువర్ణంబేని విభాష నగు.
వృక్షము - వృక్షంబు; ఋక్షమ్ము - ఋక్షంబు.
పూర్వ సూత్రముచేత ముగాగమమున కీకార్యంబగు.
వృక్షమ్ములు - వృక్షంబులు; ఋక్షమ్ములు - ఋక్షంబులు. |
|
| 43 |
లు ల న లు పరంబులగునపు డొకానొకచో ముగాగమంబునకు లోపంబును,
దత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాష నగు.
వజ్రాలు - వజ్రాలను - వజ్రాన, పగడాలు - పగడాలను - పగడాన.
ఒకానొకచోట ననుటచే నీ కార్యంబునకుం బ్రయోగ వైరళ్యంబు సూచింపంబడియె. |
|
| 44 |
ఇ గ్లౌరాయుగంతంబుల ప్రథమైక వచనంబునకు లోపంబగు.
| ఇకారాంతమునకు, గ్లౌరై శబ్దంబులకు, మఱి యుగాగ మాంతంబులకుం బ్రథమైక వచన లోపంబగు.
హరి, గిరి, శ్రీ, ధీ. |
|
| 45 |
ఇత్తునకు బహువచనంబు పరంబగునపు డుత్వం బగు.
హరులు, గిరులు, కవులు, కపులు, యామినులు, భామినులు.
తపకరణంబుచే దీర్ఘంబున కుత్వంబు లేదు.
శ్రీలు, స్త్రీలు, లకోరీలు. |
|
| 46 |
వికృతియం దికారాంతముల యుపోత్తమేత్వంబునకు బహువచనము పరంబగునపు డుత్వం బగు.
ఇచ్చటవికృతిశబ్దముచే సంస్కృతసమేతరంబు గ్రహింపవలయు.
కలికి - కలుకులు, ములికి - ములుకులు, చెలిమి - చెలుములు, బలిమి - బలుములు.
ఉపోత్తమేత్వంబున కనుటంజేసి జిగి - నిసి ఇత్యాదులం దుత్వంబులేదు.
జిగులు - నిసులు. |
|
| 47 |
ర ల డోపధ నవార్దాదుల యుపోత్తమేత్వంబున కుత్వంబు కలుగదు.
| పందిరి - పందిరులు; పిడికిలి - పిడికిళులు; రాపిడి - రాపిడులు; తొమ్మిది - తొమ్మిదులు. |
|
| 48 |
ఉకారాంత గో శబ్దంబుల కంతట వువర్ణకంబగు.
తరువు - ధేనువు - మధువు - గోవు.
అంతట ననుట స్త్రీలింగ ప్రథమైక వచన లోపబాధనార్థము. |
|
| 49 |
వువర్ణకేతరవిభక్తి పరమగుచో నుకారాంతములగు బహుళంబుగా గోశబ్దంబునకు నిత్యంబుగా వుగాగమం బగు.
| తరువులు - తరులు - ధేనువులు - ధేనులు - గోవులు. |
|
| 50 |
ఉకారాంతం బగు మహత్తునకు వువర్ణకము బహుళముగా నగు.
| విష్ణువు - విష్ణుఁడు; శంభువు - శంభుఁడు; వసువు - వసుఁడు. |
|
| 51 |
కద్రువ నాగమాత.
| కద్రువ - కద్రువలు - కద్రువను - కద్రువలను. |
|
| 52 |
ఋకారాంతంబున కత్వంబును స్త్రీ వద్భావంబు నగు.
| భ్రాత - జామాత - కర్త - భర్త - హర్త - గంత - హంత. |
|
| 53 |
విధాతృ ధాతృ దాతృ సవితృ నేతృ శబ్దంబులకు, మహత్తుల కత్వ స్త్రీ వద్భావంబులు విభాష నగు.
| విధాత - విధాతృఁడు, ధాత - ధాతృఁడు, దాత - దాతృడు, సవిత - సవితృఁడు, నేత - నేతృఁడు. |
|
| 54 |
నామంబుల తుదిదీర్ఘంబునకు హ్రస్వం బగు.
రమా - రమ, వనితా - వనిత, విద్యా - విద్య, లక్ష్మీ - లక్ష్మి, సేనానీ - సేనాని.
ఇట్లు కృత హ్రస్వములకు హ్రస్వాంతములకుఁ బోలెఁ గార్యంబగు.
లక్ష్ములు - సేనానులు - సిరులు. |
|
| 55 |
ఏకాక్షరంబులకు హ్రస్వంబు లేదు.
| క్ష్మా - మా - భా - శ్రీ - స్త్రీ - హ్రీ - ధీ - భీ - భ్రూవు. |
|
| 56 |
వృద్ధాదుల డుఙ్ఙునకు లోపము విభాష నగు.
| వృద్ధు - వృద్ధుఁడు, మూర్ఖు - మూర్ఖుఁడు, నీచు - నీచుఁడు,
గృహస్థు - గృహస్థుఁడు, చార్వాకు - చార్వాకుఁడు; |
|
| 57 |
స్త్రీలింగంబుల ప్రథమైకవచనంబునకు లోపంబగు.
| రమ - క్షమ - వనిత - ఘనత - విద్య - దేవత - మీననేత్ర. |
|
| 58 |
చరిత్రాదుల మువర్ణంబునకు లోపంబు బహుళంబుగా నగు.
చరిత్ర - చరిత్రము - చరిత - చరితము - అలక - అభిలాష - అక్షత - ఘోష - తరంగ -
భ్రమ - విజృంభణ - వధ - వేగ - స్ఫురణ - హంస ఇత్యాదులు చరిత్రాదులు.
బహుళకమువలన దర్భాదులకు ములోపంబు నిత్యంబు.
దర్భ - పనస ఇత్యాదులు. |
|
| 59 |
స్వర్గివాచి దేవసురశబ్దంబు లేకత్వ బహుత్వంబులఁ బ్రయోగింపంబడు.
దేవుఁడు - సకలసురులు.
స్వర్గివాచి యనుటచే భూదేవులు - భూసురుఁడను ప్రయోగంబు లబాధిపత్యంబులయ్యె. |
|
| 60 |
సురశబ్దంబు నిత్యంబుగా, నసురశబ్దము వైకల్పికముగా స్త్రీతుల్యంబు లగు; సంస్కృతసమాసంబునఁ గావు.
| సురలు - అసుర - అసురుఁడు - నిఖిలసురులు - రావణాసురుఁడు -
ఎల్లసురలు - ఎల్లయసురులు - ఎల్లయసురులు. |
|
| 61 |
దూతాదులకు స్త్రీత్వంబు బహుళంబుగ నగు.
దూత - దూతుఁడు, యోధ - యోధుఁడు, శుంఠ -శుంఠుఁడు.
బహుళ గ్రహణముచే నమహత్త్వంబునందు స్త్రీత్వంబు నిత్యంబు.
సింగంబుదూత యగు జంబుకంబు. |
|
| 62 |
పృథ్వీవాచి భూశబ్దంబునకు భువి యగు.
| భువి - భువులు - భువిని - భువులను. |
|
| 63 |
నౌశబ్దంబునకు నావ యగు.
| నావ - నావలు; మహానావ. కొందఱు నావి యనియు నాదేశంబగు నండ్రు. |
|
| 64 |
రై గ్లౌ శబ్దంబుల కోత్వంబు విభాష నగు.
ఇగ్లౌసూత్రముచేతం బ్రథమైక వచనమునకు లోపంబు.
రో - రై, గ్లో - గ్లౌ. |
|
| 65 |
ఐకారం బీతుల్యంబు.
| రైని - రైకి, కైని - కైకి, పైని - పైకి. |
|
| 66 |
కంధరాదులు క్లీబతుల్యంబులు బహుళంబుగా నగు.
కంధరము - కంధర.
విధా శబ్దమునకుఁ గ్లీబతుల్యత్వంబు నిత్యంబు - విధము.
కంధరా నాశికా భిక్షా దంష్ట్రా గ్రీవాపాదుకోల్కా ప్రభృతులు కంధరాదులు. |
|
| 67 |
హలంతంబు ప్రథమైక వచనాంతతుల్యం బిందునామంబగు.
| రుక్, రాట్, మరుత్, వీరుత్, కర్మ, వర్మ శ్వశబ్దంబు తప్ప నకారాంతంబు లెల్లం
బ్రథమైకవచన తుల్యంబులే యగునని యెఱుంగునది. |
|
| 68 |
ఉగాగమంబును ద్విత్వంబును దుది హల్లున కగు.
ఉగాగమాంతంబుల కిగ్లౌసూత్రముచేఁ బ్రథమైక వచన లోపంబగు.
రుక్కు, రాట్టు, మరుత్తు, వీరుత్తు.
ఉగాగమంబు లేమింజేసి యిచటనాతంబుల కస్త్రీ లింగంబులకుం బ్రథమైక వచన లోపంబులేదు.
కర్మము, వర్మము, చర్మము, సుధన్వుఁడు, సుత్రాముఁడు. |
|
| 69 |
దీర్ఘంబుమీఁది హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు.
| వాక్కు - వాకు, స్వరాట్టు - స్వరాటు. |
|
| 70 |
మతుబాదికంబు ద్వితీయైక వచనాంతతుల్యంబు నామం బగు.
| శ్రీమంతమ్, గుణవంతమ్, విద్వాంసమ్, అనడ్వాహమ్, శ్వానమ్, ఉపానహమ్, అప్సరసమ్ ఇత్యాదులు. |
|
| 71 |
దాని యంతిమ మకారంబునకు లోపం బగు.
శ్రీమంత, గుణవంత, విద్వాంస, అనడ్వాహ ఇత్యాది.
వీని కజంతములకుం బోలె డుఙాదులు యథా యోగ్యంబుగనగు.
అతఁడు శ్రీమంతుఁడు. ఇతఁడు గుణవంతుఁడు, వాని వంశము శ్రీమంతము, వీని వంశము గుణవంతము.
విద్వాంసుఁడు - విద్వాంసము, అనడ్వాహము - శ్వానము - అప్సరస.
వక్ష్యమాణ లక్షణంబుచే స్త్రీత్వంబున మతుబాదులు ఙ్యతంబులే యిందు గ్రహింపఁబడు.
శ్రీమతి - గుణవతి - విదుషి - శుని.
మహతీవాచ్యం బగునపుడు శ్రీమంతురాలు - గుణవంతురాలు - విద్వాంసురాలనియుఁ బ్రయోగింపఁదగు. |
|
| 72 |
ముదాదులకుఁ బ్రథమైకవచనలోపంబు లేదు.
| ముదము - ఉపానహము - స్రజము. |
|
| 73 |
ఋత్విగాదులు ద్వితీయైక వచనాంతతుల్యంబులు విభాష నగు.
| ఋత్విజుఁడు - ఋత్విక్కు, నీవృతము - నీవృత్తు.
ఋత్విగాదికం బాకృతిగణంబు. |
|
| 74 |
ఒకానొకచో మహత్త్వంబునందు మతుప్తకారంబున కానాదేశంబు విభాష నగు.
| హనుమానుఁడు - హనుమంతుఁడు, భగవానుఁడు - భగవంతుఁడు ఇత్యాది. |
|
| 75 |
విశ్వకర్మాదులకు స్త్రీత్వం బగు.
స్త్రీ లింగత్వాదిదేశంబుచేత నుత్వడుఙ్ఙులు లేవని యెఱుంగునది.
విశ్వకర్మ - కృష్ణవర్త్మ - అశ్వత్థామ - యువ - యజ్వ ఇత్యాదులు. |
|
| 76 |
మహద్వాచక మయి పుంలింగం బగు బ్రహ్మశబ్దమునకు స్త్రీత్వంబగు.
బ్రహ్మ - ఈశబ్దము చతుర్ముఖ ఋత్విగ్విప్రులకు వాచకంబు.
తత్వతపోవేదయోగవాచకం బగునేని బ్రహ్మము నాఁబడు. |
|
| 77 |
ఆత్మేమనిజంతంబులకు నాంతము లగు మనుజ సంజ్ఞలకు స్త్రీత్వంబు బహుళంబుగా నగు. |
| 78 |
మహత్త్వంబున స్వార్థపరం బగు రాజశబ్దము రాజు నాఁబడు.
రాజు - ఖగరాజు.
అమహత్త్వంబునందు రాజము - వృక్షరాజము.
ఉపసర్జసత్వంబునందు హతరాజుఁడు - పరశురాముఁడు. |
|
| 79 |
జగదింద్రజిత్తుల తకారంబునకు లోపంబు విభాష నగు.
| జగము - జగత్తు, ఇంద్రజి - ఇంద్రజిత్తు. ఋత్విగాది యగుటంజేసి యింద్రజితుండనియు వాడంబడు. |
|
| 80 |
సాంతంబుల తుది సకారంబునకు లోపంబు బహుళంబుగా నగు.
ఉరము -ఉరస్సు - వక్షము - వక్షస్సు, అర్చి - అర్చిస్సు, ధనువు - ధనుస్సు, ఆయువు - ఆయుస్సు.
బహుళ గ్రహణంబునంచేసి పయః ప్రభృతుల సకారంబునకు లోపంబు.
పయస్సు, వయస్సు, సరస్సు. |
|
| 81 |
మహద్వాచకంబులగు సాంతంబుల కంతలోపం బేని, ద్వితీయైక వచనాంత తుల్యత్వంబేనగు.
| అంగిరుఁడు - అంగిరసుఁడు, ఉగ్రశ్రవుఁడు - ఉగ్రశ్రవసుఁడు,
ప్రచేతుఁడు - ప్రచేతసుఁడు, ఊర్ధ్వరేతుఁడు - ఊర్ధ్వరేతసుఁడు. |
|
| 82 |
వేధ పురోధ పురోధసుఁడు.
| వేధ శబ్దమునకు నిత్యంబుగాఁ బురోధశ్శబ్దమునకు వైకల్పితముగా సలోపస్త్రీవద్భావంబులు దీనిచే నిపతింపంబడియె. |
|
| 83 |
మనఃప్రభృతుల సకారంబునకు ద్విత్వంబు విభాష నగు.
మనసు - మనస్సు, శిరసు - శిరస్సు, సదసు - సదస్సు.
లోపంబయ్యెనేని మనము - శిరము - సదము. |
|
| 84 |
ద్యు హృ చ్ఛబ్దంబులకు దివి హృది యగు.
| దివి - దివులు, హృది - హృదులు. |
|
| 85 |
స్త్రీలింగంబులెల్ల స్వస్వనియతంబులగు స్త్రీప్రత్యయంబులం గూడి యిందుఁ ప్రవర్తిల్లు.
| నామము | స్త్రీ ప్రత్యయము | తత్సమము |
| కర్తృ | కర్త్రీ | కర్త్రి |
| జనయితృ | జనయిత్రీ | జనయిత్రి |
| భాగ్యశాలిన్ | భాగ్యశాలినీ | భాగ్యశాలిని |
| బుద్ధిశాలిన్ | బుద్ధిశాలినీ | బుద్ధిశాలిని |
| మతిమత్ | మతిమతీ | మతిమతి |
| గుణవత్ | గుణవతీ | గుణవతి |
| విద్వస్ | విదుషీ | విదుషి |
| వనజముఖి | వనజముఖి, వనజముఖా | వనజముఖి, వనజముఖ |
| మీననేత్ర | మీననేత్రా | మీననేత్ర |
| అంగాదులకుఁ దప్ప సంయోగోపధంబులకు ఙీప్ప్రత్యయంబు లేమింజేసి మీననేత్రి - పద్మనేత్రి ఇత్యాదు లసాధువులు. |
|
| 86 |
మహతీతరంబులగు స్త్రీలింగంబుల విశేషణంబులకుఁ గ్లీబత్వంబు విభాష నగు.
| పద్మలత మనోహారి - పద్మలత మనోహారిణి, హృద్యంబగు విద్య - హృద్యయగు విద్య,
మొదవులలోఁ గపిల వరిష్ఠంబు - కపిల వరిష్ఠ. |
|
| 87 |
భవచ్ఛత్రాదుల కిందుఁ బ్రయోగంబు లేదు.
| భవదాదులగు హలంత సర్వనామంబులకును శతృ రేఫాంతాదులకును తెనుఁగు భాషయందు
వ్యవహారంబు లేదని యర్థము. సమాసంబులం దొలుతం గదిసి యిందుం బ్రయుక్తంబులగు
భవద్గుణంబులు - త్వదాశ్రయము - మత్పుణ్యము - లసద్రూపము - భవిష్యత్కాలము - ధూర్వహము
ఇత్యాదు లెఱుంగునది. |
|