చరిత్ర పురాతనస్థల ఖనన పరిశోధన  


ఉపోద్ఘాతము

శాసనశాస్త్రములును, నాణకశాస్త్రములును పురాతత్త్వ శాస్త్రములోని విభాగములు. ఇవి మాత్రమే కాక ఆ శాస్త్రమునకు సంబంధించిన మరియొక ముఖ్య విషయము పురాతనస్థల ఖనన పరిశోధన. మత విషయకముగా కాని, చారిత్రకముగా గాని ఒకప్పుడు ప్రసిద్ధి వహించి ఇప్పుడు దిబ్బలయి పోయిన ప్రాచీన క్షేత్రములను, నగరములను త్రవ్వి పరిశోధించి, అట్టి పరిశోధనలో బయలు పడిన పురాతన నిర్మాణ శిథిలములను బట్టియు, వస్తు సామగ్రిని బట్టియు వాని కాలమును నిర్ణయించి, ఆ కాలమునాటి జనుల ఆచార వ్యవహారాదికములను, జీవన విధానమును - ఆనాటి నాగరికతను తెలిసికొనుటకును, ఆ నాటి చరిత్రను పునర్నిర్మించుటకును పురాతత్వ శాస్త్రజ్ఞులు ప్రయత్నించు చున్నారు. ఈ విధముగ చేసిన పురాతనస్థల ఖనన పరిశోధనను అనుసరించియే మన నాగరికత, సంస్థలు, కళలు మొదలైనవాని ప్రారంభమును, వాని ప్రాథమిక దశను తెలిసికొనుటకు వీలగుచున్నది.

తెలుగు దేశమునకు క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దమునుండియే ప్రారంభమయి క్రీ. శ. పదునేడవ శతాబ్దము వరకు సాగిన సుదీర్ఘమగు స్వతంత్ర చరిత్రము కలదు. ఈ రెండువేల సంవత్సరములలో తెలుగు దేశమున వేరువేరు ప్రాంతములందు రాజ్యములు నిర్మించుకొని పరిపాలనము చేసిన రాజవంశము లనేకము కలవు. తెలుగు దేశమును సంపూర్ణముగ కాకపోయినను, విశేష భాగమును ఒకటే పతాకక్రిందికి తీసికొనివచ్చి పరిపాలనము చేసిన మహారాజాధిరాజులును, చక్రవర్తులును కలరు. తెలుగు దేశమును పరిపాలించిన రాజవంశములు వైదిక ధర్మావలంబకులును, యజ్ఞయాగాది కర్మనిరతులును అయినను పరమత సహిష్ణులై బౌద్ధ, జైనములను కూడ ఆదరించిరి. ఈ రెండువేల సంవత్సరముల కాలములో పూర్వము ప్రసిద్ధి వహించిన పట్టణములు చాల పాడుపడినవి; కొన్ని పల్లె లయినవి. బౌద్ధ జైనములు మన దేశమున నశించిన వెనుక అనాదృతిపాలై బౌద్ధ సంఘారామములును, జైనవసదులును భూగర్భగతము లైనవి. చరిత్ర ప్రసిద్ధి వహించిన పురాతన స్థలముల యొద్ద పెద్ద దిబ్బ లిప్పటికిని కానవచ్చును. ఇటువంటి దిబ్బలలో కొన్నిటిని పురాతత్వశాఖవారు త్రవ్వించి పరిశోధనలు జరిపినారు; ఇంకను జరుపుచున్నారు. ఇటువంటి దిబ్బలను త్రవ్వించి పరిశోధించుటవలనను, దేశములో కానవచ్చు శాసనములను పరిశోధించుటవలననే మన దేశము యొక్క పూర్వ చరిత్ర క్రమముగా బయటపడుచున్నది.

తెలుగు దేశములో పురాతత్వశాఖవారు కొన్ని కొన్ని దిబ్బలను, స్థలములను త్రవ్వించి జరిపిన పరిశోధనలవలన బౌద్ధావశేషములకు, జైనావశేషములకు నెలవైన చరిత్ర ప్రసిద్ధములగు ప్రదేశము లనేకము బయలుపడి మన దేశములోని బౌద్ధ, జైన మతచరిత్రములు పూర్వముకంటె ఎక్కువగా తెలిసికొనుటకు వీలయినది. ఈ ప్రదేశములలో అమరావతి, నాగార్జునుని కొండ, భట్టిప్రోలు, గంటసాల, జగ్గయ్య పేట, గుమ్మడిదుర్రు, సంకారము, రామతీర్థము, శాలిహుండము ముఖ్య బౌద్ధస్థలములు. తెనుగుదేశమున బౌద్ధము జనాదరణము చూరకొని క్రీ. పూ. 3వ శతాబ్దము మొదలు క్రీ. శ 7వ శతాబ్దము వరకు వాస్తు, శిల్ప, చిత్రలేఖనములకు తీర్పులు దిద్దినది. బౌద్ధసంఘములు వేరువేరు కులములకు తెగలకు ఉన్నతాదర్శమును చూపి నైతికముగా జనుల నిత్యజీవితములందు మార్పులు తెచ్చినవి. భౌతికములైన సీమావధులను దాటి మతమును వ్యాపింపజేయుటకయి ఆ కాలమునందలి బౌద్ధభిక్షువులు అపారమయిన కృషిని కావించిరి. వారు ఆనాడు అట్లు కావించిన కృషి ఆంధ్రనాగరికతకు అభ్యున్నతిని, శోభను సమకూర్చినది.

బౌద్ధుల పవిత్రవాస్తు నిర్మాణమును గూర్చిన పరిశోధన భారతీయ పురాతత్వ శాస్త్రమందు ప్రధానమైన స్థానమును ఆక్రమించినది. బౌద్ధులకు పవిత్రములైన కట్టడములలో సంఘారామము, స్తూపము అనునవి ప్రముఖములు. విహారమను శబ్దము బౌద్ధభిక్షువులు నివసించు మఠములకే కాక, బౌద్ధాలయములకు కూడ వాడబడుచుండినట్లు యువా\న్‌ చ్వాంగ్‌ వ్రాతలవలనను, సింహళద్వీపమున ప్రార్థన మండపములకు నేటికిని ఈనామము చెల్లుచుండుట వలనను తెలియుచున్నది.

బౌద్ధ సంఘారామము సాధారణముగా చతురస్రమయి, అంతర్భాగమున మండువావిధమున ఖాళీస్థలమును, దీని నావరించుకొని చతుశ్శాలయు, అందు మూడు ప్రక్కల 'భిక్ఖు'ల నివాసములకై కట్టిన గదులును గల నిర్మాణము. స్తూపమను పదము బౌద్ధ వాస్తువున ఇటుకతో కాని, రాతితోకాని, మట్టితో కాని, అర్ధగోలాకృతిగా నిర్మించిన సమాధి వంటి నిర్మాణములకు మాత్రమే వాడబడినది. స్తూపమునే బౌద్ధులు చైత్య మనియు వ్యవహరించు చుండిరి. బుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, అర్హతులు, చక్రవర్తులు - వీరికి మాత్రమే స్తూపము నిర్మింప వచ్చును అని బుద్ధుడే శాసించినట్లు 'మహా పరి నిర్వాణ సూత్ర'మున తెలుపబడి యున్నది. కాని కాలక్రమమున విఖ్యాతులైన బౌద్ధాచార్యులకు గూడ బౌద్ధులు ఈ గౌరవము ఇచ్చినట్లు పురాతత్వ శాఖవారి పరిశోధనల వలన రుజువగు చున్నది.

స్తూపములు త్రివిధములు. అవశేషధాతువులపై కట్టిన స్తూపములకు ధాతుగర్భములు లేదా శారీరకస్తూపములు అనియు, బుద్ధుడు సంచరించిన పవిత్ర క్షేత్రములందు ధాతు రహితముగా కేవలము స్మారక చిహ్నములుగా కట్టినవానికి ఉద్దేశిక స్తూపములనియు, ఆచార్యపాదులు ఉపయోగించిన భిక్షాపాత్ర, పాదుకలు మొదలగు పారిభోగిక వస్తువులను పదిలపరచి, ఆ ప్రదేశములపై కట్టిన స్తూపములకు 'పారిభోగిక' స్తూపములు అనియు పేర్లు. భక్తులైన బౌద్ధ శిల్పుల సిద్ధహస్తములలో స్తూప నిర్మాణము ఒక కళయై క్రమపరిణామము పొంది వాసి కనినది.అమరావతి

తెలుగు దేశము నేడు బౌద్ధావశేషములకు నిలయము. ఇట్టి వానిలో ప్రపంచ ఖ్యాతి పొందినది ధనకటక మహాచైత్యము. దీనిని ఇప్పుడు అమరావతీ స్తూపము అందురు. అమరావతి గుంటూరు మండలమున కృష్ణానదీ తీరమున గుంటూరికి ఇరువదిరెండు మైళ్ల దూరమున కలదు. ఆంధ్ర శాతవాహనులకు రాజధానియై విఖ్యాతి వహించిన ధన కటకము అమరావతికి శివారు గ్రామమై దానికి మైలు దూరముననే నేడు ధరణికోట అను పేర పరగుచున్నది. దీనికి ధాన్యకటకమని కూడ నామాంతరము కలదు.

మొట్టమొదట క్రీస్తు శకము 1797 కల్నల్‌ కాలిన్‌ మెకంజీ అమరావతికి వచ్చి ఇచ్చటి స్తూప శిల్పములను చూచి వాని విలువను గుర్తించి పత్రికలకు వ్రాసెను. అతడు అమరావతికి వచ్చుటకు కొద్ది సంవత్సరములకు పూర్వము శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అను జమీన్‌దారుడు తన రాజధానిని చింతపల్లి నుండి అమరావతికి మార్చి ఇక్కడ ఒక పట్టణమును, తాను నివసించుటకు గొప్ప భవనమును నిర్మించుకొనుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు కావలసిన రాతికొరకు అమరావతికి పడమరగా చేరువనున్న పురాతన నగరమయిన ధరణికోట యొక్క గోడలను, అందలి దిబ్బలను త్రవ్వించెను. అట్లు త్రవ్వించిన దిబ్బలలో దీపాల దిన్నె ఒకటి. దీనిలోనే పూర్వపు బౌద్ధస్తూపము ఉండెను. అతని జనము ఈ స్తూపమునుండి పెద్ద పెద్ద యిటికలను, పాలరాళ్లను త్రవ్వించి తీసికొని పోయిరి. అత్యంత రమణీయముగా నున్న శిల్పఫలకములను గూడ కాల్చి సున్నము చేసిరి.

తరువాత మెకంజీ 1816 లో మరల అమరావతికి వచ్చి స్తూప శిల్పములను చూచి, వానికి నమూనాలు వ్రాసి ప్రాచుర్యము కలిగించెను. కొన్ని శిల్ప శిలా ఫలకములను ఏరి 1819 లో అతడు కలకత్తాకు పంపెను. అటుతరువాత, ఒక భవనమును కట్టి దానిలో భద్రపరచు తలంపుతో అమరావతినుండి మరికొన్ని రాళ్లు మచిలీపట్టణమునకు కొనిపోబడినవి. అవి పదునెన్మిదేండ్లవరకు అక్కడనే ఉండెను. గుంటూరు కమీషనర్‌గా నియమించబడిన సర్‌ వాల్టర్‌ ఇలియట్‌ 1845లో అమరావతికి వచ్చి మరల స్తూపమువద్ద త్రవ్వింపగా అంతకు పూర్వము స్పృశింపని కొంత భాగము బయటపడినది. కాని ఈ భాగమునకు సంబంధించిన రాళ్లు అప్పటికే అవి ఉండవలసిన స్థలములో లేవు. ఇలియట్‌ ఈ శిల్పపురాళ్లలో చాలభాగము మద్రాసుకు పంపెను. అక్కడ చాల సంవత్సరములు అవి వానకు తడిసి, ఎండకు ఎండిన మీదట ఇంగ్లండుకు పంపబడినవి. 1856లో అవి లండను చేరినవి. అవి లండనులో సామాను వేసికొను గిడ్డంగి వంటి గృహములో ఉండగా 1867లో సుప్రసిద్ధ ఆంగ్లేయ కళాతత్వవేత్తయు, విమర్శకుడును అయిన ఫెర్గుసన్‌ వానిని చూచి, వాని సౌందర్యమునకు అచ్చెరు వంది వానినిగూర్చి ఒక ఉద్గ్రంథమును ప్రకటించెను. ఫెర్గుసన్‌ పుస్తకముతో అమరావతీ శిల్పములకు అమిత ఖ్యాతి వచ్చినది. ఇంగ్లండుకు పంపబడిన ఈ శిల్పపు రాళ్లను నేటికిని బ్రిటిష్‌ మ్యూజియములో చూడవచ్చును. ఇంగ్లండుకు పంపినవి కాక మద్రాసు కేంద్ర వస్తు ప్రదర్శనశాలకు పంపినవి కొన్నింటిని నేటికిని మద్రాసు వస్తు ప్రదర్శనశాలలో చూడవచ్చును. రాబర్ట్‌ సుయెల్‌ 1877 లో ఈ స్తూప ప్రదేశమువద్ద త్రవ్వించి మరికొన్ని శిల్పపురాళ్లను బయటికి తీసెను. వీనినిగురించు ఇతడు ఒక పుస్తకమును గూడ ప్రచురించెను. 1881లో జేమ్సు బర్జెస్‌ను పురాతత్వశాఖవారు ఖనన పరిశోధన నిమిత్తము అమరావతికి పంపిరి. కాని అప్పటికే స్తూపము నాశనమైనది. బర్జెస్‌ అక్కడి శిలా ఫలకములను సురక్షితముగా మద్రాసుకు చేర్చెను. క్రీ. శ. 1905-06, 1908-09 లో అలెగ్జాండర్‌ రే దొర కావించిన ఖనన పరిశోధనలకు ఫలితముగా మరికొన్ని శిలాఫలకములు బయల్పడినవి. అమరావతీ స్తూపమునకు చెందిన శిలాఫలకములు పెక్కులు లండనులోని బ్రిటిష్‌ మ్యూజియమునందును, మద్రాసు మ్యూజియము నందును, కొన్ని కలకత్తాలోని ఇండియన్‌ మ్యూజియము నందును, మిగిలిన శిథిలములు అమరావతి యందును పదిల పరుపబడి యున్నవి. అమరావతీ స్తూపము యొక్క నిర్మాణకాలమును సరిగా నిర్ణయించుటకు అందు దొరకిన శాసనములే ముఖ్యాధారములు. మౌర్య లిపిలోను, సాతవాహనుల, ఇక్ష్వాకులనాటి లిపులలోను ఉన్న శాసనముల వలన ఈ స్తూపము మౌర్యుల కాలము నుండియు విఖ్యాతిలో ఉండి దక్షిణాపథపతులైన సాతవాహనుల కాలమునను, అటు తర్వాతను అభివృద్ధి పొంది ప్రజల గౌరవాదరములను పొందుచు వచ్చినట్లు ఊహింపవచ్చును. కాలక్రమమున ధాన్యకటకమునకు దశ తొలగి పోయినది. క్రీ. శ. నాలుగవ శతాబ్దము నాటికే ఈ మహాచైత్యము ప్రభ క్షీణించుటకు ఆరంభించినది. చీనా యాత్రికుడైన యువా\న్‌ చ్వాంగ్‌ ఏడవ శతాబ్దములో ఆంధ్ర దేశమునకు అరుదెంచునప్పటికే ధాన్య కటకమున నుండిన సంఘారామములు అనేకము సంఘ పరిత్యక్తములై పాడుపడిపోయినవి. బౌద్ధమతమున తాంత్రిక సంప్రదాయము ప్రబలుటతో ఆ మతము తన విశిష్టతను కోల్పోవుటయే కాక, ఆ పద్ధతిని ఆదరించిన వజ్రయాన బౌద్ధాచార్యులు చీడపురుగులుగా భావింపబడిరి; బౌద్ధారామములు అన్నియు లంజ దిబ్బ లనుపేర కళంకితములుగా నిలిచిపోయినవి.

నేడు అమరావతీ స్తూపము అందలి శిల్ప చిత్రముల యోగ్యతవలననే విశ్వవిఖ్యాతి గాంచినది. ఈ స్తూపము నందలి చెక్కడపు పనులు నాటి ఆంధ్ర శిల్పుల పవిత్ర మతాభినివేశనమునే కాక, వారి కళా కోవిదత్వమును కూడ చాట జాలియున్నవి. ఇంత అద్భుత సృష్టి చేసిన శిల్పులు స్వోత్కర్ష ప్రకటనయందు ఆసక్తి లేనివారు కనుకనే వారు తమ నామములను కూడ ఎక్కడను చెక్కు కొనలేదు.

ఖనన పరిశోధనలందు లభించిన స్తూప ప్రతి బింబముల సాయమునను, చరిత్ర దృష్టితో కూడిన భావనా బలము వలనను కల్నల్‌ కాలిన్‌ మెకంజీ మున్ను ఎన్నడో కాల విపర్యయమున శిథిలమై భూగర్భస్థమైన మహా చైత్యము యొక్క ఆకృతిని పునర్నిర్మింప గలిగెను. నేడు గుండ్రముగా కన్పట్టు గుంటయందే పూర్వము ఒకప్పుడు 138 అడుగుల వ్యాసము, 100 అడుగుల ఎత్తు కలిగి శిల్పాలంకార శోభితములైన పాలరాతితో ఈ స్తూపము విరాజిల్లు చుండెడిది. ఈ నిర్మాణములోని రాళ్లను బట్టి ఈ స్తూపము వృత్తాకారము గల వేదిక, దానిపైన అర్ధ గోలాకృతితో ఉండిన అండము, దానిమీద హర్మిక, దానిపై కేతన విరాజితమైన దండాంచిత చ్ఛత్రము అనెడి అంగములతో కూడి ఉండెడిదని తెలియుచున్నది. వేదికమీది అండమునకు నాల్గువైపుల 'ఆయక'వేదికలు, వానిపై 'ఆయక' స్తంభములు అను పేరు గల ఐదేసి స్తంభములు కూడ గలవు. 'ఆయక' స్తంభ ప్రతిష్ఠాపనము ఆంధ్ర దేశమందలి బౌద్ధ స్తూపముల విశిష్టత. వేదిక చుట్టును 'ప్రదక్షిణ పథము'ను, దానిని ఆవరించి ప్రాకారమును ఉండెడివి. ఈ ప్రాకారము నిలువు రాతికంబములకు ఎడ నెడ, అడ్డముగా జొనిపిన రాతి కమ్మలతోను, స్తంభోపరిభాగమున మదురుగా ఉండు రాతి దూలములతోను నిర్మితమై ఉండినది. అడ్డు కమ్మికి 'సూచి' అనియు, మదురు రాతికి 'ఉష్ణీష' మనియు పేర్లు. సూచీ స్తంభోష్ణీషములు అతి మనోహరములైన దివ్య ప్రతిమా సంపదతో ఒప్పారుచుండినవి. ఈ ప్రాకారరేఖకు నాల్గు వైపుల నాల్గు సింహద్వారములు ఉండెడివి.

బౌద్ధము ఆంధ్ర దేశమునందు ప్రబలిన క్రీ. శ. ఆరంభ శతాబ్దముల నాటి ఆంధ్రుల ఆచారవ్యవహారములును వస్త్రాభరణములు, అలంకారములు మొదలగునవియు సవిస్తరముగా తెలిసికొనుటకు ఈ స్తూపపు రాళ్ల మీది చిత్రములే ఆధారములు. (చూడు: అమరావతి)భట్టిప్రోలు

ఇది గుంటూరు మండలమందు రేపల్లె తాలూకాలో ఉన్న చిన్న గ్రామము. ఈ గ్రామమునకు దక్షిణమున లంజదిబ్బ అని వ్యవహరింపబడు దిబ్బ బౌద్ధస్తూపము. ఇది క్రీ. శ. 1870 లో ప్రథమమున బాస్వెల్‌ చే కనుగొనబడినది. అటు తర్వాత క్రీ. శ. 1871 లో ఇలియట్‌ దీనిని గూర్చి ప్రభుత్వమునకు వ్రాసెను. ఈ స్తూపములోని ఇటికలుగూడ పరిమాణమునందును, మన్నికయందును, అమరావతి స్తూపములోని వానివంటివి అగుటచే రస్తాల నిర్మాణమునకును, కృష్ణానది కాలువలను కట్టుటకును విరివిగా ఉపయోగింపబడినవి. అటు తర్వాత రాబర్ట్‌ సుయెల్‌ దీనిని దర్శించి స్తూపము ప్రాముఖ్యమును, దాని శిథిలావస్థను గూర్చి ప్రభుత్వమునకు తెలియజేయగా పురాతత్వశాఖ సూపరింటెండెంటుగా నున్న అలెగ్జాండర్‌ రే 1882 లో ఈ స్తూప స్థలమునందు త్రవ్వటపు పరిశోధనలు చేయించిరి. ఆ ఖనన పరిశోధనలకు ఫలితముగా శిథిలము కాగా మిగిలిన స్తూపాకారము బయలు పడినది. స్తూపము మధ్య భాగమునందలి ఇటికలు తీయగా లోపల నిక్షిప్తమైన శిలాపేటికలు మూడు దొరకినవి. ఈ పేటికలలో స్వర్ణపుష్పములు, నాణెములు, రత్నములు మొదలగునవి కానవచ్చినవి. వానిని మద్రాసు మ్యూజియమునందు కాననగును. ఈ పేటికలపై నున్న శాసనములను బట్టి ఈ స్తూపముల నిర్మాణ కాలమును సరిగా నిర్ణయించుటకు వీలగు చున్నది. ఇవి దక్షిణ మౌర్య లిపియందు లిఖింపబడి యుండుటచే బూలర్‌ దొర ఇవి క్రీ. శ. రెండువందల సంవత్సరములనాటివి అయియుండవచ్చునని ఊహించెను. స్తూపాలంకరణములకయిన చెక్కడపు రాళ్లు అన్నియు కాలువ తూముల నిర్మాణమునందు ఉపయోగించుటచే నేడు మనకు ఏవియు లభ్యమగుటలేదు.గంటసాల

ఇది కృష్ణ జిల్లా దివితాలూకాలో మచిలీపట్టణమునకు పశ్చిమముగా 13 మైళ్ళ దూరమున కలదు. 'కంటకసేల' అను నామముతో క్రీస్తు శకము తొలిశతాబ్దములందు సుప్రసిద్ధమైన రేవుపట్టణముగా విలసిల్లిన ఈ గ్రామము నేడు, సముద్రమునకు దూరమై పేరు ప్రతిష్టలు లేని పల్లెటూరైనది. ఇందు పూర్వకాలమునాటి వర్తకవాణిజ్యములకు సాక్షీభూతముగ యవన, రోమక నాణెములు ఇప్పటికిని దొరకుచున్నవి. ఈ గ్రామమునకు ఈశాన్యభాగమున లంజదిబ్బలు అను పేరుగల దిబ్బలు బౌద్ధస్తూపములు. వీనినిగూడ బాస్వెల్‌ 180(?) లో గుర్తించి వీనికి ప్రాచుర్యమును కలిగించెను. 192 అడుగుల రాపకముతో 23 అడుగుల ఎత్తున చక్రాకృతి నున్న ఈ దిబ్బ 1892 లో పరిశోధింపబడినది. ఇందు ఖనన పరిశోధనలుచేసి స్తూపము యొక్క వేదిక పునాదులను, సౌష్ఠవము చెడకుండ బయల్పరచి, అలగ్జాండర్‌ రే ఈ స్తూపము అమరావతీ స్తూపముకంటె కొంచెము అర్వాచీనమైన దినియు, నమూనాను బట్టి ఇది సింహళద్వీపములోని స్తూపములను బోలి యున్న దనియు వ్రాసిరి. ఇందుకూడ స్వర్ణపుష్పములు, మౌక్తికములు, వజ్రములు గల శిలాపేటిక లభించినది. స్తూపాలంకరణ శిల్పము లన్నియు, గృహనిర్మాణములకై తీసికొనిపోయినవి పోగా, మిగిలినవి ప్రక్కగ్రామములకు తరలింపబడినవి.గుడివాడ

కృష్ణా మండలమున ఈ గ్రామము మచిలీపట్టణమునకు వాయవ్యముగ ఇరువదిమైళ్ళ దూరమున కలదు. ఇది చారిత్రకప్రశస్తి గాంచిన పట్టణము. ఈ గ్రామములో 'కోట' యను ప్రదేశమున ఆంధ్రశాతవాహనరాజుల నాటి నాణెములు పెక్కు లభించినవి. ఇచ్చటి స్తూపమునుగూడ బాస్వెల్‌ తొలుదొల్త గుర్తించెను. తర్వాత ఈ స్తూపమును పరిశీలించిన రాబర్ట్‌ సుయెల్‌ ఈ స్తూపము ఆకారమున 'సాంచీ' స్తూపమును పోలియుండు ననియు, ఈ స్తూపము కూడ బెజవాడనుండి బందరుకు రస్తా వేయుసమయమున ధ్వంసము చేయబడినదనియు, ఆ త్రవ్వటములో కొన్ని శిలాపేటికలు గూడ లభించిన వనియు వ్రాసెను. క్రీ. శ. 1892 లో అలగ్జాండర్‌ రే శాస్త్రోక్త పద్ధతిని సుమారు 142 అడుగుల చదరము కలిగి సంపూర్ణముగ కన్పట్టు దిబ్బను త్రవ్వి స్తూపాకృతిని బయలు పరపజూచిరి. కాని స్తూప ప్రదేశమునను దానికి చెందిన విహారస్థలములందును గృహములు నిర్మించియుండుటచే అట్లు చేయ వలనుపడలేదు. ఆయన స్తూపము పునాదులను మాత్రము బయలు పరచిరి.జగ్గయ్యపేట

ఇది కృష్ణజిల్లా నందిగామ తాలూకాయందు బెజవాడకు సుమారు 40 మైళ్ళ దూరమున ఉన్నది. ఇచ్చటి బౌద్ధావశేషములు అన్నియును ఈ గ్రామమునకు చెంతనే ఉన్న కొండమీద కలవు. ఇందు పెక్కు ఉద్దేశిక స్తూపములు, చైత్యములు, సంఘారామములు బర్జెస్‌ దొర గారచే క్రీ. శ. 1882 లో బహిర్గతము చేయబడినవి. 'ఇందలి మహాచైత్యము వ్యాసము 31.5 అడుగులు. దీని చుట్టు 11.5 అడుగుల వెడల్పుగల ప్రదక్షిణపథము కలదు. దీని వేదికయెత్తు 3.5 అడుగులు. వేదికచుట్టు ఫలకములతో అలంకృతమై యున్న' దని బర్జెస్‌ చెప్పినాడు. రీతిలో ఇందలి శిల్పములు అమరావతీ స్తూప శిల్పముల కంటె భిన్నములై అజంతాగుహలలోని కుడ్యచిత్రములకు సన్నిహితములుగ ఉన్నవి. ఇందలి శిల్పములు అన్నిటిలో శ్రీ పాదములకై చెక్కిన 'పుణ్యశాల' కడు రమ్యమైనది. స్తూపపు రాళ్లమీద చెక్కిన శాసనములను బట్టి ఈ స్తూపము కూడ అమరావతి, భట్టిప్రోలులందలి స్తూపములవలె మౌర్యుల కాలమునాటిదని ఊహింపబడినది. అమరావతీ స్తూపమువలెనే, ఈ స్తూపముకూడ తర్వాతికాలమందు, ముఖ్యముగా ఇక్ష్వాకులపాలనలో పెంపొందింపబడినట్లు శాసనములవల్ల తెలియుచున్నది. ఇచ్చట ఖనన పరిశోధనలందు లభించిన శిలాఫలకములు కూడ మద్రాసు మ్యూజియమునందు భద్రపరుపబడినవి.గుంటుపల్లి

అతి ప్రాచీనములైన బౌద్ధ గుహావిహారములలో గుంటుపల్లి బౌద్ధారామము ఒకటి. గుంటుపల్లి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలూకాలో కామవరపు కోటకు ఆరుమైళ్ళ దూరమున ఉన్న జైందారీ గ్రామము. ఈ గ్రామమునకు ఉత్తరమున ఉన్న కొండ కొసయందు, కొండలలో మలిచిన చైత్యాలయములను, విహారములను, ఇటికతో కట్టిన స్తూపములను, చైత్యములను పెక్కింటిని క్రీ. శ. 1889 లో అలగ్జాండర్‌ రే త్రవ్వి బయల్పరచెను. ఈ యన్నింటియందును కొండలలో రాతిలో మలచిన స్తూపచైత్యము ముఖ్యమైనది. ఈ గుహాలయమున 18 అడుగుల వ్యాసముగల వృత్తాకారవేదికపై 18 అడుగుల వ్యాసము, 14 అడుగుల ఎత్తుగల శిలానిర్మితమైన స్తూపమును, దాని చుట్టును మూడడుగుల వెడల్పున 'శ్రీవీథి'యు గలదు. హర్మికోపరితలమున నిర్మించిన దండాంచిత ఛత్రము మాత్రము శిథిలమైనది. ఈ గుహాలయము యొక్క పైకప్పు భాగము అన్నిటికంటె చిత్రమైనది. ఇది దారుమయ నిర్మాణపద్ధతిని అనుకరించుచు అర్ధగోళాకృతిని నిర్మింపబడినది. ఛత్రమునకు వలె దీని యందును రాతిలో ఊచలు మలచబడినవి. అశోకుని కాలమున బుద్ధగయ వద్ద బరాబరు కొండలలో మలచబడిన 'లోమక ఋషి' గుహాలయము రీతినే ఇదికూడ నిర్మింప బడుటచేతను, క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దము నాటి లిపిలో ఉన్న ఒక శాసనము లభించుటచేతను ఇది ఆ కాలము నాటిదని రూఢిగా చెప్పవచ్చును. ఈ బౌద్ధ సంఘారామము కూడ తరువాతి కాలమందు అభివృద్ధి చేయబడినది. ఇందు దొరకిన శిలా విగ్రహములు, రాతి బరిణెలు, బంగారపు భిక్షాపాత్ర, పూసలు మొదలైన వన్నియు నేడు మద్రాసు మ్యూజియమునందు చూడనగును.రామతీర్థము

ఇది విశాఖపట్టణము జిల్లాలో విజయనగరమునకు ఈశాన్యమున 8 మైళ్ళ దూరమున గలదు. క్రీ. శ. 1908-09 లో అలెగ్జాండర్‌ రే పరిశోధనల ఫలితముగ గురుభక్తుల కొండ, దుర్గ కొండ అను నామములతో వ్యవహరింపబడు కొండయొక్క కోనలందు ప్రాచీన బౌద్ధ సంఘారామమునకు సంబంధించిన అవశేషములు - స్తూపములు, చైత్య గృహములు,' భిక్ఖు'ల ఆవాసగృహములు, వారు ఏర్పరచుకొన్న నీటి వసతులు మొదలగునవు - బయలు పడినవి. ఇచట త్రవ్వునపుడు లభించిన వానిలో పూజలుకల కుండలు, నాణెములు, బంకమట్టితో చేసిన ముద్రికలు ప్రధానములు. ఇందు లభించిన సీసపు నాణెముల మీదను, మట్టిముద్రికల మీదను 'సిరి సివమక విజయరాజ సేల సంఘస' అని శాసనము కలదు. దీని 'సిరి సివమక విజయ' రాజు చేత పోషింపబడిన 'శైల సంఘ' మని అర్థము చెప్పవచ్చునేమో! అమరావతి శాసనము లందు ఒక దానిలో 'రాఞో సివమక సద' అను రాజు పేర్కొన బడియున్నాడు. సాధారణముగా నాణెముల మీద సైతము కానవచ్చు 'రాఞో' పదము ఇక్కడ దొరకిన మట్టి ముద్రికల మీద కానరాదు. అయినను విజయరాజ పదమును బట్టి అతడు రా జనియే ఊహింపవచ్చును. అ ట్లయినచో, ఇతడు ఆంధ్ర శాతవాహన రాజయి ఉండ వచ్చును. దీనిని అనుసరించి ఇచ్చటి బౌద్ధ సంఘారామము ఆంధ్ర శాతవాహనుల నాటిదై ఉండునని తలచుచున్నారు. 8, 9శతాబ్దముల నాటివని నిశ్చయింపబడిన విగ్రహములను బట్టి 9 వ శతాబ్దమువరకు గూడ ఈ సంఘారమము ఉచ్చస్థితిలో ఉండినట్లు తెలియుచున్నది.శాలిహుండము

శ్రీకాకులము జిల్లాలో వంశధార ఒడ్డున ఉన్నది ఈ గ్రామము. దీని దగ్గర కొండపై ఉన్న బౌద్ధావశేషములు కూడ త్రవ్వి బయల్పరుప బడినవి. ఉన్నతమైన ప్రదేశమందు నిర్మింపబడిన ఈ స్తూపరాజము చూపరులకు వింత కొల్పుచు, కళింగపట్టణపు రేవునకు వచ్చిన వణిక్‌ ప్రభువుల నందరిని ఆకర్షించుచుండెడిదట. ఇచ్చట స్తూపమందు నిక్షిప్తమైన ధాతుపేటికలు స్ఫటికముతో చేయబడినవి. స్తూపాకృతినున్న ఈ పేటికలందు స్వర్ణ పుష్పములుగూడ లభించినవి. ఇవి నేడు విశాఖపట్టణమందలి పురాతత్వశాఖవారి కార్యాలయములో భద్రపరుపబడి యున్నవి. (చూడు: శాలిహుండము)సంకారము

బొజ్జన్న కొండ అను నామాంతరము కల ప్రాచీన బౌద్ధస్థలము విశాఖపట్టణము జిల్లాలో అనకాపల్లి రైలుస్టేషనుకు రెండుమైళ్ళ దూరమున కలదు. శిల్పములతో విరాజిల్లు ఈ గుహాలయము రెండంతస్తులు కలది. చైత్యాలయ ద్వారోపరి భాగమున ధ్యానసమాధిలో ఉన్న పురుష ప్రమాణము గల బౌద్ధ విగ్రహము కలదు. 30 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు గల ఈ గుహాలయము 2 అడుగుల చదరము గల 16 స్తంభము లాధారముగా నిల్చియున్న రాతిలో మలచబడినది. నాలుగడుగుల ఎత్తుగల ఏకశిలా నిర్మితమైన స్తూపము ఒకటి ఆలయ మధ్యభాగమున కలదు. ఈ గుహాలయములకు పైగా కొండమీద ఇటికలతో నిర్మితమైన స్తూపములు, చైత్యములు, 'భిక్ఖు' నివాసయోగ్యములైన గదులు కూడ బయల్పడినవి. ఖనన పరిశోధనలందు ఇచట పెక్కు నాణెములు, బంకమట్టితో చేసిన ముద్రలు లభించినవి. ఇచట దొరకిన నాణెములలో గుప్త చక్రవర్తియైన సముద్ర గుప్తుని బంగారు నాణెము ముఖ్యమైనది.అల్లూరు

ఇది కృష్ణజిల్లా నందిగామ తాలూకాలో ఎర్రుపాలెం రైలుస్టేషనుకు నాలుగుమైళ్ళ దూరమున కలదు. ఈ గ్రామమునకు వాయవ్యముగా అరమైలు దూరమున ప్రాచీన స్తూపావశేషములను గుర్తించి, 'మహమ్మద్‌ ఖురైషీ' గారు 1926 లో దీనిని త్రవ్వి శోధించిరి. ఈ స్తూపము పునాది చక్రమునకు వలె ఆకులు కలిగి, గుండ్రమైన ఆకృతిలో ఉన్నది. మధ్యభాగము మాత్రము 32('remove in html)'8" వ్యాసము గల ఘన నిర్మాణము. ఈ నిర్మాణమున ఉపయోగించిన ఇటికలు కూడ అమరావతీ స్తూపములోని వానివలె 22" పొడవు గలవి. స్తూపవేదిక నాల్గు దిక్కులందు ముండునకు పొడుచుకొని వచ్చినట్లు కట్టిన 'ఆయక' వేదికలు గలవు. స్తూపముచుట్టును చప్టా చేయబడిన 10.5 అడుగుల వెడల్పుగల 'శ్రీవీథి' కలదు. ఇందు శిథిలములైన పాలరాతి శిల్పఫలకములు, బ్రాహ్మీలిపిలో ఉన్న శాసనములు గల శిలాస్తంభములు మొదలగునవి దొరకినవి. శాసనముల ఆధారమున ఈ స్తూపము క్రీ. శ. రెండవ శతాబ్దము నాటిది అని పురాతత్వ విదులు నిర్ణయించిరి.గుమ్మడిదుర్రు

ఈ గ్రామము నైజాము సంస్థానమున మధిర రైలు స్టేషనుకు ఆరుమైళ్ళ దూరమున ఉన్నది. గ్రామమునకు తూర్పుగా సుమారు నూరడుగుల ఎత్తున సమతలముగా నున్న తిప్పపై బౌద్ధావశేషములు ఉన్నట్టు గుర్తించి పురాతత్వశాఖ వారు 1926 లో దానిని త్రవ్వి బయల్పరచిరి. ఈ తిప్ప మూడు భాగములుగ విభజింపబడినది. అన్నిటికంటె ఎత్తయిన ప్రదేశమందు మహాస్తూపమును, దానికి దక్షిణముగా పెక్కు ఉపస్తూపములును, వీనికి పశ్చిమముగా నాల్గడుగుల దూరమున 'భిక్ఖు'ల ఆవాసములును నిర్మింపబడి ఉన్నవి. మహాస్తూపము అమరావతీ స్తూపమువలె శిల్ప ఫలకములతో అలంకరింపబడినది. శిల్పము లన్నియు పాలరాతితో చెక్క బడినవే. స్తూప ప్రతిమలు, బుద్ధుని జాతక కథలు చెక్కిన శిల్ప ఫలకము లెన్నియో ఇందు లభించినవి. ఆంధ్రరాజులనాటి శాసనములు, సీసపు నాణెములు, రాతి పూసలు, మధ్యయుగము నాటి ముద్రలు, బంగారు హారము, రజత పేటికలు కూడ లభించినవి. నిర్మాణ రీతినిబట్టియు, శాసన లిపిని బట్టియు ఈ స్తూపము క్రీ. శ. 2, 3 శతాబ్దముల నాటిదని నిర్ణయించిరి.నాగార్జునుని కొండ

అమరావతి తరువాత ప్రాచీనాంధ్ర బౌద్ధక్షేత్రములలో సుప్రసిద్ధమైనది నాగార్జునుని కొండ. ఇది గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో మాచెర్ల స్టేషనుకు 14 మైళ్ళ దూరమున ఉన్నది. ఇచ్చటి బౌద్ధావశేషము లన్నియు విశాల మగు లోయయందు ఉన్నవి. ఈ ప్రదేశమును తొలుదొల్త 1925 లో శాసన పరిశోధన శాఖకు చెందిన ఎ. రంగస్వామి సరస్వతి గారు శిథిలమైన బౌద్ధస్తూపపు దిబ్బయొద్ద ప్రాచీన బ్రాహ్మీ శాసనములు గల స్తంభమును గుర్తించి స్థల ప్రాశస్త్యమును గూర్చి ప్రభుత్వమునకు తెలియజేసిరి. తదుపరి, ఇచట మహమ్మదు ఖురైషీ గారు చేసిన ఖనన పరిశోధనకు ఫలితముగ 18 ప్రాచీన శాసనములు, రెండు శిథిలాలయములును, అనేకమగు అమూల్య శిల్ప ఫలకములును బయల్పడినవి. అటుతర్వాత 1927 నుండి 1931 వరకు లాంగ్‌హర్‌స్టు దొర, టి.యన్‌ రామచంద్రన్‌ గారు ఈ ప్రాంతమున జరిపించిన త్రవ్వటము మూలమున ఇటికలతో నిర్మింపబడిన స్తూపములు, సంఘారామములు, చైత్య గృహములు, శిలా స్తంభయుతము లయిన మండపములు పెక్కు బహిర్గతములైనవి. ఇచ్చట దొరకిన శిల్ప సంపద యంతయు, ఇందు ప్రత్యేకముగా నిర్మింపబడిన వస్తుప్రదర్శన శాల యందు పరిరక్షింపబడి ఉన్నది.

అమరావతి స్తూపము వలెనే ఇది కూడ కొంచె మించుమించుగ ఆ కాలముననే నిర్మింపబడి తర్వాత ఇక్ష్వాకురాజుల ఆదరమున క్రీ. శ. మూడు నాలుగు శతాబ్దములందు పెంపొందింపబడినది. ఇక్ష్వాకువంశజుడగు 'చాంతమూలు'ని సోదరి 'శాంతిశ్రీ' ఈ మహాస్తూపోద్ధరణ చేయుటయే కాక దాని కెదురుగ ఒక విహారమును 'అపర మహావినసేలి'యుల ఉపయోగార్థము కట్టించెను. ఈ స్తూపములు త్రవ్వుచుండగా అండము యొక్క మధ్యభాగమున నొక మట్టి పాత్రలో రజత కరండమున నిక్షిప్తమై యున్న బుద్ధధాతువు దొరికినది. ఇది బటాణీ గింజంత పరిమాణముగల ఎముక ముక్క. దీనిని 3/4" వ్యాసము గల బంగారు బరిణెలో మౌక్తిక స్వర్ణపుష్పములతో కూడ పెట్టి, దానిని మరల స్తూపాకృతినున్న రజతకరండమున పదిల పరచినారు. ఈ బౌద్ధధాతువు నేడు 'సార్నాథ్‌' లోని 'మూల గంధకుటీ విహారము'న పూజింపబడుచున్నది.

నాగార్జునుని కొండ ప్రదేశము నేడు పాడుపడి బీడుపారి పోయినది. శంకరాచార్యులవారు సపరివారముగ ఇచటికి విచ్చేసి బౌద్ధుల నందరిని తరిమివేసిరని ప్రతీతి. ఇది ఎంతవరకు సత్యమో తెలియదు.

ఖనన పరిశోధనల ఫలితముగ సుమారు 600 పెద్ద శిల్ప ఫలకములును, 400 శిథిలములైనవియును లభ్యమైనవి. ఇవి అన్నియు నేడు వస్తు ప్రదర్శనశాలలో చక్కగ అమర్చబడి యున్నవి.

ఇంకను నాగార్జునుని కొండలో త్రవ్వించవలసిన దిబ్బలు, ప్రదేశములు చాల ఉన్నవి. నాగార్జున సాగరమును కట్టినచో బౌద్ధ విహారములు, శిథిలములు మున్నగునవి పూర్తిగ మునిగిపోగలవు. కావున అక్కడ ఇంకను పరీక్షింపవలసిన ప్రదేశములను ప్రభుత్వ పురాతత్త్వ శాఖవారు త్రవ్వించుచున్నారు. ఈ త్రవ్వటము ఫలితముగ ఇదివరకు బయలు పడినవి కాక ఇంకను క్రొత్త శిథిల నిర్మాణములు మొదలైనవి బయలు పడుచున్నవి. (చూడు: నాగార్జునుని కొండ)

పై ప్రదేశములందే కాక పురాతత్వ శాఖ వారు కాపవరము, కొడవలి, ఆరుగొలను, చేజెర్ల, కనుపర్తి, ఈపూరు మొదలగు గ్రామములందు కూడ బౌద్ధావశేషములను గుర్తించి ప్రాచుర్యమును కలిగించిరి.దానవులపాడు

బౌద్ధము వలెనే జైనమతము కూడ తెలుగు దేశమున జనాదరణము పొండి ఎక్కువగా వ్యాపించినట్లు నేడు తెలుగు దేశమున శిథిలములై, నామమాత్రావశిష్టములైన జైనవసదుల వలన తెలియు చున్నది. బౌద్ధుల వలెనే జైనులు కూడ స్తూపాది నిర్మాణములు చేసినట్లు తార్కాణములు కలవు. కాని, తెలుగు దేశమున జైనమతమునకు సంబంధించిన స్థలములు పురాతత్వశాఖ వారిచే గుర్తింపబడి, శోధింపబడిన వానిలో దానవులపాటి జైనాలయములు ప్రసిద్ధములు. దానవులపాడు కడపజిల్లా, జమ్మలమడుగు తాలూకా యందు పెన్ననది ఒడ్డున నున్న కుగ్రామము. పెన్ననది వరద వలననో, మరే కారణముననో, ఎన్నడో ఇసుకలో కప్పబడి పోయి యున్న అక్కడి జినాలయములు ప్రప్రథమున క్రీ. శ. 1903 లో శ్రీ జయంతి రామయ్య పంతులుగారిచే గుర్తింపబడినవి. వారు వీనిని గురించి ప్రభుత్వమునకు తెలియజేయగా పురాతత్వశాఖ వారు ఆ స్థలము యొక్క పరిశోధనకు పూనుకొనిరి. ఇచ్చట కావించిన ఖనన పరిశోధనలకు ఫలితముగా పాలరాతితో చెక్కిన జిననాథుని విగ్రహము, 12 అడుగుల చదరముగల గర్భాలయము, ముఖమండపము బయల్పడినవి. వానిలో చాళుక్య లిపియందు ఉన్న శాసనములు, నాణెములు, పాలరాతిలో చెక్కబడిన చక్కని శిల్పములు కూడ లభించినవి.చంద్రవళ్లి

మైసూరు సంస్థానమందలి చిత్రదుర్గమునకు 1.5 మైలు దూరమున ఉన్న ఈ గ్రామమున దొరకిన నాణెములనుబట్టి ఇది క్రీస్తు శకము ప్రాథమిక శతాబ్దముల నాటి ఆంధ్ర శాతవాహనుల ముఖ్యస్థానములలో ఒకటని మైసూరు సంస్థాన పురాతత్వ శాఖాధికారులైన కె. యం. హెచ్‌. కృష్ణగారు 1940 లో ఇచ్చటను, ఈజిల్లాలోనే ఉత్తరముగా బళ్లారికి 30 మైళ్ళ దూరమున ఉన్న బ్రహ్మగిరి వద్దను ఖనన పరిశోధనలు జరిపిరి. బ్రహ్మగిరి ప్రాంతమున ఉన్న అశోకుని శాసనాధారమును బట్టియు, తనకు పరిశోధనలందు లభించిన సామాగ్రిని బట్టియు, నేడు బ్రహ్మగిరి అను పేర బరగు గ్రామమే అశోకునినాటి 'ఇసిల' అని ఆయన రూఢిగా వక్కాణించెను. బ్రహ్మగిరి కొండలకు ఆగ్నేయముగ ఒక ఫర్లాంగు దూరమున 1942 లో త్రవ్వగా బౌద్ధయుగమునాటి చైత్యగృహము ఒకటికూడ బయల్పడినది. 1947 లో ఇండియా గవర్నమెంటు పురాతత్వశాఖవారు మైసూరు పురాతత్వశాఖవారి సౌహార్దముతో ఈ ప్రదేశములందు పరిశోధనలు సాగించి బయల్పరచిన పెద్ద రాతి సమాధులు, అందు లభించిన నాణెములు, ప్రాచీన నాగరిక తావశేషములు దక్షిణదేశమున పురాతత్వ చరిత్రలో ఒక నూతనాధ్యాయమును మరల ప్రారంభించినవి. చరిత్ర రచనకు ఆవశ్యకమైన కాలక్రమమును కొంత వరకు నిర్ణయించుటకు వలసిన సామగ్రి అంతయు ఇందు లభించినది.కొండాపురము

తెలుగుదేశములోని కొండాపురము సాతవాహన రాజుల కాలమునాటి మహానగరములలో ఒకటి. అక్కడను, గోదావరీ తీరమునందలి 'పైఠాను' (ప్రతిష్ఠానము-మరాటవాడ) లోను, హైదరాబాదు పురాతత్వశాఖవారు ఖనన పరిశోధనలు కావించి యున్నారు. (చూడు: కొండాపురము, పైఠాను)హంపి - విజయనగరము

నేడు హంపి అనుపేర వ్యవహరింపబడుచున్న కుగ్రామమే పంపాతీర్థమని పురాణ ప్రసిద్ధి కలిగి, సుమారు రెండువందల సంవత్సరములు చంద్ర ధ్వజమునకు ఎదురొడ్డి నిల్చి, దక్షిణ భారతమున హైందవ స్వాతంత్ర్యమును నిలబెట్టి, హిందూ మతమును ఉద్ధరించిన విజయనగర రాజన్యుల రాజధానీ నగరము. క్రీ. శ. 1336 ప్రాంతమున సంగమ వంశజు డైన హరిహరరాయలు నిర్మించిన ఈ నగరరాజము క్రమాభివృద్ధి నొంది తుళువ కృష్ణరాయల నాటికి (1509-30) మహోజ్జ్వల చారిత్రక ప్రసిద్ధి గల నగరములలోని కెల్ల మణిపూసయై విరాజిల్లినది. సప్త ప్రాకార సమన్వితమై ఉన్నతములగు ప్రాసాదములతోను, దేవాలయములతోను అత్యంత రమణీయముగ ఉండిన ఈ నగర రాజమును రక్షస తంగడి యుద్ధమున (1565) జయమొందిన తురుష్కులు పూర్తిగా ధ్వంసము చేసిరి. అట్లు నాశనమైన ఈ మహాపట్టణపు శిథిలములు నేడు హంపి, కమలాపురము, కంపిలి గ్రామముల మధ్య పెక్కు చదరపు మైళ్ళ వైశాల్యమున ప్రకృతి ఏర్పరచిన ప్రదర్శనశాలవలె నుండి చూపరులకు తమ ప్రాచీనౌన్నత్యమును జ్ఞప్తికి తెచ్చుచున్నవి.

ఈ నడుమ మద్రాసు గవర్నమెంటు వారికి తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టి అచ్చట విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి వలయు ఏర్పాట్లు కావించుటకై హంపీ శిథిల ప్రాంతమున ఒక పెద్ద జలాశయము నిర్మింపవలసిన ఆవశ్యకము కలిగినది. ఈ జలాశయ నిర్మాణము వలన కమలాపుర గ్రామ ప్రాంతమున ఉన్న విజయనగర రాజధాని శిథిలావ శేషములు గల భూ భాగము జలమయ మగుచుండుట చేత వీలయినంత వరకు ప్రాచీనావశేషములను ఉద్ధరించు సంకల్పముతో 1950 లో ఇచ్చట ఖనన పరిశోధనలు జరుప బడినవి. తత్ఫలితముగా హరిహరరాయలనాటి బంగారు నాణెములు, గృహములు, నీటితొట్లు, బావులు బయల్పడినవి. (చూడు: హంపీ శిథిలములు)

ఇంకను తెలుగు దేశములో పురాతత్వ శాఖవారు పడమటి గోదావరి, గుంటూరు, కర్నూలు మొదలైన మండలములలో త్రవ్వింపవలసిన పురాతన స్థలములు, దిబ్బలు చాల ఉన్నవి. అవి యన్నియు త్రవ్వినచో మనకు మన ప్రాచీన చరిత్రకు, కళలకు సంబంధించిన విశేషములెన్ని బయటపడునో తెలియదు.

డాక్టరు రాయప్రోలు సుబ్రహ్మణ్యం, ఎం.ఏ., పి.హెచ్‌.డి.
సూపరింటెండెంటు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ,
నాగార్జునకొండ ఎక్సవేషన్‌ ప్రాజెక్టు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌

తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.

AndhraBharati AMdhra bhArati - charitra - telugu dEsha charitra - AdhAramulu - purAtanasthala khanana parishOdhana ( telugu andhra )