చరిత్ర తెలుగు దేశ చరిత్ర యుగ విభాగము  

తెలుగుదేశ చరిత్ర (1) చరిత్ర పూర్వ యుగము, (2) చారిత్రక యుగము అని రెండు యుగములుగా విభజింపబడినది. వీనిలో (1) చరిత్ర పూర్వ యుగము చరిత్రను తెలుపుటకు లిఖితాధారములు లేని కాలము. ఇది క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దమువరకు గల కాలము; (2) చారిత్రక యుగము క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దము మొదలుకొని ఇరువదవ శతాబ్దము వరకు గల కాలము. ఈ చారిత్రక యుగము (1) పూర్వ యుగము, (2)మధ్యయుగము, (3) ఆధునిక యుగము అని మరల మూడు యుగములుగా విభజింపబడినది. వీనిలో పూర్వయుగము క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దమునుండి క్రీస్తు శకము పదునొకండవ శతాబ్దమువరకు గల కాలము; మధ్యయుగము క్రీస్తుశకము పదునొకండవ శతాబ్దమునుండి పదునేడవ శతాబ్దము వరకు గల కాలము; ఆధునికయుగము ఆ తరువాతినుండి నేటి యిరువదవ శతాబ్దమువరకు గల కాలము. ఈ చారిత్రక యుగ విభాగములు మూడింటిలో మధ్యయుగము మరల పూర్వ మధ్యయుగ మని, ఉత్తర మధ్యయుగ మని రెండుగా విభజింపబడినది. పదునొకండవ శతాబ్దము మొదలుకొని పదునాల్గవ శతాబ్దమువరకు గల కాలము పూర్వ మధ్యయుగము. ఈ యుగము క్రీ. శ. పదునాల్గవ శతాబ్దములో కాకతీయ త్రైలింగ్య సామాజ్య పతనముతో అంతమగుచున్నది. అప్పటినుండి ఉత్తర మధ్యయుగము ప్రారంభమయి క్రీస్తు శకము పదునేడవ శతాబ్దముతో అంత మొందును. ఈ యుగములు ఆయా శతాబ్దములు ఆరంభమగు కాలమునుండి అంతమగు కాలములో ఎప్పుడో ఒకప్పుడు ఆరంభమై అంతమొందునని గ్రహింపదగును.

దేశ చరిత్రలో యుగ విభాగ కాలనిర్ణయము విషయమున ఇప్పటికిని చరిత్రకారులలో అభిప్రాయ భేదములు కలవు. హిందూదేశ చరిత్రలో యుగనిర్ణయ విషయమున ఇంకను చర్చలు సాగుచునే యున్నవి. కొందరి అభిప్రాయ ప్రకారము పూర్వయుగము క్రీస్తుశకము ఏడవ శతాబ్దములో అంతమొందును. అట్లే పదునేడవ శతాబ్దముతో మధ్యయుగము అంతమగు చున్నది. ఇక అప్పటినుండి ఆధునికయుగము. మరికొందరు వే రొక తీరున నిర్ణయింతురు. ఇట్లు ఈ యుగ నిర్ణయము బహువిధముగ నున్నది. కావున మనదేశ చరిత్రలోని ప్రసిద్ధ చారిత్రక సంఘటలను పురస్కరించుకొని తెలుగుదేశ చరిత్రమునందు పైని పేర్కొనబడిన విధము ననుసరించి యుగ విభాగము చేయబడినది.

మల్లంపల్లి సోమశేఖర శర్మ
లెక్చరర్‌ ఇన్‌ ఎపిగ్రఫీ అండ్‌ న్యుమిస్‌మాటిక్స్‌
ఆంధ్ర యూనివర్సిటీ, స్టాఫ్‌ క్వార్టర్సు, వాల్తేరు

తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.

AndhraBharati AMdhra bhArati - charitra - telugu dEsha charitra - AdhAramulu - telugu dEsha charitra yuga vibhAgamu ( telugu andhra )