దేశి సాహిత్యము జానపద గేయములు ఆలిచిప్పలు - ఆణిముత్యాలు

ఆలిచిప్పలు - ఆణిముత్యాలు (జానపద గేయాలు) 1972
సంపాదకులు:
రాళ్లపల్లి సుందరం, బి.ఎస్‌.సి.,ఎం.ఎ., మునిసిపల్‌ కాలేజి, చింతామణి, కోలారు జిల్లా.
ఘట్టమరాజు అశ్వత్థనారాయణ, ఎం.ఎ., విశ్వేశ్వరపుర కాలేజి, బెంగుళూరు.
డా. తంగిరాల వెంకటసుబ్బారావు, ఎం.ఎ., పి.హెచ్‌.డి., బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు.
జానపద సమితి, బెంగుళూరు


1. కపిలి పదాలు

బాయి గంగా బల్లారి గంగా, బారమంతా మోపినాము
బాయిలోని సిరిబాలగంగా, బాలలెద్దులు నీ బారమమ్మా

ఏడుమట్ల యీబాయికాడ, ఎద్దుల యీబాదసూడు
బక్కయెద్దులు బారుకపిలి, బద్రమమ్మా బాయిగంగా

బాయిబాయి కపిలిదోలి, బాలలాకు బలము కుంగె
తోలుబాణ తొణుకులాకు, తొలగవమ్మా బాయిగంగా

బాయిబాయి గంగమ్మా, నీవేమేమి కోరేవమ్మా
తెల్లసీర నల్లరయికె, పొసుపుకుంకుమ పొగదోలు

బాయిబాయి గంగమ్మకి, ఒక్కపొద్దు ఒడిబాలు
మనబాయి గంగమ్మకి, పట్టుదట్టి పోగునూలు

నిన్నిడిచి పోతాము తల్లి, నిద్రపోయమ్మ నీల్లారిగంగ
నీదగ్గరున్నంతసేపు, నిందులు గట్టొద్దు మాకు

తోటతోట బొమ్మన్నకీ, ఆవునెయ్యీ అరటిపండు
మనబాయి బొమ్మన్నకీ, మల్లెపూల మెడదండ

పొద్దున్నే లెయ్యవలెరా, రాముణ్ణీ తెలియవలెరా
ఆ రాముణ్ణీ తెలిసీతె, వచ్చిన గండాలు వారాయెరా

కపిలిపేరు కామరదము, బిల్లపేరు బీమరదము
బాయిగడ్ల బాలుడుండు, బాగానే కాపాడు తండ్రీ

ఎఱ్ఱగుఱ్ఱము ఎండికళ్ళెము, ఎళ్ళిరారా ఏడుకొండలకు
కొడితికాపులొచ్చినారని, కోరుకోరా వరమూలు

ఊరీకి తూరుపులో, ఉయ్యాల మఱ్ఱిమాను
ఊసేకి మనుసైతే, ఊపుర సిన్నోడా

కాలువలో కూకోని, కాలడ్డ మేసికోనీ
నా కాపురము సెడిపితివేమే, కాపోల్లపిల్లా

ఆకుతోట మేరలోన, సన్నగుండ్ల సరమెపాయె
మేరంటి నీవు రారా, మేనత్త కొడుకా

మొగునీకి మందుపెట్టె, మేనమామను కూడికోని
మేనమామ తీరిపాయె, మరిది నీటాయె

నీతట్టు సూసుకోని, ముంచితిరా నీళ్ళకడవ
పాచిజుట్టు ఎదురాయె, పానమెల్లిపాయె

మల్లిపువ్వు ముడుసుకోని, మొగునెంటా పోయేపిల్లా
మల్లిపువ్వు మగ్గిపాయె, మొగమన్నా సూపే

మానుమాను పువ్వుగాచె, మానికింద రాసిపోసె
ఇప్పిమాను పువ్వుగాసె, ఇప్పుడిరిగె నా మనుసు

ఊరకుండ్రా ఉత్తోడా, మావూరు మంచిదికాదు
కులమోళ్ళు కనుక్కొంటె, కులము సెడిపేరు

అయ్యయ్యో బగవంతా, పోతుందిరో మొగునెంటా
అదిపొయ్యే దావలోనా, వానన్నా రాదూ

బెంగుళూరు బాటలోన, బండితోలే మామకొడుకా
బండితోలే నీ మొకము, బెండాయెనేరా

బాయిలోన నీళ్ళులేవు, బడెద్దులెక్కిరావు
బోయెపిల్లా నీళ్ళకొచ్చె, బాన మునుగదేమి సేతు

వస్తానంటే వస్తాననవే, లేకుంటె లేదనవే
ఈరెండుమాట్లు నాకు, తెలుపే నిద్రపోయేనూ

ఎదురింటి ఎర్రపిల్లా, ఎవరిమీదే నీ మనసు
సక్కంగా రాళ్ళపల్లి, సాకలి సిన్నని మీద

సెలకోలువార తగిలి, సేతిగాజులు పగిలిపాయె
కానకుండా తొడిగించుమామా, కదిరినీలాలు

సింతమాను పట్టుకోనీ, సింతల్యాల సేసేవు
సింతలన్నీ వొడిగట్టుకోని, పదవే మొగునెంటా

ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావుకాదు
తగిలినోడు మొగుడుకాదు, తగురు బంగరుకాదు

కాకులెంటా కమ్మలంపు, గువ్వలెంటా గురుతులంపు
కొడిగేపల్లి గోరెంకలెంటా, ఆడుకొన్నా మాటలంపే

దారంటా పొయేవాడా, దోసకాయ మొకమోడా
తిరిగన్న సూడరా, తిత్తి కడుపోడా

ఇచ్చేది మూడుదుడ్లు, తీసేది మడికలుపు
సలువసీరా బురదాయె, సాలప్పా నీకూలి

అంచనంచన అంగిడిల్లు, అందుకొయే కొబిరిగిన్నె
అంగిడిల్లు మనదికాదు, అప్పులు సెయ్యొద్దు మామా

ఏటిగడ్డ వడికిలోన, గడ్డిబీకే గిడ్డదాన
ఎద్దులన్నీ ఏరుదాటె, ఎత్తుకోయే గడ్డిమోపు

ఉంగరాలు వదులాయె, ఉండూరు పగాయె
పక్కపాట్లు మోపాయె, పదరా పోదాము

ఒగలూ పడొద్దేపిల్లా, నీ కడవా పగులదన్నేరు
ఒగలూ వంకలపాలు, దిగులూ దిన్నెలపాలు

బాయిలోన ఇల్లుగట్టి, బాళాకు దడిగట్టి
బాళుకుందాము రాయే, బాయోళ్ళపిల్లా

నాతట్టూ సూసుకుంటూ, నీగితివేమే నిండుకడవ
కాలిరిగె సెయ్యిరిగె, మను సిరుగాలేదు

నాగలమడక్కి పోయి, నాగుమల్లె తీగె తెత్తు
నాటుకోయె తోటలోన, ముడుసుకోయే కొప్పులోన

అత్తమ్మ నీకొడుకు, సుక్కల్లొ సెందురుడు
నాగుపాము నడుమోడు, నన్నడిగినాడే

దినదినమూ రావద్దే, దిన్నె ఎక్కి సూడొద్దే
నాకి నీకి రుణము తీరె, బాయిసుట్టి బ్రమ తెలుసుకో

పోతుంది పట్టుకోరా, అడ్డమన్న కట్టుకోరా
అదిపొయ్యే దావలోనా, కొంపన్నా కట్టుకోరా

కూటిగంప నెత్తిమీద, కుంచెళ్ళు సేతిలోన
కులుకుతా పోతుందిరా, కూలిబోయోళ్ళ పిల్ల

దావెంట పోయేదానా, దారాల రయికెదానా
నీ దారాల రయికెలోకి దూరింది నా మనుసు

కావిలి బలుమాయె, కల్లబద్దురమాయె
కాసిండి పలమేమి, లేసిపోయె సిలక

ఇంటిముంద్ర ఈతవనము, ఎట్లు వత్తునే ఈడిగసాని
కల్లమీద కొంగు పరుస్తా, నేతగుబ్బలు అందుకోరా

వాడినాకు వొట్టిసున్నుము, వానికేల వొట్టిబెమలు
వారయ్యే కాలములోన, వాదింపు లేల

సుట్టుముట్ల తెల్లజొన్న, ఏడుమట్ల మంచిగేసె
ఎన్నుమింద గువ్వవాలె, రొమ్ముమింద సెయ్యితీరా

ఆకాశాన గాలిదోలె, ఆకాదోట కొమ్మలిరిగె
నేలిమోపి గాలిదోలె, పాయంపిల్ల గుబ్బులదిరె

గాజులు గల్లనకుండ, గందము పేడెల్లకుండ
అత్తమామలు కానకుండ, వచ్చి ముద్దులాడిపోరా

ఇప్పుడుంటివి ఇంటిలోన, కొప్పులోన పూలెక్కడివి
పూలుతోట వారనొస్తి, కొమ్మవాలి కొప్పునిండె

ఆడదాని సక్కదనము, పైటకొంగు పక్కనుండు
అరటికాయ సక్కదనము, ఆకుసాటున అణిగియుండు

ఇసనకఱ్ఱ ఎఱ్ఱుపాప, ఈదిలోన యాలయేడ్చేవే
ఇంటిమొగుడు కొట్టెనమ్మ, ఇంకనేను బతకలేను

బట్టబయలి రా నా బట్ట, పట్టవద్దు నాదు రొమ్ము
పసిబిడ్డ తల్లి నేను, పట్టితే పాలుగారు

దానిమొగుడు ధర్మరాజు, దాన్కి రెండు ఎనుములుండె
దానిబోయిన ముండా కొడ్కు, నెయ్యిపాలు చెయ్యి కడిగె

కొండార్న కొఱ్ఱసేను, కొయ్య పోవే రెడ్డిసాని
ఎడమ సంటికి ఎండ తగిలె, ఎత్తిపట్టు ఎండిగొడుగు

ఎద్దునమ్మి ఏమి దీరె, ఎనుమునమ్మి ఏమిదీరె
గుల్లితోకా పందినమ్మితె, గుత్తులు సత్తూలు దీరె

ఆలినిడిసీ పిల్లనిడిసీ, కట్టుకొన్న భార్యనిడిసీ
దొంబదాన్ని గూడుకొని, డోలుకొట్టే రాతరాసె

బుడబుడ నడకలాయెలేరా, బూట్ల సప్పుడు ఎక్కువాయె
దొంతికుండ్లు ఉత్తువాయె, దావబట్టే పయనమాయె.

(మాదిగ తిమ్మప్ప, సిత్తణ్ణ, కాపు తిమ్మప్ప
నరసింగరాయ రొప్పం, మడకశిరా తాలూకా

మల్లయ్య కొడ్కు కావలెప్ప
మైనగానిపల్లి, మడకశిరా తాలూకా

బసప్ప
బీచిగానిపల్లి, మడకశిరా తాలూకా

అనుమన్నగారి కిట్టన్న, చెన్నరాయుడు
రామసాగరము, కల్యాణదుర్గం తాలూకా

ముద్దలాపురం హనుమంతప్ప
జీడిపల్లి, కల్యాణదుర్గం తాలూకా

(సేకరణ: వెంకటరమణా రెడ్డి - బండ్రేవారిపల్లె, కదిరి తాలూకా, అనంతపురం జిల్లా)


2. గంగమ్మ - గౌరమ్మ పాట

గంగమ్మ గౌరమ్మ ఏసిరి మలిసెట్టు		జిలకరమల్యాలు
గంగమ్మ గౌరమ్మ పోసిరి సెంబెడునీళ్లు	జిలకరమల్యాలు
సెంబెడు నీళ్లకు సిగురాయె మలిసెట్టు	జిలకరమల్యాలు
గంగమ్మ గౌరమ్మ పోసిరి కుండెడునీళ్లు	జిలకరమల్యాలు
కుండెడు నీళ్లకు కుదురాయె మలిసెట్టు	జిలకరమల్యాలు
గంగమ్మ గౌరమ్మ పోసిరి గుడివెడు నీళ్లు	జిలకరమల్యాలు
గుడివెడు నీళ్లలు గుబురాయె మలిసెట్టు	జిలకరమల్యాలు
మొగ్గలకు మళ్లుపారి ఆయెసక్కనిసెట్టు	జిలకరమల్యాలు
వానగాలి లేచి రాలె మల్యాలు	జిలకరమల్యాలు
రామన్న లక్షుమన్న బండ్లు కట్టినారు	జిలకరమల్యాలు
గంగమ్మ గౌరమ్మ ఏరేరి పోసీరి రాసులు	జిలకరమల్యాలు
ఆబడి పాయెనమ్మ కల్లు రొప్పం దంకా	జిలకరమల్యాలు
కల్లురొప్పం అంజనయ్య పూలప్ప పూలు	జిలకరమల్యాలు
పూలకి యెలయేమి సెప్పర నాయన్న	జిలకరమల్యాలు
ఆకుకు అరబై, తొడిమకి తొంబై, మొగ్గకు ముప్పై	జిలకరమల్యాలు
కొమ్మకు కోటి కొనవే కల్లురొప్పం అంజనయ్య	జిలకరమల్యాలు
ఆబండి పాయెనమ్మ మనగేపల్లి దంకా	జిలకరమల్యాలు
మనగేపల్లి రామస్వామి పూలప్ప పూలు	జిలకరమల్యాలు
పూలకి యెలయేమి సెప్పర నాయన్న	జిలకరమల్యాలు
ఆకుకు అరబై, తొడిమకి తొంబై మొగ్గకు ముప్పై	జిలకరమల్యాలు
కొమ్మకు కోటి కొనవే మనగేపల్లి రామస్వామి	జిలకరమల్యాలు
ఆబండి పాయెనమ్మ పావగండ దంకా	జిలకరమల్యాలు
పావగండా శనిమాత్మా పూలప్ప పూలు	జిలకరమల్యాలు
పూలకి యెలయేమి సెప్పర నాయన్న	జిలకరమల్యాలు
ఆకుకు అరబై, తొడిమకి తొంబై, మొగ్గకు ముప్పై	జిలకరమల్యాలు
కొమ్మకు కోటి కొనవే పావగండా శనిమాత్మా	జిలకరమల్యాలు
ఆబండి పాయెనమ్మ జిల్లరగుంట దంకా	జిలకరమల్యాలు
జిల్లరగుంట అనుమంతరాయా పూలప్ప పూలు	జిలకరమల్యాలు
పూలకి యెలయేమి సెప్పర నాయన్న	జిలకరమల్యాలు
ఆకుకు అరబై, తొడిమకి తొంబై, మొగ్గకు ముప్పై	జిలకరమల్యాలు
కొమ్మకు కోటి కొనవే జిల్లరగుంట అనంతరాయా	జిలకరమల్యాలు
ఆబండి పాయెనమ్మ బొగుతురుపల్లి దంకా	జిలకరమల్యాలు
బొగుతురుపల్లి నరసింసామి పూలప్ప పూలు	జిలకరమల్యాలు
పూలకి యెలయేమి సెప్పర నాయన్న	జిలకరమల్యాలు
ఆకుకు అరబై, తొడిమకి తొంబై, మొగ్గకు ముప్పై	జిలకరమల్యాలు
కొమ్మకు కోటి కొనవే బొగుతురుపల్లి నరసింసామి	జిలకరమల్యాలు
ఆబండి పాయెనమ్మ లేపాక్షి దంకా	జిలకరమల్యాలు
లేపాక్షి దుగ్గెమ్మ పూలమ్మపూలు	జిలకరమల్యాలు
పూలకి యెలయేమి సెప్పర నాయన్న	జిలకరమల్యాలు
ఆకుకు అరబై, తొడిమకి తొంబై, మొగ్గకు ముప్పై	జిలకరమల్యాలు
కొమ్మకు కోటి కొనవే లేపాక్షి దుగ్గెమ్మ	జిలకరమల్యాలు

(సేకరణ: రాళ్ళపల్లి - మడకశిరా తాలూకా, అనంతపురం జిల్లా)


3. ఆరెడ్లు బాబులైరి రామచిలకా

తానె తందన్నా రామచిలకా
తందన తానందనా రామచిలక

రామసుబ్బు రామసుబ్బు రామచిలకా
నాయనోరి నాగమ్మ రామచిలకా
అంతైరి ఇంతైరి రామచిలకా
ఆరెడ్లు బాబులైరి రామచిలకా
మూగిసైగల తోన రామచిలకా
మూన్నెళ్ళు చదివిరి రామచిలకా
కన్నుసైగల తోన రామచిలకా
ఆర్నెల్లు చదివిరి రామచిలకా
తానె తందన్నా ..

(సేకరణ: తాయమ్మ - రామాపురం, చింతామణి తాలూకా, కోలారు జిల్లా)


4. గ్రహణం పాట

రామా దశరథ రామా

ఊరికి ఉత్తరాన ఊడగల మఱ్ఱీ	॥రామా॥
ఊడగల మఱ్ఱికింద మొలిచెనే మొలకా
మొలిచిన మొలకా బంగారు మొలకా
ఆయెనే ఆ మాను బంగారు మాను
కాసెనే ఆ మాను బంగారు పండు
కండ్లు లేని బాల కనుకుండె పండ్లు
కాళ్ళులేని బాల యెక్కెనే మాను
చేతుల్లేని బాల కోసెనే పండ్లు
ఏళ్ళు లేని బాల ఏరెనే పండ్లు
అడుగులేని గంప కేసెనే పండ్లు
శిరసు లేని బాల యెత్తెనే పండ్లు
దిగువ తిరుపతిలోన పండ్లమ్మ పండ్లు
గోవిందరాజు బయలెల్లినాడే
పండ్లలో యెలయేమి యెలచెప్పు బాలా
పువ్వులో పుట్టెడు పిందె లేదుమురా
కొనలేము ఆ పండ్లు మాకొద్దు పండ్లు
ఎగువ తిరుపతిలోన పండ్లయ్య పండ్లు
వెంకటేసుడు బయలెల్లినాడే
పండ్లలో యెలయేమి వెలసెప్పు బాల
పువ్వులో పుట్టెడు పిందె లేదుమురా
కొనలేము ఆ పండ్లు మాకొద్దు పండ్లు
ఊరికీ ఉత్తరాన వూడగల మఱ్ఱి
వూడగల మఱ్ఱి కింద కోమళ్ళ పుట్ట
కోమళ్ళ పుట్టకాడ పండ్లయ్య పండ్లు
పుట్టలోని నాగేంద్రుడు బయలెల్లినాడూ
పుట్టలోని పండ్ల పిందె లేదుమురా
కొందరూ చూడంగ కొంతారగించ
అందరూ చూడంగ అంతారగించ
పసిబాలులందరూ విడవోయి పండ్లు
నిండుమనుషులూ విడవోయి పండ్లు
కొందరూ చూడంగ కొంతెళ్ళ గ్రక్క
అందరూ చూడంగ అంతెళ్ళ గ్రక్క

(సేకరణ: చంచమ్మ - మేడికుర్తి, పాయల్పాడు తాలూకా, చిత్తూరు)


5. దంపుళ్ల పాట

సందకాడ కాసె సంద యెన్నెల
సంద యెన్నెలలోన పచ్చాటి సెట్టు	॥సువ్వీ॥

వచ్చాటిసెట్టు కింద కుంకప్ప రోలు
కుంకప్పరోటి కింద ముత్యాలవాయి	॥సువ్వీ॥

ముత్యాలవాయికి శాగ రాకెండ్లు
శాగ రాకెండ్ల కింద సెలియ లిద్దరు	॥సువ్వీ॥

సెలియలిద్దరు పాడి కూడి దొంచంగ
పాడినా పాట్లకు బాలుడే లేసె	॥సువ్వీ॥

ఎండి గిన్నెకు ఎన్నార బోసీ
పగడాల గిన్నెకు పాలార బోసీ	॥సువ్వీ॥

కప్ప సిప్పతో కడపార బోసీ
ఊరెచ్చ నీళ్లుపై జిడ్డు కడిగి	॥సువ్వీ॥

అంతట్లో బాలేపి పండ్లమ్మవచ్చే
అమ్మారె వోయెమ్మ నాకు పండ్లు	॥సువ్వీ॥

మనకెక్కడ పండ్లప్ప మనము బీదవారు	॥సువ్వీ॥

మూలనే ఉన్నాయి ముత్యాలరాసులు
నట్టింట్లో ఉన్నాయి రత్నాలరాసులు
పంచనే ఉన్నాయి పగడాలరాసులు	॥సువ్వీ॥

ముంచెనే బాలుడు మూడు దోసిండ్లు
ముంచి బాలేపికేసె	॥సువ్వీ॥

ఆబాలేపి ఎంచి ఏడు పండ్లు
పండ్లు బాలునికి చేతి కందించె
ఉంగరాల సందునా ఒకపండురాలె	॥సువ్వీ॥

రాలిన్నిపండు గంపలోకిపడె
గంపలో పండ్లు గజనిమ్మలాయె
ఎదురు గంపపోయి ఎండిగంపాయె	॥సువ్వీ॥

గంపకింద చుట్ట మానిక్యమాయె
కట్టుకున్న సీర పట్టుసీరాయె	॥సువ్వీ॥

అమ్మారె వోయమ్మ ఇటువంటి బాలుని
యెట్లు కంటివమ్మ	॥సువ్వీ॥

(సేకరణ: పాపమ్మ - అంకంపల్లి, కల్యాణదుర్గం తాలూకా, అనంతపురం జిల్లా)


6. అత్తా కోడళ్ల సంవాదము

సిన్నమ్మ బొయ్యమ్మ వారు అక్కాసెల్లెళ్లు
తందన్నతాన తానే తందనానా
ముందరనే బొయ్యే బొయ్యమ్మ
ముందర్నే నీళ్ళు నించె	॥తందన్న॥

ఎనక బొయ్యే సిన్నమ్మ
ఎనకల్నే నీళ్లు నించె	॥తందన్న॥

ముందర్నే బోయ్యే బొయ్యమ్మ
ముందర్నే వచ్చె	॥తందన్న॥

ఎనకల్నే బొయ్యే సిన్నమ్మ
ఎనకల్నే వచ్చె	॥తందన్న॥

బొయ్యమ్మ సేతిలో ఓమంటికడవ
బొయ్యమ్మ కాల్తగిలి కడవపగిలె	॥తందన్న॥

కడవ తెచ్చిన దంకా
నాకడపా దాటొద్దే నాకడపా దాటొద్దే	॥తందన్న॥

నాపుట్టింటోళ్లిచ్చింది
ఓ బంగరుబిందిగె
అదైనా తీస్కొని ఊరకుండే ఓ అత్తా	॥తందన్న॥

నీపుట్టింటోళ్లిచ్చింది నాపెంటకు సమానం	॥తందన్న॥

పెద్దాలు ఇచ్చింది ఓవజ్రాలకడవ
అదైనా తీస్కొని ఊరకుండే ఓ అత్తా	॥తందన్న॥

నీపెద్దలు ఇచ్చింది నాపెంటకు సమానం	॥తందన్న॥

పుట్టింటోళ్లిచ్చింది ఓ గొఱ్ఱెలమందా
అదైనా తీస్కొని ఊరకుండే ఓ అత్తా	॥తందన్న॥

నీ పుట్టింటోళ్లిచ్చింది నాపెంటకు సమానం	॥తందన్న॥

నా పుట్టింటోళ్లిచ్చింది ఓ ఆవులమంద
అదైనా తీస్కొని ఊరకుండే ఓ అత్తా	॥తందన్న॥

నీ పుట్టింటోళ్లిచ్చింది నాపెంటకు సమానం	॥తందన్న॥

(సేకరణ: మరియక్క, తాడెక్క, బాతెక్క - సింగరాయ రొప్పం, మడకశిరా తాలూకా, అనంతపురం జిల్లా)


7. మేదరి కూతురు

మేదారి కూతూరు మేలంపు రాలురా
కూసోని అల్లెరా కూరాకు జిబ్బిరా
పండుకో నల్లెరా పట్టు మంచామురా
చందమామా - సై

నిలబడుకో నల్లెరా నీలంపు దాగిరి
వంగోని అల్లెరా వడ్ల జల్లిడిరా
పండుకో నల్లెరా పట్టు మంచామురా
చందమామ - సై

(సేకరణ: తాయమ్మ - రామాపురం, చింతామణి తాలూకా, కోలారు జిల్లా)


8. బండమీద వెయ్యరా

బండమీద వెయ్యరా దబాదుబా

బట్టలు చినిగినా కోమిటోడు అరిసినా
మనకేమిరా భయమో
కొట్టరా బండమీద వెయ్యరా బండమీద దబాదుబా

మనకు కావల్సిందేమిరా
బట్టలు తెల్లగ కావాలిరా
ఎయ్యర బండమీద దబాదుబా
ఎత్తెయ్యర దబాదుబా

బట్టలు బల్లమీద వేసి
ఇత్తడిపెట్టి ఎత్తుకొని
సరాబరా తోమురా నాన్న
సరాబరా తోమురా నాన్న

(సేకరణ: మునుస్వామి - చింతామణి, కోలారు జిల్లా)


9. గణనాథుడు

గణనాథ విగ్గుణ గణనాథ
గెజ్జమూర్తి మోవలింగ గణనాథ
తొడ్లమూతో నీరుతెచ్చి గణనాథ
తోరంపు బొజ్జాలు కడిగి గణనాథ	॥గ॥

అయ్యవార్లు నిన్నేగొల్వ గణనాథ
వాళ్ళ పంచాంగమున వుందువయ్య గణనాథ	॥గ॥

కొమిడి వాళ్ళు నిన్నే గొల్వ గణనాథ
వాళ్ళ తక్కిడందే వుందువయ్య గణనాథ	॥గ॥

కాపువారే నిన్ను గొల్వ గణనాథ
వాళ్ళ కాడి మేడి నుందువయ్య గణనాథ	॥గ॥

మాలవాళ్ళె నిన్నే గొల్వ గణనాథ
వాళ్ళ మగ్గమూన వుందువయ్య గణనాథ	॥గ॥

మాదిగవాళ్ళే నిన్నే గొల్వ గణనాథ
వాళ్ళ ఆరె సూరె నుందువయ్య గణనాథ	॥గ॥

కురవవాళ్ళే నిన్నే గొల్వ గణనాథ
వాళ్ళ తుర్రె మర్రె నుందువయ్య గణనాథ	॥గ॥

వడ్డెవాళ్ళె నిన్నే గొల్వ గణనాథ
వాళ్ళ గడ్డపార నుందువయ్య గణనాథ	॥గ॥

గాండ్లవాళ్ళే నిన్నే గొల్వ గణనాథ
వాళ్ళ గానుగందు నుందువయ్య గణనాథ	॥గ॥

(సేకరణ: గంగన్న - కొమ్మేపల్లి, వాయల్పాడు తాలూకా, చిత్తూరు జిల్లా)


10. అలమేలు మంగమ్మ పాట

మంగమ్మ మంగమ్మ అలమేలు మంగా అలమేలు మంగా
మంగమ్మ గట్టేటి సీర పేరేమి, సీర పేరేమి
సీరంతా బంగారు, కొంగే జలతారు కొంగే జలతారు	॥మంగమ్మ ॥

మంగమ్మ తొడిగేటి రయికె పేరేమి, రయికె పేరేమి
రైకంతా బంగారు, అంచు జలతారు, అంచు జలతారు	॥మంగమ్మ ॥

మంగమ్మ పెట్టేటి సొమ్ము పేరేమి, సొమ్ము పేరేమి
కాసెత్తు బంగారు, కాలందెనాలు కాలందెనాలు
దుడ్డెత్తు బంగారు, రుద్రబయ్యేండ్లు రుద్రబయ్యేండ్లు	॥మంగమ్మ ॥

(సేకరణ: నరసింగరాయరొప్పం, మడకశిరా తాలూకా, అనంతపురం జిల్లా)


11. పాపమ్మ పత్తి పాట

పత్తి ఇరువా వస్తరేమమ్మ
పాపమ్మచేనికి
పత్తి ఇరువా వస్తరేమమ్మ

నాలుగూ మూలాలచేను
నయ్యమైన పత్తిచేను
గుంపు గుంపులు బేకులేదు
అయిదు మంది అంతెచాలు
పత్తిమూటలు బరూవైతే
దించుకో నా చోటుఉంది

తెల్ల జీరేవాండ్లకల్లా
తేటుగా పగిలిందీ పత్తి
ఎర్రజీరేవాండ్లకల్లా
ఏకముగ పగిలింది పత్తి
పసరు జీరేవాండ్లకల్లా
పాకముగ పగిలింది పత్తి

ఊదచీరేవాండ్లకల్లా
ఊదుగా పగిలింది పత్తి
నల్లజీరేవాండ్లకల్లా
నయముగా పగిలింది పత్తి

నీలిచీరేవాండ్లకల్లా
నీటుగా పగిలింది పత్తి

దోసెడంతా ప్రమిదజేసీ
ఏలెడంతా ఒత్తిజేసీ
చారెడంతా సమురుపోసీ
ఏడుమేడల యొక్కపైనా
ఎలుగుజేసేనన్నదీ
ఎలుగుజూసీ ఎగసీవస్తే
ఏకరూపామన్నదీ

వద్దజేరితె భద్రామయ్యెవు
నిద్రకూ రామ్మన్నదీ
నిద్రలోపల నీడజూసుక
ఏకరూపామన్నదీ

అయ్యవేసిన తోటకు
ఆపయ్య ఏసినతోటకూ
తోటకూ పూదోటకూ
ఈజనూలెల్లా

అమ్మగట్టిన పద్దెమూ
పాపమ్మగట్టిన పద్దెమూ
ఈదినా చదివీనా ఒకటే
భాజినా చదివీనా ఒకటే
బట్టబయట చదివినా ఒకటే
పత్తి ఇరువావస్తరేమమ్మా
పాపమ్మచేనికి
పత్తి ఇరువా వస్తరేమమ్మ

(సేకరణ: పిచ్చుకుంట్ల చిననాగన్న - చెలిమెళ్ల రుద్రవరం, ఆత్మకూరు తాలూకా, కర్నూలు జిల్లా)


12. రద్దు చేయుము జన్మము

వదలాను మీ పాదము - సద్గురుదేవా
రద్దు చేయుము జన్మము

ముందు జన్మములందు చేసిన కర్మచే బద్ధుండనైతిని
గర్భనరకమునందు వచ్చిన గబ్బుదేహము రద్దుచేయుము

ఏరూపు చూచినను సద్గురుబ్రహ్మ
మీ రూపుగా చూపుము
ఆడది మగవాడు గానక ఏడచూసిన సందులేకను
రూప నామ క్రియలు లేని
దాపు చేరే దారిచూపుము

వద్దు వద్దు జన్మము సద్గురుదేవా
హద్దు లేని కర్మమూ
బుద్ధి నిలుకడలేని తనువిది
వద్దనున్న వికారగుణములు
రద్దు చేసియు బుద్ధినిచ్చే
భద్రముగ చిన్ముద్ర చూపుము

సిద్ధయాఖ్యుని బ్రోవుము - సద్గురుదేవా
శ్రద్ధతో దయచూడుము
హద్దు పద్దు లేని బుద్ధి లేని నరులా సుద్దులూ
బుద్ధి నిలకడ లేని నరులను
వదల మనెను చెంబుదాసు

(సేకరణ: రమణ - మేడికుర్తి, వాయల్పాడు తాలూకా, చిత్తూరు జిల్లా)


13. ఎంతా వగలమారిరా

ఎంతా వగలమారిరా! ఈచిన్నది
ఏమీ సైగలు నేర్చెరా
ఇంటి మగనికి ఈతచాప
పరాయి మగనికి పట్టెమంచం
నడమ తిరిగే ఓబుళమ్మకి గోలుకొండ కీలు మంచము
ఇంటి మగనికి రాగిముద్ద
పరాయి మగనికి బిరియానీ
నడమ తిరిగే ఓబుళమ్మకి
సన్న బీము కోడిపెట్టా
ఇంటి మగనికి చెంపదెబ్బ
పరాయి మగనికి చెప్పుదెబ్బ
నడమ తిరిగే ఓబుళమ్మకి
పడెరా పాపాసిదెబ్బ

(సేకరణ: కె.గోపాలకృష్ణ - కల్యాణదుర్గం, అనమ్తపురంజిల్లా)


14. కంటికి పిరిమైనది

బౌవారి చిన్నది బంగారుకంటే వన్నెది
కంటికి పిరిమైన దన్న కరణగల్లా చిన్నది లాయిరే

ఆకు ఇస్తానన్నది అది వక్క ఇస్తానన్నది
కూత తిరగని కోడుపుంజును
కూరకిస్తా నన్నదె చిన్నది

బీము ఇస్తానన్నది అది బేడలిస్తా నన్నది
వండుకోను చేతకాకంటె
వండి పెడతా నన్నదే చిన్నది

బౌవారి చిన్నది బంగారుకంటే వన్నెది
కంటికి పిరిమైన దన్న కరణగల్లా చిన్నది

(సేకరణ: కృష్ణయ్య - మేడికుర్తి, వాయల్పాడు తాలూకా, చిత్తూరు జిల్లా)


15. ఒయ్యారి చిన్నది

ఓ వడ్డోళ్ళ పాప చూడు మన్ను మోసేది చూడు
ఓయి చిన్నదీ ఒయ్యారి చిన్నది
కుండనలుపుది కుమ్మరోళ్ళ చిన్నది

ఓ కాపోళ్ళ పాపచూడు పిడకలు తట్టేది చూడు
ఓయి చిన్నదీ ఒయ్యారి చిన్నది
కుండనలుపుది కుమ్మరోళ్ళ చిన్నది

ఓ కోమిటోళ్ళ పాపచూడు తక్కెడ తూచేది చూడు
ఓయి చిన్నదీ ఒయ్యారి చిన్నది
కుండనలుపుది కుమ్మరోళ్ళ చిన్నది

ఓ మాదిగోళ్ళ పాపచూడు కట్లు మోసేది చూడు
ఓయి చిన్నదీ ఒయ్యారి చిన్నది
కుండనలుపుది కుమ్మరోళ్ళ చిన్నది

ఓ చాకలోళ్ళ పాపచూడు సలవా చేసేది చూడు
ఓయి చిన్నదీ ఒయ్యారి చిన్నది
కుండనలుపుది కుమ్మరోళ్ళ చిన్నది

ఓ బాపనోళ్ళ పాపచూడు బట్లు ఉతికేది చూడు
ఓయి చిన్నదీ ఒయ్యారి చిన్నది
కుండనలుపుది కుమ్మరోళ్ళ చిన్నది

(సేకరణ: తాయమ్మ - రామాపురం, చింతామణి తాలూకా, కోలారు జిల్లా)


16. ఏల పదము

ఏలాలెత్తీ నే బాడంగా
ఏడా ఇన్నవు కోడెకాడా
నిలవరాతీ నీడ కిండా
నీయమ్మ కొడకా
నిలిచి రెండు జాములాయేనూ

ఆడదానీ అడగరాదు
అడిగీ భంగపోరాదు
తియ్యవాలెరా తీగకోనాకు
నీయమ్మకొడకా
పెట్టవాలెరా చేరీమందులో

నీకూ నీవా రెవరూ లేరు
నాకు నావా రెవరూ లేరు
ఏటిగట్టున ఇల్లు కడదామా?
నీయమ్మ కొడకా
ఏరువస్తే కూడ బోదామా?

సిద్దాటం సీరగట్టి
బిల్లామెట్టూ బిగువు రయికా
కాలి కనుమా దిగేతప్పుడు
నీయమ్మ కొడకా
కండ్లనీళ్లు రొండ్ల కొచ్చేరా

(సేకరణ: నాదిండ్ల ఉసేనమ్మ - బొజ్జాయిపల్లె, పులివెందుల తాలూకా, కడపజిల్లా)


17. నెల్లూరు బోగముసాని పాట

నేను చిన్నదానిరా - నెల్లూరు బోగము సానిరా
అదిక చక్కని దానిరా - పాగొండ పాళెము దానిరా
ఎద్దుచూసి కాపువాడు - సొప్పుకట్ట సప్పిడాయె
చెప్పకుండా పారిపోయె

నీలిచీర కట్టుకోని - నీరజొన్న కయ్యబోయే
కూలి మీద రాయిపడా - రెడ్డిమీద కన్నుబారె

సుక్కబొట్టు పెట్టుకోని - సున్న మడుగ నేను బోతే
రెడ్డి సూసే సూపులాకు - సుక్కబొట్టు సున్నమాయె

అడ్డబొట్టు పెట్టుకోని - అద్ద మడగ నేను బోతే
వాడు సూసే సూపులాకు - అడ్డబొట్టు అద్దమాయె

(సేకరణ: కె.గోపాలకృష్ణ - కల్యాణదుర్గం, అనంతపురంజిల్లా)


18. సీత పాట

సీతా మాటాడవే!
సిరసెత్తి సూడావే!

	సింగార వనమూలో
	నువు పారా జూడు!

కలియా మాటాడవే
కన్నెత్తి సూడావే

	కమసాలి వాడాలో
	సొమ్మూ లిప్పింతూ!

ఒదినా ఒదినననబోకూ
ఒరిసేరు పరిచేవ
వరుసములో పుట్టిందీ
వరసందూ గాదా!

	సీతా మాటాడవే!
	సిరసెత్తి సూడావే!
	సింగారా వనమూలో
	నువు పారా జూడూ!

రారా ముద్దులగుమ్మా!
రాపైనా చెలికాడా!
మా వూరీ కనుమాకు
రేపే పయనమురా!

	పూలో పుటికెడుదేరా!
	రవలూ సందెడుదేరా!
	నువ్వొస్తా రణభేరీ
	సోకించి రారా!

నీ సిన్ని నడుముకూ
బిళలా ఒడ్డేణాము
సందూ బొందూన దిరిగే
సకియా ఎక్కడికే!

(సేకరణ: పిచ్చుకుంట్ల చిననాగన్న - చెలిమెళ్ల రుద్రవరం, ఆత్మకూరు తాలూకా, కర్నూలు జిల్లా)


19. శెన్నంగిరామ - జాలారి పిల్ల పాట

బాయిగడ్డ సేను సేయరే శెన్నంగిరామ
బాయినీళ్లకు నేను వచ్చేను

బాయిగడ్డ సేను చేస్తే జాలారిపిల్లా
సేను గుత్త మింద పడితేను

సేనుగుత్త మింద పడితే శెన్నంగిరామ
సెవుల కమ్మ లమ్మి కట్టేను

సెవుల కమ్మ లమ్మి గట్టితే జాలారిపిల్లా
మీవాళ్ళు నిన్ను తిట్టేరు

మావాళ్లు నన్ను తిట్టితే శెన్నంగిరామ
బాయిలో పాడెనని సెప్పేను

బాయిలో పడెనని సెప్పితే జాలారిపిల్లా
బాయి పూణం తెల్ల బోసేరు

బాయి పూణం తెల్లబోసితే శెన్నంగిరామ
కప్ప మింగిందని సెప్పేను

కప్ప మింగిందని సెప్పితే జాలారిపిల్లా
కప్ప కడుపుకోసి సూసేరు

కప్ప కడుపుకోసి సూసితే శెన్నంగిరామ
కరిగి పొయ్యిందని సెప్పేను

(సేకరణ: ఎర్రగుడి, కల్యాణదుర్గం తాలూకా, అనంతపురం జిల్లా)


20. కారు తుమ్మెదా నల్లోడా!

పొద్దుపోతుం దొదినె పోతున్న వొదినె		కారు తుమ్మెదా నల్లోడా
ఎనడురానీ మరిది ఇయ్యాలవచ్చె
ఒస్తె ఒచ్చేగాని ఏమి తెచ్చిండు
రూమాలు కొంగూన రూపాయి తెచ్చె
పీట ఏద్దామంటె పిల్ల పండింది
సాప ఏద్దామంటె సవతి పండింది
మంచమేద్దామంటె మల్లి పండింది
పొద్దుపోతుం దొదినె పోతున్న దొదినె

పాలసన్నలు ఇచ్చి సన్నలూ తెచ్చే
ఏడుసిల్లుల లొట్ట ఎసరైతె పెట్టె
పచ్చితంగెడి కట్టె పొయినిండ నూకె
మేనత్త కొడుకునూ పొయ్యూద బెట్టె
పొద్దుపోదుం దొదినె పోతున్న ఒదినే

ఉడుకైతె పట్టింది ఉండోయి మరిదీ
పొంగైతె పట్టింది పోకోయి మరిదీ
ఇస్తారి కుట్టంటె ఇల్లెలుపు కుట్టె
పొద్దుపోతుం దొదినె పోతున్న ఒదినె

డొల్లకుట్టామంటె దొడ్డెలుపు కుట్టె
ఏడ్చుకుంటా ఏడు మెతుకులే ఏసె
అంత తినకూ మరిది పిల్లకింత ఉంచు
పొద్దుపోతుం దొదినె పోతున్న ఒదినె

నువుబోయె తోవలో గిన్నెలంగాడి
అందు లొక్క గిన్నే నాకంపు మరిదీ
నువు బోయె తోవలో సీరలంగాడీ
అందు లొక్క సీరా నాకంపు మరిదీ
నువు బోయె తోవలో సగరాల అంగడి
అందు లొక్క సగరా నాకంపు మరిదీ
నువుబోయె తోవలొ రైకలంగాడి
అందు లొక్క రైకా నాకంపు మరిదీ
నువుబోయె తోవలో రిబ్బనంగాడీ
అందు లొక్క రిబ్బనూ నాకంపు మరిదీ

(సేకరణ: పిట్టల లక్ష్మీ నరసయ్య - పాతర్లపాడు, నల్లగొండజిల్లా)


21. తేలు కుట్టిందే పిన్ని

తేలు కుట్టిందే పిన్ని తేలు కుట్టిందే
నిన్న తేలుకుట్టిందే - నాకు తేలు కుట్టిందే
మిట్టా మద్యాన్న మపుడు - మొగునితో కొట్లాడి
నట్టింట్లో కూర్చొని - రెట్ట మతము పట్టింటే		తేలు

చుట్టము వచ్చేనని - సంకటెట్లా యని
నట్టెతుక నేనుబోతే - చట్టికిందా నా సవితి చూపెట్టుకొనుండె	తేలు

నడిమేలు క్కుట్టింది - నందనాని కెక్కింది
నందన మెల్లానేమో - నసానసా మంటుంది

తేలేమో కుట్టింది - శైత్యము ముంచుకొంది
ముత్తుమ్ము ఉలవపిండి - తప్ప తడిసిపోయింది

మా మామ ధర్మరాజు - కన్నీళ్లు పెట్టినాడు
కాకి సోకము సేసినాడు

మాయత్త పాపిరాలు - దాని మీద బండెయ్య
ముత్తుం మన్నెయ్య - అరకచెత్త కప్పిపెట్టి
అగ్గిపుల్ల గీసెయ్య

నా మరిది మంచోడు - డాకటేరును తోలుకొచ్చి
దండిసూదు లేయించె

నా మొగుడు ఎర్రోడు - పిల్లలను పెట్టుకొని
గొఱ్ఱెలక్క ఏడ్చినాడు

ఏడు కొండలవాడా - ఓ వెంకటరమణా - కడుపునిండా
పిల్లలున్నారు - కాపాడ రావయ్య - నేనెల్లి పోతాను

(సేకరణ: రంగాపురం, డోన్‌ తాలూకా, కర్నూలు జిల్లా)


22. వియ్యపురాలు

వెండి పుల్ల వెండి ఆకు విడిదికి పంపితిమి

పార పళ్ల వియ్యపురాలు పళ్లే తోముదుగా
సన్నజాజులు మల్లెమొగ్గలు విడిదికి పంపితిమి

బట్టతల వియ్యపురాలు పూలే ముడవదుగా
బనారసు చీర నక్కీ రవిక విడిదికి పంపితిమి

అబ్బబ్బ ఇవి అన్నీ మాకు అలవాటు లేదనిరీ
హారతి కర్పూరపుదండలు విడిదికి పంపితిమి

కొంగ మెడ వియ్యపురాలు దండే వెయ్యదుగా
తమలపాకులు వక్కలు మేము విడిదికి పంపితిమి

కుక్కపళ్ల వియ్యపురాలు ఆకే వెయ్యదుగా
వివరా మెరుగని వియ్యపురాలికి విడుదులు చూపితిమి

వివరా మెరుగని వియ్యపురాలు విడిదిలో ఉండదుగా

(సేకరణ: సుశీలమ్మ - నెల్లూరు)


23. లిల్లేలు పాట

తా, లిల్లలో, లిల్లాయి లిల్లలో
ఓరామ లిల్లలో, లిల్లాయిలో

మాదిగోడు మాదిగోడు
మాదిగో డంటారు
మాదిగోడి పెళ్లాము తీర్థామాడున్నాది

మాదిగోడి పెళ్లాము తీర్థామాడిందంటె
ఏమేమి పత్తాము పెట్టాలబ్బా

ఎర్రొడ్ల బియ్యాము - ఎనుబోతు సియ్యాలు
తప్పితే తంగేడు గూటామురా

ఇశ్వబ్రెమ్మము వచ్చి ఈదిలో కూకోని
సిత్తీ గావాలనీ సిగిలిచ్చెగా

కోపాగాడు మా జాంబవంతుడు
కొడుకునూ సంపించి గోటాసిత్తీ తీసి

గుండెలే బొగ్గులు కాయించెగా - అబ్బ
కాళ్ళే సమ్మెట్లు గాయించెగా

కాళ్లే సమ్మెట్లు గాయించెగా - అబ్బ
సేతులే పటకార్లు గాయించెగా

సేతులే పటకార్లు గాయించెగా - అబ్బ
సిరుసే డాకలి కాయించెగా

సిరుసే డాకలి గాయించెగా- అబ్బ
కసురే వరిపొట్టు కాయించెగా

కసురే వరిపొట్టు గాయించెగా - అబ్బ
మెదుడే ఎలిగారం కాయించెగా

నా కత్తి జేసినా నా పెద్దా కొలిమిమీద
ఏడుపుట్ల ఉక్కైన రాలిందిగా
రాలీన ఉక్కంత రాసులు గట్టించి
రాచూరి కోటాకు తోలించెగా

వోరోరి మాదిగా - వొయ్యారి మాదిగా
రెడ్డీ రమ్మంటాడురా - మాదిగా
రెడ్డీ రమ్మంటాడురా
రెడ్డేకాదు రెడ్డబ్బ డొచ్చిన గాని

కల్లు కడవా రానియ్యదూ - నన్ను
కల్లు కడవా పోనియ్యదూ

ఓరోరి మాదిగా - వొయ్యారి మాదిగా
కాపూ రమ్మనాడురా - మాదిగా
కాపూ రమ్మన్నాడురా
కాపూల మాటాలు కళ్లములో దెలిసేను
కల్లు కడవా నన్ను రానియ్యదు

గూడూరు దావాన గుల్లెద్దు సచ్చింది
గుండెలకు నాకత్తి మిండాడయా

మారుట్లా కనుమాన మద్దీమానీ కింద
ఎద్దూను పులిజంపి కూకుందిరా
పులినీ అదిలించి ఎద్దూను తేకుంటె
ముద్దూల నాపేరు మాదీగేనా

పాలూరు దావాన పసెద్దు సచ్చింది
పక్కాలో నాకత్తి మెరిసిందయా

(సేకరణ: దుంపా శ్రీరాములురెడ్డి - బొజ్జాయిపల్లె, పులివెందుల తాలూకా, కడప జిల్లా)


24. ధర్మాపురం నరసింహుని పాట

ఏ తల్లీ - కన్నదిరో
ఏ అంసా - కన్నదిరో
ఏ అంసా - కన్నదిరో
దర్మాపురాము నరసింహ్వ!

నీయన్నా ఎరితోడు
నీతమ్మూడు చిన్నోడు
నువ్వేలే రాజ్యంబు
పరరాజూల పాలయెరో

నంద్యాలా కచ్చిరులు
పన్నిండూ కచ్చిరులు
ఏకాచ్చీట్లుండవురో
దర్మాపురాము నరసింహ్వ

ఏదర్బాజీ నొస్తవురో
దర్మాపురాము నరసింహ్వ

నువ్వెక్కే గురహాలు
నీళ్లామీది తేజంబు
పరరాజూల పాలయెరో
దర్మాపురాము నరసింహ్వ

ఏ తల్లీ - కన్నదిరో
ఏ అంసా - కన్నదిరో
ఏ అంసా - కన్నదిరో
దర్మాపురాము నరసింహ్వ!

వేలాదికొద్దీ రొక్కంబూ
రైలూమీన బోతుంది
వొయిలూమీన దిప్పయ్యో
దర్మాపురాము నరసింహ్వ!

బొగులోనిపల్లీ బోయోళ్లు
సౌదరిపల్లి కాపోళ్లు
నీ నేస్తాకాళ్లయ్యో
దర్మాపురాము నరసింహ్వ!

నీదోస్తీకాళ్లయ్యో
దర్మాపురాము నరసింహ్వ!

పాలామారి కచ్చిరులు
పన్నిండూ కచ్చిరులు
ఏదర్బాజీ నొస్తవురో
దర్మాపురాము నరసింహ్వ!

నీ పెల్లాం నీలమ్మా
నీ లంజా రొక్కమ్మ
బహుదుక్కా పోతారో
దర్మాపురాము నరసింహ్వ!

బహుగోడాడు తున్నారురో
దర్మాపురాము నరసింహ్వ!

ఇప్పావీదూలాలు
కొట్టే బడాలుపెట్టయ్యో
దర్మాపురాము నరసింహ్వ!

(సేకరణ: పిచ్చుకుంట్ల చిననాగన్న - చెలిమెళ్ల రుద్రవరం, ఆత్మకూరు తాలూకా, కర్నూలు జిల్లా)


25. పోయమ్మా నా కూతురా

ఆరెకరాల్‌ చేసిస్తా - అంటిమామిడి తోపిస్తా
పోయమ్మా నా కూతురా - పోయింటికి కీర్తితేవమ్మా
ఆరెకరాల్‌ చేనిస్తా - ఆవులప్పను నీజతకిస్తా
పోయమ్మా నాకూతురా - పోయూరికి కీర్తితేవమ్మా
పోనమ్మా నేను పోనమ్మా - పోతే తిరుగుట లేదమ్మా
ఆరుమంది అన్నగార్లూ - కడగొట్టోడే గంగులప్ప
వానికి నాకు కాదమ్మా - పోనమ్మ నేను పోనమ్మా
ఏడుమందే అక్కసెల్లెళ్లు - కడగొట్టుదీ కమలమ్మ
దానికి నాకు కాదమ్మా - పోనమ్మా నేను పోనమ్మా
నాగర బిళ్ల సేపిస్తా - నాగులప్పను నీజతకిస్తా
పోయమ్మ నాకూతురా - పోనమ్మా నేను పోనమ్మా.

(సేకరణ: తాయమ్మ - రామాపురం, చింతామణి తాలూకా, కోలారు జిల్లా)


26. మేడికుర్తి కోలాటం

ఉయ్యాలో జంపాలో ఊరిపేరేమిరా
రామరామ కోదండరామా
ఉయ్యాలో జంపాలో ఊరూ మేడికుర్తి
రామరామ కోదండరామా
రచ్చాన ఉండే ఆరెడ్డీ పేరేమి
రచ్చాన ఉండేటి రెడ్డి రాఘవరెడ్డి
ఆ రెడ్డీ భార్యపేరు చిలకాపేరేమి
ఆ రెడ్డీ భార్యపేరు సారస్వతమ్మరా
కూర్చీన ముత్యాలు కూతురు పేరేమి
కూర్చీఅ ముత్యాలు కూతురు కాంతమ్మ
బాజిగాము కట్టె బాపన పేరేమిరా
బాజిగాము కట్టేటి బాపన శివరామశాస్త్రి
కుండాలు పట్టేటి కుమ్మరి పేరేమిరా
కుండాలు పట్టేటి కుమ్మరి పకీరప్ప

(సేకరణ: ప్రకాష్‌ - మేడికుర్తి, వాయల్పాడు తాలూకా, చిత్తూరు జిల్లా)


27. నలుగూకు రావె సీతమ్మ

కమ్మాలు కడియాలు కస్తూరి బావిరీలి
నలుగూకు రావె సీతమ్మ

నీపాలిటి దేవుడు ఏనుగోపాలసామి
నీ కంటెచ్చయినోడె నిలచి ఉండాడు

అత్తారు పన్నీరు సిత్తారి గిన్నెలలో
ఏగ ఏగను రావె చెలియ సీతమ్మ

గుండూ పళ్లెములోన గురుతాయె హా నలుగు
బురుడు గుంట గంగమ్మ అంపింది నలుగు

పోడిమి పీటాలు చెందంపు గొడుగులు
అర్దుగ మీ మామ ముద్దుగ తెచ్చినాడు

మల్లెలు మల్లెలు మంచి చేమంతులు
అమరైన రసగుండ్లె అద్దాలు పడకిండ్లు

(సేకరణ: తాయమ్మ - రామాపురం, చింతామణి తాలూకా, కోలారు జిల్లా)


28. గొల్లోళ్ల పాట

ఓరోరి గొల్లోడ! ఓరి గొల్లోడ!
కొండా గోప్రా లెక్కి గొర్లా మేపకురా!

కొండా గోప్రాలెక్కి గొర్లామెపకురా
పారేటి సంద్రాన నీల్లూ తాపకురా

పారేటి సంద్రాన నీల్లూ తాపకురా
అంబాలి దెచ్చేదీ ఎవరాడ మనిసీ

అంబాలి దెచ్చేదీ ఎవరాడ మనిసీ
మాయమ్మ కోడాలె మా యాడ మనిసీ

మాయమ్మ కోడాలె మా యాడ మనిసీ
సిక్కూ జీకటిలోనా నే నొక్కదానీ

సిక్కూ జీకటిలోనా నే నొక్కదానీ
ఓశివుడ నా కివరా సిన్నీ బాలూనీ

బాలూనీ నీకిస్తే పాలూ ఎక్కడియే
పరమేశూ డంపించు పాలా కాయిళ్లు

వానా వానంటారు ఏదమ్మా వానా
కురిసెనమ్మా సింగలమూల కుంబవర్షముతో

పారెనమ్మ బండమీదిపల్లె పణితీ కాలువలూ
నిండెనమ్మా శీపురమూ నీలాల సెరువూ

నిండెనమ్మా శీపురమూ నీలాల సెరువూ
పండెనమ్మ సెక్కరంపేట పచ్చజొన్నల్లు

పచ్చజొన్నలు దంచి పాలెసరూ పెట్టీ
పాయానా నే జూతూ మా ఊరీ తోవా

మాఊరీ దోవన్నా మూడూ నిమ్మల్లు
మూడూ నిమ్మలకింద ముగ్గూరన్నల్లు

ముగ్గూరన్నల నేను ఏమంట బిలుతు
సిన్నన్న నువురార సిరి ఎంకాటేశ

నడిపన్న నువురార నందీ బసవయ్య
పెద్దన్న నువురార పెద ఓబులేశ

సిన్నన్న నాకొక్క సీరె నేయించె
నడిపన్న నాకొక్క డాబు సేయించె

పెద్దన్న నాకొక్క పెయ్య దోలించె
సిన్నన్న! నీసీర సిరిగుడ్డ లాయె!

నడిపన్న! నీడాబు నా కందమాయె!
పెద్దన్న! నీపెయ్య దొడ్డీమందాయె!

దొడ్డి మందాయె దొర లావులాయె!
మందా పశువులాయె మట్టావులాయె!!

(సేకరణ: నాదిండ్ల ఉసేనమ్మ - బొజ్జాయపల్లె, పులివెందుల తాలూకా, కడప జిల్లా)


29. ఉడతా ఉడతా ఉర్రి

ఉడతా ఉడతా ఉర్రి
ఉండే కమ్మల్లో జెఱ్ఱి

యాటికి పోతా వోయ్‌
సంతకి పోతా నోయ్‌

యేమి తెస్తా వోయ్‌
పప్పులు బెల్లాలు

వోలికి పెడతావు
ముండకి పెడతాను

ఏమేమి తెస్తావు
మిఠాయి బెల్లాలు

ఎవరికి పెడతావు
లంజకి పెడతాను

ఏడ పణుకొంటావు
పొయ్యిగడ్డలో పణుకొంతాను

మీసాలంత కాలి పాయె.

(సేకరణ: నారణప్ప - చింతామణి, కోలారు జిల్లా)


30. చిట్టెలక

పొద్దు పొద్దు లేచింది చిట్టెలక
మగము కాలు కడిగింది చిట్టెలక

గాదిలోకి దిగింది చిట్టెలక
వడ్ల గింజ కొరికింది చిట్టెలక

పాలు అన్నం చేసింది చిట్టెలక
మిండ మొగినికి పెట్టింది చిట్టెలక

ఇంకొక మొగుని కళ్లలో చిట్టెలక
కారాల పొడి చెల్లేసె చిట్టెలక

(సేకరణ: నారణప్ప - చింతామణి, కోలారు జిల్లా)


31. కాసిచ్చి కొనుక్కొంటి - కాటీకి బరిణి

కాసిచ్చి కొనుక్కొంటి - కాటీకి బరిణి
రూకిచ్చి కొనుక్కొంటి - కుంకూమ బరిణి
మీ అక్కకు ఇచ్చిరారా - సిన్నీ నరసయ్యా

అక్కయ్య నేనెరుగ - అక్కా గురుతెరుగ
జాలిమాను నాయిల్లు - జారేటి బండ
జారేటిబండ నాయిల్లు - శామంతి వనము

తుమ్మమాను నాయిల్లు - తూగుటుయ్యాల
మఱ్ఱిమాను నాయిల్లు - మల్యాల వనము
సందులో నాయిల్లు - సన్నజాజుల వనము

వంగిరారా నాయన్న - సుంగే తగిలేను
వంగీనా పాదాలకీ - వంగి మొక్కేను

మొక్కినా సేతులకి - హస్త కడియాలు
నీ బంగారి పాదాలకి - వంగి మొక్కేను

మొక్కొద్దు అక్కయ్య - మనకేనే వోగు
నీ మొక్కినా సేతులకి - హస్త కడియాలు

నీ వంగీనా నడుముకి - బంగారు డాబు
ఇంతిచ్చినా తమ్మునికి - మనమేమి ఇయ్యాల

మలిపువ్వు వస్త్రాలు - సెవ్వే పోగూలు
సేతికి గడియార్ము - పేటా రూమాలు

(సేకరణ: మైనగానిపల్లి, మడకశిరా తాలూకా, అనంతపురం జిల్లా)


32. ఈడిగ గౌడు పాట

అహారె గౌడా! ఈడిగ గౌడా!
కల్లులో ఏమన్న కలిపినావయ్యో!		కల్లులో

పుట్టార ఒకచెట్టు వనము కాకారమూ
ఆతట్టు తెగనరికె ఈతట్టు తెగనరికి
మొగము చక్కగజేసి మొదటి ఆకులువేసి
కట్టార లొట్టీ కారార కల్లూ			హారె! గౌడా!

లొట్టొల్ల కల్లెల్ల కడవలకు పోసి
కడవలో కల్లెల్ల తిత్తులకు పోసి
గాడిదా పేరే గాలిమేఘమురా
గుర్రాము పేరే జక్కి దేవరరా
పోతు పేరేమో కొమ్ముటేనుగురా
చొక్కుతా సోలుతా వచ్చేర కల్లూ
వచ్చీ రుద్రావరము చేరేర కల్లూ		హారె! గౌడా!

తిత్తుల్ల కల్లెల్ల కడవలకు బట్టి
కడవాల కల్లెల్ల బానలకు బోసి
బానపక్కల గౌడు కూర్చుండె గౌడు
సన్నాల సైగాలు చేసేర గౌడు
సంచిలో పైకాము రాదీసె గౌడు
చెవుల కమ్మలు పాయె చేటాయె కల్లు
ముక్కు ముక్కర పాయె మోటాయె కల్లు
కాళ్ల కడియాలు పాయె ఘనమాయ కల్లు		హారె! గౌడా!

గాట ఎద్దూలెల్ల కల్లు పాలాయె
గూటి యావూలెల్ల కల్లు పాలాయె
ఏలేటి భూములూ కల్లు పాలాయె
కాసేటి గొర్లెల్ల కల్లు పాలాయె
పాతర్ల గింజలూ కల్లు పాలాయె
గాదెర్ల గింజలూ కల్లు పాలాయె
గుమ్ముల్ల గింజలూ కల్లు పాలాయె
కుండల్లో గింజలూ కల్లు పాలాయె
అన్ని పోయినగాని అదే మంచికల్లు		హారె! గౌడా!

అత్త సంతకుపోయె అతిభోగమాయె
మామ మందకుబోయె మాకు మేలాయె		హారె! గౌడా!

చేతికద్దాతోడు చెల్లెళ్లతోడు
ముష్టి కోలాతోడు మాయమ్మతోడు
ఈతబసివీతోడు ఇల్లాలితోడు
ఊలిపారాతోడు ఉలిగమ్మతోడు			హారె! గౌడా!

మూతి మీనెంగీలి ఉమ్మిచ్చె కల్లు
గుడ్డబట్టాలూడ దన్నించె కల్లు
పట్టరానీ కాళ్లు పట్టించె కల్లు
పాత చెప్పులతోటి కొట్టిచ్చె కల్లు
అన్ని దన్నినగాని అదే మంచి కల్లు		హారె! గౌడా!

కట్టమీనంగీ పేరన్న చెప్పు
వరిమళ్లంగీ పేరన్న చెప్పు
చెరువులో టంగీ పేరన్న చెప్పు
చెరువులో టంగీ ముల్లంగి కాదా
వరిమళ్లంగీ కోనంగి కాదా

కట్టమీనంగీ పేరంగి కాదా
నెత్తిమిందా రాయి తురాయి కాదా
మెడలోదీ రాయి లింగకాయి కాదా
కడవలోదీ రాయి సారాయి కాదా
అనుకున్నమాటా అనుకూలమాయె
ఆదిసముద్రం ఎంకటా! చెప్పుకున్నా మాట
చెప్పుకుంటెవి కాని భోగసముద్రం ఎంకటా!

(సేకరణ: పిచ్చుకుంట్ల చిననాగన్న - చెలిమెళ్ల రుద్రవరం, ఆత్మకూరు తాలూకా, కర్నూలు జిల్లా)

AndhraBharati AMdhra bhArati - AndhraBharati AMdhra bhArati - Alichippalu - ANimutyAlu (jAnapada gEyAlu) - dEshi dESi sAhityamu ( telugu andhra )