దేశి సాహిత్యము జానపద గేయములు తెలుగు పల్లెపాటలు

తెలుగు పల్లె పాటలు
సంకలనం: ప్రయాగ నరసింహశాస్త్రి
సంపాదకురాలు: యన్‌. వి. ఎల్‌. కనకదుర్గ
ప్రథమ ముద్రణ: అక్టోబరు-1990
గౌరిశంకర్‌ ప్రచురణలు, విజయవాడ.


1. కర్షక గేయాలు
1.1. మాపల్లె పాలించు వానదేముడా

మాపల్లె పాలించు వానదేముడా
మమ్మెల్ల రక్షించు వానదేముడా

మాకెల్ల వర్షమిచ్చి వానదేముడా
మాకెల్ల పంటలిచ్చి వానదేముడా
మాకెల్ల నీరినిచ్చి వానదేముడా
మా దప్పికలు దీర్చి వానదేముడా	॥మా॥

మాపల్లె పాలించి వానదేముడా
మమ్మేలుకోవయ్య వానదేముడా
ఉత్తరాన ఉరుమురిమె వానదేముడా
దక్షిణాన జల్లుకురిసె వానదేముడా	॥మా॥

ఏదిక్కు నున్నావో వానదేముడా
మాదిక్కు రావోయి వానదేముడా
మాకెల్ల వర్షమిచ్చి వానదేముడా
మాచెరువు నిండించి వానదేముడా
మాకెల్ల పంటలిచ్చి వానదేముడా
మామొరలు వింటివయ్య వానదేముడా	॥మా॥

[ఈ పాట పల్లెలలో హరిజనస్త్రీలు గుంపులుగా చేరి కప్పను తలమీద పెట్టుకొని ఊరేగిస్తూ పాడుకొంటారు. వర్షము లేని రోజులలో ఈ పాటలు పాడితే వానలు కురుస్తాయని పల్లెటూళ్ళల్లో నమ్మకం.]


1. కర్షక గేయాలు
1.2. ఏరువాకపాట

ఏరువా కొచ్చింది ఏరువాకమ్మ
ఏళ్ళు నదులు పొంగి వెంబడొచ్చాయి॥

నల్ల మేఘాలలో నాట్యమాడింది
కొండ గుట్టల మీద కులుకు లాడింది
ఇసక నదిలో దూరి బుసలు కొట్టింది
పాడుతూ కోయిలా పరుగు లెట్టింది	॥ఏ॥

ఆడుతూ నెమలి అలిసిపోయింది
నవ్వుతూ మా అయ్య బువ్వ తిన్నాడు
ఆకాశమున మబ్బులవతరించాయి
ఉఱు మొక్క టావేళ ఉఱిమిపోయింది	॥ఏ॥

కాపు పిల్లల మనసు కదిలిపోయింది
అటకమీద గంప అందుకోవయ్య
విత్తనాలు దీసి విరజిమ్మవయ్య
మృగశిరా కార్తిలో ముంచెత్తు వాన	॥ఏ॥

కలపరా అబ్బాయి కొత్త దూడల్ని
కట్టరా అబ్బాయి కొత్త నాగళ్ళు
దున్నరా ఓఅయ్య దుక్కుల్లు మీరు
ఒకగింజ కోటియై వర్ధిల్లు మీకు
ఏరువాక సాగి ముసురు కోవాలి
కొత్త పంటలు మనకు కోరుకోవాలి	॥ఏ॥

[ఏరువాక పండుగకు ఆషాఢ శుద్ధ పూర్ణిమనాడు పాడుకొను పాట - పంటల పండుగకు చిహ్నం.]


1. కర్షక గేయాలు
1.3. ఓ మన్నిదాయిలాల (నాట్లు పాట)

ఓ తానిననీ తానినని తానిననీ నా
తానిననీ తానిననీ తానిననీ నా॥

ఓ మన్ని దాయిలాల గొబ్బియాలాలో
ఓ మన్ని దాయిలాల గొబ్బియాలాలో
కుంట పూ వాసనకు రాయుడు రాంగా
కుసుమ పూ వాసనకు కుంట దారల్లె	॥ఓ॥

కుంట ముంగిటకు రాయుడు రాంగ
మల్లె పూ వాసనకు మారుదా రెల్లె	॥ఓ॥

చెరువు ముంగిటికి రాయుడు రాంగ
సెనగ పూ వాసనకు చెఱువుదా రెల్లె	॥ఓ॥

దాయి ముంగటికి రాయుడు రాంగ
బంతి పూ వాసనకు బాయి దా రెల్లె
ఓ మన్ని దాయిలాల గొబ్బియాలాలో	॥ఓ॥

[ఊడుపులలో వరినాట్లు వేసేటప్పుడు స్త్రీలు బారులు తీర్చి ఎక్కువగా తెలంగాణా ప్రాంతములో పాడుకొందురు.]


1. కర్షక గేయాలు
1.4. పొలిపాట

ఒలియా ఒలియో ఒలియా
రావేలు గలవాడ రార పొలిగాడ॥

తూర్పునా ఒక వాన తుమ్మెదలమోత
పడమట ఒక వాన పట్టి కురవంగ
ఈ వాన ఆ వాన ఏకజడివాన
ఏవిలీ చేనుకు ఎద వానలాయె	॥ఒలి॥

వెండి తూములకింద వెల్లడము పండు
పైడి తూములకింద పాలంకి పండు
రావేలు పోవేలు రాసి పదివేలు
రావేలు మీదయ్య రాసి మాదయ్యా	॥ఒలి॥

పోయెనే పొలిగాడు పొన్నూరు దాటి
వచ్చెనే పొలిగాడు వదగాని బాట	॥ఒలి॥

వా యెక్కి పొలిగాడు వాల లాడంగ
రాసెక్కి పొలిగాడు రంప టిల్లంగ
పొలిగాడు కొట్టంగ పోగాయె రాసి
ఎద్దులూ తొక్కంగ ఎదిగెనె రాసి	॥ఒలి॥

పొలోపొలి చాల పొలి
తిరుప తెంకన్నిచ్చిన పొలి
వినుకొండెంకమ్మిచ్చిన పొలి
బెజవాడ కనకదుర్గమ్మిచ్చిన పొలి.	॥ఒలి॥

[కోతలు కోయునప్పుడు పంటలక్ష్మికి పూజచేసి “పొలి” వేసేటప్పుడు పాడేపాట.]


2. వృత్తి పాటలు
2.1. నూలు వడికే విధము తెలియండి

    (తారకము నూటెరుగ వలె)మాదిరి

నూలు వడికే విధము తెలియండి
జనులార మీరు
విధము గనుగొని మోదమందండి
నూలు వడికే విధము తెలియక
సాలు కరువది కోట్ల రూపా
యీలు వ్యర్థముగాగ పరదే
శాల పాలను చేయబోవక	॥నూ॥

రాట్నమే మనమూట యనుకోండీ
జనులార మీరు
పాటపాడుచు నూలు వడకండి
రాట్నమే మనమూట యనుకొని
పాటపాడుచు నూలు వడకిన
కాటకము లెన్నింటినైనా
దాటగల మనుమాట నమ్ముచు	॥నూ॥

మిల్లు గుడ్డల మాట మరువండీ
జనులార మీరు
తెల్లతనమునకు మోస పోకండి
మిల్లుగుడ్డల మాట మరువక
తెల్లతనమునకు తెల్ల బోయిన
కల్ల కాదిది మనకు యొక నొక
చిల్లి గవ్వయినను మిగులదు	॥నూ॥

[నూలు తీసేటప్పుడు రాట్నంతో గొంతుకలిపి పాడుతారు.]


2. వృత్తి పాటలు
2.2. సర్వాయి పాపన్న

ధీరుడు వస్తాదు పాపన్నా పాపన్నా॥
రాయిడు సర్వాయి పాపన్నా
పాపడొక్క పేరు చెబితే
ఊరపిచ్చుక ఊరుచేరదు
పొట్టిపిచ్చుక పొలం చేరదురా	॥పాప॥

పుట్టినాది పులగాము
పెరిగినాది తాడికొండ
కులమందు గమళ్ళవాడు
పేరు సరదారి పాపన్నా	॥పాప॥

తల్లికి దండాముపెట్టి అమ్మరో సర్వమ్మతల్లి
నన్ను గన్నతల్లి రావే నాకు తగ్గ పనులుచెప్పవే	॥పాప॥

వినరా సర్దారిపాప కలవిద్యలు యెన్నిచేర్చిన
కులవిద్యకు సాటిరావు ఇంకా కొన్నాళ్ళు కొడుక
ఇంటి యావులు మేపమంటాది సర్వమ్మ తల్లి
ఈతచెట్టే గీయమంటాది	॥పాప॥

ఈదులు గొడితే యీడిగవాడు
కల్లు గొడితే గమళ్ళవాడు
మొనగాడి చట్టమొచ్చునా సర్వమ్మ తల్లీ
పాళెగాడి చట్టమొచ్చునా	॥పాప॥

ఊరు గొడితే యేమి ఫలము
పల్లెగొడితే యేమి ఫలము
పడితే బందరే పడతానే సర్వమ్మ తల్లి
కొడితే గోల్కొండ కొడతానే	॥పాప॥

తిన్నగా తిరుచూర్ణ మద్ది
పాలు అన్నం భోంచేసి
పసిడిబెత్తం చేతబట్టాడోయ్‌ పాపన్నా
అవత లివతల వెండికట్లు
నడుమ బంగారు కట్లు
డాలుబల్లెము చేతబట్టాడోయి పాపన్నా
మండీబజారు కొచ్చి సోపుదారి కేకలేశాడోయ్‌	॥పాప॥

[గోలకొండ కోటకొట్టి ఒకరోజు ‘గోలకొండ’ రాచరికం చేసిన సర్వయి పాపన్న వీరగాధ.]


2. వృత్తి పాటలు
2.3. దూదేకుల సిద్ధయ్యగారి తత్వం

ఏకులమని నను వివరమడిగితే
యేమని దెల్పుదు లోకులకూ
లోకులకూ పలుగాకులకూ
దుర్మార్గులకూ యీ దుష్టులకూ
ఫాలభాగమున ఏలలు బాడుచు
భావము కన్నది నా కులము	॥ఏ॥

ఇంటి లోపలను యిల్లు గట్టుకొని
మంటలోపల రాట్నం పెట్టుకు
కంటిలోపల కదురు బెట్టుకు
ముక్కులోపల యేకు బెట్టుకొని
చెవులో బారా చేతికి దీసుకు
నారాయణ యను నరము తీసుకొని
అష్టాక్షరి యను తడిక వేసుకొని
పంచాక్షరి యను పంచ దీసుకొని
తధిమి దధిమి గుబదెబ గుబదెబ
ఏకిన కులమె మా కులము	॥ఏ॥

ఏకిన ఏకులు పీకిన పిందెలు
లోకమంత నొక పాపము చేసుకు
ఏకిన కులమె మా కులమూ	॥ఏ॥

రొమ్మున లక్ష్మీ చీరగట్టుకొని
చక్కగా సిరిపావడ దొడిగి
ఆనందమైన వీరబ్రహ్మ
శాల్వ కపుకొని నిండియున్నదే
నా కులము ఒంటరిగాదె నా కులము	॥ఏ॥

[ఏకులు వడుకునపుడు దూదేకులవారు దూదిఏకుతూ ఆమ్రోతతో కలిపి పాడేపాట.]


2. వృత్తి పాటలు
2.4. దంపుళ్ళ పాట

అత్తలేని కోడ లుత్తమురాలు ఓలమ్మా
కోడల్లేని యత్త గుణవంతురాలు

కోడలా కోడలా కొడుకుపెళ్ళామా ఓలమ్మా
పచ్చి పాలమీద మీగడేదమ్మా
వేడి పాలల్లోన వెన్నయేదమ్మ ॥ఆహుం॥

అత్తా నీచేత ఆరళ్ళెగానీ ఓలమ్మా
పచ్చిపాలమీగ మీగ డుంటుందా
వేడిపాలల్లోన వెన్న యుంటుందా ॥ఆహుం॥

చిలక తిన్నపండు నేనెట్టా తిందు ఓలమ్మా
చిలకతో మాటొస్తె నే నెట్టా పడుదు॥

మెచ్చి మేనరికంబు యిచ్చేటికంటె ఓలమ్మా
మెడకోసి నూతిలో వేసితే మేలు
లేకుంటె గంగలో కలిపితే మేలు॥

మా తాతపెళ్ళికి నే నెంతదాన్ని ఓలమ్మ
తలదువ్వి బొట్టెడితె తవ్వంతదాన్ని
అన్ని సొమ్ములు పెడితె అడ్డంతదాన్ని॥

నట్టింట కూర్చొని నగల కేడిస్తే ఓలమ్మ
ఊరుకో మనవరాల ఊరేగొస్తా నన్నాడే॥

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓలమ్మ
కొడుకు ఊళ్ళోలేడు మల్లె లెక్కడివీ॥
ముద్దుచేసిన కుక్క మూతి కఱచేను
చనువుచేసిన ఆలి చంకనెక్కేను॥

మొండి కెత్తినదాన్ని మొగుడేమి చేసు ఓలమ్మ
లజ్జ మాలినదాన్ని రాజేమి చేసు
సిగ్గుమాలినదాన్ని శివుడేమి చేసు॥

[వడ్లు దంపునపుడు ఇద్దరు ముగ్గురు స్త్రీలు కలిసి పాడుకొనుపాట.]


3. పండుగ పాటలు
3.1. సీతసమర్త

సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి కీర్తిసాంద్ర సువ్వి
సువ్వి సీతమ్మ మాకు శుభములిమ్మా॥

సృష్టిలో సీతమ్మ సమర్త కొట్నాలు దంచ
వేడ్కతో పేరంటాండ్రు వేగవచ్చిరీ	॥సు॥

పసిడిరోకళ్ళు బట్టి పద్మకుఖులు సువ్విదంచ
కనుల పండుగాయె కౌసల్య కప్పుడు
ఘల్లు ఘల్లుమనుచు హస్త కంకణమ్ము లెల్ల కదల
కొబ్బరీ బెల్లమ్ము కోరిదంచిరీ॥

నువ్వులా పప్పుదంచి నూటికీ పంచిబెట్ట
ఘనముగా పేరంటాండ్రు కలసి దంచిరీ॥

చిమిలి పళ్ళెరముల సమ్మతిగా దోడుకొని
ఇమ్ముగ నుండలు చేసిరి కొమ్మలు॥

కౌసల్యపుడు వచ్చి కాంతలందరిని బిలిచి
బంగరూ తబుకులతో పంచిబెట్టెను॥

[ప్రజలలో ప్రచారములో నున్న పాట.]


3. పండుగ పాటలు
3.2. సంక్రాంతి (జంగం దేవర)

సంకురాత్రిపండుగొచ్చె సిద్ధేశ్వరా
తల్లి పిల్ల చల్లగాను సిద్ధేశ్వరా
సాంబమూర్తి కరుణగల్గి సిద్ధేశ్వరా
కలకాలం వర్ధిల్లు సిద్ధేశ్వరా
కృపతోడ నిచ్చునండి సిద్ధేశ్వరా
ఏడాది కొక్కసారి సిద్ధేశ్వరా
వాడవాడ కొత్తుమండి సిద్ధేశ్వరా
కోటిపల్లి సోమన్న
ద్రాక్షారం భీమన్న
అరసవిల్లి సూరన్న
సింహాచలం అప్పన్న
హువ్వ హక్క హుం - శంఖం
ఏమయా స్వామి శివశివా
కైలాసవాసా
ఏమయా స్వామి సొమ్ము
లేమి లేకపోయె నయ్య
పాములను ధరించు టెవరి
కోసమో శివశివా

వెఱ్ఱివాడవయ్య నీవు వెండికొండ నుండలేక
వల్లకాడులను వసించు
టెవరికోసమో శివా	॥ఏ॥

రాచవాడవయ్యు నీవు రాచపాడి లేకపోయె
గోచిపాతలను ధరించు టెవరికోసమో	॥ఏ॥

[సంక్రాంతి సమయంలో గంటవాయిస్తూ జంగందేవరలు పాడేపాట.]


3. పండుగ పాటలు
3.3. గౌరమ్మ పండుగ

ఎంత చక్కని తల్లివే గౌరమ్మ
ఎంత చల్లని తల్లివే ఓ గౌరమ్మ
ఒక్కొక్క పోకందునా గౌరమ్మ
ఒక్కొక్క ఆకందునా
కస్తూరి చలమందునా గౌరమ్మ
రాచబాటాలందునా	॥ఎంత॥

మము జూచి యా యన్నలూ గౌరమ్మ
ఏడు మేడలెక్కిరీ
ఏడు మేడలమీద గౌరమ్మ
ఏడాది కొక దీపమూ
ఏడు కోటలెక్కిరీ గౌరమ్మ
ఎలుక కోటలెక్కిరీ	॥ఎంత॥

పల్లె కోటాల నెక్కే గౌరమ్మ
పత్తిర్లు దూయంగను
దొంగలేమొ దోచిరీ గౌరమ్మ
బంగారు గుండ్లవనము	॥ఎంత॥

తబుకులో తబికెడు గౌరమ్మ
ముత్యాలు తీసుకొని
ఇమ్మడి కుచ్చులతో గౌరమ్మ
సొమ్ములతో వచ్చిరీ	॥ఎంత॥

సొమ్మూల పెట్టూకొని గౌరమ్మ
ఇమ్ముగనూ వచ్చిరీ
గుమ్మడిపూలన్నీ గౌరమ్మ
గుత్తూల కట్టుకు నొచ్చే	॥ఎంత॥

ఈడనే పెండ్లాడవే గౌరమ్మ
ఈడనే పసుపాడవే
వాడవాడల జనమూ గౌరమ్మ
వాలలాడింతు రమ్మ	॥ఎంత॥

[విశాఖపట్టణములో ప్రచారములోనున్న గౌరమ్మ పండుగకు పాడేపాట.]


3. పండుగ పాటలు
3.4. శ్రీకృష్ణ జన్మాష్టమి

కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగా
శ్రీరంగ రంగ రంగా నినుబాసి యెట్లు నేమరచుందురా॥

కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు
దేవకి గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను॥

ఏడురాత్రులు ఒకటిగా ఏక రాత్రిని జేసెను
ఆదివారం పూటనూ అష్టమి దినమందు జన్మించెను॥

తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చు ననుచు
యెదురుకాళ్ళను బుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు॥

తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి యెత్తుకొనుచు
అడ్డాలపై వేసుకు ఆ బాలు చక్కదనము చూచెను॥

వసుదేవ పుత్రుడమ్మా ఈబిడ్డ వైకుంఠవాసుడమ్మ
నవనీత చోరుడమ్మ ఈబిడ్డ నందగోపాలుడమ్మా॥

[ఇది శ్రీకృష్ణజననము వర్ణించుపాట. లాలిపాటగా పాడుతారు.]


4. శ్రామిక గేయాలు
4.1. ఇది మిసనీ అది మిసనీ

ఇది మిసనీ అదిమిసనీ
గుంటూరూ పెదమిసనీ
ఏ మిసనీకి పోదాంరో
లంబాడోళ్ళ రామదాసా
మనమే మిసనీకి పోదంరో॥

చీరాలా చినకారూ పేరాలా పెదకారు
ఏకారెక్కి పోదాంరో లంబాడోళ్ళ రామదాస॥

నీచాయ నాచాయ కలబందాపూచాయ
కలసినట్లు ఉందమురో లంబాడోళ్ళ రామదాస॥

ఇది యొకటీ అదియొకటి అప్పన్న గుడియొకటి
ఏ గుళ్ళోకి పోదాంరో లంబాడోళ్ళ రామదాస॥

[కూలీలు పనిలోకి వెడుతూ పాడేది.]


4. శ్రామిక గేయాలు
4.2. ఊడుపుల పాట

రాయినా శందనాలో ఓయిబామల్లాలా బామ
లాల బావన్నిలాలా॥

రామలచ్చనుల్లాంటి రాజులు లేరు
సీతమ్మలాంటి ఇల్లాలు లేదు	॥రాయి॥

పాడిపంటలు సల్లగుండాలి మా
కూలిరైతుల కడుపు నిండాలి
కామందులు సల్లగుండాలి
దండిగ మాచేలు పండాలి	॥రాయి॥

ఉత్తర వచ్చె ఎత్తర గంప
కాఱు మొయిలు ఆకాశమ్ము నిండె
తొలకర్లో వర్షాలు కురువాలి
ఎకరానికి బస్తాలు పండాలి	॥రాయి॥

నీరుపెట్టి దుక్కి దున్నాలి
దుక్కిదున్ని మొక్క నాటాలి
పక్కలిరిగే రాగుపండాలి పంట
కరవులేకుండ మనముండాలి	॥రాయి॥

మా! రైతుబాబులు బాగుండాల
ఆరి! పిల్లపాపలు సల్ల గుండాల
ఆరి! ఆవుల్ని గోవుల్ని కాయాలి
కాసినందుకు మాకు కానుకలియ్యాలి
రాయినా శందనాలో ఓయి బామల్లాలా	॥రాయి॥

[ఊడ్పులు ఊడ్చేటప్పుడు పాడేపాట.]


4. శ్రామిక గేయాలు
4.3. బెస్తవాళ్ళ పాట

ఏలియాలా - ఏలియాలా
ఏలియాలా
ఐలేసా జోరిసెయ్యి! ఐలేసా బారుసెయ్యి॥

గంగమ్మ తల్లీకి చెంగల్వ పూదండ
కాళిందికీ తెల్లకల్వదండ
జోర్సెయ్యి బార్సెయ్యి జోర్సెయ్యి బార్సెయ్యి॥

గోదారి తల్లికి గొజ్జంగిపూదండ
సరస్వతికి సన్నజాజిదండ
కృష్ణవేణమ్మకు గేదంగి పూదండ
కావేరికీ చంద్రకాంతదండా
ఐలేసా జోరుసెయ్యి ఐలేసా బారుసెయ్యి॥

పిల్ల జెల్లల్నంత సల్లంగ రక్షించి
యిల్లుచేర్చండి ఓ తల్లులారా		॥గంగ॥

సిక్కాలు నిండించి సింగాలు నిండించి
యిల్లు చేర్చండి ఓ తల్లులార
ఐలేసా జోరుసెయ్యి ఐలేసా బారుసెయ్యి॥

గోదారి తల్లీకి కొట్టర టెంకాయి
కోరి దండాలెట్టి కుంకుమ బెట్టి
ఐలేసా జోరుసెయ్యి ఐలేసా బారుసెయ్యి॥

నీటిని నమ్మి ఏలేలో నీవు ఉన్నావు ఏలేలో
నిన్ను నమ్మి ఏలేలో నేను ఉన్నాను ఏలేలో॥

[చేపలు పట్టువారు గోదావరిలో నావలు వేసుకొని చేపలు పట్టడానికి పోయేటప్పుడు పాడేపాట.]


4. శ్రామిక గేయాలు
4.4. రోడ్డు కూలీల పాట

ఓ చిన్నదాన ఒగలమారిదాన
ఓ చిన్నదాన ఒయ్యారిదాన॥

బందారు చిన్నదాన బాజా బందులదాన
బాజ బందూలమీద మోజెంతొ లేదే	॥ఓ చిన్న॥

గుంటూరు చిన్నదాన గులుకుమట్టెలదాన
నీ గులుకుమట్టెలపైన తళుకెంత లేదో	॥ఓ చిన్న॥

ఎర్ర ఎర్రనిదాన ఎత్తు పిఱ్ఱలదాన
ఎత్తు పిఱ్ఱలజూసి ఎగిరెగిరె మనసు	॥ఓ చిన్న॥

నల్ల నల్లనిదాన నడుము సన్ననిదాన
కళ్ళ కాటుకదాన సల్లంగరాయె	॥ఓ చిన్న॥

[బరువులాగేటప్పుడు, ఎక్కువ జనంకూడి తమకు హుషారు రావడానికి పాడేపాట.]


5. పెండ్లి పాటలు
5.1. ఏదేశాన్నుంచొచ్చారయ్యా

ఏదేశాన్నించొచ్చారయ్యా మా దేశానికి
చక్కని త్రిలోకసుందరి జానికమ్మకు॥

దొడ్డ దొడ్డవారలని బిడ్డనిస్తిమి
దొడ్డికాళ్ళ పెండ్లికొడుకని యెరక్కపోతిమి	॥ఏ॥

మేడలు మిద్దెలు గలవారని చేరె నిస్తిమి
దిబ్బలు గుడిసెల కాపురమని ఎరక్కపోతిమి	॥ఏ॥

గాబులు గంగాళాలు గలవారని మీకిస్తిమి
డాబు చేసుకు చేతికి చెంబేలేదని యెరుగము	॥ఏ॥

దానిమ్మగింజలు పళ్ళనిచాలగ నిస్తిమి
గొగ్గిపళ్ళ పెళ్ళికొడుకని యెరక్కపోతిమి	॥ఏ॥

చదువు సంధ్యలుగలవారని చాన నిస్తిమి
ఓనమాలురాని మొద్దబ్బాయని యెరుగము	॥ఏ॥

కోటి కోట్లుగలవారని కొమ్మనిస్తిమి
కూటికే వాచియున్నారను సూటితెలియదు॥
ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి	॥ఏ॥

[బాలికలు రెండుతెగలుగా చీలిపోయి ఒకరు మగపెళ్ళివారుగానూ, మరొకరు ఆడపెళ్ళివారుగానూ జట్టులుగా పాడుకొంటారు. ఒకరు ప్రశ్న వేయడం, మరొకరు పాటలోనే వారికి జవాబు చెప్పడం.]


5. పెండ్లి పాటలు
5.2. మంగళసూత్రం పాట

ఆనంద మానంద మాయెను
మన రామూడు పెండ్లికొడు కాయెను
మన జానకి పెండ్లికూతు రాయెను
మన కౌసల్యనోము ఫలించెను॥

రత్నాల పలకను వేసిరి సీత
రాము లిద్దరు కూర్చుండిరీ
చెలు లతివేగ సింగారించిరీ
చెలువముతో శ్రీరాముడు లేచెను	॥ఆనం॥

ముందుగ పురోహితులు మంత్రముల్‌ చదువగ
పొందుగ మేళతాలములు మ్రోయించగ
మందయానలు మంచిపాటలు పాడంగ
అందముగ రాముడు మంగళసూత్రము గట్టె	॥ఆనం॥

ఎదుటను పార్వతి సరస్వతి
ఇంద్రాణిదేవి యరుంధతి
ఆణిముత్యముల సేసలుచల్లగ
తులలేని రత్నాలు తలబ్రాలు బోసిరి॥
ఆనంద మానంద మాయెను॥

[మంగళసూత్రం కట్టేటప్పుడు పాడేపాట. నాగస్వరంలో ఇదేపాట వాయించి మంగళవాయిద్యాలు మ్రోయిస్తారు.]


5. పెండ్లి పాటలు
5.3. నలుగు పాట

రారాకుమార నలుగుకు
శ్రీరామ అలుగకు
పోరాట మేల సీతతో
భూపాల చంద్రమా...॥

తప్పేమిచేసె భూమిజ
దశరథ నందన
ఒప్పూల కుప్ప జానకి
వసుధేశ నందనా	॥రా॥

కమలా పురీశ గావరా
శ్రీగంధ మిదిగోరా॥
కమలాక్షి సీతబూయగా
కరమీయ వేమిరా॥

రారా కుమార నలుగుకు
శ్రీరామ అల్గకూ॥
కస్తూరి గంధ మలద సీత
కదలి వచ్చెనూ
ఓ రాజ రాజ శేఖరా
కరమీయ వేమిరా॥

[పెళ్ళిలో వధూవరులకు నలుగుపెట్టేటప్పుడు పాడేపాట.]


5. పెండ్లి పాటలు
5.4. అప్పగింతలపాట

సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినామమ్మ
చెలగి మీ అత్తింట బుద్ధిగా నుండమ్మ॥

యెవ్వ రే మాడిన ఎదురాడ కమ్మ
వీధిలో నిలుచుండి విరుల విరబోయకు॥

పలుమారు పలుదెరచి నవ్వబోకమ్మ
పరమాత్ముతోగూడి పడతి నీవుండు॥

ఆకలీ వుంటేను అడుగబోకమ్మ
అత్తగారితో పోరు చేయబోకమ్మా॥

నాతోడి చేసిన మంకుపోరెల్ల
యెరుగని అత్తింట సేయబోకమ్మ॥

ఆడదాని బ్రతుక అరటాకు వంటిది
అడకువతొ అందరిలొ మెలగిరావమ్మ॥

[పెండ్లి అయిన తరువాత పెండ్లికొమార్తెను అత్తవారింటికి పంపునపుడు పాడుపాట.]


6. పదములు
6.1. సైరా చిన్నప్ప రెడ్డి

సయిరా చిన్నప్ప రె(డ్డీ)
డ్డి నీ పేరే బంగార్పకడ్డీ
పుట్టింది రెడ్డిపాళెములో పెరిగింది చేబోలు
చిన్నప్పరెడ్డి మాటలకు చుట్టూ నొక్క పన్నెండామడ
నిప్పులేక మండిస్తివి రెడ్డి చుట్టూ నాలుగామడ
బందిపోటు కొట్టిస్తివి రెడ్డి	॥సయిరా॥

చిన్నప్పరెడ్డి యనేటివాడు
యే విధంబుగా జరుపుచున్నాడు

చీరాల పేరాల గొడితివి
వొంగోలు బాపట్ల గొడితివి
పొందుగాను నెల్లూరు గొడితివి
యింపుగాను వినుకొండ గొడితివి
సరసగాను గుంటూరు గొడితివి	॥సయిరా॥

చిన్నప్పరెడ్డీ కట్టేది గోరంచుపంచెలు
చుట్టేది చిలకల తలగుడ్డ
గోరంచు మరి పంచెనుగట్టి
రెడ్డిపాళెము బయలుదేరెను
తిరునాళ్ళెయినా వెళ్ళుచుండెను	॥సయిరా॥

చిన్నప్ప రెడ్డి యనేటివాడు
యేడాది వొక దినంబునందు
కోటప్పకొండకు వెళ్ళడానికి
బండి ప్రభనుగా తయారుచేసి
యాభై మూళ్ళ ప్రభను గట్టెను
నాలుగుగాండ్ల యెద్దులుగట్టెను	॥సయిరా॥

[చేతిలో ఢక్కా వాయిస్తూ పాడే వీరపదము.]


6. పదములు
6.2. గుఱ్ఱాల గోపిరెడ్డి

ఓగుఱ్ఱాల గోపిరెడ్డి
దాచేపల్లికి దహనమైతివా॥

శేరు శేరు వెండి మురుగుల్‌
చేతులాకు బెట్టుకోని
కట్టవమీద వస్తా వుంటె
కలకటే రనుకొంటిర కొడకా
వయ్యారి కొడకా బంగారు కొడక
దాచేపల్లికి దహనమైతివా॥

ఈ పక్కను ఒకచేను ఆ పక్కను ఒకచేను
నడుమలోన నాపచేను సందూన నిన్ను నలుగురుబట్టి
నరికిరి కొడక వయ్యారికొడక	॥దాచే॥

ఎక్కేది యెల్లగుఱ్ఱం
కట్టేది కాయపంచ
సుక్కవంటి నీ సక్కదనము
సూడ కన్నులు లేవుర కొడక
వయ్యారి కొడక బంగారుకొడక
దాచేపల్లికి దహనమైతివా॥

[తంబురా మీటుతూ జాలిగా పాడుకొనేపాట. దీనికి తాళమూ లయా చూపించే ఢక్కాకూడా ఉంటుంది. ముగ్గురు పాడుకొంటారు; ఒకడు తంబురా, ఒకడు ఢక్కా, మరొకడు వ్రేళ్ళకు ఉంగరాలుగా వేసుకొన్న తాళము పలికిస్తాడు.]


6. పదములు
6.3. ముసలమ్మ గండి

ఎంత ధన్యవో ముసలమ్మా
నీ వెంతసాహసివి ముసలమ్మా॥

ముసలమ్మప్పుడు ముస్తాబయ్యెను
మొగమున పసుపు సొగసుగ నలదెను
అడుగులకును పారాణి పూసెను
కుంకుమ నుదుటను కుదురుగ నిలిపెను॥

కన్నులనిండా కాటుక దిద్దెను
పసుపుచేర దా నొసపరిగట్టెను
మొగ్గల రవికను నిగ్గుగగట్టెను
కొంగును నడుముకు కోరి బిగించెను॥

కూడదీసి తన కురులను దువ్వెను
గొప్పుగ నొప్పగు కొప్పును ముడిచెను
కొప్పునజాజులు కొల్లగ తురిమెను
కాళ్ళకు గజ్జలు ఘల్లనగట్టెను॥

వచనం: ఆ విధంగా అలంకరించుకొన్నదై తన వూరి
	వారిని రక్షింపడానికి సిద్ధపడి గంగమ్మకు
	బలిగా పోయి ప్రార్థించెను

జాలారివారింట జన్మమెత్తినదానవే గంగాభవాని
ఈశ్వరుని తలపైన నెక్కి ఆడేదానవే	॥గంగా॥

పార్వతమ్మ తోడ పంతాలు గలదానవే
ఆదిశక్తివి నీ వనంతశక్తివి నీవటే॥
జగములేలే తల్లి చల్లగా రక్షింపవే
పట్నములో జనమెల్ల భయముతో నున్నవారె॥
నీకు కోపంవస్తె నిలువునా జాలుదురటే
నేనువస్తిని తల్లి నా కోర్కె చెల్లించవే॥

వచనం: అంటూ ఆ గంగలో గట్టున కడ్డంగా పడింది.
	 ప్రజలు గట్టువేసి ప్రమాదం తప్పించారు.

పరులకోసమై ప్రాణం విడచెను
ఆత్మత్యాగం అనేది చూపెను
లోకాలను రక్షించే శక్తిని
బోధచేసెను ముసలమ్మా॥

హృదయం నెరిలో ఇంపుగనున్నది
కల్మషాలతో కప్పబడినది
ఓ యని పిలచే ఉత్సాహులకును
ఓ యని పలుకును ముసలమ్మా॥

[రాయలసీమలో ముసలమ్మగండి అని పేరు పడినచోటుకు తావలమైన కథ. దీనినే కీ.శే. కట్టమంచి రామలింగారెడ్డిగారు ఖండకావ్యంగా రచించారు. ఇది కూడ బుర్రకథగా పాడుకొంటారు. క్రిందటి పాటలో వలెనే వాయిద్యాలు.]


6. పదములు
6.4. పెనుగొండ కోట

కొండగల్గిన కోట, కోటగల్గిన కొండ
కోట కొండలలోన మేటి యా పెనుగొండ॥

ఏనుగుల ఎలుగుతో రౌతుల రవళితో
మేనాల మెరుపుతో మెరిసింది పెనుగొండ॥

కులికేటి గానాలు కుణిసేటి ఖడ్గాలు
పలికేటి ఘంటలు ప్రబలింది పెనుగొండ॥

భళ్ళరాయని బాహుదర్పము లోనె
నేలనీడై ఉంది నెగడింది పెనుగొండ॥

భోజరాయని గద్దె భూస్థాపితము జేసి
బుక్కరాయని కొప్పజెప్పింది పెనుగొండ॥

గజపతుల నోడించి కటకానకంపిన
సాళ్వ నరసింహయ్య సాకింది పెనుగొండ॥

రుద్రుడైనా పట్టి ముద్దర్లుకాల్చిన
తిరుమల తాతయ్య తిరునాళ్ళ పెనుగొండ॥

ద్రాక్షారసములోన దానిమ్మలని జేర్చి
జుంటితేనెలతోడ జుర్రింది పెనుగొండ॥

తిట్లలో తిమ్మయ్య కవితలో బ్రహ్మయ్య
తెనాలిరామయ్య తిరిగింది పెనుగొండ॥

బాపనయ్యల నడుమ పల్లకీ నెక్కించి
భట్టుమూర్తికి కీర్తి తెచ్చింది పెనుగొండ॥

[పెనుగొండ కోటనుగూర్చిన వీరగాధ. ఇదికూడ వీరపదమే. బుర్రకథగా పాడవచ్చును. రాయలసీమలో ప్రచలితమైన యీ పాటను విని ఆ కవితావేశములో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు ఖండకావ్యము రచించారు.]


7. సామెతలు - సమస్యలు
7.1. కోడొండోరి సెరువులకింద

కోడొండోరి సెరువులకింద
సేసిరి ముగ్గురు యెగసాయం

ఒకరికి కాడిలేదు, రెండూకి దూడలేదు
కాడి దూడలే నెగసాయం
పండెను మూడు పంటలు.

ఒకటి ఒడ్లులేదు - రెండూ గడ్డిలేదు
ఒడ్లు గడ్డిలేనిపంట! ఇసాకపట్నం సంతలో పెడితే
ఒట్టి సంతేకాని సంతలో జనంలేరు

జనములేని సంతలోకి
వచ్చిరి ముగ్గురు షరాబులు

ఒకడికి కాళ్ళు లేవు
రెండు మరి చేతుల్లేవు
కాళ్ళు చేతులులేని షరాబులు
తెచ్చిరి మూడు కానులు

తలయు మొలయు లేని కుమ్మర్లు
చేసిరి మూడుభాండాలు

ఒకటికి అంచులేదు, రెండు మరి అడుగులేదు
అంచు అడుగులేని భాండముల ఉంచిరి మూడుగింజలు

ఒకటి ఉడక ఉడకదు
రెండు మరి మిడకమిడకదు
ఉడకని మిడకని మెతుకులు తినుటకు
వచ్చిరి ముగ్గురు చుట్టాలు
ఒకడికి అంగుడు లేదు, రెండుమరి మింగలేడు
దీని భావము తెలియచెప్పండి.

[ఇది తత్వమురూపంగా పాడుకొనేపాట. బైరాగులు మఠంలో గోసాయీలు ఏకతార మీటుతూ పాడతారు. వేదాంతార్థం గర్భితం.]


7. సామెతలు - సమస్యలు
7.2. తొందర యేముంది

ఏళ్ళను పాయసమే ప్రవహిస్తే
సంద్రాలంబడి సరస్సులైతే
చెర్లో చేపలు చిక్కుళ్ళయితే
తిండికి తొందరయేముంది॥

నాయకులందరు బాలకులైతే
సంసారులంత సన్నాసులైతే
కాకి ఆర్పులే కఱవైపోతే
శాంతికి తొందర యేముందీ॥

ముక్కుమూయగ మోక్షంవస్తె
పూజసేయగా పుణ్యంవస్తె
పాటకు దేముడు పరిగిడివస్తె
స్వర్గపుతొందర యేముంది॥

ప్రభువుల గుండెలు బంగారమైతే
ఖాతాలన్నీ కడుక్కుపోతే
దలారిగాళ్ళు తన్నుకుచస్తే
డబ్బుకు తొండరయేముంది॥

పల్లెపడుచులె పెండ్లాలైతే
ఉల్లిపూవులే మల్లెలు అయితే
కథలే నిజమై కనబడిపోతే
ఏడుపు తొండరయేముంది॥

[ఇది వీరబ్రహ్మంగారి కవిత్వము వంటిది. సమకాలిక జీవితము మీద వ్యాఖ్య. చురకలుగా వేసిన మీగడతఱకలు ఇందులోని మాటలు.]


7. సామెతలు - సమస్యలు
7.3. తియ్యని మామిడిపండు

తియ్యని మామిడిపండు, పండు
తినబోతె దొరకదు తీపులుమెండు

పండుకు వృక్షము పరులెవ్వరూ కారు
పరమాత్ముడనె ఆకుపైనుండు పండు
పండు యెనుబదినాల్గు పర్వములై యుండు
ఒరులకు యీపండు వశముగాకుండు

విత్తులేని పండు విశ్వములో యుండు
సత్యము యీమాట నిత్యమయా
అత్తుగ తల్లికి ఆ బిడ్డ మగడైతె
సత్యాము యీమాట నిత్యము కనుడీ

ఒరులాకు యీపండు ఒక దినుసుగానుండు
నరులాకు యీపండు నమ్మికుండు
ధరలోన యీపండు దాసులకై యుండు
పరమగురు ధ్యానపరులకు పండూ

తియ్యని మామిడిపండు, పండు
తినబోతె దొరుకదు తీపులు మెండు

[ఇదికూడ బైరాగులూ, సిద్ధులూ పాడుకొనే తత్వమే. అన్యాపదేశముగా వేదాంతార్థము చెప్పుతుంది. ఇదికూడ ఏకతార మీటుతూ పాడుతారు.]


7. సామెతలు - సమస్యలు
7.4. ఒకరికి కాళ్ళు యిచ్చా

స్త్రీ:	ఒకరీకి చేయినిచ్చి ఒకరీకి కాలునిచ్చి
	ఒకరీకి నడుమునిచ్చి కూకున్నానోయ్‌ రాజ
పురు:	ఎవరీకి చేయినిచ్చి ఎవరీకి కాలునిచ్చి
	ఎవరీకి నడుమునిచ్చి కూకున్నావ్‌ పిల్ల
	కూకున్నావే పిల్లా
స్త్రీ:	గాజుల్కి చేతులిచ్చి కడియాల్కి కాళ్లనిచ్చి
	వడ్డాణాన్కి నడుమునిచ్చి కూకున్నానోయి

స్త్రీ:	ఒకనీని లోపల బెట్టి ఒక్కణ్ణి బయటపెట్టి
	ఒకనీని పట్టుకోని కూర్చుంటినోయ్‌ బావ
పురు:	ఎవనీని లోపలబెట్టి ఎవనీని బయటపెట్టి
	ఎవనీని పట్టుకొని కూర్చుంటివే పిల్ల.
స్త్రీ:	కాటుక లోపలబెట్టి బొట్టయిన బయటబెట్టి
	అద్దము పట్టుకొని కూర్చున్నానోయ్‌ బావ.

స్త్రీ:	ఒకనీని నొక్కిపట్టి ఒకనీని చుట్టబెట్టి
	ఒకడికోసము యెదురు చూస్తున్నానోయ్‌ బావ
పురు:	ఎవడీని నొక్కిపట్టి ఎవడీని చుట్టబెట్టి
	ఎవడీ కోసము యెదురుచూస్తున్నావే పిల్ల
స్త్రీ:	వక్కైన నొక్కిపట్టి ఆకైన చుట్టబెట్టి
	సున్నం కోసం యెదురు చూస్తున్నానోయ్‌.

[ఇది ప్రశ్నోత్తరాలతో కూడిన చమత్కారమైన పొడుపుకథ. ముందు ప్రశ్న కొంత శృంగారముగా కన్పట్టినా, చివరికి సామాన్యమైన అర్థము. ఇది నృత్యవాయిద్యాలతో స్త్రీలు నృత్యంచేస్తూ పాడుకొంటారు. జావళీవంటిది.]


8. ఆటల పాటలు
8.1. కుమ్మిపాట

పురు:	కోలు కోలన కోలుకోలే ఓ చెలియా
	కొమ్మ మన మిద్దరము జోడే
స్త్రీ:	కోసేది కొయగూర మట్ట నాసామి
	వాసనకు దవనాపుకట్ట
పురు:	వచ్చిపోయే దోవలోన చినదాన
	వంతకారి బొమ్మలాట
స్త్రీ:	వీధిలో విస్తారమమ్మా ఈవూరి
	కోలాట లెంతేడు కమ్మ
పురు:	కోలాట లేసేటి కోరికేనైనా
	తప్పక తగలాక విడువనో కొమ్మ
స్త్రీ:	వగల గుమ్మడికాయకూర నాసామి
	రేతిరిచేసిన చేత
పురు:	రేతిరిచేసిన చేత చినదాన
	మొగనాలితో పొందు రోత
స్త్రీ:	కాగితి కలు బావినీలు నాసామి
	కడవనిండా ముంచుకోని
పురు:	రెండు చేతులు కడవమీద చినదాన
	వాలుకన్నులు దానిమీద
స్త్రీ:	కలికి గోపాలుడె కొమ్మా నాసామి
	కనులకు వలలొడ్డె నమ్మా

[బాలికలు కలిసి కుమ్మిచేస్తూ చేతకఱ్ఱలతో తాళమువేస్తూ పాడేపాట.]


8. ఆటల పాటలు
8.2. తారంగం తారంగం

తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం
చిన్నారి తారంగం శ్రీకృష్ణ తారంగం

తారంగమ్మని సారెకు సారెకు
అందరు చూడగ ఆడరకృష్ణ
వీరందరు చూడగ ఆడరకృష్ణ	॥తారం॥

దురితమగుచు చెవుల మద్ది
కాయలల్లాడా కృష్ణ
పులిగోరు పతకము గొలుసు
బొజ్జపై నోలలాడగా	॥తారం॥

మురుగులు గొలుసులు చేతులు త్రిప్పుచు
కిలకిల నవ్వులు కెరలు కృష్ణ	॥తారం॥
అద్దంపు చెక్కిళ్ళు నాకు ముద్దులియ్యర
తద్దిక్కు తాకుడు తకధిమి తక తాళమువేయరా॥

[చిన్నపిల్లవాడికి ఉగ్గుపట్టి తల్లి ఆడిస్తూ చేతులూ కాళ్ళూ సాచి పాడేపాట.]


8. ఆటల పాటలు
8.3. కోలాటం

కితకు తైయకు తాధిమ తఝంత తకధిమి
తళాంగు తధిగిణు తళాంగు తధిగిణు

కృష్ణుడు:	నీళ్ళాకుబోయేటి ఓ నీలవేణిరో
		నిలచుండవే గొల్లభామ నేను
		నీకొఱకు వస్తిని లేమ
గోపిక:	నిలచుండమని నన్ను నేర్పుతో నడిగేవు
		నీకేమి పనిగల్గె కృష్ణ
		నిజముగ దెల్పరాదోయి

కృష్ణుడు:	పనియేమి యని నన్ను పాటించియడిగేవు
		పని నీకు తెలువదె భామ
		ఇంత పసిబాలవా ముద్దలేమ
గోపిక:	తెలిసిందిగాని నాకు తెచ్చి యేమిచ్చెదవు
		తేటగ తెల్పరాదోయి కృష్ణ
		మాటన్న నిలుపరాదోయి

కృష్ణుడు:	మచ్చు చూచుకొని మాలైన నేగొంటె
		మచ్చన్న జూపవె భామ
		ఇంత మరుగెందుకే గొల్లలేమ
గోపిక:	పెండ్లిచేసుకొన్న పెనిమిటి యిదివరకు
		పేరన్న పెట్టలేదోయి కృష్ణ
		దారన్న జూపలేదోయి

కృష్ణుడు:	వద్దేల సుద్దేల వందనమదియేల
		ఒద్దికగా రావె ఓ భామ
		ఒక్కసారి ముద్దియ్యవె ఓలేమ
గోపిక:	ముద్దు లిచ్చుటకు పెద్దదాననుగాను
		పెద్దగ రట్టాయెనోయి నా
		పెద్దబావ కెరుకాయెను

[స్త్రీలు పురుషులు కలిసి చేతిలో కోలాటపు కఱ్ఱలు పెట్టుకొని నృత్యంచేస్తూ తాళ్ళు ధరించుకోపు జడ అల్లుతూ పాడేపాట.]


8. ఆటల పాటలు
8.4. చెమ్మచెక్క

చెమ్మచెక్క చేరెడేసి మొగ్గ
అట్లుపొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ

పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మాబావ పెళ్ళి చెయ్యంగ
చూచివద్దము రండి సుబ్బారాయుడు పెండ్లి
మావారింట్లో పెండ్లి మళ్ళీవద్దము రండి
దొరగారింట్లో పెళ్ళి దోచుకొద్దము రండి

ఒప్పులకుప్ప ఒయ్యారిభామ
సన్ననిబియ్యం చాయపప్పు
చిన్నమువ్వ సన్నగాజు
కొబ్బరికోరు బెల్లపచ్చు
గూట్లూ రూపాయి నీ మొగుడు సిపాయి
రోట్లో తవుడు నీ మొగుడెవరు

9. హాస్యపు పాటలు
9.1. వదినలందరు వచ్చిరీ (వదినపాట)

వదినలందరు వచ్చిరి వయ్యారముగ మా
వదినలందరు వచ్చిరీ

వదినలందరు వచ్చిరీ మిగుల సంతోషించిరీ
వగలుచేయుచు వొకరికొకరితొ
వాదించుచు వచ్చిరీ

పిల్లి కుక్కలవలెను మా వదినలందరు
పందిమూతుల వలెను
బాన కడుపులవారుగా కోరపండ్లు తోడను
కూరిమితొ తాబేలునడకల కోరి వా రొచ్చిరి

సారి గమా పాడెదరూ
మా వదినలందరు సంగీతం పాడిరి
మెచ్చి సభవారందరు చింపిగొంగళి కప్పిరీ
వగలుచేయుచు ఒకరికొకరూ
వాదించు కొచ్చిరీ

[పెండ్లిండ్లలో వదినలమీద వరుసపెట్టి వేళాకోళం చేస్తూ పాడే హాస్యపుపాట.]


9. హాస్యపు పాటలు
9.2. అత్తవారింటికి కొత్తల్లుడు (అల్లుని హాస్యం)

అత్తవారింటికి కొత్తల్లు డొస్తేను
కొత్తసున్నందెచ్చి మెత్తరమ్మా
కొత్తసున్నంతోను కోపంబువస్తేను
నల్లేరు తెప్పించి నలవరమ్మ
నల్లేరుతోడను నసనసలాడితే
దూలగుండాకుతో దులపరమ్మ
దూలగుండాకుతో దుఃఖమ్మువస్తేను
బర్రెపలుపులుదెచ్చి బాదరమ్మా
బర్రెపలుపులతోను బాధలువస్తేను
కొరడాలు తెప్పించి కొట్టరమ్మా
అత్తారియింటికి వస్తే సుఖమేమంటు
వచ్చినదారినే పట్టరమ్మా

[మునుగుడుపులకోసం అత్తవారింటికి వచ్చిన కొత్త అల్లునిపై మరదళ్ళు పాడేపాట.]


9. హాస్యపు పాటలు
9.3. ఆలుమగల సరసం

మగ:	కొట్టకుండ తిట్టకుండ వుంచుకుంటాను పిల్ల
	చల్లంగ మెల్లంగ నీవుంటావా
స్త్రీ:	చల్లంగ మెల్లంగ నేనుంటను గాని
	నవ్వేటి నవ్వుమొగం ఎట్టపెట్టేది

మగ:	నవ్వేటి నవ్వుముఖం నీవుబెట్టితే
	చేతిలో దుడ్డుకర్ర చెండాడదా
స్త్రీ:	చేతిలో దుడ్డుకర్ర చెండాడితే నీ
	బండారం బయటికీ నే చెప్పనా

మగ:	బండారం బయటికీ నీవుచెప్పితే మీ
	అమ్మగారింటి కెళ్ళీ నే చెప్పనా
స్త్రీ:	అమ్మగారింటికెళ్ళి నీవు చెప్పితే నే
	కూటినీళ్ళ కాయకుండ దిగనూకనా

మగ:	నీవు కూటినీళ్ళ కాయకుండ దిగనూకితే నే
	స్టేషనుకి పోకుండ ఎగనూకనా
స్త్రీ:	స్టేషనుకి పోకుండ ఎగనూకితే
	బాయిలో గుంటలో నేనుపడనా

మగ:	బాయిలో గుంటలో నీవుపడితే నే
	వెట్టోణ్ణి పిలిపించి ఎత్తించనా
స్త్రీ:	వెట్టోణ్ణి పిలిపించి ఎత్తించితే నే
	దెయ్యమై భూతమై నిన్నుపట్టనా

మగ:	దెయ్యమై భూతమై నీవుపడితే నే
	భూతగాణ్ణి పిలిపించి వదలగొట్టనా
స్త్రీ:	భూతగాణ్ణి పిలిపించి వదలగొట్టితే నే
	తిరుపతికొండెక్కి తిరిగిచూస్తే

మగ:	తిరుపతికొండెక్కి తిరిగి చూస్తే
	చెన్నపురి రేవుకెల్లి చెక్కెయ్యనా

[జానపదులలో ఆలుమగలు వలపు మాటలతో పాడుకొనేపాట.]


9. హాస్యపు పాటలు
9.4. కలికాలం తీరు

నందామయా గురుడ నందామయా
ఆనందజ్యోతికి నందామయా

అత్తలకు పీటలు కోడలికి మంచాలు
మామనెత్తిన తట్ట పెడతారయా

వరికూడు తిని యేరువరుసలే తప్పారు
మగని పేరు బెట్టి పిలచేరయా
ముండలంతా గూడి ముత్తయిదులౌతారు

గూడూరిసందున గున్న చింతలక్రింద
గువ్వ మూడు మాటలాడేనయ్య
త్రాగునీళ్ళకు కఱువులయ్యేనయా

తాటిచెట్టుమీద తాబేలు పలికింది
తలంబ్రాలు వానకురిసేనయా
మూడునెలలకు కఱువు లొచ్చేనయా

నల్లగొండావల నాగులారముకాడ
నాల్గుకాళ్ళ కోడి పుట్టేనయా
అరువయాయాముడ కూసేనయా

ఆదివారమునాడు ఆబోతుగర్భాన
హనుమంతుడూ పుట్టి పెరిగేనయా
హనుమంతునకు పోయి మ్రొక్కేరయా

[బ్రహ్మంగారి తత్వము. రానున్న విడ్డూరాలగూర్చి వర్ణిస్తూ బైరాగులు ఒక జట్టుగా పాడుకొనేపాట. అందరూ కలిసి కూర్చున్నపుడు ఏకతార మీటుతూ పాడుకొంటారు. లేనపుడు కంఠాలుమాత్రం కలిపి పాడతారు.]


10. లాలి పాటలు
10.1. జో అచ్యుతానంద

జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామగోవిందా

తొలుత బ్రహ్మాండములు తొట్టె గావించి
నాలుగూ వేదాలు గొలుసు లమరించీ
బలువైన ఫణిరాజు పానుపమరించీ
చెలులు డోలికలోన చేర్చి లాలించీ

ముల్లోకముల నేలు ముమ్మూర్తులారా
అడ్డాలలో నేడు బిడ్డలైనారా
ఏ జన్మలో నోములే నోచినానో
యీజన్మలో నాకు బిడ్డలైనారా

ఉదయాస్తమయములే ఉక్కు స్తంభములో
నిండు ఆకసమూ అడ్డదూలముగ
నాల్గువేదములు బంగారు గొలుసులు
బలువైన భూస్తలము గురుపీఠకంబు

బంగారమనియేటి చలవటుపరచి
నేర్పుతో పాపణ్ణి ఏర్పాటుచేసి
ఏడు భువనముల వారేకమై పాడ
పేటలో భేరీ మృదంగములు మ్రోయ

తొమ్మిదీ వాకిళ్ళ దొడ్డిలోపలనూ
మూర్ఖు లారుగురునూ సాధులైనారు
అంతలో ముగ్గురూ మూర్తులున్నారు
తెలివి తెలిపేటివాడు దేవుడున్నాడు

పట్టవలె ఆర్గురిని పదిలంబుగానూ
కట్టవలె ముగ్గుర్ని కదలకుండానూ
ఉంచవలె నొక్కణ్ణి హృత్కమలమందూ
చూడవలె వెన్నెల భావమందుననూ

జంటగూడినవాని జాడ గనవలెను
ఇంట బ్రహ్మానంద ముంటుండవలెను
ఓంకారమనియేటి తొట్టెలోపలను
తత్వమసి యనియేటి చలువనే పఱచి

[ఇది స్త్రీలుపాడేజోలపాట. ఇటువంటిది అన్నమయ్యకూడ రచించాడు.]


10. లాలి పాటలు
10.2. లాలీ శ్రీకృష్ణయ్య

లాలీ శ్రీకృష్ణయ్య నవ
నీల మేఘవర్ణ
బాలగోపాలకృష్ణ పవ్వళించవేమయ్య

శృంగారముగ నిన్ను బంగారు తొట్టెలలో
రంగూగ జోలపాడెదాను నిదురపోవయ్యా

ఇందరిలోపల నీకు ఎవరు కావలెనయ్య
ఇందీరాక్షి కాళిందియే కావలెనా

లలితాంగీ రుక్మిణీ లలనయే కావలెనా
పలుకు కోకిల సత్యభామయే కావలెనా
లాలీ శ్రీకృష్ణయ్య నీలమేఘవర్ణ
బాలగోపాల కృష్ణ పవ్వళించవేమయ్య

[ఇది పాపను తొట్టెలోవేసి ఉయ్యాలలూపుతూ తల్లి పాడేపాట.]


10. లాలి పాటలు
10.3. నిదురబోడూ కృష్ణుడూ

నిదురబోడూ కృష్ణుడూ బెదరినా(డు)
అయ్యొ వీడు నేడు

కుదురుగా ముజ్జగములు జో
కొట్టి నిదురబుస్తేగాని

గట్టిగా విభూతి నుదుట
పెట్టి చూచి సంధ్యవేళ
చుట్టుగాను గొప్ప దిష్టి
దీసివేసి తేనుగాని

తంత్రమున నేను మహి
మంత్రవాదుల బిలిపించి
మంత్రింపించి మొలకొక్క
యంత్రము గట్టినగాని

[తల్లి పాపను నిద్రపుచ్చుతూ పాడుపాట.]


10. లాలి పాటలు
10.4. రామలాలీ

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయా లాలీ

అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలో పాలరుగుగాని నిదురపోవరా

జోలలుబాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించి మరి యూరకుంటే సౌజ్ఞ చేసేవూ

ఎంతోయెత్తు మరిగినావు ఏమిసేతురా
వింతగాని కొండ నుండు వీరరాఘవా

[ప్రసిద్ధమైన లాలిపాట. ఇటువంటిపాట తమిళ, కన్నడములో కూడా కలదు.]

AndhraBharati AMdhra bhArati - AndhraBharati AMdhra bhArati - telugu palle pATalu - prayAga narasiMhaSAstri - dEshi dESi sAhityamu ( telugu andhra )