దేశి సాహిత్యము స్త్రీల పాటలు గోవు పాట
గోవు పాట
గొల్లకృష్ణుడు వేణునాదము - చేతబట్టుకు వూదుకొనుచు - గోవు మందవెంటనడచి
పొన్నవృక్షము చెంతజేర - గోవులన్ని పొదలదూరి - కలసిమేయుచుండగానూ
పెద్దకాలపు ఆవులార - పేరుపడ్డ మందలార - కపిలయావు దూడల్లార
కర్రియావుదూడరావె - తెల్లయావుపిల్లరావె - బొల్లియావు నీవురావె
కామధేను కల్పతరువా శ్రీలక్ష్మి పేరిందేవి - అన్నపూర్ణ విశాలాక్షి
తెల్లమత్సగోవురావె - నల్లమత్స ఆవురావె - చిన్నిఆవు దూడరావె
శనివారము విష్ణుప్రీతి పేరుపేరున పిలిచి తాను బట్టిదట్టి బిగియగట్టి
లేగదూడల - చేతబట్టి శృంగారపు చెంబుపట్టి వెండిత్రాళ్ళు తెచ్చితాను
బందనములు వేయుచూను గోవులకు పాలుపిదికి గొల్లభామల మూపులందు
బెట్టివారి యిండ్లకనిపి చెట్టుయెక్కి - వేణునాదము చేతబట్టుచు - వూదుచుండగ
గోవులన్ని పొదలదాటి సకలదిక్కుల మేయుచుండగ తూర్పుదిశకూ కొన్ని వెళ్ళి
గట్లపైని మేయుచుండగ గొప్పనాదము చెవులబడగా అదురుకొంటూ బెదురుకొంటూ
మేతమాని యెదురుచూడగ గాండ్రు గాండ్రు మనుచు వేగమె పెద్దపులియొకడొచ్చినిలిచి
నాదుపొలము పాడుశాయగ నేడువచ్చిన యావులార పోకుపోకుడు మేతమాని
చిక్కినారుగ నాదుచేతికి వారమొక్క జీవయనుగా గొంతువిరిచి రక్తమెల్ల
గ్రోలి పొట్టచించివేగమె కొవ్వుతీసి నారదీస్తు దాటిపోవా జూతురేమొ
పారిపోవజూతురేమొ కురుచకొమ్ములు చిన్నియావుల నిడువకొమ్ముల పెద్దయావుల
పేరుబడ్డయావులాను కోట్లకొద్దిగ తిన్నదానను నన్నువిడచి పారిపోతె
వెంటతరిమి చంపివైతును నాదుపొలమూ చేరిమీరు నాదుహారము దొరికినారు
నాదుపేరు వ్యాఘ్రము మాకుమీకు వైరమెందుకు నేనుచెప్పిన మాటదాటక
బుద్ధిగలిగి యుండుమనుచూ బల్కగా నాయావుముందు నిలిచి యనుబల్కుచుండె
పేరుపేరుగ నున్నయావులు వెనుకచేరనిల్వగాను వ్యాఘ్రమా వినుమునాదు
ఒక్కమనవి చిత్తగించు మూడుదినముల కిందట నేను కవలదూడల కన్నదానను
నన్ను పెంచిన దాతలెల్లా పాలుపితుక చుండగాను రెండు దూడలు బెంచుచుంటిని
నాదురాకకు దూడలెల్లా యెదురుచూచును బెంగాతోను శలవుయిచ్చిన పాలుయిచ్చీ
మళ్ళివచ్చి నీదు ఆకలి తీర్తుననుచుబల్కగాను నీదుమాటలు నమ్మినేను
వదలివేయను నమ్మునన్ను వ్యాఘ్రమును నేనుగానా అనుచు బల్కుచుండెనూ
సకలదేవతలార వచ్చెద నాదుపుణ్యము ధారబోసెద నాదుకొడుకుల మీదుగాను
సత్యమైన తల్లిదండ్రి తోడునీడలమీద నేను సకలయానలు బెట్టెదాను
సత్యవాక్యము దప్పితేను స్వామిద్రోహము జేసినట్లు పుట్టినింటి వారికెల్లా
అత్తయింటివారికెల్లా కీర్తిసంపద బోయినట్లు కల్లకాదు మాటనమ్ము
బొంకుగాదు మాటనమ్ము శలవుయిచ్చిన వేగవత్తును కోరి మ్రొక్కితి దాపునా
ఇన్నివిధముల కోరగాను - గొప్పయానలు పెట్టగాను - పెద్దపులికి జాలికలిగి
యడవిలోనా - యానబెట్టి తప్పితేను ద్రోహమూలు చుట్టిచుట్టి - తరుముకొచ్చి
నిన్నుబట్టి చంపివేతును - గాన వేగమె వెళ్ళినీవు నీదుకొడుకు పాలుయిచ్చి
మళ్ళిరమ్మటంచు చెప్ప - గంతువేయుచు చంగుచంగున - దాటుకొనుచు యింటిమొగమై
దొడ్డిచేరియు కవలదూడల - చేరబిలిచీ పాలుయిచ్చీ - తృప్తిపరచే బిడ్డలార
వేగవెళ్ళేద అడవిలోను - మేయుచుండగ పెద్దపులియొక - టొచ్చిబట్టగ బిడ్డలాకు
బుద్ధిగలిగి మసలుచుండిడి - పచ్చిచేనూ మేయబోగా - కాపుచేతిలో చిక్కబోకా
బొదచాటున మేయబోక - పులులనోటి కందబోకా - ఇండ్లలోనా తిరుగబోకా
కర్రదెబ్బలు తినకమీరు - కాపువాడు మేపబోవు - బీళ్ళయందూ నిలచికసువు
కడుపునిండా తినుచుమీరు - దొడ్డికొచ్చి నిద్రజెందుడి - పేరిందేవి మీనాక్షి
ఆదిలక్ష్మి అన్నపూర్ణా - కామధేను కల్పతరువా - పేరుబడ్డా గోవులారా
నాదుకొడుకుల మీరుచూచి - ముందుకొచ్చిన పొడవబోకా - వెనుకకొచ్చిన తన్నబోకా
మందజేర్చుక బుద్ధిగలిగి - నపుడేనే వ్యాఘ్రరాజా ఆకలిదీర్చబోయెదా
ఓ గోవులారా నాదుకొడుకుల దయతోజూడుడి తుంగభద్రానదులలోను
స్నానమాడి భక్తిగాను దేవునిపూజించితాను అడవికేగెను - ఓజనులారా
చూడచోద్యముగాను యుండెనూ - అన్నలారా చిన్నలారా ఆకలిగనుంటెదోషము
వ్యాఘ్రరాజా వేడవచ్చితి - కోపగింపక నన్ను జంపుము - కోటిగోవుల తిన్నదానవు
లక్షరుచులను యెరిగియుండి - సకలన్యాయము తెలిసియుండి - గడువుమీరక వచ్చినేను
బొబ్బలిడినా రావునీవు తెలియజాలను - ఓ వ్యాఘ్రరాజా వేగవచ్చి నన్ను జంపుము
ఆర్చుకుంటూ హడలుకుంటూ వచ్చి గోవు కాళ్ళకపుడు మ్రొక్కి చెప్పెను వ్యాఘ్రరాజా
తల్లినీవు లక్ష్మీదేవి అన్నమాట దాటనేరవు నిన్నుమించినవారుభువిలో
నీతిపరులా గానలేము నీదుచర్యలు విన్నవారలు చదువువారలు వ్రాయువారలు
యెంతమూర్ఖత ద్రోహులయినా పుణ్యమబ్బు మోక్షమందేరు ఓ జనులారా తప్పకను
చదువుచుండూడీ అనుచుచెప్పి ప్రాణమొదలెను బ్రహ్మవచ్చెను రుద్రుడొచ్చెను విష్ణు వచ్చెను
యింద్రుడొచ్చెను సకలదేవతలు వచ్చిరి దల్లీనీవె మాతవునీవు నిన్నుమించిన
నీతిపరులా యెల్లలోకము లందులేరు నీవుయున్నా గ్రామమందు పంటలుపండు
పూర్తిగను నెలకు మూడు వర్షమూలు సకలజనులు సుఖమునొందెదరు
ఓ గోవులారా నీదుకీర్తిని జెప్పశక్యమా నీదుచరితము చదువువారలు విన్నవారలు
జూచువారలు కైలాసపదవి జేరిసుఖమును వుందురనుచూ
మేముజెప్పినమాటలెల్లా శాశ్వతంబుగ జరుగుననుచును
చెప్పి వారిలోకములకు వెళ్ళినంతట యల్లయావు
మందజేరి బిడ్డలాకు పాలుయిచ్చి సుఖమునుండేను ఓ జనులారా
యెల్లకాలము జదువుచుందూరు అప్పాటివింత యీదినంబున జరుగురీతిగనూ.
AndhraBharati AMdhra bhArati - dEshi sAhityamu - strIla pATalu - gOvu pATa ( telugu andhra )