| దేశి సాహిత్యము | స్త్రీల పాటలు | గుమ్మడు పాట |
| గుమ్మడు పాట |
| రాణించు ముత్యాల రావిరేకయు బొట్టు - కురు వెంట్రుకల నడుమ గునిసియాడ బాగైన ముత్యాల పౌజు కమ్మలజోడు - చెక్కిళ్ళపై మెరుగు సేయుచుండ వక్ష స్థలంబున వరుస పక్షులు రెండు - ఒప్పుగా తమతోన నొప్పుచుండ రంగారు బంగారు రచనా కలాపంబు - నసియాడు నెన్నడుము పసలుచూప మేటి పటుత్రాడు కవ్వానమించ జుట్టి - వల్లెవాటుల కొంగు లుయ్యాలలూగ కరమునను కంకణంబుల రవముసెలగా - తరుణి యొయారమున పెరుగు చిలుకుచుండె॥ 1 |
| కలికి కంఠపుసరులు చక్కగ - గొప్ప ముత్యపుసరులు జారగ కలికి కరమున కంకణాదులు - కలసి మ్రోవగను గరివి కెదురుగ పెరుగుదించెను - కడవ స్తంభం మొదట నిలిపెను కరమునను దట్టించి కవ్వము - ఇంతిచే బూనె\న్॥ 2 |
| ఘుమ్ము ఘుమ్మున పెరుగు తరచగ - కోరి విని ప్రార్థించి కృష్ణుడు అమ్మ వెన్నాయనుచు కవ్వము - నణచి పట్టగనూ నమ్మరా కృష్ణమ్మ పెరుగులో - నడుమ గుమ్మడు తిరుగులాడును నమ్మకున్నను ఘుమ్ము ఘుమ్మను - నాదమిటు వినుమీ ॥కృష్ణా గుమ్మడిడిగో॥ 3 |
| వామహస్తము ననచి పాదము - వసుధ మీదికి కాలు యెత్తుకు భూమి కదలగ నవయవమ్ములు - బొజ్జ కదలగనూ కోమలీకంబైన చక్కని - గునిసియాడెడి నడుము వంచుకు ప్రేమ లెన్నుచు చెయ్యి చాపెను - పెరుగు తరచగనూ॥ 4 |
| కాటబోయిన వారి పాపడు - కడవ లోపల చెయ్యి ముంచెను తూటుపొడిచీ కరచె గుమ్మడు - తొలగి పోవగనూ మాటలేటికి విడుము కవ్వము - అన్న నీకును వెన్న బెట్టెద యేటికీ ఇందున్న గుమ్మడు - యెగిరి కరచెడినీ ॥కృష్ణా గుమ్మడిడిగో॥ 5 |
| గుమ్మడేడే గోపదేవీ - గుమ్మడేడే కన్నతల్లీ గుమ్మడిని పొడచూపగదవే - అమ్మ గోపెమ్మా ॥గుమ్మడేడే॥ 6 |
| మ్రుచ్చు తనమున వేదములుగొని - తెచ్చి వెరచుచు జలధిలోపల జొచ్చియున్నా వాని వెంబటి - జొచ్చి వెనుదగిలీ మత్స్యమై సోమకుని ద్రుంచితి - మొదటి చదువులు బ్రహ్మకిచ్చితి అక్షయాంబు గుమ్మడనియెడి - మాట నేనెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 7 |
| సురులు నసురులు జలధి తఱచగ - సరసగను భూధరము కృంగగ అల్లసురవరులెల్ల పొగడగా - వారి కిష్టముగా గిరికి కుదురుగ కూర్మమైతిని - క్రిందిలోకమునందు గుమ్మడి తరచుగా నొకమాటకైనను - తరుణి నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 8 |
| చారు భూమి చరాచరమ్ములు - చంకబెట్టుకు హైమనేత్రుడు వారినిధిలో జొచ్చి నంతట - వాని వెనుదగిలీ కోరి వరాహరూపమైతిని - రక్కసుని రణభూమి జంపితి వారి భూములలోన గుమ్మడి - పేరు నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 9 |
| జగములన్నియు విష్ణుమయమని - చదున్ను బాలుండిందు గలడన పరుగుగను దట్టించి స్తంభము - పగుల వేయగనూ సగము మృగమై హేమకస్యపు - చంపి దానవసుతుని గాచితి మగువరో అందున్న గుమ్మడి - మాట నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 10 |
| వడుగు బ్రాహ్మణ వేషమున నే - బలిని అడిగితి దానమిమ్మని పుడమిలో మూడడుగులిచ్చెను - పొంగి వేడుకతో అడుగులను బ్రహ్మాండ భాండము - అంతటను నే నపుడు నిండితి అడుగు క్రిందను గుమ్మడనియెటు - అరసి నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 11 |
| వరుస నెరుగక కార్తవీర్యుడు - వచ్చి యా సురధేనుకైగొని పరగగా జమదగ్ని జంపిన - పగకు నే నపుడూ వరుస నిరువది యొక్క మారులు - వెంటబడి భూపతుల జంపితి వైరి భూములలోన గుమ్మడి - పేరు నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 12 |
| పరగగా రాక్షసుల బాధకు - విబుధ దేవతలెల్ల శరణని కోర దశరథ రాజసుతుడై - యవని జన్మించీ జలధి బంధనజేసి రావణు - జంపితీ రణభూమిలోపల బలిమిగల యా గుమ్మడనియెడు - మాట నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 13 |
| సంతసమ్ముగ రామకృష్ణులు - సదయులై రేపల్లె వాడలో యింతులకు పదియారు వేలకు - ఇష్టమొనరించీ కుంతి సుతునకు సారథైతిని - కురుబలమ్ముల నణచుచోటను మంతనమ్ముగ గుమ్మడనియెడి - మాట నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 14 |
| యుద్ధయోగము చేయు చోటను - పణతులను చెరుపంగవలెనని వృద్ధ బ్రాహ్మణవేషముననే - వేడ్కలమరగనూ యుద్ధమున రాక్షసుల చంపితి - ఉత్పతిల్లగ భూమి దెచ్చితి యుద్ధ యోగమునందు గుమ్మడి - చోద్యమే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 15 |
| మర్మమెరుగక కలియుగమ్మున - మత్తులై నీచులను మించియు నిర్మలాశ్వము నెక్కి వారల - నణచి మోదముతో ధర్మదేవతలనెడి రాజుల - ధరణిలో నిలుపంగవలెనని ధర్మయుద్ధములోను గుమ్మడి - తెరవు నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 16 |
| చిత్తమును బహుచందములుగా - చంద్రకళయును జలసమస్తము సప్తరాత్రులు వుంటినే - పటపత్ర శయనమునా హరియె గతియని అక్షయంబుగ - నారదాదులు శ్రుతులు చేయగ యోగమార్గమునందు గుమ్మడి - పేరు నే నెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 17 |
| మేదినియు మిన్నొక్కటగుచు - మెండు జలముల దిశలు ములుగగ మోదమలరగనుంటినే నా - మొదటి రూపమునా ఆదరమ్మున తిరిగి యంతట - అమ్మ నే జగమెల్ల నుండితి వెదకితిని జగమెల్లవేమరు - గుమ్మడిని యెరుగా ॥అమ్మా గుమ్మడేడే॥ 18 |
| ఇందుగలడా గుమ్మడంటివి - ఎందుగలడో చూడుమాయని వందనంబిడివేగ తన తిరు - వాక్కు తెరువగనూ నందనందను నోటిలోపల - నాతిపొడగనె చరాచరమ్ములు చంద్రసూర్యులు మొదలుగాగల - సకల దేవతలూ॥ 19 |
| వెరువవలెనని గుమ్మడంటిని - వెరచితిని తెరువాకు మూయుము చిరుతలను వెరపించు చందము - చేస్తినో తండ్రీ కన్న బలిమిని గుమ్మడంటిని - కరుణ జూడుము దేవమణినను కరుణతో హరిదాసు నేలిన - కాకుళాధీశా॥ 20 |