దేశి సాహిత్యము స్త్రీల పాటలు శ్రీకృష్ణుని చల్దులు
శ్రీకృష్ణుని చల్దులు
సృష్టిలోవెలసినట్టీ - శ్రీ వాసిష్టులెల్ల గొలువా
శ్రీకాంతుని వల్లభులకూ - శ్రీమహిమలు విస్తరింత్రూ
వేడుక రెండే పదములు - ఉభయాకారుండని పాడా
కాళింగమర్దనులకు - ఘనమైన కల్యాణమ్ము
పంచ శతకోటియోజన - విస్తీర్ణమైనా పృథివీ
ఆత్మారక్షించా ఉదయ - మైతిరి రాజీవలోచనులు
చెన్నుగ గోపకుమాళ్ళూ - చేకోలలు చేతనుబట్టుక
శ్రీకృష్ణా గోవులుగాయను - పోదామా ప్రొద్దునలేచి
అని విన్నపములు సేయగ - అచ్యుతులూ మేలుకాంచ్రీ
అవధరింపుతులేచి - ఆనందమున పొంగీ
త్రైలోక్యవల్లభులు - తమతల్లితో అనిరి యిట్లూ
గోవులను కాయవలెను - చాలా ప్రొద్దాయెను మాకూ
అనుచూ తన పట్టి లేపగ - ఆనందామున గోపీ
అఖిలాండనాయకులనూ - అంకించీ పిలచే తల్లీ
సకలకల్యాణా నిలయుడ - సకలాగుణ శీలుడ
పరంజ్యోతి తేజోనిలయా - బల్లిదుడ మేల్కొనరో
శ్రీ పరమాకల్యాణూడా - సృష్టికి కర్తవైనా
క్షీరాబ్ధీ శయనుడైనా - తనయుడ మేల్కొనరో
అమి వరదా శుభనిలయుడ - ఆనందసాగరూడా
ఇందిరానంద కరుడా - యదునందన మేలుకొనరో
గ్రాహము తాకిన కొలనా - గజరాజు మకరిచేతా
ఆర్తీచే గొలువ భక్తి - ఆలించివిన్నాదేవ
పాంచాలీ వలువలు వేగా - దుశ్శాసనుడు సభనొలువా
అక్షాయంబుగ వలువల - నొసగిన హరి కృష్ణా
పూతకి ప్రాణసంహార - మాకల్లా ఉదయమైతి
క్షత్రీయవర్గము లణచిన - పుత్రూడ మేలుకో
శశధరుడు అర్జునుడు - దిశలెల్ల దృంచవేసి
ఆధారములేక అంతా - వృక్షంబున నుండెనపుడూ
కమలాలోచనులు తమరు - కరుణించి తలచనపుడె
శరణాగతుల రాజ - చయ్యన మేలుకొనరో
మత్స్యావతారమున - అచ్చూగ అసురుని చీరగ
చొచ్చి వేదములు నిలిపిన - వేదా వేద్యుడ లెమ్మా
కూర్మావతారమున - కొండవీపున ఆని
అమరూల కమృత మొసగిన - ఆది కూర్మమలెమ్ము
నట్టేడూ సముద్రములు - ధరణీపై కలసీ పార
వసుధా కొమ్మున యెత్తిన - వరహావతారుడా
అదరీ రక్కసులూ తమరు - బెదర స్తంభమున వెడలి
హిరణ్య కశిపుని చంపు - నరసింహావతారుడ లెమ్మీ
బాలప్రాయమున తనరు - బలిచక్రవర్తీ నపుడు
మూడే పాదమ్ములు అడిగిన - మురవైరి మేలుకో
కార్తవీర బాహులు వెయ్యీ - ఖడ్గంబున ఖండించి
క్షత్రియ వర్గము గెలిచిన - పరశురామావతారూడా
వాలీ మర్దనుడ - వారధి బంధనుడ
సుగ్రీవ హితుడవైన - సూర్యవంశుడ మేలుకో
సేతూ బంధానుడా - శ్రీలక్ష్మీ వల్లభుడ
రావణవైరి వైన - రఘునందన మేలుకొనరొ
గోపీనందనుడ - గోవర్ధనోద్ధారుడ
గోపికా ప్రాణవల్లభ - గోపాలుడ మేలుకొనరొ
హలాయుధమ్ము బూని - అన్నీ తీర్థములు తిరిగి
అవలీలగాను వచ్చిన - బలరామావతార లెమ్ము
రుద్రునికి త్రిపురములు - అగ్గాళమయ్యెనంత
మగనాళ్ళ మానము గొన్న - బుద్ధావతారుడ
కాళంగి మర్దనూడ - కౌస్తుభ హారమువేసి
కలియుగ దుష్టుల జంపిన కలికావతారుడ
అమి వరదా శుభనిలయుడా - ఆనంద యోగనిద్ర
ఎప్పూడు మేల్కొంటిరి - ఇదుగో గోపకుమాళ్ళు
అనుచూ తిరుబోనం దెరచీ - చల్లారబోసెను చల్దీ
దధిచాల శొంఠీ వేసి - మృదువుగా కలిపెను చల్ది
ఓ యమ్మా కలిపెను చల్ది - ఒప్పా చిక్కములోనుంచీ
మృదువైనా పచ్చళ్ళన్నీ - చల్దీపై నుంచెను తల్లి
వాక్కాయ వద్దికాయ - వొప్పైన మామిడికాయ
వూరీన అల్లంతోను - వుసిరీ కాయను వుంచె
చల్లించిన మిరియపు గెలలూ - జన్మువుల పెరుగులతోను
అల్లమ్ము ఆవకాయ - అనేకం వుంచెను తల్లి
చెన్నూ భావించీ చూచి - శిరిపాదములు కడిగీ
ముద్దుతో ఒప్పునట్లూ - ముఖపద్మ మొనరించె
నారి కేశవు కురుల - తలదువ్వి పాపిటతీసి - కొప్పూ వొప్పుగ ముడిచే
చేమంతులు చంపాకములు - చెంగల్వలు నడుమనుంచే
అతివీరులైనా మల్లెలు - అనేకం ముడిచెను తల్లీ
వొప్పూగ కమల నేత్రి - ఉభయా భాస్కరులకు
బాగుగా చందనమ్ము - బలచందనం అలదే
కడువొప్పు పాదములకు - గండూ కడియములుంచె
కనకంపు గజ్జెలు గట్టి - ఘనమైన తొడుగులుంచె
మెరుగూ మొలనూళ్ళ బెట్టె - మేలైన సొమ్ములు బెట్టె
అంగుళీయ ముద్రికలు - మురవైరి కొప్పబెట్టె
వజ్రాగోమేధిక పతకం - వైడూర్య రత్నాఖచితం
సువర్ణపతకం కృష్ణుని - కంఠమున నుంచెను తల్లీ
పచులేని పచ్చాబొట్టు - బాగుగా దిండే జుట్టీ
భమిడీకాదారీ దోపే - తొమ్మండుగురు వెంటా నడువ
బాగుగా మళ్ళీచూచె - బంగారం వొప్పె బిరుదూ
నందూని సుతుడూ వెడలె - గోవులకాతా మనుచు
చిలకాలు పలికేటి మోత - గోవుల కొమ్ముల మోత
గోవుల తరిమెడి మోత - కాంతలు పాడే మోత
కోవిలాలు కూసెటి మోత - పుంజూలు కూసెటి మోత
నెమళ్ళు ఆడెడి మోత - నెమళ్ళు కూసెటి మోత
నాల్గోజామాయెను పొద్దూ - నాధునికి విన్నాపములు
ఎత్తీ మూడెత్తుల మోత - ఉభయ పార్శ్వములయందు
ఏమీ భాగ్యము గలిగె - ఈమంద జనమువారికి
త్రైలోకదాతా పతికి - తల్లి యశోదాదేవికి
సర్వేశ్వరుడు పట్టినవేణు - సంచారింపుచు విన్న
మాత్రశ్రీ కార్యము - తలచినమోతా
అనుచున్న దేవగణంబులు - గగనమార్గములయందు
పుష్పంబులు వృష్టికురిసెను - పుండరీకాక్షులమీద
యక్షాకిన్నర గరుడ - గంధర్వ విద్యాధరులు
తుంబూరు నారదూలు - స్తుతియించి మిమ్ము గొలువ
చెంగలి గడ్డిమేసి - చేకొనుచు గోధనమంతా
యిందిరపతి వద్దకువచ్చె - మందల్ల నడుమనిలిచె
చిటిచిట్టీ లేగాలన్నీ - చెవులు రిక్కించి చూచి
చెలువూనీ జేరవచ్చె - శ్రీ వేణునాదంబులకు
చిక్కంబున చల్దీదింపె - చొక్కంబుగ వెండీవలెను
అగ్రజులు అందీ ముద్దలు - అందంది వేయువారు
పడులేని పచ్చళ్ళన్నీ - వుంగ్రాలు ఎగసనదోసుకు
వొప్పైన పచ్చళ్ళన్నీ - వేళ్ళనడుమనువేయ
బాలచంద్రుని చుట్టు - చాల పరివేషంవలెను
కూడెదరు గోపకుమాళ్ళు - మేలుగా ఒప్పేభక్తి
ప్రభాతసమయా మప్పుడు - భాస్కరులు ఉదయమవగ
బ్రహ్మాండ కోట్లు వెలగ - ప్రభుడూ చలిదారగించె
మవునంబున ఆరగించెను - మధుసూదన హస్తములకు
పన్నీరు అవధరించెను - త్రైలోక్య వల్లభూడు
పచ్చీ పోకలతోను - పండుతెల నాకులతోను
పచ్చకర్పూర విడియం - పరమాత్ము డవధరించె
అమరాంగనలు వచ్చి సంభ్రమమున విమా - నారూఢులై బ్రోవ ఆలంకమధ్యమమున
భ్రమతూలై వారలు జూచితె పంచశతకోటి - విభ్రాంతులై కల్పవృక్షముల నీడను
కడుతిన్నగ మళ్లీజూచి కమలానాభులు వేణు - బట్టెను కాంతలా చిత్తమమరా
మలహరి ఘూర్జరి పురమందున నో చిలుకా - పలికిన మాధవుండు దేశాక్షి భోజగమన
సావేరి భూపాలమునా - సరసిజ శ్రీరాగా
సర్వంబున నాదముబుట్టే - సనకాదులు అంజలిబట్ట
సతులూ తమ సుతులను వీడీ సర్వేశ్వరును తగులుకురాగా
అందారు గొల్లలు గూడీ - ఆలోచనలు సేయుచుండ్రీ
పెద్దావాడందదు గొల్ల - పేదరికం తెలిపెను కృష్ణుడు
పండావాడందురు గొల్లా - పాపంపు మాటలాడ
సతినైనా యిచ్చేగాని - సావంగనోపననెను
బింక్కంపు పరుడో గొల్ల - బిరుదూ పాటించీ చూసీ
సతినిచ్చే కష్టంకంటె - చచ్చుండుట మేలని పలికె
వివేకపరుడో గొల్ల - వివరించి తెలిపెద మీకు
మన మెవ్వరు మన సతులెవ్వరు - మధురాపురి కేగుద మనిరి
తల్లీ తండ్రీ కృష్ణుడు - దాతా దైవము గురువు
అచ్యుతుడె మన కందరికీ - ఆత్మాబంధుడని బలికె
కస్తూరి చుక్కచేది - కన్నులా కాటుకబెట్టీ
కస్తూరి ఒక చెలియా - కలయంగా పూసుకువచ్చె
వొచ్చేనని వొక చెలితాను - హెచ్చూగ హారంతూల
వచ్చేనని ఒక చెలిపేరు - గుచ్చార వేసుకొనుచు
కురులూ కుచములుగదల - బరువేణి అమ్ములు గదల
జలజాక్షి కృష్ణుని జూచి - నిలువూ నిలుమని బలికె
కనుగీటుచు కృష్ణుడు నందన - వనము లొపాలకు వచ్చీ
కనకామండపమున - కాంతా తెమ్మని బలికె
తెస్తీనిదేవర యిది ఒక - పూర్వాజన్మ ఫలమున
దొరకేనని పరుగూనా - వచ్చెచెలి
వెన్నూడి వేణునాదం - చదివీన విన్నా వారికి
సాయుజ్య పదవీగలదు - సంసార భీతితొలగు
ప్రభాత సమయమప్పుడు - భాస్కరూడూ రాగ
ప్రభు నీ చలికోలలు మహిమలు - చదివీన విన్నా వారికి
సాయుజ్య పదవీ గలదు - సంసార భీతీ తొలగు
AndhraBharati AMdhra bhArati - dEshi sAhityamu - strIla pATalu - shriikR^ishhNuni chaldulu ( telugu andhra )