| దేశి సాహిత్యము | స్త్రీల పాటలు | శ్రీకృష్ణుని జననము |
| శ్రీకృష్ణుని జననము |
| కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటిరంగరంగా శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ యేడు రాత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెనూ తలతోను జన్మమైతె - తనకు బహు - మోసంబు వచ్చుననుచు ఎదురుకాళ్ళను బుట్టెను - ఏడుగురు - దాదులను చంపెనపుడు నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున యేడ్చుచు నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు ఒళ్లెల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి నిన్నెట్లు ఎత్తుకుందూ - నీవొక్క - నిమిషంబు తాళరన్నా గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబులాడె నపుడు ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా నీపుణ్యమాయె కొడుకా - యింకొక్క - నిమిషంబు తాళుమనుచూ కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగానూ పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ తడివస్త్రములు విడిచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను అడ్డాలపై వేసుక - ఆబాలు - నందచందము చూచెను వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ సితపత్రనేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామ చంద్రుడమ్మ శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము పండ్లను పరుసవేది - భుజమున - శంఖుచక్రములు గలవు వీపున వింజామరం - నాతండ్రి - బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములును - అన్నియూ - అమరెను కన్నతండ్రీ నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్లు వ్రాసెతండ్రీ అన్నెకారి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా నిన్ను నే నెత్తుకోని - ఏత్రోవ - నేగుదుర కన్నతండ్రి ఆ చక్కదనము జూచి - దేవకి - శోకింపసాగె నపుడు తల్లి శోకము మాన్పగా - మాధవుడు - గట్టిగా యేడ్వసాగె శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా బూచులను మర్దించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు అల్లడుగొ జోగివాడూ - నా తండ్రి - వస్తాడు పవళించరా జోగి మందుల సంచులూ - ఏ వేళ - నా చంక నుండగాను జోగేమి చేసునమ్మ - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు అల్లదుగొ పాము వచ్చె - నా తండ్రి - గోపాల పవళించరా పాముల్ల రాజె అయినా - శేషుండు - పానుపై యుండగానూ పామేమి చేసునమ్మా - నలినాక్షి - భయము నీ కేలనమ్మా నీలమేఘపు చాయలూ - నీమేను - నీలాల హారములునూ సద్గురుడు వ్రాసెనాడు - నా తండ్రి - నీరూపు నీచక్కన నిన్ను నేనెత్తుకోనీ - యేత్రోవ - పోదురా కన్నతండ్రి నాకేమి భయములేదే - నాతల్లి - నాకేమి కొదువలేదే మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను వెరపించవస్తే మా మామ నాచేతనూ - మరణమై - పొయ్యేది నిజముసుమ్మూ వచ్చు వేళాయెననుచూ - నా తల్లి - వసుదేవు పిలువనంపూ గోపెమ్మ బిడ్డ నిపుడూ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ రేపల్లె వాడలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చె నపుడూ గోపెమ్మ పుత్రినపుడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ అతి త్వరితముగ వచ్చెనూ - దేవకి - హస్తముల నుంచె నపుడు దేవకికి - తనయు డపుడూ - పుట్టెనని - కంసునకు కబురాయెను ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె తెమ్మని సుతునడిగెనూ - దేవకి - అన్నదీ అన్నతోనూ మగవాడు కాదురన్నా - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా ఉపవాసములు నోములూ - నోచి యీ - పుత్రికను గంటినన్నా పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి పూజ ఫలముచేతనూ - వారి కృప - వల్ల పుత్రికను గంటీ నీ పుణ్యమాయెరన్నా - నీవు పు - త్రికను దయచేయుమన్నా నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుట తగదు రన్నా ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిపట్టి బ్రతిమాలెనూ గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ కాదుకాదని కంసుడూ - దేవకి - పుత్రికను అడిగె నపుడు అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె అంబరమునకు ఎగురగా - వేయనపు - డా బాల కంసు జూచి నన్నేల చంపెదవురా - నీ యబ్బ - రేపల్లె వాడలోను పెరుగుతున్నాడ వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ నిజముగా దోచెనపుడూ - కంసుండు - యేతెంచి పవళించెనూ రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెందెను శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను రేపల్లె వాడలందూ - కృష్ణుడు - తిరుగుచున్నా చోటుకూ చనుదెంచి విషపుపాలూ - ఇవ్వనూ - సమకట్టి ఇవ్వగానూ బాలురతో బంతులాడ - కృష్ణుని - బాలురందరు కొట్టగా కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధి నడుమను నిలచెనూ ప్రేమ కృష్ణుణ్ణి చూచీ - పూతకి - ప్రియముతో బుజ్జగించి నా యన్న వూరుకోర - నా తండ్రి - పాలు యిచ్చెదను రార మూడు గుక్కలు పీల్చగా - పూతకి - భూమిపై కొరిగి పడగా గోపెమ్మ చూచి అపుడూ - బంగారు - గిన్నెలో బువ్వపెట్టి ప్రొద్దున్న వుగ్గుపోసి - కృష్ణుణ్ణి - యెడలోను పండవేసె అంతలో కంసహితుడూ - బండిరూ - పై - యెదురుగావచ్చెనూ పాదములు రెండు పిడుగు - లావలే - దడదడా విసిరెనపుడూ వృషభమై వచ్చి నిలువ - ఒక్కలఘు - వున చంపివేసెనపుడూ చల్లమ్ము వారలెల్లా - ఈ కబురు - చల్లగా చెప్పిరపుడు రేపల్లె వాడలోను - ఉన్నట్టి - గోపికలు గుంపుగూడి "మాయిళ్ళ కొచ్చునమ్మా - కృష్ణుడు - మమురవ్వ చేసునమ్మా తాళలేమమ్మ మేము - మీ సుతుడు - తాలిమితో వుండడమ్మా మగనివలె పనులుసేయా - నీ సుతుడు - మాయిండ్లలోకి వచ్చూ ఇకనైన బుద్ధిచెప్పీ - ఇంతిరో - పదిలమ్ము సేయుమమ్మా" అనుచునూ గట్టిగాను - మనమంత - గోపెమ్మ కడకుబోయి చెప్పుదామనుచు వారు - గోపెమ్మ - చెంతకేగగ నప్పుడు గోపాలకృష్ణు డపుడూ - అచటనే - పాలుత్రాగుచు నుండెనూ ఇదియేమి యాశ్చర్యమే - ఓ చెలియ - ఇదియేమి చోద్యమమ్మ కనుపాపలను దీసునే - కృష్ణుడు - దొంగతనములు చేసునే ఇకనేమి చేసునోను - మనము బులు - పాటమున వస్తిమమ్మా అమ్మనే నెరుగనమ్మా - నాత్రోవ - నేబోవు చుండగాను ననురవ్వ చేసిరమ్మా - నేనంత - భయపడీ వస్తినమ్మా కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గొబ్బున పిలువబోవ కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గుబ్బలను చూపినారు పౌర్ణమి రోజులందు - జలజాక్షు - లందరూ కూడకోనీ చీరలటు తీసివేసి - గొప్పికలు - జలకమాడుచు నుండగా తీసివుంచిన చీరలు - కృష్ణుండు - వేసె ఆ పొన్నమీద వేసియా వేణునాదం - వూదుచూ - వుండె నా మాధవుండూ జలకమ్ము చాలించియూ - గోపికలు - మనచీర లేమాయెనే నమ్మరాదమ్మ కృష్ణుని - ఇకను ఈ - చినగొల్లవాని నెపుడూ ఎంతపని చేసెనమ్మా - ఓ చెలియ - ఏమి యాశ్చర్యమమ్మా వెదకుచూ కొందరుండీ - నీళ్ళలో - మునిగియుండిరి కొందరూ అప్పుడూ గోపికలలో - ఒకయింతి - తాజూచి శ్రీకృష్ణునీ రారె ఓ అమ్మలార - ఈ పొన్న - మీదనున్న కృష్ణునీ ఇవ్వరా మా చీరలూ - ఓ కృష్ణ - ఇవ్వరా మా రవికెలూ దండంబు పెట్టెదార - కృష్ణయ్య - దయయుంచి దయచెయ్యరా అందరూ ఒకచేతితో దండంబు - పెట్టగా చూచితాను పొందుగా మీరందరూ - దండంబు - రెండుచేతుల బెట్టరే ఎంతపని వచ్చెననుచూ - గోపికలు - మానభంగము నొందిరీ వసుదేవ తనయునకునూ - దండంబు - రెండుచేతుల బెట్టిరీ పొందుగా వలువలన్నీ - కృష్ణుండు - పేరుపేరున ఇచ్చెను నాయత్త తిట్టునేమొ - యనుచు నొక - రొకరితో వగచిరపుడూ మాయాడు బిడ్డ యిపుడూ - కొట్టునో - నా బావ దండించునో నా మగడు నన్ను బ్రతుక - నివ్వడూ - నేనేమి చేతునమ్మా కస్తూరి రంగ రంగా - నా యన్న - కావేటి రంగరంగా నినుబాసి యెట్లునే మరచుందురా. |